గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

2. పాదారవింద శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) ఆంధ్ర పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్. 

పాదారవింద శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) 

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.


శ్లోII  మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని

ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోಽపి కతమః I

తథాపి శ్రీకాంచీవిహృతిరసికే కోಽపి మనసో

విపాక స్త్వత్పాద స్తుతివిధిషు జల్పాకయతి మామ్ II 1 II

శాII  శ్రీమత్కంచి విహారభాగ్య రసికా! శ్రీకంచి కామాక్షి! నీ

శ్రీమన్మార్గమహత్వమున్ దెలుపగాఁ జింతింప లేరెవ్వరున్,

నీ మందస్మిత చంద్రికామృతము నన్నే సోకి ప్రేరించి శో

భామార్గంబున నిన్ నుతింప నడపెన్ వాఙ్మాధురిన్ గొల్పుచున్.

తాII ఓ కాంచీ విహారరసికా! నీ మహిమమార్గ మిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాఁడును జాలఁడు. ఐనను నామనఃపరిపాక మేమో కాని నీ పాదములను కొనియాడుటలోనన్ను వాచాలుని జేయుచున్నది.

శ్లోII  గలగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం

ధృత ప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురుః I

సమిన్ధే బన్ధూక స్తబకసహయుధ్వా దిశి దిశి

ప్రసర్పన్ కామాక్ష్యాశ్చరణ కిరణానా మరుణిమా II 2 II

శాII  కామాక్షీచరణారుణప్రభలు లోకంబంత వ్యాపించుచున్

శ్రీమత్కల్పక పల్లవారుణ రుచిశ్రీకిన్ గళగ్రాహియై, 

ప్రేమన్  సంధ్యసువర్ణకాంతి గురువై విఖ్యాతిగా వెల్గుచున్,

శ్రీమన్మంకెనపూలఁ గేలికొనుచున్ చెల్వొందుచుండెంగదా. (గళగ్రాహి=శత్రువు)

తాII కల్పతరుపల్లవకాంతులకు శత్రువై ఉదయసంధ్యారాగచ్ఛాయలకు దొలి గురువై

మంకెనపూగుత్తులతో తగవాడునదై కామాక్షి చరణకిరణ రక్తిమ దశదిశలం దలమి

వెల్గొందుచున్నది.

శ్లోII  మరాలీనాం యానాభ్యసన కలనా మూలగురవే

దరిద్రాణాం త్రాణవ్యతికర సురోద్యాన తరవే I

తమస్కాణ్డ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే

జనోಽయం కామాక్ష్యా శ్చరణ నలినాయ స్పృహయతే  II 3 II

తే.గీ.II  నలువరాణి రాయంచకున్ నడక నేర్పు,

పేదలను గాచు కల్పకవేల్పుతరువు,

చీకటులయుద్ధతిన్ మాపు చాకచక్య,

కంచికామాక్షి చరణముల్ గాంచు వీడు.

తాII రాయంచలకు నడకనేర్పు మొదటిగురువై, దరిద్రుల సంరక్షించునెడ కల్పతరువై,

చీకఁటుల యౌద్ధత్యప్రకటన మెదిరించుదిట్టయై యున్న కామాక్షీచరణకమలముల కొఱకు వీడు (నే నన్నమాట) వేడుకపడుచున్నాడు.

శ్లోII  వహన్తీ సైన్దూరీం సరణి మవనమ్రామరపురీ -

పురంధ్రీ సీమన్తే కవికమల బాలార్క సుషమా I

త్రయీ సీమన్తిన్యాః స్తనతట నిచోలారుణపటీ

విభాన్తీ కామాక్ష్యాః పదనలిన కాన్తిర్విజయతే II 4 II

తే.గీ.II  నమ్రతనునొప్పు దేవకాంతలకునొసటి

కుంకుమగ, సుకవికమలకోమలులకు

గోపతిగ, శ్రుతి కామినీ కుచతటముల

నెఱ్ఱ పైటమ్మపాదమ్ము లేలు జగతి.

తాII చెంతవ్రాలెడి దేవకాంతల సీమంతసీమలందు కుంకుమరేఖయై, కవులనెడి కమల

ములు వికసింప బాలసూర్యప్రభయై, శ్రుతికామినీకుచతటములం దెఱ్ఱని పైటచెరఁగై

కామాక్షి చరణారవిందరుచి సర్వోన్నతమై యలరుచున్నది.

శ్లోII  ప్రణమ్రీ భూతస్య ప్రణయకలహత్రస్త మనసః

స్మరారాతేశ్చూడావియతి గృహమేధీ హిమకరః I

యయోస్సాంధ్యాం కాంతిం వహతి సుషమాభి శ్చరణయోః

తయోర్మే కామాక్ష్యా హృదయ మపతన్ద్రం విహరతామ్ II 5 II

తే.గీ.II  ప్రణయకలహాన భీతిల్లి వ్రాలినట్టి

శివుని శీర్షగగనవాసి జింకతాలు

పే జనని పాద కాంతిచే నెఱ్ఱఁబారు

నా జనని పాదములు గొల్తు నహరహంబు.

తాII ప్రణయకలహమున భయవివశమైన మనసుతో వ్రాలిన శంకరుని శిరస్సనెడి ఆకా

శమందు ఒకయింటివాఁడై యున్న చంద్రుడు ఏ తల్లిపాదముల కాంతిచే సంధ్యారాగ

కాంతిని వహించునో అట్టి కామాక్షీదేవిచరణములందు నా మనసు మెలకువతో

విహరించుగాక!

శ్లోII  యయోః పీఠాయన్తే విబుధ ముకుటీనాం పటలికా

యయోః సౌధాయన్తే స్వయముదయభాజో భణితయః I

యయోః దాసాయన్తే సరసిజ భవాద్యాశ్చరణయోః

తయోర్మే కామాక్ష్యా దినమను వరీవర్తు హృదయమ్ II 6 II

తే.గీ.II  దేవతల కిరీటమ్ము లే దేవి పాద

పీఠమగు, పొంగు కైతలు వేనికి తగ

సౌధములగు, బ్రహ్మాదులు సతము గొలుచు

ముదము గొలుపు నా పాదముల్ మెదలుత మది.

తాII దేవతాకోటికిరీటకోటి దేనికి పాదపీఠ మగునో, తమంతట నుదయించు కవితా

రీతులు వేనికి సౌధములు (మేడలు) అగునో, బ్రహ్మాదులు వేనికడ దాసులగుదురో,

యట్టి కామాక్షీచరణములందు నా హృదయ మనుదినము వర్తించుగాక!

15 – 02 – 2024.

శ్లోII  నయన్తీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే

సృజన్తీ లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధఖచితా I

కవీన్ద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జననీ

స్ఫురన్తీ కామాక్ష్యాః చరణరుచి సంధ్యా విజయతే II 7 II

సీII  కామాక్షి శ్రీపాద కాంతిసంధ్యాప్రభల్ పద్మప్రభను చిన్నఁ బరచుచుండి,

నఖకాంతికిరణమన్ నవరమ్య శశిరేఖ పొదువఁబడినదయిముదముతోడ

దశదిశలందున తనరార నరుణ కాంతిని గూర్చి యుదయింప దీక్షఁ జేసి,

కవుల హృదయములన్ గలువలకు వికాస మారంభమును గూర్చి యనుపమాన

తే.గీ.II  మగుచు, సర్వాతిశయముగ నలరునమ్మ!

యట్టి నీ పాదపద్మముల్ పట్టినాడ,

నీదు పాదముల్ విడనీకు నాదు మదిని

కాంచికా పురవాసినీ! కరుణఁ జూడు.

తాII కామాక్షీచరణకాంతియను సంధ్య పద్మప్రభను సంకోచింపజేయునదై నఖకాంతికిరణమనెడి అర్ధచంద్రునిచే బొదువఁబడినదై దిశలయం దరుణకాంతి నుదయింపఁజేయునదై కవుల హృదయములనెడి కలువలకు వికాసారంభముఁ గూర్చునదై సర్వాతిశాయియైయొప్పుచున్నది.

శ్లోII  విరావైర్మాంజీరైః కిమపి కథయన్తీవ మధురం

పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే I

వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ-

ప్రరోహం కామాక్ష్యాః చరణయుగలీ సా విజయతే II 8 II

తే.గీ.II  వాలి ముందున్న శివునిపై భవునిరాణి

ప్రేమ కలహప్రరోహంబు వీగఁజేయు

ప్రౌఢయగు వయస్యవలెను రవళిఁ జేయు

నందియలనొప్పి పాదంబులలరుచుండె. 

తాII అందెలరవళిచే నేమేమొ మధురముగ మాట్లాడుచున్నట్లుండి తనముందు

నవ్వుచు వ్రాలిన శివునిపై కామాక్షికి కలిగిన ప్రణయకలహాంకురమును సడలించుటలో ప్రౌఢయగు చెలికత్తెవలె వర్తించు కామాక్షి చరణయుగళి సర్వోన్నతితో నలరుచున్నది.

శ్లోII  సుపర్వ స్త్రీలోలాలక పరిచితం షట్పదకులైః

స్ఫురల్లాక్షారాగం తరుణతరణి జ్యోతిరరుణైః I

భృతం కాంత్యమ్భోభిః విసృమరమరందైః సరసిజైః

విధత్తే కామాక్ష్యాః చరణ యుగలం బన్ధుపదవీమ్ II 9 II

తే.గీ.II  దేవకాంతల కురులను తేటిమూక

కలుగు పాదాళి పారాణి కాంతి బాల

భానునెఱుపు పద్మములతో బాంధవమును

నెఱపు కామాక్షి పాదముల్ నేర్పుమీర.

తాII దేవతాస్త్రీల చలించుముంగురులను తుమ్మెదలతో గూడి పారాణి

లాక్షా రాగముతో నెఱనెఱ్ఱనై కామాక్షిచరణము బాలభాను ప్రభలచే నెఱుపెక్కినట్టియు,

కాంతిపుంజముచే నిండి జాలువారు తేనియలతో నిండినట్టియు పద్మములతో చుట్టరి

కము నెఱవుచున్నది.

శ్లోII  రజః సంసర్గేಽపి స్థితమరజసా మేవ హృదయే

పరం రక్తత్వేన స్థితమపి విరక్తైక శరణమ్ I

అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం

విధత్తే కామాక్ష్యాః చరణ యుగమాశ్చర్యలహరీమ్ II 10 II 

తే.గీ.II రజముతోనొప్పి, యొప్పు నరజసులందు, 

రక్తమయ్యును శరణు విరక్తులకును,

మందగతియయ్యునందదు మందులకును,

గణ్య కామాక్షి శ్రీపాదకమలయుగము.

తాII రజస్సంపర్కము (పరాగసంబంధము) గలదయ్యు రజోగుణ సంబంధము లేని

వారి హృదయమునందే నిల్చినదై, మిగుల రక్తమయ్యు (ఎఱ్ఱనిదయ్యు) విరక్తులకు

మాత్రమే ప్రధానాశ్రయమై మందమతులకు అలభ్యమయ్యు ననవరతము మందగతిని

(మెల్లని నడకను) పూనినదై కామాక్షీ చరణద్వంద్వ మాశ్చర్యపు వెల్లువను జాల్కొ

లుపుచున్నది.

16 – 02 – 2024.

శ్లోII  జటాలా మంజీర స్ఫురదరుణ రత్నాంశు నికరైః

నిషీదన్తీ మధ్యే నఖరుచిఝరీ గాఙ్గపయసాం I

జగత్త్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం

తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాథోజ యుగలీ II 11 II

తే.గీ.II  అందెలందలి మణికాంతి యనెడి జడలు

దాల్చి, నఖకాంతి యనెడి యుదకము నడుమ

నిలిచి లోకరక్షణఁ జేయు నిష్ఠ నమ్మ!

నీ పదంబులు తపమును నెరపఁ బూనె.

తాII అందెలయందు బొదుపఁబడిన పద్మరాగముల తళుకులనెడి జటాధారియై, 

నఖకాంతి ప్రవాహ మను గంగాజలమధ్యమున నిలువఁబడి జగద్రక్షణము సేయుటకై

చరణపద్మద్వయి తపోనిష్ఠను బూనియున్నది.

శ్లోII  తులాకోటి ద్వంద్వ క్వణిత భణితాభీతీవచసోః

వినమ్రం కామాక్షీ విసృమర మహః పాటలితయోః I

క్షణం విన్యాసేన క్షపితతమసోర్మే లలితయోః

పునీయాన్మూర్ధానం పురహర పురంధ్రీ చరణయోః II 12 II

తే.గీ.II  అందెల రవళిచే నిత్య మభయ మిచ్చు,

కాంతిచే నెఱ్ఱనై శోభఁ గదలుచుండు,

తమము పాపు నా పాదముల్ ధన్యతనిడ

శంభు రాణి నా శిరమునన్ జక్క నిడుత.  

తాII అందెలరవళిచే నభయములు పలుకుచు, కాంతిచే నెఱ్ఱనివై సొగసు గుల్కుచు

తమస్సును హరించు తన పాదములను ఒక్క క్షణము నా శిరమునందు మోపి

యా పురహరుని ఇల్లాలగు కామాక్షి నన్ను పవిత్రుని జేయుగాక!

శ్లోII  భవాని ద్రుహ్యేతాం భవ నిబిడితేభ్యో మమ ముహుః

తమోవ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ I

యయోర్లాక్షా బిందు స్ఫురణ ధరణా ద్ధూర్జటి జటా-

కుటీరా శోణాఙ్కం వహతి వపురేణాఙ్క కలికా II 13 II

తే.గీ.II  జనని! నీ పతి శీర్షానఁ జంద్రరేఖ

యెట్టి నీపాదలత్తుకనెఱ్ఱబారు

నట్టి లత్తుకపాదాలు నెట్టుఁ గాక

నాదు సంసార తమమును, నయనిధాన!

తాII ఓ భవానీ! నీకు నమస్కరించు శివుని జటాకుటీరమం దలరు చంద్రరేఖ యే చరణములందలి లాక్షారాగబిందు స్వరణము (చుక్క) దాల్చి కుంకుమతిలకము దిద్దుకొన్నట్లుండునో యట్టినీ చరణములు సంసారముచే గాఢముగ నల్లుకొనిన మదీయ తమోగుణ వ్యామోహపరంపరను నశింపజేయుగాక!

శ్లోII  పవిత్రీ కుర్యుర్నః పదతలభువః పాటలరుచః

పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే I

కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశా

వలన్తో వ్యాత న్వన్త్యహమహమికాం మాధవముఖాః II 14 II

తే.గీ.II  మాధవాదులే పదధూళి మాకు మాకు 

ననుచు తలఁ దాల్చఁ జూతురో యట్టి నీదు

పాదపద్మారుణరజంబు పాపహరణ

నిపుణతను జేయుత పవిత్రునిగను నన్ను.

తాII ఓ పరశివా! విష్ణుప్రముఖులైన దేవతలు వేని పరాగలేశమును తమ తలఁదాల్చు

టకై యెడనెడ వివశులై పరిభ్రమింతురో యట్టి నీ చరణపరాగములు అరుణద్యుతిచే

గుల్కుచు పాపహరణనిపుణములై నన్ను బవిత్రుని జేయుగాక!

