గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 3. రాఘవ పంపిన 2 వ రసగుళిక.

దీని భావమేమి తిరుమలేశ?

మన ప్రియ పాఠకులు రాఘవ గారు మన మెదడుకు మంచి మేతనందిస్తున్నారు. మరో పద్యం పంపి దీని భావమేమి తిరుమలేశ? అని మనల్నడిగారు. ఆ పద్యం చూద్దామా?

ఆ:-
చెరకుతోటనుండు వరిమళ్లలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైననుండును
దీని భావమేమి తిరుమలేశ?

ఈ పద్యంలో మనకు తోచే భావము:-
అదేమిటై వుంటుందో చెప్పండి? అది చెరకు తోటలో వుంటుంది. వరిమళ్ళలోవుంటుంది. జొన్న చేలలో వుంటుంది. తలుపు మూలనుంటుంది. అది మన తలపై కూడా వుంటుంది.అదేంటో ?

చూచారు కదా ప్రశ్న?
మనబుర్రంతా పాడైపోవాలి కాని అదేమిటో మాత్రం మనకంతు చిక్కదు. నాకైతే మాత్రం అదేమిటో తోచటం లేదు. మీకు తెలిస్తే చెప్పండి.మేమంతా కూడా మీసమాధానం సరయిందయితే చాలా ఆనందిస్తాం.

సమాధనం:-BLOCKED
నాకు తోచినది మీముందుంచుతున్నాను.
1) చెరకు (తోటనుండు) తోటలో వుంటుంది. { నిజమే అది అక్కడేకదా వుంటుంది? }
2) వరి (మళ్ళలోనుండు.) వరిచేలుండే మళ్ళలో వుంటుంది. { నిజమేకదా? }
3) జొన్న (చేలనుండు.) అది వేయ బడిన జొన్న చెనులోనే వుంటుంది. { ఔను కదా? }
4) తలుపు (మూలనుండు.) ద్వారానికి ప్రక్కగా, మూలగా వుంటుంది. { అది మూలనుండక మరెక్కడుంటుంది? }
5) తల (పైననుండును.) శిరస్సుపైనే వుంటుంది. { తల మనకు పైభాగంలో కాక మరెక్కడుంటుంది? }

సామాన్యమైన విషయాలను చెప్పే వాక్యాలు మనకు చోద్యంగా ప్రశ్నల్లాగా కనిపించడమే దీనిలోని తమాషా.


చాలా బాగుంది కదా?
ఇటువంటి రస గుళిక నందించిన రాఘవ గారికి మన అందరి తరపునా ధన్యవాదాలందిస్తున్నాను.

మీరూ ఇటువంటి తమాషా శ్లోకలున్నా, పద్యాలున్నా, తప్పక వాటివల్ల మీరానందిందించే ఆనందాన్ని పదిమందికీ పంచడంకోసం మీ కామెంట్ ద్వారా పంపగలరని ఆశిస్తున్నాను.

జైహింద్.
Print this post

11 comments:

Unknown చెప్పారు...

మీరు వాడుతున్న పసుపు రంగు చదవడానికి ఇబ్బంది కలిగిస్తుంది.కనుక రంగును మార్చగలరు.
మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

భలే, భలే!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నారసిం హా! నమస్సులు.
ఆ పద్యంలోగల భావం తెలుసుకొనే ప్రయత్నం చేసేవారికి అవకాశం కల్పించడం కోసం వెన్వెంటనే ప్రస్ఫుటం కాకుండా వుండడం కోసం పసుపు రంగు పులమ వలసి వచ్చింది. ఐతే మీ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని మరికొంచెం కనిపించీ కనిపించనట్టుగా వ్రాసే ప్రయత్నం చేయగలను.
జైహింద్.

asankhya చెప్పారు...

బావుంది. ఆ పసుపు రంగు గురించి మీ idea బావుంది. mouse తో select చేస్తే జవాబు స్పష్టంగా కనిపిస్తున్నాయి :)

రాఘవ చెప్పారు...

