గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

4. కటాక్ష శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) ఆంధ్ర పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.

 

జైశ్రీరామ్.

ఓం శ్రీ కామాక్ష్యై నమః

4. కటాక్ష శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) 

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.


1. శ్లోII  మోహాన్ధకారనివహం వినిహన్తు మీడే

మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్‌ 

          శ్రీ కాంచిదేశ శిశిరీకృతి జాగరూకా 

          నేకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్‌.

శాII   శ్రీమన్మంగళ కంచికిన్ జలువ వాసిన్ గొల్పు శ్రద్ధాళువున్,

           బ్రేమన్ మూకకు సత్కవిత్వఝరినే వ్రేలార్చు నేకామ్రనా

           థామోద ప్రియ భామినీ వినుత స్నేహాలోకనం బెంచి నే 

           నా మోహాంధసమూహమున్ దఱుమగా నర్ధిన్ మదిన్ గొల్చెదన్.

తాII  శ్రీ కాంచీనగర ప్రాంతమును చల్లఁబఱచుట యందు శ్రద్ధ కలిగినట్టి, మూగవోయిన మనస్సు కలవారికిని మహాకవిత్వము నొసగునట్టివి అయిన ఏకామ్రనాథ తరుణి అయిన శ్రీ కామాక్షీ కరుణావలోకములను నా మోహాంధకార రాశిని దొలగించ స్తుతించెదను.

2. శ్లోII  మాతర్జయన్తి మమతాగ్రహ మోక్షణాని - మాహేంద్రనీల రుచి శిక్షణ దక్షిణాని

           కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని -  త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని.  

మII   మమకారంబను దయ్యమున్ దరుము సామర్థ్య ప్రభా పూర్ణమై,

           సమమై నిల్వఁగ నెంచు నీలమణి ద్యుత్ సమ్మర్ధ యోగ్యంబునై,

           ప్రముదంబున్ వెలయించినట్టి జగతిన్ రక్షింపగా నొప్పు నీ 

           మమతన్ గోర్కెలఁ దీర్చు చూపులవి కామాక్షీ! శుభారామముల్.

తాII  ఓ తల్లీ! కామాక్షీ! నీ చూపులు, నన్ను లేక అందఱను పట్టిన మమకారమనెడి దయ్యమునుండి విడిపించగల్గునవి. ఇంద్రనీల మణుల కాంతిని శిక్షించుటలో, ముల్లోకములకు రక్షణమును కల్పించుటలో, వరములిచ్చుటలో, సమర్థములైనవి.

3. శ్లోII  ఆనంగ తంత్ర విధి దర్శిత కౌశలానా - మానందమంద పరిఘూర్ణిత మన్థరాణామ్‌ 

           తారల్య మంబ తవతాడిత కర్ణసీమ్నాం -  కామాక్షి! ఖేలతి కటాక్ష నిరీక్షణానామ్.

చంII  మదనుని తంత్రపద్ధతి సమంచిత రీతిని చూపునట్టి, స

          మ్ముదమట సంభమించుటను, పూర్తిగ తగ్గిన వేగమొప్పి, కా

          మ్యద! భవదీయకర్ణముల నంచితరీతిని చేరియున్న నీ 

          సదయనునొప్పు చూపులను చంచలమాడుచు నుండె శాంభవీ!

తాII  అమ్మా! నీ చూపులు మన్మథ తంత్ర విధానమును ప్రదర్శించినవి. వానిలో ఆనందము మెల్లగా సుడి తిరుగుటచే కదలికలలో వేగము కోల్పోయినవి. అవి కర్ణాంతము వ్యాపించినవి. అట్టి నీచూపులలో చాంచల్యము ఆడుకొను చున్నది. 

4. శ్లోII  కల్లోలితేన కరుణారస వేల్లితేన - కల్మాషితేన కమనీయ మృదుస్మితేన 

           మా మంచితేన తవ కించన కుంచితేన - కామాక్షి! తేన శిశిరీకురు వీక్షితేన. 

తే.గీ.II కరుణనుప్పొంగుచున్న నీ కనులఁ జూడ,

            సాంజనోద్భాస సన్నుత సరసిజములు,

            వాలుకన్నుల కామాక్షి! వరలఁ జేయ

            నన్ను, నీకంటఁ జూడుమా, నయనిధాన!

తాII  అమ్మా! నీ శరీరమొక కరుణాసముద్రము. కన్ను అందలి తరంగమువలె నున్నది. అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి యున్నది. అదిచూచువారికి పూజింప దగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును. దానికి కాటుక దిద్దబడియున్నది. అట్టి నీ కంటి చూపుతో సంసారతాపతప్తుఁడనైన నన్ను చల్లబఱపుము. 

5. శ్లోII  సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య - మందస్మితస్య పరితోషిత భీమ చేతాః. 

              కామాక్షి! పాండవచమూ రివ తావకీన - కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః. 

మత్తII    మాటిమాటికి నొప్పు తెల్లని మందహాసము చేరుచున్

              జూటధారికిఁ బ్రీతిఁ గొల్పెడి చూడ్కులయ్యవి యద్దిరా!

              కోటికాంతులు నీదు చూపులు కోరి కర్ణసమీపమున్

              దాటి పాండవ సేనఁబోలుచు తాము చేరె మహోద్ధతిన్.

తాII  ఈ శ్లోకమున అమ్మవారి కాంతి పాండవసేనతో పోల్చబడినది. అమ్మవారి కడగంటి కాంతి మాటిమాటికి తెల్లని చిరునవ్వునకు సహాయముగా వెళ్ళుచున్నది. ఎట్లు? పాండవసేన అర్జునునకు సహాయముగా వెళ్ళినట్లు. అమ్మవారి కడగంటి కాంతి శివుని చిత్తమును సంతోషపరచు చున్నది. ఎట్లు? పాండవసేన భీముని చిత్తమును సంతోషపఱచినట్లు. పాండవసేన కర్ణుని దగ్గఱకు వెళ్ళినట్లు అమ్మవారి కడగంటి కాంతి చెవిసమీపమునకు కదలుచున్నది. అమ్మవారి కటాక్షములు చిరునవ్వు చిందించునవి. కర్ణాంతమును చేరునంత విశాలములైనట్టివి. 

6. శ్లోII  అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్య- మానన్థచంద్రమస మానయతాం ప్రకాశమ్‌ 

           కాలాంధకారసుషమాం కలయ న్దిగన్తే - కామాక్షి! కోమలకటాక్ష నిశాగమ స్తే. 

శాII    అమ్మా! నీదు కటాక్షమన్ నిశ దిశల్ వ్యాపించి, గాఢాంధమున్

           నెమ్మిన్ గొల్పుచు, నాదు తాపఖచరున్ వెన్వెంటనే బాపుచున్,

           సమ్మాన్యంబుగ సంతసమ్మనెడి  సచ్చంద్రప్రకాశమ్మునే

           క్రమ్మంజేయుము, నాదు మానసమునం గామాక్షి! నిన్ గొల్చెదన్.

తాII  అమ్మవారి కటాక్షమనెడి రాత్రి యొక్క రాక దిగంతమున చీకట్లను వ్యాపింపజేయుచున్నది. అది పరితాపమనెడి సూర్యకాంతిని వెంటనే అస్తమింప జేయుగాక! అది నాలో ఆనంద చంద్రప్రకాశమును నింపుగాక! రాత్రిరాకతో దిక్కులచివఱలలో చీకట్లు గ్రమ్ముకొనును. సూర్యుడస్తమించును. ప్రకాశము విస్తరించును. కటాక్షా గమముతో పరితాపము నశించును. ఆనందము వెల్లివిరియును. కన్నులలోని నల్లదనము దిగన్తముల విస్తరించును. 

7. శ్లోII  తాటంక మౌక్తిక రుచాంకుర దన్తకాన్తిః – కారుణ్య హస్తిప శిఖామణినాధిరూఢః 

            ఉన్మూలయ త్వశుభపాదప మస్మదీయం - కామాక్షి! తావక కటాక్షమతంగజేన్ద్రః. 

తే.గీ.II కమ్మలనుగల ముత్యపు కాంతి యనెడి 

            దంత కాంతులనొప్పెడి దయ యనఁబడు 

            హస్తిపారూఢ దృగ్గజేంద్రాకృతమ్ము

            మా యమంగళవృక్షమున్ మడపుఁ గాక.

తాII  ఓ కామాక్షీదేవీ! నీ కర్ణభూషణములలోని ముత్యముల కాంతులు దన్తకాంతులుగా కనిపించుచున్నవి. (ఏనుగునకు దంతియను పేరు దన్తముల వలననే వచ్చును) నీ కటాక్షమే ఏనుగు. దానిపై కారుణ్యమను మావటివాడు ఎక్కి యున్నాడు. ఏనుగులకు వృక్షమును పెకిలించుట అలవాటైన సులభమయినపని. కమ్మలలోని ముత్యముల యొక్క కాంతి మొలకలనెడి దంతకాతులు గల కారుణ్య హస్తిపారూఢమైన నీ కటాక్ష గజేంద్రము మాయొక్క అమంగళ వృక్షమును సమూలముగా పెకలించి వేయుగాక. 

8. శ్లోII  ఛాయా భరేణ జగతాం పరితాప హారీ - తాటంక రత్న మణితల్లజ పల్లవశ్రీః 

            కారుణ్యనామ వికిరన్మకరంద జాలం -  కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే. 

తే.గీ.II దట్టమైనట్టి నీడచేఁ దలరుచుండి, 

            లోక పరితాపమును బాపు లోలకులను

            కలుగు మణిచిగురాకులు కలిగినట్టి

            కల్పకంబను నీ కడగంటి చూపు

            దయను వెదజల్లి వెలిగెడున్, నయనిధాన!

తాII  ఓ కామాక్షీదేవీ! తన చల్లని నీడతో జగముల పరితాపమపహరించునట్టి కమ్మలలో పొదగబడిన శ్రేష్ఠ రత్నమణులే ఎఱ్ఱని చిగురుటాకులై ప్రకాశించుచుండగా దయయను మకరందరసపు వెల్లువను వెదజల్లుచు నీ కటాక్ష కల్పతరువు రాజిల్లు చున్నది. 

9. శ్లోII  సూర్యాశ్రయ ప్రణయినీ మణికుండలాంశు - లౌహిత్య కోకనద కానన మాననీయా 

           యాంతీ తవ స్మర హరానన కాన్తిసింధుమ్ - కామాక్షి! రాజతి కటాక్ష కలిన్దకన్యా .

తే.గీ.II అక్షయంబగు యమున కటాక్షమరయ,

            మహిత సూర్యాశ్రయహితయు, మణుల కర్ణ

            కుండలారుణోత్పలవనకోటిఁ బాఱు,

            శివుని ముఖకాంతిసంద్రమున్ జేరు నమ్మ.

 తాII  ఓ కామాక్షీ దేవీ! నీ కటాక్షము యమునానదియే. యమునానది తన ఆవిర్భావహేతువైన సూర్యుని ఆశ్రయమునందు ప్రేమ కలది. నీ కటాక్షము సూరిజనుల ఆశ్రయించుట యందు బ్రేమకలది. యమునానది ఎఱ్ఱ కలువల వనముల నుండి ప్రవహించును. నీ కటాక్షము మణికుండల కాంతుల నుండి పెల్లుబికి వచ్చును. యమునానది సముద్రమును చేరును నీ కటాక్షము శివముఖ కాంతినిజేరును. అందుచేత నీ కటాక్షము యమునానదియే.

10. శ్లోII  ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతాత్ - కామాక్షి! వీక్షణ విలాస కలాపురంధ్రీ 

            సద్య స్తమేవ కిల ముక్తి వధూ ర్వృణీతే-తస్మా న్నితాన్త మనయో రిద మైకమత్యమ్. 

ఉII       నీ కనుచూపులన్ గలుగు నిర్భర దివ్యకళాలలామ తా

            లోకమునందు నేరిని విలోకన జేయునొ పక్షపాతయై,

            శ్రీకర ముక్తికాంతయు వరించును వారినె, నీ కటాక్షమే

            సోకిన  ముక్తి సత్ఫలము శోభిలఁ గల్గు, నిజంబు శాంభవీ!

తాII  ఓ కామాక్షీదేవీ! నీ చూపుల కదలికలలోని కళయనెడి యొకసతి పక్షపాతము చూపి ఎవనిని చేరుకొనునో ఆతనినే ముక్తి వధువు వెంటనే స్యయముగా వరించును. అందువలన వీక్షణ విలాస పురంధ్రికి ముక్తి వధువునకైకమత్యము కనబడుచున్నది. ఎన్ని జన్మల పున్నెమున్ననో అమ్మవారి కటాక్షము కల్గును. కటాక్షమా పుణ్యాత్మునిపై పడెనో లేదో అప్పుడే అతనికి ముక్తి లభించును.


11. శ్లోII  యాన్తీ సదైవ మరుతా మనుకూలభావమ్‌ - భ్రూ వల్లి శక్రధను రుల్లసితా రసార్ద్రా

              కామాక్షి! కౌతుక తరంగిత నీలకంఠా - కాదంబినీవ తవ భాతి కటాక్షమాలా. 

తే.గీ.II   దేవతల కనుకూలమై తేజరిల్లు

              నీ కటాక్షమాలేంద్రచాపాకరమ్మె,

              నిత్య శృంగార రసముచే నియతిఁ దడిసి,

              కౌతుకమునొప్పు శివునొంది భాతి గాంచె.

తాII  అమ్మా కామాక్షీ! నీ యొక్క కడగంటి చూపులవరుస ఎల్లప్పుడును దేవతలకే ఆనుకూల్యమును పొందుచున్నదయి, కనుబొమలనెడి యింద్రధనువుచే ప్రకాశించినదై శృంగార రసముచే తడిసినదై, కుతూహలముప్పొంగిన శివుఁవుడు కలదై, మేఘమాలవలె ప్రకాశించుచున్నది.

12. శ్లోII  గంగామ్భసి స్మితమయే తపనాత్మజేవ -  గంగాధరోరసి నవోత్పల మాలికేవ 

           వక్త్రప్రభాసరసి శైవల మండలీవ - కామాక్షి! రాజతి కటాక్ష రుచిచ్చటా తే. 

ఉII      నీ కడగంటి చూపు గణనీయపు కాంతి ప్రసారమెన్నగా

           శ్రీకరమందహాసమను చెల్వగు గంగను సూర్యపుత్రినాన్

           శ్రీకరకంఠు రొమ్మున వసించు నవోత్పలహారమట్టులన్

           శ్రీకరమౌముఖాంభసిని చెల్గెడు శైవలమట్లు వెల్గెడున్.

తాII  అమ్మవారి కటాక్ష రుచి చ్చట చిరునవ్వు అనెడి ఆ గంగ యందు యమున వలె, తెల్లనైన శివుని యురమున అప్పుడే పూచిన నల్లకల్వల మాల వలె ముఖ కాంతి సరస్సునందు నాచు వలె ప్రకాశించుచున్నది. 

13. శ్లోII  సంస్కారతః కిమపి కన్దలితా న్రసజ్ఞ - కేదా రసీమ్ని సుధియా ముపభోగయోగ్యాన్‌ 

             కల్యాణ సూక్తిలహరీ కలమాంకురా న్నః  - కామాక్షి! కన్దలయతు త్వదపాంగమేఘః. 

తే.గీ.II నీదగు కటాక్షమేఘముల్ శ్రీద! నా సు

             ధల రసజ్ఞతన్ నాల్కకేదారమునను

             భావనన్ జిత్రముగ మొల్చు భవ్యభోగ్య

             సూక్తిఝరి వరిన్ మొలిపించు చూచి మరల.

తాII  అమ్మా! సంస్కారము వలన రసజ్ఞకేదారముల యందు మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన మా వాక్కులనెడి వరి మొలకలను నీ కడగంటి చూపనెడి మేఘము మొలకెత్తించు గాక! లేక, అమ్మా! నా నాలుకయనెడి పొలము నందు సంస్కారము వలన మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన శోభ వాక్కలమాంకురము లనే కటాక్షమేఘము మరల మొలకెత్తించుగాక. 

14. శ్లోII  చాంచల్యమేవ నియతం కలయన్‌ ప్రకృత్యా-మాలిన్య భూశ్శ్రుతి పథాక్రమ జాగరూకః 

            కైవల్యమేవ కిము కల్పయతే నతానాం -  కామాక్షి! చిత్రమపి తే కరుణా కటాక్షః. 

తే.గీ.II కరుణనొప్పెడి జనని! నీ కంటిచూపు

            కలితమాలిన్య, విడువదు కదలికలను,

            శ్రుతిపథాక్రమవర్తి, నిన్ జూచి కొలువ

            వినుతకైవల్యమిచ్చును, వింతకాదె?

తాII  కామాక్షి దేవి దయగలచూపు చాంచల్యమును విడువదు. కాటుకను (మాలిన్యమును) ధరించును. చెవిచేరు మార్గమును (వేదమార్గమును) అతి క్రమించినది. ఐనను నమస్కరించు వారికి జీవేశ్వ రైక్య రూపకైవల్యమునే ఇచ్చుట వింతచిత్రము. 

15. శ్లోII  సంజీవనే జనని చూతశిలీముఖస్య - సమ్మోహనే శనికిశోరక శేఖరస్య 

            సంస్తమ్భనే చ మమతాగ్రహచేష్టితస్య - కామాక్షి! వీక్షణ కలా పరమౌషధం తే. 

ఉII       నీదగు దృష్టిపాతము గణింపగ లేశమెయైనగాని, యో

            శ్రీద! మరున్ సజీవునిగఁ జేయును, మారునివైరి కెన్నుచున్

            మోదముతోడ మోహమును బుట్టగఁ జేయు, మమత్వమన్ గ్రహ

            మ్మౌదలఁ జేయు దౌష్ట్యముల నంతము చేయును శాంభవీసతీ!

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! నీదృష్టిపాతము లేశమైనను మన్మథుని సంజీవింప జేయును. శివుని సమ్మోహింప జేయును. మమతాగ్రహము యొక్క వికృత చేష్టలను స్తంభింప జేయును. 

16. శ్లోII  కామద్రుహో హృదయ యన్త్రణ జాగరూకా - కామాక్షి! చంచలదృగంచల మేఖలా తే 

             ఆశ్చర్యమమ్బ! భజతాం ఝటితి స్వకీయ-సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్. 

తే.గీ.II  శివుని హృదయమున్ బంధింపఁ జేయఁ గల్గు 

             నీదు కడగంటిచూపులు నేర్పుమీర

             భక్తి సంబంధులగువారి బంధనములు

             త్రుంచి వేయునో కామాక్షి! ప్రోవనెంచి.

తాII  అమ్మా! ఓ కామాక్షి దేవీ! చంచలములైనను నీ చూపులు శివుని హృదయమును బంధించి వేయుటకు సమర్థములు కాని భక్తుల బంధనములన్నింటిని సంబంధ మాత్రము చేతనే ఛేదించి వేయ గలవనుట ఎంత విచిత్రము! 

17. శ్లోII  నీలోఽపి రాగమధికం జనయన్పురారేః,

             లోలోఽపి భక్తి మధికాం ద్రఢయ న్నరాణామ్‌ 

             వక్రోఽపి దేవి నమతాం సమతాం వితన్వన్‌ 

             కామాక్షి! నృత్యతు మయి త్వదపాంగ పాతః.

శాII      అమ్మా! నీ కడగంటి చూపు నలుపే యైనన్ భవున్ రాగిగా,

             నెమ్మిన్ జేయును, భక్తి నిల్పుఁ బ్రజలన్ నిత్యంబు స్ఫారంబెయై, 

             క్రమ్మం జేయు సమత్వభావమును వక్రంబయ్యు నీమూడిటిన్

             సమ్మానంబుగ నిమ్ము నాకునుమహేశానీ! కృపాంభోనిధీ!

తాII  అమ్మా! నీ క్రీగంటి ప్రసారము నల్లనిదయ్యును శివునకు రాగమును (ఎఱ్ఱదనమును) కలిగించు చున్నది. అది చంచలమయ్యును మనుష్యులలో నధికముగా భక్తిని దృఢీకరింప చేయుచున్నది. మరియునది వంకఱయైనను నమస్కరించు వారలలో సమభావమును విస్తరింపజేయుచున్నది. అది నా యందు రాగమును కలిగించి భక్తిని దృఢమొనరించి సమభావమును విస్తరింప జేయుగాక. 

18. శ్లోII  కుంఠీకరోతు విపదమ్మమ కుంచిత భ్రూ-చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః 

             రక్షో పకార మనిశం జనయన్‌ జగత్యాం-కామాక్షి! రామ ఇవతే కరుణాకటాక్షః .

తే.గీ.II సునత భ్రూకుటి రామాస్త్రమును కలుగుచు

           శ్రిత విదేహ భవానురాగతతిఁ గలిగి

           క్షితిని పాలించు సతి! దయాన్వితపు చూపు

           నీది, యాపదల్ పాపి నన్నాదుకొనుత.

తాII  వంచిన భ్రూకుటియనెడి (రామాస్త్రముతో)విల్లుతోనొప్పునది, ఆశ్రయింపబడిన విదేహ భవానురాగము కలది, అగు భూమిని యెల్లప్పుడు రక్షించుటయనునీయొక్క దయగల చూపు రామునివలె నాయొక్క ఆపదను నశింపజేయుగాక.

19. శ్లోII  శ్రీ కామకోటి శివలోచన శోషితస్య - శృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే 

             ప్రేమామ్భసార్ద్ర మచిరాత్ప్రచు రేణ శంకే - కేదార మంబ తవ కేవల దృష్టిపాతమ్‌. 

శాII       కామాక్షీ! శివలోచనప్రభలచే కాముండు శుష్కించ నా

              కాముండున్ మొలకెత్తగా తగినటుల్ కంజాక్షి! నీ కంటి చూ

              పే మాన్యంబగునట్టి ప్రేమఁ గురిసెన్, విఖ్యాతమౌ నీదు స

              త్ప్రేమార్ద్రంబగుదృష్టిపాతపొలమున్ బ్రీతిన్ మదిన్ గాంచెదన్.

తాII  శ్రీ కామకోటి పీఠాధిష్టాత్రివైన యో తల్లీ! శివుని కంటి వేడిచే నెండింపబడిన శృంగార బీజరాశి (మన్మథుడు) తిరిగి మొలకెత్తుటకు అత్యంత ప్రేమార్ద్రమైన యేకైక దృష్టి పాతమే పొలమయినదని యెంచు చున్నాను. 

20. శ్లోII  మాహాత్మ్య శేవధిరసౌ తవ దుర్విలంఘ్య - సంసార వింధ్యగిరి కుంఠన కేలి చుంచుః 

             ధైర్యాంబుధిం పశుపతే శ్చులుకీ కరోతి. - కామాక్షి! వీక్షణ విజృంభణ కుంభజన్మా.

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ వీక్షణమ్మనియెడి

             జృంభణాగస్త్యుఁడీభవాశ్లిష్టచిత్ర

             వింధ్యగిరి దాటి వచ్చి యావేల్పు శివుని

             ధైర్య సంద్రమున్ జేఁబట్టి త్రాగెనమ్మ!

తాII  అమ్మా! కామాక్షీ! నీ వీక్షణ విజృంభణాగస్త్యుడు సంసారమనెడి వింధ్యగిరిని దాటి వచ్చి, శివుని ధైర్యమను సముద్రమును బుడిసిట బట్టుచున్నాడు.


21. శ్లోII  పీయూష వర్ష శిశిరా స్పుటదుత్పలశ్రీ, - మైత్రీ నిసర్గ మధురా కృతతారకాప్తిః 

             కామాక్షి! సంశ్రితవతీ వపురష్టమూర్తేః - జ్యోత్స్నాయతే భగవతి త్వదపాంగమాలా. 

తే.గీ.II శ్రీద! పీయూష వర్షశిశిరము నొప్పి,

            కలువ కాంతితో సన్మైత్రి కలిగియుండి, 

            సహజ మధురమై, తారకామహతినొప్పి,

             శివుని యాశ్రయమంది భాసిల్లుచుండె

             కలికి కామాక్షి! నీ కడగంటి చూపు.

తాII  అమ్మవారి కడగంటి చూపుల వరుస అమృతమును వర్షించుచు చల్లగా నుండును, వికసించుచున్న కలువల కాంతి కలిగి యుండును, సహజ మధురముగా నుండును. వెన్నెలయు పై లక్షణములు కలిగి యుండును. అమ్మవారి కడగంటి చూపుల వరుస కనుపాపలతో కూడి యుండును. వెన్నెల నక్షత్రములతో కూడి యుండును. రెండును తారకాప్తి కలవియే కావున అమ్మవారి కడగంటి చూపుల వరుస వెన్నెల వలె నాచరించు చున్నది. 

22. శ్లోII  అమ్బ! స్మరప్రతిభటస్య వపు ర్మనోజ్ఞమ్-అమ్భోజ కానన మివాంచిత కంటకాభమ్

             భృంగీవ చుంబతి సదైవ సపక్షపాతా-కామాక్షి! కోమలరుచి స్త్వదపాంగమాలా.  

శాII       కామాక్షీ! సుకుమార కోమల మహద్గణ్యంపు నీ దృష్టియన్

             ప్రేమోదంచిత భృంగి ముద్దిడెకదా, విఖ్యాతమౌ పుల్కలన్

             శ్రీమంతంబగు నంబుజాత వనమన్ శ్రీకంఠు దేహంబునే

             లేమా యీశ్వరు పక్షపాతి! కనగా లేవా ననున్? గావవా?

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! నీ కడగంటి చూపుల వరుస భక్తుల యందు బక్షపాతము కలది. దాని కాంతి కోమలమైనది. మృదువైన కమల వనము వంటి శివుని యందమైన శరీరము నాడుతుమ్మెద వలె నెడతెగక స్పృశించు చున్నది. ఆరోమాంచము కమల వనము నందలి కంటకముల (ముండ్ల) కాంతిగలదై యున్నది. 

23. శ్లోII  కేశ ప్రభాపటల నీల వితాన జాలే - కామాక్షి! కుండల మణిచ్భవిదీపశోభే 

            శంకే కటాక్షరుచిరంగతలే కృపాఖ్యా - శైలూషికా నటతి శంకరవల్లభే తే.

శాII       కామాక్షీ శివవల్లభా! నలుపుగా కన్పించు నీ కేశమన్ 

             శ్రీమంతంబగు పందిటన్ చెవుల రాజీవంపుభూషన్ లస

             చ్ఛ్రీమాణిక్యపు కాంతియందునను నీ శ్రీమత్కటాక్షోజ్వల

             చ్ఛ్రీమద్వేదిని సత్కృపాఖ్య నటనం జేయున్ గదా నట్టువై.  

తాII  శివపియవైన యో కామాక్షీ! నీ కటాక్ష కాంతి యే యొకరంగ స్థలము. దానికి పైన కేశ ప్రభ పందిరిగా నుండగా కుండలమణులకాంతి దాని యందు దీపముల వెలిగించినది. ఆ రంగస్థలమున నీ దయ యను నటి నటించు చున్నట్లున్నది. అనగా నీ కన్నులలో దయ దోబూచులాడుచున్నది. 

24. శ్లోII  అత్యన్త శీతల మతన్ద్రయతు క్షణార్థ - మస్తోక విభ్రమ మనంగ విలాసకన్దమ్‌ 

             అల్పస్మితాదృత మవారకృపా ప్రవాహమ్ - అక్షి ప్రరోహ మచిరా న్మయి కామకోటి.

శాII        అమ్మా! మిక్కిలి చల్లనై, కదలు, మోహభ్రాంతులన్ బాపుచున్

              నెమ్మిన్ మన్మథు సద్విలాసభువియై స్నేహప్రభన్ నవ్వునన్

              సమ్మోదమ్మును గల్గి పూర్ణముగ దీక్షన్ బారు నీదౌ కృపా

              సమ్మాన్యంబగు కంటి చూపు నను ధ్యాసన్ బొందఁగాఁ జేయుమా!

తాII  మిక్కిలి చల్లని, వేగముగా కదలు, మన్మథ విలాసముల జన్మ భూమియైన, చిఱునవ్వు చిందించు, అపారముగా ప్రవహించు కృపగల నీ చూపును అరక్షణము నా యందు వెంటనే జాగృత మొనర్చుము తల్లీ! 

25. శ్లోII  మన్దాక్షరాగ తరలీకృతి పారత౦త్ర్యా - త్కామాక్షి ! మన్ధరతరాం త్వదపాంగదోలామ్‌

             ఆరుహ్య మన్ద మతికౌతుక శాలి చక్షు - రానన్ద మేత ముహురర్ధ శశాంక మౌలేః.

తే.గీ.II  వరలు సిగ్గుచే, ప్రేమచే వశము తప్పి, 

             కదలికను మందగించ నీ కంటి చూపు

             టూయలన్ మెల్లగానెక్కి, యూగుచున్న

             శివునికన్నులానందమున్ జిందెనమ్మ.

తాII  సిగ్గొకవైపు, ప్రేమ యొకవైపు లాగు చుండగా వివశమై కదలికతో వేగము తగ్గిన నీ యొక్క క్రీగన్ననెడి ఊయలను మెల్లిగా నెక్కి మిక్కిలి కుతూహలము కల శివుని యొక్క కన్ను ఆనందము నొందు చున్నది. 

26. శ్లోII  త్రైయంబకం త్రిపురసున్దరి హర్మ్యభూమి - రంగం విహార సరసీ కరుణా ప్రవాహః 

దాసశ్చ వాసవ ముఖాః పరిపాలనీయం - కామాక్షి విశ్వమపి వీక్షణ భూ భృత స్తే. 

ఉII  నీ కనుచూపు రాజునకు నీపతి దేహమె నిల్చు చోటు, య

       స్తోక దయాప్రవాహమది సుందరమైన జలాశయంబగున్,

       నాకవిభుండు, దేవతలనారత సేవకపాళి, శాంభవీ!

       లోకమె యేలఁ తగ్గది, విలోకనఁ జేయఁ ద్రిలోక సుందరీ!

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ యొక్క చూపనెడి రాజునకు, శివ శరీరం నివాసస్థానము. దయాప్రవాహమే విహరించు సరస్సు, ఇంద్రాదులు సేవకులు, ప్రపంచమే పరిపాలింపదగినది.

27. శ్లోII  వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః - భ్రూవల్లరీ వశకరీ భువనాని గేహమ్‌ 

             రూపం త్రిలోకనయనామృత మమ్బ తేషాం - కామాక్షి! యేషు తవ వీక్షణ పారతన్త్రీ.

