జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు.
ప్రౌఢకవి రాచాలపల్లి బాబు దేవీదాస శర్మ గారి "అమలిన శృంగారము" : కావ్య పరిచయము
—గంగిశెట్టి ల.నా.
మన కవి తాపసి, బాబూ దేవీదాస శర్మ గారున్నారే, ఒక విలక్షణమైన కవి.. అటు కొన్ని శతాబ్దాల కిందటి పౌరాణిక భక్తి భావనలు, ఆ తర్వాతి యుగాల ప్రాబంధిక ప్రౌఢతలు, ఇటు గత శతాబ్ది ప్రారంభకాలాన్ని ఉర్రూతలూపిన భావకవిత్వం లాలిత్యాలు, అంతటితో ఆగకుండా మొన్న మొన్నటి శేషేంద్ర నవ కాల్పనిక భావోద్వేగాలు ఒక చోట రాశిపోసినట్లుగా రూపొందిన విలక్షణ కవితా మూర్తి!... అలాంటి విలక్షణ కవి, ఇప్పటి కాలంలో ఉండడమే, అందులోనూ మన మధ్య ఉండడమే ఒక అపురూప విషయం... నిజానికి ' సత్కవి ' అంటే అలాగే ఉండాలి.. కేవలం కవితా సత్తుకు మాత్రమే కట్టుబడి ఉండాలి కానీ, ఏదో ఒక కాలీనపు గుంజకు కాదు... గుంజకు కట్టుబడ్డ పెయ్యలకు స్వతంత్రం ఉండనట్లే, భావుకుడైన కవికి కూడా, భావ స్వాతంత్ర్యం కొరవడుతుంది.. ఏ గుంజకూ కట్టుబడని అచ్చపు సత్కవి ఉంటాడా అన్నది , ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే... సత్కవి అనిపించుకునే వారికి భక్తి ఒక పెద్ద గుంజ!.. అందులోనూ పౌరాణిక భక్తి!.. దాన్ని దాటి , సమకాలీనతలోకి ప్రవహించడం అందరికీ సాధ్యం కాదు... ప్రస్తుతం కోనలో దేవీదాసు గారు తరచూ పునరావృతం చేసే, కవిత్వం చూస్తే, ఆ శంక కలగటం సహజమే.. కానీ, ఒకప్పుడు ప్రౌఢవయసులో దేవీ దాసు గారు రచించిన అమలిన శృంగారము అనే కావ్యాన్ని చూస్తే ఆ అనుమానం కలగదు.. పైగా, ఈ భాక్తేయ కవేనా, ఇంత భావనారమ్యమైన కావ్యం రాసింది అనే ఆశ్చర్యమూ కలుగుతుంది!!
*
"అమలిన శృంగారము" ఆయన 2022 వ సంవత్సరంలో ప్రకటించినది.. అంటే రాయప్రోలు వారు అమలిన శృంగారమనే నవ కావ్య శాస్త్ర భావనను ప్రకటించిన సుమారు 123 సంవత్సరాల పిమ్మట ప్రచురించినది.. వాస్తవానికి, ఆ భావన మీద అప్పటిలోనే అనేక వాదోపవాదాలు జరిగాయి... 1930 ల తరువాత వచ్చిన భావ ధారలో , అంటే కొద్ది తక్కువగా వంద సంవత్సరాల క్రితమే ఆ భావన మరుగున పడిపోయినదంటే అతిశయోక్తి కాదు.. అయినా వీరు నాది భావ కవిత్వం పట్ల భక్తితో, అక్కడే ఆగిన కవితానురక్తితో, దాన్ని సంస్మరించుకుంటూ ఈ కావ్యాన్ని వ్రాశారు.. ఆ విధంగా, ఆధునిక కవితా యుగ ప్రారంభ దశలో, నవ కవితకు నూతనోత్తేజమిచ్చిన, ఒక గొప్ప నవ్య సంస్కార భావనకు, బాబూ దేవీ దాసు గారు తన కవితా నీరాజనమర్పించినారు...
