జైశ్రీరామ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతము
రచన. … చింతా రామకృష్ణారావు. 8247384165
జయమమ్మ! జయమమ్మ శ్రీ యాంధ్రమాతా!
జగతికే వెలుగైన శాంత ప్రపూతా!
జయమమ్మ జయమమ్మ శ్రీ యాంధ్రమాతా!!
1. శ్రీకాకుళాదిగా శ్రీయనంతపురంబు
వ్యాపించియున్న నీ ప్రఖ్యాత సద్వ్యాప్తి
కారుణ్య పరిపూర్తి, కమనీయ గుణదీప్తి,
కవుల కెన్నగ సాధ్యమా? … మా తల్లి!
బ్రహ్మకైనను వేద్యమా? మా తల్లి! బ్రహ్మకైనను వేద్యమా? .... జయమమ్మ! జయమమ్మ ll
2. గోదావరీ, కృష్ణ, తుంగభద్రా, పెన్న,
కిన్నెరసాని, యా కుందేరు, గోస్తనీ,
గుండ్లకమ్మా, వంశధారా సుధా సార
సౌందర్యమెన్న గలమా? … మా తల్లి
గొంతెత్తి పాడగలమా? మాతల్లి గొంతెత్తి పాడగలమా? .... జయమమ్మ! జయమమ్మ ll
3. ఆంధ్రామృతోద్భాస మమరావతీ ద్యుతుల్,
వర పోలవర దివ్య వరణీయ భాగ్యముల్
పరమ పావని నీదు ప్రఖ్యాతి గురుతులే
వివరింప సాధ్యమగునా? … నీ కన్న
పరమాత్మ వేరె యగునా? నీ కన్న పరమాత్మ వేరె యగునా? .... జయమమ్మ! జయమమ్మ ll
4. ఆదిశక్తివి నీవు, అన్నపూర్ణవు నీవు,
అవధాని వర్యుల కాటపట్టువు నీవు,
కవుల కాణాచివౌ కల్పవల్లివి నీవు,
చిత్రకవికోవిదులకున్, … మా తల్లి
క్షేత్రంబు నీవె జగతిన్, మాతల్లి క్షేత్రంబు నీవె జగతిన్, .... జయమమ్మ! జయమమ్మ ll
5. అన్నవరంబును, సింహాచలంబును,
తిరుమలగిరియును, మంగాపురంబును,
రామతీర్థంబును, శ్రీ హర్షవల్లియున్,
దేవతాప్రాంగణములే, … నీ నేల
కల్యాణ తోరణములే, నీ నేల కల్యాణ తోరణములే. .... జయమమ్మ! జయమమ్మ ll
6. మహిళావధానులు, మహనీయ సుకవులు,
వేదాంత వేద్యులు, విశ్వప్రపూజ్యులు,
శ్రామికుల్, పాలకుల్, జయమార్గ సూచకుల్
ఆంధ్రతేజము జగతిలో … మాయమ్మ
సుందరంబుగ వెలుగునే నాతల్లి! సుందరంబుగ వెలుగునే. .... జయమమ్మ! జయమమ్మ ll
7. ఆత్మాభిమానులకాలవాలము నీవు
అనితరప్రతిభులనమరియుందువు నీవు,
ఆదిశక్తివి నీవు, అమృతమూర్తివినీవు,
ఆంధ్రమాతా! బిడ్డగా … మాయమ్మ!
నన్ను నీకే పుట్టనీ! మాయమ్మ నన్ను నీకే పుట్టనీ. .... జయమమ్మ! జయమమ్మ ll
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












6 comments:
కథా(కవితా)వస్తువు వెలయడం, సమర్థుడైన కవి దొరకడం, సందర్భోచిత పదాలు స్ఫురించడం, పాటగా రూపుదిద్దుకొనడం శ్రావ్యమైన సంగీతం అమరడం
అద్భుత గాయనీ మణులు ఆలపించడం -----ఓహ్ అప్పుడు గదా ఆనందం. అదిప్పుడు దొరికింది. ఆనందించాను. గురువర్యులు
బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణా రావుగారికి వేనవేల నమస్కృతులు.
కడయింటి కృష్ణమూర్తి..గోవా.
కడయింటి కృష్ణమూర్త్యన
మడమనుత్రిప్పంగరాని మహనీయుండే,
వడివడి రామాయణమును
కడుముదమున వ్రాయఁ జేసె కవివర్యులచే.
అజ్ఞాత ఇలా అన్నారు.
గురువు గారు, భరతమాత వైభవ దండకం అద్భుతం. అది శ్యామలాదండక స్వరభరితంగా చదవ మనమ్మునకానందమ్ము గల్గెన్. ధన్యుడినైతిని గురువర్యా.
చాలా బాగా రాసావు అన్నయ్యా. శ్రీమతి సరస్వతి గారు బాగా గానం చేశారు.
బాగా వ్రాశారు అభినందనలు
సంస్కృతాంధ్ర కవిపండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీశ్రీశ్రీ చింతారామకృష్ణారావుగారిచేరచింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం యావద్రాష్ట్రభౌగోళికాంశములను సుస్పష్టపరుస్తున్నది.ఇచటి సుజలాలను,సుఫలాలను,ప్రసిద్ధపుణ్యక్షేత్రాలను, ప్రాజక్టులను పాటలో ఇమిడ్చి వర్ణించినవిధానం అద్భుతం. వీరి కలానికి శ్రీమతి వల్లూరి సత్యవతిగారి గళం తోడై లలితసంగీతఛాయలతో శ్రోతలను మంత్రముగ్థులను చేస్తున్నది.గాయని శ్రీమతి సత్యవతి గారికి అభినందనలు. శ్రీరామకృష్ణకవిగారికి నమస్సులు. భవిష్యత్తులో ఈ గీతం పాఠ్యపుస్తకాలలో ప్రచురణకు నోచుకోగలదని విశ్వసిద్దాం.
డా. సత్యయాజ్జ వల్క్య శర్మ.లింగాల
రి. గజిటెడ్ ప్థానోపాధ్యాయుడు.
పాయకరావుపేట.
అనకాపల్లి జిల్లా (ఆం. ప్ర)
9247168255
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.