శ్లోII  బలా కామాలాభిర్నఖ రుచిమయీభిః పరివృతే

వినమ్ర స్వర్నారీ వికచకచ కాలామ్బుదకులే I

స్ఫురన్తః కామాక్షి స్ఫుటదలిత బన్ధూక సుహృదః

తటిల్లేఖాయన్తే తవచరణ పాథోజ కిరణాః II 15 II

తే.గీ.II  గోళ్ళకాంతి యన్ గొంగల గుంపు కలిగి,

నమ్ర దేవకాంతల కచ నారదమున

స్ఫుట దలిత వర బంధూక సుహృద తతిని

మెఱపుతీగ నీ పాదముల్, స్మేర వదన!

తాII గోళ్ళకాంతులనెడి కొంగలగుంపుచే చుట్టఁబడిన, నమస్కరించెడి దేవతాస్త్రీల విరిసిన కురులనెడి మేఘముల సమూహమున బాగుగా వికసించి ప్రకాశించుచున్న మంకెనపూలకు మిత్రములైన నీయొక్క పాదముల కాంతులు మెఱపు తీగలట్లు శోభించుచున్నవి.

శ్లోII  సరాగః సద్వేషః ప్రసృమర సరోజే ప్రతిదినం

నిసర్గా దాక్రామన్విభుధజన మూర్ధానమధికమ్ I

కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం

నతానాం కామాక్షి ప్రకటయతి  కైవల్యసరణిమ్ II 16 II

తే.గీ.II  నుత సరాగమై ద్వేషంబు ప్రతిదినంబు

జలజములపైనఁ బ్రకటించు, చారునేత్ర!

బుధులతలఁ ద్రొక్కు నీ పాదము లవెటులను

నతుల కొసగు ముక్తిని? చెప్పు మతుల జనని!

తాII దినదినము సరాగమై పద్మకోశములయెడ ద్వేషమును గొని పద్మములకంటె

అందమయి విబుధజనుల తలపై కెక్కి త్రొక్కెడు నీ చరణపద్మము తనదరిని

వ్రాలు సత్పురుషులకు కైవల్యసంపద నిత్తునని చాటించుచున్నది. ఇది యెట్లో చెప్ప

వమ్మా!

శ్లోII  జపాలక్ష్మీ శోణో జనిత పరమజ్ఞాన నలినీ (లహరీ)

వికాసవ్యాసఙ్గో విఫలిత జగజ్జాడ్య గరిమా I

మనః పూర్వాద్రిం మే తిలకయతు కామాక్షి తరసా

తమస్కాణ్డ ద్రోహీ తవ చరణ పాథోజ రమణః II 17 II

తే.గీ.II  కంచికామాక్షి! నీ పాదకమల విభుఁడు

దిరెసెన కుసుమంబన శోణతేజమొంది 

జ్ఞానపద్మ వికాసమున్ ఘనతఁ జేయు,

జాడ్యహారి, నా యెదగిరిన్ సదయఁ బొడుచు.

తాII నీ చరణమను సూర్యుఁడు దాసానిపువ్వువలె నెఱుపొంది పరమార్థ జ్ఞాన

రూపమైన పద్మినికి వికాసము కూర్చువాఁడై జగములందలి గాఢమైన జాడ్యమును

హరించువాఁడై యిప్పుడు నా మనస్సనెడి యుదయాద్రిని తిలకమై తులకించుగాక !

శ్లోII  నమస్కుర్మః ప్రేఙ్ఖన్మణికటక నీలోత్పలమహః

పయోధౌ రింఖద్భిర్నఖ కిరణ ఫేనైర్ధవలితే I

స్ఫుటం కుర్వాణాయ ప్రబలచల దౌర్వానలశిఖా

వితర్కం కామాక్ష్యాః సతతమరుణిమ్నే చరణయోః II 18 II

తే.గీ.II  అలము నఖకాంతికొండచే వెలిగనయిన,

మణుల మంజీర కాంతి యన్ మహిత జలధి

యందు, రేగిన బడబాగ్నియనగ నొప్పు

నమ్మ! నీపాద శోణి కే నంజలింతు.

తాII అలముకొను నఖకాంతులనెడి కొండ(మరువు)లచే వెల్లనై, మిరుమిట్లుగొలుపు మణిమంజీరములందలి యింద్రనీల కాంతియను సముద్రమునందు దీవ్రముగ రేగిన బడబాగ్నిజ్వాలలోయను నూహను కల్పించెడి కామాక్షీచరణముల అరుణప్రభకు నమస్కరింతుము.

శ్లోII  శివే పాశాయేతాం అలఘుని తమః కూపకుహరే

దినాధీశాయేతాం మమ హృదయ పాథోజవిపినే I

నభోమాసాయేతాం సరసకవితారీతీ సరితి

త్వదీయౌ కామాక్షి ప్రసృతకిరణౌ దేవి చరణౌ II 19 II

సీII  కామాక్షి నీ పాద కాంత్యర్చి త్రాడుగా శివుని బంధింపంగ చెలగుగాత,

తమసమన్ గూపాన తల్లడిల్లు జనుల రక్షించుటందున రవిగ నగుత,

దయను నా హృదయమన్ దతమ్మికొలనుఁ గాంచి వికసింపఁజేయంగ వేధ యగుత,

సరసకవన సరోవరము నుప్పొంగింప శ్రావణమాసమై సాగుగాత,

తే.గీ.II  నీదు పాదపద్మప్రభల్ నేర్పుమీర

జనులహృదయాలలో నిల్చి మనఁగఁ జేసి,

ముక్తిమార్గంబు గొలుపుత భక్తినొసగి,

వందనంబులు చేసెదనందుమమ్మ!

తాII దేవీ ! నీ చరణముల ప్రకాశకిరణములు శివుని హృదయమును బంధించు పాశములగుగాక.  దరిలేని తమస్సనుకూపమనుండి జీవుల నుద్ధరించుటయందు,  నా హృదయమను తామరకొలని వికసింపఁజేయుటయందు సూర్యబింబములగుగాక ! సరసకవనసరోవరము నుత్తరంగితము చేయుటయందు శ్రావణమాసములగుగాక !

శ్లోII  నిషక్తం శృత్యన్తే నయన మివ సద్వృత్త రుచిరైః

సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః I

శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే

త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణమ్ II 20 II

సీ.  నీ కన్నులట్టులే నీపాదయుగళియు శ్రుత్యంతమైయొప్పు శోభనాంగి!

సద్వృత్త రుచిరమై, సమమై, విశుద్ధమై, దంతయుక్తాధరకాంతినొప్పు,

కుచయుగ్మమట్టుల కూర్మిని ముక్తాశ్రయంబయియొప్పెడున్, గంబుకంఠి!

కామాక్షి! మా యుమా! కరుణాతరంగిణీ! వరశివా! పద్మాక్షి! భవ్యతేజ!

తే.గీ.II  ప్రణతులగువారి శరణమౌభవ్యమైన

నీదు పాదయుగంబును నేను మదిని

నిలిపి ప్రణమిల్లుచుంటిని, నీరజాక్షి!

భావమందుననిలువుమా, భక్తిఁ గొలుతు.

తాII అమ్మవారి కన్నులవలెనే పాదములు కూడా శ్రుత్యంతములు. మంచి కాంతివంతమై, సమానముగా నొప్పుచు విశుద్ధముగా అధరకాంతితో నొప్పును,  కుచయుగ్మము వలె ముక్తాశ్రయము. ప్రణమిల్లువారికి శరణమగునవయిన నీ పాదారవిందములను మ్రొక్కెదను.

19 – 02 – 2024.

శ్లోII  నమస్యాసంసజ్జన్ నముచి పరిపన్థి ప్రణయినీ

నిసర్గ ప్రేఙ్ఖోలత్కురలకుల కాలాహి శబలే I

నఖచ్ఛాయా దుగ్ధోదధి పయసి తే వైద్రుమరుచాం

ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా II 21 II

కామాక్షీ! శచి వంగి వందనమిడన్ కాలాహినాన్ కేశముల్

తే.గీ.II  ప్రణతులర్పించు శచి కురులనెడి కాల

నాగు నీల వర్ణమునను తోగి శబల

తఁ గను నఖకాంతిసంద్రాన పగడ డంబు

నమరె కామాక్షి! నీ పాదకమలమిచట.

తాII నమస్కరించుటకు దాపునవ్రాలిన శచీదేవియొక్క చెదరెడిముంగురులనెడి నల్ల త్రాచుచే శబలితమైన నఖకాంతులనెడి పాల్కడలియందు నీ పాదారవిందముల కాంతి పవడంబుడంబును పెనుపొందఁ జేయుచున్నది.

శ్లోII  కదా దూరీకర్తుం కటుదురిత కాకోల జనితం

మహాన్తం సంతాపం మదన పరిపన్థి ప్రియతమే I

క్షణాత్తే కామాక్షి తిభువన పరితాపహరణే

పటీయాంసం లప్స్యే పదకమల సేవామృతరసమ్ II 22 II

తే.గీ.II  కటు దురితమను గాకోల గరళతాప

హరణమునకు భువన తాప హరణ మయిన

నీ చరణ పద్మ యుగళి సేవాచరణమ

నెడి సుధను నేను కామాక్షి! పడయు దెపుడొ?

తాII ఓ కామారిసుందరీ ! చేదు పాప విషపాతకమగు గరళము వలని మహాతాపమును

వారింపచేసికొనుటకు త్రిభువన పరితాప నిర్హరణ చణమైన నీ చరణకమల సేవాచరణ

రూపమైన యమృత రసమునేనాటిఁకి బడయగలనో కదా !

శ్లోII  యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే

యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖ రుచిమ్ I

యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం

మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే II 23 II

శాII  ఏ పాదారుణమందఁ గోరుకొనునో యిష్టంబుతో సంధ్యయే,

యే పాదాంచిత సుస్మరాంకుశ ఛవిన్నేణాంకుడర్ధించునో,

యే పాదప్రముఖంపు మార్దవమునే యీవిద్రుమాలెంచునో

యా పాదంబులు దేవి! నాదు మదిలోనాకాంక్షతో నిల్పుమా.  

తాII ఏ పాదములందలి అరుణచ్ఛాయ వడయవలెనని సాంధ్యరాగము ముచ్చటప

డునో ఏ చరణముల నఖకాంతికి వెన్నెల మిక్కిలి తాపమొందునో యే యడుగుల

మార్థవపరిపాకాతిశయమును లేజిగురు లాసక్తిమై నభ్యసింపగోరునో అట్టి శ్రీకామాక్షీ

దేవి దివ్యచరణములను మనసునందు నిలిపికొందును.

శ్లోII  జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః

కుశాగ్రీయ స్వాన్తైః కుశలధిషణైః శాస్త్రసరణౌ I

గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే

గిరామైదంపర్యం (తవ చరణ పద్మం విజయతే) తవ చరణ మాహాత్మ్య గరిమా. II 24 II

తే.గీ.II  కుశలధిషణులైన యతులు, కుశలమతులు

కాదు పరతత్త్వమిది, కాదు కా దటంచు

నీ జగంబును నిరసించి, యిదియె నిజమ

టంచు నీ పాదపద్మము లెంచి రమ్మ!

తాII నైజముగ కుశాగ్రబుద్ధులు శాస్త్రరీతులయందుకూడ కుశలప్రజ్ఞులు అయిన

యతులు పరతత్త్వ మిదికా దిదికాదని యీ జగమ్మును నిరసించినమీఁదట

అకృత్రిమవాక్కులకు (వేదములకు) ఐదంపర్యము ఇదే పర్యవసానార్థము అనగా

నీ చరణప్రభాసంపదను అన్వేషింతురు.

శ్లోII  కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం

దధానం వైశద్యం కలితరసమానంద సుధయా I

అలంకారం భూమేః మునిజన మనశ్చిన్మయ మహా-

పయోధేరంతస్స్థం తవ చరణరత్నం మృగయతే II 25 II

తే.గీ.II  శాస్త్ర పీయూష సరసులన్ స్నానమాడి,

శుచిగ, నానందమయమయి, శోభయగుచు

జగతికి, మునుల మదులను జలధులందు

యత్నమునఁ గాంతు నీ పాదరత్నములను.

తాII శాస్త్రములనెడి యమృతసరస్సులో స్నానము చేసినది యెంతయు వైశద్యమును

(స్వచ్ఛత్వమును) దాల్చినది. ఆనందామృతరసభరితము, భువనాభరణమును మునులమనస్సనెడి చిన్మయమహాసాగరము లోలోననున్న నీ చరణమను 'రత్నము వెదకి పట్టఁ దగియున్నది.

శ్లోII  మనోగేహే మోహోద్భవ తిమిరపూర్ణే మమ ముహుః

దరిద్రాణీ కుర్వన్ దినకర సహస్రాణి కిరణైః I

విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచన చెణః

క్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో జనని తే II 26 II

తే.గీ.II  మోహ తిమిరంపు నా మనోగేహమందు

నలముకొన్న జీకటిఁ బాప నమరు నీదు

చరణ మణి దీప కాం త్యర క్షణము లోన

చీకటులు పాపి జనని! నిన్ జేర్చు నన్ను.

తాII అమ్మా! మోహముచే బుట్టిన చీఁకటులు గ్రమ్మిన నా మనోగృహమందు లోలోన యలముకొన్న తమస్సును హరింప నిపుణమైన నీ చరణమణిదీపము స్వీయ కిరణములచే సూర్యబింబసహస్రమును భేదపడజేయుచు అరక్షణమైన నాకు సాన్నిధ్యమనుగ్రహించునుగాక!

శ్లోII  కవీనాం చేతోవన్నఖరరుచిసంపర్కి విబుధ

స్రవన్తీ స్రోతోవత్పటుముఖరితం హంసకరవైః I

దినారమ్భ శ్రీవన్నియతం అరుణచ్ఛాయ సుభగం

మదన్తః కామాక్ష్యాః స్ఫురతు పదపఙ్కేరుహయుగమ్ II 27 II

తే.గీ.II  కవి వలె రవిలంకెయె లేని కరజ కాంతి,

గంగపరవళ్ళ వలె హంసకరవ హేల

నుదయ కిరణారుణార్భటిన్ పదయుగళము

నా యెడందను నిలుపుమో నళిన నేత్ర!

తాII  కవుల మనస్సువలె అమ్మవారి చరణ పద్మయుగము సూర్యసంపర్కము లేనిదే కాని గోళ్ళకాంతుల సంపర్కము గలది. ఆకాశగంగానదీ ప్రవాహము వలె హంసకరములతో మిక్కిలి ధ్వనించునది. ప్రాతఃకాంతివలె నిశ్చితముగా అనూరుని అరుణ కాంతి ప్రసరించనిది కాని ఎఱ్ఱగానే ఉన్నది. ఆ పాదపద్మ యుగము నాలో స్ఫురించుగాక!

శ్లోII  సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకిముకుటైః 

తటైర్నీహారాద్రేరధికం అణునా యోగిమనసా I

విభిన్తే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశామ్

అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగళం II 28 II

సీII  కఠిన నాకి కిరీట కాఠిన్యమబ్బెనా మోహంబు త్రెంచు నీ పూజితాంఘ్రి?

హిమగిరి పరిచయ హేతువు చేతనా చల్లఁబరచు భక్తజనులమదులు?