అయితే చిన్న మార్పుతో!
రాయప్రోలు గారు తన అమలిన శృంగార భావనను " నష్టమైనట్టి ప్రేమఖండములకొక్క/ సుకవి అక్షర జీవ గీతికయ చాలు.....
కొసరి యేమోయీ అని పిల్చుకొనుటకన్న/ చెలుల కిల మీద నేమి కావలయు సఖుడ!" అంటూనే, దాన్నొక సోదర బంధంగా పరిణమింపజేస్తూ, దానికి సంకేతంగా తృణకంకణము ధరింపజేశారు..నాటి సంఘంలో కొత్త చనువును, స్వేచ్ఛను పెంచుకొంటున్న యువతీ యువకులకు అలా మార్గదర్శకమైన ఓ ప్రబోధ ప్రాయమైన నవ్య సిద్ధాంతాన్ని వినిపించారు..
కానీ కాలం మారింది, స్త్రీ-పురుషుల చనవుల రూపం మారింది, ఆ సిద్ధాంతమే కాల విస్మృతి పాలయ్యింది.. కవితా ప్రీతిలో అక్కడ ఆగిన దేవీ దాసరావు గారు, అందుకే కాలోచితమైన మార్పుతో, దీనిని ఆదర్శ ప్రేమికుల సాప్తపదీనంతో ముగింపుకు తెచ్చారు. ఆ మార్పు అభినందనీయమైనదే, అమలిన అనే మాట అర్థం ఎలా మారినా!...
*
రాచాలపల్లి బాబూ దేవీ దాసు గారు, ఇందులో కేవలం సిద్ధాంత ప్రబోధం చేయకుండా, దాని చిత్రించడానికి ఒక చిన్న కథను అల్లుకున్నారు.. బుద్ధ చరిత్రతో మొదలుపెట్టి, నాటి భావ కవుల భావనలన్నింటికీ అందులో చోటు కల్పిస్తూ, ఆ కథను అన్నారు.. ఒకానొక "కొండ రాణి".. రాజుల ఇంట పుట్టిన బిడ్డే.. కాల మహిమ వల్ల, చిన్నప్పుడే తప్పిపోయి, కొండరాజుల ఇంట పెరిగింది.. ఒక పూట వేటకు వెళ్లి, ఓ నెమలి మీద బాణాన్ని సంధించి, దాన్ని గాయపరిస్తే, దాన్ని చూసిన బుద్ధ ధర్మావలంబి అయిన యువక సన్యాసి, ఏ "యిరువదేడుల ప్రాయము వాడో" ఆ నెమలికి ఉప చర్య చేసి, ఆమెకు అహింసను బోధిస్తాడు.. ఆ పడుచు పిల్ల సైతం, తన విల్లంబులు విడిచివైచి, ఆయన పరిచర్యలో నిమగ్నమవుతూ, మనసా అతనిని ఆరాధిస్తుంది.. అతనికిని, ఆమె పట్ల ప్రేమ భావమంకురించినా, దానిని ఉదాత్త రీతిలో , హృదయాన నిలుపుకుంటాడు.. ఆమెకు కూడా, మనో శరీరాలకతీతమైన ఉదాత్త భావనను బోధిస్తాడు.. అలా వారి మధ్య సాగినది 'అమలిన శృంగారము'.. కడప అమ్మవారే, వారి ఉదాత్తతను మెచ్చి, ఇరువురను వివాహం చేసుకొమ్మని ఆదేశించి, వివాహితులై లోకసేవజేయుడని ఆశీర్వదించటంతో కథ సుఖాంతమవుతుంది..
రాయప్రోలు గారు ప్రతిపాదించిన అమలిన శృంగారము, ఎదగని యువతీ యువకుల పరస్పరాకర్షణకు పర్యాయమైన ప్రేమ భావమునకు విరుగుడైతే, రాచాలపల్లి గారు చిత్రించిన అమలిన శృంగారము, పరిణత యువతీయువకుల పరిణయమునకు దారి తీసి, సముచిత సంఘజీవన విధానమునకు ఉపకరించే రాజయోగ విధానము.. ఆ విధంగా, పేరునకిది 'అమలిన శృంగారము' అయినా, కాలోచితమైన నిర్మల ప్రణయ భావము.. ఆ విధంగా అభినందనీయము...
