జైశ్రీరామ్.
II3. స్తుతి శతకం II మూకపంచశతి (మూకకవి ప్రణీతము)
పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.
శ్లోII పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయన్తే గిరాం
వైరించాన్యపి గుంఫనాని విగళద్గర్వాణి శర్వాణి తే
స్తోతుం త్వాం పరిఫుల్ల నీలనళినశ్యామాక్షి కామాక్షి మాం
వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్పాద సేవాదరః II 1 II
తే.గీ.II ఫుల్లనీలోత్పలాక్షి! శంభుని ప్రియసతి!
బ్రహ్మ పలుకె నిన్ నుతి చేయ వలను కాక
వీడె గర్వంబు, నిన్ను సేవించు నాకుఁ
కోర్కె నిన్ గీర్తనము చేయఁ గొలిపె మతిని.
తాII ఓ కామాక్షీ! నిండుగా వికసించిన నీలి కమలం వంటి ముదురు నీలి కన్నులు కలిగిన శివుని భార్యా ! దేవతలలో గొప్పది, పదాల వాడుకలో ప్రావీణ్యం, బ్రహ్మ యొక్క పాండిత్యమైన పదాలు కూడా అహంకారం కోల్పోయే నీ మహిమలను స్తుతించడంలో సహాయపడదు ( వారుమిమ్మల్ని స్తుతించడానికి సరిపోవు కాబట్టి). అయినప్పటికీ, మీకు సేవ చేయాలనే నా తీవ్రమైన కోరిక మరియు మీ పాదాలను ఆరాధించాలనే కోరిక నన్ను ఉచ్చారణగా మరియు మీ స్తోత్రంలో కీర్తనలు పాడమని ప్రేరేపిస్తుంది.
శ్లోII తాపింఛ స్తబకత్విషే తనుభ్రుతాం దారిద్ర్యముద్రాద్విషే
సంసారాఖ్య తమోముషే పురరిపోర్ వామాంకసీమాజుషే
కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే
విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరంజ్యోతిషే II 2 II
తే.గీ.II నుత తమాల పుష్ప వర శోభితయు, కంప
తీరమున విహరించునదియును, కవుల
నాల్క నుండు, జగద్రక్షణ నొనరించు,
శివుని కెడమ దేహంబైన శివకు నతులు.
తాII తమాల పుష్పంలా ప్రకాశవంతంగా ఉండేటువంటి, ప్రజల పేదరికాన్ని పారద్రోలేటువంటి, సంసారమనే అంధకారాన్ని పారద్రోలుతూ ఉండేటువంటి , కంపా తీరమునవిహరించేటువంటి, కవుల నాలుక గుడిసెలో ఉండేటువంటి, మరియు ఇది అన్ని లోకాలను రక్షించేటువంటి పరమశివుని ఎడమ అర్ధభాగాన్ని పంచుకునే ఆ పరమ తేజస్సగు కామాక్షికి ఎల్లప్పుడూ నా ప్రణామాలు.
శ్లోII యే సంధ్యారుణయంతి శంకరజటా కాంతార చంద్రార్భకం
సిందూరంతి చ యే పురందర వధూ సీమంత సీమాంతరే
పుణ్యమ్ యే పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమీ
పాయాసుః పరమేశ్వర ప్రణయినీ పాదోద్భవాః పాంసవః II 3 II
తే.గీ.II శివ జటాటవీ శశి నెఱ్ఱఁ జేయునట్టి,
శచికి పాటల సిందురచ్ఛవిగ నమరు,
నతుల పుణ్యముల్ పండించు నుత భవాని
యొక్క పదధూళి నన్ గాచు చక్కగాను.
తాII అమ్మవారి పాద పరాగములు శివుని జడల అడవిలోని బాలచంద్రుని సంధ్యారుణునిగా నొనరించుచున్నవి. శచీదేవి పాపటలో సిందూరములగు చున్నవి. సేవించువారి పున్నెమును పండించుచున్నవి. అట్టి ఆ పాదరేణువులు నన్ను కాపాడుగాక!
శ్లోII కామాడంబర పూరయా శశిరుచా కమ్రస్మితానాం త్విషా
కామారేరనురాగ సింధుమధికం కల్లోలితం తన్వతీ కామాక్షీతి సమస్త సజ్జననుతా కళ్యాణదాత్రీ నృణామ్
కారుణ్యాకులమానసా భగవతీ కంపాతటే జృంభతే II 4 II
తే.గీ.II కామ డంబంబుతోఁ జంద్రకాంతి నొప్పు
తెల్లనౌ చిఱునవ్వుతోఁ ద్రినయనునినె
రాగ సంద్రానఁ గలచిన రమణి యనుచు
నుత జనని కంపదరి జృంభ గతిని యొప్పె.
తాII కామాడంబరముతో చంద్రకాంతి గల తెల్లని తన చిఱునవ్వుతో శివుని అనురాగసముద్రమును కల్లోలిత మొనర్చుచున్న కామాక్షి యని సర్వజనులచే నుతింపబడిన, దయతో నుప్పొంగిన మనస్సుగల భగవతి కమ్పాతీరమున విజృంభించుచున్నది.
09 – 3 – 2024.
శ్లోII కామాక్షీణ పరాక్రమ ప్రకటనం సంభావయన్తీ దృశా
శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాలితాశాంతరా
వామాక్షీ జన మౌళి భూషణ మణిః వాచాం పరా దేవతా
కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే II 5 II
సీII కమనీయ దృష్టితోఁ గాముని ప్రకటించుచున్నట్టి ప్రతిభతో నొప్పుచుండి,
చక్కఁగా భావింప సంపూర్ణమైనట్టి యౌవనమధ్యస్థ యగుచునొప్పి,
క్షీర సహోదర స్మిత రుచి నలరారి ప్రక్షాళితాశాంత భాగికగుచు,
పూబోడి జన మౌళి భూషణమణిగ తా వర్ధిల్లుచున్నట్టి భాగ్యరాశి,
తే.గీ.II వాక్ పరా దేవతామూర్తి భవ్యతేజ
దివ్య కామక్షి యనఁబడు దీపశిఖయె
కరుణ రూపంబు గొన్న ప్రకాశమొకటి
కంప తీరాన నుండెను సొంపు మీర.
తాII తనచూపుతో కాముని పరాక్రమమును ప్రకటించుచున్న, యౌవన మధ్యస్థయై తన చిఱునవ్వుచే దిక్కుల మధ్యభాగమున తెల్లబఱచుచు, స్త్రీలలో తలమానికమై, వాక్కులకందని దేవతయై, కమ్పానదీ తీరమున కామాక్షియను పేర ఒకానొక కరుణ ప్రకాశించుచున్నది.
శ్లోII శ్యామా కాచన చంద్రికా త్రిభువనే పుణ్యాత్మనామాననే
సీమా శూన్య కవిత్వ వర్ష జననీ యా కాపి కాదంబినీ
మారారాతి మనోవిమోహన విధౌ కాచిత్థమః కందలీ
కామాక్ష్యాః కరుణా కటాక్ష లహరీ కామాయ మే కల్పతాం II 6 II
సీII మూడులోకములందు పూర్ణమౌ శ్యామలంబౌనొక చంద్రిక జ్ఞానకల్ప,
పుణ్యాత్ములగువారి మోములనెనలేని మేల్కవిత్వముఁ గొల్పు మేఘమొకటి,
మరువైరి మనసున మరులు గొనుటయను పనియందు కామాక్షి ప్రబలమైన
కటిక చీకటి మొల్క కరుణాకటాక్ష సత్కమనీయ ధార నా కామకల్ప
తే.గీ.II నమును గావించుగాక సద్ఘనతరముగ
నమ్మపాదాలపై నాకు నమ్మకంబు
పెంచఁ గోరెడి నాకోర్కె నెంచి, జనని
కోర్కెతీర్పఁగ నే నెంచి కోరుచుంటి.
తాII మూడు లోకములందు నల్లని ఒకానొక వెన్నెల పుణ్యాత్ముల యొక్క ముఖములందు హద్దులేని కవిత్వవర్షమును కలిగించును. ఏదో ఒకానొక మేఘమాల శివుని మనస్సును మోహించుట అను కర్మయందు కామాక్షీదేవియొక్క కడగంటి దయాప్రవాహము ఒకానొక చీకటి మొలక. అది నాయొక్క కామము కొఱకు పూనుకొను గాక!
శ్లోII ప్రౌఢధ్వాంత కదంబకే కుముదినీ పుణ్యాంకురం దర్శయన్
జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్
కాలిందీ లహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం
కశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః II 7 II
సీ. చిమ్మ చీకటి గుమిన్ జిఱుజాబిలిన్ జూపుచున్నట్టి కచభర శోభితాంబ,
వెన్నెలలోఁ గూడ, మన్ననన్ జక్రవాకపుజంటఁ గలిపెడి ఘన కుచభర,
నభమున కాళింది నవ లహరీ దశ కనబడఁ జేయు నూగారు కలిత,
కాంచీపురంబందు కమనీయ శశిమౌళి కన్నులపడువై ఘనతరముగ
తే.గీ.II వర్ధిలుచు నుండె కామాక్షి, సార్థకముగఁ
జేయ సేవించు సుజనుల జీవనములు,
భక్తితోఁ గొల్తు నాకున్న శక్తి మీర
నాదు జనయిత్రిపాదముల్ నయభయముల.
తాII చీకట్ల గుంపులో చిఱుజాబిల్లి మొలకను చూపుచు, వెన్నెలలో గూడ చక్రవాకముల జంటను కలుపుచు, ఆకసమున వింతగా మనోహరముగా నున్నాయని ప్రవాహమును చూపించుచున్న శివుని కన్నుల గొప్పపండుగ సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.
శ్లోII తంద్రా హీన తమాల నీల సుషమైః తారుణ్య లీలాగృహైః
తారానాథ కిశోర లాంఛిత కచైః తామ్రారవిందేక్షణైః
మాతః సంశ్రయతాం మనో మనసిజ ప్రాగల్భ్య నాడిన్ధమైః
కంపాతీరచరైః ఘనస్తనభరైః పుణ్యాంకురైః శాంకరైః II 8 II
సీII నిస్తంద్ర సు తమాలనీలంపు ప్రభలతో తారుణ్య లీలా నిధాన గృహము,
శ్రీ చంద్రరేఖ లాంఛితమైన మహనీయ కచభారయుత దివ్య కమలవదన
తామ్రారవింద సత్తరళాయతేక్షణ కవులపాలిటి గొప్ప కల్పభూజ,
మరుని విజృంభణ కిరవైనపెన్నిధి, కంపసమీపన కదలు ముగుద,
తే.గీ.II ఘనపు స్తనభర కామాక్షి కరుణతోడ
నిరుపమంబైన నాసేవ నిరతమంది,
మదిని వసియించు తాను నా మనసునెన్ని
సత్కరించుత శోభిల్ల సముచితముగ.
తాII అమ్మవారు శివుని పుణ్యముల మొలక. అది తమాలనీలము. తారుణ్యలీలా గృహము. చంద్రకిశోరచిహ్నిత కచము. ఎఱ్ఱని కమలముల వంటి నేత్రములు కలిగినట్టిది. మన్మథుని విజృంభణమునకు హేతువైనట్టిది. కమ్పాతీరమున చరించునట్టిది. గొప్ప స్తనముల బరువు గలిగినట్టిది. అది నా మనస్సును సత్కరించుగాక!
శ్లోII నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షావిధిం పుష్ణతీ
తేజస్సంచయపాటవేన కిరణాన్ ఉష్ణర్ ద్యుతేర్ముష్ణతీ
కాంచీమధ్యగతాపి దీప్తిజననీ విశ్వాంతరే జృంభతే
కాచిచ్చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా II 9 II
సీII నిశ్చలయయ్యు తా నిరతంబు మరుతాళి రక్షించి పోషించు రమ్యవదన,
తనకాంతిపుంజంపు దార్ఢ్యంబుచేతను సూర్యుని కిరణముల్ చూరగొనును,
కాంచీపురముమధ్య కలదయ్యు నెప్పుడున్ విశ్వంబునకు గొప్ప వెలుగులిచ్చు,
తమసాంధమున్ బాపు ప్రమిదనొప్పెడి దివ్వె, చిత్రంబుగానిట చెలగుచుండె,
తే.గీ.II కంచి కామాక్షి మాయమ్మ కమలనయన,
దివ్య సుజ్ఞాన సజ్జ్యోతి, భవ్యమైన
జ్ఞానసంపత్తి కలిగించి కాచునన్ను,
వందనమ్ములు చేసి నే వరలుచుందు.
తాII సహజముగ దాను నిశ్చలమయ్యు మరుత్తులకు రక్షణకల్పించునది. మరుత్తులు దేవతలు, (శ్లేష) వాయువులు. తన కాంతిపుంజముయొక్క దార్థ్యము చే సూర్యునికిరణములను హరించునది. కాంచీమధ్యవర్తిని యయ్యు (నడుమున నొడ్డాణ ముగలదియని -- (శ్లేష) సకలవిశ్వాంతరమునందు తలచిన మాత్రమున తమంబును = చీకటిని (శ్లేష) అజ్ఞానమును ఆర్పెడి ఒకానొక చిత్రమైన దీపము విజృంభించుచున్నది.
శ్లోII కాంతైః కేశ రుచాం చయైర్ భ్రమరితం మందస్మితైః పుష్పితం
కాంత్యా పల్లవితం పదాంబురుహ యోః నేత్రత్విషా పత్రితం
కంపాతీర వనాంతరం విదధతీ కళ్యాణ జన్మస్థలీ
కాంచీమధ్య మహామణిర్విజయతే కాచిత్ కృపా కందలీ II 10 II
సీII తనరెడి నల్లని తలకట్టు చేతను భ్రమరితంబయియుండి ప్రముదమొప్ప
పాదపద్మప్రభాపల్లవయుక్తమై కరుణాంతరంగ ప్రఖ్యాతినొప్పి,
నేత్రకాంతులచేత నిరుపమానంబుగ పత్రితయైయొప్పి పరవశించి,
మందహాసద్యుతినందిన పుష్టితో సకలమౌ కల్యాణ సన్నిధగుచు,
తే.గీ.II కంప తీరంబునను తులకింపుతోడ
నొక్క కృపయను చిఱు మొల్క యొప్పియుండి
భక్తపాళికి శుభదయై రక్తినొప్పె
నట్టి కామాక్షి జనని కే నంజలింతు.
తాII నల్లని తలకట్టుచే భ్రమరితమై (తుమ్మెదలు ముసిరినదై) పాదకమల ప్రభలచే బల్లవితమై (చిగిర్చినదై) నేత్రకాంతులచే బత్రితయై (మారాకు పెట్టినదై) మందహా సద్యుతులచే పుష్టి నందినదై సకలకల్యాణములకు నిధానమై కంపాతీరమునం దులకించు నొక కృపయను చిఱుమొలక సర్వోన్నతిం దనరుచున్నది.
శ్లోII రాకాచంద్ర సమానకాంతి వదనా నాకాధి రాజస్తుతా
మూకానామపి కుర్వతీ సురధనీ నీకాశ వాగ్వైభవం
శ్రీ కాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం
ఏకా పుణ్య పరంపరా పశుపతేరాకారిణీరాజతే II 11 II
తే.గీ.II పూర్ణిమాచంద్రవదనయై ముద్దులొలుకు,
నగణితంబుగ శచియె యూడిగము చేయ,
మూగకున్ గవితాపగ స్ఫురణఁ గొలుపు
శివుని భాగ్యంబు కంచిలో చెలగుచుండె.
తాII పౌర్ణమి చంద్రునివంటి ముద్దుమోము గలదై, దేవేంద్రలక్ష్మి తన కూడిగము సేయ, మూగవారికిగూడ మందాకినీ ప్రవాహమధురమగు కవితా విలాస స్ఫురణము నల వరించుచు, నేకామ్రనాధుల భాగ్యమొకటి కాంచీపురమునందు సకలదుః ఖాపహారియై విహరించుచున్నది.
శ్లోII జాతా శీతల శైలతః సుకృతినాం దృశ్యా పరం దేహినాం
లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాపవిచ్ఛేదినీ
ఆశ్చర్యం బహు ఖేలనం వితనుతే నైశ్చల్యమాబిభ్రతీ
కంపాయాస్తటసీమ్ని కాపి తటినీ కారుణ్య పాథోమయీ II 12 II
చంII హిమగిరి పుత్రియై, తన నహీపు భక్తిని దల్చినంతనే
ప్రముదముతోడఁ గన్బడుచు, భక్తిగ సంస్మరణంబు చేయ మో
క్షము నిడి తాపముల్ డులిపి, కంచిని గంప సమీపమందునన్
సముచితరీతి యాడెడు ప్రశస్తదయామృతధార యొప్పెనే.
తాII హిమగిరికిం బుట్టి, పుణ్యాత్ములకు మాత్రము అనుకొన్నక్షణములో దర్శన మిచ్చుచు, క్షణకాలము సంస్మరించినంతనే తాపత్రయము నున్మూలించుచు, గాంచీపురమునందు సుస్థిర స్థితిం గనియు గంపాతీరము నందుల్లాస ఖేలనము సేయుచు నొక దయా రసామృత తరంగిణి జాల్వారుచున్నది.