యోగులమనసులనున్న హేతువునొక్కొ కానరాని వెలుగుఁ గనఁగఁ జేయు?

కంచికామాక్షి! నీ కమనీయపాదముల్ నాదు చిత్తమునందు మోదమలర

తే.గీ.II  నుండునట్టులఁ జేయుము నిండు మదిని,

నీదు కృప నాదు మదికింత మోదమొదవు,

భక్తితో నిన్ను నిత్యమున్ భజన చేతు,

వందనంబులు చేసెదనందుకొనుము.

తాII సహజకఠినములైన దేవతల కిరీటములతోడి నిత్యసంపర్కమువలననా యేమమ్మా

నీ పాదయుగళి సమ్మోహమును భేదింపజేయఁగల్గుచున్నది? మంచుకొండచరియల

పరిచయము చేతనా యేమి భక్తులను చల్లబరుపగల్గుచున్నవి? అణుమాత్రమైన

(సుసూక్ష్మమైన) యోగిమనసుతోడి అనుబంధముచేతనా యేమి దృశ్యముకాని వస్తు

వును (బ్రహ్మపదార్థమును) సుస్పష్ట మొనర్చుచున్నది?

శ్లోII  పవిత్రాభ్యాం అంబ! ప్రకృతి మృదులాభ్యాం తవ శివే

పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః I

ప్రవాలైరమ్భోజై రపి చ వనవాస వ్రతదశాః

సదైవారభ్యన్తే పరిచరిత నానాద్విజగణైః II 29 II

తే.గీ.II  నీదు సుపవిత్ర మృదుపాద నీరజముల

చే తిరస్కృత పవడముల్, శృంగములును

ద్విజగణంబుల సేవలన్ దీక్షఁ బూనె

వనమునందుండి జనని! తా పడయ ఛవిని.  

తాII పవిత్రములు సహజమృదులములు నైన నీ పాదములచే దిరస్కృతములై జడిసిపోయిన పవడములు, పద్మములును ద్విజాళిపరిచర్య సేయుచు (బ్రాహ్మణ సేవ చేయుచు)(శ్లేష) పక్షులను సేవించుచు, హంసలను గొలుచుచు నెల్లప్పుడు వన (జల) వాసవ్రతదశను (పవడములపక్షములో అరణ్యమందుండిచేయు ప్రతదశను) ఆరంభించినవి. పవడములకంటె పద్మములకంటెను నీ పాదములు మృదులములని భావము.

శ్లోII  చిరాద్దృష్యా హంసైః కథమపి సదా హంససులభం

నిరస్యన్తీ జాడ్యం నియత జడమధ్యైక శరణమ్ I

అదోష వ్యాసఙ్గా సతతమపి దోషాప్తిమలినం

పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ II 30 II

తే.గీ.II కమలములు హంస సులభముల్, కమలమెపుడు

జడము మధ్యనే యుండును, శర్వరిఁ గని

మలినమౌ, నమ్మ పాదముల్ సులభమవవు,

జడము పాపునమలినముల్ సహజముగనె.

తాII కామాక్షీ చరణయుగము హంసలచే యత్యాశ్రమవిశేషులచే ఎన్నటికోచూడబడునదై హంసలకు సులభమైయున్న పద్మమును జూచి పరిహసించుచున్నది. తానుజడత్వమును నిరసించి 'నియతముగ జడ (జల) మధ్యమందుండు పంకజమును గని హేళన చేయుచున్నది. దోషవ్యాసంగములేని నీ పాదయుగము నిరంతరము దోష+ఆప్తిమలినమ్=రాత్రి సంబంధముచే మలినమగు (మూసికొనిపోవు') పద్మమునుజూచినవ్వుచున్నది. 

శ్లోII  సురాణామానన్ద ప్రబలనతయా మండనతయా

నఖేన్దు జ్యోత్స్నాభిః విసృమర తమః ఖండనతయా I

పయోజశ్రీ ద్వేషవ్రతరతతయా త్వచ్చరణయోః

విలాసః కామాక్షి ప్రకటయతి నైశాకరదశామ్ II 31 II

తే.గీ.II దేవతాళిని సంతుష్టిఁ దేల్చుచుండి,

గోటి కాంతిని వెన్నెలల్ గురియుచుండి,

చీకటిని నీదు పాదముల్ చీల్చుచుండి,

చాటె చంద్రత్వ మమ్మరో! చక్కగాను. 

తాII కామాక్షీ! దేవతల కానందము చేకూర్చుటచేత, గోటికాంతుల నెడి వెన్నెలలచేఁ

జీకటిని జెండాడుట చేత, పద్మములశోభయెడ ద్వేషవ్రతమును బూనుటచేత, నీ చరణ

ముల సొంపు చంద్రత్వ స్థితిని వెల్లడించుచున్నది.

శ్లోII  సితిమ్నా కాన్తీనాం నఖరజనుషాం పాదనళిన-

చ్ఛవీనాం శోణిమ్నా తవ జనని కామాక్షి నమనే I

లభన్తే మన్దారగ్రథిత నవ బన్ధూక కుసుమ-

స్రజాం సామీచీన్యం సురపుర పురన్ధ్రీ కచభరాః II 32 II

తే.గీ.II  నీదు నఖముల తెలుపును, నీదుపాద

ముల యెఱుపు కూడి మందారములును మంకె

నలును మాలయై కచముల నలరె నమ్మ 

వ్రాల దేవాంగనలు నీదు పాదములను.

తాII దేవతాస్త్రీలు నీ పాదములందు వ్రాలినపుడు వారి వేణీభరములు నఖప్రభల

తెలుపు రంగును పాదముల యెరుపురంగును పరస్పరము కలియుటచేత మందార పుష్పములు (తెలుపు) మంకెనపూలు (ఎరుపు) కలిపి గ్రుచ్చి సంతరించిన మాలలతోడిసామరస్యమును బొందుచున్నవి.

20 – 02 – 2024.

శ్లోII  స్ఫురన్మధ్యే శుద్ధే నఖకిరణ దుగ్ధాబ్ధిపయసాం

వహన్నబ్జం చక్రం దరమపి చ లేఖాత్మకతయా I

శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం

త్రిధామా కామాక్ష్యాః పదనలిన నామా విజయతే II 33 II

తే.గీ.II  నఖకిరణ పయోధినిఁ దోచు నవ్య రేఖ

లందుఁ బద్మంబు, చక్రంబు, ననుపమమగు

శంఖమును దాల్చి, మత్స్య భాస మయి, నీదు

పాద పద్మముల్ కామాక్షి! వరలెనమ్మ!

తాII తెల్లని నఖకాంతులనెడి పాలసముద్రమునందలి పాలలో స్ఫురించుచు రేఖారూపమున పద్మమును జక్రమును శంఖమును ధరించుచు మత్స్యాకృతి (రేఖ) వడసినిరుపమ లక్ష్మిని (శోభను) వహించుచు కామాక్షీ పాదపద్మమనెడి విష్ణుమూర్తి మత్స్యావతారమూర్తియై సర్వాతిశాయియై విలసిల్లుచున్నాడు.

శ్లోII  నఖశ్రీసన్నద్ధ స్తబకనిచితః స్వైశ్చ కిరణైః

పిశంగైః కామాక్షి ప్రకటిత లసత్పల్లవరుచిః I

సతాం గమ్యః శఙ్కే సకల ఫలదాతా సురతరుః

త్వదీయః పాదోಽయం తుహిన గిరిరాజన్యతనయే II 34 II

తే.గీ.II  తుహినగిరిరాజకన్యకా! మహిమఁ జూపు

నీదు నఖకాంతి పూలతో నిండియుండి,

పల్లవారుణప్రభనొప్పు పాద యుగళి,

మంచి చేసెడి కల్పకమంచునెంతు.

తాII ఓ తుహినగిరికన్యా! నీ పాదము నఖకాంతులచే సంఘటితములగు పుష్పమం

జరులచే నిండి తనయరుణ కిరణావళి చేత లేజివుళ్ళ తళుకును వెలువరించుచు

కల్పతరురూపమున సత్పురుషుల కభిగమ్యమైయున్నది.

శ్లోII  వషట్కుర్వన్మాంజీర కలకలైః కర్మలహరీ-

హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే I

మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం

మనోవేద్యాం మాతస్తవ చరణ యజ్వా గిరిసుతే (విజయతే) II 35 II

తే.గీ.II  అమ్మ! నీపాద యజ్వ తా నందెల ధ్వని

నెపముతో వషట్కారంబు నెరపుచుండి,

జ్ఞానుల మనంబులనువేదిఁ గర్మ హవిని

చిత్స్వరూపాగ్నిలో వేసి చెలఁగుచుండె.

తాII తల్లీ! నీ పాదమనెడి యొక మహానుభావుఁడు సోమయాజియై యందెల రవళినె

పమున వషట్కారములు సేయుచు జ్ఞానుల మనోవేది యందు ప్రస్ఫుటప్రభతో ప్రజ్వలిం

చుచున్న పరమచిద్రూపమైన అగ్నియందు కర్మపరంపరలనెడి హవిస్సులను హోమము

సేయుచున్నాడు. శ్రీచరణ సేవ నైష్కర్మ్య పర్యవసానమని తాత్పర్యము.

శ్లోII  మహామన్త్రం కిన్చిన్మణి కటక నాదైర్మృదు జపన్

క్షిపన్దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః I

నతానాం కామాక్షి ప్రకృతి పటురుచ్చాట్య మమతా-

పిశాచీం పాదోಽయం ప్రకటయతి తే మాన్త్రికదశామ్ II 36 II

తే.గీ.II  అమ్మ! నీపాదపద్మమ్ములనుపమాన

మయిన మంజీరనాదమంత్రాక్షరములఁ

జదువుచు నఖకాంతివిభూతిఁ జల్లు దెసల

నతుల మమతాపిశాచాళి వెతలు పాపు.

తాII ఓ కామాక్షి! మణిమంజీర నాదములచే నల్లలననేదియో మహామంత్రమును జపిం చునదై నఖకాంతిరూపమగు నచ్చమైన విభూతి దేసదెసలం జల్లుచు స్వభావదృఢమైన నీ పాదము వినత జన మమతా పిశాచము నుచ్చాటనము సేయుచు నొకానొకమాంత్రికు డట్లు వర్తించుచున్నది.

శ్లోII  ఉదీతే బోధేన్దౌ తమసి నితరాం జగ్ముషి దశాం

దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతీ I

సితేనాచ్ఛాద్యాఙ్గం నఖరుచి పటేనాంఘ్రి యుగళీ

పురన్ధ్రీ తే మాతః స్వయమభి సరత్యేవ హృదయమ్ II 37 II

తే.గీ.II  జ్ఞాన శశిరాకఁ దమమది నాశనమవ,

నీదు పాద పురంధ్రి, పునీత ప్రేమ

వెల్లి విరియగ నఖకాంతి తెల్ల చీర

ముసుగుతో జ్ఞానపతిఁ జేరె పూవుబోడి!

తాII దేవీ! నీపాదయుగళియను పతివ్రత రాగాతిశయమును ప్రకటించుచు జ్ఞానచం ద్రుడుదయించి, తమమెల్ల (తమము=చీకఁటి, అజ్ఞానము) పేదవడజేయగా (నశిం పజేయగా) నఖకాంతి యను తెల్లని మేల్ముసుగువెట్టి స్వయముగా 'హృదయమనెడి నాయకునికడకు అభిసరించుచున్నది. (వెన్నెలలో ప్రియునిగూర్చి సంకేతస్థలమునకు పోవు నాయిక జ్యోత్స్నాభిసారిక యనబడును.)

శ్లోII  దినారంభః సంపన్నలిన విపినానా మభినవో

వికాసో వాసన్తః సుకవిపికలోకస్య నియతః I

ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞానశశినః-

చకాస్తి త్వత్పాద స్మరణమహిమా శైలతనయే II 38 II

తే.గీ.II  పార్వతీ! నీ పద ధ్యాన ప్రాభవమది

సంప దంభోజములు వికసింపఁ జేయ

నుదయమౌ, సుకవి పికాళి మృదువసంత

భాసమౌ, జ్ఞానశశికై ప్రదోషమగును.

తాII పార్వతీ! నీ చరణధ్యాన ప్రభావము సంపదలనెడి పద్మములను వికసింపజేయు టలో నుదయసమయమై, సుకవికోకిలములకు నూతనవసంత శోభయై, పరమజ్ఞానచం ద్రోదయమగుటకు ప్రదోషసమయమై యలరుచున్నది.

శ్లోII  ధృతచ్ఛాయం నిత్యం సరసిరుహమైత్రీ పరిచితం

నిధానం దీప్తినాం నిఖిలజగతాం బోధజనకమ్ I

ముముక్షూణాం మార్గప్రథనపటు కామాక్షి పదవీం

పదం తే పాతఙ్గీం పరికలయతే పర్వతసుతే II 39 II

తే.గీ.II  వరలు ఛాయాసహితమౌచు, పద్మమైత్రి

కలదియై, కాంతి నిధియౌచు, ఘన సుచేత

నమును గొలుపుచుండి, ముముక్షునకును ముక్తిఁ

గొలుపు నీపాదమమ్మరో! కుతపుఁడనగ.

తాII నీ పాదము ఛాయాసహితమై (ఛాయకాంతి; సూర్యపత్ని) నిత్యమును పద్మ ముల చెలిమి కలదియై కాంతులకు నిధియై చైతన్యస్ఫోరకమై మోక్షార్థులకు మార్గము చూపుటలో సర్వసమర్థమును నైన సూర్యస్థానమును ఆక్రమించుకొన్నది. సూర్యునియం దీ లక్షణము లన్నియు కలవు.

శ్లోII  శనైస్తీర్త్వా మొహామ్బుధి మథ సమారోఢుమనసః

క్రమాత్కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీమ్ I

లభన్తే నిశ్శ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం

పురశ్చర్యాభిస్తే పురమథన సీమన్తిని జనాః II 40 II

తే.గీ.II  జ్వాలి యిల్లాల! కామాక్షి! జనులు మొదట

మోహ సంద్రమ్ము దాటి, తా ముక్తి సౌధ

మెక్క నీ పాద నిశ్శ్రేణినే గ్రహింత్రు

క్షణములో నెక్క సాధ్యమౌన్ కమల నయన!

తాII అనేకోపాసనాపురశ్చరణలు చేసిచేసి మోహసముద్రమును దాటి క్రమముగ పుణ్యా త్ములకు మాత్రమే సులభమైయున్న కైవల్య మను సౌధాగ్రమును క్షణములో నెక్క దలచువారు నీ చరణమును నిచ్చెనగా బడయనేర్తురు.

శ్లోII  ప్రచండార్తి క్షోభప్రమథనకృతే ప్రాతిభసరిత్-

ప్రవాహ ప్రోద్దండీ కరణ జలదాయ ప్రణమతామ్ I

ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ-

ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోಽయం జనని తే II 41 II

తే.గీ.II  ప్రణత జన వేదనను బాపు వర సుమిత్ర

మన, ప్రతిభనదిఁ బారించు ఘనము, గాఢ

భవ తమోహారియౌ దీప్తి, భవ్యమైన

నీదు పదముల దయఁ గాంతు నిఖిల జనని.