*
కానీ ఈ కావ్యాన్ని ఆస్వాదింప చేస్తున్నది, కాలగతి పొందిన ఆ పూర్వ ప్రణయ భావన కాదు!.. అందులో అపూర్వంగా దర్శనమిచ్చే ప్రబంధ కవుల నుంచి, భావకవుల వరకు సాగే లలిత సుకుమార పద్య నిర్మాణ రీతి.. అతిసున్నితమైన భావాలు, అంతే లలితమైన శబ్దాలు పెనవేసుకుని సాగిన పద్యాలు కావ్యమంతటా సాక్షాత్కరించి, అచ్చపు కావ్య ప్రేమికులను, మళ్లీ ఏ కృష్ణశాస్త్రి గారి యుగానికో, కరుణశ్రీ గారి దాపుకో తీసుకొని వెళ్తాయి.. వాటిని ఇక్కడ సాంతం ప్రతిలిఖించి, చూపలేకపోయినా.... కావ్య ప్రారంభంలో, 11 పద్యాలలో అటు ప్రాబంధిక రీతి, ఇటు భావ కవితా ఫణితి కలబోసినట్లున్న శరత్కాల వర్ణనకు సంబంధించిన ఒకటి రెండు పద్యాల ప్రస్తావనతో మాత్రమే సరి పెట్టడానికి సాహసిస్తాను..
అది " శారద సంధ్య; సానుతల శాద్వల కోమల భూమి" అంటూ మొదలవుతుంది కావ్యం.. తరువాత " ప్రకృతి వధూటిక పటునితంబములుగా సికతాతలమ్ములు చెన్నుమీర!" అని అతి ప్రౌఢభావనతో మొదలయ్యే సీస పద్యం.. ఆ పిమ్మట " సాంధ్యరాగస్నాత సాను వినోదిని తడియార కురులు వాల్ జడలు వైచి!
అలవోక జడలోని యందాల సిరులలో విరివిగా విరజాజి సరులు దురిమి!" అతి లలితమైన భావాలను నింపుకున్న లలిత పదాల కూర్పు తోటి సీస పద్యం సాగుతుంది.. ఆ రెండు పద్యాల నిర్మాణంలో ఉన్న కాంట్రాస్టును గుర్తిస్తే కవిగారి శిల్ప ప్రతిభ మన కన్నుల ముందు నిలుస్తుంది... ఆ తరువాత ఉన్న " నింగిని నీలిమబ్బు - నళినీమకరంద రసాంధకార సారంగ తరంగ ఝాంకృత సరాళముగా చెరలాడుచుండె" అనే అతి ప్రౌఢ సమాస గుంఫనతో సాగిన ఉత్పలం ఆ శిల్ప ప్రతిభను మరింత ప్రకాశవంతం చేసి చూపుతుంది ... తరువాత వెంటనే వచ్చే" నల్ల కలువల కళలుగా, నల్లనాగు/ మెలికలుగ, కరికలభాల నలుపుగాగ/ .... జలదశకలాలు గుమిగూడి జరిగె" చిత్రణ, కవి గారి భావుకతకు, భావ కవితా భక్తికి అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.. ఇలాంటి సున్నితమైన లలిత భావనలు కావ్యమంతటా అడుగడుగునా పరచుకుని ఉంటాయి.. వాటిని ఈ ఫోనుపై ప్రతిలిఖించి చూపే శక్తి నాకు లేదు.. పై పద్యాల ఫోటో కాపీని దిగువ పెడుతున్నాను.. మీరే ఓపిక చేసుకుని చూడండి... వాటి ఆధారంగా కావ్యం లో దొరలిన కవితామాధురిని
అంచనా వేసుకోండి...
— ల.నా. గంగిశెట్టి, 16/4/25
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.