గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2009, శనివారం

చిత్ర కవిత విచిత్ర కవిత అనడంలో సందేహం లేదు.

పాయాదనాదిః పరమేశ్వరో వః .
చిత్ర కవిత విచిత్ర కవిత అనడంలో సందేహం లేదు. మీకు ఆశీశ్శులందించే యీ క్రింది శ్లోకాన్ని చూద్దామా?

శ్లోకము:-
గవీశ పత్రః నగజార్తి హారీ
కుమార తాతః శశిఖండ మౌళిః
లంకేశ సం పూజిత పాద పద్మః
పాయాదనాదిః పరమేశ్వరో వః.

ఈ పై శ్లోకాన్ని గమనించాం కదా?
ఆశీరర్థక శ్లోకమిది. మొత్తం శ్లోకంలో పరమ శివుడు మిమ్ము రక్షించు గాక! అని అర్థం మనకు ప్రస్ఫుట మవడమే కాదు. దీని లోగల చిత్ర కవివుతా ప్రావీణ్యతను గమనిస్తే మానసోల్లాస కారకమయే మరో తమాషా మనకు అవగతమవక మానదు. అదేమిటంటారా?

గవీశపత్రః = నంది వాహనుడును,
నగజార్తి హారీ = పార్వతీదేవి దుఃఖాన్ని పోగొట్టిన వాడును,
కుమార తాతః = కుమార స్వామి తండ్రియును,
శశి ఖండ మౌలిః = చంద్రశేఖరుడును,
లంకేశ సంపూజిత పాద పద్మః = రావణాసురునిచే పూజింప బడిన పద్మముల వంటి పాదములు కలవాడును,
అనాదిః = పుట్టుక లేని వాడును అగు
పరమేశః = పరమ శివుడు,
వః = మిమ్ము,
పాయాత్ = రక్షించు గాక.

భావము:-
నంది వాహనుడును, పార్వతీ దుఃఖాపహారియును, కుమార స్వామి తండ్రియును, చంద్ర శేఖరుడును, రావణ పూజిత పాద పద్మములు కలవాడును, పుట్టు లేని వాడును అగు పరమ శివుడు మిమ్ము రక్షించు గాక.
అని పరమ
శివుని పరంగా ఒక అర్థం వస్తుంటే


విష్ణువుపరంగా మరొక అర్థం మనకు ద్యోతకమయే విధంగా రచించ గలిగి యుండడమే దీనిలో గల చిత్రత.
చూడండి.

శివునికి వాడిన విశేషణములనే విష్ణువుకూ ఉపయోగించి చెప్ప గలగడమే దీనిలోని చమత్కారం.
శివునకు ప్రయోగించిన విశేషణ వాచక పదములలోని మొదటి అక్షరములను తొలగించి చదివితే మనకు అర్థమైపోతుంది.

{గ} వీశప త్రః = పక్షి రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడును,
{న} గజార్తి హారీ = గజేంద్రుని దుఃఖమును హరించిన వాడును,
{కు} మార తాతః = మన్మధుని తండ్రియును,
{శ} శిఖండ మౌలిః = నెమలి పింఛమును తలపై ధరించిన వాడును,
{లం} కేశ సంపూజిత పాద పద్మః = {క+ఈశ} బ్రహ్మ రుద్రులచేత పూజింపబడుచున్న పాద పద్మములు కలవాడును,
అనాదిః = పుట్టుక లేని వాడును,
{ప} రమేశః = లక్ష్మీ పతియు నైన శ్రీ మహా విష్ణువు,
వః = మిమ్ములను,
పాయాతు = రక్షించు గాక.

భావము:-
గరుత్మంతుని వాహనముగా కలవాడును, గజేంద్రుని రక్షించిన వాడును, మన్మధుని తంద్రియును, నెమలి పింఛమును తలపై ధరించిన వాడును, బ్రహ్మ రుద్రులచేత పూజింప బడు పాద పద్మములు కలవాడును, పుట్టుక లేని వాడును, లక్ష్మీ పతియు నగు శ్రీ మహావిష్ణువు మిమ్ము కాపాడు గాక.

చూచాం కదా! ఎంత చమత్కారంగా శివ కేశవుల శుభాశీశ్శులు మీకు కలగాలని చెప్ప బడిందో.
ఇలాంటి శ్లోకాల్ని ఈ రోజుల్లో చెప్ప గలిగేవారు మృగ్యం కదా? అందుకని మనం
ఇలాంటి శ్లోకాలు కాని, పద్యాలు కాని మన కంట పడితే వెన్వెంటనే పుస్తకంలో వ్రాసుకోవడంతొ పాటు మస్తిష్కంలో భద్ర పరచుకోగలగాలి. అంతే కాదు. ఆ శ్లోకాన్ని దానిలోని చమత్చారాన్ని వివరించి చెప్పి, దీనిని వినడం వలన అవతలి వ్యక్తి పొందిన ఆనందానుభూతిని చూచి మనం కృతార్థులమవగలగాలి. మరి అలాగే చేద్దామా?

జైహింద్.
Print this post

5 comments:

Unknown చెప్పారు...

చాలా చక్కటి పద్యము. పరిచయము చేసిన మీకు అభినందనలు.

Bolloju Baba చెప్పారు...

చిత్ర కవిత్వం గురించి వినడమే కానీ ఇంత వివరణాత్మకంగా చూడటం ఇదే ప్రధమం.
విస్మయం కలుగుతోంది ఆ కవిపుంగవుల ప్రజ్ఞ ను తలచుకొంటూంటే.
మంచి పద్యాన్ని పరిచయంచేసారు. ధన్యవాదములు.

Unknown చెప్పారు...

మంచి శ్లోకాన్ని పరిచయం చేసారు.ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బొల్లోజు బాబా గారూ!
కందము:-
బొల్లోజు వంశ పుంగవ!
తెల్లము మీ సహృదయమ్ము. తీయని మాటల్
మల్లెల సౌరభమట్టుల
యుల్లమునానందమగ్న మొనరించెనయా!


అరిపిరాల సత్య ప్రసాద్ గారూ!
ఆటవెలది:-
అరిపిరాల వంశ మురిపాలబిడ్డవై
యలరు చున్న వాడ! ఆత్మ బంధు!
వనగ తగిన యటుల నాంధ్రామృతముగ్రోలు
సత్య వర్తివయ్య! స్తుత్య మూర్తి.

నరసిమ్హ {వేదుల బాల కృష్ణ మూర్తి} గారూ!
కందము:-
శ్రీ నారసిమ్హ! మీకృప
నేనారయనగునె? కవుల నేర్పును గనినన్
మౌనము దాల్చగ నెటులగు?
జ్ఞానామృత వితరణమున ఘనులా { "శు/సు" } కవుల్.

రాఘవ చెప్పారు...

నాకు సింగయగారి తిమ్మనగారు గురుతొచ్చారు (పారిజాతాపహరణంలో ఐదవ ఆశ్వాసమనుకుంటాను). భలే శ్లోకాన్ని పరిచయం చేశారు. కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.