ఉII        నీ చూపెవ్వరిపైన నిల్చునొ శుభానీకంబులే వారికిన్,

             శ్రీచక్రాంకిత! వాణి నిల్చును సదా చేపట్టి తా తోడుగా,

              కాచున్ లక్ష్మి చరించి చెప్పినటులన్, కల్గించు సౌందర్యమున్,

              భూచక్రంబె నివాస దేశమగు, తత్ పుణ్యాత్మకుల్ ధన్యులౌన్.

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! నీ చూపెవరి యందు వివశమై పడునో వారికి వాగీశ్వరి సహచరిగా, లక్ష్మి కనుసైగ ననుసరించి సేవ చేయునదిగా, భువనములే ఇల్లుగా, రూపము త్రిలోకనయనామృతముగా మారిపోవును. 

28. శ్లోII మాహేశ్వరం ఝటితి మానసమీనమమ్బ!-కామాక్షి ధైర్యజలధౌ సుతరాం నిమగ్నమ్‌ 

             జాలేన శృంఖల యతి త్వదపాంగ నామ్నా - విస్తారితేన విషమాయుధ దాశకోఽసౌ. 

తే.గీ.II త్ర్యక్షు మనసను మత్స్యము ధైర్యమనెడి

            సంద్రమున మగ్నమై యుండ సరసమయిన

            నీదు కంటి చూపను వల మోదమలర

            వేసి బంధించెనమ్మ! నీ దాస మరుడు.

తాII  అమ్మా కామాక్షీ దేవీ! శివుని మనస్సను చేప ధైర్యమను సముద్రమంద మగ్నమై యుండ దానిని నీ కడగంటి చూపనెడి వలపరచి నీ దాసుడైన మన్మథుడు బంధించు చున్నాడు. 

29. శ్లోII  ఉన్మధ్య బోధ కమాలాకర మమ్బ! జాడ్య - మ్భే రమం మమ మనోవిపినే భ్రమన్తమ్‌ 

             కుంఠీ కురుష్వ తరసా కుటిలాగ్ర సీమ్నా - కామాక్షి! తావక కటాక్ష మహాంకుశేన. 

తే.గీ.II   మొనను కలిగిన నీ చూపు ములికితోడ

             జ్ఞానమను నాదు సరసును కలఁచివైచి,

             మనసనెడి నాదు వనమున మసలుచున్న

             జాఢ్యమనునేన్గు నణచుమా శ్యామలాంబ!

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! వక్రమైన మొనగల నీ కటాక్షమనునంకుశముతో నా జ్ఞాన సరస్సును కలచివైచి నామనస్సను వనమున భ్రమించుచున్న నా జాడ్యమను నేనుగును అణచి వేయుము. 

30. శ్లోII  ఉద్వేల్లిత స్తబకితైర్లలితై ర్విలాసై - రుత్థాయ దేవి తవ గాఢ కటాక్షకుంజాత్‌ 

           దూరమ్‌ పలాయ యతు మోహమృగీకులమ్మే- కామాక్షి! సత్వర మనుగ్రహ కేసరీన్ద్రః. 

తే.గీ.II పైకిప్రాఁకి గుత్తులుకట్టి శ్రీకరాంబ!

           లలితమగు నీ కటాక్షమై వెలయు పొదను

           వీడి దయయను మృగరాజు వేగముగను

           మోహమృగములన్ నానుండి పోవఁ గనుత.

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ కటాక్ష మొక పొదరిల్లు. దానిలో దయయను మృగ చక్రవర్తి యున్నది. తద్విలాసములు ఉద్వేల్లితస్తబకిత లలితములై యున్నవి. ఆ పొదరింటి నుండి యా సింహము త్వరగా లేవవలెను. నా మోహ మనెడి లేళ్ళ గుంపును దూరముగా బారద్రోలవలెను. 


31. శ్లోII  స్నేహార్ద్రితాం విదలితోత్పలకాన్తి చోరాం - జేతారమేవ జగదీశ్వరి జేతుకామః 

            మానోద్ధతో మకరకేతురసౌ ధునీతే - కామాక్షి తావకకటాక్షకృపాణవల్లీమ్.

శాII       స్నేహార్ద్రంబయి, కల్వకాంతిఁ గొను నీ శ్రీమంత దృక్ ఖడ్గమున్

             తా హస్తంబున బూని మన్మథుఁడు మోదంబొప్ప జళ్పించె స

             మ్మోహంబున్ గొలుపంగ నేశివునిచే ముందట్లు తా నోడె నా

             స్నేహోదంచిత మూర్తిపై, జనని! భాసించంగ కామేశ్వరీ!

తే.గీ.II మహిత కామాక్షి! జయగర్వమహిత శివుని

             చేతనోడింపఁబడియు తా చేతఁబట్ట

             కలువకాంతిని దోచు నీకంటిచూపు

             ఖడ్గమును శివు నెదిరింపకదలె మరుఁడు.

తాII  అమ్మా కామాక్షీ! అభిమానముతో గర్వించియున్న, తనను జయించిన శివునే జయింప గోరిన ఈ మన్మథుఁడు స్నేహముతో తడిసి వికసించిన కలువల కాంతిని దొంగిలించు నీ కడగంటి చూపనెడి ఖడ్గవల్లి జళిపించుచుండెను.

32. శ్లోII  శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం - కామాక్షి! సంతతమపి స్మృతి మార్గగామీ 

             కౌటిల్య మంబ కథ మస్థిరతాం చ ధత్తే - చౌర్యంచ పంకజరుచాం త్వదపాంగపాతః. 

మII    జననీ! నీదగు కంటిచూపు శ్రుతికిన్ సంబంధమౌ మార్గమున్

           గనుచున్, మౌనుల సత్ స్మృతిన్ మెలగుచున్, గామాక్షి! వక్రత్వమున్,

           ఘన చాంచల్యము దివ్య పంకజ రుచుల్ కంజాక్షి! చౌర్యంబునే

           క్షణమందెట్లు ధరించుచున్నది? లసచ్ఛాంతిప్రభాపూర్ణమై.

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! నీ క్రీగంటి ప్రసారము శ్రుతి మార్గమును బొందు చున్నది. మునుల యొక్క స్మృతి మార్గమును గూడా బొందు చున్నది. ఇట్లు శ్రుతి స్మృత్యనుసారి యైనను వక్రత్వ చంచలత్వములను కమల కాంతి చౌర్యము నెట్లు ధరించు చున్నది. 

33. శ్లోII  నిత్యం శ్రుతేః పరిచితౌ యతమానమేవ - నిలోత్సలం నిజసమీప నివాసలోలమ్‌ 

             ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్రః - కామాక్షి! కింను తవ కాలిమసంప్రదాయమ్‌. 

తే.గీ.II అమ్మ! కామక్షి! నీ చూపె కమ్మనమ్మ,

             శ్రుతి పరిచయ నీలోత్పల మతి సమీప

             ముననె శిష్యుఁడైయుండ వీక్షణగురుండు

              ప్రీతి బోధించు కాలిమ రీతి నెలమి.

తాII  ఓ కామాక్షీ దేవీ!ఎల్లప్పుడు చెవి(వేదము) యొక్క, పరిచయమునందు, యత్నించుచున్నదేయయ్యు, తన దగ్గఱ నుండు నల్లకలువకు, చూపనెడి గురుస్వామి ప్రీతితో నీ యొక్క నలుపు యొక్క రీతిని, నేర్పుచున్నదో యన్నట్లున్నది.

34. శ్లోII  భ్రాంత్వా ముహుః స్తబకిత స్మితఫేనరాశౌ- కామాక్షి! వక్త్రరుచి సంచయవారిరాశౌ,

            ఆనన్దతి త్రిపురమర్దన నేత్రలక్ష్మీ- రాలభ్య దేవి తవ మన్ద మపాంగసేతుమ్. 

ఉII       నీముఖమందునొప్పు వరణీయపు సుస్మిత కాంతి ఫేన పూ

            ర్ణామల వారిధిన్ భ్రమణ మందుచు నీదు నపాంగసేతువున్

            బ్రేమను జూచి యా శివుని వీక్షణముల్ పరితృప్తిఁ జెందె నో

            కామిత సత్ప్రదా! వినుతిఁ గాంచిన నీకను చూపునెన్నెదన్. 

తాII  కామాక్షీ దేవీ! శివుని కన్నుల కాంతి నీ చిఱునవ్యుతో నిండిన వక్త్రకాంతి యనెడి సముద్రమునందు తిరిగి తిరిగి క్రీగంటి చూపనెడి ఒడ్డును పొంది ఆనందించు చున్నది. 

35. శ్లోII  శ్యామా తవ త్రిపుర సున్దరి లోచనశ్రీః - కామాక్షి! కందలితమేదుర తార కాన్తిః, 

            జ్యోత్స్నా వతీ స్మితరుచాపి కథం తనోతి - స్పర్ధా మహో కువలయైశ్చ తథా చకోరైః. 

చంII    సునయన శాంభవీ! త్రిపుర సుందరి! నీదగు కంటి కాంతి చా

            మనమయి తళ్కుఁ గల్గి సిత మందమనోహర హాసనప్రభన్

            వినుత చకోర కల్వలకు ప్రేమను పంచుటె యొప్పియుండగా

            పనిపడి స్పర్ధ నొప్పెకద, భావనఁ జేయగ నొప్పె సత్యమై.

తాII  త్రిపుర సున్దరి వైన యో కామాక్షీ దేవీ! నల్లని కనుపాపల తళుకు అనెడి నక్షత్ర కాంతి గల నీ నయన శోభ చిఱునవ్యు వెన్నెలగలదై వెన్నెలరాత్రి యగుటచే కలువలతో చకోరములతో స్నేహము చేయవలసి యుండగా వానితో పోటీ పడుచుండుట విచిత్రముగదా. 

36. శ్లోII  కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ - కామాక్షి! సామ్య సరణిం సముపైతి కాన్త్యా 

            నిశ్శేషనేత్ర సులభం జగతీషు పూర్వ - మన్య త్రినేత్ర సులభం తుహినాద్రి కన్యే. 

కంII     శ్రీ లలిత! నీ నిరీక్షణ

            కాలాంజనమును, సమమగు కాంతిని, కనగా

            కాలాంజనమొదవు ప్రజకు,

            నీ లలిత నిరీక్షణ శివునికె లభియించున్.

తాII  కామాక్షీ దేవి నిరీక్షణము కాలాంజనము నల్లనివే. రెండును కాంతితో సమములే. కాలాంజనము ఎవరి నేత్రములకైన లభించును. కాని అమ్మవారి నిరీక్షణము త్రినేత్రుడైన శివునకు మాత్రమే లభించును. 

37. శ్లోII  ధూమాంకురో మకరకేతన పావకస్య - కామాక్షి! నేత్ర రుచి నీలిమ చాతురీ తే 

అత్యంత మద్భుత మిదం నయన త్రయస్య - హర్షోదయం జనయతే హరిణాంకమౌలేః. 

ఉII       నీ కనులందునన్ గలుగు నీలిమ మన్మథునగ్ని ధూమమే

            శ్రీకరమై రహించునటు చేయుచు నా శివునక్షులందునన్,

            లోకశుభంకరంబయిన శ్లోకమహాద్భుత హర్షరేఖలే

            యేకముగా జనించునటు నిందునిభాస్య! యొనర్చుచుండెనే.

తాII  ఓ కామాక్షీ దేవీ!, నీ యొక్క, నేత్ర కాంతిలోని నీలిమ యొక్క నిపుణత, మన్మథాగ్ని యొక్క, పొగమొలక.  ఇది మిక్కిలి వింత. చంద్రుని శిరమందు దాల్చిన శివుని యొక్క మూడు కన్నులకు, ఆనందావిర్భావమును,  కలిగించు చున్నది.

38. శ్లోII  ఆరంభ లేశసమయే తవ వీక్షణస్య - కామాక్షి! మూకమపి వీక్షణమాత్రనమ్రమ్‌ 

             సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ - కీర్తి స్స్వయంవరణ మాల్యవతీ వృణీతే. 

తే.గీ.II  నమ్రుఁడైనట్టి మూకపై నలుసుపాటి

             నీదు కనుచూపు పడినంత మేదురగతి

             కీర్తి, సుజ్ఞానకన్యలు కేలఁ బట్టి

             మాల వేయ నిల్తురు పదిమందియెదుట.

తాII  అమ్మవారి చూపు ప్రసరించినదో లేదో వినమ్రుడయిన మూగను కూడ సర్వజ్ఞతా కన్య, కీర్తి కన్యయు స్యయంవరమాలల ధరించి వరించెదరు. 

39. శ్లోII  కాలామ్బువాహ ఇవ తే పరితాపహారీ - కామాక్షి! పుష్కర మథః కురుతే కటాక్షః 

             పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీ - మన్యస్తు సంతతరుచిం ప్రకటీకరోతి. 

తే.గీ.II  నీ దయాదృష్టి, మేఘము నీరజమును

             ముకుళితంబుగఁ జేయుటనొకటె యైన,

             క్షణమునన్ మాయు వెలుగుతో గలది మైత్రి

             జలదము, కనుల నీ వెల్గు శాశ్వతమ్ము.

తాII  అమ్మవారి చూపు వర్షాకాలమేఘము వంటిది. అమ్మవారి చూపును వర్షాకాల మేఘమును పరితాపమును హరించు నట్టివే. కాని భేదమేమనగా వర్షాకాల మేఘము క్షణకాలము మెఱిసి నశించు మెఱుపుతో స్నేహమొనర్చు చుండగా అమ్మవారి కటాక్షము మాత్రము నిరంతర కాంతిని ప్రకటించు చుండును. 

40. శ్లోII  సూక్ష్మేఽపి దుర్గమ తరేఽపి గురుప్రసాద - సాహాయ్యకేన విచర న్నపవర్గమార్గే 

           సంసార పఙ్కనిచయే న పతత్యమూం తే-కామాక్షి! గాఢ మవలమ్బ్యకటాక్షయష్టిమ్. 

తే.గీ.II దుర్గమంబగు సూక్ష్మంపు మార్గమగుత

           మోక్షమనునది, గురువుల శిక్షణమున

           నీ కటాక్షమన్ యష్టిని నేను పట్టి

           భద్రముగ ముక్తిఁ జేరుదున్ భక్తరక్ష!

తాII  మోక్షమార్గమిఱుకుగా నుండును. నడుచుటకు గష్టముగా నుండును. అయినను గుర్వనుగ్రహముతో అమ్మవారి కటాక్షమనెడి యూత కట్టిను గట్టిగా పట్టుకొని నడుచువాడు ఆ మార్గమున నిటునటు నున్న బురదగుంటలలో పడకుండ కైవల్యానంద ధామము జేరుకొనును. 


41. శ్లోII  కామాక్షి! సంతత మసౌ హరినీలరత్న - స్తంభే కటాక్ష రుచి పుంజమయే భవత్యాః 

            బద్ధోఽపి భక్తి నిగలై ర్మమ చిత్త హస్తి - స్తంభం చ బన్థమపి ముంచతి హన్త చిత్రమ్. 

మII    రమణీ! నీ కను చూపు కాంతి హరినీలస్తంభమై యొప్పగా

           కమలాక్షీ! వరభక్తి రజ్జువుననే గాఢంబుగా దానికిన్

           బ్రముదంబొప్ప బిగించి కట్ట, మది యన్ బాపంపు నాగంబు తా

           నిముషంబైనను నిల్వనేరక విడున్, నేనేమి చేయంగనౌన్?

తాII  అమ్మవారి కటాక్ష కాంతి పుంజమనెడి స్తంభము నందు భక్తి శృంఖలలచే నా మనస్సునెడి ఏనుగు బంధించబడి యున్నను అది స్తంభించి పోవుటను మాను కొన్నది. అట్లే బంధమును కూడ విడచి వేయు చున్నది. 

42. శ్లోII  కామాక్షి! కార్ష్ణ్య మపి సంతత మంజనం చ - బిభ్రన్నిసర్గతరలోఽపి భవత్కటాక్షః 

వైమల్యమన్వహ మనంజనతాం చ భూయః - స్థైర్యం చ భక్త హృదయాయ కథం దదాతి. 

ఉII  నల్లనివయ్యు, కాటుకననారతమున్ ధరియించి యుండియున్,

       సల్లలితంపు చంచల ప్రశస్తకటాక్షము లెట్లు నేర్చె నే

       యెల్లలు లేని స్థైర్యునిగ, నేకలుషంబులు లేనివానిగా

       చల్లగ చేయునైపుణని, చక్కగ భక్తున కో శుభంకరీ(పరాత్పరీ)!

తాII  అమ్మవారి కటాక్షము నల్లని దయ్యు స్వచ్ఛతను, సౌజన్యమును, నిరంజనత్వమును, చంచలమయ్యు స్థెర్యమును భక్త హృదయమునకు నెట్లు గూర్చు చున్నది. 

43. శ్లోII  మన్దస్మిత స్తబకితం మణి కుండలాంశు - సోమ ప్రవాలరుచిరం శిశిరీకృతాశమ్‌ 

           కామాక్షి! రాజతి కటాక్షరుచేః కదమ్బ - ముద్యాన మంబ కరుణా హరిణేక్షణాయాః.

తే.గీ.II నీదు చిఱునవ్వె పూచెండు, నీ మణిమయ

           కుండల జిగి చిగుళ్ళయి, కూర్మినొప్పు(న్)

           (ఈ)నీ కటాక్ష కాంతి కదంబమే హృణీయ

           సుందరికి విహారోద్యాన మందునమ్మ!  

తాII  చిఱునవ్యులే పూలగుత్తులుగా, మణికుండల కాంతులే చిగుళ్ళుగా దిక్కుల జల్లబఱచునట్టి అమ్మవారి కటాక్ష కాంతి కదంబము కరుణా సుందరి విహరించు తోటగా ప్రకాశించుచున్నది. 

44. శ్లోII  కామాక్షి! తావక కటాక్ష మహేన్ద్రనీల - సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య.

            సామ్రాజ్య మంగల విధౌ మణికుణ్డలశ్రీ - ర్నీరాజ నోత్సవ తరంగిత దీపమాలా.

శాII     అమ్మా! నీదు కటాక్షపీఠము నమందానందమున్ బొందె నా

           సమ్మాన్యుండగు కంతుఁ డో జనని! ధీసమ్మాన్య!  పట్టాభిషే

           కమ్మొప్పన్ ఘటియిల్లె నందతనికిన్ గల్యాణి నీరాజనం

           బమ్మాన్యున్ గని నీదు పోగులిడె, మాతా! వానికిన్ దీప్తితోన్.

తాII  అమ్మవారి కటాక్షము మహేన్ద్రనీలమణి నిర్మిత సింహాసనము, దానిని మన్మథుడెక్కెను. అప్పుడు వానికి పట్టాభిషేక కర్మ జరిగెను. ఆ కర్మ చివఱ నీరాజన దీపమాలగా అమ్మవారి మణి కుండల కాంతి రూపొందెను. 

45. శ్లోII  మాతః క్షణం స్నపయ మాం తవ విక్షితేన - మన్దాక్షి తేన సుజనైరపరోక్షితేన 

          కామాక్షి! కర్మతిమిరోత్కర భాస్కరేణ - శేయస్కరేణ మధుపద్యుతి తస్కరేణ. 

ఉII    తుమ్మెద కాంతిఁ దోచు, నవధుల్ గననట్టి శుభంబులిచ్చు, వే

          గమ్ముగ కర్మచీకటులఁ గాల్చెడి యా రవియైన, సిగ్గుతో

          నెమ్మది మందగించెడి, గణింపగనొప్పెడి భక్తపాళినే

          కమ్మగ గాంచు నీ కనులఁ గాంచుము నన్ను క్షణంబు భార్గవీ!

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ చూపు కర్మాంధకారము బాపుటలో సూర్యుడు, తుమ్మెదల కాంతి నపహరించు దొంగయునైనట్టిది. అది శ్రేయస్సుల కలిగించునది. సిగ్గుతొణికిసలాడు నట్టిది. సుజనులెప్పుడు దానిన సాక్షాత్కరించు కొను చుందురు. అట్టి చూపుచేత నో తల్లీ! నన్ను క్షణకాలము స్నానమాడింపుము. 

46. శ్లోII  ప్రేమాపగాపయసి మజ్జన మారచయ్య - యుక్త స్మితాంశు కృత భస్మ విలేపనశ్రీః 

            కామాక్షి! కుణ్ణల మణి ద్యుతిభి ర్జటాలః - శ్రీకణ్ఠమేవ భజతే తవ దృష్టి పాతః.

తే.గీ.II ప్రేమ నది మున్గి, చిఱునవ్వు వెలుగు బూది

            పూతతోఁ బ్రకాశించుచు పూర్తిగాను,

            కుండలపు కాంతి జడఁ దాల్చి కూర్మిఁ జూచు

            నీదు చూపుకొలుచు శివున్ మేదురముగ.

తాII  ప్రేమయను నది నీట స్నాన మొనరించి చిఱునవ్వు కాంతి యనెడి బూడిద పూతతో ప్రకాశించు చున్నదై కుండల మణి కాంతులనెడి జడల దాల్చి నీ చూపు శివునే సేవించు చున్నదో కామాక్షీ దేవీ! 

47. శ్లోII  కైవల్యదాయ కరుణారస కింకరాయ - కామాక్షి! కన్దలిత విభ్రమ శంకరాయ 

           ఆలోకనాయ తవ భక్త వశంకరాయ - మాతర్నమో స్తు పరతంత్రిత శంకరాయ. 

తే.గీ.II పరము నిడఁగల, కరుణఁ గింకరునిగఁ గల,

           యంకురిత విలాస సుఖద, యనవరత సు

           భక్తులె వశంకరులు కాగ, పరమశివుఁ డొ

           క వశుఁడుగ గల నీ కటాక్షములఁ గొలుతు.

తాII  కైవల్యము నొసగునట్టి, ఏమిచేయు మనిన నదియే చేయునట్టి కరుణా రసముగల అంకురించిన విలాసములచే సుఖమును కలిగించు భక్తులకు వశమైన శంకరుని తనకు వశమొనరించు కొనిన నీ కటాక్షమునకో కామాక్షీ దేవీ! నేను నమస్కరించు చున్నాను. 

48. శ్లోII  సామాజ్య మఙ్గల విధౌ మకరధ్యజస్య - లోలాలకాలికృత తోరణ మాల్య శోభే 

            కామేశ్యరి! ప్రచల దుత్పల వైజయంతీ - చాతుర్యమేతి తవ చంచల దృష్టిపాతః. 

తే.గీ.II మదను సామ్రాజ్య మంగళవిధియె చూడ

            నీదుముంగురుల్ కామాక్షి! మేదురమగు

            తోరణములు నీ చూపులు తోచునమ్మ

            కదలు కలువ పతాక సంకలనమంచు.

తాII  ముంగురులే తోరణ మాలలైన మన్మథుని సామ్రాజ్యార్పణోత్సవమునందమ్మ వారి చంచల దృక్ప్రసారమే కదలుచున్న కలువల పతాక వలె ప్రకాశించు చున్నది. 

49. శ్లోII  మార్గేణ మంజు కచకాన్తి తమో వృతేన - మన్దాయ మాన గమనా మదనాతురాఽసౌ 

            కామాక్షి దృష్టి రయతే తవ శంకరాయ - సంకేత భూమి మచిరా దభిసారికేవ. 

తే.గీ.II మంజు కచకాంతి తమసమౌ మార్గమందు

            నెమ్మదిని యొప్పు నడకతో నిర్భరమగు

            కామపీడిత కామాక్షి! కంటి చూపు

            శివునికొఱ కభిసారికై చేర సాగు. 

తాII  ముంగురుల చీకటి ముసిరిన దారిలో కామాక్షి యైన అమ్మ వారి చూపు శంకరుని సంగమమునకై తమోభిసారిక వలె సంకేతభూమికి పోవు చున్నట్టున్నది. 

50. శ్లోII  వ్రీడాను వృత్తి రమణీ కృత సాహచర్యా - శైవాలితాం గలరుచా శశి శేఖరస్య 

            కామాక్షి! కాన్తి సరసీం త్వదపాఙ్గలక్ష్మీ - ర్మన్దం సమాశ్రయతి మజ్జన ఖేలనాయ. 

తే.గీ.II లజ్జ యను కాంతతో మెల్గు లక్ష్మి నీదు

           చూపు, కామాక్షి! శివునికి ప్రాపగుచును

           కంఠకాంతిచేఁ గలిగిన ఘనతరమగు

           సరసు నాశ్రయించెను తాను స్నానమాడ.

తాII  లజ్ఞయను దాసితో కలసినడుచునట్టి యమ్మవారి కడగంటి కాంతి యనెడి రాణి శివుని కంఠకాన్తి యనెడి నాచు గల కాన్తి యనెడి సరస్సును స్నానమాడి వినోదించుటకొఱకు జేరు చున్నది. 


51. శ్లోII  కాషాయ మంశుక మివ ప్రకటం దధానో - మాణిక్య కుణ్ణల రుచిమ్మమతా విరోధీ 

           శ్రుత్యంత సీమని రతః సుతరాం చకాస్తి - కామాక్షి! తావక కటాక్ష యతీశ్యరోఽసౌ. 

శాII     అమ్మా! నీదు కటాక్షమన్ యతినుతుండాకుండలోద్భాసమై

           నెమ్మిన్జిందెడి కావివస్త్రధరుఁడై నిర్జించి స్వార్థంబునే,

           యమ్మాన్యుండు మనోజ్ఞమైన శ్రుతి సీమాసక్తుఁడై వెల్గు, తా

           క్రమ్మన్ జేయుత భక్తపాళి కిలపై కల్యాణతేజంబులే. 

తాII  అమ్మవారి కటాక్షమను యతీశ్వరుడు మాణిక్య కుండల కాంతి నే కాషాయాంబరముగా ధరించి మమకారము లేని వాడై వేదాంత సీమలో నాసక్తుడై మిక్కిలి ప్రకాశించు చున్నాడు. 

52. శ్లోII  పాషాణ ఏవ హరినీలమణిర్దినేషు 

ప్రమ్లానతాం కువలయమ్‌ ప్రకటీకరోతి 

నైమిత్తికో జలదమేచకిమా తత స్తే 

కామాక్షి! శూన్యముపమాన మపాంగలక్ష్మ్యాః.

మII  హరినీలంబది రాయియే, కలువభామా వాడిపోవున్ బవల్,

కురియన్ వచ్చిన కాలమేఘమపుడే కోల్పోవునాఛాయ, సుం

దరి! కామాక్షి! గణింపఁ బోలవుగ నీ దాక్షిణ్య పూర్ణంబులౌ

వరదృగ్జాలముతోడ నెవ్వియు నహో! వర్ణింపలేరెవ్వరున్!

తాII  ఓ కామాక్షీ దేవీ! ఇంద్రనీలమణి రాయియే, పగళ్ళయందు కలువ వాడి యుండుటను బయట పెట్టును. మేఘము యొక్క నలుపు(కాలము) నిమిత్తమున

నేర్పడినది. అందువలన నీ యొక్క కడగంటి కాంతికి ఉపమానము లేదు.

53. శ్లోII  శృంగార విభ్రమవతీ సుతరాం సలజ్ఞా  

నాసాగ్ర మౌక్తిక రుచా కృత మందహాసా

శ్యామా కటాక్ష సుషమా తవ యుక్తమేత 

త్కామాక్షి! చుమ్బతి దిగమ్బర వక్త్ర బిమ్బమ్. 

ఉII  సారస నేత్రి! కంచిపుర సన్నుతవాసిని! వందనంబు, శృం

గారవిలాసవిభ్రమము, గల్గెడి సిగ్గున నొప్పు ముక్కెరన్

గూరెడి కాంతి స్మేరముగ గొప్పగు నీదు కటాక్ష భాతి తా

చేరుచు ముద్దు పెట్టుకొను స్మేరముఖుండగు నా దిగంబరున్.

తాII  శృంగార విలాసము లనొకవైపు సిగ్గుగా నొకవైపు ప్రదర్శించు ముక్కు కొన ముత్తెపు కాంతినే చిఱునవ్వుగా చేసి కొన్న నల్లనిదై యౌవన మధ్యస్థురాలై యున్న నీ కటాక్ష కాంతి దిగంబరుడైన శివుని ముఖ బింబమును చుంబించు చున్నది. 

54. శ్లోII  నిలోత్సలేన మధుపేన చ దృష్టి పాతః 

కామాక్షి! తుల్య ఇతి తే కథ మామనన్తి 

శైత్యేన నిందతి యదన్వహ మిన్దు పాదా 

న్పాథోరుహేణ యదసౌ కలహాయతే చ.

శాII  కామాక్షీ సతి! శైత్యమందు శశినే  గర్జించు(కాల్దన్ను) నీ చూపులన్

మే మాకల్వలఁ బోలునం చనము, కామేశాని పద్మాళినే

యేమాత్రంబును లెక్కచేయకునికిన్ హృద్యంపు నీ చూపులన్

మేమెట్లందుము భృంగతుల్యమని, యా మేల్జూడ్కులన్ గొల్చెదన్.

తాII  అమ్మవారి చూపు చంద్రకిరణముల నిందించుటచే నల్లకలువతో సమానమని చెప్పరాదు. కమలములతో కలహించుటచే తుమ్మెదతో సమానమని చెప్పరాదు.దానితో సమానమని చెప్పుట ఎట్లుకుదురును? వాని కన్న గొప్పది కదా! 

55. శ్లోII  ఓష్ట ప్రభాపటల విద్రుమ ముధ్రితే తే 

భ్రూవల్లి వీచి సుభగే ముఖ కాన్తి సిన్ధౌ 

కామాక్షి! వారిభర పూరణ లంబమాన 

కాలామ్చువాహ సరణిం లభతే కటాక్షః. 

సీII  కామాక్షి! నీవైన గణ్యంపు పెదవుల కాంతియన్ పవడముల్ కలిగియున్న,

పూజ్యవౌ నీ కను బొమలను వీచికల్ గొప్పగా వెలుగుచు నొప్పియున్న,

నీముఖ కాంతియన్ నిరుపమ జలధిని నీరునింపుకొన నవారితగతి

ఘనముగా వ్రేలాడు గణుతిగన్న కటాక్ష కాలాంబువాహంపు ఘనతఁ బొగడ

తే.గీ.II నీ కటాక్షంబు లేనిచో నిరుపమముగ

సాధ్యమెట్లగునమ్మరో? సరసిజముఖి!