తాII ప్రణతులగువారి తీవ్రవివత్తులను నశింపఁ జేయుటయందు మొదటి మిత్రమైనదియు, ప్రతిభాప్రవాహమును (జ్ఞానవికాసమును) ఉద్ధృతము సేయు కారు మేఘమయినవదియు, గాఢమైన సంసారతమస్సును హరించు మహాజ్యోతి అయినదియును, అగు నీ చరణానుగ్రహ పొందుటకై నేను మనసుపడుచున్నాను.

శ్లోII  మరుద్భిస్సంసేవ్యా సతతమపి చాంచల్యరహితా

సదారుణ్యం యాన్తీ పరిణతి దరిద్రాణ సుషమా I

గుణోత్కర్షాన్ మాంజీరక కలకలైస్తర్జనపటుః

ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ II 42 II

తే.గీ.II  అమ్మరో! మరుత్ సేవలనందుకొనియు

చంచలింప, దరుణిమను సతము కలిగి,

వన్నెతగ్గు చివురులకు భయము గొలుపు

పాదమంజీర  రుతిని  నీ పాదయుగళి. II 42 II

తాII నీ పాదము ఎల్లప్పుడు మరుత్తులచేత (వాయువుల చేత (శ్లేష.) దేవతలచేతను) సేవింపబడునదయ్యును చాంచల్యములేనిదై, నిరంతర మెరుపెక్కియు పరిపాకదశలో (పండినప్పుడు) కాంతిహీన మయియుండు పవడముంగని గుణోత్కర్షవలన (తన యందలి గుణాతిశయముచే) అందెలమ్రోత నెపమున బెదరించి పరిహసించుచున్నది. (గుణ+ఉత్కర్షము, అనగా త్రాటితో నట్టిటు లాగుట. ఓడినశత్రువును బంధించి అట్టిట్టులాగుట ప్రసిద్ధమైన విషయము, కావున పవడమును గెల్చిన దేవిచరణము ఆ పవడములను దారమున గ్రుచ్చునెపమున బంధించి అవమానించుచున్నదనియు భావము.)

21 – 02 – 2024.

శ్లోII  జగద్రక్షాదక్షా జలజరుచి శిక్షా పటుతరా

సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః I

ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాదిముకుటీ-

తటీ సీమాధామా జయతి తవ జనని కామాక్షి పదయోః II 43 II

సీII  కామాక్షి! జగతిని కాపాడు నీ పాద కంజముల్ పటువుచే కంజములను

శిక్షింపఁ జాలును, శ్రీమాత! సురలకు, నమ్యమై, జ్ఞానుల గమ్యమగుచు,

వేదాలఁ గ్రీడించు వేడ్కతోనొప్పుచు, నలదేవతల హేరములను నొప్పి

నిలుచునవయి యుండి, నిలుచు సర్వోన్నత మయి గొప్పగానమ్మ! నియతి నొప్పి,

తే.గీ.II  అట్టి నీ పాదపద్మముల్ పట్టి కొలుచు

ననుపమానంపు భాగ్యంబు నందఁ జేసి

నాదు జన్మకు ధన్యత మోదమలరఁ

గలుగఁ జేయుమా! ప్రార్థింతు, కరుణఁ గనుమ.II 43 II

తాII నీ పాదయుగళి లోకరక్షణసమర్థమై పద్మముల కాంతిని శిక్షింపగల జాణయై సురలకు నమ్యమై జ్ఞానుల కభిగమ్యమై శ్రుతులయందు క్రీడింప వేడ్కగలదై ఇంద్రా దుల కిరీటముల పై నిల్చునదై సర్వోన్నతమై విలసిల్లుచున్నది.

శ్లోII  గిరాం దూరౌ చోరౌ జడిమ తిమిరాణాం కృత జగత్-

పరిత్రాణౌ శోణౌ ముని హృదయలీలైక నిపుణౌ I

నఖైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండిత భవ -

గ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే II 44 II

సీII   జాడ్యాంధకారమ్ము చక్కగా హరియించు, మాటలకందక మహిమనొప్పు,

జగములఁ బాలించు జయనిధానంబులు, శోణవర్ణముతోడ సొబగులీను, 

మునుల మానసముల ఘనతనొప్పుచునుండు, నఖముల తోడను నవ్వుచుండు,

వేదంబులందలి విపులసారంబగు, భవగ్రహోన్మాదంబు పారద్రోలు,

తే.గీ.II   నట్టి నీపాదములు నేను పట్టి విడువ,

నిత్య సంపూజ్య! నిరుపమ నిష్కళంక!

సాధు జనపోషణంబును సదయఁ జేయు

కంచి కామాక్షి నిన్ గొల్తునంచితముగ.  II 44 II

తాII పలుకులకు (వేదములకును) అందనివి, జాడ్యాంధకారమును హరించునవి, జగమ్ముల పాలించునవి, ఎఱ్ఱనివి, మునిహృదయములందు విలసించు నేరిమి గలవి, నఖకాంతులచే నవ్వులు చిందించునవి, వేదముల కెల్ల సారభూతమయినవి, సంసారగ్రహోన్మాదమును వదలించుననియు నైన నీ పాదములను ధ్యానించెదను.

శ్లోII  అవిశ్రాన్తం పఙ్కం యదపి కలయన్యావకమయం

నిరస్యన్కామాక్షి ప్రణమనజుషాం పఙ్కమఖిలమ్ I

తులా కోటి ద్వన్ద్వం దధదపి చ గచ్ఛన్నతులతాం

గిరాం మార్గం పాదో గిరివరసుతే లఙ్ఘయతి తే II 45 II

తే.గీ.II  పంకశోభిత, భక్తులపంకహారి,

యా తులాకోటి ధారియే యతులకనగ,

నీ పదయుగళి కామాక్షి! నేర్పుమీర

వాక్సరణికి మించుచునుండె, భవ్యసుగతి.

తాII నిరంతరము లాక్షా రాగపంకమును పారాణిగ పూసికొనియు తనదరిని వ్రాలు భక్త జనుల పంకమును (పాపమును) హరించుచు, తులాకోటిద్వంద్వమును (అందెల జతను) దాల్చియు అతులమై= సాటిలేనిదై (శ్లేష.) తులాంతక్కెడ దానియొక్క కోటి ద్వంద్వము = చివరిభాగములను పూనియు, అతుల మై=సరితూచరానిదై నీ పాదము స్తుతివచనసరణి కతీతమై యున్నది.

శ్లోII  ప్రవాళం సవ్రీడం విపినవివరే వేపయతి యా

స్ఫురల్లీలం బాలాతపమధికబాలం వదతి యా I

రుచిం సాంధ్యాం వన్ధ్యాం విరచయతి యా వర్ధయతు సా

శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్యలహరీ II 46 II

తే.గీ.II  పవడములనడవుల సిగ్గు పడగఁ నణచు,

లేత యెండను తా వట్టి లేత యనును,

నూత్నసంధ్యను వ్యర్థమనును మదంబ

పాదకాంతి, ధరణి నన్ను వరలఁ జేయు.

తాII కామాక్షి చరణారుణకాంతి ప్రవాహము పవడము నడవులం దడగి మడగి సిగ్గుపడే వణకిపోఁ జేయుచున్నది. నిండుశోభగల లేయెండ వట్టి లేత యనుచున్నది. నూతన సంధ్యను వంధ్య యనుచున్నది. అట్టి శ్రీ చరణరక్తిమ నా కశేష శుభపరంపరలను బెంపొందించుఁగాక.

శ్లోII  కిరన్జ్యోత్స్నారీతిం నఖముఖరుచా హంసమనసాం 

వితన్వానః ప్రీతిం వికచతరుణామ్భోరుహరుచిః I

ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే

శరత్కాల ప్రౌఢిం శశిశకలచూడ ప్రియతమే II 47 II

తే.గీ.II  జిల్కి నఖకాంతి వెన్నెలన్ చెలగు హంస

లకు ముదము గొలుపుచు, నవ వికచ పద్మ

కాంతినొప్పెడి నీ పాద కమలములవి

జయ శరత్ప్రౌఢిమన్ జూపు శంభురాణి! 

తాII కొనగోటితళుకులచే తరపి వెన్నెలలం దరుముటచే హంస మానసముల కానందము నించుచు (హంస= రాజహంస, యతి) వికసించిన కొత్తతామరల  కాంతిం గుల్కుచు కేవలమొక వెలుగై ప్రస్ఫుటమైన నీ పాదము శరదృతు వైభవమును బ్రకటించుచున్నది.

శ్లోII  నఖాఙ్కూరస్మేర ద్యుతి విమల గంగామ్భసి సుఖం

కృతస్నానం జ్ఞానామృతం అమలం ఆస్వాద్య నియతమ్ I

ఉదంచన్మంజీర స్ఫురణమణిదీపే మమ మనో

మనోజ్ఞే కామాక్ష్యాః చరణ మణిహర్మ్యే విహరతామ్ II 48 II

తే.గీ.II  నఖర కాంతియన్ గంగలో స్నానమాడి,

జ్ఞాన సుధఁ గ్రోలి తృప్తిగా నాదు మనసు

ముదము మంజీరమణిదీపములను కులుకు 

నీ చరణమణిసౌధాన నిలుచునమ్మ.

తాII నఖప్రభల నెడి గంగాజలములందు సుఖముగ స్నానముచేసి జ్ఞానామృతమును దృప్తిగ గ్రోలి నా చిత్తము మంజీరమణీదీపముచే నందముగుల్కు శ్రీ కామాక్షీ చరణమణిసౌ ధమందు విహరించుగాక!  

శ్లోII  భవామ్భోధౌ నౌకాం జడిమ విపినే పావకశిఖాం

అమర్త్యేన్ద్రాదీనాం అధిముకుటం ఉత్తంస కలికామ్ I

జగత్తాపే జ్యోత్స్నామకృతక వచః పంజర పుటే

శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ II 49 II

సీII  సంసారమనఁబడు సాగరమును దాటఁ జేసెడి నావగా చెలఁగునదిగ,

జాడ్య కాననమును చక్కగా దహియించు కారుచిచ్చనగ తా క్రాలునదిగ,

యాఖండలాదుల కమరు కిరీటాగ్ర కమనీయ పుష్పమై యమరినదిగ,

లోకతాపము బాప శ్రీకారమును చుట్టు వెన్నెలై జగతిని విరిసినదిగ,

తే.గీII  శ్రుతులనెడి పంజరస్థమౌ శుకముగాను

కంచి కామాక్షి! నీ పాద కమలములను

గాంచెదను నేను, కరుణించి కావవమ్మ!

వందనంబులు చేసెద నందుకొనుము.

తాII సంసారసాగరముం దరింపజేయు నౌకను, జాడ్యమను నడవికి దావానలమును, ఇంద్రాదిదేవతల కిరీటాగ్రమందు పూమొగ్గను, లోకముల తాపమార్చు వెన్నెలను, అకృతకములైన పల్కులు (వేదములు) అనెడి పంజరమునందు రాచిలుకనుగా కామా క్షీచరణయుగళిని భావించెదను.

శ్లోII  పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చుంచుః ప్రణమతాం

మనోజ్ఞస్త్వత్పాదో మణి ముకుర ముద్రాం కలయతే I

యదీయాం కామాక్షి ప్రకృతి మసృణాః శోధకదశాం

విధాతుం చేష్టంతే బలరిపువధూటీ కచభరాః II 50 II

తే.గీ.II  నతుల కాత్మస్వరూపంబు నుతిగఁ జూప

పూజ్య! నీ పాదముల్ మణి ముకురమాయె,

శుచిగ నద్దానిఁ దుడువగ శచి చికురము

లొప్పె కామాక్షి! ప్రణమిల్లుచుండుకతన.

తాII అమ్మా! నీ పాదము తనయెడ వినతులైనవారికి స్వరూపస్ఫూర్తిని ప్రతిఫలింపజే యజాలెడి మణిదర్పణంపుసొంపును వహించుచున్నది. ఆ అద్దమును నిర్మలమగునట్లు తుడుచుటకు స్వభావమృదులములైన శచీదేవి శిరోజములు కుంచెలవలె నుపయుక్తము లగు చున్నవి. దేవేంద్రుని రాణి మా కామాక్షమ్మ చరణములపై దలవంచి నిరంత రము మ్రొక్కునని భావము.

శ్లోII  అవిశ్రాన్తం తిష్ఠ న్నకృతక వచః కన్దర పుటీ-

కుటీరాన్తః ప్రౌఢం నఖరుచిసటాలీం ప్రకటయన్ I

ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా

తమోవేతండేన్ద్రం తవ చరణ కంఠీరవపతిః II 51 II

తే.గీ.II  వేదవాగ్గుహాకుటిలోన వెలుగుచుండి,

గోళ్ళ కాంతులన్ జడలతో గోచరించు

నీదు పాద సింహాధిపుండాదుకొనుత

నన్ను కామాక్షి మదకరిన్ మిన్నఁ జంపి.

తాII ఓ కామాక్షీ! వేద వాక్కులనెడి గుహ యను గుడిసె లోపల ఎల్లప్పుడూ నివసించుచు, ప్రౌఢమైన కాలి గోళ్ళ కాంతి కిరణాలను జడల సమూహమును ప్రకటించుచు , నీయొక్క చరణము అను సింహప్రభువు నా హృదయంలో చీకటి ఏనుగు(అజ్ఞానం)ను త్వరగా అంతం చేయుఁగాక. 

శ్లోII  పురస్తాత్ కామాక్షి ప్రచుర రసమాఖండలపురీ-

పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః I

నఖశ్రీభిః స్మేరా బహు వితనుతే నూపురరవైః

చమత్కృత్యా శఙ్కే చరణయుగలీ చాటురచనాః II 52 II

తే.గీ.II  దేవకాంతల నృత్యముల్  తృప్తిఁ గొలుప,

వర నఖద్యుతిస్మేరంబు వరలఁ జింది,

పాద నూపుర రవళిచే ప్రస్తుతించు

చున్నవని దల్తు నీ పదశోభఁ గాంచి.

తాII ఓ కామాక్షీ! దేవకాంతలు మీ ముందు చక్కటి భావాలతో కూడిన నృత్య నాటకాన్ని ప్రదర్శింపగా ఆ నృత్యాన్ని చూసి మీ కమల పాదాలు మీ కాలి గోళ్ళ నుండి ప్రకాశవంతమైన తెల్లని తేజస్సను చిరునవ్వులు చిందించుచు,  అందెలరవళితో నృత్య ప్రదర్శనకు ప్రశంసలు పలుకుతున్నట్లు ఊహించుచున్నాను.

22 – 02 – 2024.

శ్లోII  సరోజం నిన్దన్తీ నఖకిరణ కర్పూర శిశిరా 

నిషిక్తా మారారేర్ముకుట శశిరేఖా హిమజలైః I

స్ఫురన్తీ కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే

తవాధత్తే మైత్రీం పథిక సుదృశా పాదయుగలీ II 53 II

సీII  కామాక్షి! నీ పాద కమలమ్ములెఱ్ఱనై కమల నిందను చేసి క్రాలుచుండి,

నఖ కాంతి యను కిరణ ఘనసార ముదాల్చి, మారారి ముకుటస్థ మాన్యుఁడయిన

శశిరేఖ తుహినాన స్నానంబునే చేసి, పల్లవచయమున పండుకొనుచు,

విరహ కాంతను బోలి విఖ్యాతినొప్పుచున్ జెలగుచునున్నవి చిగురు బోడి!

