మన సాహితీ జగత్తులో తత్ సృష్టి కర్తలైన మహా కవులెందరో అత్యద్భుతమైన రత్నాల్లాంటి పద్యాలను నిక్షిప్తం చేశారు. ఆ జగత్తులో సంచరిస్తూ కూడా మనమా రత్న కాంతులను జ్ఞాన చక్షువులతో గాంచ లేకపోతే, మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకో లేకపోతే మనమెంతటి నష్టాన్ని పొందుతున్నామో ఆ రత్నాలను చూచినప్పుడు, తద్వారా ఆనందానుభూతిని పొందినప్పుడు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు నా దృష్టిలో పడిన ఏ రత్నమూ నా బ్లాగు ద్వారా మీకందింప బడక మానదు.
ప్రస్తుతం ఒక తమాషా పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.
క:-
పండినదెండినదొక్కటి.
ఖండించిన పచ్చిదొకటి. కాలినదొకటై
తిండికి రుచియైయుండును.
ఖండితముగ దీని దెల్పు కవియున్ గలడే
ఈ పద్యంలో గల భావాన్ని మీరూహించి మీ కామెంట్ ద్వారా పంపండి.
ఒకవేళ అంత ఓపిక లేకపోతే దీని క్రిందనే వివరణను తెలుపు రంగులో ఉంచాను.
అది మామూలుగా చదివినపుడు మనకు కన పడదు.
మనం తెలుసుకోవాలనుకొన్నప్పుడు మౌస్ ను వివరణ అనే భాగం నుండి లెఫ్ట్ క్లిక్ నొక్కి పట్టుకొని క్రింద పూర్తయే వరకు జరిపినట్లయితే వివరణ కనిపిస్తుంది. ఉత్సాహవంతులు సమాధానాన్ని చెప్పడానికి అవకాశం కలుగుతుందనీ, అత్యుత్సాహం ఆపుకోలేక సమాధానం వెంటనే తెలిసేసుకోవాలనుకొనే వారి కొఱకు తెలుపు తంగులో ఉంటే గోప్యంగా ఉంటుందని వివరణను అలా వ్రాశాను. కష్టం కలిగించాననుకొంటే మన్నించగలరు.
వివరణ:-
పండినదెండిన దొక్కటి = వక్క.{ పోక చెక్క }
ఖండించిన పచ్చిదొకటి = తమలపాకు.
కాలినది = సున్నము
ఒకటై = ఒకటిగా అయి { తాంబూలమై }
తిండికి = తినిటకు.
రుచియై యుండును = తినుటకు మన నోటికి రుచికరముగ నుండును.
తాత్పర్యము:-
చెట్టుకు కాసి, పండి, ఎండినటువంటి చెక్క, తమల పాకు, సున్నము ఒకటిగా తాంబూలమై మనౌ తినుటకు రుచికరముగ నుండును.
చూచారుకదా! మరొక పర్యాయం మరొక పద్యాన్నో శ్లోకాన్నో తెలుసుకొందాం.
జైహింద్.
Print this post
2 comments:
వక్క,తమలపాకు,సున్నం కదా!
హ..హ..హ
భలేఉంది. ఈ తాంబూలం గురించి చాలా పద్యాలే ఉన్నాయనుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.