నీ కటాక్షంబు నాపైన నిలుపుమమ్మ

యొక్కక్షణమైన,  నిన్గొల్తు చక్కనమ్మ.

తాII  పెదవులు పగడములుగా కనుబొమలు తరంగములుగా నొప్పు నమ్మవారి ముఖ కాంతి యనెడి సముద్రము నందు కటాక్షము నీరు నింపుకొనుటకై వ్రేలాడు వర్షాకాల మేఘమా యన్నట్లున్నది. 

56. శ్లోII  మన్దస్మి తై ర్ధవలితా మణి కుణ్బలాంశు 

సంపర్కలోహిత రుచి స్త్యదపాంగధారా 

కామాక్షి! మల్లి కుసుమై ర్నవ పల్లవెశ్చ 

నీలోత్ప లైశ్చ రచితేవ విభాతి మాలా.

శాII  అమ్మా! నీ కడగంటి చూపులక్రమం బంతస్మితారాధ్యమై

యమ్మా! తెల్లగనొప్పి, పోగుల ద్యుతిన్నత్యంత నీలచ్ఛటల్

నెమ్మిన్ ప్రస్ఫుటమౌచు, కైరవములన్ నెత్తావి మల్లెల్, లస

త్సమ్మాన్యంబగు లే చిగుళ్ళ, స్రజసద్భాతిన్ బ్రసిద్ధంబయెన్.

తాII  అమ్మా! నల్లనైన నీ క్రీగంటి చూపుల వరుస చిఱునవ్వులచే తెల్లనిదై, మణి కుండల కాంతులచే నెట్టనిదై, మల్లెలతో చిగుళ్ళతో కలువలతో కూర్చబడిన మాలయా యను నట్లున్నది. 

57. శ్లోII  కామాక్షి! శీతలకృపారస నిర్ఝరాంభ 

స్సంపర్క పక్ష్మల రుచి స్త్యదపాంగమాలా 

గోభి స్సదా పురరిపో రభిలక్ష్యమాణా 

దూర్యా కదంబక విడమ్బన మాతనోతి. 

శాII  అమ్మా! నీ కరుణా కటాక్ష జల ధారాశ్లిష్టమౌ రెప్పలన్

నెమ్మిన్ గల్గిన కాంతి గ్రాసము గొనన్ నిత్య ప్రభా పూర్ణ దై

వమ్మౌనా భవు నింద్రియాఘ్న్యచయమే భాసించుచున్ గాంచు, మా

యమ్మా! నీదు కటాక్షమున్ గొనఁగ నిమ్మా! సత్కృపన్ శాంభవీ!

తాII  అమ్మ వారి చూపుల వరుస యందు కరుణా రస ప్రవాహజలము చే దడిసిన ఱెప్పల కాంతి యున్నది. అందుచే శివునింద్రియము లనెడి గోవులచే గఱికగా చూడబడు చున్నట్లున్నది. 

58. శ్లోII  హృత్పఙ్కజమ్మమ వికాసయతు ప్రముష్ణ 

న్నుల్లాస ముత్పలరుచే స్తమసాం నిరోద్ధా 

దోషానుషంగ జడతాం జగతాం ధునానః 

కామాక్షి! వీక్షణ విలాస దినోదయ స్తే. 

చంII  కలువలకాంతి దొంగిలెడి, గాఢ తమోనివహంబుఁ బాపు ని

స్తులమగు జాడ్య దోషమను దుర్భర రాత్రి వినాశకారియౌ

చలువలనీను నీకనులు చక్కగ చిందెడి కాంతిపూర్ణమౌ

కలిగెడి ప్రొద్దుపొడ్పు మది కంజమునే వికసింపఁ జేయుతన్.

తాII  కలువల కాంతిని దొంగిలించునట్టి తమో వికారములనెడి చీకట్ల నణచు నట్టి దోషమనెడి రాత్రికి సంబంధించిన జాడ్యమును దొలగించునట్టి అమ్మవారి కంటి విలాసమనెడి ప్రాతఃకాలము నా హృదయ పజ్కజమును వికసింప జేయుగాక. 

59. శ్లోII  చక్షు ర్విమోహయతి చన్ద్ర విభూషణస్య 

కామాక్షి! తావకకటాక్ష తమః ప్రరోహః 

ప్రత్యఙ్ముఖం తు నయనం స్థిమితం మునీనాం 

ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రమ్. 

తే.గీ.II కంచి కామాక్షి! నీ కడగంటి చూపు 

శివుని కంటిని మోహింపఁ జేయునమ్మ,

నిశ్చలాంతర్ముఖులను గణించి వారి

కంటికిన్ వెలుగిచ్చుచునుంట వింత.

తాII  అమ్మవారి కడగంటి చీకటి మొలక శివుని కంటిని మోహింపజేయుచున్నను, నిశ్చలమైన అంతర్ముఖమైన మునుల యొక్క కంటిని మాత్రము వెలిగించు చున్నది. 

60. శ్లోII  కామాక్షి! వీక్షణరుచా యుధి నిర్జితం తే 

నీలోత్పలం నిరవశేష గతాభిమానమ్‌ 

ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస 

వ్యాజేన నూన మభయార్థన మాతనోతి. 

తే.గీ.II అమ్మ! నీ కంటి కాంతితో ననిని యోడి

చేరి నీలోత్పలమ్ము తా సిగ్గు విడిచి

నీదు చెవిపోగునందునన్ నిల్చె, యభయ

మీయ వేడుటకాయనన్, హృద్యముగను.

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ కంటి కాంతితో యుద్ధము చేసి యోడి పోయిన నీలోత్సలము ఆభిమానము వీడి ఆ కంటికి సమీపమునకు వచ్చి చెవి కలంకారముగా నుండి యా నెపమున దనకభయము నీయుమని వీక్షణమును నిశ్చయముగా వేడు కొనుచున్నదేమో యన్నట్లున్నది. 


61. శ్లోII  ఆశ్చర్య మమ్బ మదనాభ్యుదయావలంబః 

కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమ స్తే 

ధైర్యం విధూయ తనుతే హృదిరాగబన్థమ్‌ 

శంభోస్తదేవ విపరీతతయా మునీనామ్‌. 

తే.గీ.II అమ్మరో! మదనాభ్యుదయావలంబ

మయిన నీ కటాక్షము శివున్ జయ నిధాన!

ధైర్య హీనునిగాఁ, బ్రేమ తన్మయునిగఁ

జేసి, మునులలోరాగమున్ చేర్చునమ్మ.

తాII  అమ్మవారి చంచల వీక్షణ విలాసము మన్మథుని అభివృద్ధికి ఆధారమైన శివుని హృదయమున ధైర్యము దొలగించి అనురాగమును కలిగించు చున్నను మునుల హృదయము నందు మాత్రము ధైర్యమును గలిగించి రాగమును దొలగించు చున్నది. 

62. శ్లోII  జన్తో స్సకృత్ప్రణమతో జగదీడ్యతాం చ 

తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయామ్‌ 

కామాక్షి! మాక్షిక ఝరీమివ వైఖరీంచ 

లక్ష్మీంచ పక్ష్మలయతి క్షణ మీక్షణం తే. 

ఉII  నిన్ను క్షణంబు కొల్చినను నీదు కటాక్షము సోకు నంత, లో

కోన్నతుఁ డన్న కీర్తియు, మహోజ్వల కోమల తత్త్వమున్,  సభన్

మిన్నగు సూక్ష్మబుద్ధియును, మించినవాగ్ఝరి, యింట లక్ష్మియున్

గ్రన్నన గల్గునమ్మ వర కంచిపురేశ్వరి! లోకపావనీ!

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! నీ కొకపరి నమస్కరించు వానికి నీ వొకింత సేపు చూచిన వెంటనే జగన్నుత్యత్వము, తేజస్విత, సభారంజకమైన సూక్ష్మ బుద్ధి, తేనెల, గార్చు వాక్కు నింటి యందు లక్ష్మియు గలుగును. 

15 – 01 – 2024.

63. శ్లోII  కాదమ్బినీ కిమయతే న జలానుషఙ్గమ్‌ 

భృఙ్గావళీ కి మురరీకురుతే న పద్మమ్‌ 

కింవా కలిన్దతనయా సహతే న గఙ్గామ్‌ 

కామాక్షి! నిశ్చయ పదం న తవాక్షి లక్ష్మీః. 

ఉII  నీరదమాల కాదు కన, నీటిని యొప్పని కారణంబునన్,

వారిజమున్ సహింపమిని బంభరకూటమి కాదు చూడగా,

నేరదు గంగ సఖ్యత గణించగ కాదు కళింద చూడగన్,

కోరెద నీ కటాక్ష మనుకోఁదగు నేదని? తెల్పుమమ్మరో!

తాII  అమ్మ వారి కంటి కాంతి మేఘమాల యను కొందమా? మేఘమాలకు జలాను షంగమున్నది. అమ్మవారి కంటి కాంతికి జలానుషంగము లేదు. లేక యది తుమ్మెదల వరుస యనుకొందమా? తుమ్మెదల వరుస పద్మమునంగీకరించును. కాని అమ్మవారి కంటి కాంతి దాని నంగీకరించదు. పోని యమున యనుకొందమా, యమునగంగను సహించును. అమ్మవారి కంటి చూపు గంగను సహించదు. (కావున మేఘ మాల యని భృంగావలియని, యమున యని నిశ్చయించ లేక మూక కవి సందేహము లోనే మునుగు చున్నాడు.) 

64. శ్లోII  కాకోలపావక తృణీకరణేఽపి దక్షమ్‌  

కామాక్షి! బాలక సుధాకర శేఖరస్య 

అత్యన్త శీతల తమోఽప్యనుపారతం తే 

చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః. 

ఉII  రాజిత సత్ కటాక్ష మధురద్యుతినొప్పెడి కంచివాసినీ!

సాజముగా విషాగ్నులను సైచెడి క్రొన్నెలవంకధారి సం

పూజిత మానసంబుననె పూర్తిగ చల్లనిదయ్యు, నీదు సత్ 

పూజితమౌ కటాక్షమది, మోహము కొల్పుట చిత్రమే కదా?

తాII  విషాగ్నులను లెక్క చేయని చిన్ని చంద్రుని శిరోభూషణముగా ధరించు శివుని చిత్తమును గూడ అమ్మవారి చూపు చల్లనిదయ్యు మోహింప జేయుట చిత్రము గదా! 

65. శ్లోII  కార్పణ్య పూరరస వర్థిత మమ్బ మోహ 

కన్దోద్గతం భవమయం విషపాదపమ్మే 

తుంగం ఛినత్తు తుహినాద్రి సుతే భవత్యాః 

కాంచీపురేశ్వరి! కటాక్ష కుఠారధారా.

తే.గీ.II శ్రీద! మోహకందజమైన, చిత్రమైన

క్రోధజలముచే పెరిగిన, కొండఁ బోలు

నాదు భవ విషవృక్షమున్ నరుకు గాక,

నీ కటాక్షకుఠారము, నీలవేణి!

తాII  హిమవత్సర్వత కుమారివైన, కాంచీపుర నాయికవైన యో కామాక్షీ దేవీ! నీ కటాక్ష మనెడి గండ్ర గొడ్డలి యంచు, మోహమనుదుంప నుండి మొలచిన అహంకార జలముచే పెరిగిన ఎత్తయిన నా సంసార మనెడి విషవృక్షమును ఛేదింప జేయుగాక. 

66. శ్లోII  కామాక్షి! ఘోర భవరోగ చికిత్స నార్థ 

మభ్యర్థ్య దేశిక కటాక్ష భిషక్ప్రసాదాత్‌ 

తత్రాపి దేవి లభతే సుకృతీ కదాచి 

దత్యన్త దుర్లభ మపాంగ మహౌషధం తే. 

తే.గీ.II మాదు భవరోగమును పాపు మందు కొఱకు 

గురు భిషజు కటాక్షముపొంది వరల వలయు,

దుర్లభంబైన గురుకృప దొరికెనేని

యామ్మ! నీకటాక్షౌషధమందనగును.

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ కటాక్షము ఘోరమైన సంసార మనెడి రోగమును కుదుర్చుటలో గొప్ప మందు. అది లభింప వలెనన్న ముందుగా గురువనెడి వైద్యుడు లభింప వలెను. అతడు దయతో చూచి రోగి ననుగ్రహింప వలెను. పదే పదే అడిగిన పిమ్మట నా దేశికుడను వైద్యుడు కటాక్షమను గొప్ప మందు నొసగును. దానిని పొందుట కా రోగి బహు జన్మార్జీత సుకృతము కలవాడై యుండ వలెను, ఇన్ని యున్నను ఆ మందు లభించుట నియతము కాదు. ముఖ్యముగా గుర్వనుగ్రహమును పొంది యుండవలెను. అమ్మ వారి కటాక్షము గురు కటాక్షాధీనము. 

67. శ్లోII  కామాక్షి! దేశిక కృపాఙ్కుర మాశ్రయన్తో 

నానా తపోనియమ నాశిత పాశ బన్ధాః 

వాసాలయం తవ కటాక్ష మముం మహాంతో 

లబ్ధ్వా సుఖం సమధియో విచరన్తి లోకే. 

తే.గీ.II గురుననుగ్రహలేశమున్ గోరి పొంది,

జపతపాదులన్ భవపాశ చయము త్రుంచు

ఘనులు నీ కటాక్ష గృహము ఘనతఁ బొంది

సుఖము సమబుద్ధితో నంబ! శోభిలుదురు.

తాII  ఓ కామాక్షీ దేవీ!, గురువు యొక్క యనుగ్రహ లేశమును ఆశ్రయించిన, అనేక తపోనియమముల చేత నశింప జేయ బడిన పాశముల బన్ధములు గల గొప్పవారు ఈ నీ యొక్క యీ కటాక్షమును నివాస భవనమునుగా పొంది, సమబుద్ధి గలవారై, లోకము నందు సుఖముగా తిరిగెదరు. 

68. శ్లోII  సాకూత సంలపిత సంభృత ముగ్ధహాసం 

వ్రీడానురాగ సహచారి విలోకనం తే 

కామాక్షి కామ పరిపంథిని మారవీర 

సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి. 

ఉII  నీ మదిలోని భావమును నేర్పుగ నీవు వచించు వేళ నో

శ్రీ మధురాక్షరా! నగవు, సిగ్గను, రాగము, కంట నొక్కటై

ప్రేమ బహిర్గతంబగుచు శ్రీగళు మానసమందు మన్మథా

స్త్రామలవేదనన్ గొలుపు నమ్మరొ! సన్నుత! కంచి వాసినీ!

తాII  ఓ కామాక్షి దేవీ! నీవు సాభిప్రాయముగ మాట్లాడునప్పుడు అప్రయత్నముగా నుబికిన నవ్వు సిగ్గు అనురాగము ముప్పిరిగొన్న నీ చూపు శివుని యందేర్పడిన మన్మథ వీరుని స్మామాజ్యమునకు లోబడియున్న యవస్థను బ్రకటించు చున్నది. 

69. శ్లోII  కామాక్షి! విభ్రమ బలైకనిధి ర్విధాయ 

భ్రూవల్లి చాపకుటిలీకృతమేవ చిత్రమ్‌ 

స్వాధీనతాం తవ విధాయ శశాంకమౌలే 

రజ్ఞార్థ రాజ్యసుఖలాభ మపాజ్ఞవీరః. 

ఉII  నీదు కటాక్ష వీరుఁడు గణింపుగ నీకనుబొమ్మధన్వదే

మోదముతో విలాసబలపూర్ణపు సన్నిధిగా గడించుచున్,

ఖేదవిదూరపద్ధతిని కేళిగ శ్రీహరు దేహమర్థమున్

వాదుగ నిచ్చె కంచిపురవాసిని! నీకు శుభంకరమ్ముగాన్.

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ కటాక్ష వీరుడు కను బొమ్మలు అను ధనుర్లతను వంచి విలాసబలము నిధిగా పొంది శివుని యొక్క సగము శరీరము నందధికారమును నీ వశము చేసెను.  

70. శ్లోII  కామాంకురైక నిలయ స్తవ దృష్టిపాతః 

కామాక్షి భక్త మనసాం ప్రదదాతి కామాన్‌ 

రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి 

వైరాగ్యమేవ కథమేష మహామునీనామ్‌. 

శా.  అమ్మా! నీ కనుచూపు మన్మధుని బ్రహ్మానందసామ్రాజ్యమే,

నెమ్మిన్ భక్తుల కోరికల్ నియతితో నిత్యంబు తీర్చున్, బ్రమో

దమ్మున్గొల్పును శంభు చిత్తమునకున్ దర్పంపు రాగంబుతో

గొమ్మంచున్మునిపాళికిచ్చు పరముల్ గూర్మిన్ సదా శాంభవీ!

తాII  ఓ కామాక్షీ దేవీ! నీ చూపు మన్మథునికి పుట్టిల్లు. భక్తుల మనస్సులలో బుట్టిన కోరికలన్నిటిని తీర్చుచు నుండును. అది స్వయముగా రాగముతో కూడినదే యైనను మహామునులకు వైరాగ్యమునే ప్రకటించుచున్నది. 

16 – 01 – 2024.


71. శ్లోII  కాలామ్బువాహ నివహైః కలహాయతే తే 

కామాక్షి! కాలిమ మదేన సదా కటాక్షః 

చిత్రం తథాపి నితరా మముమేవ దృష్ట్యా 

సోత్కణ్ఠ ఏవ రమతే కిల నీలకణ్ఠః.  

తే.గీ.II కాలిమ మదంబుచేతను కలహమందు

నీలి మేఘంబు తోడను నీ కటాక్ష

మైన గాని యాశివుని రూపాన కేకి

చూచి రమియించుటే వింత సుజనపాల!

తాII  ఓ కామాక్షీదేవీ! నీ కటాక్షము వర్షాకాలమేఘమాలతో కాలిమ మదము కారణముగా కలహించు చున్నను దీనిని చూచి యుత్కంఠగల వాడయి శివుడను నెమలి రమించుచుండుట చిత్రముగదా. 

72. శ్లోII  కామాక్షి! మన్మథరిపుమ్‌ ప్రతి మారతాప 

మోహాన్థకార జలదాగమ నేన నృత్యన్‌ 

దుష్కర్మ కంచుకి కులం కబలీ కరోతు 

వ్యామిశ్రమేచక రుచి స్త్వదపాంగ కేకీ. 

తే.గీ.II నీ కటాక్షమన్ నెమలి, వినీల మదన

మోహ మేఘంబు శివునిపై మోహరించ,

నాట్యమాడునో కామాక్షి! నాదు దుష్ట

కర్మసర్పంబులన్ మ్రింగి కాచునదియె. 

తాII  అమ్మ వారి కటాక్ష మనెడి నెమలి శివునిపైకి మన్మథ మోహాంధకార మేఘము యొక్క రాకతో పురి విప్పి నాట్యము చేయు చున్నదై దుష్కర్మ సర్పసమూహములను మింగి వేయుగాక! 

73. శ్లోII  కామాక్షి! మన్మథరిపో రవలోకనేషు 

కాన్తమ్‌ పయోజమివ తావక మక్షిపాతమ్‌

ప్రేమాగమో దివసవ ద్వికచీకరోతి 

లజ్ఞాభరో రజనివ న్ముకులీ కరోతి. 

తే.గీ.II సుభగ! కామాక్షి! శివదృష్టి సోకినంత

నీ కటాక్షమన్ గమలంబు నీరజాక్షి!

పగలు పోలు ప్రేమను విచ్చి వరలుచుండు,

రాత్రిఁ బోల్ సిగ్గునన్ ముడ్చి క్రాలునమ్మ!

తాII  ఓ కామాక్షీ దేవీ! శివుని చూపులు సోకగానే నీ కటాక్షము అందమైన కమలము వలె పగలు యొక్క ప్రేమతో వికసించుచు రాత్రి వంటి లజ్జతో ముకుళలించు చున్నది. 

74. శ్లోII  మూకో విరించతి పరమ్‌ పురుషః కురూపః 

కందర్పతి త్రిదశరాజతి కింపచానః 

కామాక్షి కేవల ముపక్రమ కాలఏవ 

లీలా తరంగిత కటాక్ష రుచః క్షణం తే. 

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ కటాక్షమ్ము సోక

మూగ బ్రహ్మగానగుచుండి పూజ్యుఁడగును,

వికృత రూపుండు మదనుఁడై వెలుగుచుండు,

పేద యింద్రుఁడై వరలును, శ్రీద! జనని!

తాII  అమ్మా! నీలీలా కటాక్షము పూర్తిగ ప్రసరింప కుండగనే, కొంచెము ప్రసరింపగానే, మూగ - బ్రహ్మ, వికృత రూపుడు - మన్మథుడు, పేద ఇంద్రుడు నగు చున్నాడు. 

75. శ్లోII  నీలాలకా మధుకరన్తి మనోజ్ఞనాసా 

ముక్తారుచః ప్రకట కన్ద బిసాఙ్కురన్తి 

కారుణ్య మంబ మకరన్దతి కామకోటి 

మన్యేతతః కమలమేవ విలోచనం తే. 

తే.గీ.II నీలి ముంగురుల్ మధుపముల్, నీదు నాసి

కను గలుగునట్టి ముత్యపు కాంతి బిసరు

హాంకురము, దయ మధువుగా నలరుచున్న

నీకటాక్షంబు కమలంబు నీరజాక్షి!

తాII  అమ్మా! నీ కన్నుమీద వాలు ముంగురులు తుమ్మెదలుగా, ముక్కు ముత్తెపు కాంతులు కందబిసాంకురములుగా కారుణ్యము మకరన్దముగా భాసించుటచే నీ కన్నును కమలమును గానే తలచు చున్నాను. 

76. శ్లోII  ఆకాంక్ష్య మాణ ఫలదాన విచక్షణాయాః 

కామాక్షి! తావక కటాక్షక కామధేనోః 

సమ్పర్క ఏవ కథ మమ్బ విముక్త పాశ 

బన్ధాః స్ఫుటం తను భృతః పశుతాం త్యజన్తి.

తే.గీ.II అమ్మ! కామాక్షి! కోర్కెలన్ నెమ్మిఁ దీర్చు

నీ కటాక్షమన్ సురగవి నియతిఁ గనినఁ

బ్రజలు భవబంధములు వీడి పాశవికత

నెట్లు విడకుందురిల నో మహేశురాణి! 

తాII  అమ్మా! కామాక్షీ దేవీ! కోరిన ఫలముల నొసగుటలో సమర్థమగుటచే నీ కటాక్షము కామధేనువే. దాని సంబంధము కలిగిన తోడనే దేహధారులు పాశబంధముల నుండి విడివడుదురు. ఇది యెట్లు? 

77. శ్లోII  సంసార ఘర్మ పరితాప జుషాం నరాణాం 

కామాక్షి! శీతలతరాణి తవేక్షితాని 

చన్ద్రా తపన్తి ఘనచన్దన కర్దమన్తి 

ముక్తాగుణన్తి హిమవారి నిషేచనన్తి. 

తే.గీ.II అమ్మ! భవఘ్రీష్మతప్తులకనవరతము

నీ కటాక్షంబు వెన్నెలల్, నిరుపమాన

చందనపుముద్ద, ముత్తెంపు సరములమ్మ!

హిమజలాభిషేకము చూడ! హిమగిరిసుత!

తాII  అమ్మవారి చల్లని చూపులు సంసారమను గ్రీష్మము యొక్క పరితాపముచే తపించిన మనుష్యులకు వెన్నెలలు గంధపు ముద్దలు, ముత్తెముల హారములు హిమ జలాభిషేకములగు చున్నవి. 

78. శ్లోII  ప్రేమామ్బురాశి సతతస్నపితాని చిత్రం 

కామాక్షి! తావక కటాక్ష నిరీక్షణాని 

సంధుక్షయన్తి ముహు రిన్ధనరాశిరీత్యా 

మారద్రుహో మనసి మన్మథ చిత్రభానుమ్‌. 

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ కటాక్షమ్ము సతము

స్నేహ జలధిని మునిగిన చితుకు కనగ,

మారరిపునకు మనసున మన్మథాగ్ని

రగులఁగొల్పెడునోయమ్మ! రాజిత పద!

తాII  అమ్మవారి కడగంటి చూపులు ప్రేమసముద్రములో మునిగి యుండియు నిన్ధన రాశి వలె మాటి మాటికి శివుని మనస్సు నందు మన్మ థాగ్నిని రగులు కొల్పు చున్నది. 

79. శ్లోII  కాలాంజన ప్రతిభటం కమనీయ కాన్త్యా 

కన్దర్ప తన్త్రకలయా కలితానుభావమ్‌ 

కాంచీ విహార రసికే కలుషార్తి చోరం 

కల్లోలయస్వ మయి తే కరుణాకటాక్షమ్‌. 

తే.గీ.II కంచిపురవాస రసిక! నీ కంటి చూపు

కాంతిఁ గాలాగ్నిఁ బోలుచు, కలిగి మదను

నాగమనమును వర్ధిల్ల సాగుచున్న,

దోషదుఃఖాదులను బాపు తుల్యరహిత

మైన నీ చూపు కరుణ నా పైన నిలుపు.

తాII  ఓ దేవీ! నీ చూపు కాంతి చేతనే కాలాంజనముతో బోలియున్నది మన్మథాగమముతో మరింత గొప్ప తనము నొంది యున్నది. దోషముల దుఃఖముల నపహరించు నీ కరుణా కటాక్షమును నాయందు బఱపుము. 

80. శ్లోII  కాంతేన మన్మథ మదేన విమోహ్యమాన 

స్వాంతేన చూత తరుమూలగతస్య పుంసః 

కాంతేన కించి దవలోకయ లోచనస్య 

ప్రాంతేన మాం జనని కాంచిపురీవిభూషీ. 

తే.గీ.II కంచి పుర శోభితా! నీదు కంటి కొనల

మన్మథ మదపు కాంతి యా మదనదమను

నాత్మలో మోహమున్ గొల్పు, నా కటాక్ష

మమ్మ! కొలుపుము నాపైన సమ్ముదమున.

తాII  ఓ తల్లీ! నీ కంటి కొన యందు మన్మథుని మదమున్నది. అదియే కామేశ్వరుని మనస్సును మోహింప జేయుచున్నది. అందమైన యాకంటి కొనతో నన్ను కొంచెము చూడుము. 


81. శ్లోII  కామాక్షి! కేఽపి సుజనాస్త్వదపాంగ సంగే 

కంఠేన కన్దలిత కాలిమ సంప్రదాయాః 

ఉత్తంస కల్పిత చకోర కుటుమ్బపోషా 

నక్తందివ ప్రసవ భూ నయనా భవంతి.

తే.గీ.II అమ్మ! నీ కటాక్షము గాంతు రరుదుగాను

గరళ కంఠులు, నిందు శేఖరులు, హరులు,

సూర్యచంద్రాగ్నినేత్ర సత్ శోభితులును

కలుగుదురు సృష్టిలో, వారె గణ్యులిలను.

తాII  అమ్మవారి చూపు పడిన పుణ్యాత్ములు సజ్ఞనులైన కొందరు మాత్రమే నల్లని మెడగల వారుగా (నీల కంఠులుగ) శిరస్సున చందునలంకరించు కొనువారుగా (చంద్రశేఖరులుగ) సూర్య చంద్రులు కన్నులుగా గలవారుగా సూర్య చంద్ర నేత్రులుగా నగుదురు. 

82. శ్లోII  నీలోత్పల ప్రసవకాన్తి నిదర్శనేన 

కారుణ్య విభ్రమ జుషా తవ వీక్షణీన 

కామాక్షి! కర్మ జలధేః కలశీ సుతేన 

పాశత్రయా ద్యయ మమీ పరిమోచనీయాః.

తే.గీ.II నల్ల కలువల కాంతి రాగిల్లఁ గలిగి

కరుణతోనొప్పి, కర్మసాగరమునకు న

గస్త్యుఁడైయున్న నీ కడగంటి చూపు

మాదు పాశత్రయంబును మాపుఁ గాక.

తాII  ఓ కామాక్షీ దేవీ! నల్లగలువ పూవు యొక్క కాంతిని బ్రదర్శించు, దయ యొక్క విలాసమును బొందిన, కర్మయనుసముద్రమునకు, అగస్త్యుడైన, నీ యొక్క చూపు చేత,  ఈ మేము పాశముల మూడింటి నుండి విడిపింప దగినవారము.

83. శ్లోII  అత్యన్త చఞ్చల మక్ళత్రిమ మఞ్జనం కిం 

ఝంకారభంగిరహితా కిము భృఙ్గమాలా 

ధూమాజ్కురః కిము హుతాశన సఙ్గహినః  

కామాక్షి! నేత్ర రుచి నీలిమ కన్దలీ తే. 

తే.గీ.II కదులు కాటుకయా నీదు కనుల కాంతి?

శబ్ద రహిత భృంగచయమా? సరసిజాక్షి?

యగ్ని సంపర్క రహితమౌ యగ్నికేతు

వౌనొ? వివరింపు కామాక్షి! యనుపమముగ.

తాII  అమ్మా నీ నేత్ర కాంతి మిక్కిలి చంచలమైన "సహజమైన కాటుకయా? ఝంకారములేని తుమ్మెదల వరుసయా? అగ్ని సంపర్కము లేని పొగ మొలకయా? 

84. శ్లోII  కామాక్షి! నిత్య మయ మజ్ఞలి రస్తు ముక్తః 

బీజాయ విభ్రమ మదోదయ ఘూర్ణితాయ 

కన్దర్పదర్ప పునరుద్భవ సిద్ధిదాయ 

కల్యాణదాయ తవ దేవి దృగఞ్చలాయ.

తే.గీ.II ముక్తి బీజము, విభ్రమము, మదము లవి

పుట్టుటన్ దిరుగు, మరుని పూర్వగర్వ

సిద్ధినొసగు, శుభములిచ్చు శ్రీకటాక్ష

మునకు దోసిలి పట్టుదుము జగదంబ! 

తాII  అమ్మా నీ కటాక్షము విభ్రమ మదముల పుట్టుకచే తిరుగుచున్నదియు, చచ్చిన మన్మథుని గర్వమును మరల బుట్టించు చున్నదియు. శుభముల నిచ్చు నట్టిదియును. అట్టి నీకటాక్షమునకు ఇదిగో దోసిలొగ్గు చున్నాను. 