తే.గీ.II  సన్నుతంబైన నీపాద సన్నిధాన

మమరఁ జేయుము నీ కృపన్ ప్రముదమంద,

జన్మరాహిత్యమున్ గొల్పు చక్కనమ్మ!

వందనంబులు చేసెదనందుకొనుము.

తాII ఓ కామాక్షీ! కమలమును నిందించుచు, గోళ్ళకాంతియనెడి కర్పూరమును పూసికొని, శివుని కిరీట మందలి చంద్రరేఖలోని మంచుజలములలో స్నానమాడి, స్పష్టమైన కాంతియనెడి చిగుళ్ళపై దొర్లాడుచున్న నీ పాదయుగళి విరహిణితో పోల్చదగియున్నది.

శ్లోII  నతానాం సంపత్తేః అనవరతమాకర్షణజపః

ప్రరోహత్సంసార ప్రసరగరిమస్తంభనజపః I

త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహనజపః

పటీయాన్నః పాయాత్పదనలిన మంజీరనినదః II 54 II

తే.గీ.II  నతుల ధనవృద్ధి చేసెడి నుత జపంబు,

ప్రబలు భవమునాపెడిదైన భవ్య జపము,

భవుని లోగొను మంజీర భవ్యనాద

మెప్పుడున్ కాచు కామక్షి!  గొప్పగ మము.

తాII ఓ కామాక్షీ! నీ పాద పద్మములు నమస్కరించువారికొఱకు, సంపత్తి నాకర్షించుటకొఱకు, పెరుగుచున్న వారి సంసారప్రసారమును స్తంభింపజేయుట కొఱకు, శివుని మనస్సును మోహింపజేయుట కొఱకు చేయదగిన జపధ్వనివలె మంజీర నాద మొప్పుచున్నది. అది మమ్ములను కాపాడుగాక!

శ్లోII  వితన్వీథా నాథే మమ శిరసి కామాక్షి కృపయా

పదామ్భోజన్యాసం పశుపరిబృఢ ప్రాణదయితే I

పిబన్తో యన్ముద్రాం ప్రకటముపకమ్పా పరిసరం

దృశా నానద్యన్తే నలినభవ నారాయణ ముఖాః II 55 II

తే.గీ.II  ప్రభ్విణీ! శివా! కామాక్షి! భర్గురాణి!

పంపతీరాన నీ పాద పద్మచిహ్న

ములఁ గని, గొని, విధి కరివేల్పు నినదింత్రు,

తత్పదములు నా తలపైన దయను నిలుపు.

తాII ఓ అమ్మా! నీ పాదన్యాసమును కమ్పానదీతీరప్రాంతమున కంటితో త్రాగుచు బ్రహ్మవిష్ణ్వాదులు ఆనందోద్గారముల నొనర్చుచున్నారు. ఆ పాదన్యాసమును నా శిరముపై

దయతో నుంచుము.

శ్లోII  ప్రణామోద్యద్ బృన్దారక ముకుట మన్దారకలికా-

విలోలల్లోలమ్బ ప్రకరమయ ధూమ ప్రచురిమా I

ప్రదీప్తః పాదాబ్జ ద్యుతి వితతి పాటల్యలహరీ-

కృశానుః కామాక్ష్యా మమ దహతు సంసారవిపిననమ్ II 56 II

తే.గీ.II  వందనముచేయు దేవతాబృందముకుట

మహిత మందారముల వ్రాలు మధుపములను

ధూమయుక్తమౌ పాదాగ్ని క్షేమమొసఁగ

కాల్చుగాత నా భవ వనిన్ గంచి నిలయ!

తాII కామాక్షి యొక్క పాద పద్మాల నుండి ప్రకాశవంతమైన ఎరుపు కాంతి, అది అగ్ని. ఆమె పాదాల ముందు వంగి నమస్కరిస్తున్న ఖగోళ కిరీటాలపై మందార పువ్వుల చుట్టూ తిరుగుతున్న తేనెటీగలు పొగ ముద్రను కలిగిస్తాయి (వాటి ముదురు రంగు కారణంగా). ఆ కామాక్షి పాద పద్మముల అగ్ని నా సంసార వనమును దహించును గాక. 

శ్లోII  వలక్ష శ్రీఋక్షాధిప శిశుసదృక్షైస్తవ నఖైః

జిఘృక్షుర్దక్షత్వం సరసిరుహ భిక్షుత్వ కరణే I

క్షణాన్మే కామాక్షి క్షపిత భవ సంక్షోభ గరిమా

వచో వైచక్షన్యం చరణయుగలీ పక్ష్మలయతాత్ II 57 II

తే.గీ.II  భిక్షువుగ పద్మమును జేయు దక్షతఁ గొన

గోళ్ళతో తెల్లనై యమ్మ! గ్లోను బోలి

క్షపిత భవబంధ సంక్షోభ గరిమనొప్పు

నీ పదములు నా వాగ్ఝరిన్ నియతిఁ బెంచు.

తాII ఓ కామాక్షీ! కమలమును భిక్షువుగా చేయు సామర్ధ్యమును పొందఁగోరి, తెల్లని కాంతినొంది, బాల చంద్ర సదృశమైన, శమింపఁ జేయఁబడిన సంసార సంక్షోభము యొక్క గొప్పదనముగల నీ పాదముల జంట క్షణములో నా వాఙ్నైపుణ్యమును పెంపొందించుగాక. 

శ్లోII  సమంతాత్ కామాక్షి క్షత తిమిర సంతాన సుభగాన్

అనంతాభిర్భాభిః దినమను దిగన్తాన్విరచయన్ I

అహంతాయా హన్తా మమ జడిమదన్తావలహరిః

విభిన్తాం సంతాపం తవ చరణ చిన్తామణిరసౌ II 58 II

తే.గీ.II  అంతు లేనట్టి ద్యుతిని దిగంతములను

చీకటుల్ బాపి కామాక్షి! చేయునట్టి,

యహముఁ బాపు చింతామణి మహితమైన

నీ పదములు నా తాపమున్ బాపుగాక.

తాII నీ పాద పద్మముల చింతామణి (కోరికలు కలిగించే రత్నం) నా దుఃఖాన్ని నాశనం చేయుగాక ; చింతామణి చీకటిని పారద్రోలి , తన తేజస్సును నలుదిశలా ప్రసరింపజేసి , నా అహాన్ని చంపి , నా తాపమును పోగొడుతుంది. 

శ్లోII  దధానో భాస్వత్తాం అమృతనిలయో లోహితవపుః

వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ I

గతౌ మన్దో గఙ్గాధరమహిషి కామాక్షి భజతాం

తమః కేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే II 59 II

తే.గీ.II  తల్లి కామాక్షి! నీ పాద పల్లవములు

ప్రణతులకు సేవకులకును భాస్కరుండు,

గౌరుఁ, డంగారకుండును, కవియు, రాహు

కేతువు లగుచు వర్ధిల్లు ఖ్యాతితోడ.

శాII  శ్రీమాతా! నతులైనవారలకు, నిన్ సేవించుభక్తాళికిన్,

శ్రీమద్భాధరుఁడున్ సుధానిలయుఁడున్, శ్రీలోహితాకారుఁడున్,

శ్రీమత్సౌమ్యుఁడు, సద్గురుండు, కవియున్, శ్రీకల్పుఁడౌ మందుఁడున్,

దామిశ్రప్రహరాళి నీదు పదముల్ ధాత్రిన్ జయోత్కర్షముల్.

శా.  శ్రీమాతా! నతులైనవారలకు, నిన్ సేవించుభక్తాళికిన్,

శ్రీమద్భాధరుఁడున్ సుధానిలయుఁడున్, శ్రీలోహితాకారుఁడున్,

శ్రీమత్సౌమ్యుఁడు, సద్గురుండు, కవియున్, శ్రీకల్పుఁడౌ మందుఁడున్,

దామిశ్రప్రహరాళి నీదు పదముల్ ధాత్రిన్ జయోత్కర్షముల్.

తాII అమ్మా!శివుని యిల్లాలా! ఓ కామాక్షీ దేవీ! నమస్కరించువారికిని; సేవించువారికిని ప్రకాశత్వమును (సూర్యుడు) ధరించునది; అమృతమునకు నిలయము (చంద్రుడు); ఎఱ్ఱని ఆకృతి గలది (అంగారకుడు); శాంతమైనది (బుధుడు); గొప్పది (బృహస్పతి) కవితను చేయునది (శుక్రుడు); మరియు; నడకయందు మాన్యము గలది (శనైశ్చరుడు) చీకటిని పోగొట్టునది (రాహువు కేతువు)యునైన నీ యొక్క పాదకమలము సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

శ్లోII  నయన్తీం దాసత్వం నలిన భవముఖ్యాన్ అసులభ-

ప్రదానాత్ దీనానాం అమరతరు దౌర్భాగ్య జననీం I

జగజ్జన్మ క్షేమక్షయవిధిషు కామాక్షి పదయోః

ధురీణామీష్టే కస్తవ భణితు మాహోపురుషికామ్ II 60 II

తే.గీ.II  అమ్మ! నీ పాదపద్మాళి లసులభదగ

చేసుకొనె విధిప్రముఖులన్ సేవకులుగ,

కల్పకము దుఃఖితులకు, నీ కల్పనమును,

పోషణన్నాశమున్ జేయు, పొగడఁ దరమె?.

తాII ఓ కామాక్షీ! నీ కమల పాదములు బ్రహ్మ మరియు ఇతరులను నీ సేవకులుగా చేస్తాయి. దుఃఖంలో ఉన్నవారికి వారు కోరికలు తీర్చే చెట్టు వంటి ఐశ్వర్యాన్ని కురిపిస్తారు. వారు ప్రపంచాలను సృష్టిస్తారు, నిలబెట్టుకుంటారు మరియు నాశనం చేస్తారు. ఈ కార్యకలాపాలన్నింటిలో మీ శక్తి మరియు గర్వాన్ని ఎవరు తగినంతగా వర్ణించగలరు?

శ్లోII  జనోఽయం సంతప్తో జనని భవ చండాంశు కిరణైః

అలబ్ధ్వైకం శీతం కణమపి పరజ్ఞానపయసః I

తమోమార్గే పాన్థస్తవ ఝటితి కామాక్షి శిశిరాం

పదామ్భోజచ్ఛాయాం పరమశివ జాయే మృగయతే II 61 II

తే.గీ.II  వర పరజ్ఞానపయమును బడయ లేక,

తల్లి! భవసూర్య కిరణ సంతప్తుఁడ నిల,

కన తమోమార్గవర్తినై కనలుచుంటి,

నీదు పదపల్లవచ్ఛాయ నాదుకొనుము.

తాII ఓ తల్లి కామాక్షీ! పరమశివుని భార్యా!  నేను ఈ సంసారపు సూర్యుని యొక్క మండుతున్న కిరణాలచే పీడించబడుతున్నాను, కానీ ఆధ్యాత్మిక (ఉన్నత) జ్ఞానం యొక్క పాలు యొక్క చల్లదనాన్ని నేను పొందడం లేదు . నేను ఈ చీకటి మార్గంలో ప్రయాణికుడను. తక్షణమే నీ పాద పద్మాల చల్లని నీడను కోరుతున్నాను.  

శ్లోII  జయత్యమ్బ! శ్రీమన్నఖకిరణ చీనాంశుకమయం

వితానం బిభ్రాణే సురముకుట సంఘట్టమసృణే I

నిజారుణ్య క్షౌమాస్తరణవతి కామాక్షి సులభా

బుధైః సంవిన్నారీ తవ చరణ మాణిక్యభవనే II 62 II

తే.గీ.II  పాత్రి! నీ గోళ్ళకిరణమన్ బట్టుబట్ట

యంచు చాందినిన్ ధరియించు నమరుల ముడి

రాపిడిని నునుపెక్కిన శ్రీపద భవ

నమున జ్ఞానదీప్తి బుధుల కమరు వడిని.

తాII ఓ కామాక్షీ! గోళ్ళ కాంతియను పట్టుబట్ట అంచుల చాందినిని ధరించు దేవతల కిరీటముల మణుల రాపిడిచే నునుపెక్కిన శాగమట్ట పఱచబడిన అమ్మవారి పాదమణి భవనమున నున్న జ్ఞానకాంతి పండితులకు సుఖముగా లభించును.

శ్లోII  ప్రతీమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణ-

శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీన్ద్ర తనయే I

సురేన్ద్రాశా మాపూరయతి యదసౌ ధ్వాన్తమఖిలం

ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే II 63 II

తే.గీ.II  అనుపమాద్రీంద్రతనయ! కామాక్షి! యెట్టి

హేతువున నీదు పాదముల్ ఖ్యాతిగాను

చీకటులఁ బాపి దిక్కులన్ జిందు కాంతి,

సూర్య తేజంపు హేతువా శోభ, కనఁగ.

తాII ఓ కామాక్షీ! హిమవంతుని కుమార్తెవైన జననీ! ఉదయించే సూర్యుని తేజస్సుకు మూలమైన, ఇంద్రుని కోరికలను నెరవేర్చే, చీకటిని పారద్రోలే, ఎర్రటి తేజస్సుతో అన్ని ప్రాంతాలను ముంచెత్తే నీ కమల పాదాలను మేము ధ్యానిస్తాము.

శ్లోII  మహాభాష్యవ్యాఖ్యాపటు శయన మారోపయతి వా

స్మర వ్యాపారేర్ష్యా పిశున నిటిలం కారయతి వా I

ద్విరేఫాణా మధ్యాసయతి సతతం వాధివసతిం

ప్రణమ్రాన్ కామాక్ష్యాః పదనలిన మాహాత్మ్యగరిమా II 64 II

తే.గీ.II  కలికి కామాక్షి! నీ పాదకమల గరిమ

భాష్యకారులుగాఁ జేయు ప్రణతులఁ గని,

కామ జితులుగఁ జేయుచు ఘనతఁ గొలుపు,

పద్మమున వెల్గువారిగా వరలఁ జేయు.

తాII కామాక్షి పాద కమలం యొక్క గొప్పతనం, వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసేవారిని మహాభాష్యాన్ని వ్రాయగల గొప్ప పండితునిగా చేస్తుంది లేదా శివుని వలె కామాన్ని దహనం చేయగలవాఁడుగా చేస్తుంది లేదా దేవతల నివాసాన్ని ఆక్రమించేవాడుగా చేస్తుంది.  

శ్లోII  వివేకామ్భః  స్రోతః స్నపన పరిపాటీ శిశిరితే 

సమీభూతే శాస్త్ర స్మరణ హల సంకర్షణ వశాత్ I

సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో

మహాసంవిత్సస్య ప్రకర పరబీజం గిరిసుతే II 65 II

చం.  ధరణి వెవేక దివ్య జల ధారను మున్గుటఁ జల్లనౌటనే

యరయుచు శాస్త్ర సంస్మరణ హాలమునన్ సమమైన సజ్జనో

ద్ధుర వర చేతన ప్రథిత తోరపు క్షేత్రమునందున జ్ఞానమన్

నిరుపమ బీజమద్దు జననీ మహిమాన్విత! నీదు పాదముల్.

తే.గీ.II  అల వివేకాంబుధిన్ స్నానమాచరించి

శాస్త్రపఠనహలంబున చదును చేయఁ

బడిన ఋషిహృదయక్షేత్రములను జ్ఞాన 

బీజములు నాటు జనని! నీ వినుత పదము.