శ్లోII ఐక్యం ఏన విరచ్యతే హరతనౌ దంభావపుంభావుకే
రేఖా యత్కచసీమ్ని శేఖర దశాం నైశాకరీ గాహతే
ఔన్నత్యం ముహురేతి యేన స మహాన్మేనా సఖః సానుమాన్
కంపాతీర విహారిణా సశరణాః తేనైవ ధామ్నా వయం II 13 II
శాII తానేశక్తి, త్రిశూలి, దేహమునకున్ దంభావపుంభావమున్
లోనన్ వెల్గి సమైక్యతన్ గొలిపె, నే లోకేశ్వ రా జాబిలిన్
తానే దాల్చె, హిమాద్రి కీర్తి నిట నే తన్వంగి పెంచెన్, సదా
జ్ఞానోద్భాసిత కంపవాసియగునా కామాక్షి మా దిక్కగున్.
తాII జాబిల్లిరేఖ శిరమునం దూగ మేనాభర్తయైన హిమగిరి సార్వభౌమునికి బర మోన్నతి గూర్చుచు కంపాతీరమందు నవయౌవనముతో విహరించు నొక సొగసుచేత మేము దిక్కుగలవార మైనారము.
శ్లోII అక్ష్ణోశ్చ స్తనయోః శ్రియా శ్రవణయోః బాహ్వోశ్చ మూలం స్పృశన్
ఉత్తంసేన ముఖేన చ ప్రతిదినం ద్రుహ్యన్పయోజన్మనే
మాధుర్యేణ గిరాం గతేన మృదునా హంసాంగనాం హ్రేపయన్
కాంచీసీమ్ని చకాస్తి కో೭పి కవితా సంతాన బీజాంకురః II 14 II
సీII కమనీయమైన సత్ కవితా సుకల్పక బీజాంకురంబగు వేల్పులమ్మ,
ఆకర్ణవిశ్రాంతమగుకనుదోయితో నలరారుచున్నట్టి యనుపమాద్య,
బాహుమూలలునొక్కు బరువైన పాలిండ్లతోనొప్పు చున్నట్టి తోయజాక్షి,
శిరముననున్నశశిని, ముఖములనొప్పు కాంతిచేక్రిందైన కమలయుతయు,
తే.గీ.II నడక మాటల సొంపుచే నతముఖముగ
హంసలను చేసి యలరెడి యనుపమాంగి,
కాంచి పురమున విలసిల్లె కరుణఁ జూప
కంచి కామాక్షి, మదిలోన కలుగు జనని.
తాII కవితాకల్పవృక్షమునకు మూలమైన లేత మొలకయై, నేత్రప్రభ కర్ణమూలములను, కుచద్యుతి బాహుమూలములను నారయగా, మొగమును కిరీటచంద్రుఁడును పద్మకాంతులను ద్రోసిరాజనగా, మాటల సొంపుచే నడకల యింపుచే రాజహంసికి సిగ్గు కల్పించుచు, నొక పొలుపు కాంచీపురమున విలసిల్లుచున్నది.
శ్లోII ఖండం చాంద్రమసం వతంసమనిశం కాంచీపురే ఖేలనం
కాలాయశ్ఛవితస్కరీం తనురుచిం కర్ణేజపే లోచనే
తారుణ్యోష్మనఖంపచం స్తనభరం జంఘా స్పృశం కుంతలం
భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే II 15 II
సీII శీర్షభాగమునందు చిఱు చంద్రరేఖతో ననుపమానంబుగా నలరు జనని,
వినుతదేహపుకాంతి యినుమునే నిరసింప వినుతులు గన్నట్టి విశ్వతేజ,
కర్ణాంతమున్ గల్గు కన్నుల సొగసుతో జగతిని కాచెడి జయనిధాన,
తరుణవయసుచేత తనరు నఖంపచ స్థనభరముననొప్పు శంభురాణి,
తే.గీ.II జంఘములఁ ద్రాకు వేణితో చక్కనొప్పి
యున్న కామాక్షి యనుభాగ్యమెన్నడబ్బు
నాకునీజన్మలోననే శ్రీకరముగ,
కలుగఁ జేయుము మాయమ్మ! కనికరమున.
తాII శిరమునం జంద్రరేఖ తూగగా, శరీరకాంతి ఇనుముయొక్క కాంతిని నిరసింపగా, కనులు చెవిలో రహస్యము తెలుపగా (ఆకర్ణాంతములనుట) ' ఎలప్రాయంపు వెచ్చదన మున గోరు వెచ్చనయి పాలిండ్లు కులుకగా, జంఘాలము (పిక్కలందాకునది) అయి తలకట్టు విలసిల్లగా, ఆచార్యకృపాలబ్ధమయి యుండెడి యా కామాక్షి యనెది భాగ్యము మాకుం బ్రీతి చేకూర్చు టెన్నడో కదా !
శ్లోII తన్వానం నిజకేళి సౌధసరణిం నైసర్గికీణాం గిరాం
కేదారం కవిమల్లసూక్తిలహరీ సస్యశ్రియాం శాశ్వతం
అంహోవంచనచంచు కించన భజే కాంచీపురీ మండనం
పర్యాయ చ్ఛవి పాకశాసన మణేః పౌష్పేషవం పౌరుషం II 16 II
మII శ్రుతులే శాంభవి గేళిసౌధసరణిన్ శోభిల్ల వర్ధిల్లుచున్,
సతమున్ సత్కవి సూక్తిసస్యరమకున్ సంస్తుత్య కేదారమై,
క్షితి పాపంబులఁ బాపు నేర్పరియునౌ, శ్రీకంచికా భూషయౌ,
స్తుతుఁడౌ మన్మథగర్వ, నీలమణియౌ శోభన్ సదా కొల్చెదన్.
తాII శ్రుతికాంతారత్నములు కేళీవిహారము సేయు సౌధములందు (వేదాంతములంద నుట) శోభిల్లి కవుల వాగ్రూప సస్యములు పండుటకు పంటపొలమై, పాపహరమై పుష్పేషుని (మన్మధుని) మగతనమెల్ల రూపెత్తినదై, కాంచీనగరాలంకారమై, యింద్రనీ లమణితున్కవంటి నెమ్మేనిచాయగల యొక శాశ్వతసౌందర్యము నారాధించెదను.
శ్లోII ఆలోకే ముఖపంకజే చ దధతీ సౌధాకరీం చాతురీం
చూడాలంక్రియమాణ పంకజ వనీ వైరాగమ ప్రక్రియా
ముగ్ధస్మేర ముఖీ ఘనస్తనతటీ మూర్ఛాల మధ్యాంచితా
కాంచీసీమని కామినీ విజయతే కాచిజ్జగన్మోహినీ II 17 II
సీ. పద్మముఖంబున, వాలుచూపులలోన, నెలరాజు నైపుణినలరుచుండి,
శిగలోన నొప్పుగఁ జేర్చబడెడి చంద్ర రేఖ సత్ప్రక్రియఁ బ్రీతిఁ గలిగి,
చిఱునవ్వులొలికించు సిరులొల్కు ముఖముతో, శ్రీకరంబుగ సృష్టిఁ జెలగుచుండి,
ఘనమైన స్తనభారమున కృశింసచిన కౌను నందంబుగా నొప్పు సుందరాంగి,
తే.గీ.II కంచిపురమున తొనికెడి కనికరమున
ననుపమాన సర్వోత్కృష్టమైనదగుచు
శ్రీజగన్మోహినొక్కతె చెలఁగుచుండె.
కంచి కామాక్షి యాతల్లి ఘన సుచరిత.
తాII చూపునందు, వదనకమలమునందును, చంద్రునికి సంబంధించిన నైపుణిని ధరించునదియైన, కొప్పునందు అలంకరింపబడుచున్న కమల వన వైరముల ప్రక్రియ గల, చక్కని చిఱునవ్వు మోముగల, గొప్ప స్తనభారముచే చిక్కిన నడుముతో నొప్పిన జగన్మోహినియైన ఒకానొక కామిని కాంచిసీమయందు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.
శ్లోII యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేపి మందస్మిత
జ్యోత్స్నాసంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహో దేహినం
ద్రాక్షామాక్షికమాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ
కామాక్షి స్వయమాతనోత్యభిసృతిం వామేక్షణేవ క్షణం II 18 II
తే.గీ.II నీదు చిఱునవ్వువెన్నెల నీటమున్గి
నీదు చూపను రా త్రేరిమీద పడునొ
విమతి యైనను వాగ్ఝరి వెంబడించు
తేనె ద్రాక్షలన్ మీరెడి తీపినొప్పి.
తాII ఓ కామాక్షీ! ఎవరికి నీ కటాక్షమనెడి పూర్ణిమారాత్రి నీ చిఱునవ్వనెడి వెన్నెలయేట స్నానమాడి నిత్యాభిముఖియగునో అతఁడు ఎంత మందమతియైనను వానింగూర్చి ద్రాక్షారసము యొక్కయు, తేనె యొక్కయు గర్వమునకు సిగ్గుగూర్చెడి రీతిని అభిసారికానాయికవోలె విచిత్రవాగ్వైఖరి యభిసరించును.
శ్లోII కాలిందీ జలకాంతయః స్మితరుచి స్వర్వాహినీ పాథసి
ప్రౌఢధ్వాంతరుచః స్ఫుటాధరమహో లౌహిత్య సంధ్యోదయే
మాణిక్యోపల కుండలాంశు శిఖినీ వ్యామిశ్రధూమశ్రియః
కళ్యాణైకభువః కటాక్షసుషమాః కామాక్షి రాజంతి తే II 19 II
ఉII నీ కడగంటి కాంతులవి నీ చిఱునవ్వులగంగలోపలన్
శ్రీకరమైన యా యమున చిందెడి కాంతిగ, నీ స్ఫుటాధర
శ్రీకమనీయమౌ యరుణ చిద్ఘనసంధ్యను కాఱుచీకటై,
సోకగ కుండల ప్రభలు, శోభిలె నాపొగకాంతినమ్మరో.
తాII ఓ కామాక్షీ! చిఱునవ్వనెడి దేవనదిలో (పాల వంటి గంగలో) యమున జలప్రభలయి, పెదవి పై గులుకు నెఱ్ఱనికాంతియనెడి సంధ్యారాగమందు కాఱుచీకటులయి, మణికుండలములనెడి అగ్ని శిఖయందు నెలకొను ధూమరేఖలై నీ కాటుకకంటికొనకాంతులు కల్యాణకరంబు లగుచున్నవి.
నీ చిరునవ్వు యొక్క ప్రకాశానికి ప్రాతినిధ్యం వహించే ఆకాశ గంగ యొక్క పాల తెల్లని నీటిలో యమునువాచీకటి జలాలను పోలి ఉంటుంది, ఇది అన్ని శుభాల సారవంతమైన నేల అయిన మీ ప్రక్క చూపుల ప్రకాశం. ఇది మీ పెదవుల ఎరుపు రంగుతో సూచించబడే సాయంత్రం సంధ్యా సమయంలో ( సంధ్య ,సూర్యాస్తమయం) దట్టమైన చీకటిని కూడా పోలి ఉంటుంది. ఇది మీ మాణిక్య చెవి-గోళాల ప్రకాశాన్ని సూచించే అగ్ని నుండి వచ్చే పొగ లాంటిది .
శ్లోII కలకల రణత్ కాంచీ కాంచీవిభూషణ మాలికా
కచభర లసచ్చంద్రా చంద్రావతంస సధర్మిణీ
కవికులగిరః శ్రావం శ్రావం మిలత్ పులకాంకురా
విరచిత శిరః కంపా కంపాతటే పరిశోభతే (జగదంబికా) II 20 II
సీII కలకల ధ్వనిఁజేయు కనకవడ్డాణంబు ధరియించియున్నట్టి దక్ష కన్య
కంచికే తానలంకారంబుగానిల్చి, చంద్రవంకను సిగన్ జక్కఁ దాల్చి,
చంద్రశేఖరునితో సరియై ప్రకాశించు ధార్మికమూర్తియై ధరను నిలిచి,
కవుల సద్రచనలన్ జక్కగా వినుచుండి తలయూపినుతియించు పులకరించి,
తే.గీ.II కంప తీరాన వెలసె తానింపుమీర,
శివుని యర్థాంగగౌరిగా చెలువు మీర,
నట్టికామక్షి పాదముల్ పట్టి విడువ
జన్మరాహిత్యమందగ చక్కగాను.
తాII కలకల మ్రోయు వడ్డాణము గల కాంచీ నగరమునకు అలంకార మాలయైన కేశపాశమున ప్రకాశించు చంద్రకల గల, చంద్రకలాశేఖరుడైన శివునితో సమాన ధర్మము గల, కవుల సమూహముయొక్క వాక్కులను వినుచు వినుచు పులకించిపోవుచు శిరః కమ్పము చేయు అమ్మవారు కమ్పానదీతీరమున విలసిల్లుచున్నది.
శ్లోII సరసవచసాం వీచీ నీచీ భవన్మధుమాధురీ
భరిత భువనా కీర్తిః మూర్తిర్మనోభవజిత్వరీ
జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే
కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితం II 21 II
తే.గీ.II తేనె లొలికెడి వాగ్ఝరి, దివ్య కీర్తి,
మన్మథుని గెల్చు రూపము, మహిని సుఖము,
కోరుకొను భోగభాగ్యము, కూర్మితోడ
నమ్మచూడకెట్లబ్బును? నెమ్మదిఁ గన.
తాII తరంగించు తేనె తీపి గల సరసవాక్కు, లోకముల నిండిన కీర్తి, మన్మథునోడించు రూపు, మనసునకు తగిన భోగ్యము, మనుష్యులకు అమ్మవారి కటాక్షము సోకనిదే ఎట్లు కలుగును?
శ్లోII భ్రమరిత సరిత్కూలో నీలోత్పల ప్రభయా భయా
నతజన తమః ఖణ్డీ తుండీరసీమ్ని విజృంభతే
అచలతపసామేకః పాకః ప్రసూన శరాసన
ప్రతిభట మనోహారీ నారీకులైక శిఖామణిః II 22 II
తే.గీ.II మహి గిరీశుని సత్తపోమహిమ జనిత,
నతుల కభయప్రదాత, యంధమునడంచు,
స్త్రీలమేల్బంతి, కంప దరిని, ఘనుఁడగు
శివుని యర్థాంగి, కంచిలో చెలగుచుండె.
తాII స్త్రీల శిఖరాభరణం, శివుని హృదయాన్ని దోచుకున్నది, శివుని అచంచలమైన తపస్సుల ఫలం,ఆమె పాదాలకు నమస్కరించే వారి భయాన్ని పోగొట్టే కామాక్షి దేవి కంపా ఒడ్డున ప్రకాశిస్తుంది.నీలి తామరపువ్వువంటి ముదురు నీలం తేజస్సుతో తేనెటీగలు నివసించినట్లుగా కనిపిస్తాయి .
శ్లోII మధుర వచసో మందస్మేరా మతంగ జగామినః
తరుణిమ జుషస్తాపింఛాభాః తమః పరిపంథినః
కుచభరనతాః కుర్యుర్భద్రం కురంగవిలోచనాః
కలితకరుణాః కాంచీభాజః కపాలిమహోత్సవాః II 23 II
సీII మధురవాఙ్నిధియును, మందస్మితోదంచిత ముఖియు, జగతిలో ప్రముఖయుఁ గన,
మదగజగమనయు, మహనీయ యౌవనవతియును, ఘన శుభమతియు తలప,
తాపింజపూవులన్ దలదన్ను కాంతితో వరలెడి శుభగుణ భాగ్యరాశి,
వక్షోభరంబుచే వంగిన తనుమధ్య, తామసంబును బాపు ధర్మనిష్ఠ,
తే.గీ.II నుత కురంగ నేత్ర, కరుణాన్వితగ తాను
కంచిలో వెల్గు కామాక్షి, సంచితఫల
మౌను తలప కపాలికి, ననుపమమగు
భద్రతనుగొల్పు మనలకు, పాహి యనిన.
తాII మధురమైన మాటలు, అందమైన చిరునవ్వు కలవారు, మత్తెక్కిన ఏనుగు నడకలా ఉండేవారు, యవ్వనం తాజాది , తాపింజాపువ్వులా ప్రకాశవంతంగా ఉంటుంది , ఆమె వక్షస్థల బరువుతో కొంచెం వంగి ఉంటుంది , కామాక్షి దేవి. దయతో నిండిన మరియు కంచి నివాసం ఉన్న డోయ్ కళ్ళు మాకు శుభం కలిగించు (ఆమె ద్వారా మేము ఆశీర్వదించబడాలి)
శ్లోII కమల సుషమాకక్ష్యారోహే విచక్షణ వీక్షణాః
కుముద సుకృత క్రీడా చూడాల కుంతలబంధురాః
రుచిర రుచిభిస్తాపింఛశ్రీ ప్రపంచన చుంచవః
పురవిజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః II 24 II
తే.గీ.II కమల కాంతులన్ మించెడి కనుల నేర్పు,
కలువరేని తా శిఖయందు కలిగినదియు,
తనువు కాంతి తమాలమున్ దాటునదియు
శివ మనోహారి, కంచిలో చెలఁగుచుండె.