85. శ్లోII  దర్పాఙ్కురో మకరకేతన విభ్రమాణాం 

నిన్దాఙ్కురో విదలితోత్సల చాతురీణామ్‌ 

దీపాఙ్కురో భవ తమిస్ర కదమ్బకానాం 

కామాక్షి! పాలయతు మాం త్యదపాంగపాతః. 

తే.గీ.II మదనుని విలాసముల గర్వ సదనమమ్మ,

నీలి కలువలశోభకు నింద చూడ,

దీపము భవాంధమునకును, దివ్యమైన

నీ కటాక్షంబు నన్నోము నిరతమిలను.

తాII  అమ్మా! నీ కటాక్షము మన్మథ విలాసముల గర్వము. వికసించిన కలువల నైపుణ్యమునకు నింద . సంసారాన్ధకారమునకు దీప కలిక. అట్టి నీ కటాక్షము నన్ను నిరంతరము కాపాడుగాక! 

86. శ్లోII  కైవల్య దివ్య మణి రోహణ పర్వతేభ్యః 

కారుణ్య నిర్ఝర పయః కృత మజ్జనేభ్యః 

కామాక్షి! కింకరిత శంకర మానసేభ్యః 

తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః.  

తే.గీ.II ముక్తిమణికి రోహణగిరుల్ భువనమాత!

కరుణ వారిని మునిగిన ఘనకటాక్ష

ములవి, దాసునిగా శివున్ బొలుపుఁ గొనిన

వాటి కంజలించెద నేను మేటిగాను.

తాII  అమ్మా! నీ వీక్షణ విభ్రమములు కైవల్య దివ్యమణికి రోహణగిరులు, దయాప్రవాహ జలమున స్నాతములైనట్టివి. శివుని మనస్సును దాసముగా నొనరించు కొన్నట్టివి. అట్టి నీ వీక్షణ విభ్రమములకు నా నమస్సగుగాక. 

87. శ్లోII  అల్పీయ ఏవ నవ ముత్సల మమ్బ! హీనా 

మీనస్య వా సరణి రమ్చురుహాం చ కిం వా 

దూరే మృగీ త ద(దృగ)సమఞ్జస మఞ్జనం చ 

కామాక్షి! వీక్షణ రుచౌ తవ తర్కయామః. 

తే.గీ.II క్రొత్తకలువయు చిన్నదై కుంచితమగు,

మత్స్యమును తక్కువైపోవు, మసలు జింక

దూరమైనదె యగుఁగాదె, తులయెకాదు

కాటుకయు చూడ నీ కటాక్షమున కమ్మ!

తాII  అమ్మవారి కంటి కాంతిలో కొత్త కలువయు చిన్నదై పోవును. చేపయు తక్కువదై పోవును. లేడియో దూరమందున్నదియే యగును. ఆ కాటుకయు నయోగ్యముగానే కన్పడునని యూహించు చున్నాము. 

88. శ్లోII  మిశ్రీభవద్గరల పజ్కిల శాఙ్కరోర 

స్సీమాఙ్గణే కిమపి రిఙ్ఖణ మాదధానః 

హేలావధూత లలిత శ్రవణోత్పలోఽసౌ 

కామాక్షి! బాల ఇవ రాజతి తే కటాక్షః. 

తే.గీ.II విషపు కాంతిచే బురదయి విషగళునెద

పయిని, నీ కటాక్షము నిల్పు, బాలుఁడెటుల

చెవిని కలిగిన కలువను చేతబట్టి 

విదలుచు నటులఁ దోగాడు విశ్వజనని!

తాII  అమ్మా! నీ చూపు విషపు కాంతిచే బురదయైన శివుని వక్షో దేహమున, చెవి యందలి కలువను విదల్చుచు బాలునివలె దోగాడు చున్నది. 

89. శ్లోII  ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తి ధాటీ 

చూతాటవీషు బుధకోకిల లాల్యమానమ్‌ 

మాధ్వీరసమ్‌ పరిమలం చ నిరర్గలం తే 

కామాక్షి! వీక్షణ విలాస వసంత లక్ష్మీః. 

చంII  మహిత వసంత లక్ష్మియగు, మంజులవాఙ్నిధి! నీ కటాక్షమే,

సహృదయ పాండితీవని నసాదృశపాండితి జాలువార ని

ర్వహణపు వేళ తేనియలు పారగ, సౌరభముల్ రహించగా

మహిని యొనర్చునద్ది, వర మానస! నీదు కటాక్షమొందినన్.

తాII  అమ్మా! నీ చూపు వసంత లక్ష్మి. అది పండిత వాగ్వనములందు బండితులనెడి కోకిలలచే నాస్వాదింప దగిన తేనెను వాసనను బుష్కలముగా నందించు చున్నది. అమ్మవారి దయగల చూపులెవరి పై ప్రసరించునో వారు రసవంతమైన ఆమోద భరితమైన కవిత్యమును జెప్పి పండితుల నానందింప జేయుదురు. 

90. శ్లోII  కూలంకషం వితనుతే కరుణామ్చువర్షీ 

సారస్వతం సుకృతిన స్సులభమ్‌ ప్రవాహమ్‌ 

తుచ్చీకరోతి యమునామ్చు తరఙ్గభఙ్గీ 

కామాక్షి! కిం తవ కటాక్షమహామ్బువాహః. 

తే.గీ.II కరుణ వర్షించు నీదగు కంటిచూపు

మేఘమే యగు, సుకృతు లమేయసుగతిఁ

బొంది, సాహితీసారంబు బొందుదు రిల,

మించి యమునను తా ప్రవహించు కరుణ. 

తాII  నీ కటాక్షము దయాజలమును వర్షించుటచే మేఘమే యగుచున్నది. అది పుణ్యాత్మునికి కూలంకష సారస్వత ప్రవాహమును సులభ మొనరించు చున్నది. యమునానదీ తరఙ్గముల తీరు నవమానించు చున్నదో యను నట్లున్నది.

17 – 01 – 2024.


91. శ్లోII  జాగర్తి దేవి కరుణా శుక సున్దరీ తే 

తాటఙ్కరత్న రుచి దాడిమఖణ్డశోణే 

కామాక్షి! నిర్భర కటాక్ష మరీచి పుఞ్జ 

మాహేన్ద్ర నీలమణి పఞ్జర మధ్యభాగే. 

తే.గీ.II కరుణ శుకకాంత మేల్కొని ఘనతనుండె

నీ కటాక్ష తేజః పుంజ నీలమణి వి

నిర్మితపు పంజరమున, దానిమ్మపండు

ముక్క నా నొప్పె కమ్మల చక్కఁ దనము.

తాII  అమ్మా! నీ కటాక్ష కాంతి సమూహమొక యింద్ర నీల మణి నిర్మిత పంజరము. అందులో కమ్మల కాంతి యను దానిమ్మ పండు ముక్క శోభించు చున్నది. ఆ పఞ్జరమున దయయను నాడు చిలుక మేలుకొని యున్నది. 

17 – 01 – 2024.

92. శ్లోII  కామాక్షి! సత్కువలయస్య సగోత్రభావా 

దాక్రామతి శ్రుతి మసౌ తవ దృష్టిపాతః 

కిం చ స్ఫుటం కుటిలతామ్‌ ప్రకటీకరోతి 

భ్రూవల్లరీ పరిచితస్య ఫలం కి మేతత్.

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ కటాక్షమ్ము శ్రుతిని

మంచి కలువ సోదరభావ మహిమఁ జేసి 

యాక్రమించుచు వక్రత నమరియుండె

నిదియె భ్రూలత పరిచయ మెన్ను ఫలమొ?

తాII  ఓ కామాక్షీ దేవీ!, నీ యొక్క, కటాక్షము, మంచికలువ యొక్క,సోదర భావము వలన, చెవిని (వేదమును),ఆక్రమించు చున్నది. మరియు, స్పష్టముగా,వక్రతను (కపటమును) ప్రకటన చేయుచున్నది, ఇది,  తీగవంటి కనుబొనుల పరిచయమునకు, ఫలమా యేమి?

93. శ్లోII  ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య 

నారాచవర్ష లహరీ నగరాజ కన్యే 

శజ్కే కరోతి శతధా హృది ధ్రైర్యముద్రాం 

శ్రీకామకోటి యదసౌ శిశిరాంశు మౌలేః. 

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీ కటాక్షమ్మునెంతు

మన్మథుని బాణ వృష్టిగా మరులు గొలిపి

భవుని మదిలోని ధైర్యమున్ భంగపరచు

శతవిధమ్ముల ఖండించి, జయనిధాన!

తాII  హిమవత్‌పర్వత సుతవైన యో కామాక్షీ దేవీ! నీయక్షి కాంతి మన్మథుని బాణ వర్షముగా తలపోయుదును. ఏలననగా నది శివుని మనస్సులోని ధైర్యమును నూరు ముక్కలు చేయు చున్నది. 

94. శ్లోII  బాణేన పుష్పధనుషః, పరికల్ప్యమాన 

త్రాణేన భక్త మనసాం కరుణాకరేణ 

కోణేన కోమల దృశ స్తవ కామకోటి 

శోణేన శోషయ శివే మమ శోకసిన్ధుమ్‌.

తే.గీ.II అమ్మ! నీ చూపు మదనుని యమ్ము చూడ

భక్తరక్షణ చేయుచు బరగునమ్మ!

దయకు ఖనియది, యెఱ్ఱనిదయినదమ్మ,

శోకసంద్రమునింకించు, శోభనాంగి!

తా|| అమ్మా! నీ చూపు మన్మథుని బాణము. అది భక్తులకు రక్షణమును కల్పించు చున్నది. అది దయకు గనిగా నున్నది. అది యెఱ్ఱనిది. అట్టినీ చూపు చేత నా యొక్క శోక సముద్రము నింకింప జేయుము. 

95. శ్లోII  మారద్రుహా మకుటసీమని లాల్యమానే 

మన్దాకినీ పయసి తే కుటిలం చరిష్ణుః 

కామాక్షి! కోపరభసా ద్వలమానమీన 

సందేహ మజ్కురయతి క్షణ మక్షిపాతః.

తే.గీ.II అమ్మ! కామక్షి నీకటాక్షమ్ము చూడ

శివుని తలపైన గంగపై శివములెత్తి

యందు వంకరగానొప్పు యనిమిషమగు

చేపవలెనున్నదోయమ్మ! దీపకళిక!

తాII  అమ్మా! నీ చూపు శివుడు నెత్తిని బెట్టుకొని యాదరించు గంగా జలమున కోపముచే వంకరగా తిరుగు చేపయా యని సందేహింప బడుచున్నది. 

96. శ్లోII  కామాక్షి! సంవలిత మౌక్తికకుణ్ణలాంశు 

చంచత్స్మితశ్రవణ చామర చాతురీకః 

స్తమ్భే నిరన్తర మపాఙ్గమయే భవత్యా 

బద్ధ శ్చకాస్తి మకరధ్యజ మత్తహస్తీ. 

తే.గీ.II గుణద! నీ చూపు ముత్యాల కుండలములు,

కాంతి నగుతమ్మి కర్ణుఁడౌ కాముఁడనెడి

గంధకరి నీదు చూపను కంబమునకు

బంధమై యుండి లోకాన ప్రబలుచుండె.

తాII  అమ్మా! నీ చూపు ముత్యాల కుండలము. కాంతి యనెడి నవ్వుగల చామరముల వంటి చెవులు గల మన్మధుడనెడి మదగజము నీ చూపనెడి స్తంభమున బంధింప బడినదై ప్రకాశించు చున్నది. 

97. శ్లోII  యావత్కటాక్ష రజనీ సమయాగమ స్తే 

కామాక్షి తావ దచిరా న్నమతాం నరాణామ్‌ 

ఆవిర్భవ త్యమృత దీధితి బిమ్బ మమ్బ 

సంవిన్మయం హృదయ పూర్వ గిరీంద్రశృంగే.

తే.గీ.II ఎంతలోనీ కటాక్షమన్ హృద్యమైన

పూర్ణిమ నిశాసమయమది పొంగి వచ్చు

నంతలోజనగిరిపైన నద్భుతమగు

జ్ఞానచంద్రోదయమ్మగు కంచి నిలయ! 

తాII  ఎంతలో నీకటాక్షమనెడి పున్నమ రాత్రి సమయము వచ్చునో అంతలోనే నమస్కరించు నరుల హృదయ మనెడి తూర్పు కొండ కొమ్మున జ్ఞాన మయమైన చంద్ర బింబమావిర్భవించును. 

98. శ్లోII  కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్షో 

దిత్సు స్సమస్త విభవం నమతాం నరాణామ్‌ 

భృంగస్య నీల నలినస్య చ కాన్తి సంప 

త్సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రమ్‌. 

తే.గీ.II అమ్మ! కామాక్షి నీ కటాక్షమ్ము కల్ప

వృక్షము, జనుల కోరికల్ వేగ తీర్చు, 

తుమ్మెదల, నీలకమలాలఁ దోగియాడు

నీలి సంపదన్ హరియించు, నీలవేణి!

తాII  అమ్మా! కల్పవృక్షము వంటి నీ చూపు నమస్కరించువారలకు సమస్త సంపదల నీయగోరును. కాని తుమ్మెద యొక్క నీల కమలము యొక్క కాంతి యను సంపద మొత్తము హరించుట వింత కదా! అమ్మ వారి కటాక్షము తుమ్మెద కన్న నీల నలినముకన్న మిక్కిలి నల్లనై శోభించు చున్నది. 

99. శ్లోII  అజ్ఞాత భక్తి రస మప్ర సరద్వివేక 

మత్యన్త గర్వ మనధీత సమస్త శాస్త్రమ్‌ 

అప్రాప్త సత్య మసమీపగతం చ ముకేః 

కామాక్షి! నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. 

తే.గీ.II అమ్మ! కామాక్షి! నీకటాక్షమ్ము కోర

దవని నవివేకులన్ భక్తిరవవిదూరు

ల ననధీతమహిత శాస్త్రుల నిల ముక్తి

దూరుల నసమీపగతులన్, దోయజాక్షి!

తాII  అమ్మా! భక్తి యొక్క రక్తి నెఱుగని వానిని వివేకము ప్రసరించని వానిని, గర్వము లేని వానిని, అన్ని శాస్త్రముల నేర్వని వానిని, సత్యము చేరని వానిని ముక్తికి డగ్గఱని వానిని కోరదు. ఇన్ని ఉన్న వానికే అమ్మవారి కటాక్షము లభించును. అనగా నది సామాన్యులకు దుర్లభము. 

100. శ్లోII  అత్యన్త శీతల మనర్గల కర్మపాక 

కాకోల హారి సులభం సుమనోభిరేతత్‌ 

పీయూష మేవ తవ వీక్షణ మమ్బ కిం తు 

కామాక్షి! నీలమిదమిత్యయమేవ భేదః. 

తే.గీ.II  అమ్మ! కామాక్షి! నీ కటాక్షమ్ము చూడ

చల్లనిది, కర్మకాకోలమల్లన గొను,

దేవతలకు సులభమది, దీని కాంతి

నల్లనిది, శుభకరమది, నళిననయన!

తాII  అమ్మా! మిక్కిలి చల్లనిది అనర్గల కర్మపాకమను విషమును హరించునది దేవతలకు సులభమైనదియు నైన నీ చూపు అమృతమే కాని నీ యీ చూపు నల్లనిది. 


101. శ్లోII  పాతేన లోచనరుచే స్తవ కామకోటి 

పోతేన పాతక పయోధి భయాతురాణామ్‌ 

పూతేన తేన నవ కాంచన కుండలాంశు 

వీతేన శీతలయ భూధర కన్యకే మామ్‌. 

చంII  వరద! హిమాద్రికన్య! గుణవర్ధన సన్నుత నీ కటాక్షముల్

తరియమిఁ బాపసాగర నితాంతభయాతురులైనవారికిన్

నిరుపమ పోతమౌను, నవనిర్మల కాంచనకుండలాంశువుల్,

కరుణను నాపయిన్ గురిసి కావుము నన్నిక కంచి వాసినీ!

తాII  పర్వత సుతవైన యో కామాక్షి దేవీ! నీ దృష్టి పాతము పాపసముద్ర భయాతురులకు పోతము. నవకాంచనకుండలాంశు సముపేతము. అట్టి నీ దృష్టి పాతము చేత నన్ను జల్లబఱుపుము. 

కటాక్ష శతకం సర్వం సంపూర్ణమ్.

18 – 01 – 2024.

స్వస్తి.

II3. స్తుతి శతకం II

మూకపంచశతి (మూకకవి ప్రణీతము) 

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.



శ్లోII  పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయన్తే గిరాం

వైరించాన్యపి గుంఫనాని విగళద్గర్వాణి శర్వాణి తే

స్తోతుం త్వాం పరిఫుల్ల నీలనళినశ్యామాక్షి కామాక్షి మాం

వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్పాద సేవాదరః II 1 II

తే.గీ.II  ఫుల్లనీలోత్పలాక్షి! శంభుని ప్రియసతి!

బ్రహ్మ పలుకె నిన్ నుతి చేయ వలను కాక

వీడె గర్వంబు, నిన్ను సేవించు నాకుఁ

కోర్కె నిన్ గీర్తనము చేయఁ గొలిపె మతిని.

తాII ఓ కామాక్షీ! నిండుగా వికసించిన నీలి కమలం వంటి ముదురు నీలి కన్నులు కలిగిన శివుని భార్యా ! దేవతలలో గొప్పది, పదాల వాడుకలో ప్రావీణ్యం, బ్రహ్మ యొక్క పాండిత్యమైన పదాలు కూడా అహంకారం కోల్పోయే నీ మహిమలను స్తుతించడంలో సహాయపడదు ( వారుమిమ్మల్ని స్తుతించడానికి సరిపోవు కాబట్టి). అయినప్పటికీ, మీకు సేవ చేయాలనే నా తీవ్రమైన కోరిక మరియు మీ పాదాలను ఆరాధించాలనే కోరిక నన్ను ఉచ్చారణగా మరియు మీ స్తోత్రంలో కీర్తనలు పాడమని ప్రేరేపిస్తుంది.

శ్లోII  తాపింఛ స్తబకత్విషే తనుభ్రుతాం  దారిద్ర్యముద్రాద్విషే

సంసారాఖ్య తమోముషే పురరిపోర్ వామాంకసీమాజుషే

కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే

విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరంజ్యోతిషే II 2 II

తే.గీ.II  నుత తమాల పుష్ప వర శోభితయు, కంప

తీరమున విహరించునదియును, కవుల

నాల్క నుండు, జగద్రక్షణ నొనరించు,

శివుని కెడమ దేహంబైన శివకు నతులు.

తాII తమాల పుష్పంలా ప్రకాశవంతంగా ఉండేటువంటి, ప్రజల పేదరికాన్ని పారద్రోలేటువంటి,  సంసారమనే అంధకారాన్ని పారద్రోలుతూ ఉండేటువంటి , కంపా తీరమునవిహరించేటువంటి, కవుల నాలుక గుడిసెలో ఉండేటువంటి, మరియు ఇది అన్ని లోకాలను రక్షించేటువంటి పరమశివుని ఎడమ అర్ధభాగాన్ని పంచుకునే  ఆ పరమ తేజస్సగు కామాక్షికి ఎల్లప్పుడూ నా ప్రణామాలు. 

శ్లోII  యే సంధ్యారుణయంతి శంకరజటా కాంతార చంద్రార్భకం

సిందూరంతి చ యే పురందర వధూ సీమంత సీమాంతరే

పుణ్యమ్ యే పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమీ

పాయాసుః పరమేశ్వర ప్రణయినీ పాదోద్భవాః పాంసవః II 3 II

తే.గీ.II  శివ జటాటవీ శశి నెఱ్ఱఁ జేయునట్టి,

శచికి పాటల సిందురచ్ఛవిగ నమరు,

నతుల పుణ్యముల్ పండించు నుత భవాని

యొక్క పదధూళి నన్ గాచు చక్కగాను.

తాII అమ్మవారి పాద పరాగములు శివుని జడల అడవిలోని బాలచంద్రుని సంధ్యారుణునిగా నొనరించుచున్నవి. శచీదేవి పాపటలో సిందూరములగు చున్నవి. సేవించువారి పున్నెమును పండించుచున్నవి. అట్టి ఆ పాదరేణువులు నన్ను కాపాడుగాక!

శ్లోII  కామాడంబర పూరయా శశిరుచా కమ్రస్మితానాం త్విషా

కామారేరనురాగ సింధుమధికం కల్లోలితం తన్వతీ                                                                                                                                                                                                 కామాక్షీతి సమస్త సజ్జననుతా కళ్యాణదాత్రీ నృణామ్

కారుణ్యాకులమానసా భగవతీ కంపాతటే జృంభతే II 4 II

తే.గీ.II  కామ డంబంబుతోఁ జంద్రకాంతి నొప్పు

తెల్లనౌ చిఱునవ్వుతోఁ ద్రినయనునినె

రాగ సంద్రానఁ గలచిన రమణి యనుచు

నుత జనని కంపదరి జృంభ గతిని యొప్పె. 

తాII కామాడంబరముతో చంద్రకాంతి గల తెల్లని తన చిఱునవ్వుతో శివుని అనురాగసముద్రమును కల్లోలిత మొనర్చుచున్న కామాక్షి యని సర్వజనులచే నుతింపబడిన, దయతో నుప్పొంగిన మనస్సుగల భగవతి కమ్పాతీరమున విజృంభించుచున్నది.

09 – 3 – 2024.

శ్లోII  కామాక్షీణ పరాక్రమ ప్రకటనం సంభావయన్తీ దృశా

శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాలితాశాంతరా

వామాక్షీ జన మౌళి భూషణ మణిః వాచాం పరా దేవతా

కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే II 5 II

సీII  కమనీయ దృష్టితోఁ గాముని ప్రకటించుచున్నట్టి ప్రతిభతో నొప్పుచుండి,

చక్కఁగా భావింప సంపూర్ణమైనట్టి యౌవనమధ్యస్థ యగుచునొప్పి,

క్షీర సహోదర స్మిత రుచి నలరారి ప్రక్షాళితాశాంత భాగికగుచు,

పూబోడి జన మౌళి భూషణమణిగ తా వర్ధిల్లుచున్నట్టి భాగ్యరాశి,

తే.గీ.II  వాక్ పరా దేవతామూర్తి భవ్యతేజ

దివ్య కామక్షి యనఁబడు దీపశిఖయె

కరుణ రూపంబు గొన్న ప్రకాశమొకటి

కంప తీరాన నుండెను సొంపు మీర.

తాII తనచూపుతో కాముని పరాక్రమమును ప్రకటించుచున్న, యౌవన మధ్యస్థయై తన చిఱునవ్వుచే దిక్కుల మధ్యభాగమున తెల్లబఱచుచు, స్త్రీలలో తలమానికమై, వాక్కులకందని దేవతయై, కమ్పానదీ తీరమున కామాక్షియను పేర ఒకానొక కరుణ ప్రకాశించుచున్నది.

శ్లోII  శ్యామా కాచన చంద్రికా త్రిభువనే పుణ్యాత్మనామాననే

సీమా శూన్య కవిత్వ వర్ష జననీ యా కాపి కాదంబినీ

మారారాతి మనోవిమోహన విధౌ కాచిత్థమః కందలీ

కామాక్ష్యాః కరుణా కటాక్ష లహరీ కామాయ మే కల్పతాం II 6 II

సీII  మూడులోకములందు పూర్ణమౌ శ్యామలంబౌనొక చంద్రిక జ్ఞానకల్ప,

పుణ్యాత్ములగువారి మోములనెనలేని మేల్కవిత్వముఁ గొల్పు మేఘమొకటి,

మరువైరి మనసున మరులు గొనుటయను పనియందు కామాక్షి ప్రబలమైన

కటిక చీకటి మొల్క కరుణాకటాక్ష సత్కమనీయ ధార నా కామకల్ప

తే.గీ.II  నమును గావించుగాక సద్ఘనతరముగ

నమ్మపాదాలపై నాకు నమ్మకంబు

పెంచఁ గోరెడి నాకోర్కె నెంచి, జనని

కోర్కెతీర్పఁగ నే నెంచి కోరుచుంటి.

తాII మూడు లోకములందు నల్లని ఒకానొక వెన్నెల పుణ్యాత్ముల యొక్క ముఖములందు హద్దులేని కవిత్వవర్షమును కలిగించును.  ఏదో ఒకానొక మేఘమాల శివుని మనస్సును మోహించుట అను కర్మయందు కామాక్షీదేవియొక్క కడగంటి దయాప్రవాహము ఒకానొక చీకటి మొలక.  అది నాయొక్క కామము కొఱకు పూనుకొను గాక!

శ్లోII  ప్రౌఢధ్వాంత కదంబకే కుముదినీ పుణ్యాంకురం దర్శయన్ 

జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్

కాలిందీ లహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం

కశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః II 7 II

సీ.  చిమ్మ చీకటి గుమిన్ జిఱుజాబిలిన్ జూపుచున్నట్టి కచభర శోభితాంబ,

వెన్నెలలోఁ గూడ, మన్ననన్ జక్రవాకపుజంటఁ గలిపెడి ఘన కుచభర,

నభమున కాళింది నవ లహరీ  దశ కనబడఁ జేయు నూగారు కలిత, 

కాంచీపురంబందు కమనీయ శశిమౌళి కన్నులపడువై ఘనతరముగ

తే.గీ.II వర్ధిలుచు నుండె కామాక్షి, సార్థకముగఁ

జేయ సేవించు సుజనుల జీవనములు,

భక్తితోఁ గొల్తు నాకున్న శక్తి మీర

నాదు జనయిత్రిపాదముల్ నయభయముల.

తాII చీకట్ల గుంపులో చిఱుజాబిల్లి మొలకను చూపుచు, వెన్నెలలో గూడ చక్రవాకముల జంటను కలుపుచు, ఆకసమున వింతగా మనోహరముగా నున్నాయని ప్రవాహమును చూపించుచున్న శివుని కన్నుల గొప్పపండుగ సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

శ్లోII  తంద్రా హీన తమాల నీల సుషమైః తారుణ్య లీలాగృహైః

తారానాథ కిశోర లాంఛిత కచైః తామ్రారవిందేక్షణైః

మాతః సంశ్రయతాం మనో మనసిజ ప్రాగల్భ్య నాడిన్ధమైః

కంపాతీరచరైః ఘనస్తనభరైః పుణ్యాంకురైః శాంకరైః II 8 II

సీII  నిస్తంద్ర సు తమాలనీలంపు ప్రభలతో తారుణ్య లీలా నిధాన గృహము,

శ్రీ చంద్రరేఖ లాంఛితమైన మహనీయ కచభారయుత దివ్య కమలవదన

తామ్రారవింద సత్తరళాయతేక్షణ కవులపాలిటి గొప్ప కల్పభూజ,

మరుని విజృంభణ కిరవైనపెన్నిధి, కంపసమీపన కదలు ముగుద,

తే.గీ.II  ఘనపు స్తనభర కామాక్షి కరుణతోడ

నిరుపమంబైన నాసేవ నిరతమంది,

మదిని వసియించు తాను నా మనసునెన్ని

సత్కరించుత శోభిల్ల సముచితముగ.

తాII అమ్మవారు శివుని పుణ్యముల మొలక. అది తమాలనీలము. తారుణ్యలీలా గృహము. చంద్రకిశోరచిహ్నిత కచము. ఎఱ్ఱని కమలముల వంటి నేత్రములు కలిగినట్టిది. మన్మథుని విజృంభణమునకు హేతువైనట్టిది. కమ్పాతీరమున చరించునట్టిది. గొప్ప స్తనముల బరువు గలిగినట్టిది. అది నా మనస్సును సత్కరించుగాక!

శ్లోII  నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షావిధిం పుష్ణతీ

తేజస్సంచయపాటవేన కిరణాన్ ఉష్ణర్ ద్యుతేర్ముష్ణతీ

కాంచీమధ్యగతాపి దీప్తిజననీ విశ్వాంతరే జృంభతే

కాచిచ్చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా II 9 II

సీII  నిశ్చలయయ్యు తా నిరతంబు మరుతాళి రక్షించి పోషించు రమ్యవదన,

తనకాంతిపుంజంపు దార్ఢ్యంబుచేతను సూర్యుని కిరణముల్ చూరగొనును,

కాంచీపురముమధ్య కలదయ్యు నెప్పుడున్ విశ్వంబునకు గొప్ప వెలుగులిచ్చు, 

తమసాంధమున్ బాపు ప్రమిదనొప్పెడి దివ్వె, చిత్రంబుగానిట చెలగుచుండె,

తే.గీ.II  కంచి కామాక్షి మాయమ్మ కమలనయన,

దివ్య సుజ్ఞాన సజ్జ్యోతి, భవ్యమైన

జ్ఞానసంపత్తి కలిగించి కాచునన్ను,

వందనమ్ములు చేసి నే వరలుచుందు.

తాII సహజముగ దాను నిశ్చలమయ్యు మరుత్తులకు రక్షణకల్పించునది. మరుత్తులు దేవతలు, (శ్లేష) వాయువులు. తన కాంతిపుంజముయొక్క దార్థ్యము చే సూర్యునికిరణములను హరించునది. కాంచీమధ్యవర్తిని యయ్యు (నడుమున నొడ్డాణ ముగలదియని -- (శ్లేష) సకలవిశ్వాంతరమునందు తలచిన మాత్రమున తమంబును = చీకటిని (శ్లేష) అజ్ఞానమును ఆర్పెడి ఒకానొక చిత్రమైన దీపము విజృంభించుచున్నది.

శ్లోII  కాంతైః కేశ రుచాం చయైర్ భ్రమరితం మందస్మితైః పుష్పితం

కాంత్యా పల్లవితం పదాంబురుహ యోః నేత్రత్విషా పత్రితం

కంపాతీర వనాంతరం విదధతీ కళ్యాణ జన్మస్థలీ

కాంచీమధ్య మహామణిర్విజయతే కాచిత్ కృపా కందలీ II 10 II

సీII  తనరెడి నల్లని తలకట్టు చేతను భ్రమరితంబయియుండి ప్రముదమొప్ప

పాదపద్మప్రభాపల్లవయుక్తమై కరుణాంతరంగ ప్రఖ్యాతినొప్పి,

నేత్రకాంతులచేత నిరుపమానంబుగ పత్రితయైయొప్పి పరవశించి,

మందహాసద్యుతినందిన పుష్టితో సకలమౌ కల్యాణ సన్నిధగుచు,

తే.గీ.II  కంప తీరంబునను తులకింపుతోడ

నొక్క కృపయను చిఱు మొల్క యొప్పియుండి

భక్తపాళికి శుభదయై రక్తినొప్పె

నట్టి కామాక్షి జనని కే నంజలింతు.