తాII హిమగిరి తనయా! ఓ కామాక్షీ! నీ తామర పాదాలు వివేకము అనే జలధారలో స్నానం చేసి చల్లబడి, శాస్త్రాలోచన అను నాగలితో చదును చేయబడిన ఋషుల హృదయ క్షేత్రంలో నిజమైన జ్ఞాన బీజాలను నాటుతాయి . 

23 – 02 – 2024.

శ్లోII  దధానో మన్దార స్తబక పరిపాటీం నఖరుచా

వహన్దీప్తాం శోణాంగులి పటలచామ్పేయ కలికాః I

అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో

వికాసీ వాసన్తః సమయ ఇవ తే శర్వదయితే II 66 II

శాII  కామాక్షీ! నఖ కాంతి పోలు కనగా గణ్యంపు మందారమున్,

శ్రీమాతా! వర చంపకారుణములే చెన్నారు పాదాంగుళుల్,

హైమా! సంతస దాయియౌ పదములాహాహా! యశోకంబులే,

ప్రేమన్ గాంచ వసంతతేజమయమే విఖ్యాతమౌ పాదముల్.

తాII ఓ కామాక్షీ! మీ బొటనవేలు గోళ్ల ప్రకాశం మల్లె పువ్వుల సమూహాన్ని పోలి ఉంటుంది. ప్రకాశవంతమైన ఎర్రటి రంగుతో మీ కమల పాదాల వేళ్లు చంపా పువ్వు మొగ్గలను పోలి ఉంటాయి. నీ పాదాలు అశోక పుష్పాల ఆనందాన్ని పంచుతాయి. ఓ శివుని భార్యా! మీ పాదాలు వసంత ఋతువులా కనిపిస్తున్నాయి.

శ్లోII  నఖాంశు ప్రాచుర్య ప్రసృమర మరాలాలిధవలః

స్ఫురన్మంజీరోద్యన్ మరకత మహశ్శైవలయుతః I

భవత్యాః కామాక్షి స్ఫుట చరణ పాటల్య కపటో

నదః శోణాభిఖ్యో నగపతితనూజే విజయతే  II 67 II

తే.గీ.II  హైమ! నీ పాద నఖకాంతి హంసగుంపు,

చీలమండలు ముదురాకుఁ జెలఁగు పచ్చ,

యెఱ్ఱనైనట్టి నది యావహించినట్టు

లున్న నీపాదపాళి కనుపమ జయము.

తాII ఓ కామాక్షీ! హైమా! నీ గోళ్ళ నుండి వెలువడే అద్భుతమైన తెల్లని తేజస్సు నదిలో తేలియాడే హంసల వంటిది మరియు నీ చీలమండల ముదురు ఆకుపచ్చ రంగు నాచు లాంటిది.  శోణా నదిలా ఉన్న నీ పాదాల  ఎర్రటి తేజస్సుకు విజయము.

శ్లోII  ధునానం పఙ్కౌఘం పరమ సులభం కంటకకులైః

వికాస వ్యాసఙ్గం విదధద పరాధీనమనిశమ్ I

నఖేన్దు జ్యో త్స్నాభిర్విశద రుచి కామాక్షి నితరామ్

అసామాన్యం మన్యే సరసిజ మిదం తే పదయుగమ్ II 68 II

సీII  పాపపంకిలమును పారద్రోలుచునుండు కామాక్షి నీపాదకంజయుగళి,

కంటకరిపులకు నంట నసాధ్యమ్ము, భవ్యమయిన నీదు పాదయుగళి,

స్వప్రకాశముతోడ సకలంబు నడిపించు, వరములనొసఁగు నీ పాదయుగళి,

నఖచంద్ర కిరణాల నఖిలంబు తెల్లనై భవహారియగు నీదు పాదయుగళి,

తే.గీ.II  అట్టి నీ పాదయుగళిని పట్టి విడువ,

తల్లిరో! చూడనవి యసాధారణములు,

నీదు కృపయున్న లభియించు మోదమలర

సేవచేంగ నీపాద సీమ జనని!

తాII ఓ కామాక్షీ! నీ కమల పాదాలు పాపాలను కడిగివేస్తాయి, శత్రువులకు సులువుగా లభించవు, పుష్పించేటటువంటివి , ఎల్లప్పుడూ (భక్తులను) స్వేచ్చగా, కాలి గోరు-చంద్రుల నుండి చంద్రకాంతి కారణంగా తెల్లని రంగును కలిగిస్తాయి. మీ తామర పాదాలు చాలా అసాధారణమైనవి, అసాధారణమైనవి అని అనుకుంటున్నాను .

శ్లోII  కరీన్ద్రాయ ద్రుహ్యత్యలసగతి లీలాసు విమలైః

పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే I

పదామ్భోజ ద్వన్ద్వం తవ తదపి కామాక్షి హృదయం

మునీనాం శాన్తానాం కథ మనిశ మస్మై స్పృహయతే  II 69 II

తే.గీ.II  గమనసౌష్టవ గరిమను గజ విరోధి,

కమలములతోడ మాత్సర్యగరిమనొప్పు,

కామమును మెచ్చు కామాక్షి కమల పాద

పాళిఁ గోరదే మునిపాళి భవ్య మనసు?

తాII ఓ కామాక్షీదేవీ! నీ యొక్క మెల్లని నడకయొక్క విలాసములందు పాదముల జంట గజేస్త్రుని కొఱకు ద్రోహమొనర్చుచున్నది. స్వచ్ఛములైన కమలములతో మత్సరతను ప్రకటించుచున్నది. కామమును ఆదరించుచున్నది. శాంతులైన ఆ మునులయొక్క మనస్సు కూడ దీని (పాదముల జంట) కొఱకు కోరుచున్నది.

శ్లోII  నిరస్తా శోణిమ్నా చరణ కిరణానాం తవ శివే

సమిన్ధానా సంధ్యారుచిరచల రాజన్యతనయే I

అసామర్థ్యాదేనం పరిభవితుమేతత్ సమరుచాం

సరోజానాం జానే ముకులయతి శోభాం ప్రతిదినమ్ II 70 II

తే.గీ.  మహిత సంధ్యారుణద్యుతుల్ మాసిపోవు

నంతగా తల్లి పాదంబులధిగమించ, 

చింత చెందుచు నేమియుఁ జేయలేక

ముడుచుకొనఁ జేయు పద్మాళిఁ బ్రొద్దు చివర.

తాII ఓ హైమవతీ! మీ కమల పాదాల నుండి ప్రకాశవంతమైన ఎరుపు రంగు సాయంత్రం సంధ్యాకాలం (సంధ్య) యొక్క ప్రకాశవంతమైన ఎరుపు రంగును మించిపోయింది. అది ప్రతీకారం తీర్చుకోలేక పోయినందున (సంధ్య) మీ కమల పాదాల వలె ఎరుపు మరియు మృదువైన కమలాన్ని సాయంత్రం సంధ్య సమయంలో మూసివేస్తుంది.   

శ్లోII  ఉపాదిక్షద్దాక్ష్యం తవ చరణనామా గురురసౌ

మరాలానాం శఙ్కే మసృణగతి లాలిత్య సరణౌ I

అతస్తే నిస్తన్ద్రం నియతమమునా సఖ్య పదవీమ్

ప్రపన్నం పాథోజం ప్రతి దధతి కామాక్షి కుతుకమ్ II 71 II

తే.గీ.  అమ్మపాదాల సఖ్యత నలరు కమల

ములను జూచి పొంగెడు హంసములను మెచ్చి,

వాటి కమ్మ పాదంబులు మేటి గురువ

గుచును నడకలో శిక్షణఁ గొలిపెనందు.

తాII హంసలు అమ్మవారి పాదములతో సఖ్యము చేయు కమలమును గూర్చి కుతూహలపడుటచేత వాని కమ్మవారి పాదము గురువై నడకలో సామర్థ్యము నుపదేశించినదని భావించుచున్నాను.

శ్లోII  దధానైః సంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులైః

ద్విజాధీశ శ్లాఘావిధిషు విదధ ద్భిర్ముకులతామ్ I

రజోమిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోః

విరోధస్తే యుక్తో విషమశరవైరి ప్రియతమే II 72 II

తే.గీ.II  ప్రకృతిమలిన షట్పదముల బంధ మొప్పి,

యల ద్విజాధీశుఁ బొగడుట నలసతఁ గల

ఘన రజోమిశ్ర నలముతోఁ గయ్యమొంది

యుంట నీ పాదయుగళికి నొప్పునమ్మ!

తాII ఓ శాంభవీ! స్వాభావిక మాలిన్యము (నలుపు)గల తుమ్మెదలతో సంబంధమును పెట్టుకొను, ద్విజాధీశు (బ్రాహ్మణ-చంద్రు)ని మెచ్చుకొనుటలో ముకులత్వమును (వైముఖ్యమును) ప్రకటించు, రజో మిశ్రకమలములతో అమ్మవారి పాదము విరోధము పెట్టుకొనుట యుక్తమే.

శ్లోII  కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణౌ రక్షణచణౌ

విపన్నానాం శ్రీమన్నలినమసృణౌ శోణకిరణౌ I

మునీన్ద్రాణామన్తః కరణశరణౌ మన్దసరణౌ

మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ II 73 II

తే.గీ.II  కవనలక్ష్మిని కలిపెడి ఘనతఁ గలది,

రక్షణాపన్నులకు, శోణ హ్రదము, నిలుచు

మునుల మదులలో, మందగమన కనంగ

నట్టి కామాక్షిపదములకంజలింతు.

తాII అమ్మవారి చరణములు కవిత్వ శ్రీలను కలుపుటలో నిపుణములైనవి. ఆపన్నులను రక్షించుటకు సమర్థత గలవి. ఎఱ్ఱని కిరణములు గలవి. మునీంద్రుల అంతఃకరణమున నివసించునట్టివి. మందగమనము గలవి. అట్టివానికి నమస్కరించుచున్నాను.

24 – 02 – 2024.

శ్లోII  పరస్మాత్సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః

నఖ శ్రీభిర్జ్యోత్స్నా కలితతులయోస్తామ్రతలయోః I

నిలీయే కామాక్ష్యా నిగమ నుతయోర్నాకినతయోః

నిరస్త ప్రోన్మీలన్నలిన మదయోరేవ పదయోః II 74 II

తే.గీ.II  పరములకుపరమై, ముక్తి వరలఁ గొలుపు,

గోళ్ళ కాంతి చంద్రిక నొప్పు, కొలుచు నట్టి

వేదములు కల, దేవసేవితము లబ్జ

ములను మించు జనని పాదములను దలతు.

తాII ముక్తిని ఇవ్వగల, సమర్ధులన్నింటి కంటే ఉన్నతమైన కమలాల అహంకారాన్ని పారద్రోలే, కామాక్షి పాదాలలో నా హృదయం కరిగిపోతుంది, ఎవరి గోళ్ళ యొక్క తేజస్సు అందాన్ని అధిగమిస్తుంది. చంద్రకాంతి, అరికాళ్ళు గులాబీ రంగులో ఉంటాయి, వేదాలచే స్తుతించబడినవి మరియు ఖగోళులు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు.

శ్లోII  స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం

మ్రదిమ్నాశోణిమ్నా భగవతి దధాతే సదృశతామ్ I

వనే పూర్వస్యేచ్ఛా సతతమవనే కిం తు జగతాం

పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియామ్ II 75 II

తే.గీ.II  అమ్మ పాదముల్, చిగురాకు నెమ్మినొకటె,

మృదులమై యెఱ్ఱగానుండు, నెదలఁ గాంచ

వనమునందుండు చిగురా కవనమునందు

నన్నిటిన్ గావ పాదంబులమరియుండు. 

తాII ఓ కామాక్షీ! లేత ఆకు మొగ్గలు మరియు మీ తామర పాదాల మధ్య ఈ సహజ సారూప్యత ఉంది ; రెండూ మృదువైనవి మరియు గులాబీ రంగులో ఉంటాయి. కానీ జ్ఞానులకు తేడా కనిపిస్తుంది.  పూర్వం యొక్క కోరిక అడవిలో ఉంది  (వనే) తరువాతి కోరిక ఎల్లప్పుడూ లోకాలను రక్షించడంలో ఉంటుంది (అవనే).  [సంస్కృతంలో 'అ' అనేది దాని వ్యతిరేకతను పొందేందుకు ఒక పదానికి ఉపసర్గ ఉంటుంది. కాబట్టి 'అవనే' అనేది 'వనే'కి వ్యతిరేకం]

25 – 02 – 2024.

శ్లోII  కథం వాచాలోಽపి ప్రకటమణి మంజీరనినదైః

సదైవానన్దార్ద్రాన్విరచయతి వాచంయమజనాన్ I

ప్రకృత్యా తే శోణచ్ఛవిరపి చ కామాక్షి చరణో

మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే II 76 II

తే.గీ.II  ప్రణవ మంజీర వాచాల పాదయుగళి

మునిజనంబుల కానంద మునిడు, నెటుల?

శోణమయ్యును జనులకు శుద్ధచిత్త

మెట్టులిచ్చునో కామాక్షి! యిదియ వింత.

తాII మంజీరనాదములచే మాట్లాడు అమ్మవారి చరణము మౌనులను ఆనందార్థులను చేయుచున్నది. అంతేకాక ఎఱ్ఱనిరంగు కలదైనను అది బుద్ధి యందు నిర్మలతను పెంచుచున్నది గదా! ఇది ఎట్లు?

శ్లోII  చలత్తృష్ణావీచీ పరిచలన పర్యాకులతయా

ముహుర్భ్రాన్త స్తాన్తః పరమశివవామాక్షి పరవాన్ I

తితీర్షుః కామాక్షి ప్రచురతర కర్మామ్బుధిమముం

కదాహం లప్స్యే తే చరణమణిసేతుం గిరిసుతే II 77 II

తే.గీ.II  ఆశల తరంగములఁ జిక్కి, వ్యాకులుండ

నయి పదేపదే భ్రమియించి యలసి యున్న

నేను కర్మవారిధి దాట నౌనదెపుడు

నీదు పాదసేతువుపొంది? నిరుపమ సతి! 

తాII ఓ పార్వతీ మాతా! ఆశల తరంగములతో వ్యాకులుడనైన మాటిమాటికి భ్రమించి అలసిన పరవశుడనైన నేను కర్మ సముద్రమును దాట గోరితిని. తత్సాధనమైన నీ పాదమనెడి మణిమయసేతువు నెప్పుడు పొందగలుగుదునో.

శ్లోII  విశుష్యన్త్యాం ప్రజ్ఞాసరితి దురిత గ్రీష్మ సమయ-

ప్రభావేణ క్షీణే సతి మమ మనః కేకిని శుచా I

త్వదీయః కామాక్షి స్ఫురిత చరణామ్భోద మహిమా

నభోమాసాటోపం నగపతిసుతే కిం న కురుతే II 78 II

తే.గీ.II  నాదు పాపతాపంబుచే జ్ఞానఝరియు

నెండిపోచుండ నీ కవి గుండెయనెడి

నెమలి దుఃఖంబుతోఁ గ్రున్క నీదు పాద

ములగు శ్రావణ మాసమ్ము, పూజ్య జనని!