తాII కమలములశోభ పై తరగతి కెక్కుటయందు విచక్షణతగన్న చూపులుగలవి. కలు వల పుణ్యక్రీడ అయిన చంద్రుని శిరోభూషణముగాగల కురులుగలవి. నిజ కాంతిచే తాపింఛకుసుమశోభను విస్తరింపజేయు నేర్పుగలవియు నగు పరమశివుని మనోరధములు (కామాక్షియనుట) కంపాతీరమునందు చరించుచున్నవి.
శ్లోII కలితరతయః కాంచీలీలా విధౌ కవిమండలీ
వచన లహరీ వాసంతీనాం వసంత విభూతయః
కుశలవిధయే భూయాసుర్మే కురంగవిలోచనాః
కుసుమ విశిఖా రాతేరక్ష్ణాం కుతూహల విభ్రమాః II 25 II
తే.గీ.II కంచి సంచార కౌతుక, కవుల శ్రేణి
వచన లహరి వాసంతికి వర వసంత
సంపద, మృగేక్షణయు, కామ శత్రువునకు
కనులపండుగ, తీర్చుత కామితములు.
తాII కాంచీవిహార కుతూహలములు, కవిశ్రేణివాష్ప్రవాహంబులనెడి వాసంతి లతలకు వసంత సంపదలు, ఆడులేడి చూపులు గలవి, కామవైరికన్నులకు వేడుకలు గొలుపునవియు నగు విలాసములు, నాకు క్షేమవిధాయకము అనుగాక !
శ్లోII కబలిత తమస్కాండాః తుండీర మండల మండనాః
సరసిజ వనీ సంతానానామ్ అరుంతుద శేఖరాః
నయన సరణేర్నేదీయంసః కదా ను భవంతి మే
తరుణ జలదశ్యామాః శంభోస్తపః ఫలవిభ్రమాః II 26 II
తే.గీ.II చెలఁగు తమసమ్ము నశియింపఁ జేయునట్టి,
కంచి కాభరణంబుగా క్రాలునట్టి,
చంద్రరేఖను దాల్చిన, సాంద్ర రజని,
శంకరునితపఃఫలమిడు జయము కనిన.
సీII కబళించు భక్తుల కఠినమైయున్నట్టి యజ్ఞానతిమిరమ్ము ననుపమముగ,
కంచికేతానలంకారమై యున్నట్టి కామక్షి యనబడు కల్పవల్లి,
నెలవంకతాలుపు, సులలిత సహృదయ, సుజనులమదినుండు శోభనాంగి,
సాంద్రమేఘమువోలె శ్యామలవర్ణము కలియొప్పుచునుండు కంబుకంఠి,
తే.గీ.II కంచి కామాక్షి యాతల్లి కాలకంఠు
తపము ఫలమది, జన్మంబు ధన్యతఁ గన
నెపుడు నే చూడనగునొ నా తపన తీర
జనని దుర్గాంబ పదములు చక్కగాను.
తాII దట్టమైన అజ్ఞాన అంధకారాన్ని కబళించే కామాక్షిని, కంచికి అలంకారంగా, నెలవంకను తలపై పెట్టుకుని, కొత్తగా ఏర్పడిన మేఘంలా చీకటిగా ఉన్న అద్భుతమైన ఫలాన్ని, శంభుని యొక్క తపస్సును, నేను ఎప్పుడు చూస్తాను?
11 – 3 – 2024.
శ్లోII అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా
సరసిజభువో యానం మ్లానం గతేన చ మంజునా
త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతీ
తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరీ II 27 II
సీII కామాక్షి తనముఖ కాంతితో నోడించు పద్మతేజమ్మును వరలుచుండి,
సుందరంబుగనుండి శోభిల్లు నడకతో రాయంచనడకల రహిని బాపు,
నయగారముననొప్పు నయవాగ్విభవముచే దేవతామృత దివ్య దీప్తి డించు,
ననుపమమైన మా యమ్మలో సుగుణాళి వినువారి చెవులకు ప్రణవసుధయె,
తే.గీ.II శివునియర్థాంగి మాయమ్మ భవవిదూర,
యట్టి మాతల్లి కంచికాపట్టణమును
శ్రేషమైనట్టి దానిగా చేయుచెండె
తాను వసియించి యచ్చట జ్ఞానఖనిగ.
తాII కామాక్షీమాత మన్మథుని మొదటి బాణమయిన పద్మాన్ని దీనురాలినిగా చేసే ముఖకాంతికలది, బ్రహ్మవాహనమైన హంసను తన మెల్లని నడకలచే ఓడించేది, దేవతల ఆహారమైన అమృతాన్ని తన మాటల తీయదనంతో విస్తరింపజేసేది, అట్టి శివుని సుందరి కంపాతీరాన్ని శ్రేష్ఠమైనదానినిగా చేస్తుంది.
శ్లోII జనని భువనే చంక్రమ్యేహం కియన్త మనేహసం
కుపురుష కర భ్రష్టైః దృష్టైర్ధనైరుదరం భరిః
తరుణ కరుణే తంద్రాశూన్యే తరంగయ లోచనే
నమతి మయి తే కించిత్ కాంచీపురీ మణిదీపికే II 28 II
సీII చెడుబుద్ధి కలిగిన చెడువర్తనులయిన వారలిచ్చెడి సొమ్ము వడసి నేను
కడుపు నింపుకొనుచు గౌరవహీనునై బ్రతుకుటెట్టులు తల్లి? పరము లేదొ?
యెంత కాలమిటుల నీలోకమున నేను నిర్లక్ష్యవర్తినై నిలువవలయు?
కంచిలోనున్నట్టి కమనీయ మణిదీపమా! మొరలను వినుమా! యొకింత,
తే.గీ.II బద్ధకము లేక వెలిగెడి ముద్దరాల!
దయకు మారుపేరైనట్టి జయనిధాన!
నీకు సాష్టాంగపడు నన్ను నీవు దయను
చూడు మించుక, నీవె నా తోడు జనని!
తాII ఓ తల్లీ! చెడు స్వభావాలు మరియు ప్రవర్తనకలిగిన వ్యక్తుల చేతుల్లోని కల్మషమైన డబ్బుతో నా కడుపు నింపుకుంటూ, ఈ లోకంలో ఎంతకాలం లక్ష్యం లేకుండా తిరుగుతాను . కంచి రత్నాల దీపమా! సోమరితనం లేని దయ యొక్క భాండాగారమైన నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్న నాపై నీ చూపు యొక్క చిన్న తరంగాన్ని దయచేసి మళ్లించుమమ్మా!
శ్లోII మునిజన మనః పేటీరత్నం స్ఫురత్ కరుణానటీ
విహరణ కలాగేహం కాంచీపురీ మణి భూషణం
జగతి మహతో మోహవ్యాధేః నృణాం పరమౌషధం
పురహరదృశాం సాఫల్యం మే పురః పరి జృంభతాం II 29 II
తే.గీ.II మునుల మదులందు వజ్రము, మోహమనెడి
రోగమునకౌషధంబును, రుద్రునకన
నేత్రపర్వంబగు, దయానటి త్రినేత్ర,
నడచునాట్యశాలయె, కనఁబడుత నాకు.
తాII ఋషుల మదిలోని వజ్రము, దయ అనే నర్తకి, విహరించే రంగస్థలము, కంచికి అలంకారము, మోహము అనే అనారోగ్యమునకు గొప్ప మందు, శివుని నేత్రములకు ధన్యత చేకూర్చేది అయిన కామాక్షి నా ముందు తనను తాను బహిర్గతం చేసుకొనుగాక.
శ్లోII మునిజన మనోధామ్నే ధామ్నే వచోమయ జాహ్నవీ
హిమగిరి తట ప్రాగ్భారాయ అక్షరాయ పరాత్మనే
విహరణ జుషే కాంచీదేశే మహేశ్వర లోచన
త్రితయ సరస క్రీడా సౌధాంగణాయ నమో నమః II 30 II
చంII మునిజన మానసద్యుతికి, పూజ్య వచస్సురగంగకున్,లస
ద్ఘనహిమ సన్నగాగ్ర వరకామిత సత్ప్రదకున్, శివ త్రిలో
చనముల కాటపట్టయిన సౌధముగా గల కంచి కామకో
టిని వసియించు దేవికి, ఘటింతు ప్రణామము లార్యకున్ ధృతిన్.
తాII మునిజనుల మనస్సుకు, గంగాప్రవాహం వంటి వాక్కులకు నిలయమైనట్టిదానకు, హిమగిరి యొక్క ఉన్నత పుణ్య శిఖరమునకు; నాశరహితమైన పరమాత్మకు, కాంచీదేశమందు విహరించేది- శివుని మూడుకన్నుల సరసక్రీడలకు మేడయైనట్టిదైన కామాక్షికి నమస్సులు!
శ్లోII మరకతరుచాం ప్రత్యాదేశం మహేశ్వర చక్షుషాం
అమృత లహరీ పూరం పారం భవాఖ్యపయోనిధేః
సుచరిత ఫలం కాంచీభాజో జనస్య పచేలిమం
హిమశిఖరిణో వంశస్యైకం వతంసముపాస్మహే II 31 II
తే.గీ.II మరకతఛవిని పోద్రోచు, మారవైరి
కంటి కమృతము, భవమను కడలికొడ్డు,
కంచి జన పుణ్యఫలము, నగపతి భూష,
కంచి కామాక్షి, కొలుతు నే నెంచి మదిని.
తాII మరకతమణికాంతిని కాదనునది, సంసారసింధువునకొడ్డు, మహేశ్వరుని చూపుల కమృతప్రవాహంపుబుగ్గ, కాంచీవాసుల పరిపక్వపుణ్యఫలము, హిమగిరివంశమున కేకైక భూషణము నైన కామాక్షీదేవి నుపాసించెదము.
శ్లోII ప్రణమన దినారంభే కంపానదీ సఖి తావకే
సరస కవితోన్మేషః పూషా సతాం సముదంచితః
ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవిత్వ కుముద్వతీం
నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వరకన్యకే II 32 II
తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ దరి నెమ్మిఁ జేరు
క్షణము నుండియె ఘనతర కవనధార
పారుటను జేసి, ప్రౌఢులౌ పర సుకవుల
మోములన్ వాడఁగా జేయు ముగ్ధవమ్మ.
తాII ఓ కామాక్షీ! ఆనందముతో నీ సన్నిధిని వ్రాలిన యా మొదటి దినారంభము నందే కవితారుణోదయమైనట్లయి శత్రుకోటియొక్క వక్తృత్వముతో గూడిన కవిత్వ విలాస ప్రౌఢిరూపమైన కలువతీగ మోము ముడిచికొనునట్లు చేయగలదు.
శ్లోII శమిత జడిమారంభా కంపాతటీ నికటేచరీ
నిహత దురితస్తోమా సోమార్ధముద్రిత కుంతలా
ఫలిత సుమనోవాంఛా పాంచాయుధీ పరదేవతా
సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందినీ II 33 II
తే.గీ.II మాంద్యమును వాపు, చెలగుకల్మషమునడఁచు,
కంపతీరాన నుండు, శ్రీకరవిధముగ
చంద్రకళఁ దాల్చు, వేల్పులన్ జక్కఁగఁ గను,
హిమజ నా కంటఁ బడి నన్నునేలుఁ గాక.
తాII మాంద్యమునణచి, పాపపుదుడుకువాషి, కంపాతీరమునందు పసించుచు, చంద్రరేఖ సిగబంతిగా ధరించి, వేల్పులకోరికల నీడేర్చుచు, హిమగిరి సార్వభౌము పూర్వపుణ్యమును పండించుచుండెడి తల్లి, నా నయనములను సఫలము సేయుగాక !
శ్లోII మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా
కుముద సుషమా మైత్రీ పాత్రీ వతంసిత కుంతలాం
జగతి శమిత స్తంభాం కంపానదీ నిలయామసౌ
శ్రియతి హి గలత్తంద్రా చంద్రావతంస సధర్మిణీం II 34 II
తే.గీ.II జాడ్యమా! నన్ను పీడింపఁ జాలవీవు,
స్తబ్దతనుబాపు, శశిరేఖ ధరను, శివుని
సతిని, కంప తీర నిలయ సన్నిధాన
మాశ్రయించెను నామది యనుపమముగ.
తాII ఓ జాడ్యాతిరేకమా! నీవు నాబుద్ధి నెట్లు పీడింపగలవు. ఈ నా బుద్ధి చంద్రావతంసయగు, స్తబ్ధతను నశింపజేయు, కమ్పానదియే నిలయముగాగల, శివుని యిల్లాలిని సోమరితనము వీడి ఆశ్రయించుచున్నది గదా.
శ్లోII పరిమళ పరీపాకోద్రేకం పయోముచి కాంచనే
శిఖరిణి పునర్ద్వైధీభావం శశిన్యరుణాతపం
అపి చ జనయన్కంబోః లక్ష్మీం అనంబుని కో ప్యసౌ
కుసుమ ధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః II 35 II
సీII మొయిలు పుత్తడులకున్ బుట్టించు సౌరభం బమ్మ మేన్ జుత్తులనమరినటుల,
గిరిని రెండుగ చేయు నిరుపమ కానాక్షి, మహితమౌ కుచయుగ్మ, మంగళనిధి,
చంద్రునికరుణిమన్ జక్కగాదిద్దుతా నరుణతేజమునొప్పునధరజనని,
నిర్జలదేశాన నిరుపమ శంకంబుఁ గలుగునట్టులఁ జేయు కంబుకంఠి,
తే.గీ.II అట్టి కల్యాణగుణమణి యనుపమముగ
మన్మథునిపూర్ణశక్తి యా మాన్యతేజ,
కంచిపురలోన విలసిల్లు కనకదుర్గ,
భక్తిసంపత్తి నిచ్చి నన్ వరలఁజేయు.
ఆ.వె.II మేఘమందుమరియు మేలుపుత్తడియందు
పరిమళమ్ముఁ గొల్పు పంకజముఖి,
కొండ రెండు చేయు కుచయుగ్మ కొలుపును
చందమామకెఱుపు చక్కగాను.
తాII మేఘమందు, మేలిమిబంగారమందును పరిమళమును సంఘటింపజేసి (అనగా నల్లని జుట్టునందు పువ్వులు,) మేనియందు సుగంధమును గూర్చి, మహాగిరియందు ద్వైతమును (జంటను) గూర్చి, (అనగా గిరులంబోలు కుచములు రెండు ధరించి,) చంద్రునం దరుణప్రభను సంతరించి (అనగా ముఖమునం దెఱ్ఱని యధరమును,) నిర్జలదేశమందు శంఖమును నలవరించి (అనగా శంఖమువంటి కంఠమును పూని,) మన్మధుని పూర్ణపరాక్రమ మొకటి కాంచిలో విలసిల్లుచున్నది.
శ్లోII పురదమయితు ర్వామోత్సంగస్థలేన రసజ్ఞయా
సరసకవితాభాజాం కాంచీపురోదరసీమయా
తటపరిసరై ర్నీహారాద్రే ర్వచోభి రకృత్రిమైః
కిమిద న తులా మస్మచ్చేతో మహేశ్వరి! గాహతే II 36 II
తే.గీ.II శివుని వామాంకమును, కంచిసీమనడిమి,
సుకవితారసజ్ఞశిఖరశోభ, పర్వ
తేశ్వరుని ఘనసౌందర్యతేజము, శ్రుతి
సార మగు నిన్ను కామాక్షి! చేరుటెట్లు?
తాII అమ్మా! శివునివామాంకము, గాంచీపురగర్భదేశము, కవితారసజ్ఞ శేఖరము, పర్వతే శ్వరుని పరమసౌందర్యము, వేదవాక్యార్థసారము, నైన పదార్థమునగు నీతో నా మన సైక్యము పొందజాల దేమమ్మా !
శ్లోII నయన యుగళీం ఆస్మాకీనాం కదా ను ఫలేగ్రహీం
విదధతి గతౌ వ్యాకుర్వాణా గజేంద్ర చమత్ క్రియాం
మరకతరుచో మాహేశానా ఘనస్తన నమ్రితాః
సుకృతవిభవాః ప్రాంచః కాంచీవతంస ధురంధరాః II 37 II
తే.గీ.II మదపుటేనుగున్ మించెడి మందగమన,
మరకతద్యుతి వెదఁజల్లు మరు రిపు సతి,
కుచ భరంబున నమ్రిత, కూర్మినొప్పు
కడుసనాతన నీ సతిన్ గాంచుటెపుడొ?
తాII మదగజముయొక్క గమననై పుణ్యమును దన నడకచే వ్యాఖ్యానించుచు కాంచీపుర శిరోభూషణములయి మరకతమణిప్రభగెల్చు శరీరముగలవై కుచభారముచే వినమ్రము లయి ఆద్యంతరహితములైన శివుని సుకృతవిశేషములు నా కన్నుల నెన్నడు సఫలము సేయునోకదా !