"చోద్యముగను" కూడ ద్వ్యర్థివాచకమే. చోద్యంగా (చోద్యముగ) అని మొదట, తరువాత చోద్యాన్ని చూడమనీను (చోద్యము-గను)! ఇది ఎక్కడ చదివానో గురుతులేదు కానీ మొదటిసారి చదవగానే భలే ఉందే అనిపించింది. :)

అజ్ఞాత చెప్పారు...

ఇది ఆటవెలది అన్నారుకదా. ఆటవెలది లో, ప్రతీ పాదం మొదటి అక్షరానికి, నాల్గవగణంలో మొదటి అక్షరానికి యతి ఉండాలి కదా. మరి ఈ పద్యం మొదటి పాదంలో, "చె" కి యతిమైత్రి ఉన్న అక్షరం ఏమీ ఉన్నట్టుగా లేదు. నా గణ విభజన సరియేనా? నా సందేహ నివృత్తి చేయగలరు.

రాఘవ చెప్పారు...

@అసంఖ్హ్య:
ఉపజాతి కాబట్టి ఆటవెలదిలో యతి లేదా ప్రాసయతి చెల్లించవచ్చు. ఇక్కడ మొదటి పాదంలో ప్రాసయతి చెల్లింది. చెరకు - వరి అన్నప్పుడు... "చెరకు"లో "ర"కి "వరి"లో "రి"కి ప్రాస సరిపోతుంది కదా. మీ గణవిభజన సరైనదే :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అసంఖ్యాఖ్య!
ఆటవెలది పద్యంలో మీకు తెలిసిన విధంగా నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి వేయబడాలి. అంతే కాదు మీకు తెలియ వలసినదింకొకటుంది.
ఆతవెలదికి, తేటగీతికి, సీసానికి, ప్రాస నియమం ఉండదు. యతి నియమంతో పాటు యతికి బదులు ప్రాసయతిని ఉంచవచ్చు.

ఆటవెలది:-
చెరకుతోటనుండు వరిమళ్లలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైననుండును
దీని భావమేమి తిరుమలేశ?

ఈ పద్యంలో
1)చెరకు /2)తోట / 3)నుండు / 4)వరి మళ్ళ / 5)లోనుండు.
1వ గణంలో మొదటక్షరం - చే - 4 వ గణం మొదటక్షరం - వ - > సరిపో లేదు.
ఇప్పుడు ప్రాసయతి చూద్దాం.
1 వగణంలో - చెర . 4 వ గణంలో - వరి. ...... యతికి బదులు ప్రాస యతి ఉండి సరిపోయింది. ఈ విధంగా వుంటే ప్రాస యతి అంటారు. కాన దోషము కాదని గ్రహింపనగును.

అసంఖ్య చెప్పారు...

@రాఘవగారు, చింతా రామకృష్ణారావు గారు: సందేహ నివృత్తి చేసినందుకు ధన్యుణ్ణి. నాకు ఒక కొత్త సూత్రం తెలిసింది ఈ రోజు. మిమ్మల్నే స్ఫూర్ర్తిగా తీసుకొని నేను(అసంఖ్యని) ఒక ఆటవెలది పద్యాన్ని రాసాను.

ఇక్కడ చూడండి:
http://karvepaku.blogspot.com/2009/01/blog-post_15.html"

లేదా profile నొక్కి blog చూసినా గాని.

మీలాంటివారు, మాకు కొంచం దారిచూపాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ నారసిం హా! నమస్తే.
పసుపువర్ణంలోగాని మరే లేత వర్ణంలో గాని వున్న వాటిపై మౌస్ పెట్టి ఎడమ క్లిక్ నొక్కి పట్టుకొని ఆ విషయం ఎంత వరకూ వుందో అంత వరకూ గీసినట్లయితే ఆ వర్ణంలో అక్షరాలు స్పష్టంగా కనబడతాయి. అది ఇప్పుడే నేనూ తెలుసుకొన్నాను. తప్పక మీరు అలా చూడ గలందులకు మనవి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా! మీకు చక్కని అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. కీపిటప్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.