తాII ఓ కామాక్షీ! పాపమను గ్రీష్మకాలముయొక్క ప్రభావముచే నాలోని ప్రజ్ఞానది ఎండిపోవు చుండగా నాలోని కవి మనస్సనెడి నెమలి దుఃఖముతో క్షీణించినది కాగా నీ పాదమనెడి మేఘము శ్రావణమాస మగుచున్నది.

శ్లోII  వినమ్రాణాం చేతో భవన వలభీసీమ్ని చరణ

ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూత తమసి I

అసీమా కామాక్షి స్వయ మలఘు దుష్కర్మ లహరీ

విఘూర్ణన్తీ శాన్తిం శలభ పరిపాటీవ భజతే II 79 II

తే.గీ.II  వందనము చేయు భక్త హృన్మందిరమున

నీ పదజ్యోతి కామాక్షి! నిరతముగను

వెలుగుచుండ దుష్కర్మలన్ శలభరాశి

వలెను శాంతిని గనునమ్మ! పద్మనయన!

తాII ఓ కామాక్షీ! నమస్కరించువారి మనో భవనమున నీ పాదము దీపమై  ప్రకాశించుచుండగా, దానియందు పాప ప్రవాహము మిడుతల దండులా వచ్చిపడి నశిస్తున్నాయి.

శ్లోII  విరాజన్తీ శుక్తిర్నఖ కిరణ ముక్తా మణితతేః

విపత్పాథోరాశౌ తరిరపి నరాణాం ప్రణమతామ్ I

త్వదీయః కామాక్షి ధృవమలఘు వహ్నిర్భవవనే

మునీనాం జ్ఞానాగ్నేః అరణిరయమంఘ్రి ర్విజయతే  II 80 II

తే.గీ.II  నఖ కిరణ ముత్యముల శుక్తి, నతుల యాప

దాంబుధికి నావయు, భవ దావాగ్ని యరయ,

మునులజ్ఞానాగ్నికరణి సత్ పూజ్యమైన

నీదు పాదమ్ము కామాక్షి! నిత్యపూజ్య!

తాII ఓ కామాక్షీ! గోళ్ళ కాంతులనెడి ముత్తెముల సమూహమునకు ముత్తెపు చిప్ప, నమస్కరించు నరుల ఆపదలనెడి సముద్రమునకు నావ, సంసారమను అడవి యందు అగ్ని, మునుల జ్ఞానమనెడి అగ్నికి అరణియునై నీ పాదము వర్ధిల్లుచున్నది.

శ్లోII  సమస్తైః సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః

స్తుతో గన్ధర్వ స్త్రీ సులలిత విపంచీ కలరవైః I

భవత్యా భిన్దానో భవ గిరికులం జృమ్భితతమో-

బలద్రోహీ మాతశ్చరణ పురుహూతో విజయతే  II 81 II

తే.గీ.II  సతత విబుధ సంసేవ్య త్వత్ సత్పదములు,

దేవకాంతావిపంచుల దివ్యరవము

లఁ బొగడఁబడి, భవ నగంబులను నరికెడి,

జృమ్భిత తమోబలద్రోహి యింద్రుఁడరయ.

తాII ఎల్లప్పుడును బుధులందఱిచే బాగుగా సేవింపదగిన, గంధర్వ స్త్రీల మనోహరవీణాధ్వనులచేత పొగడబడిన, సంసారపర్వతసమూహమును ఛేదించు, తమస్సు పెరిగిన బలుడను రాక్షసుని ఛేదించిన నీ చరణమను ఇంద్రుడు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు.

03 – 03 – 2024.

శ్లోII  వసన్తం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్-

ఘనచ్ఛాయాపూర్ణం శుచి మపి నృణాం తాపశమనమ్ I

నఖేన్దు జ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం

నమామః కామాక్ష్యాః చరణ మధికాశ్చర్యకరణమ్ II 82 II

తే.గీ.II  భక్తు లెదల నామని యయ్యు వారిద రుచి

నలరు, శుచియయ్యు తాపంబునణచివేయు,

జ్యోత్స్న భాసిత నఖయయ్యు సూకములను 

విడఁగఁ జేయు, నమ్మపదాళిఁ బ్రీతిఁ గొలుతు.

తాII కామాక్షీదేవి కమల పాదాలు ఎల్లప్పుడూ భక్తుల హృదయాలలో వసంత ఋతువులా ఉన్నప్పటికీ అవి కూడా చీకటి మబ్బులతో నిండిన వర్షాకాలంలా ఉంటాయి. అవి శుభ్రంగా  ఉన్నప్పటికీ (శుచి అంటే వేసవికాలం కూడా) అవి కష్టాల వేడిని దూరం చేస్తాయి. అవి చల్లగా ఉంటాయి (శిశిర అంటే శీతాకాలం తర్వాత మరియు వసంతకాలం ముందు కాలం అని కూడా అర్ధం) ఎందుకంటే కాలి గోళ్ళ నుండి చంద్రకాంతి లాంటి ప్రకాశం ఉంటుంది, కానీ అవి కమలాన్ని వికసించేలా చేస్తాయి. ఎవరి పాదాలు మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో ఆ కామాక్షికి మనం సాష్టాంగ నమస్కారంచేస్తాము

శ్లోII  కవీన్ద్రాణాం నానాభణితి గుణచిత్రీకృతవచః

ప్రపంచ వ్యాపార ప్రకటన కలాకౌశలనిధిః I

అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్ముని జనైః

నమస్యః కామాక్ష్యాః చరణ పరమేష్ఠీ విజయతే II 83 II

తే.గీ.II  సనక భృగుముఖ్యముని వంద్య, సకల సుకవి

వివిధ వాఙ్మహద్విన్యాస విమలసుగుణ

ప్రకటన సుకలా కౌశల వరనిధి యగు

బ్రహ్మ కామాక్షి పాదముల్, వరలు సతము.

తాII కవుల అనేక విధములైన వాగ్విన్యాసరీతి గుణముల ప్రకటించు కలా కౌశలమునకు నిధియైన, కమలమును క్రిందుగా చేయు, సనకాది భృగ్వాది మునులచే నమస్కరింపదగిన కామాక్షీదేవియొక్క పాదమనుబ్రహ్మ సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు.

శ్లోII  భవత్యాః కామాక్షి స్ఫురిత పద పఙ్కేరుహభువాం

పరాగాణాం పూరైః పరిహృత కలంక వ్యతికరైః I

నతానా మామృష్టే హృదయముకురే నిర్మలరుచి

ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే II 84 II

తే.గీ.II  అమ్మ! నీ పాద పద్మాల దుమ్ము నతుల

హృదయములనున్న క్రుళ్ళును వదలఁజేయ,

శుభ్రముకురములై మదుల్ శోభిలుటను

జగతి ప్రతిఫలించునఁటను, సన్నుతాత్మ!

తాII ఓ కామాక్షీ, నిండుగా వికసించిన నీ పాద కమలంలోని పుప్పొడి రేణువులు నీ యెదుట సాష్టాంగ నమస్కారం చేసేవారి హృదయాలలోని  మురికిని తొలగిస్తాయి . వారి హృదయాల అద్దంలో ఈ విధంగా శుభ్రంగా, స్పష్టంగా మరియు మెరుస్తూ ఈ విశ్వమంతా  ప్రతిఫలిస్తుంది.

04 – 03 – 2024.

శ్లోII  తవ త్రస్తం పాదాత్కిసలయం అరణ్యాన్తర మగాత్

పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ I

జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే

విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః II 85 II

తే.గీ.II  అమ్మ! నీ పాద మార్దవ మందలేక

పల్లవము పద్మమును చేరెఁ బడయ నెంచి,

పద్మ మది యాశ్రయించె నీ పాదములను,

శత్రువును వీడు మన, లేదొ శరణమనును.

తాII మీ పాదాల మృదుత్వమునకు భయపడి లేత ఆకు మొగ్గలు మరొక అడవికి వెళ్ళాయి. మరోవైపు కమలం  మీ కమల పాదాల ఆశ్రయం పొందింది (తమ మృదుత్వం మరియు అందంతో రెండో వారిచే ఓడిపోయింది). ఆకు మొగ్గ మరియు కమలం రెండూ సరైన పని మాత్రమే చేశాయి. ఓడిపోయిన వారు సుదూర ప్రదేశానికి వెళతారు లేదా శత్రువును ఆశ్రయిస్తారు.

శ్లోII  గృహీత్వా యాథార్థ్యం నిగమ వచసాం దేశిక కృపా-

కటాక్షార్కజ్యోతిః శమిత మమతాబన్ధ తమసః I

యతన్తే కామాక్షి ప్రతిదివస మంతర్ద్రఢయితుం

త్వదీయం పాదాబ్జం సుకృతపరిపాకేన సుజనాః II 86 II

తే.గీ.II  గురు కృపాకటాక్షజ్యోతి వరలి తమస

మంతమై వేదసారమౌ యనుపమమగు

నీదు పాదముల్ సుకృతులు నిలుప మదుల,

జనని! యత్నించుచుందురు సతత మెన్ని.

తాII గురుకృపాకటాక్షమనెడి సూర్యకాంతిచే మమకారమను చీఁకటి మాసిపోఁగా వేద ములలోని నిజమైనయర్థ మిది యని యెఱింగి నీ పాదకమలమును అంతరంగమునందు గట్టిగా నిల్పుకొనుట కనుదినము పురాకృతసుకృతపరిపాకముచే సుజనులు యత్నము సేయుదురు.

05 – 03 – 2024.

శ్లోII  జడానామప్యమ్బ స్మరణసమయే త్వచ్చరణయోః

భ్రమన్మన్థక్ష్మా భృద్ఘుమఘుమిత సిన్ధు ప్రతిభటాః I

ప్రసన్నాః కామాక్షి ప్రసభమధర స్పన్దన కలాః

భవన్తి స్వచ్ఛన్దం ప్రకృతి పరిపక్వా భణితయః II 87 II

తే.గీ.  జడుఁడె నీ పద ధ్యానమున్, స్మరణఁ జేయ,

జలధి మధన ఘుమఘుమిత సాంద్ర దివ్య

శబ్ద చయముతోడను స్పర్ధ సలుపు రుతిగ

పల్కులు మెఱయు పెదవులన్ వరలి జనని!

తాII ఓ తల్లి కామాక్షీ! మందమతి యైనను నీ పాదములను స్మరించినా, ధ్యానించినా,  మందర పర్వతం ద్వారా క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నప్పుడు అతని నుండి వెలువడే పదాలు ' ఘుముఘుము ' శబ్దంతో పోటీ పడతాయి, అతని పెదవులను బలవంతంగా కంపించేలా చేస్తాయి. ఆ పదాలు సహజంగా చక్కగా ఏర్పడి,  స్పష్టంగా మరియు ఆకస్మికంగా మెఱుస్తాయి.   

శ్లోII  వహన్నప్యశ్రాన్తం మధురనినదం హంస కమసౌ

తమేవాధః కర్తుం కిమివ యతతే కేలిగమనే I

భవస్యైవానన్దం విదధదపి కామాక్షి చరణో

భవత్యాస్తద్ద్రోహం భగవతి కిమేవం వితనుతే II 88 II

తే.గీ.II  హంసకము తాల్చియున్దాని ననవరతము 

క్రిందు చేయంగఁ గనుటేల? నిందువదన!

తా భవానంద యగుచునే తలచి చూడఁ

గ, భవ హాని చేయుటదేమి? శుభ నిధాన!

నీదు పాద మో కామాక్షి! నిరతముగను.

తాII ఓ కామాక్షీ! మీ తామర పాదాలు విశ్రాంతి లేకుండా, చీలమండల మధురమైన ధ్వనిని కలిగి ఉంటాయి (హంసక). అలాంటప్పుడు వారు ఆడంబరమైన నడకలో హంస (హంస)తో ఎందుకు పోటీ పడుతున్నారు? అవి శివునికి (భవ) ఆనందాన్ని కలిగిస్తాయి, అయితే అవి భక్తుల  సంసారాన్ని(భవ) ఎలా నాశనం చేస్తాయి . [కవి హంసక= (చీలమండ, హంస) మరియు భవ =( శివ , సంసారం ) అనే రెండు అర్థాలను ఉపయోగించి వాక్ విరోధాభాస(స్పష్టంగా పరస్పర విరుద్ధమైన) బొమ్మను సృష్టించాడు]

శ్లోII  యదత్యన్తం తామ్యత్యలసగతి వార్తాస్వపి శివే

తదేతత్కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగమ్ I

కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే

మునీన్ద్రాణామాస్తే మనసి చ కథం సూచినిశితే II 89 II

తే.గీ.II  చిన్ననడకకు నలయు నీ చిన్నిపాద

మెట్లు దేవతా మకుటమ్ము లెన్నొ త్రాక

నోర్చు? తీక్ష్ణమైన మునులనొప్పియుండు

మదులనెట్లు మసలు నీదు పదము లమ్మ!

తాII ఓ కామాక్షీ! మెలమెల్లన నడచుట చేతగూడ మిగుల శ్రమించు స్వభావమృదువైన నీ పాద యుగము దేవతలకిరీటసంఘట్టన మెట్లోర్చుచున్నదో గదా ! సూదిమొనకంటె. సుతీక్ష మైన మునుల మనసునం దెట్లు మసలుచున్నదో గదమ్మా !

05 – 03 – 2024.

శ్లోII  మనోరఙ్గే మత్కే విబుధ జన సమ్మోదజననీ

సరాగవ్యాసఙ్గా సరస మృదు సంచార సుభగా I

మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్యప్రకరణం

రణన్మంజీరా తే చరణయుగలీ నర్తకవధూః II 90 II

తే.గీ.  సతి! విబుధజన సమ్మోద జనని, నుత స

రాగ కలిత(కలన), సరస సంచర సుభగ, తవ 

శబ్ద సంయుత మంజీర చరణ నర్త

కి ప్రకరణ లాస్యమును మదిన్ గృపఁ గొలుపుత.

సీ.  కామాక్షి! నీ పాదకమల నర్తక కాంత కరుణాంతరంగయౌ కామితదయె,

విబుధ జనులకు సంవేద్యమై మోదంబు కలిగించునట్టిదౌ ఘనసుచరిత,

సద్రాగవ్యాసంగ సరసంపుమృదులసంచార, సుభగయైన, జయనిధాన,

ఘల్లుఘల్లునయందెలల్లనమ్రోగంగ నా పాదయుగళిమహాద్భుతముగ

తే.గీ.II  నా మనోరంగమందునన్ నాట్యమాడి

ప్రకటనము చేయ లాస్యంపు ప్రకరణమును,

వేడుచుంటిని, నేను నీ వాడనమ్మ!

నాదు మదిలోనె నీవుండి నన్నుఁ గనుము.

తాII విబుధజనులకు (దేవతలకు -- పండితులకును) ఆనందమునుదయింపఁజేయున దియు, రాగవ్యాసంగముకలదియు, ఎరుపుతో కూడినది. (శ్లేష) :-- సంగీతరాగము

లను మేళవించునదియు సరసమృదులమైన సంచారముచే (సొంపైననడకచే) (శ్లేష):-- నాట్యగతసుందరపాదవిన్యాసభంగిచే నింపైనదియు నై అందెలు మ్రోయ నీ చరణ యుగళి అనెడి నాట్యకత్తె నా మనస్సనెడి రంగస్థలమందు నాట్యప్రకరణమును బ్రదర్శించునుగాక !