శ్లోII మనసిజయశః పారంపర్యం మరందఝరీసువాం
కవికులగిరాం కందం కంపానదీ తటమండనం
మధురలలితం మత్కం చక్షుర్మనీషి మనోహరం
పురవిజయినః సర్వస్వం తత్పురస్కురుతే కదా II 38 II
తే.గీ.II మన్మథుని కీర్తిరూపము, మధువులొలుకు
మధుర కవిసూక్తి మూలము, మాన్యమయిన
కంపకున్భూషణంబగు, ఘనులమదులు
ద్రోచు శాంభవిన్ గాంచగ వేచియుంటి.
తాII మన్మధునికీర్తి పరంపర, పచ్చితేనియలు వాకలుగట్టు మధురకవి సూక్తులు, పల్ల వించు మూలకందము విబుధజనమనోహరము మూర్తీభవించిన శివుని పూర్వపుణ్యము నైయున్న కంపానదీతీరమణిభూషణ మొకానొకటి నా కన్నుల నటించు టెన్నడో కదా!
శ్లోII శిథిలిత తమోలీలాం నీలారవింద విలోచనాం
దహన విలసత్ ఫాలాం శ్రీకామకోటిం ఉపాస్మహే
కరధృత సచ్ఛూలాం కాలారి చిత్తహరాం పరాం
మనసిజ కృపాలీలాం లోలాలకామలికేక్షణాం II 39 II
సీ. తామసగుణమును తరిమివేసెడి తల్లి, నీలోత్పలాక్షి, సన్నీలవేణి,
ఫాలనేత్రంబునన్ బ్రబలెడి యగ్నితో, సత్ప్రకాశమునొప్పు సదయహృదయ,
శ్రీకామకోటిలో శ్రీకరంబుగనుండి భక్తులన్ రక్షించు భర్గురాణి,
చేతిలోశూలమున్ జెన్నారగాఁ గల్గి, శూలిమనసు దోచు శోభనాంగి,
తే.గీ.II మన్మథుని బ్రోచినట్టి యా మాననీయ
ముంగురులశోభతోనొప్పు ముద్దుగుమ్మ,
యట్టి కామాక్షి పాదముల్ పట్టి నేను
భక్తితో నుపాసించెద భద్రతఁ గన.
తాII తమోగుణం (అజ్ఞానం) యొక్క లీలను నశింపజేయునది, నల్లకలువలవంటి కన్నులు కలది, నొసట అగ్నితో ప్రకాశించేది, శ్రీకామకోటి నివాసిని, చేతశూలాన్ని ధరించినది, యముణ్ణి జయిన శివుని మనస్సును హరించినది, మన్మథుని దయతో ప్రోచినది, కదలాడే ముంగురులుకలది, ఫాలలోచన అయిన కామాక్షీదేవిని ఉపాసిస్తాము.
శ్లోII కలాలీలాశాలా కవికులవచః కైరవవనీ
శరజ్జ్యోత్స్నాధారా శశధరశిశు శ్లాఘ్యముకుటీ
పునీతే నః కంపాపులినతట సౌహార్దతరలా
కదా చక్షుర్మార్గం కనకగిరి ధానుష్క మహిషీ II 40 II
సీII కాలకంఠునిసతి కళలకాటస్థలి, కంచిలో కామాక్షి కమల నయన,
కవుల మాటలనెడి కలువల తోటకు శరదిందుచంద్రిక, చల్లనమ్మ,
శోభిల్లు శశిరేఖ చూడామణిగగల మన్ననలందునాపన్నరక్ష,
కంపానదీతీర మింపని మదినెంచిస్నేహంబుతోనఁట చెలగు తల్లి,
తే.గీ.II అట్టి మాతల్లి కన్నులకట్టునెపుడు?
కాలయాపన చేయక కదలి వచ్చి
తనను గాంచెడి కోరికన్ తానె తీర్చి
బ్రతుకు వ్యర్థము కాకుండ క్షితిని గాచు.
తాII మేరుపర్వతాన్ని విల్లుగాగల్గిన పరమశివుని పట్టపురాణి కళలకు విహారస్థలము, కవుల మాటలనే కలువలతోటలకు శరత్ కాలపు వెన్నెలప్రవాహము, బాలచంద్రుని ధరించిన కిరీటముకలది, కంపానదీతీరం పట్ల స్నేహం చేసేదీ, , అట్టి తల్లి మా కన్నులమార్గాన్ని ఎపుడు ధన్యం చేస్తుందో కదా!
శ్లోII నమః స్తాన్నమ్రేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా
దధానేభ్యః చూడాభరణం అమృతస్యంది శిశిరం
సదా వాస్తవేభ్యః సువిధభువి కంపాఖ్యసరితే
యశో వ్యాపారేభ్యః సుకృత విభవేభ్యో రతిపతేః II 41 II
తే.గీ.II స్తన భరంబున నమ్రిత, సదయనొప్పు,
చంద్రరేఖసద్భూషగా శిరమునొప్ప,
కంపతీరాన చెలువొందు కాలగళుని
రాణి కామాక్షి నెన్నుచు ప్రణుతులిడుదు.
తాII కుచభారగర్వముచే వినమ్రయై చల్లని అమృతము నించు శిరోభూషణముచే (చంద్రునిచే) నందముగని కంపాతీరముల నలరు శంకరుల భాగ్యసంపదలకు నా నమస్కారము.
12 – 3 – 2024.
శ్లోII అసూయన్తీ కాచిత్ మరకతరుచో నాకిముకుటీ -
కదంబం చుంబంతీ చరణనఖ చంద్రాంశుపటలైః
తమోముద్రాం విద్రావయతు మమ కాంచీర్నిలయనా
హరోత్సంగ శ్రీమన్ మణిగృహ మహాదీపకలికా II 42 II
మII తనుకాంతి న్మణికాంతులన్ డులుచు, పాదద్వంద్వమున్ మ్రొక్కుచున్
ప్రణతుల్ జేసెడి దేవతామకుటముల్ ప్రఖ్యాతిగాముద్దిడున్,
వినుతుండౌహరు దేహమందిరమణిద్వీపంబునన్ దీపమై
ఘనతన్వెల్గు జగత్రయీజననియౌ కామాక్షి జ్ఞానంబిడున్.(నన్ బ్రోచుతన్.)
తాII తన శరీరకాంతితో మరకతమణికాంతులను అసూయపడజేసేది, కాలిగోటిచంద్రకాంతులతో దేవతాకిరీటసమూహాన్ని ముద్దిడుకొనేది, శివుని ఒడి అనే మణిగృహంలోని గొప్పదీపపుమొలక, కాంచీ నివాసిని- అయిన కామాక్షి నాలోని అజ్ఞానస్థితికి పారద్రోలుగాక!
శ్లోII అనాద్యంతా కాచిత్ సుజన నయనానందజననీ
నిరుంధానా కాంతిం నిజరుచి విలాసైర్జలముచాం
స్మరారేః తారల్యం మనసి జనయన్తీ స్వయమహో
గలత్కంపా శంపా పరిలసతి కంపాపరిసరే II 43 II
సీII ఆద్యంతములు లేని యపురూప దేవత, కన్నులపండువై కలుగు తల్లి,
తన దేహ కాంతితోఁ దల్లడిల్లఁగఁ జేయు నీలి మేఘరుచుల నీలవేణి,
మనసిజవైరికే మది చంచలింపగా యెదదోచి చేసెడి మృదులదేహ,
శంపా సమీపాన సొంపుగా కనిపించు సన్నుతుల్ గొనునట్టి సరసిజాక్షి
తే.గీ.II దివ్యతేజంబుతో నొక్క దేవపూజ్య
కంపమన్నది లేనట్టి కరుణ కాంతి
భక్తపాళిని బ్రోవగా వరలుచుండె,
కంచి కామాక్షి యాతల్లి, కాచు నన్ను.
తాII కంప ఒడ్డున మెరుపులా మెరుస్తున్నకామాక్షి దేవి ఆది అంతం లేనిది, మంచివారి హృదయాలను ఆహ్లాదపరుస్తుంది, తన చీకటి తేజస్సుతో మేఘాలను అధిగమిస్తుంది, శివుని హృదయాన్ని మృదువుగా చేస్తుంది.
శ్లోII సుధాడిండీరశ్రీః స్మితరుచిషు తుండీర విషయం
పరిష్కుర్వాణాసౌ పరిహసిత నీలోత్పలరుచిః
స్తనాభ్యాం ఆనమ్రా స్తబకయతు మే కాంక్షితతరుం
దృశామైశానీనాం సుకృత ఫల పాండిత్య గరిమా II 44 II
తే.గీ.II స్త్యేనఫేనమున్ బోలెడి చిఱునగవును,
దివ్యనీలోత్పలము గెల్చు దేహకాంతి,
కుచ భరంబున వంగిన కోమలాంగి
భవుని కనువెల్గు నా కోర్కె వరలఁ జేయు.
తాII అమృతంలా మధురమైన చిరునవ్వు, ముదురు నీలిరంగు తేజస్సుతో నీలపువ్వును వెక్కిరించేది, స్తనభారానికి వంగి, శివుని నేత్రాలచేత చేసినపుణ్యఫలం కామాక్షీ దేవి నా కోరికలు తీర్చుగాక.
శ్లోII కృపాధారా ద్రోణీ కృపణధిషణానాం ప్రణమతాం
నిహంత్రీ సంతాపం నిగమ ముకుటోత్తంసకలికా
పరా కాంచీలీలా పరిచయవతీ పర్వతసుతా
గిరాం నీవీ దేవీ గిరిశ పరతంత్రా విజయతే II 45 II
సీII కృపను పారెడు తూము, కృపణధిషణులైన నతులైనచో కాచు నతులితగతి,
నిగమ ముకుటోత్తంస యగణితకలికయౌ నీరజాతేక్షణ నిరుపమాన,
కాంచీనగర లీలలెంచి గణించిన పర్వతాధిపుపుత్రి ప్రవర చరిత,
వాక్కులకధిపతి, భాస్వంతుఁడైనట్టి పరమేశునకధీన పార్వతమ్మ,
తే.గీ.II యట్టి కామాక్షి తల్లికి నంజలించి,
జయము పలికెద సతతంబు ప్రియముతోడ,
కంచిలోనుండి ధర్మంబు కాచు జనని,
నిత్యమంగళ, నాతల్లి, నిర్వికార.
తాII కృపారసము చిలుకు తూము. బలహీనహృదయుల పట్ల దయగలది, తన ముందు సాష్టాంగ ప్రణామం చేసేవారి బాధలను తొలగించునది, ఉపనిషత్తుల శిఖరాభరణము, కంచిలో ఆడుకొనునది, హిమవంతుని పుత్రి, వాక్కుకు అధిపతి, మరియు శివుని నియంత్రణలో తనను తాను ఉంచుకున్నది అయిన కామాక్షికి జయము.
శ్లోII కవిత్వశ్రీకందః సుకృత పరిపాటీ హిమగిరేః
విధాత్రీ విశ్వేషాం విషమ శరవీర ధ్వజపటీ
సఖీ కంపానద్యాః పదహసిత పాథోజ యుగళీ
పురాణో పాయాన్నః పురమథన సామ్రాజ్యపదవీ II 46 II
చంII కవితకు మూలకందము సుగణ్య హిమాద్రి శుభప్రసూతియున్,
ప్రవిమల సృష్టి కర్త, సుమభాసు నికేతనరాజమెన్నగా,
ప్రవహనమైన కంప చెలి, పల్లవహస్తయు, మన్మథారి సం
స్తవ శుభ రాజ్య సత్పదవి, నన్ గని బ్రోచుత ప్రేమతో సదా.
తాII కవిత్వశోభకు మూలకందము, హిమగిరిపూర్వపుణ్యపరిపాటి, సర్వసృష్టికర్త్రి, మన్మధయోధుని ధ్వజపతాక, కంపానది చెలిమికత్తె, మదన వైరి సామ్రాజ్యపదవియు, నైన పురాణి మమ్ము బ్రోచుగాక !
శ్లోII దరిద్రాణా మధ్యే దరదళిత తాపింఛసుషమాః
స్తనాభోగః కాంతాః తరుణ హరిణాంకాంకిత కచాః
హరాధీనా నానావిబుధ ముకుటీ చుంబితపదాః
కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే II 47 II
సీII సన్ననినడుముతో, సరిగ తమాలంపు వృక్షశోభను నేను వెలుగుటెపుడొ?
కుచభారమునవంగి, కురులలో శశిరేఖఁ దాలిచి భువిపైన తనియుటెపుడొ?
శివునకధీనమై చెలగుచు నేనునును నీవుగా నొప్పుచు నీల్గుటెపుడొ?
పలుదేవతల శీర్షికల ముద్దులిడుభాగ్య మెప్పుడు కల్గునో గొప్పగాను?
తే.గీ.II కంపతీరాన నీవలె నింపునొప్పి
నేను విహరింతు నెప్పుడో? నిరుపమాన!
నీవుగా నేను మారుట నీదు కృపయె,
నీవె నాకోర్కె తీర్చుచున్ బ్రోవవమ్మ!
తాII గిరిసుతా! సన్నని నడుముకలిగి, కాస్తవికసించిన తమాల వృక్షము యొక్క పరమశోభతో, కుచభారాలతో వంగి, చంద్రరేఖను దాల్చిన కేశపాశంతో, శివాధీనత్వంపొంది, పలుదేవతాకిరీటాలను ముద్దిడుకునే పాదాలతో, కంపాతీరంలో మేమెప్పుడు నీరూపంతో సమానరూపంకలిగి విహరిస్తామోకదా తల్లీ! (సారూప్యం కోరుతున్న విధానమిది.)
శ్లోII వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మనసో
నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరీ
చరీచర్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే
సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా II 48 II
శాII నావాక్కుల్ మది నీపయిన్ నిలుచుతన్, నావాగ్ఝరుల్ ప్రౌఢమై
భావోద్భాసితమై చెలంగుత, సతీ! వాగ్దేవి! నా జాడ్యమా
దేవీ! శత్రుపరంబు కాత, మదిలో దేదీప్యమానంబుగా
నీవే వెల్గుత, నీ దయామృతఝరుల్ నిత్యంబు నాకందుతన్.
తాII ఓ కామాక్షీ! నా మనస్సు మరియు నా వాక్కు నీలో స్థిరంగా ఉండుగాక. నా నోటిలో అద్భుతమైన ప్రసంగ తరంగాలు నాట్యం చేయుగాక. ఓ జ్ఞానమాత! మన మందబుద్ధిని మన శత్రువులకు పోనిత్తువుగాక. ఓ తల్లి కామాక్షీ! నీ దయ నాపై ధారాళంగా కురియుగాక.
శ్లోII క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురుః
కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం
నరీనర్తు స్వైరం వచనలహరీ నిర్జరపురీ-
సరిద్వీచీ నీచీకరణ పటురాస్యే మమ సదా II 49 II
తే.గీ.II భ్రమరశోభకు శిక్షణ సముచితమిడు
నీదు కడగంటి చూపు నన్నాదుకొనును,
వరలు స్వర్గంగఝరి మించు వాగమృతము
నాట్యమాడుత కామాక్షి! నా రసనను.
తాII ఓ కామాక్షీ! తుమ్మెదల శోభకు శిక్షణనిచ్చుటలో గురువైన నీ కడగంటి చూపుల ప్రసారం క్షణంలో నన్ను ఆపదలనుండి విముక్తుని చేయుగాక! నా ముఖంలో ఎల్లప్పుడు గంగానది ప్రవాహాన్ని అధఃకరించే శక్తిగల మాటల ప్రవాహం నాట్యం చేయుగాక!
శ్లోII పురస్తాన్మే భూయః ప్రశమనపరః స్తాన్మమ రుజాం
ప్రచారస్తే కంపాతట విహృతి సంపాదిని ద్రుశోః
ఇమాం యాంఛామూరీకురు సపది దూరీకురు తమః -
పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయ మాం II 50 II
తే.గీ.II కంప దరినాడఁ గోరెడి గణ్యవమ్మ,
నీదు చూపు నా రుగ్మతన్ నిత్యమణచు,
నాదు మాయ చీకటి బాపి నీదు కృపను
జ్ఞానులందున నిలిపి నన్ గావుమమ్మ!
తాII కంపా నది ఒడ్డున ఆడుకోవడానికి ఇష్టపడే ఓ కామాక్షీ! నీ చూపు నుండి తేజస్సు నా ముందు వ్యాపించి నా అనారోగ్యాన్ని మరియు దాని బాధను తగ్గించు. దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరించి, నా అజ్ఞానమనే చీకటిని తొలగించి, నన్ను జ్ఞానుల లోకానికి నడిపించుము.