తాII నల్లని తలకట్టుచే భ్రమరితమై (తుమ్మెదలు ముసిరినదై) పాదకమల ప్రభలచే బల్లవితమై (చిగిర్చినదై) నేత్రకాంతులచే బత్రితయై (మారాకు పెట్టినదై) మందహా సద్యుతులచే పుష్టి నందినదై సకలకల్యాణములకు నిధానమై కంపాతీరమునం దులకించు నొక కృపయను చిఱుమొలక సర్వోన్నతిం దనరుచున్నది.


శ్లోII  రాకాచంద్ర సమానకాంతి వదనా నాకాధి రాజస్తుతా

మూకానామపి కుర్వతీ సురధనీ నీకాశ వాగ్వైభవం

శ్రీ కాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం

ఏకా పుణ్య పరంపరా పశుపతేరాకారిణీరాజతే II 11 II

తే.గీ.II  పూర్ణిమాచంద్రవదనయై ముద్దులొలుకు,

నగణితంబుగ శచియె యూడిగము చేయ,

మూగకున్ గవితాపగ స్ఫురణఁ గొలుపు

శివుని భాగ్యంబు కంచిలో చెలగుచుండె.

తాII పౌర్ణమి చంద్రునివంటి ముద్దుమోము గలదై, దేవేంద్రలక్ష్మి తన కూడిగము సేయ, మూగవారికిగూడ మందాకినీ ప్రవాహమధురమగు కవితా విలాస స్ఫురణము నల వరించుచు, నేకామ్రనాధుల భాగ్యమొకటి కాంచీపురమునందు సకలదుః ఖాపహారియై విహరించుచున్నది.

శ్లోII  జాతా శీతల శైలతః సుకృతినాం దృశ్యా పరం దేహినాం

లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాపవిచ్ఛేదినీ

ఆశ్చర్యం బహు ఖేలనం వితనుతే నైశ్చల్యమాబిభ్రతీ

కంపాయాస్తటసీమ్ని కాపి తటినీ కారుణ్య పాథోమయీ II 12 II

చంII  హిమగిరి పుత్రియై, తన నహీపు భక్తిని దల్చినంతనే

ప్రముదముతోడఁ గన్బడుచు, భక్తిగ సంస్మరణంబు చేయ మో

క్షము నిడి తాపముల్ డులిపి, కంచిని గంప సమీపమందునన్

సముచితరీతి యాడెడు ప్రశస్తదయామృతధార యొప్పెనే.

తాII హిమగిరికిం బుట్టి, పుణ్యాత్ములకు మాత్రము అనుకొన్నక్షణములో దర్శన మిచ్చుచు, క్షణకాలము సంస్మరించినంతనే తాపత్రయము నున్మూలించుచు, గాంచీపురమునందు సుస్థిర స్థితిం గనియు గంపాతీరము నందుల్లాస ఖేలనము సేయుచు నొక దయా రసామృత తరంగిణి జాల్వారుచున్నది.

శ్లోII  ఐక్యం ఏన విరచ్యతే హరతనౌ దంభావపుంభావుకే 

రేఖా యత్కచసీమ్ని శేఖర దశాం నైశాకరీ గాహతే

ఔన్నత్యం ముహురేతి యేన స మహాన్మేనా సఖః సానుమాన్

కంపాతీర విహారిణా సశరణాః తేనైవ ధామ్నా వయం II 13 II

శాII  తానేశక్తి, త్రిశూలి, దేహమునకున్ దంభావపుంభావమున్

లోనన్ వెల్గి సమైక్యతన్ గొలిపె, నే లోకేశ్వ రా జాబిలిన్

తానే దాల్చె, హిమాద్రి కీర్తి నిట నే తన్వంగి పెంచెన్, సదా

జ్ఞానోద్భాసిత కంపవాసియగునా కామాక్షి మా దిక్కగున్.

తాII జాబిల్లిరేఖ శిరమునం దూగ మేనాభర్తయైన హిమగిరి సార్వభౌమునికి బర మోన్నతి గూర్చుచు కంపాతీరమందు నవయౌవనముతో విహరించు నొక సొగసుచేత మేము దిక్కుగలవార మైనారము.

శ్లోII  అక్ష్ణోశ్చ స్తనయోః శ్రియా శ్రవణయోః బాహ్వోశ్చ మూలం స్పృశన్ 

ఉత్తంసేన ముఖేన చ ప్రతిదినం ద్రుహ్యన్పయోజన్మనే

మాధుర్యేణ గిరాం గతేన మృదునా హంసాంగనాం హ్రేపయన్

కాంచీసీమ్ని చకాస్తి కో೭పి కవితా సంతాన బీజాంకురః II 14 II

సీII  కమనీయమైన సత్ కవితా సుకల్పక బీజాంకురంబగు వేల్పులమ్మ,

ఆకర్ణవిశ్రాంతమగుకనుదోయితో నలరారుచున్నట్టి యనుపమాద్య,

బాహుమూలలునొక్కు బరువైన పాలిండ్లతోనొప్పు చున్నట్టి తోయజాక్షి,

శిరముననున్నశశిని, ముఖములనొప్పు కాంతిచేక్రిందైన కమలయుతయు,

తే.గీ.II  నడక మాటల సొంపుచే  నతముఖముగ

హంసలను చేసి యలరెడి యనుపమాంగి,

కాంచి పురమున విలసిల్లె కరుణఁ జూప

కంచి కామాక్షి, మదిలోన కలుగు జనని.

తాII కవితాకల్పవృక్షమునకు మూలమైన లేత మొలకయై, నేత్రప్రభ కర్ణమూలములను, కుచద్యుతి బాహుమూలములను నారయగా, మొగమును కిరీటచంద్రుఁడును పద్మకాంతులను ద్రోసిరాజనగా, మాటల సొంపుచే నడకల యింపుచే రాజహంసికి సిగ్గు కల్పించుచు, నొక పొలుపు కాంచీపురమున విలసిల్లుచున్నది.

శ్లోII  ఖండం చాంద్రమసం వతంసమనిశం కాంచీపురే ఖేలనం

కాలాయశ్ఛవితస్కరీం తనురుచిం కర్ణేజపే లోచనే

తారుణ్యోష్మనఖంపచం స్తనభరం జంఘా స్పృశం కుంతలం

భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే II 15 II

సీII  శీర్షభాగమునందు చిఱు చంద్రరేఖతో ననుపమానంబుగా నలరు జనని,

వినుతదేహపుకాంతి యినుమునే నిరసింప వినుతులు గన్నట్టి విశ్వతేజ,

కర్ణాంతమున్ గల్గు కన్నుల సొగసుతో జగతిని కాచెడి జయనిధాన,

తరుణవయసుచేత తనరు నఖంపచ స్థనభరముననొప్పు శంభురాణి,

తే.గీ.II  జంఘములఁ ద్రాకు వేణితో చక్కనొప్పి

యున్న కామాక్షి యనుభాగ్యమెన్నడబ్బు

నాకునీజన్మలోననే శ్రీకరముగ,

కలుగఁ జేయుము మాయమ్మ! కనికరమున.

తాII శిరమునం జంద్రరేఖ తూగగా, శరీరకాంతి ఇనుముయొక్క కాంతిని నిరసింపగా, కనులు చెవిలో రహస్యము తెలుపగా (ఆకర్ణాంతములనుట) ' ఎలప్రాయంపు వెచ్చదన మున గోరు వెచ్చనయి పాలిండ్లు కులుకగా, జంఘాలము (పిక్కలందాకునది) అయి తలకట్టు విలసిల్లగా, ఆచార్యకృపాలబ్ధమయి యుండెడి యా కామాక్షి యనెది భాగ్యము మాకుం బ్రీతి చేకూర్చు టెన్నడో కదా !

శ్లోII  తన్వానం నిజకేళి సౌధసరణిం నైసర్గికీణాం గిరాం

కేదారం కవిమల్లసూక్తిలహరీ సస్యశ్రియాం శాశ్వతం

అంహోవంచనచంచు కించన భజే కాంచీపురీ మండనం

పర్యాయ చ్ఛవి పాకశాసన మణేః పౌష్పేషవం పౌరుషం II 16 II

మII  శ్రుతులే శాంభవి గేళిసౌధసరణిన్ శోభిల్ల వర్ధిల్లుచున్,

సతమున్ సత్కవి సూక్తిసస్యరమకున్ సంస్తుత్య కేదారమై,

క్షితి పాపంబులఁ బాపు నేర్పరియునౌ, శ్రీకంచికా భూషయౌ, 

స్తుతుఁడౌ మన్మథగర్వ, నీలమణియౌ శోభన్ సదా కొల్చెదన్.

తాII శ్రుతికాంతారత్నములు కేళీవిహారము సేయు సౌధములందు (వేదాంతములంద నుట) శోభిల్లి కవుల వాగ్రూప సస్యములు పండుటకు పంటపొలమై, పాపహరమై పుష్పేషుని (మన్మధుని) మగతనమెల్ల రూపెత్తినదై, కాంచీనగరాలంకారమై, యింద్రనీ లమణితున్కవంటి నెమ్మేనిచాయగల యొక శాశ్వతసౌందర్యము నారాధించెదను.

శ్లోII  ఆలోకే ముఖపంకజే చ దధతీ సౌధాకరీం చాతురీం

చూడాలంక్రియమాణ పంకజ వనీ వైరాగమ ప్రక్రియా

ముగ్ధస్మేర ముఖీ ఘనస్తనతటీ మూర్ఛాల మధ్యాంచితా

కాంచీసీమని కామినీ విజయతే కాచిజ్జగన్మోహినీ II 17 II

సీ. పద్మముఖంబున, వాలుచూపులలోన, నెలరాజు నైపుణినలరుచుండి,

శిగలోన నొప్పుగఁ జేర్చబడెడి చంద్ర రేఖ సత్ప్రక్రియఁ బ్రీతిఁ గలిగి,

చిఱునవ్వులొలికించు సిరులొల్కు ముఖముతో, శ్రీకరంబుగ సృష్టిఁ జెలగుచుండి,

ఘనమైన స్తనభారమున కృశింసచిన కౌను నందంబుగా నొప్పు సుందరాంగి,

తే.గీ.II  కంచిపురమున తొనికెడి కనికరమున

ననుపమాన సర్వోత్కృష్టమైనదగుచు

శ్రీజగన్మోహినొక్కతె చెలఁగుచుండె.

కంచి కామాక్షి యాతల్లి ఘన సుచరిత.

తాII చూపునందు, వదనకమలమునందును, చంద్రునికి సంబంధించిన నైపుణిని ధరించునదియైన,  కొప్పునందు అలంకరింపబడుచున్న కమల వన వైరముల ప్రక్రియ గల, చక్కని చిఱునవ్వు మోముగల, గొప్ప స్తనభారముచే చిక్కిన నడుముతో నొప్పిన జగన్మోహినియైన  ఒకానొక కామిని కాంచిసీమయందు  సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

శ్లోII  యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేపి మందస్మిత

జ్యోత్స్నాసంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహో దేహినం

ద్రాక్షామాక్షికమాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ

కామాక్షి స్వయమాతనోత్యభిసృతిం వామేక్షణేవ క్షణం II 18 II

తే.గీ.II  నీదు చిఱునవ్వువెన్నెల నీటమున్గి

నీదు చూపను రా త్రేరిమీద పడునొ

విమతి యైనను వాగ్ఝరి వెంబడించు

తేనె ద్రాక్షలన్ మీరెడి తీపినొప్పి.

తాII ఓ కామాక్షీ! ఎవరికి నీ కటాక్షమనెడి పూర్ణిమారాత్రి నీ చిఱునవ్వనెడి వెన్నెలయేట స్నానమాడి నిత్యాభిముఖియగునో అతఁడు ఎంత మందమతియైనను వానింగూర్చి ద్రాక్షారసము యొక్కయు, తేనె యొక్కయు గర్వమునకు సిగ్గుగూర్చెడి రీతిని అభిసారికానాయికవోలె విచిత్రవాగ్వైఖరి యభిసరించును.

శ్లోII  కాలిందీ జలకాంతయః స్మితరుచి స్వర్వాహినీ పాథసి

ప్రౌఢధ్వాంతరుచః స్ఫుటాధరమహో లౌహిత్య సంధ్యోదయే

మాణిక్యోపల కుండలాంశు శిఖినీ వ్యామిశ్రధూమశ్రియః

కళ్యాణైకభువః కటాక్షసుషమాః కామాక్షి రాజంతి తే II 19 II

ఉII  నీ కడగంటి కాంతులవి నీ చిఱునవ్వులగంగలోపలన్

శ్రీకరమైన యా యమున చిందెడి కాంతిగ, నీ స్ఫుటాధర

శ్రీకమనీయమౌ యరుణ చిద్ఘనసంధ్యను కాఱుచీకటై,

సోకగ కుండల ప్రభలు, శోభిలె నాపొగకాంతినమ్మరో.

తాII ఓ కామాక్షీ! చిఱునవ్వనెడి దేవనదిలో (పాల వంటి గంగలో) యమున జలప్రభలయి, పెదవి పై గులుకు నెఱ్ఱనికాంతియనెడి సంధ్యారాగమందు కాఱుచీకటులయి, మణికుండలములనెడి అగ్ని శిఖయందు నెలకొను ధూమరేఖలై నీ కాటుకకంటికొనకాంతులు కల్యాణకరంబు లగుచున్నవి.

నీ చిరునవ్వు యొక్క ప్రకాశానికి ప్రాతినిధ్యం వహించే ఆకాశ గంగ యొక్క పాల తెల్లని నీటిలో యమునువాచీకటి జలాలను పోలి ఉంటుంది, ఇది అన్ని శుభాల సారవంతమైన నేల అయిన మీ ప్రక్క చూపుల ప్రకాశం. ఇది మీ పెదవుల ఎరుపు రంగుతో సూచించబడే  సాయంత్రం సంధ్యా సమయంలో ( సంధ్య ,సూర్యాస్తమయం) దట్టమైన చీకటిని కూడా పోలి ఉంటుంది. ఇది మీ మాణిక్య చెవి-గోళాల ప్రకాశాన్ని సూచించే అగ్ని నుండి వచ్చే పొగ లాంటిది .  

శ్లోII  కలకల రణత్ కాంచీ కాంచీవిభూషణ మాలికా

కచభర లసచ్చంద్రా చంద్రావతంస సధర్మిణీ

కవికులగిరః శ్రావం శ్రావం మిలత్ పులకాంకురా

విరచిత శిరః కంపా కంపాతటే పరిశోభతే (జగదంబికా) II 20 II

సీII  కలకల ధ్వనిఁజేయు కనకవడ్డాణంబు ధరియించియున్నట్టి దక్ష కన్య 

కంచికే తానలంకారంబుగానిల్చి, చంద్రవంకను సిగన్ జక్కఁ దాల్చి,

చంద్రశేఖరునితో సరియై ప్రకాశించు ధార్మికమూర్తియై ధరను నిలిచి,

కవుల సద్రచనలన్ జక్కగా వినుచుండి తలయూపినుతియించు పులకరించి,

తే.గీ.II  కంప తీరాన వెలసె తానింపుమీర,

శివుని యర్థాంగగౌరిగా చెలువు మీర,

నట్టికామక్షి పాదముల్ పట్టి విడువ

జన్మరాహిత్యమందగ చక్కగాను.

తాII కలకల మ్రోయు వడ్డాణము గల కాంచీ నగరమునకు అలంకార మాలయైన కేశపాశమున ప్రకాశించు చంద్రకల గల, చంద్రకలాశేఖరుడైన శివునితో సమాన ధర్మము గల, కవుల సమూహముయొక్క వాక్కులను వినుచు వినుచు పులకించిపోవుచు శిరః కమ్పము చేయు అమ్మవారు కమ్పానదీతీరమున విలసిల్లుచున్నది.


శ్లోII  సరసవచసాం వీచీ నీచీ భవన్మధుమాధురీ 

భరిత భువనా కీర్తిః మూర్తిర్మనోభవజిత్వరీ

జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే

కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితం II 21 II

తే.గీ.II  తేనె లొలికెడి వాగ్ఝరి, దివ్య కీర్తి,

మన్మథుని గెల్చు రూపము, మహిని సుఖము,

కోరుకొను భోగభాగ్యము, కూర్మితోడ

నమ్మచూడకెట్లబ్బును? నెమ్మదిఁ గన.

తాII తరంగించు తేనె తీపి గల సరసవాక్కు, లోకముల నిండిన కీర్తి, మన్మథునోడించు రూపు, మనసునకు తగిన భోగ్యము, మనుష్యులకు అమ్మవారి కటాక్షము సోకనిదే ఎట్లు కలుగును?

శ్లోII  భ్రమరిత సరిత్కూలో నీలోత్పల ప్రభయా భయా

నతజన తమః ఖణ్డీ తుండీరసీమ్ని విజృంభతే

అచలతపసామేకః పాకః ప్రసూన శరాసన

ప్రతిభట మనోహారీ నారీకులైక శిఖామణిః II 22 II

తే.గీ.II మహి గిరీశుని సత్తపోమహిమ జనిత,

నతుల కభయప్రదాత, యంధమునడంచు, 

స్త్రీలమేల్బంతి, కంప దరిని, ఘనుఁడగు

శివుని యర్థాంగి, కంచిలో చెలగుచుండె.

తాII స్త్రీల శిఖరాభరణం, శివుని హృదయాన్ని దోచుకున్నది, శివుని అచంచలమైన తపస్సుల ఫలం,ఆమె పాదాలకు నమస్కరించే వారి భయాన్ని పోగొట్టే కామాక్షి దేవి కంపా ఒడ్డున ప్రకాశిస్తుంది.నీలి తామరపువ్వువంటి ముదురు నీలం తేజస్సుతో తేనెటీగలు నివసించినట్లుగా కనిపిస్తాయి .

శ్లోII  మధుర వచసో మందస్మేరా మతంగ జగామినః

తరుణిమ జుషస్తాపింఛాభాః తమః పరిపంథినః

కుచభరనతాః కుర్యుర్భద్రం కురంగవిలోచనాః

కలితకరుణాః కాంచీభాజః కపాలిమహోత్సవాః II 23 II

సీII  మధురవాఙ్నిధియును, మందస్మితోదంచిత ముఖియు, జగతిలో ప్రముఖయుఁ గన,

మదగజగమనయు, మహనీయ యౌవనవతియును, ఘన శుభమతియు తలప,

తాపింజపూవులన్ దలదన్ను కాంతితో వరలెడి శుభగుణ భాగ్యరాశి,

వక్షోభరంబుచే వంగిన తనుమధ్య, తామసంబును బాపు ధర్మనిష్ఠ,

తే.గీ.II  నుత కురంగ నేత్ర, కరుణాన్వితగ తాను

కంచిలో వెల్గు కామాక్షి, సంచితఫల

మౌను తలప కపాలికి, ననుపమమగు

భద్రతనుగొల్పు మనలకు, పాహి యనిన.

తాII మధురమైన మాటలు, అందమైన చిరునవ్వు కలవారు, మత్తెక్కిన ఏనుగు నడకలా ఉండేవారు, యవ్వనం తాజాది , తాపింజాపువ్వులా ప్రకాశవంతంగా ఉంటుంది , ఆమె వక్షస్థల బరువుతో కొంచెం వంగి ఉంటుంది , కామాక్షి దేవి. దయతో నిండిన మరియు కంచి నివాసం ఉన్న డోయ్ కళ్ళు మాకు శుభం కలిగించు (ఆమె ద్వారా మేము ఆశీర్వదించబడాలి)

శ్లోII  కమల సుషమాకక్ష్యారోహే విచక్షణ వీక్షణాః

కుముద సుకృత క్రీడా చూడాల కుంతలబంధురాః

రుచిర రుచిభిస్తాపింఛశ్రీ ప్రపంచన చుంచవః

పురవిజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః II 24 II

తే.గీ.II  కమల కాంతులన్ మించెడి కనుల నేర్పు,

కలువరేని తా శిఖయందు కలిగినదియు,

తనువు కాంతి తమాలమున్ దాటునదియు

శివ మనోహారి, కంచిలో చెలఁగుచుండె.

తాII కమలములశోభ పై తరగతి కెక్కుటయందు విచక్షణతగన్న చూపులుగలవి. కలు వల పుణ్యక్రీడ అయిన చంద్రుని శిరోభూషణముగాగల కురులుగలవి. నిజ కాంతిచే తాపింఛకుసుమశోభను విస్తరింపజేయు నేర్పుగలవియు నగు పరమశివుని మనోరధములు (కామాక్షియనుట) కంపాతీరమునందు చరించుచున్నవి.

శ్లోII  కలితరతయః కాంచీలీలా విధౌ కవిమండలీ

వచన లహరీ వాసంతీనాం వసంత విభూతయః

కుశలవిధయే భూయాసుర్మే కురంగవిలోచనాః

కుసుమ విశిఖా రాతేరక్ష్ణాం కుతూహల విభ్రమాః II 25 II

తే.గీ.II  కంచి సంచార కౌతుక, కవుల శ్రేణి

వచన లహరి వాసంతికి వర వసంత

సంపద, మృగేక్షణయు, కామ శత్రువునకు

కనులపండుగ, తీర్చుత కామితములు.

తాII కాంచీవిహార కుతూహలములు, కవిశ్రేణివాష్ప్రవాహంబులనెడి వాసంతి లతలకు వసంత సంపదలు, ఆడులేడి చూపులు గలవి, కామవైరికన్నులకు వేడుకలు గొలుపునవియు నగు విలాసములు, నాకు క్షేమవిధాయకము అనుగాక !

శ్లోII  కబలిత తమస్కాండాః తుండీర మండల మండనాః

సరసిజ వనీ సంతానానామ్ అరుంతుద శేఖరాః

నయన సరణేర్నేదీయంసః కదా ను భవంతి మే

తరుణ జలదశ్యామాః శంభోస్తపః  ఫలవిభ్రమాః II 26 II

తే.గీ.II  చెలఁగు తమసమ్ము నశియింపఁ జేయునట్టి,

కంచి కాభరణంబుగా క్రాలునట్టి,

చంద్రరేఖను దాల్చిన, సాంద్ర రజని,

శంకరునితపఃఫలమిడు జయము కనిన.

సీII  కబళించు భక్తుల కఠినమైయున్నట్టి యజ్ఞానతిమిరమ్ము ననుపమముగ,

కంచికేతానలంకారమై యున్నట్టి కామక్షి యనబడు కల్పవల్లి,

నెలవంకతాలుపు, సులలిత సహృదయ, సుజనులమదినుండు శోభనాంగి,

సాంద్రమేఘమువోలె శ్యామలవర్ణము కలియొప్పుచునుండు కంబుకంఠి,

తే.గీ.II  కంచి కామాక్షి యాతల్లి కాలకంఠు

తపము ఫలమది, జన్మంబు ధన్యతఁ గన

నెపుడు నే చూడనగునొ నా తపన తీర

జనని దుర్గాంబ పదములు చక్కగాను.

తాII దట్టమైన అజ్ఞాన అంధకారాన్ని కబళించే కామాక్షిని, కంచికి అలంకారంగా, నెలవంకను తలపై పెట్టుకుని, కొత్తగా ఏర్పడిన మేఘంలా చీకటిగా ఉన్న అద్భుతమైన ఫలాన్ని, శంభుని యొక్క తపస్సును, నేను ఎప్పుడు చూస్తాను?

11 – 3 – 2024.

శ్లోII  అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా

సరసిజభువో యానం మ్లానం గతేన చ మంజునా

త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతీ

తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరీ II 27 II

సీII  కామాక్షి తనముఖ కాంతితో నోడించు పద్మతేజమ్మును వరలుచుండి,

సుందరంబుగనుండి శోభిల్లు నడకతో రాయంచనడకల రహిని బాపు,

నయగారముననొప్పు నయవాగ్విభవముచే దేవతామృత దివ్య దీప్తి డించు,

ననుపమమైన మా యమ్మలో సుగుణాళి వినువారి చెవులకు ప్రణవసుధయె,

తే.గీ.II  శివునియర్థాంగి మాయమ్మ భవవిదూర,

యట్టి మాతల్లి కంచికాపట్టణమును

శ్రేషమైనట్టి దానిగా చేయుచెండె

తాను వసియించి యచ్చట జ్ఞానఖనిగ.

తాII కామాక్షీమాత మన్మథుని మొదటి బాణమయిన పద్మాన్ని దీనురాలినిగా చేసే ముఖకాంతికలది, బ్రహ్మవాహనమైన హంసను తన మెల్లని నడకలచే ఓడించేది, దేవతల ఆహారమైన అమృతాన్ని తన మాటల తీయదనంతో విస్తరింపజేసేది, అట్టి శివుని సుందరి కంపాతీరాన్ని శ్రేష్ఠమైనదానినిగా చేస్తుంది.

శ్లోII  జనని భువనే చంక్రమ్యేహం కియన్త మనేహసం

కుపురుష కర భ్రష్టైః దృష్టైర్ధనైరుదరం భరిః

తరుణ కరుణే తంద్రాశూన్యే తరంగయ లోచనే

నమతి మయి తే కించిత్ కాంచీపురీ మణిదీపికే II 28 II

సీII  చెడుబుద్ధి కలిగిన చెడువర్తనులయిన వారలిచ్చెడి సొమ్ము వడసి నేను

కడుపు నింపుకొనుచు గౌరవహీనునై బ్రతుకుటెట్టులు తల్లి? పరము లేదొ?

యెంత కాలమిటుల నీలోకమున నేను నిర్లక్ష్యవర్తినై నిలువవలయు?

కంచిలోనున్నట్టి కమనీయ మణిదీపమా! మొరలను వినుమా! యొకింత,

తే.గీ.II  బద్ధకము లేక వెలిగెడి ముద్దరాల!

దయకు మారుపేరైనట్టి జయనిధాన!

నీకు సాష్టాంగపడు నన్ను నీవు దయను

చూడు మించుక, నీవె నా తోడు జనని!

తాII ఓ తల్లీ! చెడు స్వభావాలు మరియు ప్రవర్తనకలిగిన వ్యక్తుల చేతుల్లోని కల్మషమైన డబ్బుతో నా కడుపు నింపుకుంటూ, ఈ లోకంలో ఎంతకాలం లక్ష్యం లేకుండా తిరుగుతాను . కంచి రత్నాల దీపమా! సోమరితనం లేని దయ యొక్క భాండాగారమైన నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్న నాపై నీ చూపు యొక్క చిన్న తరంగాన్ని దయచేసి మళ్లించుమమ్మా!

శ్లోII  మునిజన మనః పేటీరత్నం స్ఫురత్ కరుణానటీ

విహరణ కలాగేహం కాంచీపురీ మణి భూషణం

జగతి మహతో మోహవ్యాధేః నృణాం పరమౌషధం

పురహరదృశాం సాఫల్యం మే పురః పరి జృంభతాం II 29 II

తే.గీ.II  మునుల మదులందు వజ్రము, మోహమనెడి

రోగమునకౌషధంబును, రుద్రునకన

నేత్రపర్వంబగు, దయానటి త్రినేత్ర,

నడచునాట్యశాలయె, కనఁబడుత నాకు.

తాII ఋషుల మదిలోని వజ్రము, దయ అనే నర్తకి, విహరించే రంగస్థలము, కంచికి అలంకారము, మోహము అనే అనారోగ్యమునకు గొప్ప మందు, శివుని నేత్రములకు ధన్యత చేకూర్చేది అయిన కామాక్షి నా ముందు తనను తాను బహిర్గతం చేసుకొనుగాక.  

శ్లోII  మునిజన మనోధామ్నే ధామ్నే వచోమయ జాహ్నవీ

హిమగిరి తట ప్రాగ్భారాయ అక్షరాయ పరాత్మనే

విహరణ జుషే కాంచీదేశే మహేశ్వర లోచన

త్రితయ సరస క్రీడా సౌధాంగణాయ నమో నమః II 30 II

చంII  మునిజన మానసద్యుతికి, పూజ్య వచస్సురగంగకున్,లస

ద్ఘనహిమ సన్నగాగ్ర వరకామిత సత్ప్రదకున్, శివ త్రిలో

చనముల కాటపట్టయిన సౌధముగా గల కంచి కామకో

టిని వసియించు దేవికి, ఘటింతు ప్రణామము లార్యకున్ ధృతిన్.

తాII మునిజనుల మనస్సుకు, గంగాప్రవాహం వంటి వాక్కులకు నిలయమైనట్టిదానకు, హిమగిరి యొక్క ఉన్నత పుణ్య శిఖరమునకు; నాశరహితమైన పరమాత్మకు, కాంచీదేశమందు విహరించేది- శివుని మూడుకన్నుల సరసక్రీడలకు మేడయైనట్టిదైన కామాక్షికి నమస్సులు!


శ్లోII  మరకతరుచాం ప్రత్యాదేశం మహేశ్వర చక్షుషాం

అమృత లహరీ పూరం పారం భవాఖ్యపయోనిధేః

సుచరిత ఫలం కాంచీభాజో జనస్య పచేలిమం

హిమశిఖరిణో వంశస్యైకం వతంసముపాస్మహే II 31 II

తే.గీ.II  మరకతఛవిని పోద్రోచు, మారవైరి

కంటి కమృతము, భవమను కడలికొడ్డు,

కంచి జన పుణ్యఫలము, నగపతి భూష,

కంచి కామాక్షి, కొలుతు నే నెంచి మదిని.

తాII మరకతమణికాంతిని కాదనునది, సంసారసింధువునకొడ్డు, మహేశ్వరుని చూపుల కమృతప్రవాహంపుబుగ్గ, కాంచీవాసుల పరిపక్వపుణ్యఫలము, హిమగిరివంశమున కేకైక భూషణము నైన కామాక్షీదేవి నుపాసించెదము.

శ్లోII  ప్రణమన దినారంభే కంపానదీ సఖి తావకే 

సరస కవితోన్మేషః పూషా సతాం సముదంచితః

ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవిత్వ కుముద్వతీం

నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వరకన్యకే II 32 II

తే.గీ.II  అమ్మ! కామాక్షి! నీ దరి నెమ్మిఁ జేరు

క్షణము నుండియె ఘనతర కవనధార

పారుటను జేసి, ప్రౌఢులౌ పర సుకవుల

మోములన్ వాడఁగా జేయు ముగ్ధవమ్మ.