06 – 03 – 2024.

శ్లోII  పరిష్కుర్వన్మాతః పశుపతి కపర్దం చరణరాట్

పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటమ్ I

భవాఖ్యే పాథోధౌ పరిహరతు కామాక్షి మమతా-

పరాధీనత్వం మే పరిముషిత పాథోజ మహిమా II 91 II

తే.గీ.II  శివుని జడముడిన్, నిస్సంగు చిత్తములను

శ్రుతులమౌళిపైనలరెడి యతులితమగు

నీదు పదములు కామాక్షి! నిరుపమగతి

మమతలనుబంధనలు నాకు మాపుగాక.

తాII ఓ కామాక్షీ! శివుని జటాకుటీరమును, విషయపరాఙ్ముఖులైన మహాయోగుల హృదయపద్మ మును, బరమోత్తమవాక్కులైన శ్రుతులమౌళిభాగమును, అలంకరించుచుండు నీ పాదము పద్మముల మహిమ కొల్లలాడే మదీయ మమకారపరమైన భావమును హరించుగాక ! 

06 – 03 – 2024.

శ్లోII  ప్రసూనైః సంపర్కాదమర తరుణీ కున్తల భవైః

అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతామ్ I

స్వసఙ్గాత్కఙ్కేలి ప్రసవ జనకత్వేన చ శివే

త్రిధా ధత్తే వార్తామ్ సురభిరితి పాదో గిరిసుతే II 92 II

తే.గీ.II  అమర కాంతల తలపూలనాసదనము,

నమతుల యభీష్టములు తీర్చు ప్రముదగుణము,

స్పర్శచే నశోకము పూయ సదయఁ జేయు

టను సురభియౌను జనని నీ ఘనపదంబు.

తాII దేవతా స్త్రీల తలకొప్పులలోని పూవుల సమ్పర్కమువలన, నమస్కరించు వారి కోరిక నీడేర్చుటవలన, తన స్పర్శతో అశోకవృక్షమును పూయించుట వలనను, ఈ మూడు విధములుగా అమ్మవారి పాదము సురభి యని ప్రసిద్ధి నొందినది.

శ్లోII  మహామోహస్తేనవ్యతికర భయాత్పాలయతి యో

వినిక్షిప్తం స్వస్మిన్మునిజన మనోరత్న మనిశమ్ I

స రాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షి తరసా

కిమేవం పాదోಽసౌ కిసలయరుచిం చోరయతి తే II 93 II

తే.గీ.II  మోహ చోరభీతిని దాచె మునులు మనసు

రత్నమును నీ పదము చెంత, రక్షణకయి, 

తాను దృఢ రాగమును గనెఁ దలచి కావ,

చిగురు ఛాయఁ దా నమ్మరో! చెలఁగి గొనెనొ?

తాII ఓ కామాక్షీ! మునులు మోహమను దొంగకు భయపడి తమ మనస్సనెడి అమూల్యరత్నమును తనకడ దాపరికము సేయగా దానిని రక్షించుటకు నీ పాదము దృఢరాగము గొని (రాగము = ఎరుపు, ప్రేమ) ఒక లేఁత చిగురాకువలె కన్పట్టుచున్నదా యేమి ? అనఁగా నిది చిగురాకు మాత్రమని యెంచి దొంగ రత్నమును హరింపఁడని అర్థము, ప్రకృతము శ్రీచరణలగ్నమైన మనసు మోహవశముకాదని భావము.

ఓ కామాక్షీ! మీ కమల పాదాలు తమ వద్ద జమ చేసిన వారి హృదయ రత్నాన్ని గొప్ప భ్రమలు మరియు కోరికల దొంగల నుండి ఎల్లప్పుడూ రక్షిస్తాయి. రాగం (ఎరుపు, అనుబంధం) అధికంగా ఉండటం వల్ల ఎప్పుడూ అందంగా ఉండే ఈ నీ పాదాలు ఆకు మొగ్గల అందాన్ని ఎందుకు దొంగిలించాలి? [ఇది కూడా విరోధభాష . ఒకవైపు కామాక్షి పాదాలు మోహము మొదలైన దొంగల నుండి భక్తుల హృదయాన్ని రక్షిస్తాయి . మరోవైపు ఆకు మొగ్గల ఎరుపును వారే దొంగిలిస్తారు (అంటే ఎరుపు రంగులో శ్రేష్ఠమైనది)]

08 – 03 – 2024.

శ్లోII  సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం

సమాస్వాద్య శ్రాన్తం హృదయ శుకపోతం జనని మే I

కృపాజాలే ఫాలేక్షణమహిషి! కామాక్షి! రభసాత్

గృహీత్వా రున్ధీథాః చరణ యుగలీ పంజరపుటే II 94 II

తే.గీ.II  విషయ శాలి కణికలను బ్రీతిఁ దినుచు

నలసె నా చిత్తమన్ జిల్క, యాదరమను

వలను పట్టి దానిని నీదు పాదములను

పంజరంబున బంధించు! భద్రకాళి!

తాII ఓ కామాక్షీ! విషయమను బియ్యపుగింజను బాగుగా తిని అలసిన నా మనస్సు అను చిలుకకూనను నీ పాదమను పంజరమునందు దయయను వలను విసరి పట్టుకొని బంధింపుము.

శ్లోII  ధునానం కామాక్షి స్మరణ లవమాత్రేణ జడిమ-

జ్వరప్రౌఢిం గూఢస్థితి నిగమనైకుంజ కుహరే I

అలభ్యం సర్వేషాం కతిచన లభన్తే సుకృతినః

చిరాదన్విష్యన్తః తవ చరణ సిద్ధౌషధమిదమ్ II 95 II

తే.గీ.II  నీదు పాద సిద్ధౌషధ మాదుకొనుచు

తలచినంత జాడ్యజ్వర తాపముడుపు,

నిగమనైకుంజకుహరాన సుగతినున్న

నీ పదౌషధిన్ ఘనుఁడొందు, నిజము జనని!

తాII ఓ కామాక్షీ! నీ పాదమను సిద్ధౌషధమును కొద్దిసేపు స్మరించిన మాత్రమున జాడ్యజ్వరమును తొలగించును. వేదమను పొదలోపలి భాగమున గూఢముగా నుండునట్టిది, అందఱకు లభించనిది, చాలా కాలము వెదకు కొందఱు పుణ్యాత్ములే దానిని పొందెదరు.

శ్లోII  రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం

మనోవాస్తవ్యాభ్యాం మథిత తిమిరాభ్యాం నఖరుచా I

నిధేయాభ్యాం పత్యా నిజశిరసి కామాక్షి సతతం

నమస్తే పాదాభ్యాం నలిన మృదులాభ్యాం గిరిసుతే II 96 II

సీ.  ధ్వనియించు నందెలన్ ధరియించు నట్టివి, గమనలాలిత్యము గలవి కనగ,

పుణ్యాత్ములెదలందు పూర్తిగా వసియించి, భక్తులఁ గాపాడు ప్రతిన కలవి,

పాపపు తిమిరాలఁ బాపంగ తగియున్న నఖకాంతిని యలరునఖిల జగతి,

శ్రీగళుండైనట్టి శివుని శిరముపైన ధరియింప తగియున్న చరితఁ గలవి,

తే.గీ.II  నిజము కామాక్షి! నీపాద నీరజములు,

నిత్యకల్యాణఫలదమౌ స్తుత్యపాద

పద్మములకేను ప్రణమిల్లి వరలనుంటి,

నీదు కృపఁ జూపి కావుమా నిత్యము నను.

తాII ఓ కామాక్షీ! నీ పాదములు ధ్వనించు నందెలు గలవి. వాని గమనము అందమైనది. పుణ్యాత్ముల మనములందే అవి నివసించునట్టివి. గోళ్ళకాంతులచే చీకట్లు చీల్చునట్టివి. భర్తయైన శివునిచే నెల్లప్పుడు తన శిరస్సున నుంచుకొన దగినట్టివి. 

శ్లోII  సరాగే రాకేన్దు ప్రతినిధిముఖే పర్వతసుతే

చిరాల్లభ్యే భక్త్యా శమధన జనానాం పరిషదా I

మనోభృఙ్గో మత్కః పద కమలయుగ్మే జనని తే

ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతామ్ II 97 II

తే.గీ.II  శివుని యర్థాంగి! హిమజ! శశిముఖి! యనుప

లభ్య రాగపాదాబ్జముల్గలిగినట్టి

జనని! కామాక్షి! నీపాద జలజములను

నా మనోభృంగ మానంద నటననలరు.

తాII ఓ రాకేందుముఖీ ! కామాక్షీ ! శమదమాద్యైశ్వర్యసంపన్నులను భక్త సమా జముచే చిరకాలమునకు లభ్యమగు నీ పాదారవిందద్వంద్వమందు ఎట్టి విక్షేపము లేక నా చిత్తమను తుమ్మెద క్రీడించుగాక !

శ్లోII  శివే సంవిత్పాశైః శశిశకలచూడ ప్రియతమే

శనైర్గత్యాగత్యా జిత సురవరేభే గిరిసుతే I

యతన్తే సన్తస్తే చరణ నలినాలాన యుగలే

సదా బద్ధుం చిత్త ప్రమద కరియూథం దృఢతరమ్ II 98 II

తే.గీ.II  ఓ శివా! గిరిజా! భవానీ! శశిముఖి! 

మందగమన జిత సురభి! మహితమైన

నీ చరణ నలినాలాన నియతి జ్ఞాన

పాశమున చిత్తకరిఁ గట్ట వలచు ఘనుఁడు.

తాII తన మన్దగమనముతో ఐరావతమును జయించిన పర్వతపుత్రి, శివుని యిల్లాలునునైన అమ్మవారి చరణయుగము అనెడి ఆలానస్తంభ యుగ్మమున తమ మనస్సులను గజముల సమూహమును జ్ఞానపాశములతో బంధించుట కెల్లప్పుడు సత్పురుషులు యత్నించుచుందురు.

శ్లోII  యశః సూతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే

శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే I

సతాం పాశగ్రన్థిం శిథిలయతి కిం కిం న కురుతే

ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతిపరిపాటీ చరణయోః II 99 II

తే.గీ.II  అమ్మ కామాక్షి పదములకంజలింప

కీర్తిఁ గొలుపును, కవితకున్ స్ఫూర్తిఁ గొలుపు,

శ్రీలనిడు, చిత్తమున శక్తిఁ జెలఁగఁ జేయు,

బంధములు పాపు, శుభములే వరలఁ జేయు.

తాII శాంభవీచరణపద్మమునం దొనర్చు ప్రణామము యశమును గూర్చును. తియ్యని కవిత్వము నించును. సంపదల నిడును. ఒకానొక మనఃపరిపాకము నలవరించును. జీవపాశగ్రంథిని విప్పును. అది చేయని మంగళ మేమున్నది !

శ్లోII  మనీషాం మాహేన్ద్రీం కకుభమివ తే కామపి దశాం

ప్రధత్తే కామాక్ష్యాః చరణ తరుణాదిత్యకిరణః I

యదీయే సంపర్కే ధృతరస మరన్దా కవయతాం

పరీపాకం ధత్తే పరిమలవతీ సూక్తినలినీ II 100 II

తే.గీ.II  గిరిజ పాదతరుణ రవికిరణములను

బుద్ధి ప్రాగ్దిశ శోభిల్ల, పూజ్య కవుల

సూక్తి పద్మిని పరిమళశోభితమును

కలిత మకరంద పరువమున్ గలిగి వెలుగు.

తాII తల్లి (కామాక్షీదేవి) పాదము బాలభాస్కరుని కాంతిరేఖ. అది బుద్ధి అనే తూర్పుదిక్కును శోభిల్లజేస్తుంది- ఆ తత్ఫలితమైన వారి సూక్తి పద్మిని మరందరసముతో నిండి, పరిమళించినదై, కవిత్వ పరిపాకాన్ని ధరిస్తుంది. 

శ్లోII  పురా మారారాతిః పురమజయదమ్బ స్తవశతైః

ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహినశైలేంద్రతనయే I

అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే

సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగలమ్ II 101 II

తే.గీ.II  కనగ స్మరవైరి స్తవశతం బునను నీదు

కృపను విజితత్రిపురుఁడయి కీర్తిఁ గనడె?

కాన కామాక్షి! నీ పాదకమలము లెద

నాకు నవసానమున నుండి సాఁకుగాక.

తాII ఓ హిమవాన్ పుత్రిక! ఒకప్పుడు కామ శత్రువైన పరమశివుడు వందలాది శ్లోకాలతో నిన్ను ప్రసన్నం చేసుకుని మూడు నగరాలపై విజయం సాధించాడు. కావున ఓ తల్లి కామాక్షీ! నా అంత్యము సమీపించిన వెంటనే   నీ కమల పాదములు నా హృదయములో వెలిగిపోవును గాక. 

శ్లోII  పదద్వన్ద్వం మన్దమ్ గతిషు నివసన్తం హృది సతాం

గిరామన్తే భ్రాన్తం కృతక రహితానాం పరిబృఢే I

జనానామానన్దం జనని జనయన్తం ప్రణమతాం

త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలమ్ II 102 II

తే.గీ.II  మందగతిగల్గి, నిత్యమున్ మంచివారి

డెందములనుండి, మాటలకందనట్టి,

ముందు ప్రణమిల్లు వారికి మోదమొసగు,

నీ పదములకు కామాక్షి! నిత్య నతుఁడ.

తాII ఓ కామాక్షీ! నిదానమైన నడక గల, మంచివారి హృదయాలలో నివసించే, మాటలకు అందనివి మరియుదాని ముందు సాష్టాంగపడిన వారిని స్వచ్ఛమైన ఆనందంతో   నింపే నీ అకళంక కమల పాదాలకు నేను ప్రతిరోజూ నమస్కరిస్తున్నాను .

శ్లోII  ఇదం యః కామాక్ష్యాః చరణ నలిన స్తోత్రశతకం

జపేన్నిత్యం భక్త్యా నిఖిలజగదాహ్లాద జనకమ్ I

స విశ్వేషాం వన్ద్యః సకల కవి లోకైక తిలకః

చిరం భుక్త్వా భోగాన్ పరిణమతి చిద్రూపకలయా II 103 II

తే.గీ.II  అమ్మ పాదనళినశతకమ్మునెవరు

భక్తితో జపియింతురో వారు సతము

గౌరవముపొంది యుత్తమ కవులగుదురు,

వరలు దీర్ఘాయువున, ముక్తి ప్రాప్తమగును.

తాII అందరి హృదయాలలో ఆనందాన్ని నింపే కామాక్షి పాద పద్మాలపై వంద శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో జపిస్తారో , వారు అందరిచే గౌరవించబడతారు, ఉత్తమ కవులు అవుతారు మరియు దీర్ఘకాలం జీవిత శ్రేయస్సును అనుభవించిన తర్వాత, లో విలీనం అవుతారు. పరమ స్పృహ స్వభావం కలిగిన అంతిమ వాస్తవికత.

09 – 03 – 2024.

II పాదారవింద శతకము సంపూర్ణం II

కృతికర్త.  

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165


రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.

44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.

45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)

46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.

స్వస్తి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.