శ్లోII ఉదంచంతీ కాంచీనగరనిలయే త్వత్ కరుణయా
సమృద్ధా వాగ్ధాటీ పరిహసిత మాధ్వీ కవయతాం
ఉపాదత్తే మార ప్రతిభట జటాజూట ముకుటీ-
కుటీరోల్లాసిన్యాః శతమఖ తటిన్యా జయపటీమ్ II 51 II
తే.గీ.II కంచి కామాక్షి! నీ దయన్ కవన ధార
పుష్కలంబుగఁ బొంగుచు ముందుకురుకు,
శివజటాజూట గంగదౌ సిడము పట్టి
చేత చిక్కించుకొనునమ్మ! సిద్ధమిదియె.
తాII కాంచీనగరవాసినీ! నీ దయవలన; తేనెల తీయదనాన్ని పరిహసించే, పుష్కలమైన వేగంగల కవిత్వశక్తి పెల్లుబికి వస్తుంది. అది శివుని జడలకు కిరీటంగా ఉల్లసిల్లుతున్న గంగానదియొక్క విజయ పతాకను చేజిక్కించుకుంటుంది.
శ్లోII శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం
సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా
త్రిలోక్యాం ఆధిక్యం త్రిపురపరిపంథి ప్రణయినీ
ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే II 52 II
తే.గీ.II శివుని యిల్లాల! కామాక్షి! చేరినీకు
వందనము చేయు సుతున కమంద బుద్ధి,
విద్య, సంపద, కీర్తి సత్ప్రేమనిత్తు
వట్టి నీ సేవ త్రైలోక్యపతిని చేయు,
నిఁక లభింపనిదేముండు? సకల జనని!
తాII కామాక్షీ! శివుని ఇల్లాలా! జననీ! పాపాలను హరించుదానా! నీ పాదాలపై మోకరిల్లే సుపుత్రులను నీవు వెంటనే కరుణిస్తావు. సంపదను, విద్యను, అమితకీర్తిని ప్రసాదిస్తావు. నీ పాదాభివవందనము త్రిలోకాల్లో ఆధిక్యతనే కలిగిస్తుందంటే, దానివల్ల లభించనివి ఏవి ఉంటాయి తల్లీ?
శ్లోII మనః స్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం
సదా లోలం నీలం చికురజిత లోలంబనికరమ్
గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః
దృశాం యోగ్యం భోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే II 53 II
సీII నతులైనవారల మతులలో జాడ్యమున్ దొలగంగఁ జేసెడి తోయజాక్షి,
నీలోత్పలంబులన్ నిలదీసి యోడించు కమనీయమైనట్టి కలువకంటి,
నీలివర్ణమునొప్పు, మేలైన కచములన్ దుమ్మెదలను మించు ధుర్యురాలు,
వాగ్దంబమేలేక వరలెడు చిఱునవ్వు గలయట్టి శివపత్ని జ్ఞానతేజ,
తే.గీ.II చంద్రరేఖను దాల్చెడి సన్నుతాంగి,
శివుని కన్నుల వెలుగయి చెలగుతల్లి,
హిమగిరీశుని సత్పుత్రి, క్షమకు నిలయ,
కనగ ధరను సర్వోత్కర్షగావెలుంగు.
తాII కమ్పానదీతీరమున నమస్కరించు వారి మనోజాడ్యమును తొలగించునట్టిది, మంచి కన్నులు గలిగినట్టిది, నీలి రంగు గలట్టిది, తుమ్మెదల జయించు కేశములు గలట్టిది, వాక్కులకు దూరముగా నున్నట్టిది, చిఱునవ్వు గలట్టిది, చంద్రకల దాల్చినట్టిది, శివుని కన్నుల యోగ్యభోగ్యమైనట్టిది, హిమవంతుని భాగ్యమైనట్టిది అగు అమ్మవారు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.
13 – 3 – 2024.
శ్లోII ఘనశ్యామాన్ కామాంతక మహిషీ కామాక్షి మధురాన్
దృశాం పాతానేతాన్ అమృత జలశీతాననుపమాన్
భవోత్పాతే భీతే మయి వితర నాథే దృఢభవన్-
మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా II 54 II
మII భవమన్ విడ్వర మిట్లు నాదు మదినే బాధించుచుండగ నో
శివపత్నీ! భయమొందుచుంటి, నిను నే సేవింతు నీ మూకపై
భవదీ యామృత శీత లాక్షయ మహద్భాస్వంత మాధుర్య సం
స్తవనీయాద్భుతమౌ కటాక్షములనే సాగిల్లగాఁ జేయుమా.
తాII శివపత్నీ! కామాక్షీ! సంసార మొకయుత్పాతమై బెదరిపోవుచున్న నాయందు, తీవ్రశోకంబున వివ శుడైయున్న యీ మూగవానియందు, మేఘశ్యామలములు, అమృతశీతలములు, మధురములు నైన నీ చూపులను బ్రసరింపజేయుము.
శ్లోII నతానాం మందానాం భవనిగళ బంధాకులధియాం
మహాన్ధ్యాం రున్ధానాం అభిలషిత సంతానలతికామ్
చరంతీం కంపాయాః తటభువి సవిత్రీం త్రిజగతాం
స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతుకలికాం II 55 II
మII భవబంధమ్ములఁ జిక్కి మందమతులై బాధాకులస్వాంతులై
స్తవనీయంబుగ మ్రొక్కు భక్తతతికిన్ సర్వాపదల్ బాపుచున్
భవతాపంబునడంచి జ్ఞానమిడి, సంభాసించు కల్పమ్ము నా
శివసంజీవని, యెంతు నామెను మదిన్ జిజ్ఞాసతో నిత్యమున్.
తాII సంసారమను సంకెళ్ళం దవిలి మందమతులై చెదరినమనసుగల జనులు నిజ చరణమ్ముల వ్రాలినంతనే వారి యజ్ఞానరూపమైన గ్రుడ్డితనమును బాపి కల్పలతవోలె వారి యభిలాష లొసంగుచు కంపాతీరమున మసలెడి శివసంజీవినీలతికను "నిత్యము స్మరింతుము.
శ్లోII పరా విద్యా హృద్యా శ్రితమదనవిద్యా మరకత-
ప్రభానీలా లీలాపర వశిత శూలాయుధమనాః
తమః పూరం దూరం చరణనత పౌరందరపూరీ-
మృగాక్షీ కామాక్షీ కమలతరలాక్షీ నయతు మే II 56 II
తే.గీ.II తా పరావిద్య, హృద్య, శ్రితమదన నుత
విద్య, మరకతనీలయు, వినత సుర వి
లాసిని, కమలనేత్ర, విలాస మోహి
త శివ మానస, కామాక్షి దయను కనుత.
తాII పరమార్థవిద్యాస్వరూపిణి, మనోహారిణి, మన్మథవిద్యావిలాసిని, మరకత మాణిక్య నీలకాంతిభాసిని, నిజచరణ వినత సుర విలాసిని, కమలదళ లోచని, నిజవిలాస సమ్మోహిత సదాశివ మానస, అగు కామాక్షి నా యజ్ఞానమును నిజకటాక్ష వీక్షణముచే పోఁగొట్టు గాక!
శ్లోII అహంతాఖ్యా మత్కం కబలయతి హా హంత హరిణీ
హఠాత్సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ
కటాక్ష వ్యాక్షేప ప్రకటహరిపాషాణపటలైః
ఇమాం ఉచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా II 57 II
తే.గీ.II నా యహమ్మను జింక తా నయము వీడి
నాదు జ్ఞానమన్ మొలకను నములుచుండె
నీదు దివ్యకటాక్షేంద్రనీలశిలల
తో తరిమికొట్టు కామాక్షి! దోయిలింతు!
తాII అహంకారమనెడి జింక దూకి హఠాత్తుగ నా జ్ఞానమనెడి మొలకను కబళించుచు న్నది. దయతో నీ కటాక్ష ప్రసారములనెడి ఇంద్రనీలశిలాశకలములచే నా లేడిని తఱిమికొట్టుమమ్మా.
శ్లోII బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ
కటాక్షః కామాక్షి ప్రకట జడిమక్షోదపటిమా
కథంకారం నాస్మై కరముకుల చూడాలముకుటా
నమోవాకం బ్రూయుః నముచి పరిపంథి ప్రభృతయః II 58 II
తే.గీ.II పండితుఁడు, మూక యెవరైన బడసిరేని
నీ కటాక్షమున్ గామాక్షి! నిత్యమతని
సేవఁ జేసెదరింద్రాది దేవగణము,
తమ ముడులు తీసి, భక్తితోఁ దలలు వంచి.
తాII పండితుఁడుకాని మూగవాఁడుకాని ఎవనియందు ఒక క్షణమైనను మాంద్యమును హరించు నీ కటాక్షము ప్రసరించునో వానికి ఇంద్రాదిదేవతలు నిజకిరీటములువంచి కరములు మొగిచి నమస్కరించెదరు.
శ్లోII ప్రతీచీం పశ్యామః ప్రకట రుచినీ వారకమణి-
ప్రభాసధ్రీచీనాం ప్రదలిత షడాధారకమలామ్
చరంతీం సౌషుమ్నే పథి పరపదేందు ప్రవిగలత్-
సుధాద్రాం కామాక్షీం పరిణత పరంజ్యోతిరుదయామ్ II 59 II
సీII వివరంబు పరికింప వినుత సర్వాంతర యైనట్టి శివమనోహరి జననిని,
నీవారబీజమునే పోలు తనుకాంతిఁ గలిగిన మహనీయ కరుణనిధిని,
యపురూపమైన మూలాధారమాదిగా షట్చక్రమూలమౌ సదయమతిని,
వినుతసుషుమ్న సద్విమల మార్గపు గామి యయి సహస్రారమ్మునమరి పారు,
తే.గీ.II నమృతధారకునర్థమౌ యనుపమమగు
శ్రీపరంజ్యోతి యుదయమై చెలగునట్టి
కంచి కామాక్షినే మదినెంచి గాంతు,
వందనంబులు చేయుచున్ వినుత గతిని.
తాII సర్వాంతరయైన, నీవారబీజమువంటి తనుత్వకాంతులు గల, మూలాధారాది షట్కమలములు ఆధారములుగాగల, సుషుమ్నా మార్గమున విహరించు, సహస్రారచంద్రునినుండి స్రవించు అమృతధారచే ఆర్థయైన పరంజ్యోతియొక్క ఉదయముగా పరిణమించు కామాక్షీదేవిని చూచుచున్నాము.
శ్లోII జంభారాతి ప్రభృతిముకుటీః పాదయోః పీఠయంతీ
గుమ్ఫాన్వాచాం కవిజనకృతాన్ స్వైరం ఆరామయంతీ
శంపాలక్షీం మణిగణరుచా పాటలైః ప్రాపయన్తీ
కంపాతీరే కవిపరిషదాం జృంభతే భాగ్యసీమా II 60 II
తే.గీ.II దేవతల కిరీటాళిని దివ్యపాద
పీఠిగాఁ గొని, సుకవుల వినుతకవిత
ధాటినొనరించి తనపుష్పవాటిగాను,
తొడవుకాంతితో గాంతులే జడియ నిలిచె
కవులభాగ్యమ్ము కామాక్షి కంప దరిని.
తాII ఇంద్రాదిదేవతాకిరీటకోటిని దనకు బాదపీఠ మొనరించుకొని సుకవివచోధాటిని తాను విహరించుపుష్పవాటి నొనరించుకొని నిజాభరణ మణిగణరుచులచే క్రొమ్మెరుగుల శోభ నదలించుచు కవివరుల అదృష్టసీమ యొకటి కంపాతీరమందు విజృంభించు చున్నది.
14 – 3 – 2024.
శ్లోII చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం
కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగామ్
మారారాతేర్ మదనశిఖినం మాంసలం దీపయన్తీం
కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే II 61 II
తే.గీ.II చంద్రశేఖర, చతురాస్య, చంచలాక్షి,
కుందసుస్మేర, కుచభార మంద గమన,
నతశరీర, నెరయదల్చు క్షితి భ్రరముల,
శివునికామాగ్నిపెంచుచు కవులకల్ప
వల్లియైనకామాక్షినే వరలఁ గొలుతు.
తాII ఇందు కిరీటము, ఇంపులు గుల్కెడి నెమ్మొగము, చంచలమగు నపాంగవిలాసము, మొల్లలబోలు నెలనవ్వులు గలిగి, కుచభారమున నానతయై, కుంతలములచే దుమ్మెద లనదల్చుచు, కామవైరికామాగ్నిని రగుల్చుచు, గవులపలుకులకుఁ గల్పవల్లియై, యలరు కామాక్షినుపాసింతురు.
శ్లోII కాలాంబోధప్రకర సుషమాం కాంతిభిః తర్జయన్తీ
కల్యాణానాం ఉదయసరణిః కల్పవల్లీ కవీనామ్
కందర్పారేః ప్రియసహచరీ కల్మషాణాం నిహంత్రీ
కాంచీదేశం తిలకయతి సా కాపి కారుణ్యసీమా II 62 II
మII వర కామాక్షి దయాసముద్ర, నగగా భాసించు నా కంచికిన్,
పరమోద్భాసిత దేహకాంతి మొయిలున్ పంతంబుతో నెగ్గు, సు
స్థిర శోభాళికి మూలమున్, కవుల భాతిన్ బెంచు కల్పంబు,నీ
శ్వరు కామాగ్నిని పెంచు, చెడ్డనణచున్, శర్వాణి లోకంబునన్.
తాII కామాక్షి, అపారమైన దయ యొక్క స్వరూపిణి, కంచిని అలంకరించింది. ఆమె తన శరీరం యొక్క తేజస్సు ద్వారా చీకటి మేఘాల ప్రకాశాన్ని అధిగమించింది . అన్ని శుభాలు వచ్చే మూలం ఆమె. ఆమె కవులకు కోరికలు తీర్చే లత మరియు మన్మథుని శత్రువు అయిన శివునికి ప్రియ సహచరురాలు. ఆమె సర్వ దురాచారాలను నాశనం చేసేది కూడా.
శ్లోII ఊరీకుర్వన్నురసిజతటే చాతురీం భూధరాణాం
పాథోజానాం నయనయుగళే పరిపంథ్యం వితన్వన్
కంపాతీరే విహరతి రుచా మోఘయన్ మేఘశైలీం
కోకద్వేషం శిరసి కలయన్ కోపి విద్యావిశేషః II 63 II
తే.గీ.II జ్ఞానపూర్ణ స్వరూపిణి, కంప దరిని
మేఘతేజంబునేమించు మేనితోడ,
కుచ శిఖరి తాల్పు, శశిరేఖ కురులఁ గలిగి,
విజిత నీలోత్పలకచ, వెలసె శివగ.
తాII మహోన్నతమైన జ్ఞాన స్వరూపిణి కంపా నది ఒడ్డున తన తేజస్సుతో మేఘాల అంధకారాన్ని అధిగమిస్తూ, తన వక్షస్థలంపై పర్వతాల లక్షణాలను అలవర్చుకుంటూ, కమలాల పట్ల తన కళ్లతో శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, తలపై నెలవంకను ఆడుతూ ఆడుతుంది.
శ్లోII కాంచీలీలాపరిచయవతీ కాపి తాపింఛలక్ష్మీః
జాడ్యారణ్యే హుతవహశిఖా జన్మభూమిః కృపాయాః
మాకందశ్రీర్మధురకవితా చాతురీ కోకిలానాం
మార్గే భూయాన్మమ నయనయోః మాన్మథీ కాపి విద్యా II 64 II
తే.గీII కంచి నెచ్చెలి, తాపింఛ కాంతి యుతయు,
జాడ్య వన దవానలయును, జాలికిరవు,
మధుర కవికోకిలలకును మావి చివురు,
నయిన కామాక్షి దోచు నా నయన దృష్టి.
తాII కాంచి యను విలాసవతికి నెచ్చెలియు, ఇరుగుడుమ్రానికి ఈడగు మైచాయగ లదియై, జాడ్యమను నడవిం దహించు దావాగ్నిశిఖయునై, దయకు పుట్టినిల్లై, మధుర కవికోకిలములకు మామిడిచివురునై, యున్న యొకానొక కామకళ నా చూపుమేఱల దోచుగాక.
15 – 3 – 2024.
శ్లోII సేతుర్మాతః మరకతమయో భక్తిభాజాం భవాబ్ధౌ
లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతీ
కాంచీభూషా పశుపతిదృశాం కాపి కాలాంజనాలీ
మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాలా II 65 II
ఉII నీదు కటాక్ష మెన్న మహనీయ భవాంబుధి సేతువే కనన్,
వాదుగ కల్వపూలను నవప్రభలన్ విలసిల్లునట్టి యా
హ్లాదమునొప్పుమన్మథునియద్భుతటెక్కెము, కంచి భూషయున్,
మోదముసాంబమూర్తికిపూర్తిగ కాటుకకన్నిలిచ్చు త
చ్ఛ్రీద మదంబ శాంభవి నశింపఁగ జేయుత నాదు దుఃఖమున్.
సీII కామాక్షి నీవైన కరుణాకటాక్షముల్ భవసాగరముపైన వారధియగు,
లీలా విలోల విశాల కువలయంపు మన్మథ ధ్వజమౌను మంగళాంగి,
కంచికా కామాక్షి! కాంచీనగరభూషణంబు తలంపంగ నయనిధాన!