తాII ఓ కామాక్షీ! ఆనందముతో నీ సన్నిధిని వ్రాలిన యా మొదటి దినారంభము నందే కవితారుణోదయమైనట్లయి శత్రుకోటియొక్క వక్తృత్వముతో గూడిన కవిత్వ విలాస ప్రౌఢిరూపమైన కలువతీగ మోము ముడిచికొనునట్లు చేయగలదు.


శ్లోII  శమిత జడిమారంభా కంపాతటీ నికటేచరీ

నిహత దురితస్తోమా సోమార్ధముద్రిత కుంతలా

ఫలిత సుమనోవాంఛా పాంచాయుధీ పరదేవతా

సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందినీ II 33 II

తే.గీ.II  మాంద్యమును వాపు, చెలగుకల్మషమునడఁచు,

కంపతీరాన నుండు, శ్రీకరవిధముగ

చంద్రకళఁ దాల్చు, వేల్పులన్ జక్కఁగఁ గను,

హిమజ నా కంటఁ బడి నన్నునేలుఁ గాక.

తాII మాంద్యమునణచి, పాపపుదుడుకువాషి, కంపాతీరమునందు పసించుచు, చంద్రరేఖ సిగబంతిగా ధరించి, వేల్పులకోరికల నీడేర్చుచు, హిమగిరి సార్వభౌము పూర్వపుణ్యమును పండించుచుండెడి తల్లి, నా నయనములను సఫలము సేయుగాక !

శ్లోII  మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా

కుముద సుషమా మైత్రీ పాత్రీ వతంసిత కుంతలాం

జగతి శమిత స్తంభాం కంపానదీ నిలయామసౌ

శ్రియతి హి గలత్తంద్రా చంద్రావతంస సధర్మిణీం II 34 II

తే.గీ.II  జాడ్యమా! నన్ను పీడింపఁ జాలవీవు,

స్తబ్దతనుబాపు, శశిరేఖ ధరను, శివుని

సతిని, కంప తీర నిలయ సన్నిధాన

మాశ్రయించెను నామది యనుపమముగ.

తాII ఓ జాడ్యాతిరేకమా! నీవు నాబుద్ధి నెట్లు పీడింపగలవు. ఈ నా బుద్ధి చంద్రావతంసయగు, స్తబ్ధతను నశింపజేయు, కమ్పానదియే నిలయముగాగల, శివుని యిల్లాలిని సోమరితనము వీడి ఆశ్రయించుచున్నది గదా.

శ్లోII  పరిమళ పరీపాకోద్రేకం పయోముచి కాంచనే

శిఖరిణి పునర్ద్వైధీభావం శశిన్యరుణాతపం

అపి చ జనయన్కంబోః లక్ష్మీం అనంబుని కో ప్యసౌ

కుసుమ ధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః II 35 II

సీII  మొయిలు పుత్తడులకున్ బుట్టించు సౌరభం బమ్మ మేన్ జుత్తులనమరినటుల,

గిరిని రెండుగ చేయు నిరుపమ కానాక్షి, మహితమౌ కుచయుగ్మ, మంగళనిధి,

చంద్రునికరుణిమన్ జక్కగాదిద్దుతా నరుణతేజమునొప్పునధరజనని,

నిర్జలదేశాన నిరుపమ శంకంబుఁ గలుగునట్టులఁ జేయు కంబుకంఠి,

తే.గీ.II  అట్టి కల్యాణగుణమణి యనుపమముగ

మన్మథునిపూర్ణశక్తి యా మాన్యతేజ,

కంచిపురలోన విలసిల్లు కనకదుర్గ,

భక్తిసంపత్తి నిచ్చి నన్ వరలఁజేయు.

ఆ.వె.II  మేఘమందుమరియు మేలుపుత్తడియందు

పరిమళమ్ముఁ గొల్పు పంకజముఖి,

కొండ రెండు చేయు కుచయుగ్మ కొలుపును

చందమామకెఱుపు చక్కగాను.

తాII మేఘమందు, మేలిమిబంగారమందును పరిమళమును సంఘటింపజేసి (అనగా నల్లని జుట్టునందు పువ్వులు,) మేనియందు సుగంధమును గూర్చి, మహాగిరియందు ద్వైతమును (జంటను) గూర్చి, (అనగా గిరులంబోలు కుచములు రెండు ధరించి,) చంద్రునం దరుణప్రభను సంతరించి (అనగా ముఖమునం దెఱ్ఱని యధరమును,) నిర్జలదేశమందు శంఖమును నలవరించి (అనగా శంఖమువంటి కంఠమును పూని,) మన్మధుని పూర్ణపరాక్రమ మొకటి కాంచిలో విలసిల్లుచున్నది.

శ్లోII  పురదమయితు ర్వామోత్సంగస్థలేన రసజ్ఞయా 

సరసకవితాభాజాం కాంచీపురోదరసీమయా 

తటపరిసరై ర్నీహారాద్రే ర్వచోభి రకృత్రిమైః 

కిమిద న తులా మస్మచ్చేతో మహేశ్వరి! గాహతే II 36 II

తే.గీ.II  శివుని వామాంకమును, కంచిసీమనడిమి,

సుకవితారసజ్ఞశిఖరశోభ, పర్వ

తేశ్వరుని ఘనసౌందర్యతేజము, శ్రుతి

సార మగు నిన్ను కామాక్షి! చేరుటెట్లు?

తాII అమ్మా! శివునివామాంకము, గాంచీపురగర్భదేశము, కవితారసజ్ఞ శేఖరము, పర్వతే శ్వరుని పరమసౌందర్యము, వేదవాక్యార్థసారము, నైన పదార్థమునగు నీతో నా మన సైక్యము పొందజాల దేమమ్మా !

శ్లోII  నయన యుగళీం ఆస్మాకీనాం కదా ను ఫలేగ్రహీం 

విదధతి గతౌ వ్యాకుర్వాణా గజేంద్ర చమత్ క్రియాం 

మరకతరుచో మాహేశానా ఘనస్తన నమ్రితాః

సుకృతవిభవాః ప్రాంచః కాంచీవతంస ధురంధరాః II 37 II

తే.గీ.II  మదపుటేనుగున్ మించెడి మందగమన,

మరకతద్యుతి వెదఁజల్లు మరు రిపు సతి,

కుచ భరంబున నమ్రిత, కూర్మినొప్పు

కడుసనాతన నీ సతిన్ గాంచుటెపుడొ?

తాII మదగజముయొక్క గమననై పుణ్యమును దన నడకచే వ్యాఖ్యానించుచు కాంచీపుర శిరోభూషణములయి మరకతమణిప్రభగెల్చు శరీరముగలవై కుచభారముచే వినమ్రము లయి ఆద్యంతరహితములైన శివుని సుకృతవిశేషములు నా కన్నుల నెన్నడు సఫలము సేయునోకదా !

శ్లోII  మనసిజయశః పారంపర్యం మరందఝరీసువాం

కవికులగిరాం కందం కంపానదీ తటమండనం

మధురలలితం మత్కం చక్షుర్మనీషి మనోహరం

పురవిజయినః సర్వస్వం తత్పురస్కురుతే కదా II 38 II

తే.గీ.II  మన్మథుని కీర్తిరూపము, మధువులొలుకు

మధుర కవిసూక్తి మూలము, మాన్యమయిన

కంపకున్భూషణంబగు, ఘనులమదులు

ద్రోచు శాంభవిన్ గాంచగ వేచియుంటి. 

తాII మన్మధునికీర్తి పరంపర, పచ్చితేనియలు వాకలుగట్టు మధురకవి సూక్తులు, పల్ల వించు మూలకందము విబుధజనమనోహరము మూర్తీభవించిన శివుని పూర్వపుణ్యము నైయున్న కంపానదీతీరమణిభూషణ మొకానొకటి నా కన్నుల నటించు టెన్నడో కదా!

శ్లోII  శిథిలిత తమోలీలాం నీలారవింద విలోచనాం

దహన విలసత్ ఫాలాం శ్రీకామకోటిం ఉపాస్మహే

కరధృత సచ్ఛూలాం కాలారి చిత్తహరాం పరాం

మనసిజ కృపాలీలాం లోలాలకామలికేక్షణాం II 39 II

సీ.  తామసగుణమును తరిమివేసెడి తల్లి, నీలోత్పలాక్షి, సన్నీలవేణి,

ఫాలనేత్రంబునన్ బ్రబలెడి యగ్నితో, సత్ప్రకాశమునొప్పు సదయహృదయ,

శ్రీకామకోటిలో శ్రీకరంబుగనుండి భక్తులన్ రక్షించు భర్గురాణి,

చేతిలోశూలమున్ జెన్నారగాఁ గల్గి, శూలిమనసు దోచు శోభనాంగి,

తే.గీ.II  మన్మథుని బ్రోచినట్టి యా మాననీయ

ముంగురులశోభతోనొప్పు ముద్దుగుమ్మ,

యట్టి కామాక్షి పాదముల్ పట్టి నేను

భక్తితో నుపాసించెద భద్రతఁ గన.

తాII తమోగుణం (అజ్ఞానం) యొక్క లీలను నశింపజేయునది, నల్లకలువలవంటి కన్నులు కలది, నొసట అగ్నితో ప్రకాశించేది, శ్రీకామకోటి నివాసిని, చేతశూలాన్ని ధరించినది, యముణ్ణి జయిన శివుని మనస్సును హరించినది, మన్మథుని దయతో ప్రోచినది, కదలాడే ముంగురులుకలది, ఫాలలోచన అయిన కామాక్షీదేవిని ఉపాసిస్తాము.

శ్లోII  కలాలీలాశాలా కవికులవచః కైరవవనీ

శరజ్జ్యోత్స్నాధారా శశధరశిశు శ్లాఘ్యముకుటీ

పునీతే నః కంపాపులినతట సౌహార్దతరలా

కదా చక్షుర్మార్గం కనకగిరి ధానుష్క మహిషీ II 40 II

సీII  కాలకంఠునిసతి కళలకాటస్థలి, కంచిలో కామాక్షి కమల నయన,

కవుల మాటలనెడి కలువల తోటకు శరదిందుచంద్రిక, చల్లనమ్మ,

శోభిల్లు శశిరేఖ చూడామణిగగల మన్ననలందునాపన్నరక్ష,

కంపానదీతీర మింపని మదినెంచిస్నేహంబుతోనఁట చెలగు తల్లి,

తే.గీ.II  అట్టి మాతల్లి కన్నులకట్టునెపుడు?

కాలయాపన చేయక కదలి వచ్చి

తనను గాంచెడి కోరికన్ తానె తీర్చి

బ్రతుకు వ్యర్థము కాకుండ క్షితిని గాచు.

తాII మేరుపర్వతాన్ని విల్లుగాగల్గిన పరమశివుని పట్టపురాణి కళలకు విహారస్థలము, కవుల మాటలనే కలువలతోటలకు శరత్ కాలపు వెన్నెలప్రవాహము, బాలచంద్రుని ధరించిన కిరీటముకలది, కంపానదీతీరం పట్ల స్నేహం చేసేదీ, , అట్టి తల్లి మా కన్నులమార్గాన్ని ఎపుడు ధన్యం చేస్తుందో కదా!


శ్లోII  నమః స్తాన్నమ్రేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా

దధానేభ్యః చూడాభరణం అమృతస్యంది శిశిరం

సదా వాస్తవేభ్యః సువిధభువి కంపాఖ్యసరితే

యశో వ్యాపారేభ్యః సుకృత విభవేభ్యో రతిపతేః II 41 II

తే.గీ.II  స్తన భరంబున నమ్రిత, సదయనొప్పు,

చంద్రరేఖసద్భూషగా శిరమునొప్ప,

కంపతీరాన చెలువొందు కాలగళుని

రాణి కామాక్షి నెన్నుచు ప్రణుతులిడుదు.

తాII కుచభారగర్వముచే వినమ్రయై చల్లని అమృతము నించు శిరోభూషణముచే (చంద్రునిచే) నందముగని కంపాతీరముల నలరు శంకరుల భాగ్యసంపదలకు నా నమస్కారము.

12 – 3 – 2024.

శ్లోII  అసూయన్తీ కాచిత్ మరకతరుచో నాకిముకుటీ -

కదంబం చుంబంతీ చరణనఖ చంద్రాంశుపటలైః

తమోముద్రాం విద్రావయతు మమ కాంచీర్నిలయనా

హరోత్సంగ శ్రీమన్ మణిగృహ మహాదీపకలికా II 42 II

మII  తనుకాంతి న్మణికాంతులన్ డులుచు, పాదద్వంద్వమున్ మ్రొక్కుచున్

ప్రణతుల్ జేసెడి దేవతామకుటముల్ ప్రఖ్యాతిగాముద్దిడున్,

వినుతుండౌహరు దేహమందిరమణిద్వీపంబునన్ దీపమై

ఘనతన్వెల్గు జగత్రయీజననియౌ కామాక్షి జ్ఞానంబిడున్.(నన్ బ్రోచుతన్.)

తాII తన శరీరకాంతితో మరకతమణికాంతులను అసూయపడజేసేది, కాలిగోటిచంద్రకాంతులతో దేవతాకిరీటసమూహాన్ని ముద్దిడుకొనేది, శివుని ఒడి అనే మణిగృహంలోని గొప్పదీపపుమొలక, కాంచీ నివాసిని- అయిన కామాక్షి నాలోని అజ్ఞానస్థితికి పారద్రోలుగాక!

శ్లోII  అనాద్యంతా కాచిత్ సుజన నయనానందజననీ

నిరుంధానా కాంతిం నిజరుచి విలాసైర్జలముచాం

స్మరారేః తారల్యం మనసి జనయన్తీ స్వయమహో

గలత్కంపా శంపా పరిలసతి కంపాపరిసరే II 43 II

సీII  ఆద్యంతములు లేని యపురూప దేవత, కన్నులపండువై కలుగు తల్లి,

తన దేహ కాంతితోఁ దల్లడిల్లఁగఁ జేయు నీలి మేఘరుచుల నీలవేణి,

మనసిజవైరికే మది చంచలింపగా యెదదోచి చేసెడి మృదులదేహ,

శంపా సమీపాన సొంపుగా కనిపించు సన్నుతుల్ గొనునట్టి సరసిజాక్షి

తే.గీ.II  దివ్యతేజంబుతో నొక్క దేవపూజ్య

కంపమన్నది లేనట్టి కరుణ కాంతి

భక్తపాళిని బ్రోవగా వరలుచుండె,

కంచి కామాక్షి యాతల్లి, కాచు నన్ను.

తాII కంప ఒడ్డున మెరుపులా మెరుస్తున్నకామాక్షి దేవి ఆది అంతం లేనిది, మంచివారి హృదయాలను ఆహ్లాదపరుస్తుంది, తన చీకటి తేజస్సుతో మేఘాలను అధిగమిస్తుంది, శివుని హృదయాన్ని మృదువుగా చేస్తుంది.

శ్లోII  సుధాడిండీరశ్రీః స్మితరుచిషు తుండీర విషయం

పరిష్కుర్వాణాసౌ పరిహసిత నీలోత్పలరుచిః

స్తనాభ్యాం ఆనమ్రా స్తబకయతు మే కాంక్షితతరుం

దృశామైశానీనాం సుకృత ఫల పాండిత్య గరిమా II 44 II

తే.గీ.II స్త్యేనఫేనమున్ బోలెడి చిఱునగవును,

దివ్యనీలోత్పలము గెల్చు దేహకాంతి,

కుచ భరంబున వంగిన కోమలాంగి

భవుని కనువెల్గు నా కోర్కె వరలఁ జేయు.

తాII అమృతంలా మధురమైన చిరునవ్వు, ముదురు నీలిరంగు తేజస్సుతో నీలపువ్వును వెక్కిరించేది, స్తనభారానికి వంగి, శివుని నేత్రాలచేత చేసినపుణ్యఫలం కామాక్షీ దేవి నా కోరికలు తీర్చుగాక.

శ్లోII  కృపాధారా ద్రోణీ కృపణధిషణానాం ప్రణమతాం

నిహంత్రీ సంతాపం నిగమ ముకుటోత్తంసకలికా

పరా కాంచీలీలా పరిచయవతీ పర్వతసుతా

గిరాం నీవీ దేవీ గిరిశ పరతంత్రా విజయతే II 45 II 

సీII  కృపను పారెడు తూము, కృపణధిషణులైన నతులైనచో కాచు నతులితగతి,

నిగమ ముకుటోత్తంస యగణితకలికయౌ నీరజాతేక్షణ నిరుపమాన,

కాంచీనగర లీలలెంచి గణించిన పర్వతాధిపుపుత్రి ప్రవర చరిత,

వాక్కులకధిపతి, భాస్వంతుఁడైనట్టి పరమేశునకధీన పార్వతమ్మ,

తే.గీ.II  యట్టి కామాక్షి తల్లికి నంజలించి,

జయము పలికెద సతతంబు ప్రియముతోడ,

కంచిలోనుండి ధర్మంబు కాచు జనని,

నిత్యమంగళ, నాతల్లి, నిర్వికార.

తాII కృపారసము చిలుకు తూము. బలహీనహృదయుల పట్ల దయగలది, తన ముందు సాష్టాంగ ప్రణామం చేసేవారి బాధలను తొలగించునది, ఉపనిషత్తుల శిఖరాభరణము, కంచిలో ఆడుకొనునది, హిమవంతుని పుత్రి, వాక్కుకు అధిపతి, మరియు శివుని నియంత్రణలో తనను తాను ఉంచుకున్నది అయిన కామాక్షికి జయము.

శ్లోII  కవిత్వశ్రీకందః సుకృత పరిపాటీ హిమగిరేః

విధాత్రీ విశ్వేషాం విషమ శరవీర ధ్వజపటీ

సఖీ కంపానద్యాః పదహసిత పాథోజ యుగళీ

పురాణో పాయాన్నః పురమథన సామ్రాజ్యపదవీ II 46 II

చంII  కవితకు మూలకందము సుగణ్య హిమాద్రి శుభప్రసూతియున్,

ప్రవిమల సృష్టి కర్త, సుమభాసు నికేతనరాజమెన్నగా,

ప్రవహనమైన కంప చెలి, పల్లవహస్తయు, మన్మథారి సం

స్తవ శుభ రాజ్య సత్పదవి, నన్ గని బ్రోచుత ప్రేమతో సదా.

తాII కవిత్వశోభకు మూలకందము, హిమగిరిపూర్వపుణ్యపరిపాటి, సర్వసృష్టికర్త్రి,  మన్మధయోధుని ధ్వజపతాక, కంపానది చెలిమికత్తె, మదన వైరి సామ్రాజ్యపదవియు, నైన పురాణి మమ్ము బ్రోచుగాక !

శ్లోII  దరిద్రాణా మధ్యే దరదళిత తాపింఛసుషమాః

స్తనాభోగః కాంతాః తరుణ హరిణాంకాంకిత కచాః

హరాధీనా నానావిబుధ ముకుటీ చుంబితపదాః

కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే II 47 II

సీII  సన్ననినడుముతో, సరిగ తమాలంపు వృక్షశోభను నేను వెలుగుటెపుడొ?

కుచభారమునవంగి, కురులలో శశిరేఖఁ దాలిచి భువిపైన తనియుటెపుడొ?

శివునకధీనమై చెలగుచు నేనునును నీవుగా నొప్పుచు నీల్గుటెపుడొ?

పలుదేవతల శీర్షికల ముద్దులిడుభాగ్య మెప్పుడు కల్గునో గొప్పగాను?

తే.గీ.II  కంపతీరాన నీవలె నింపునొప్పి

నేను విహరింతు నెప్పుడో? నిరుపమాన!

నీవుగా నేను మారుట నీదు కృపయె,

నీవె నాకోర్కె తీర్చుచున్ బ్రోవవమ్మ!

తాII గిరిసుతా! సన్నని నడుముకలిగి, కాస్తవికసించిన తమాల వృక్షము యొక్క పరమశోభతో, కుచభారాలతో వంగి, చంద్రరేఖను దాల్చిన కేశపాశంతో, శివాధీనత్వంపొంది, పలుదేవతాకిరీటాలను ముద్దిడుకునే పాదాలతో, కంపాతీరంలో మేమెప్పుడు నీరూపంతో సమానరూపంకలిగి విహరిస్తామోకదా తల్లీ! (సారూప్యం కోరుతున్న విధానమిది.)

శ్లోII  వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మనసో

నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరీ

చరీచర్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే

సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా II 48 II

శాII  నావాక్కుల్ మది నీపయిన్ నిలుచుతన్, నావాగ్ఝరుల్ ప్రౌఢమై

భావోద్భాసితమై చెలంగుత, సతీ! వాగ్దేవి! నా జాడ్యమా

దేవీ! శత్రుపరంబు కాత, మదిలో దేదీప్యమానంబుగా

నీవే వెల్గుత, నీ దయామృతఝరుల్ నిత్యంబు నాకందుతన్.

తాII ఓ కామాక్షీ! నా మనస్సు మరియు నా వాక్కు నీలో స్థిరంగా ఉండుగాక. నా నోటిలో అద్భుతమైన ప్రసంగ తరంగాలు నాట్యం చేయుగాక. ఓ జ్ఞానమాత! మన మందబుద్ధిని మన శత్రువులకు పోనిత్తువుగాక. ఓ తల్లి కామాక్షీ! నీ దయ నాపై ధారాళంగా   కురియుగాక.

శ్లోII  క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురుః

కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం

నరీనర్తు స్వైరం వచనలహరీ నిర్జరపురీ-

సరిద్వీచీ నీచీకరణ పటురాస్యే మమ సదా II 49 II

తే.గీ.II  భ్రమరశోభకు శిక్షణ సముచితమిడు

నీదు కడగంటి చూపు నన్నాదుకొనును,

వరలు స్వర్గంగఝరి మించు వాగమృతము

నాట్యమాడుత కామాక్షి! నా రసనను.

తాII ఓ కామాక్షీ! తుమ్మెదల శోభకు శిక్షణనిచ్చుటలో గురువైన నీ కడగంటి చూపుల ప్రసారం క్షణంలో నన్ను ఆపదలనుండి విముక్తుని చేయుగాక! నా ముఖంలో ఎల్లప్పుడు గంగానది ప్రవాహాన్ని అధఃకరించే శక్తిగల మాటల ప్రవాహం నాట్యం చేయుగాక!

శ్లోII  పురస్తాన్మే భూయః ప్రశమనపరః స్తాన్మమ రుజాం

ప్రచారస్తే కంపాతట విహృతి సంపాదిని ద్రుశోః

ఇమాం యాంఛామూరీకురు సపది దూరీకురు తమః -

పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయ మాం II 50 II

తే.గీ.II  కంప దరినాడఁ గోరెడి గణ్యవమ్మ,

నీదు చూపు నా రుగ్మతన్ నిత్యమణచు,

నాదు మాయ చీకటి బాపి నీదు కృపను

జ్ఞానులందున నిలిపి నన్ గావుమమ్మ!

తాII కంపా నది ఒడ్డున ఆడుకోవడానికి ఇష్టపడే ఓ కామాక్షీ! నీ చూపు నుండి తేజస్సు నా ముందు వ్యాపించి నా అనారోగ్యాన్ని మరియు దాని బాధను తగ్గించు. దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరించి, నా అజ్ఞానమనే చీకటిని తొలగించి, నన్ను జ్ఞానుల లోకానికి నడిపించుము.


శ్లోII  ఉదంచంతీ కాంచీనగరనిలయే త్వత్ కరుణయా

సమృద్ధా వాగ్ధాటీ పరిహసిత మాధ్వీ కవయతాం

ఉపాదత్తే మార ప్రతిభట జటాజూట ముకుటీ-

కుటీరోల్లాసిన్యాః శతమఖ తటిన్యా జయపటీమ్ II 51 II

తే.గీ.II  కంచి కామాక్షి! నీ దయన్ కవన ధార

పుష్కలంబుగఁ బొంగుచు ముందుకురుకు,

శివజటాజూట గంగదౌ సిడము పట్టి

చేత చిక్కించుకొనునమ్మ! సిద్ధమిదియె.

తాII కాంచీనగరవాసినీ! నీ దయవలన; తేనెల తీయదనాన్ని పరిహసించే, పుష్కలమైన వేగంగల కవిత్వశక్తి పెల్లుబికి వస్తుంది. అది శివుని జడలకు కిరీటంగా ఉల్లసిల్లుతున్న గంగానదియొక్క విజయ పతాకను చేజిక్కించుకుంటుంది.

శ్లోII  శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం

సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా

త్రిలోక్యాం ఆధిక్యం త్రిపురపరిపంథి ప్రణయినీ

ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే II 52 II

తే.గీ.II  శివుని యిల్లాల! కామాక్షి! చేరినీకు

వందనము చేయు సుతున కమంద బుద్ధి,

విద్య, సంపద, కీర్తి సత్ప్రేమనిత్తు

వట్టి నీ సేవ త్రైలోక్యపతిని చేయు,

నిఁక లభింపనిదేముండు? సకల జనని!

తాII కామాక్షీ! శివుని ఇల్లాలా! జననీ! పాపాలను హరించుదానా! నీ పాదాలపై మోకరిల్లే సుపుత్రులను నీవు వెంటనే కరుణిస్తావు. సంపదను, విద్యను, అమితకీర్తిని ప్రసాదిస్తావు. నీ పాదాభివవందనము త్రిలోకాల్లో ఆధిక్యతనే కలిగిస్తుందంటే, దానివల్ల లభించనివి ఏవి ఉంటాయి తల్లీ?

శ్లోII  మనః స్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం

సదా లోలం నీలం చికురజిత లోలంబనికరమ్

గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః

దృశాం యోగ్యం భోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే II 53 II

సీII  నతులైనవారల మతులలో జాడ్యమున్ దొలగంగఁ జేసెడి తోయజాక్షి,

నీలోత్పలంబులన్ నిలదీసి యోడించు కమనీయమైనట్టి కలువకంటి,

నీలివర్ణమునొప్పు, మేలైన కచములన్ దుమ్మెదలను మించు ధుర్యురాలు,

వాగ్దంబమేలేక వరలెడు చిఱునవ్వు గలయట్టి శివపత్ని జ్ఞానతేజ,

తే.గీ.II  చంద్రరేఖను దాల్చెడి సన్నుతాంగి,

శివుని కన్నుల వెలుగయి చెలగుతల్లి,

హిమగిరీశుని సత్పుత్రి, క్షమకు నిలయ,

కనగ ధరను సర్వోత్కర్షగావెలుంగు.

తాII కమ్పానదీతీరమున నమస్కరించు వారి మనోజాడ్యమును తొలగించునట్టిది, మంచి కన్నులు గలిగినట్టిది, నీలి రంగు గలట్టిది, తుమ్మెదల జయించు కేశములు గలట్టిది, వాక్కులకు దూరముగా నున్నట్టిది, చిఱునవ్వు గలట్టిది, చంద్రకల దాల్చినట్టిది, శివుని కన్నుల యోగ్యభోగ్యమైనట్టిది, హిమవంతుని భాగ్యమైనట్టిది అగు అమ్మవారు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

13 – 3 – 2024.

శ్లోII  ఘనశ్యామాన్ కామాంతక మహిషీ కామాక్షి మధురాన్

దృశాం పాతానేతాన్ అమృత జలశీతాననుపమాన్

భవోత్పాతే భీతే మయి వితర నాథే దృఢభవన్-

మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా II 54 II

మII  భవమన్ విడ్వర మిట్లు నాదు మదినే బాధించుచుండగ నో

శివపత్నీ! భయమొందుచుంటి, నిను నే సేవింతు నీ మూకపై

భవదీ యామృత శీత లాక్షయ మహద్భాస్వంత మాధుర్య సం

స్తవనీయాద్భుతమౌ కటాక్షములనే సాగిల్లగాఁ జేయుమా.


తాII శివపత్నీ! కామాక్షీ! సంసార మొకయుత్పాతమై బెదరిపోవుచున్న నాయందు, తీవ్రశోకంబున వివ శుడైయున్న యీ మూగవానియందు, మేఘశ్యామలములు, అమృతశీతలములు, మధురములు నైన నీ చూపులను బ్రసరింపజేయుము.

శ్లోII  నతానాం మందానాం భవనిగళ బంధాకులధియాం

మహాన్ధ్యాం రున్ధానాం అభిలషిత సంతానలతికామ్

చరంతీం కంపాయాః తటభువి సవిత్రీం త్రిజగతాం

స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతుకలికాం II 55 II

మII  భవబంధమ్ములఁ జిక్కి మందమతులై బాధాకులస్వాంతులై

స్తవనీయంబుగ మ్రొక్కు భక్తతతికిన్ సర్వాపదల్ బాపుచున్

భవతాపంబునడంచి జ్ఞానమిడి, సంభాసించు కల్పమ్ము నా

శివసంజీవని, యెంతు నామెను మదిన్ జిజ్ఞాసతో నిత్యమున్.

తాII సంసారమను సంకెళ్ళం దవిలి మందమతులై చెదరినమనసుగల జనులు నిజ చరణమ్ముల వ్రాలినంతనే వారి యజ్ఞానరూపమైన గ్రుడ్డితనమును బాపి కల్పలతవోలె వారి యభిలాష లొసంగుచు కంపాతీరమున మసలెడి శివసంజీవినీలతికను "నిత్యము స్మరింతుము.

శ్లోII  పరా విద్యా హృద్యా శ్రితమదనవిద్యా మరకత-

ప్రభానీలా లీలాపర వశిత శూలాయుధమనాః

తమః పూరం దూరం చరణనత పౌరందరపూరీ-

మృగాక్షీ కామాక్షీ కమలతరలాక్షీ నయతు మే II 56 II

తే.గీ.II  తా పరావిద్య, హృద్య, శ్రితమదన నుత

విద్య, మరకతనీలయు, వినత సుర వి

లాసిని, కమలనేత్ర, విలాస మోహి

త శివ మానస, కామాక్షి దయను కనుత. 

తాII పరమార్థవిద్యాస్వరూపిణి, మనోహారిణి, మన్మథవిద్యావిలాసిని, మరకత మాణిక్య నీలకాంతిభాసిని, నిజచరణ వినత సుర విలాసిని, కమలదళ లోచని, నిజవిలాస సమ్మోహిత సదాశివ మానస, అగు కామాక్షి నా యజ్ఞానమును నిజకటాక్ష వీక్షణముచే పోఁగొట్టు గాక!

