వర్దిపర్తి కొనమరాట్ కవీంద్రుఁడిది సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలోప్రజల నాల్కలపై నాట్యమాడుచుండుట విశేషం.
ఇతడు పెక్కు రచనలు చేసియుండెను. వీరు తమ రచనలలో చిత్ర కవితలు కూడా వెలయించి యుండిరి.
ఇతడు రచించిన ప్రశ్నోత్తర గూఢ చిత్ర రచనకు ఉదాహరణముగా ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.
క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-
మత్స్య స్వరూపక! మనుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! హరి! మురవైరి! నరక
శిక్ష! కుచేల సమ్రక్షక! సర్వజ్ఞ ! హరిహయనుత! చక్ర హస్త! రఘుకు
లాధిప! సర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! తపనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
" మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా ! శ్రీ యాది దేవ! "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.