పశుపతి కంటికి పరమాద్భుతంబైన కాలాంజనాలియే కమల నయన!
తే.గీ.II అట్టి నీకంటి చూపు నన్ పట్టి చూచి
నాదు దుఃఖమున్ బాపుత మోదమలర,
నిన్నె నమ్మిన సుతుఁడను, నీడవగుచు
నన్ను కాపాడుమమ్మరో సన్నుతముగ.
తాII ఓ తల్లీ! కామాక్షీ! నీ కటాక్షమాల భక్తులు సంసారసాగరము దాటుటకు మరకతమణి సేతువు, కలువపూలవిలసిల్లు సువిలాసచంచలమగు మన్మధుని టెక్కెము, కాంచీపురీభూషణము, పశుపతిచూపులకు నల్లని కాటుకరేఖ, అది నా దుఃఖమును సడలించుగాక.
శ్లోII వ్యావృణ్వానాః కువలయదళ ప్రక్రియావైరముద్రాం
వ్యాకుర్వాణా మనసిజమహారాజ సామ్రాజ్యలక్షీం
కాంచీలీలా విహృతిరసికే కాంక్షితం నః క్రియాసుః
బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః II 66 II
తే.గీ.II కంచి లీలావిహారిణీ! కలువపూల
వికసనంబున శత్రువై, విషమశరుని
రాజ్యలక్ష్మినిఁ దెలిపెడి, రాగబంధ
ములను బాపు కంటను గనుము ననుఁ గృపను.
తాII కాంచీనగరంలో లీలావిహారం చేసే ఓ కామాక్షితల్లీ! కలువపూవుల వికసనమునందు శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, మన్మథమహారాజు యొక్క సామ్రాజ్య లక్ష్మిని వ్యాఖ్యానిస్తూ; నియమవంతులైన విరాగుల (సంసార) బంధాలను తెంపివేస్తూ దీక్షాబద్ధాలైన నీ దయతో కూడిన కంటికొసలనుండి ప్రసరించే చూపులు మా కోర్కెలను నెరవేర్చు గాక!
శ్లోII కాలాంభోదే శశిరుచిదళం కైతకం దర్శయంతీ
మధ్యేసౌదామిని మధులిహాం మాలికాం రాజయంతీ
హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీ
కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీః II 67 II
సీII శిఖకాలమేఘాన చిన్ని చంద్రునిఁ బోలు మొగలి పూ రేకును ముడిచి చూపు,
చిరునవ్వు మెఱుపులన్ విరితేనెమేపరు లనుబోలు చూపులన్ ఘనత నిలుపు,
వికసిత ముఖపద్మ మొకహంసగీతమున్ వెలుగొందగా జేయు విపులసరణి,
కంపానదీతీర కారుణ్యలక్ష్మియై యొక కాంతి పుంజంబు ప్రకృతిజనని
తే.గీ.II కూర్మితోఁ జూచి భక్తుల కోర్కె తీర్చ
భాసిలుచునుండె కృపతోడ వాసిగాను,
కంచి కామాక్షి మాయమ్మ కనికరమున
నన్ను కృపఁజూచి కాచుత నయము తలర.
తాII కారుమబ్బులో చంద్రకాంతిమొలకవంటి మొగలిపూరేకును (చంద్రరేఖను సిగలో) ధరించి చూపునది; మెరుపుతీగ మధ్యలో తుమ్మెదల వరుసను ప్రకాశింపజేసినది (నవ్వులలో కలసిన నల్లని కటాక్షప్రసారాలు) వికసించిన కమలంలో హంసధ్వనిని వెలుగొందజేయునది (వదనంలో నుండి మధురధ్వనులు) అయిన వినూత్నమైన ఒకానొక దయాసంపదలరాశి, కంపాతీరంలో ప్రకాశిస్తున్నది.
శ్లోII చిత్రం చిత్రం నిజమృదుతయా భర్త్సయన్ పల్లవాలీం
పుంసాం కామాన్ భువి చ నియతం పూరయన్ పుణ్యభాజాం
జాతః శైలాన్న తు జలనిధేః స్వైరసంచారశీలః
కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మే II 68 II
తే.గీ.II చిగురుటాకులఁ జడిపించు ద్యుతితనువున,
ధర సుకృతులకు సుఫలముల్ దయనొసంగు,
జలజ కాని చింతామణి చట్టు పట్టి,
శుభములనుగొల్పుచున్ మాకు నభయమిడుత.
తాII తన శరీరపు మెత్తదనంచేత చిగురుటాకులను బెదరగొడుతూ, పుణ్యాత్ములైనవారి కోర్కెలను నియమబద్ధంగా భూలోకంలోనే ఫలింపజేస్తూ, సముద్రంనుండి కాక పర్వతంనుండి పుట్టినదై, స్వేచ్ఛావిహారంచేస్తూ కాంచీనగరంలో అలంకారంగా నెలకొని ఉన్న ఒకానొక వింతయైన చింతామణి మాకు శుభాలను కల్గించుగాక!
16 – 3 – 2024.
శ్లోII తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూకపుష్పం
తస్మన్ మల్లీకుసుమసుషమాం తత్ర వీణానినాదం
వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యాం
ఐశానీ సా కలయతితరాం ఐంద్రజాలం విలాసం II 69 II
సీII జలదనికటమందు తామ్రాంబుజములును, దానిలో మంకెన, దానియందు
మల్లికాకుసుమంపు మహితమౌ కాంతియు, నక్కడవీణను చక్కగాను
ధ్వనియింపఁ జేయుచు, ఘనుడైన గణనాథు జనకుని సత్కార్య చయ తరంగ
ఫలితమై కామాక్షి మహనీయమైనట్టి యావిష్కృతంబయ్యె ననుపమముగ,
తే.గీ.II అట్టి కామాక్షి మము నిలఁబెట్టునట్టి
దిట్ట, నేనామె పాదముల్ పట్టి విడువ,
ననుపమంబుగ నాలోననలరు జనని
నిత్యమంగళదాయియై నిలుపు నన్ను.
తాII మేఘాల దగ్గర ఎర్రటి కమలాలు (కళ్ళు) ఉన్నాయి (జుట్టు తాళాలు). దాని దగ్గరే ఎర్రటి మందార పువ్వులు (పెదవులు) ఉన్నాయి. ఆ మందార పువ్వుల లోపల మల్లె మొగ్గలు (పళ్ళు) ఉంటాయి. వీణ యొక్క మధురమైన సంగీతం ఉంది. ఈ మాయాజాలం అంతా కంచిలో నివసించే శివుని సత్కార్యాల తరంగాల ఫలితమైన కామాక్షి ద్వారా ఆవిష్కరించబడింది.
17 – 3 – 2024.
శ్లోII ఆహారాంశం త్రిదశ సదసాం ఆశ్రయే చాతకానాం
ఆకాశోపర్యపి చ కలయన్ ఆలయం తుంగమేషాం
కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం
మందస్మేరో మదననిగమ ప్రక్రియా సంప్రదాయః II 70 II
సీII చాతకంబులకును చక్కని నిలయమున్ దివ్యులకును భుక్తి భవ్యరీతి
నిత్యమొసగునట్టి నిరుపమ శశితాల్పు, గగనసౌధద్వయ మగణితముగ
గలిగిన కుచభర, కౌనుశూన్యపుదేహ, కవులకు సురగవి, కమల నయన,
మందహాసాంచితమహనీయ ముఖపద్మ, మదనవేదపుసార సదయహృదయ,
తే.గీ.II కంపతీరాన కామాక్షి యింపుతోడ
భక్తజనులను కాచెడి భవ్య హృదయ
వెలుగుచున్నది గొప్పగా, ప్రీతితోడ
సేవ చేసెద నాతల్లి చిత్తమలర.
తాII చాతక పక్షులకు ఆశ్రయమైన మబ్బులో దేవతల ఆహారభాగాన్ని కల్పించటం (మబ్బువంటి నీలమైన తలకట్టులో చంద్రుడు), ఆకాశంపై భాగానకూడ ఎత్తైన భవనాన్ని కలిగి ఉండటం (సన్నని నడుముపై ఉన్నత కుచమండలం) కవులకు కామధేనువు, సన్నని చిరునవ్వు- ఇట్టివి కలిగి ఉన్న మన్మథ వేదప్రక్రియాసంప్రదాయము- కంపాతీరంలో విహరిస్తున్నది.
శ్లోII ఆర్ద్రీభూతైరవిరలకృపైః ఆత్తలీలావిలాసైః
ఆస్థా పూర్ణైరధిక చపలైః అంచితాంభోజ శిల్పైః
కాంతైర్లక్ష్మీ లలితభవనైః కాంతికైవల్యసారైః
కాశ్మల్యం నః కబలయతు సా కామకోటీ కటాక్షైః II 71 II
సీII ఆర్ద్రమై యుండెడి యవిరళకృపనొప్పి, లీలావిలాసాలఁ దేలియాడు,
వాంఛాప్రపూర్ణముల్, వరలవొక్కయెదనె, ఘనమౌచునొప్పెడి కమలసృష్టి,
అమ్మవౌ కనుపాపలాకర్షణీయమౌ నిలయముల్, కామారి కలల పంట,
గణనీయ మహితప్రకాశస్వరూప సత్ సారముల్, వేదాంత సారములును,
తే.గీ.II అట్టి మహనీయమైనట్టి పట్టుఁ గలుగు
దివ్యమైనట్టి చూపులు దీనులమగు
మాదు మదులందు నెలకొన్న మలినములను
మ్రింగివేయుత, మాకు సన్మంగళమిడ.
తాII అమ్మవి దయగల చూపులు దయారసంతో తడిసినట్టివి, మనోహరమైన విలాసాలుకలవి, వాంఛాప్రపూర్ణాలు, ఒకచోటనే ఉండనట్టివి, గొప్పనైన కమలముల యొక్క సృష్టి విశేషాలు, సంపదలకు ఆకర్షణీయమైన నిలయాలును, కేవల ప్రకాశస్వరూపసారాలు. అట్టి శ్రీకామకోటీ అమ్మవారి చూపులు మాలోని మాలిన్యాన్ని మ్రింగివేయుగాక.
శ్లోII ఆధూన్వంత్యై తరల నయనైః ఆంగజీం వైజయంతీం
ఆనందిన్యై నిజపదజుషాం ఆత్త కాంచీపురాయై
ఆస్మాకీనం హృదయమఖిలైః ఆగమానాం ప్రపంచైః
ఆరాధ్యాయై స్పృహయతితరాం ఆదిమాయై జనన్యై II 72 II
చంII సుమశరుకేతనమ్మెగుర శోభిల వేయుచు కంటి చూపులన్,
ప్రముదమునన్ భజించు వర భక్తులకున్ బరితోషమిచ్చుచున్,
సుమధుర సేవలందు నుత సుందర వేదములందు నిల్చి సే
మము నిడు కంచికాపురి ప్రమాణమహేశ్వరికంజలించెదన్.
తాII మన్మథపతాకాన్ని తన చలించే చూపులతో ఎగురవేస్తూ, తన పాదము లాశ్రయించిన వారిని ఆనందింపజేస్తూ, అఖిల వేద శాక్తాగమాలలో ప్రబంధింపబడి ఆరాధింపబడుచున్నదై, తల్లులకే తల్లియై కాంచీపురంలో నెలకొన్న కామాక్షీదేవిపట్ల నా మనసు ఆనందంప్రకటిస్తున్నది.
శ్లోII దూరం వాచాం త్రిదశసదసాం దుఃఖసింధోస్తరిత్రం
మోహక్ష్వే లక్షితిరుహవనే క్రూరధారం కుఠారమ్
కంపాతీర ప్రణయి కవిభిః వర్ణితోద్యచ్చరిత్రం
శాంత్యై సేవే సకలవిపదాం శాంకరం తత్కలత్రం II 73 II
తే.గీ.II దేవ నుతులకునందదు, నావ గాను
దుఃఖ జలధిదాటించు, దురిత మోహ
వనకుఠారము, కవినుత ఘన సుచరిత,
కంచి శివునాలి నెంచెద కావ నన్ను.
తాII దేవతాస్తుతుల కందనిది, దుఃఖసాగరము దాటుటకు ఓడయైనది మోహమనెడి విషవృక్షముల అడవికి బదునైన గండ్రగొడ్డలియైనదియునై కవులచే స్తుతింపబడు చరి త్రగలదియై కంపాతీరమున విహరించు చంద్రశేఖరకళత్రమును సకలవిపత్ప్రశాంతికై సేవించెదను.
శ్లోII ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ-
శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశన్తీ
తుండీరాఖ్యై మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రీ
చండీ దేవీ కలయతి రతిం చంద్రచూడాలచూడే II 74 II
తే.గీ.II ప్రకృతిసిద్ధ మాలిన్యమున్ బరగ తుడిచి,
ఆశ్రితులప్రజ్ఞ పెంచుచు, ననుపమ శశి
రేఖఁ శిరమునఁ దాల్చి, తా శ్రీకరమగు
చండి స్వర్ణము కురిపించు తుండిరమున.
తాII ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న మాలిన్యాన్ని ఖండించివేస్తూ, తన పాదాలనాశ్రయించినవారికి ఏమరుపాటులేని ప్రజ్ఞావికాసాన్ని కలిగిస్తూ, చంద్రవంకను శిరోమణిగా ధరించి చండీదేవి స్వరూపిణియై బంగారు వర్షాన్ని కురిపిస్తూ- తుండీర మండలం (కాంచి)లో మాకు ఆనందాన్ని కల్గిస్తున్నది.
శ్లోII యేన ఖ్యాతో భవతి స గృహీ పూరుషో మేరుధన్వా
యద్దృక్కోణే మదననిగమ ప్రాభవం బోభవీతి
యత్ ప్రీత్యైవ త్రిజగదధిపో జృంభతే కింపచానః
కంపాతీరే స జయతి మహాన్ కశ్చిదోజో విశేషః II 75 II
సీII శివుఁడు గృహస్తుగా చిత్తంబు పొంగార నయ్యె నే జననిచేననుపమముగ,
నేతల్లి క్రీగంటి యెనలేని చూపులు కామదేవునిలోని ప్రేమఁ బెంచు,
నేశక్తి కృపచేత భాసించె భిక్షువు ముల్లోకములనేలు ముఖ్యుఁడగుచు,
కంపా సమీపాన గలిగిన యా దివ్య జనని కామాక్షికి జయము జయము,
తే.గీ.II భక్తజనపాళి కెన్నగా భాగ్యరాశి,
దేవతాతతిన్ రక్షించు దివ్యశక్తి,
కవులవాఙ్నిధి యైనట్టి కల్పవల్లి,
మోక్షమొసగుచు నాకు సంరక్షఁ గొలుపు.
తాII ఎవరి వల్ల శివుడు గృహస్థుడిగా ప్రసిద్ది చెందాడో, ఎవరి ప్రక్క చూపులు కామదేవుని ప్రేమలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయో, ఎవరి అనుగ్రహం వల్ల (మానవ పుర్రెతో కూడిన భిక్షాపాత్రతో) భిక్షాటన చేసే శివుడు ఈ ముగ్గురికీ ప్రభువుగా అధికారం పొందాడు. కంపా నది ఒడ్డున ఉండే ఆ ప్రకాశవంతమైన దయాశక్తికి విజయం.
శ్లోII ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి యన్మే
నింద్యాం భింద్యాత్ సపది జడతాం కల్మషాదున్మిషంతీం
సాధ్వీ మాధ్వీరసమధురతా భంజినీ మంజురీతిః
వాణీవేణీ ఝటితి వృణుతాత్ స్వర్ధునీ స్పర్ధినీ మామ్ II 76 II
సీII ధరణి నా వాగ్గతి ధన్యమో? కాక యధన్యమగునొ? యనన్ ధన్యమనుదు,
పాపంబునుండి తా పనిపడి వికసించు జాడ్యమ్ము నేసాధ్వి సరిగ చూచి
తొలగించు? ననినచో పులకితాంగుడనయి పరమ బ్రహ్మ జనని నిరుపమముగ
తొలగించునందును, సులలిత మధురమౌ తీయతేనియ మించు దివ్యగతిని
తే.గీ.II స్వర్గ గంగాఝరిన్ మించి సరసమైన
వాఙ్నిధియె నన్ను వరియించి వరలఁ జేయు
నమ్మ కామాక్షి కరుణను నెమ్మితోడ,
వందనమ్ములు చేయుదున్ భక్తితోడ.
తాII అమ్మా! కామాక్షీదేవీ, నా వాక్కులగతి ధన్యమా, అధన్యమా, అను ప్రశ్నకు అతి ధన్యమని నా యుత్తరము. ఎవతె పాపమునుండి వికసించు నింద్యమైన జాడ్యమును తొలగించునను ప్రశ్నకు పరబ్రహ్మస్వరూపిణి అనియే నా యుత్తరము. తేనె తీపిని భంజించు అందమైన రీతిగల ఆకాశగంగతో పోటీపడు వాఙ్నిధి నన్ను వరించుగాక!