శ్లోII  అహంతాఖ్యా మత్కం కబలయతి హా హంత హరిణీ

హఠాత్సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ

కటాక్ష వ్యాక్షేప ప్రకటహరిపాషాణపటలైః

ఇమాం ఉచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా II 57 II

తే.గీ.II  నా యహమ్మను జింక తా నయము వీడి

నాదు జ్ఞానమన్ మొలకను నములుచుండె

నీదు దివ్యకటాక్షేంద్రనీలశిలల

తో తరిమికొట్టు కామాక్షి! దోయిలింతు!

తాII అహంకారమనెడి జింక దూకి హఠాత్తుగ నా జ్ఞానమనెడి మొలకను కబళించుచు న్నది. దయతో నీ కటాక్ష ప్రసారములనెడి ఇంద్రనీలశిలాశకలములచే నా లేడిని తఱిమికొట్టుమమ్మా.

శ్లోII  బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ

కటాక్షః కామాక్షి ప్రకట జడిమక్షోదపటిమా

కథంకారం నాస్మై కరముకుల చూడాలముకుటా

నమోవాకం బ్రూయుః నముచి పరిపంథి ప్రభృతయః II 58 II

తే.గీ.II  పండితుఁడు, మూక యెవరైన బడసిరేని

నీ కటాక్షమున్ గామాక్షి! నిత్యమతని

సేవఁ జేసెదరింద్రాది దేవగణము,

తమ ముడులు తీసి,  భక్తితోఁ దలలు వంచి.

తాII పండితుఁడుకాని మూగవాఁడుకాని ఎవనియందు ఒక క్షణమైనను మాంద్యమును హరించు నీ కటాక్షము ప్రసరించునో వానికి ఇంద్రాదిదేవతలు నిజకిరీటములువంచి కరములు మొగిచి నమస్కరించెదరు.

శ్లోII  ప్రతీచీం పశ్యామః ప్రకట రుచినీ వారకమణి-

ప్రభాసధ్రీచీనాం ప్రదలిత షడాధారకమలామ్

చరంతీం సౌషుమ్నే పథి పరపదేందు ప్రవిగలత్-

సుధాద్రాం కామాక్షీం పరిణత పరంజ్యోతిరుదయామ్ II 59 II

సీII  వివరంబు పరికింప వినుత సర్వాంతర యైనట్టి శివమనోహరి జననిని,

నీవారబీజమునే పోలు తనుకాంతిఁ గలిగిన మహనీయ కరుణనిధిని,

యపురూపమైన మూలాధారమాదిగా షట్చక్రమూలమౌ సదయమతిని,

వినుతసుషుమ్న సద్విమల మార్గపు గామి యయి సహస్రారమ్మునమరి పారు,

తే.గీ.II  నమృతధారకునర్థమౌ యనుపమమగు

శ్రీపరంజ్యోతి యుదయమై చెలగునట్టి

కంచి కామాక్షినే మదినెంచి గాంతు,

వందనంబులు చేయుచున్ వినుత గతిని.

తాII సర్వాంతరయైన, నీవారబీజమువంటి తనుత్వకాంతులు గల, మూలాధారాది షట్కమలములు ఆధారములుగాగల, సుషుమ్నా మార్గమున విహరించు, సహస్రారచంద్రునినుండి స్రవించు అమృతధారచే ఆర్థయైన పరంజ్యోతియొక్క ఉదయముగా పరిణమించు కామాక్షీదేవిని చూచుచున్నాము.

శ్లోII  జంభారాతి ప్రభృతిముకుటీః పాదయోః పీఠయంతీ

గుమ్ఫాన్వాచాం కవిజనకృతాన్ స్వైరం ఆరామయంతీ

శంపాలక్షీం మణిగణరుచా పాటలైః ప్రాపయన్తీ

కంపాతీరే కవిపరిషదాం జృంభతే భాగ్యసీమా II 60 II

తే.గీ.II  దేవతల కిరీటాళిని దివ్యపాద

పీఠిగాఁ గొని, సుకవుల వినుతకవిత

ధాటినొనరించి తనపుష్పవాటిగాను,

తొడవుకాంతితో గాంతులే జడియ నిలిచె

కవులభాగ్యమ్ము కామాక్షి కంప దరిని.

తాII ఇంద్రాదిదేవతాకిరీటకోటిని దనకు బాదపీఠ మొనరించుకొని సుకవివచోధాటిని తాను విహరించుపుష్పవాటి నొనరించుకొని నిజాభరణ మణిగణరుచులచే క్రొమ్మెరుగుల శోభ నదలించుచు కవివరుల అదృష్టసీమ యొకటి కంపాతీరమందు విజృంభించు చున్నది.

14 – 3 – 2024.


శ్లోII  చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం

కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగామ్

మారారాతేర్ మదనశిఖినం మాంసలం దీపయన్తీం

కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే II 61 II

తే.గీ.II  చంద్రశేఖర, చతురాస్య, చంచలాక్షి,

కుందసుస్మేర, కుచభార మంద గమన,

నతశరీర, నెరయదల్చు క్షితి భ్రరముల,

శివునికామాగ్నిపెంచుచు కవులకల్ప

వల్లియైనకామాక్షినే వరలఁ గొలుతు.

తాII ఇందు కిరీటము, ఇంపులు గుల్కెడి నెమ్మొగము, చంచలమగు నపాంగవిలాసము, మొల్లలబోలు నెలనవ్వులు గలిగి, కుచభారమున నానతయై, కుంతలములచే దుమ్మెద లనదల్చుచు, కామవైరికామాగ్నిని రగుల్చుచు, గవులపలుకులకుఁ గల్పవల్లియై, యలరు కామాక్షినుపాసింతురు.

శ్లోII  కాలాంబోధప్రకర సుషమాం కాంతిభిః తర్జయన్తీ

కల్యాణానాం ఉదయసరణిః కల్పవల్లీ కవీనామ్

కందర్పారేః ప్రియసహచరీ కల్మషాణాం నిహంత్రీ

కాంచీదేశం తిలకయతి సా కాపి కారుణ్యసీమా II 62 II

మII  వర కామాక్షి దయాసముద్ర, నగగా భాసించు నా కంచికిన్,

పరమోద్భాసిత దేహకాంతి మొయిలున్ పంతంబుతో నెగ్గు, సు

స్థిర శోభాళికి మూలమున్, కవుల భాతిన్ బెంచు కల్పంబు,నీ

శ్వరు కామాగ్నిని పెంచు, చెడ్డనణచున్, శర్వాణి లోకంబునన్.

తాII కామాక్షి, అపారమైన దయ యొక్క స్వరూపిణి, కంచిని అలంకరించింది. ఆమె తన శరీరం యొక్క తేజస్సు ద్వారా చీకటి మేఘాల  ప్రకాశాన్ని అధిగమించింది . అన్ని శుభాలు వచ్చే మూలం ఆమె. ఆమె కవులకు కోరికలు తీర్చే లత మరియు మన్మథుని శత్రువు అయిన శివునికి ప్రియ సహచరురాలు. ఆమె సర్వ దురాచారాలను నాశనం చేసేది కూడా.

శ్లోII  ఊరీకుర్వన్నురసిజతటే చాతురీం భూధరాణాం

పాథోజానాం నయనయుగళే పరిపంథ్యం వితన్వన్

కంపాతీరే విహరతి రుచా మోఘయన్ మేఘశైలీం

కోకద్వేషం శిరసి కలయన్ కోపి విద్యావిశేషః II 63 II

తే.గీ.II  జ్ఞానపూర్ణ స్వరూపిణి, కంప దరిని

మేఘతేజంబునేమించు మేనితోడ,

కుచ శిఖరి తాల్పు, శశిరేఖ కురులఁ గలిగి,

విజిత నీలోత్పలకచ, వెలసె శివగ.

తాII మహోన్నతమైన జ్ఞాన స్వరూపిణి కంపా నది ఒడ్డున తన తేజస్సుతో మేఘాల అంధకారాన్ని అధిగమిస్తూ, తన వక్షస్థలంపై పర్వతాల లక్షణాలను అలవర్చుకుంటూ, కమలాల పట్ల తన కళ్లతో శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, తలపై నెలవంకను ఆడుతూ ఆడుతుంది.

శ్లోII  కాంచీలీలాపరిచయవతీ కాపి తాపింఛలక్ష్మీః

జాడ్యారణ్యే హుతవహశిఖా జన్మభూమిః కృపాయాః

మాకందశ్రీర్మధురకవితా చాతురీ కోకిలానాం

మార్గే భూయాన్మమ నయనయోః మాన్మథీ కాపి విద్యా II 64 II

తే.గీII  కంచి నెచ్చెలి, తాపింఛ కాంతి యుతయు,

జాడ్య వన దవానలయును, జాలికిరవు,

మధుర కవికోకిలలకును మావి చివురు,

నయిన కామాక్షి దోచు నా నయన దృష్టి.

తాII కాంచి యను విలాసవతికి నెచ్చెలియు, ఇరుగుడుమ్రానికి ఈడగు మైచాయగ లదియై, జాడ్యమను నడవిం దహించు దావాగ్నిశిఖయునై, దయకు పుట్టినిల్లై, మధుర కవికోకిలములకు మామిడిచివురునై, యున్న యొకానొక కామకళ నా చూపుమేఱల దోచుగాక. 

15 – 3 – 2024.

శ్లోII  సేతుర్మాతః మరకతమయో భక్తిభాజాం భవాబ్ధౌ

లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతీ

కాంచీభూషా పశుపతిదృశాం కాపి కాలాంజనాలీ

మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాలా II 65 II

ఉII  నీదు కటాక్ష మెన్న మహనీయ భవాంబుధి సేతువే కనన్, 

వాదుగ కల్వపూలను నవప్రభలన్ విలసిల్లునట్టి యా

హ్లాదమునొప్పుమన్మథునియద్భుతటెక్కెము, కంచి భూషయున్,

మోదముసాంబమూర్తికిపూర్తిగ కాటుకకన్నిలిచ్చు త

చ్ఛ్రీద మదంబ శాంభవి నశింపఁగ జేయుత నాదు దుఃఖమున్.

సీII  కామాక్షి నీవైన కరుణాకటాక్షముల్ భవసాగరముపైన వారధియగు,

లీలా విలోల విశాల కువలయంపు మన్మథ ధ్వజమౌను మంగళాంగి,

కంచికా కామాక్షి! కాంచీనగరభూషణంబు తలంపంగ నయనిధాన!

పశుపతి కంటికి పరమాద్భుతంబైన కాలాంజనాలియే కమల నయన!

తే.గీ.II అట్టి నీకంటి చూపు నన్ పట్టి చూచి

నాదు దుఃఖమున్ బాపుత మోదమలర,

నిన్నె నమ్మిన సుతుఁడను, నీడవగుచు

నన్ను కాపాడుమమ్మరో సన్నుతముగ.  

తాII ఓ తల్లీ! కామాక్షీ! నీ కటాక్షమాల భక్తులు సంసారసాగరము దాటుటకు మరకతమణి సేతువు, కలువపూలవిలసిల్లు సువిలాసచంచలమగు మన్మధుని టెక్కెము,  కాంచీపురీభూషణము, పశుపతిచూపులకు నల్లని కాటుకరేఖ, అది నా దుఃఖమును సడలించుగాక.

శ్లోII  వ్యావృణ్వానాః కువలయదళ ప్రక్రియావైరముద్రాం

వ్యాకుర్వాణా మనసిజమహారాజ సామ్రాజ్యలక్షీం

కాంచీలీలా విహృతిరసికే కాంక్షితం నః క్రియాసుః

బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః II 66 II

తే.గీ.II  కంచి లీలావిహారిణీ! కలువపూల

వికసనంబున శత్రువై, విషమశరుని

రాజ్యలక్ష్మినిఁ దెలిపెడి, రాగబంధ

ములను బాపు కంటను గనుము ననుఁ గృపను.

తాII కాంచీనగరంలో లీలావిహారం చేసే ఓ కామాక్షితల్లీ! కలువపూవుల వికసనమునందు శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, మన్మథమహారాజు యొక్క సామ్రాజ్య లక్ష్మిని వ్యాఖ్యానిస్తూ; నియమవంతులైన విరాగుల (సంసార) బంధాలను తెంపివేస్తూ దీక్షాబద్ధాలైన నీ దయతో కూడిన కంటికొసలనుండి ప్రసరించే చూపులు మా కోర్కెలను నెరవేర్చు గాక!

శ్లోII  కాలాంభోదే శశిరుచిదళం కైతకం దర్శయంతీ

మధ్యేసౌదామిని మధులిహాం మాలికాం రాజయంతీ

హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీ

కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీః II 67 II

సీII  శిఖకాలమేఘాన చిన్ని చంద్రునిఁ బోలు మొగలి పూ రేకును ముడిచి చూపు,

చిరునవ్వు మెఱుపులన్ విరితేనెమేపరు లనుబోలు చూపులన్ ఘనత నిలుపు,

వికసిత ముఖపద్మ మొకహంసగీతమున్ వెలుగొందగా జేయు విపులసరణి,

కంపానదీతీర కారుణ్యలక్ష్మియై యొక కాంతి పుంజంబు ప్రకృతిజనని

తే.గీ.II  కూర్మితోఁ జూచి భక్తుల కోర్కె తీర్చ

భాసిలుచునుండె కృపతోడ వాసిగాను,

కంచి కామాక్షి మాయమ్మ కనికరమున

నన్ను కృపఁజూచి కాచుత నయము తలర.

తాII కారుమబ్బులో చంద్రకాంతిమొలకవంటి మొగలిపూరేకును (చంద్రరేఖను సిగలో) ధరించి చూపునది; మెరుపుతీగ మధ్యలో తుమ్మెదల వరుసను ప్రకాశింపజేసినది (నవ్వులలో కలసిన నల్లని కటాక్షప్రసారాలు) వికసించిన కమలంలో హంసధ్వనిని వెలుగొందజేయునది (వదనంలో నుండి మధురధ్వనులు) అయిన వినూత్నమైన ఒకానొక దయాసంపదలరాశి, కంపాతీరంలో ప్రకాశిస్తున్నది.

శ్లోII  చిత్రం చిత్రం నిజమృదుతయా భర్త్సయన్ పల్లవాలీం

పుంసాం కామాన్ భువి చ నియతం పూరయన్ పుణ్యభాజాం

జాతః శైలాన్న తు జలనిధేః స్వైరసంచారశీలః

కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మే II 68 II

తే.గీ.II  చిగురుటాకులఁ జడిపించు ద్యుతితనువున,

ధర సుకృతులకు సుఫలముల్ దయనొసంగు,

జలజ కాని చింతామణి చట్టు పట్టి, 

శుభములనుగొల్పుచున్ మాకు నభయమిడుత.

తాII తన శరీరపు మెత్తదనంచేత చిగురుటాకులను బెదరగొడుతూ, పుణ్యాత్ములైనవారి కోర్కెలను నియమబద్ధంగా భూలోకంలోనే ఫలింపజేస్తూ, సముద్రంనుండి కాక పర్వతంనుండి పుట్టినదై, స్వేచ్ఛావిహారంచేస్తూ కాంచీనగరంలో అలంకారంగా నెలకొని ఉన్న ఒకానొక వింతయైన చింతామణి మాకు శుభాలను కల్గించుగాక!

16 – 3 – 2024.

శ్లోII  తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూకపుష్పం

తస్మన్ మల్లీకుసుమసుషమాం తత్ర వీణానినాదం

వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యాం

ఐశానీ సా కలయతితరాం ఐంద్రజాలం విలాసం II 69 II

సీII  జలదనికటమందు తామ్రాంబుజములును, దానిలో మంకెన, దానియందు

మల్లికాకుసుమంపు మహితమౌ కాంతియు, నక్కడవీణను చక్కగాను

ధ్వనియింపఁ జేయుచు, ఘనుడైన గణనాథు జనకుని సత్కార్య చయ తరంగ

ఫలితమై కామాక్షి మహనీయమైనట్టి యావిష్కృతంబయ్యె ననుపమముగ,

తే.గీ.II  అట్టి కామాక్షి మము నిలఁబెట్టునట్టి

దిట్ట, నేనామె పాదముల్ పట్టి విడువ,

ననుపమంబుగ నాలోననలరు జనని

నిత్యమంగళదాయియై నిలుపు నన్ను.

తాII మేఘాల దగ్గర ఎర్రటి కమలాలు (కళ్ళు) ఉన్నాయి (జుట్టు తాళాలు). దాని దగ్గరే ఎర్రటి మందార పువ్వులు (పెదవులు) ఉన్నాయి. ఆ మందార పువ్వుల లోపల మల్లె మొగ్గలు (పళ్ళు) ఉంటాయి. వీణ యొక్క మధురమైన సంగీతం ఉంది. ఈ మాయాజాలం అంతా కంచిలో నివసించే  శివుని సత్కార్యాల తరంగాల ఫలితమైన  కామాక్షి ద్వారా ఆవిష్కరించబడింది.

17 – 3 – 2024.

శ్లోII  ఆహారాంశం త్రిదశ సదసాం ఆశ్రయే చాతకానాం

ఆకాశోపర్యపి చ కలయన్ ఆలయం తుంగమేషాం

కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం

మందస్మేరో మదననిగమ ప్రక్రియా సంప్రదాయః II 70 II

సీII  చాతకంబులకును చక్కని నిలయమున్ దివ్యులకును భుక్తి భవ్యరీతి

నిత్యమొసగునట్టి నిరుపమ శశితాల్పు, గగనసౌధద్వయ మగణితముగ

గలిగిన కుచభర, కౌనుశూన్యపుదేహ, కవులకు సురగవి, కమల నయన,

మందహాసాంచితమహనీయ ముఖపద్మ, మదనవేదపుసార సదయహృదయ,

తే.గీ.II  కంపతీరాన కామాక్షి యింపుతోడ

భక్తజనులను కాచెడి భవ్య హృదయ

వెలుగుచున్నది గొప్పగా, ప్రీతితోడ

సేవ చేసెద నాతల్లి చిత్తమలర.

తాII చాతక పక్షులకు ఆశ్రయమైన మబ్బులో దేవతల ఆహారభాగాన్ని కల్పించటం (మబ్బువంటి నీలమైన తలకట్టులో చంద్రుడు), ఆకాశంపై భాగానకూడ ఎత్తైన భవనాన్ని కలిగి ఉండటం (సన్నని నడుముపై ఉన్నత కుచమండలం) కవులకు కామధేనువు, సన్నని చిరునవ్వు- ఇట్టివి కలిగి ఉన్న మన్మథ వేదప్రక్రియాసంప్రదాయము- కంపాతీరంలో విహరిస్తున్నది.


శ్లోII  ఆర్ద్రీభూతైరవిరలకృపైః ఆత్తలీలావిలాసైః

ఆస్థా పూర్ణైరధిక చపలైః అంచితాంభోజ శిల్పైః

కాంతైర్లక్ష్మీ లలితభవనైః కాంతికైవల్యసారైః

కాశ్మల్యం నః కబలయతు సా కామకోటీ కటాక్షైః II 71 II

సీII  ఆర్ద్రమై యుండెడి యవిరళకృపనొప్పి, లీలావిలాసాలఁ దేలియాడు,

వాంఛాప్రపూర్ణముల్, వరలవొక్కయెదనె, ఘనమౌచునొప్పెడి కమలసృష్టి,

అమ్మవౌ కనుపాపలాకర్షణీయమౌ నిలయముల్, కామారి కలల పంట,

గణనీయ మహితప్రకాశస్వరూప సత్ సారముల్, వేదాంత సారములును,

తే.గీ.II  అట్టి మహనీయమైనట్టి పట్టుఁ గలుగు

దివ్యమైనట్టి చూపులు దీనులమగు

మాదు మదులందు నెలకొన్న మలినములను

మ్రింగివేయుత, మాకు సన్మంగళమిడ.

తాII అమ్మవి దయగల చూపులు దయారసంతో తడిసినట్టివి, మనోహరమైన విలాసాలుకలవి, వాంఛాప్రపూర్ణాలు, ఒకచోటనే ఉండనట్టివి, గొప్పనైన కమలముల యొక్క సృష్టి విశేషాలు, సంపదలకు ఆకర్షణీయమైన నిలయాలును,  కేవల ప్రకాశస్వరూపసారాలు.  అట్టి శ్రీకామకోటీ అమ్మవారి చూపులు మాలోని మాలిన్యాన్ని మ్రింగివేయుగాక.

శ్లోII  ఆధూన్వంత్యై తరల నయనైః ఆంగజీం వైజయంతీం

ఆనందిన్యై నిజపదజుషాం ఆత్త కాంచీపురాయై

ఆస్మాకీనం హృదయమఖిలైః ఆగమానాం ప్రపంచైః

ఆరాధ్యాయై స్పృహయతితరాం ఆదిమాయై జనన్యై II 72 II

చంII  సుమశరుకేతనమ్మెగుర శోభిల వేయుచు కంటి చూపులన్,

ప్రముదమునన్ భజించు వర భక్తులకున్ బరితోషమిచ్చుచున్,

సుమధుర సేవలందు నుత సుందర వేదములందు నిల్చి సే

మము నిడు కంచికాపురి ప్రమాణమహేశ్వరికంజలించెదన్.

తాII మన్మథపతాకాన్ని తన చలించే చూపులతో ఎగురవేస్తూ,  తన పాదము లాశ్రయించిన వారిని ఆనందింపజేస్తూ, అఖిల వేద శాక్తాగమాలలో ప్రబంధింపబడి ఆరాధింపబడుచున్నదై, తల్లులకే తల్లియై కాంచీపురంలో నెలకొన్న కామాక్షీదేవిపట్ల నా మనసు ఆనందంప్రకటిస్తున్నది.

శ్లోII  దూరం వాచాం త్రిదశసదసాం దుఃఖసింధోస్తరిత్రం

మోహక్ష్వే లక్షితిరుహవనే క్రూరధారం కుఠారమ్

కంపాతీర ప్రణయి కవిభిః వర్ణితోద్యచ్చరిత్రం

శాంత్యై సేవే సకలవిపదాం శాంకరం తత్కలత్రం II 73 II

తే.గీ.II  దేవ నుతులకునందదు, నావ గాను

దుఃఖ జలధిదాటించు, దురిత మోహ

వనకుఠారము, కవినుత ఘన సుచరిత,

కంచి శివునాలి నెంచెద కావ నన్ను.

తాII దేవతాస్తుతుల కందనిది, దుఃఖసాగరము దాటుటకు ఓడయైనది మోహమనెడి విషవృక్షముల అడవికి బదునైన గండ్రగొడ్డలియైనదియునై కవులచే స్తుతింపబడు చరి త్రగలదియై కంపాతీరమున విహరించు చంద్రశేఖరకళత్రమును సకలవిపత్ప్రశాంతికై సేవించెదను.

శ్లోII  ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ-

శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశన్తీ

తుండీరాఖ్యై మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రీ

చండీ దేవీ కలయతి రతిం చంద్రచూడాలచూడే II 74 II

తే.గీ.II  ప్రకృతిసిద్ధ మాలిన్యమున్ బరగ తుడిచి,

ఆశ్రితులప్రజ్ఞ పెంచుచు, ననుపమ శశి

రేఖఁ శిరమునఁ దాల్చి, తా శ్రీకరమగు

చండి స్వర్ణము కురిపించు తుండిరమున.

తాII ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న మాలిన్యాన్ని ఖండించివేస్తూ, తన పాదాలనాశ్రయించినవారికి ఏమరుపాటులేని ప్రజ్ఞావికాసాన్ని కలిగిస్తూ, చంద్రవంకను శిరోమణిగా ధరించి చండీదేవి స్వరూపిణియై బంగారు వర్షాన్ని కురిపిస్తూ- తుండీర మండలం (కాంచి)లో మాకు ఆనందాన్ని కల్గిస్తున్నది.

శ్లోII  యేన ఖ్యాతో భవతి స గృహీ పూరుషో మేరుధన్వా

యద్దృక్కోణే మదననిగమ ప్రాభవం బోభవీతి

యత్ ప్రీత్యైవ త్రిజగదధిపో జృంభతే కింపచానః

కంపాతీరే స జయతి మహాన్ కశ్చిదోజో విశేషః II 75 II

సీII  శివుఁడు గృహస్తుగా చిత్తంబు పొంగార నయ్యె నే జననిచేననుపమముగ,

నేతల్లి క్రీగంటి యెనలేని చూపులు కామదేవునిలోని ప్రేమఁ బెంచు,

నేశక్తి కృపచేత భాసించె భిక్షువు ముల్లోకములనేలు ముఖ్యుఁడగుచు,

కంపా సమీపాన గలిగిన యా దివ్య జనని కామాక్షికి జయము జయము, 

తే.గీ.II  భక్తజనపాళి కెన్నగా భాగ్యరాశి,

దేవతాతతిన్ రక్షించు దివ్యశక్తి, 

కవులవాఙ్నిధి యైనట్టి కల్పవల్లి,

మోక్షమొసగుచు నాకు సంరక్షఁ గొలుపు.

తాII ఎవరి వల్ల శివుడు గృహస్థుడిగా ప్రసిద్ది చెందాడో, ఎవరి ప్రక్క చూపులు కామదేవుని ప్రేమలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయో, ఎవరి అనుగ్రహం వల్ల (మానవ పుర్రెతో కూడిన భిక్షాపాత్రతో) భిక్షాటన చేసే శివుడు ఈ ముగ్గురికీ ప్రభువుగా అధికారం పొందాడు. కంపా నది ఒడ్డున ఉండే ఆ ప్రకాశవంతమైన దయాశక్తికి విజయం.

శ్లోII  ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి యన్మే

నింద్యాం భింద్యాత్ సపది జడతాం కల్మషాదున్మిషంతీం

సాధ్వీ మాధ్వీరసమధురతా భంజినీ మంజురీతిః

వాణీవేణీ ఝటితి వృణుతాత్ స్వర్ధునీ స్పర్ధినీ మామ్ II 76 II

సీII  ధరణి నా వాగ్గతి ధన్యమో? కాక యధన్యమగునొ? యనన్ ధన్యమనుదు,

పాపంబునుండి తా పనిపడి వికసించు జాడ్యమ్ము నేసాధ్వి సరిగ చూచి

తొలగించు? ననినచో పులకితాంగుడనయి పరమ బ్రహ్మ జనని నిరుపమముగ

తొలగించునందును, సులలిత మధురమౌ తీయతేనియ మించు దివ్యగతిని

తే.గీ.II  స్వర్గ గంగాఝరిన్ మించి సరసమైన

వాఙ్నిధియె నన్ను వరియించి వరలఁ జేయు

నమ్మ కామాక్షి కరుణను నెమ్మితోడ,

వందనమ్ములు చేయుదున్ భక్తితోడ.

తాII అమ్మా! కామాక్షీదేవీ, నా వాక్కులగతి ధన్యమా, అధన్యమా, అను ప్రశ్నకు అతి ధన్యమని నా యుత్తరము. ఎవతె పాపమునుండి వికసించు నింద్యమైన జాడ్యమును తొలగించునను ప్రశ్నకు పరబ్రహ్మస్వరూపిణి అనియే నా యుత్తరము. తేనె తీపిని భంజించు అందమైన రీతిగల ఆకాశగంగతో పోటీపడు వాఙ్నిధి నన్ను వరించుగాక!

శ్లోII  యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజాం

యస్యాః పీఠీ సతతశిశిరా శీకరైర్మాకరందైః

యస్యాః పేటీ శృతి పరిచలన్ మౌళిరత్నస్య కాంచీ

సా మే సోమాభరణ మహిషీ సాధయేత్కాంక్షితాని II 77 II

సీII  ఎవతెకు యోగుల హృదయంపుకమలంబులగు పుష్పములవాటికగను తలప?, 

నెవతె పీఠము దల్ప స్తవనీయమగు తేనె చినుకులన్ జల్లనై జెలఁగుచుండు?

నెవతెకు వేదాల నెప్పుడున్ దిరిగెడి మౌళిరత్నపుపెట్టె మాననీయ

కంచినగరమగున్?గమనీయమైనట్టి కరుణాకటాక్షుండు గరళగళుని

తే.గీ.II  మహిషి యాయమ్మ కామాక్షి, మహిని కృపను

నాదు మదిలోన నెలకొన్న శ్రీదమయిన

కోరికల్ తీర్చి కుశలంబు కొలుపు గాక,

యట్టి కామాక్షిపదములకంజలింతు.

తాII ఎవతెకు యోగుల హృదయకమలమే పుష్పవాటికయో, ఎవతెయొక్క పీఠము మకరందపు చినుకులతో చల్లనై యుండునో, ఎవతెకు వేదములలో తిరుగు మౌళి

రత్నము యొక్క పెట్టె కాంచీనగరమో, ఆ సోమశేఖరుని మహిషి నా కోరికల దీర్చు గాక!

18 – 3 – 2024.

శ్లోII  ఏకా మాతా సకలజగతామేయుషీ ధ్యానముద్రాం

ఏకామ్రాధీశ్వర చరణయోః ఏకతానాం సమింధే

తాటంకోద్యన్మణిగణరుచా తామ్రకర్ణప్రదేశా

తారుణ్యశ్రీ స్తబకితతనుః తాపసీ కాపి బాలా II 78 II

సీII  ఏకామ్రనాథీశు శ్రీకరపదసుమ ధ్యానభంగిమనున్నధన్యురాలు,

సకలభువనమాత ముకుళితవరహస్త, చిత్తమేకాగ్రతన్ జెలఁగనుండి,

తాటంకమణిజన్య తామ్రవర్ణము చెవి భాగంబులెఱ్ఱగా వరలఁ జేయ,

యౌవన సంపదనలరుపూగుత్తుల సొగసుతోనొప్పెడి యగణితముగ

తే.గీ.II  బాల యొక్కతె కంచిని వరలుచుండె

ఘోర తపమును జేయుచున్ గూర్మితోడ,

కంచికామాక్షి యాయమ్మ కరుణతోడ

కేలుమోడ్చెడి నన్ను రక్షించుగాక.

తాII ఏకామ్రేశ్వరుని పాద పద్మాలపై ధ్యాన భంగిమలో ఉన్న ఒక యువకురాలు, తేజోవంతమైన నవ యవ్వనంతో, ఆమె రత్నాలు పొదిగిన చెవి ఆభరణాల  నుండి తేజస్సుతో, ఆమె చెవుల చుట్టూ ఎర్రటి ఛాయతో, తపస్సు చేస్తోంది. 

శ్లోII  దంతాదంతిప్రకటనకరీ దంతిభిర్మందయానైః

మందారాణాం మదపరిణతిం మథ్నతీ మందహాసైః

అంకూరాభ్యాం మనసిజతరోః అంకితోరాః కుచాభ్యాం

అంతః కాంచి స్ఫురతి జగతాం ఆదిమా కాపి మాతా II 79 II

సీII  మందగమనమున మదపుటేనుగుతోడ యుద్ధంబు ప్రకటించు యోధురాలు, 

మందారపూల యమంద గర్వంబునే మందహాసంబున మాయఁ జేయు,

నలకామదేవ భూజాంకురము, కుచాంకితోరమ్మయిన యట్టి చారుశీల,

లోకమ్ములకునొక్క లోకేశ్వరిగనొప్పుశ్రీకరమైనట్టి చిద్విభాస,

తే.గీ.II  కంచిలోనొక్క దేవత కాంక్షితముల

నెల్ల భక్తులకును దీర్చ నుల్ల మలర

నొప్పి యున్నది సృష్టికే గొప్పగాను,

శివుని యర్థాంగి కామాక్షి, భవముబాప.

తాII తన నిదానమైన మనోహరమైన నడకతో ఏనుగును అధిగమించేటువంటి, మందార పువ్వుల అహంకారాన్నిచూర్ణం చేసే ప్రకాశవంతమైన చిరునవ్వు కలిగినటువంటి, కామదేవ వృక్షం నుండి మొలకెత్తిన మొలకలను పోలినటువంటి, అన్ని లోకాల పురాతన తల్లి కంచిలో ప్రకాశిస్తుంది.

శ్లోII  త్రియంబకకుటుంబినీం త్రిపురసుందరీం ఇందిరాం

పుళిందపతిసుందరీం త్రిపురభైరవీం భారతీం

మతంగకులనాయికాం మహిషమర్దనీం మాతృకాం

భణంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే II 80 II

సీII  త్రిపురసుందరి తల్లి, త్రిపురభైరవి, త్ర్యంబ కకుటుంబినియు, మాతృకయును మరియు, 

యిందిర, మాతంగి, యిలపుళిందపతికి రాజ్ఞియు, మహిషమ ర్దనిగ, భార

తిగ, కంచిలో మాకు తగు మేలు చేయంగఁ గలుగు కామాక్షి! మా కల్పవల్లి! 

విబుధ వరులు నిన్ను వివిధరీతులతోడ ప్రీతిని బిల్చుచు ఖ్యాతిగాను

తే.గీ.II  సేవలందింతురమ్మవిశేషముగను!

నేనునున్ నిన్ను మదినెంచి నిత్యమిట్లు

గొలుచుచుంటిని, నన్ జూచి పలుకవమ్మ!

పలుకులిమ్ము నిన్ స్తుతి చేయఁ బరవసించి.

తాII ఓ కామాక్షీ! త్రియంబకుటుంబినియని, త్రిపురసుందరియని, ఇందిరయని, పుళిందనాథసుందరి యని, త్రిపురభైరవియని, భారతియని, మతంగకులనాయికయని, (మాతంగి) మహిషాసుర మర్దినియని, మాతృకయని ('అ' కారాది 'క్ష' కారాంత వర్ణమాలామంత్రరూపిణి అని), నీ విహృతినే యనఁగా నీ అవతారవిహారవిశేషములనే విబుధవరులు పలువిధములుగ బేర్కొనుచుందురు.


శ్లోII  మహామునిమనోనటీ మహితరమ్య కంపాతటీ

కుటీరకవిహారిణీ కుటిలబోధసంహారిణీ

సదా భవతు కామినీ సకలదేహినాం స్వామినీ

కృపాతిశయకింకరీ మమ విభూతయే శాంకరీ II 81 II

సీII  మునిమనోనటి, వక్రబోధసంహారిణి, సకలదేహులకును స్వామినియును,

ఘనమైన వినుతమౌ కంపాతటీ కుటీరక విహారిణియునౌ రమ్యనదియు,

దివ్యమయిన కృపాతిశయ కింకరి శాంకరి విభూతి, కలలపంట,

యగు గాక సతత మీ నగరాజ సత్పుత్రి, జగతిని నడిపించు నయనిధాన,

తే.గీ.II  జయము, జయమమ్మ జగదంబ! జయము నీకు,

భయము మా లోనఁ బోఁగొట్టి నియతితోడ

మెలఁగుమార్గాన నడుపుమా మేలుగనగ,

సకలసద్గుణ శుభమణీ! శంభురాణి!

తాII మునుల మనోరంగములందు నటించు నర్తకి, కంపాతటీకుటీరముల విహరించు నది, కుటిలబోధమును (అజ్ఞానమును) హరించునది, సకలశరీరులకు స్వామినియగు భామిని కృపావిశేషమునకు గింకరి కృపకు లోబడు తల్లియునగు శాంకరి మా సకలవిభూతులకు హేతువగుగాక. 

శ్లోII  జడాః ప్రకృతినిర్ధనాః జనవిలోచనారుంతుదాః

నరా జనని వీక్షణం క్షణమవాప్య కామాక్షి తే

వచస్సు మధుమాధురీం ప్రకటయంతి పౌరందరీ-

విభూతిషు విడంబనాం వపుషి మాన్మథీం ప్రక్రియాం II 82 II

తే.గీ.II  అమ్మ! కామాక్షి! నీకటాక్షమ్ములున్న

జడుఁడు తీయగా పల్కెడి జాణ యగును,

పేద దేవేంద్రవైభవోపేతుఁడగును,

రూపహీనుఁడు మన్మథరూపుఁడగును.

తాII అమ్మా కామాక్షీ! నీ కటాక్ష పాత్రులయిన జడులుకూడ తేనియలతీపి గల మాటలు గలవారయ్యెదరు. ఆగర్భదరిద్రులు దేవేందైశ్వర్యసంపన్నులు కాగలరు. కురూపులు నవమన్మధ సుందరులయి విలసిల్లుదురు.

శ్లోII  ఘనస్తనతట స్ఫుటస్ఫురిత కంచులీ చంచలీ

కృతత్రిపురశాసనా సుజనశీలితోపాసనా

దృశోః సరణిమశ్నుతే మమ కదా ను కాంచీపురే

పరా పరమయోగినాం మనసి చిత్కలా పుష్కలా II 83 II

సీII  స్తనసుందరత్వమున్ గనఁ జేయు కంచుక ధారియై శివుని చిత్తము రగిల్చి,

భక్తులచేత నుపాసింబడునది, సర్వోత్తమంబౌ ప్రశస్తికలది,

పరమయోగులయొక్క పావన హృదయాలలోనుండునట్టి విలోలనయన,

పూర్ణస్వరూపిణి, మునిజన సేవిత, భోగభాగ్యములిచ్చు పూవుబోడి,

తే.గీ.II  పూర్ణమైనట్టి కామాక్షి పూజ్య జనని,

కంచి పురమున వెలిగెడి కల్పవల్లి,

నాదు కనులకునెప్పుడు నయము కదుర

దర్శనం బిడునో కదాతనివితీర?

తాII స్తనసౌందర్యాన్ని ప్రకాశింపజేసే కంచుకమును ధరించి త్రిపుర శాసనుడైన శివుని చంచలింపజేసినది, సుజనులచే ఉపాసింపబడునది, సర్వోత్తరయైనది (పరా), పరమయోగుల హృదయాలలో వెలిగెడు చైతన్యకళ, పూర్ణరూపిణియైన తల్లి, కాంచీపురము నందు నా కనులకెప్పుడు దర్శనమిచ్చునో కదా!

శ్లోII  కవీంద్రహృదయేచరీ పరిగృహీత కాంచీపురీ

నిరూఢకరుణాఝరీ నిఖిలలోకరక్షాకరీ

మనః పథదవీయసీ మదనశాసనప్రేయసీ

మహాగుణగరీయసీ మమ దృశోస్తు నేదీయసీ II 84 II

తే.గీ.II  కవుల మదులందుఁ జరియించు కంచి నిలయ,

కరుణ రస ఝరి, లోకరక్షణ చణయును,

గుణ గరీయసి, శివపత్ని, ఘన సుహృదయ

మార్గమునకు దవ్వైనది, మమ్ముగనుత.

తాII కవీంద్రులహృదయమందు జరించునది, కాంచీపురిని జేరియుండునది, ప్రఖ్యాత కరుణారస నిర్ఘరియై సర్వలోకరక్షణమాచరించునది, మహాగుణగరీయసియు, మదన వైరి ప్రేయసియు, మనోమార్గమునకు దవ్వయినదియు నగు తల్లి నా చూపులకు దారసిల్లు గాక.

19 – 3 – 2024.

శ్లోII  ధనేన న రమామహే ఖలజనాన్న సేవామహే

న చాపలమయామహే భవభయాన్న దూయామహే

స్థిరాం తనుమహేతరాం మనసి కిం చ కాంచీరత-

స్మరాంతకకుటుంబినీ చరణ పల్లవోపాసనాం II 85 II

చంII  ధనమును చూచి పొంగ మిక ధాత్రిని దుష్టులసేవ చేయ, మెం

దును చపలత్వ మొంద మిల దుష్టభవంబన భీతి చెంద మీ

శుని వర కంచి వాస సతి శుభ్రపదద్వయపల్లవంబులన్

బ్రణవముగాఁ దలంచుచు నుపాసన చేసెదమెల్లవేళలన్.

తాII ధనమునకు పొంగము, దుష్టులసేవింపము, చపలత్వము నొందము, భవభయమునం బరితపింపము, మఱి కాంచీవిహారకుతూహలినియైన పురవైరి యిల్లాలి చరణపల్లవముల యుపాసనను మనసునందు సుస్తిర మొనరించుకొందుము.

శ్లోII  సురాః పరిజనా వపుర్మనసిజాయ వైరాయతే

త్రివిష్టపనితంబినీ కుచతటీ చ కేళీగిరిః

గిరః సురభయో వయః తరుణిమా దరిద్రస్య వా

కటాక్షసరణౌ క్షణం నిపతితస్య కామాక్షి తే II 86 II

శాII  అమ్మా! నీ కను చూపు సోకిననె పేదైనన్ రమానాథుఁడౌన్,

నెమ్మిన్ దేవతలెల్ల సేవకులగున్, నిత్యస్మరోత్తేజుఁడౌన్,

మిన్నౌదేవనితంబినీ కుచగిరుల్ నిత్యంబు కేళీగిరుల్,

క్రన్నన్ వానికి నౌను, వాఙ్మియగుచున్ బ్రాయుండగున్ నిత్యమున్. 

తాII కామాక్షీ! ఎవడు నీ ప్రక్క చూపుల బాటలో పడుతాడో, అతడు మిక్కిలి దరిద్రుడైనప్పటికీ, అతనికి దేవతలు సేవకులుగా మారతారు,  అతడు తన దేహపు  సొగసులో కామదేవుని మించినవాడు , మూడు లోకములలో అతి సుందరమైన దేవకాంతల యొక్క వక్షస్థలము అతని క్రీడా గిరులు అగును, అతని పదాలు మధురమైన వాసన మరియు అతని వయస్సు శాశ్వతమైన యవ్వనము. 

శ్లోII  పవిత్రయ జగత్రయీ విబుధబోధ జీవాతుభిః 

పురత్రయవిమర్దినః పులక కంచులీదాయిభిః

భవక్షయవిచక్షణైః వ్యసనమోక్షణైర్వీక్షణైః

నిరక్షరశిరోమణిం కరుణయైవ కామాక్షి మాం II 87 II

మII  త్రిజగత్ పండిత జ్ఞానమూలమగు సద్దివ్యౌషధంబున్, జగ

ద్విజితానంగుని మేని బుల్కలకు భావింపన్ గారణంబున్, సదా

సుజనాళిన్ భవబంధబాహ్యులుగ సత్ శోభన్ గృపన్ జేయుచున్

నిజశక్తిన్ వ్యసనాళిఁ బాపు పదముల్ నీవమ్మ! కామేశ్వరీ!

తాII ఓ కామాక్షీ! ముల్లోక పండితుల జ్ఞానమునకు జీవనౌషధములు, పరమశివు నెమ్మేను పులకరింపజేయునవి, సంసారమును క్షయింపజేయు విచక్షణగలవి, వ్యసనములను విడి పింపజేయునవి అయిన నీ చూపులచే దయతో నిరక్షరశిరోమణి

యైన నన్ను బవిత్రుని జేయుము.

శ్లోII  కదా కలితఖేలనాః కరుణయైవ కాంచీపురే

కలాయముకులత్విషః శుభకదంబ పూర్ణాంకురాః

పయోధరభరాలసాః కవిజనేషు తే బంధురాః

పచేలిమకృపారసాః పరిపతంతి మార్గే దృశోః II 88 II

తే.గీ.II  కంచిలోపలఁ గరుణఁ గ్రీడించునవియు,

శింశుపపుకాంతిఁ గలిగి భాసించునట్టి,

శుభకదంబపూర్ణాంకుర శోభనొప్పి,

స్తనభరాలస, కవిబంధ సదయదృష్టి

యెపుడుపరతువో నాపైన నీశురాణి! 

తాII కాంచీపురమున గరుణతో క్రీడించునవి, కళాయకుసుమ (ఇఱుగుడుపువ్వుచే) కాంతి నింపైనవి, శుభములనెడి కడిమితరువులచీరు మొలకలయినవి, కుచభరముచే నల సము లైనవి, కవిజనులయందు పరిపూర్ణములైనవియు, నగు పరిపక్వకృపారసములు నా యం దెపుడు గురియునో కదా' !

శ్లోII  అశోధ్యమచలోద్భవం హృదయనందనం దేహినాం

అనర్ఘమధికాంచి తత్ కిమపి రత్నముద్ ద్యోతతే

అనేన సమలంకృతా జయతి శంకరాంకస్థలీ

కదాస్య మమ మానసం వ్రజతి పేటికావిభ్రమం II 89 II

తే.గీ.II  కన నశోధ్య మచలజము, మనసు పొంగఁ

జేయు దేహులకు నిల కంచి నిలయయున

నర్ఘరత్నమ్ము, భవునొడినమరి శోభ

గొలుపు, దానిపై  నామది నిలుచునెపుడొ?

తాII శోధ్యము కానిది, కొండనుండి పుట్టినది, ప్రాణుల హృదయుము నానందింప జేయునది, వెల కట్టలేనిది, కాంచీనగరమందున్నట్టిదియునైన, ఆ రత్నము (అమ్మవారు) ప్రకాశించుచున్నది. శివుని యొడి ఈ రత్నముచే అలంకరింపబడి సర్వోత్కర్షముగా వర్ధిలుచున్నది. ఈ రత్నమునకు నా మనసెప్పుడు పెట్టెగా నుండునో.

శ్లోII  పరామృతఝరీప్లుతా జయతి నిత్యమంతశ్చరీ 

భువామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా

మహద్భిరపరోక్షితా సతతమేవ కాంచీపురే

మమాన్వహమహంమతిః మనసి భాతు మాహేశ్వరీ II 90 II

తే.గీ.II  పర సుధా ఝరీ ప్లుతయును, వరలు జ్ఞాన

రూప, జీవులకు బయటన్ లోపలఁ గల,

యాత్మ, కంచి నొప్పుచు, మహితాత్ములకును

కంటబడు తల్లి, నాలోనఁ గలుగుగాక. 

తాII పరమజ్ఞానైకరూపిణియై, పరమానందామృత ప్రవాహపరిప్లుతయై, జీవుల లోపలను వెలుపలను జరించునదై, కాంచీపురమున మహానుభావులచే దర్శింపఁబడునదై, యలరు పూర్ణాహంభావ స్వరూపిణియైన మహేశ్వరి నా మనసున దేవతగా భాసించుగాక !


శ్లోII  తమోవిపినధావినం సతతమేవ కాంచీపురే

విహారరసికా పరా పరమసంవిదుర్వీరుహే

కటాక్షనిగళైర్ధృఢం హృదయదుష్టదంతావలం

చిరం నయతు మామకం త్రిపురవైరి సీమంతినీ II 91 II

తే.గీ.II  ఘన తమోవిపినంబున మనగ తిరుగు

నాదు మదికరిన్ గామాక్షి! నీదు కామ

కోటి సుజ్ఞానమనియెడి రాటఁ నిలుప

నీ కటాక్షమన్ గొలుసుతో నీవె కట్టు.

తాII తమోగుణరూపమైన యడవిలో నురుకుచు పరుగులెత్తెడి నా హృదయమనెడి మదపుటేనుగును సాధనతో మళ్ళించి మచ్చికచేసి కాంచీవిహారకౌతుకముగొన్న పరమ శివుని రాణివాసము (కామాక్షి ) పరమార్థజ్ఞానరూపమైన చెట్టునకు తన కటాక్షము అనెడి గొలుసులచే నంటగట్టుగాక !

శ్లోII  త్వమేవ సతి చండికా త్వమసి దేవి చాముండికా

త్వమేవ పరమాతృకా త్వమపి యోగినీరూపిణీ

త్వమేవ కిల శాంభవీ త్వమసి కామకోటీ జయా

త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే II 92 II

తే.గీ.II  నీవె చండిక, కామాక్షి! నీవె విజయ,

నీవె జయవు, శంభునిసతి, నీవె యోగి

ని, భువన జనని, చాముండ, నీవె కోర్కె

లకు ముగింపువు, సకలములకును నీవె.

తాII ఓ కామాక్షీ! నీవు చండికవి. నీవు చాముండికవి. నీవు దివ్యమాతవి. నువ్వు కూడాయోగినివి. నీవు శంభుని భార్యవి. నీవు కామకోటివి, కోరికలన్నింటికి అంతం. నీవు జయవి మరియు విజయవి. మూడు లోకాలు నీలోనే ఉన్నవి. ఇంక  చెప్పుట కేమున్నదమ్మా? 

శ్లోII  పరే జనని పార్వతి ప్రణతపాలిని ప్రాతిభ-

ప్రదాత్రి పరమేశ్వరీ త్రిజగదాశ్రితే శాశ్వతే

త్రియంబకకుటుంబినీ త్రిపదసంగిని త్రీక్షణే

త్రిశక్తిమయి వీక్షణం మయి నిధేహి కామాక్షి తే II 93 II

తే.గీ.II  పరశివా! త్రిలోచని! భక్తి ప్రణత సుజన

పాలినీ! త్రిశక్తిస్వరూపా! త్రియంబ

కేశ్వర కుటుంబినీ! దృష్టి కృపను పరుచు

నాపయిన్ వర కామాక్షి! పాపదూర!

తాII పరశివా! ఓ పార్వతీ! ప్రతిభాప్రదాత్రి! ప్రణతజనపాలిని! త్రిపదసంచారిణి! త్రిలోచని! త్ర్యంబకేశ్వరునికుటుంబిని! శక్తిత్రయస్వరూపిణి! కామాక్షీ! నీ కటాక్షములను నా పైని బ్రసరింపజేయగదమ్మా.

శ్లోII  మనోమధుకరోత్సవం విదధతీ మనీషాజుషాం

స్వయంప్రభవవైఖరీ విపినవీథికాలంబినీ

అహో శిశిరితా కృపామధురసేన కంపాతటే

చరాచరవిధాయినీ చలతి కాపి చిన్మంజరీ II 94 II

తే.గీ.II  సజ్జన హృదయ భృంగాళి సంతసమును

పెంచు చిన్మయ మంజరి పిత్ర్యమనగ

కృపను జలువలనించుచు ప్రపగ నిలిచె

వేదవేదికపై, సృష్టి ప్రీతి నడుప.

తాII సజ్జనుల మనసులనెడి తుమ్మెడల కానందము నించు నొక చిన్మయ పుష్పమం జరి కృపామధురిమచే జలువలనించుచు బ్రహ్మనుండి ప్రవృత్తములయిన వేదములనెడి వైఖరీ రూపమైన వేదికపై నిలిచి యీ చరాచరసృష్టిక ర్తియై చరించుచున్నది.

శ్లోII  కళావతి కలాభృతో ముకుటసీమ్ని లీలావతి

స్పృహావతి మహేశ్వరే భువనమోహనే భాస్వతి

ప్రభావతి రమే సదా మహితరూపశోభావతి

త్వరావతి పరే సతాం గురుకృపాంబుధారావతి II 95 II

సీII  మకుటమందున శశి మానితముగఁ గల్గి, లీలలన్ గలిగిన బాలవమ్మ!

పతిని ప్రేమగ చూచు ప్రభ గల తల్లివి, సుప్రకాశపు రూప శోభకలిగి,

త్వరగల, కృపయను నిరుపమ జలధార వరలగొల్పెదవీవు నిరుపమాన,

పరమునందెప్పుడున్ నిరుపమముగ నీదు ధ్యానంబునందుండి హాయికనుదు,

తే.గీ.II  కంచి కామాక్షి! ప్రోవ నీకన్ననెవరు

నాకు కలుగుదు రోయమ్మ? నయనిధాన!

వందనంబులు చేసెద నందుకొనుము,

జయము నీవని యనుటకు సాక్షి నీవె.

తాII కిరీటమున చంద్రుని గల, లీలలు గల, మహేశ్వరునియందు కోరిక గల, ప్రభ గల, ప్రకాశించు గొప్ప రూప శోభగల, త్వర గల, గొప్ప కృప యను జలధార గల పరము (అమ్మవారు) నందు ఎల్లప్పుడు రమించుచుండెదను.

శ్లోII  త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే

త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే

త్వయైవ ఖరకోపయా నయనపావకే హూయతే

త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే II 96 II

తే.గీ.II  జగతికంబవు నీచేత జగములొలయు,

కరుణకలిగిన నీచేత కావఁబడును

కంటిమంటచే హోమమే ఘనముగనగు,

నిత్యసత్యవౌ నీచేత నిత్యమగును.

తాII జగదంబవైన నీచే భువనము లుదయించుచున్నవి. కరుణారసార్ద్రంవైన నీచేత నవి

పాలింపబడుచున్నవి. తీవ్రకోపవైన నీచేత (వుహాకాళిచేత) నయనాగ్నిలో హోమము

చేయబడుచున్నవి. నిత్యసత్యవైన నీచేతనే యని నిత్యస్థితి నందుచున్నవి.

20 – 3 – 2024.

శ్లోII  చరాచరజగన్మయీం సకలహృన్మయీం చిన్మయీం

గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం

పరాపరమయీం సదా దశదిశాం నిశాహర్మయీం

పరాం సతతసన్మయీం మనసి చిన్మయీం శీలయే (కామకోటీం భజే) II 97 II

సీII  కదలని, కదులు సకలమునుండెడిదాన! అన్ని హృదయాలలోనున్నదాన!

జ్ఞానపూర్ణా! సతీ! కలుగు త్రిగుణపూర్ణ! ముల్లోకములనుండు తల్లివమ్మ,

రాత్రింబవళ్ళునున్ రాజిలు కామాక్షి!కన పరారూపవై కదలుతల్లి!

సత్తాస్వరూపమై సకలంబునందుండు సౌమ్యరూపిణివమ్మ సకల జనని!

తే.గీ.II పరమచైతన్య రూపిణీ! భక్తపాళి

కోర్కెలను తీర్చ కంచిలో కొలువు తీరి

పరమశివునకు మోదంబు నిరుపమముగ

కలుగఁజేసెడి తల్లి! నన్ గనికరించు.

తాII కదిలేవీ కదలనివన్నిటియందున్నదానా! సకలహృదయాలలో నిండినదానా! జ్ఞానముచేనిండినదానా! మూడుగుణాలలో నిండినదానా! ముల్లోకాలలో, రాత్రింబవళ్ళలో నిండియున్నదానా! పరారూపిణి! ఎల్లపుడు సత్తారూపమైనదానా! పరమచైతన్యరూపిణీ! సదానిన్ను విమర్శిస్తాను.

వి.వి. (అపరా– సరాగులచే పూజనందునది, పరాపరా-అటు పిమ్మటిదశ, పరా- విరాగులచే సేవింపబడునది.)

శ్లోII  జయ జగదంబికే హరకుటుంబిని వక్త్రరుచా

జితశరదంబుజే ఘనవిడంబిని కేశరుచా

పరమవలంబనం కురు సదా పరరూపధరే

మమ గతసంవిదో జడిమడంబర తాండవినః II 98 II

తే.గీ.II  లోక మాత!  శివుని పత్ని! శ్రీకరమగు

కనుల కాంతితోన శరత్తు కమలములను

గెలిచితివి, పరరూపిణీ! కేలుపట్టి

జడిమ డంబరమును బాపి నడుపు నన్ను.

తాII జగదంబా! శివుని ఇల్లాలా! కన్నులకాంతితో శరత్కాల కమలకాంతిని జయించినదానా! తలకట్టుకాంతితో మేఘకాంతిని క్రిందుచేసినదానా! పరరూపధారిణీ! జ్ఞానాన్ని కోల్పోయి, అజ్ఞానపు తాండవంగలిగిన నాకు ఎల్లప్పుడు గొప్పనైన చేయూతనిమ్ము తల్లీ! (దృశ్యమాన త్రిపుటీరూప ప్రపంచసృష్టికి ఆవల యున్నది- ‘పర’రూప)

శ్లోII  భువనజనని భూషాభూతచంద్రే నమస్తే

కలుషశమని కంపాతీరగేహే నమస్తే

నిఖిలనిగమవేద్యే నిత్యరూపే నమస్తే

పరశివమయి పాశచ్ఛేదహస్తే నమస్తే II 99 II

తే.గీ.II  లోకమాత! చంద్రవిభూష! నీకు నతులు,

సర్వవేదసువేద్యవు,  శాశ్వతవును, 

పరశివమయివి, మహిత కంపాతటస్థ!

పాశవిచ్ఛేదహస్తవు, పాపనాశ! 

తాII తా. లోకమాతా! చంద్రాభరణా! పాపహారిణీ! కంపాతీరగృహిణీ! సర్వవేదములచే తెలియదగినదానా! శాశ్వతరూపా! పరశివతత్త్వంతో నిండినదానా! పాశములను ఛేదించే హస్తములు కలదానా! నీకు నమస్కారము.

శ్లోII  క్వణత్కాంచీ కాంచీపుర మణివిపంచీ లయఝరీ-

శిరః కంపా కంపావసతిః అనుకంపాజలనిధిః

ఘనశ్యామా శ్యామా కఠినకుచ సీమా మనసి మే

మృగాక్షీ కామాక్షీ హరనటనసాక్షీ విహరతాత్ II 100 II

సీII ధ్వనిచేయు వడ్డాణమును గలతల్లివి, నుత మృగాక్షీ నీకు నతులు, గొనుము,

కాంచీపుర మణివిపంచిలయఝరికి తలయూపి మెచ్చెడి తరళనయన!

కంపానదీతీర కమనీయ వాసము కలిగిభక్తులఁ గాచు కల్పవల్లి!

అనుకంపసంద్రమా! ఘన కుచసీమ! యౌవనమధ్య! కామాక్షి! జీవమీవె,

తే.గీ.II  హరనటనసాక్షి పరికింపనమ్మ నీవు,

మేఘమును గేలు చేయు నీ మేని చాయ.

నాదు మదిలోన వసియించి నన్నుఁ గనుము,

బంధనంబులు బాపి నన్ వరలఁ గనుము.

తాII మ్రోగుచున్న మొలనూలు మణులచే ఒప్పుతూ, కాంచీపురంలోని మణుల వీణల వాద్యప్రవాహానికి మెచ్చుకోలుగా తల ఊపుదానవు, కంపానదీతీరవాసము కలిగిన దయాసముద్రానివి, మేఘమువలె నల్లనైన దానివి, శ్యామాదేవియు, కఠినమైన పాలిండ్లుకలతల్లివై, జింకకన్నులు కలదానివై, కామాక్షీ దేవివై, శివుని తాండవమునకు సాక్షివై ఉన్నతల్లీ, నా మనస్సులో విహరింతువుగాక!


శ్లోII  సమరవిజయకోటీ సాధకానందధాటీ

మృదుగుణపరిపేటీ ముఖ్యకాదంబవాటీ

మునినుతపరిపాటీ మోహితాజాండకోటీ

పరమశివవధూటీ పాతు మాం కామకోటీ II 101 II

మాలని.  సమర విజయ రూపా!సాధకానంద దీపా!

యమిత మృదు గుణాత్మా! ఆది కాదంబ వర్త్మా!

ప్రముద ముని శరణ్యా! బ్రహ్మకోటి ప్రగణ్యా!

ప్రమద శివుని భామా! పాహి కామాక్షి! హైమా!

తే.గీ.II  సమర విజయ వానందవా సాధకులకు,

మృదుగుణపుపేటివి, కదంబ సాధువాటి!

ముని నుత పరిపాటి వజాండ మోహితవును,

వర శివ వధూటి! నన్ను కాపాడుమమ్మ!

తాII యుద్ధాలలో విజయస్వరూపమా! సాధకులకు కలిగే తీవ్రానంద స్వరూపమా! మృదువైన గుణాల మణులపేటికా! కదంబవనాలనే ముఖ్యంగా గలదానా! మునులచే స్తుతింపబడుదానా! బ్రహ్మాండకోటులను మోహింపజేయుదానా! పరమశివుని ఇల్లాలా! కామకోటినిలయా! నన్ను రక్షించుతల్లీ!

శ్లోII  ఇమం పరవరప్రదం ప్రకృతిపేశలం పావనం

పరాపరచిదాకృతి ప్రకటన ప్రదీపాయితం

స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్ అంబికాం

జపైరలమలం మఖైః అధికదేహ సంశోషణైః II 102 II

తే.గీ.II  పరము మోక్షమ్ము వరముగా వరలనిచ్చు,

నుత పరాపరాకృని నెన్ని క్షితిని జూపు,

స్తుతిశతకపాఠనము చేయుచో కృశింపఁ

జేయు వ్రతముల పనియేమి? శ్రీకరమిది.

తాII పరమును మోక్షమును వరముగా ప్రసాదించునది, గొప్ప చిన్న జీవుల ఆకృతులకు స్వస్వరూపమును చూపించుటలో ప్రదీపమైన ఈ స్తుతిని పఠించినచో ఎక్కువగా దేహమును పీడించు జపములతో గాని యజ్ఞములతో గాని పనిలేదు.

21 – 3 – 2024.

II స్తుతి శతకం సంపూర్ణం II

కృతికర్త.  

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165


రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.

44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.

45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)

46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.

స్వస్తి.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.