శ్లోII యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజాం
యస్యాః పీఠీ సతతశిశిరా శీకరైర్మాకరందైః
యస్యాః పేటీ శృతి పరిచలన్ మౌళిరత్నస్య కాంచీ
సా మే సోమాభరణ మహిషీ సాధయేత్కాంక్షితాని II 77 II
సీII ఎవతెకు యోగుల హృదయంపుకమలంబులగు పుష్పములవాటికగను తలప?,
నెవతె పీఠము దల్ప స్తవనీయమగు తేనె చినుకులన్ జల్లనై జెలఁగుచుండు?
నెవతెకు వేదాల నెప్పుడున్ దిరిగెడి మౌళిరత్నపుపెట్టె మాననీయ
కంచినగరమగున్?గమనీయమైనట్టి కరుణాకటాక్షుండు గరళగళుని
తే.గీ.II మహిషి యాయమ్మ కామాక్షి, మహిని కృపను
నాదు మదిలోన నెలకొన్న శ్రీదమయిన
కోరికల్ తీర్చి కుశలంబు కొలుపు గాక,
యట్టి కామాక్షిపదములకంజలింతు.
తాII ఎవతెకు యోగుల హృదయకమలమే పుష్పవాటికయో, ఎవతెయొక్క పీఠము మకరందపు చినుకులతో చల్లనై యుండునో, ఎవతెకు వేదములలో తిరుగు మౌళి
రత్నము యొక్క పెట్టె కాంచీనగరమో, ఆ సోమశేఖరుని మహిషి నా కోరికల దీర్చు గాక!
18 – 3 – 2024.
శ్లోII ఏకా మాతా సకలజగతామేయుషీ ధ్యానముద్రాం
ఏకామ్రాధీశ్వర చరణయోః ఏకతానాం సమింధే
తాటంకోద్యన్మణిగణరుచా తామ్రకర్ణప్రదేశా
తారుణ్యశ్రీ స్తబకితతనుః తాపసీ కాపి బాలా II 78 II
సీII ఏకామ్రనాథీశు శ్రీకరపదసుమ ధ్యానభంగిమనున్నధన్యురాలు,
సకలభువనమాత ముకుళితవరహస్త, చిత్తమేకాగ్రతన్ జెలఁగనుండి,
తాటంకమణిజన్య తామ్రవర్ణము చెవి భాగంబులెఱ్ఱగా వరలఁ జేయ,
యౌవన సంపదనలరుపూగుత్తుల సొగసుతోనొప్పెడి యగణితముగ
తే.గీ.II బాల యొక్కతె కంచిని వరలుచుండె
ఘోర తపమును జేయుచున్ గూర్మితోడ,
కంచికామాక్షి యాయమ్మ కరుణతోడ
కేలుమోడ్చెడి నన్ను రక్షించుగాక.
తాII ఏకామ్రేశ్వరుని పాద పద్మాలపై ధ్యాన భంగిమలో ఉన్న ఒక యువకురాలు, తేజోవంతమైన నవ యవ్వనంతో, ఆమె రత్నాలు పొదిగిన చెవి ఆభరణాల నుండి తేజస్సుతో, ఆమె చెవుల చుట్టూ ఎర్రటి ఛాయతో, తపస్సు చేస్తోంది.
శ్లోII దంతాదంతిప్రకటనకరీ దంతిభిర్మందయానైః
మందారాణాం మదపరిణతిం మథ్నతీ మందహాసైః
అంకూరాభ్యాం మనసిజతరోః అంకితోరాః కుచాభ్యాం
అంతః కాంచి స్ఫురతి జగతాం ఆదిమా కాపి మాతా II 79 II
సీII మందగమనమున మదపుటేనుగుతోడ యుద్ధంబు ప్రకటించు యోధురాలు,
మందారపూల యమంద గర్వంబునే మందహాసంబున మాయఁ జేయు,
నలకామదేవ భూజాంకురము, కుచాంకితోరమ్మయిన యట్టి చారుశీల,
లోకమ్ములకునొక్క లోకేశ్వరిగనొప్పుశ్రీకరమైనట్టి చిద్విభాస,
తే.గీ.II కంచిలోనొక్క దేవత కాంక్షితముల
నెల్ల భక్తులకును దీర్చ నుల్ల మలర
నొప్పి యున్నది సృష్టికే గొప్పగాను,
శివుని యర్థాంగి కామాక్షి, భవముబాప.
తాII తన నిదానమైన మనోహరమైన నడకతో ఏనుగును అధిగమించేటువంటి, మందార పువ్వుల అహంకారాన్నిచూర్ణం చేసే ప్రకాశవంతమైన చిరునవ్వు కలిగినటువంటి, కామదేవ వృక్షం నుండి మొలకెత్తిన మొలకలను పోలినటువంటి, అన్ని లోకాల పురాతన తల్లి కంచిలో ప్రకాశిస్తుంది.
శ్లోII త్రియంబకకుటుంబినీం త్రిపురసుందరీం ఇందిరాం
పుళిందపతిసుందరీం త్రిపురభైరవీం భారతీం
మతంగకులనాయికాం మహిషమర్దనీం మాతృకాం
భణంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే II 80 II
సీII త్రిపురసుందరి తల్లి, త్రిపురభైరవి, త్ర్యంబ కకుటుంబినియు, మాతృకయును మరియు,
యిందిర, మాతంగి, యిలపుళిందపతికి రాజ్ఞియు, మహిషమ ర్దనిగ, భార
తిగ, కంచిలో మాకు తగు మేలు చేయంగఁ గలుగు కామాక్షి! మా కల్పవల్లి!
విబుధ వరులు నిన్ను వివిధరీతులతోడ ప్రీతిని బిల్చుచు ఖ్యాతిగాను
తే.గీ.II సేవలందింతురమ్మవిశేషముగను!
నేనునున్ నిన్ను మదినెంచి నిత్యమిట్లు
గొలుచుచుంటిని, నన్ జూచి పలుకవమ్మ!
పలుకులిమ్ము నిన్ స్తుతి చేయఁ బరవసించి.
తాII ఓ కామాక్షీ! త్రియంబకుటుంబినియని, త్రిపురసుందరియని, ఇందిరయని, పుళిందనాథసుందరి యని, త్రిపురభైరవియని, భారతియని, మతంగకులనాయికయని, (మాతంగి) మహిషాసుర మర్దినియని, మాతృకయని ('అ' కారాది 'క్ష' కారాంత వర్ణమాలామంత్రరూపిణి అని), నీ విహృతినే యనఁగా నీ అవతారవిహారవిశేషములనే విబుధవరులు పలువిధములుగ బేర్కొనుచుందురు.
శ్లోII మహామునిమనోనటీ మహితరమ్య కంపాతటీ
కుటీరకవిహారిణీ కుటిలబోధసంహారిణీ
సదా భవతు కామినీ సకలదేహినాం స్వామినీ
కృపాతిశయకింకరీ మమ విభూతయే శాంకరీ II 81 II
సీII మునిమనోనటి, వక్రబోధసంహారిణి, సకలదేహులకును స్వామినియును,
ఘనమైన వినుతమౌ కంపాతటీ కుటీరక విహారిణియునౌ రమ్యనదియు,
దివ్యమయిన కృపాతిశయ కింకరి శాంకరి విభూతి, కలలపంట,
యగు గాక సతత మీ నగరాజ సత్పుత్రి, జగతిని నడిపించు నయనిధాన,
తే.గీ.II జయము, జయమమ్మ జగదంబ! జయము నీకు,
భయము మా లోనఁ బోఁగొట్టి నియతితోడ
మెలఁగుమార్గాన నడుపుమా మేలుగనగ,
సకలసద్గుణ శుభమణీ! శంభురాణి!
తాII మునుల మనోరంగములందు నటించు నర్తకి, కంపాతటీకుటీరముల విహరించు నది, కుటిలబోధమును (అజ్ఞానమును) హరించునది, సకలశరీరులకు స్వామినియగు భామిని కృపావిశేషమునకు గింకరి కృపకు లోబడు తల్లియునగు శాంకరి మా సకలవిభూతులకు హేతువగుగాక.
శ్లోII జడాః ప్రకృతినిర్ధనాః జనవిలోచనారుంతుదాః
నరా జనని వీక్షణం క్షణమవాప్య కామాక్షి తే
వచస్సు మధుమాధురీం ప్రకటయంతి పౌరందరీ-
విభూతిషు విడంబనాం వపుషి మాన్మథీం ప్రక్రియాం II 82 II
తే.గీ.II అమ్మ! కామాక్షి! నీకటాక్షమ్ములున్న
జడుఁడు తీయగా పల్కెడి జాణ యగును,
పేద దేవేంద్రవైభవోపేతుఁడగును,
రూపహీనుఁడు మన్మథరూపుఁడగును.
తాII అమ్మా కామాక్షీ! నీ కటాక్ష పాత్రులయిన జడులుకూడ తేనియలతీపి గల మాటలు గలవారయ్యెదరు. ఆగర్భదరిద్రులు దేవేందైశ్వర్యసంపన్నులు కాగలరు. కురూపులు నవమన్మధ సుందరులయి విలసిల్లుదురు.
శ్లోII ఘనస్తనతట స్ఫుటస్ఫురిత కంచులీ చంచలీ
కృతత్రిపురశాసనా సుజనశీలితోపాసనా
దృశోః సరణిమశ్నుతే మమ కదా ను కాంచీపురే
పరా పరమయోగినాం మనసి చిత్కలా పుష్కలా II 83 II
సీII స్తనసుందరత్వమున్ గనఁ జేయు కంచుక ధారియై శివుని చిత్తము రగిల్చి,
భక్తులచేత నుపాసింబడునది, సర్వోత్తమంబౌ ప్రశస్తికలది,
పరమయోగులయొక్క పావన హృదయాలలోనుండునట్టి విలోలనయన,
పూర్ణస్వరూపిణి, మునిజన సేవిత, భోగభాగ్యములిచ్చు పూవుబోడి,
తే.గీ.II పూర్ణమైనట్టి కామాక్షి పూజ్య జనని,
కంచి పురమున వెలిగెడి కల్పవల్లి,
నాదు కనులకునెప్పుడు నయము కదుర
దర్శనం బిడునో కదాతనివితీర?
తాII స్తనసౌందర్యాన్ని ప్రకాశింపజేసే కంచుకమును ధరించి త్రిపుర శాసనుడైన శివుని చంచలింపజేసినది, సుజనులచే ఉపాసింపబడునది, సర్వోత్తరయైనది (పరా), పరమయోగుల హృదయాలలో వెలిగెడు చైతన్యకళ, పూర్ణరూపిణియైన తల్లి, కాంచీపురము నందు నా కనులకెప్పుడు దర్శనమిచ్చునో కదా!
శ్లోII కవీంద్రహృదయేచరీ పరిగృహీత కాంచీపురీ
నిరూఢకరుణాఝరీ నిఖిలలోకరక్షాకరీ
మనః పథదవీయసీ మదనశాసనప్రేయసీ
మహాగుణగరీయసీ మమ దృశోస్తు నేదీయసీ II 84 II
తే.గీ.II కవుల మదులందుఁ జరియించు కంచి నిలయ,
కరుణ రస ఝరి, లోకరక్షణ చణయును,
గుణ గరీయసి, శివపత్ని, ఘన సుహృదయ
మార్గమునకు దవ్వైనది, మమ్ముగనుత.
తాII కవీంద్రులహృదయమందు జరించునది, కాంచీపురిని జేరియుండునది, ప్రఖ్యాత కరుణారస నిర్ఘరియై సర్వలోకరక్షణమాచరించునది, మహాగుణగరీయసియు, మదన వైరి ప్రేయసియు, మనోమార్గమునకు దవ్వయినదియు నగు తల్లి నా చూపులకు దారసిల్లు గాక.
19 – 3 – 2024.
శ్లోII ధనేన న రమామహే ఖలజనాన్న సేవామహే
న చాపలమయామహే భవభయాన్న దూయామహే
స్థిరాం తనుమహేతరాం మనసి కిం చ కాంచీరత-
స్మరాంతకకుటుంబినీ చరణ పల్లవోపాసనాం II 85 II
చంII ధనమును చూచి పొంగ మిక ధాత్రిని దుష్టులసేవ చేయ, మెం
దును చపలత్వ మొంద మిల దుష్టభవంబన భీతి చెంద మీ
శుని వర కంచి వాస సతి శుభ్రపదద్వయపల్లవంబులన్
బ్రణవముగాఁ దలంచుచు నుపాసన చేసెదమెల్లవేళలన్.
తాII ధనమునకు పొంగము, దుష్టులసేవింపము, చపలత్వము నొందము, భవభయమునం బరితపింపము, మఱి కాంచీవిహారకుతూహలినియైన పురవైరి యిల్లాలి చరణపల్లవముల యుపాసనను మనసునందు సుస్తిర మొనరించుకొందుము.
శ్లోII సురాః పరిజనా వపుర్మనసిజాయ వైరాయతే
త్రివిష్టపనితంబినీ కుచతటీ చ కేళీగిరిః
గిరః సురభయో వయః తరుణిమా దరిద్రస్య వా
కటాక్షసరణౌ క్షణం నిపతితస్య కామాక్షి తే II 86 II
శాII అమ్మా! నీ కను చూపు సోకిననె పేదైనన్ రమానాథుఁడౌన్,
నెమ్మిన్ దేవతలెల్ల సేవకులగున్, నిత్యస్మరోత్తేజుఁడౌన్,
మిన్నౌదేవనితంబినీ కుచగిరుల్ నిత్యంబు కేళీగిరుల్,
క్రన్నన్ వానికి నౌను, వాఙ్మియగుచున్ బ్రాయుండగున్ నిత్యమున్.
తాII కామాక్షీ! ఎవడు నీ ప్రక్క చూపుల బాటలో పడుతాడో, అతడు మిక్కిలి దరిద్రుడైనప్పటికీ, అతనికి దేవతలు సేవకులుగా మారతారు, అతడు తన దేహపు సొగసులో కామదేవుని మించినవాడు , మూడు లోకములలో అతి సుందరమైన దేవకాంతల యొక్క వక్షస్థలము అతని క్రీడా గిరులు అగును, అతని పదాలు మధురమైన వాసన మరియు అతని వయస్సు శాశ్వతమైన యవ్వనము.
శ్లోII పవిత్రయ జగత్రయీ విబుధబోధ జీవాతుభిః
పురత్రయవిమర్దినః పులక కంచులీదాయిభిః
భవక్షయవిచక్షణైః వ్యసనమోక్షణైర్వీక్షణైః
నిరక్షరశిరోమణిం కరుణయైవ కామాక్షి మాం II 87 II
మII త్రిజగత్ పండిత జ్ఞానమూలమగు సద్దివ్యౌషధంబున్, జగ
ద్విజితానంగుని మేని బుల్కలకు భావింపన్ గారణంబున్, సదా
సుజనాళిన్ భవబంధబాహ్యులుగ సత్ శోభన్ గృపన్ జేయుచున్
నిజశక్తిన్ వ్యసనాళిఁ బాపు పదముల్ నీవమ్మ! కామేశ్వరీ!
తాII ఓ కామాక్షీ! ముల్లోక పండితుల జ్ఞానమునకు జీవనౌషధములు, పరమశివు నెమ్మేను పులకరింపజేయునవి, సంసారమును క్షయింపజేయు విచక్షణగలవి, వ్యసనములను విడి పింపజేయునవి అయిన నీ చూపులచే దయతో నిరక్షరశిరోమణి
యైన నన్ను బవిత్రుని జేయుము.
శ్లోII కదా కలితఖేలనాః కరుణయైవ కాంచీపురే
కలాయముకులత్విషః శుభకదంబ పూర్ణాంకురాః
పయోధరభరాలసాః కవిజనేషు తే బంధురాః
పచేలిమకృపారసాః పరిపతంతి మార్గే దృశోః II 88 II
తే.గీ.II కంచిలోపలఁ గరుణఁ గ్రీడించునవియు,
శింశుపపుకాంతిఁ గలిగి భాసించునట్టి,
శుభకదంబపూర్ణాంకుర శోభనొప్పి,
స్తనభరాలస, కవిబంధ సదయదృష్టి
యెపుడుపరతువో నాపైన నీశురాణి!
తాII కాంచీపురమున గరుణతో క్రీడించునవి, కళాయకుసుమ (ఇఱుగుడుపువ్వుచే) కాంతి నింపైనవి, శుభములనెడి కడిమితరువులచీరు మొలకలయినవి, కుచభరముచే నల సము లైనవి, కవిజనులయందు పరిపూర్ణములైనవియు, నగు పరిపక్వకృపారసములు నా యం దెపుడు గురియునో కదా' !
శ్లోII అశోధ్యమచలోద్భవం హృదయనందనం దేహినాం
అనర్ఘమధికాంచి తత్ కిమపి రత్నముద్ ద్యోతతే
అనేన సమలంకృతా జయతి శంకరాంకస్థలీ
కదాస్య మమ మానసం వ్రజతి పేటికావిభ్రమం II 89 II
తే.గీ.II కన నశోధ్య మచలజము, మనసు పొంగఁ
జేయు దేహులకు నిల కంచి నిలయయున
నర్ఘరత్నమ్ము, భవునొడినమరి శోభ
గొలుపు, దానిపై నామది నిలుచునెపుడొ?
తాII శోధ్యము కానిది, కొండనుండి పుట్టినది, ప్రాణుల హృదయుము నానందింప జేయునది, వెల కట్టలేనిది, కాంచీనగరమందున్నట్టిదియునైన, ఆ రత్నము (అమ్మవారు) ప్రకాశించుచున్నది. శివుని యొడి ఈ రత్నముచే అలంకరింపబడి సర్వోత్కర్షముగా వర్ధిలుచున్నది. ఈ రత్నమునకు నా మనసెప్పుడు పెట్టెగా నుండునో.
శ్లోII పరామృతఝరీప్లుతా జయతి నిత్యమంతశ్చరీ
భువామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా
మహద్భిరపరోక్షితా సతతమేవ కాంచీపురే
మమాన్వహమహంమతిః మనసి భాతు మాహేశ్వరీ II 90 II
తే.గీ.II పర సుధా ఝరీ ప్లుతయును, వరలు జ్ఞాన
రూప, జీవులకు బయటన్ లోపలఁ గల,
యాత్మ, కంచి నొప్పుచు, మహితాత్ములకును
కంటబడు తల్లి, నాలోనఁ గలుగుగాక.
తాII పరమజ్ఞానైకరూపిణియై, పరమానందామృత ప్రవాహపరిప్లుతయై, జీవుల లోపలను వెలుపలను జరించునదై, కాంచీపురమున మహానుభావులచే దర్శింపఁబడునదై, యలరు పూర్ణాహంభావ స్వరూపిణియైన మహేశ్వరి నా మనసున దేవతగా భాసించుగాక !
శ్లోII తమోవిపినధావినం సతతమేవ కాంచీపురే
విహారరసికా పరా పరమసంవిదుర్వీరుహే
కటాక్షనిగళైర్ధృఢం హృదయదుష్టదంతావలం
చిరం నయతు మామకం త్రిపురవైరి సీమంతినీ II 91 II
తే.గీ.II ఘన తమోవిపినంబున మనగ తిరుగు
నాదు మదికరిన్ గామాక్షి! నీదు కామ
కోటి సుజ్ఞానమనియెడి రాటఁ నిలుప
నీ కటాక్షమన్ గొలుసుతో నీవె కట్టు.
తాII తమోగుణరూపమైన యడవిలో నురుకుచు పరుగులెత్తెడి నా హృదయమనెడి మదపుటేనుగును సాధనతో మళ్ళించి మచ్చికచేసి కాంచీవిహారకౌతుకముగొన్న పరమ శివుని రాణివాసము (కామాక్షి ) పరమార్థజ్ఞానరూపమైన చెట్టునకు తన కటాక్షము అనెడి గొలుసులచే నంటగట్టుగాక !
శ్లోII త్వమేవ సతి చండికా త్వమసి దేవి చాముండికా
త్వమేవ పరమాతృకా త్వమపి యోగినీరూపిణీ
త్వమేవ కిల శాంభవీ త్వమసి కామకోటీ జయా
త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే II 92 II
తే.గీ.II నీవె చండిక, కామాక్షి! నీవె విజయ,
నీవె జయవు, శంభునిసతి, నీవె యోగి
ని, భువన జనని, చాముండ, నీవె కోర్కె
లకు ముగింపువు, సకలములకును నీవె.
తాII ఓ కామాక్షీ! నీవు చండికవి. నీవు చాముండికవి. నీవు దివ్యమాతవి. నువ్వు కూడాయోగినివి. నీవు శంభుని భార్యవి. నీవు కామకోటివి, కోరికలన్నింటికి అంతం. నీవు జయవి మరియు విజయవి. మూడు లోకాలు నీలోనే ఉన్నవి. ఇంక చెప్పుట కేమున్నదమ్మా?
శ్లోII పరే జనని పార్వతి ప్రణతపాలిని ప్రాతిభ-
ప్రదాత్రి పరమేశ్వరీ త్రిజగదాశ్రితే శాశ్వతే
త్రియంబకకుటుంబినీ త్రిపదసంగిని త్రీక్షణే
త్రిశక్తిమయి వీక్షణం మయి నిధేహి కామాక్షి తే II 93 II
తే.గీ.II పరశివా! త్రిలోచని! భక్తి ప్రణత సుజన
పాలినీ! త్రిశక్తిస్వరూపా! త్రియంబ
కేశ్వర కుటుంబినీ! దృష్టి కృపను పరుచు
నాపయిన్ వర కామాక్షి! పాపదూర!
తాII పరశివా! ఓ పార్వతీ! ప్రతిభాప్రదాత్రి! ప్రణతజనపాలిని! త్రిపదసంచారిణి! త్రిలోచని! త్ర్యంబకేశ్వరునికుటుంబిని! శక్తిత్రయస్వరూపిణి! కామాక్షీ! నీ కటాక్షములను నా పైని బ్రసరింపజేయగదమ్మా.
శ్లోII మనోమధుకరోత్సవం విదధతీ మనీషాజుషాం
స్వయంప్రభవవైఖరీ విపినవీథికాలంబినీ
అహో శిశిరితా కృపామధురసేన కంపాతటే
చరాచరవిధాయినీ చలతి కాపి చిన్మంజరీ II 94 II
తే.గీ.II సజ్జన హృదయ భృంగాళి సంతసమును
పెంచు చిన్మయ మంజరి పిత్ర్యమనగ
కృపను జలువలనించుచు ప్రపగ నిలిచె
వేదవేదికపై, సృష్టి ప్రీతి నడుప.
తాII సజ్జనుల మనసులనెడి తుమ్మెడల కానందము నించు నొక చిన్మయ పుష్పమం జరి కృపామధురిమచే జలువలనించుచు బ్రహ్మనుండి ప్రవృత్తములయిన వేదములనెడి వైఖరీ రూపమైన వేదికపై నిలిచి యీ చరాచరసృష్టిక ర్తియై చరించుచున్నది.
శ్లోII కళావతి కలాభృతో ముకుటసీమ్ని లీలావతి
స్పృహావతి మహేశ్వరే భువనమోహనే భాస్వతి
ప్రభావతి రమే సదా మహితరూపశోభావతి
త్వరావతి పరే సతాం గురుకృపాంబుధారావతి II 95 II
సీII మకుటమందున శశి మానితముగఁ గల్గి, లీలలన్ గలిగిన బాలవమ్మ!
పతిని ప్రేమగ చూచు ప్రభ గల తల్లివి, సుప్రకాశపు రూప శోభకలిగి,
త్వరగల, కృపయను నిరుపమ జలధార వరలగొల్పెదవీవు నిరుపమాన,
పరమునందెప్పుడున్ నిరుపమముగ నీదు ధ్యానంబునందుండి హాయికనుదు,
తే.గీ.II కంచి కామాక్షి! ప్రోవ నీకన్ననెవరు
నాకు కలుగుదు రోయమ్మ? నయనిధాన!
వందనంబులు చేసెద నందుకొనుము,
జయము నీవని యనుటకు సాక్షి నీవె.
తాII కిరీటమున చంద్రుని గల, లీలలు గల, మహేశ్వరునియందు కోరిక గల, ప్రభ గల, ప్రకాశించు గొప్ప రూప శోభగల, త్వర గల, గొప్ప కృప యను జలధార గల పరము (అమ్మవారు) నందు ఎల్లప్పుడు రమించుచుండెదను.
శ్లోII త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే
త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే
త్వయైవ ఖరకోపయా నయనపావకే హూయతే
త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే II 96 II
తే.గీ.II జగతికంబవు నీచేత జగములొలయు,
కరుణకలిగిన నీచేత కావఁబడును
కంటిమంటచే హోమమే ఘనముగనగు,
నిత్యసత్యవౌ నీచేత నిత్యమగును.
తాII జగదంబవైన నీచే భువనము లుదయించుచున్నవి. కరుణారసార్ద్రంవైన నీచేత నవి
పాలింపబడుచున్నవి. తీవ్రకోపవైన నీచేత (వుహాకాళిచేత) నయనాగ్నిలో హోమము
చేయబడుచున్నవి. నిత్యసత్యవైన నీచేతనే యని నిత్యస్థితి నందుచున్నవి.
20 – 3 – 2024.
శ్లోII చరాచరజగన్మయీం సకలహృన్మయీం చిన్మయీం
గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం
పరాపరమయీం సదా దశదిశాం నిశాహర్మయీం
పరాం సతతసన్మయీం మనసి చిన్మయీం శీలయే (కామకోటీం భజే) II 97 II
సీII కదలని, కదులు సకలమునుండెడిదాన! అన్ని హృదయాలలోనున్నదాన!
జ్ఞానపూర్ణా! సతీ! కలుగు త్రిగుణపూర్ణ! ముల్లోకములనుండు తల్లివమ్మ,
రాత్రింబవళ్ళునున్ రాజిలు కామాక్షి!కన పరారూపవై కదలుతల్లి!
సత్తాస్వరూపమై సకలంబునందుండు సౌమ్యరూపిణివమ్మ సకల జనని!
తే.గీ.II పరమచైతన్య రూపిణీ! భక్తపాళి
కోర్కెలను తీర్చ కంచిలో కొలువు తీరి
పరమశివునకు మోదంబు నిరుపమముగ
కలుగఁజేసెడి తల్లి! నన్ గనికరించు.
తాII కదిలేవీ కదలనివన్నిటియందున్నదానా! సకలహృదయాలలో నిండినదానా! జ్ఞానముచేనిండినదానా! మూడుగుణాలలో నిండినదానా! ముల్లోకాలలో, రాత్రింబవళ్ళలో నిండియున్నదానా! పరారూపిణి! ఎల్లపుడు సత్తారూపమైనదానా! పరమచైతన్యరూపిణీ! సదానిన్ను విమర్శిస్తాను.
వి.వి. (అపరా– సరాగులచే పూజనందునది, పరాపరా-అటు పిమ్మటిదశ, పరా- విరాగులచే సేవింపబడునది.)
శ్లోII జయ జగదంబికే హరకుటుంబిని వక్త్రరుచా
జితశరదంబుజే ఘనవిడంబిని కేశరుచా
పరమవలంబనం కురు సదా పరరూపధరే
మమ గతసంవిదో జడిమడంబర తాండవినః II 98 II
తే.గీ.II లోక మాత! శివుని పత్ని! శ్రీకరమగు
కనుల కాంతితోన శరత్తు కమలములను
గెలిచితివి, పరరూపిణీ! కేలుపట్టి
జడిమ డంబరమును బాపి నడుపు నన్ను.
తాII జగదంబా! శివుని ఇల్లాలా! కన్నులకాంతితో శరత్కాల కమలకాంతిని జయించినదానా! తలకట్టుకాంతితో మేఘకాంతిని క్రిందుచేసినదానా! పరరూపధారిణీ! జ్ఞానాన్ని కోల్పోయి, అజ్ఞానపు తాండవంగలిగిన నాకు ఎల్లప్పుడు గొప్పనైన చేయూతనిమ్ము తల్లీ! (దృశ్యమాన త్రిపుటీరూప ప్రపంచసృష్టికి ఆవల యున్నది- ‘పర’రూప)
శ్లోII భువనజనని భూషాభూతచంద్రే నమస్తే
కలుషశమని కంపాతీరగేహే నమస్తే
నిఖిలనిగమవేద్యే నిత్యరూపే నమస్తే
పరశివమయి పాశచ్ఛేదహస్తే నమస్తే II 99 II
తే.గీ.II లోకమాత! చంద్రవిభూష! నీకు నతులు,
సర్వవేదసువేద్యవు, శాశ్వతవును,
పరశివమయివి, మహిత కంపాతటస్థ!
పాశవిచ్ఛేదహస్తవు, పాపనాశ!
తాII తా. లోకమాతా! చంద్రాభరణా! పాపహారిణీ! కంపాతీరగృహిణీ! సర్వవేదములచే తెలియదగినదానా! శాశ్వతరూపా! పరశివతత్త్వంతో నిండినదానా! పాశములను ఛేదించే హస్తములు కలదానా! నీకు నమస్కారము.
శ్లోII క్వణత్కాంచీ కాంచీపుర మణివిపంచీ లయఝరీ-
శిరః కంపా కంపావసతిః అనుకంపాజలనిధిః
ఘనశ్యామా శ్యామా కఠినకుచ సీమా మనసి మే
మృగాక్షీ కామాక్షీ హరనటనసాక్షీ విహరతాత్ II 100 II
సీII ధ్వనిచేయు వడ్డాణమును గలతల్లివి, నుత మృగాక్షీ నీకు నతులు, గొనుము,
కాంచీపుర మణివిపంచిలయఝరికి తలయూపి మెచ్చెడి తరళనయన!
కంపానదీతీర కమనీయ వాసము కలిగిభక్తులఁ గాచు కల్పవల్లి!
అనుకంపసంద్రమా! ఘన కుచసీమ! యౌవనమధ్య! కామాక్షి! జీవమీవె,
తే.గీ.II హరనటనసాక్షి పరికింపనమ్మ నీవు,
మేఘమును గేలు చేయు నీ మేని చాయ.
నాదు మదిలోన వసియించి నన్నుఁ గనుము,
బంధనంబులు బాపి నన్ వరలఁ గనుము.
తాII మ్రోగుచున్న మొలనూలు మణులచే ఒప్పుతూ, కాంచీపురంలోని మణుల వీణల వాద్యప్రవాహానికి మెచ్చుకోలుగా తల ఊపుదానవు, కంపానదీతీరవాసము కలిగిన దయాసముద్రానివి, మేఘమువలె నల్లనైన దానివి, శ్యామాదేవియు, కఠినమైన పాలిండ్లుకలతల్లివై, జింకకన్నులు కలదానివై, కామాక్షీ దేవివై, శివుని తాండవమునకు సాక్షివై ఉన్నతల్లీ, నా మనస్సులో విహరింతువుగాక!
శ్లోII సమరవిజయకోటీ సాధకానందధాటీ
మృదుగుణపరిపేటీ ముఖ్యకాదంబవాటీ
మునినుతపరిపాటీ మోహితాజాండకోటీ
పరమశివవధూటీ పాతు మాం కామకోటీ II 101 II
మాలని. సమర విజయ రూపా!సాధకానంద దీపా!
యమిత మృదు గుణాత్మా! ఆది కాదంబ వర్త్మా!
ప్రముద ముని శరణ్యా! బ్రహ్మకోటి ప్రగణ్యా!
ప్రమద శివుని భామా! పాహి కామాక్షి! హైమా!
తే.గీ.II సమర విజయ వానందవా సాధకులకు,
మృదుగుణపుపేటివి, కదంబ సాధువాటి!
ముని నుత పరిపాటి వజాండ మోహితవును,
వర శివ వధూటి! నన్ను కాపాడుమమ్మ!
తాII యుద్ధాలలో విజయస్వరూపమా! సాధకులకు కలిగే తీవ్రానంద స్వరూపమా! మృదువైన గుణాల మణులపేటికా! కదంబవనాలనే ముఖ్యంగా గలదానా! మునులచే స్తుతింపబడుదానా! బ్రహ్మాండకోటులను మోహింపజేయుదానా! పరమశివుని ఇల్లాలా! కామకోటినిలయా! నన్ను రక్షించుతల్లీ!
శ్లోII ఇమం పరవరప్రదం ప్రకృతిపేశలం పావనం
పరాపరచిదాకృతి ప్రకటన ప్రదీపాయితం
స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్ అంబికాం
జపైరలమలం మఖైః అధికదేహ సంశోషణైః II 102 II
తే.గీ.II పరము మోక్షమ్ము వరముగా వరలనిచ్చు,
నుత పరాపరాకృని నెన్ని క్షితిని జూపు,
స్తుతిశతకపాఠనము చేయుచో కృశింపఁ
జేయు వ్రతముల పనియేమి? శ్రీకరమిది.
తాII పరమును మోక్షమును వరముగా ప్రసాదించునది, గొప్ప చిన్న జీవుల ఆకృతులకు స్వస్వరూపమును చూపించుటలో ప్రదీపమైన ఈ స్తుతిని పఠించినచో ఎక్కువగా దేహమును పీడించు జపములతో గాని యజ్ఞములతో గాని పనిలేదు.
21 – 3 – 2024.
II స్తుతి శతకం సంపూర్ణం II
కృతికర్త.
భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో,
ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో
వ్రాసినది.)
3) ఆంధ్రసౌందర్యలహరి.
4) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో
అనేక స్వీయ రచనలు.
5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత
సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో
వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత
నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య
శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.
(బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో
మూడు శతకములు.)
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క
రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త
శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు,
సీతాన్వయముగా తేటగీతి పద్యముల
హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల
నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము
42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక.
43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.
44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.
45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)
46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.
స్వస్తి.
జైహింద్.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.