గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

1. ఆర్యా శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) ఆంధ్రపద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్. 

ఆర్యా శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము)  

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.

1. శ్లోII  కారణ పర చిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా.

కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబకకోమలాంగలతా.

ఉII  కుంకుమ పూల గుత్తివలె కోమలదేహలతాభిరామ, శో

భాంకురమైన కారణ పరాద్భుత చిద్వరరూప, కంచికా

శంకర కామపీఠగత సన్నుత దివ్య దయాస్వరూప, దు

శ్శంకలఁ బాపగా వెలుఁగు చక్కని తానిట సంచరించునే.

తాII కుంకుమ పూల గుత్తివలె కోమల మైన తీగవంటి శరీరం కలిగి, కారణ పర చైతన్య స్వరూపిణిగా కామపీఠాన్ని  ఆశ్రయించి న ఒకానొక దయారూపిణి కాంచీపురం లో విహరిస్తున్నది .

2. శ్లోII  కంచన్ కాంచీతిలకం కరధృత కోదండ బాణ సృణి పాశం.

కఠిన స్తన భర నమ్రం కైవల్యానందకందమవలంబే .

శాII  కోదండంబును, బాణ, పాశ, శృణులన్ కూర్మిన్  సదా దాల్చి, సు

శ్రీదంబౌ కుచభార నమ్ర విలస చ్ఛిద్రూపయై యొప్పు, స

మ్మోదంబిచ్చెడి, ముక్తి హేతువగు, సంపూజ్యంపు కామాక్షినే,  

బాధల్ పాపగ నాశ్రయింతు, సుగుణోద్భాసిన్ సుధాసింధువున్.

తాII ధనస్సుని, బాణాన్ని, అంకుశాన్ని, పాశాన్ని తన బాహువులలో ధరించినది, కఠినమైన స్తనముల బరువుతోకొంచెము వంగినది, కైవల్యం అనే ఆనందానికి కారణభూతమైనది అయిన ఒకానొక కాంచీనగరతిలకంగా భాసించే వస్తువుని (శ్రీకామాక్షీదేవిని) ఆశ్రయింతును.

౩. శ్లోII  చింతితఫలపరిపోషణ - చింతామణిరేవ కాంచినిలయా మే.

చిరతర సుచరిత సులభా - చిత్తం శిశిరయతు చిత్సుధాధారా॥

కంII  చింతితఫలమిచ్చెడి నా

చింతామణి! కాంచి నిలయ! శ్రీకర పుణ్యా

క్రాంతులకే దక్కును, నా

చింతలఁ జిత్సుధను బాపి శిశిరము నిలుపున్.

తాII కాంచీ నిలయయైన ఆ చింతామణియే నాకు కోరిన కోరికలు ఫలింపఁ జేయును. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభంగా లభించును.  బాధా తప్తమయిన నా చిత్తాన్ని ఆ అమృత ధార చల్లఁబరచు గాక.

21 – 01 – 2024

4. శ్లోII  కుటిలకచం కఠినకుచం కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్.

కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వతసార్వభౌమసర్వస్వమ్ ॥౪॥

తే.గీ.II  కుటిల కచభరయు, కఠినకుచయుగళియు,

కుంద సుస్మిత కాంతియు, కుంకుమ వపు

వు హిమ గిరిసుత, ఘనమగు మహిమఁ దనరెఁ

గంచినే గొనె విహృతిగ, కమలనయన.

తాII పర్వతాల రాజు హిమవంతునకు సర్వస్వమయిన కామాక్షి దేవి, వంకర జుట్టు, దృఢమైన స్తనాలు, మల్లెపూల వంటి చిరునవ్వు, కుంకుమ వర్ణంతో కంచిని తన విహార స్థలముగా మార్చుకున్నది.

21 – 01 – 2024

5. శ్లోII  పఞ్చశరశాస్త్రబోధన- పరమాచార్యేణ దృష్టిపాతేన.

కాఞ్చిసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారమ్ ॥౫॥

తే.గీ.II  కంచి నగరాన నొక కన్య కామశాస్త్ర

బోధనాచార్యుఁడగు తనపుష్పనేత్ర

దృష్టిఁ బరపుచు జితకాము దృష్టిఁ గొనెను

మోహపరవశున్ జేయుచు మోహనాంగి.

తాII కంచి నగరంలో ఒక కుమారి కామశాస్త్రబోధనాచార్యులయిన తన కంటి చూపులు ప్రసరణలతో జితకాముఁడయిన శంకరునే మోహపరవశునిగా చేయుచున్నది. 

22 – 01 – 2024

6. శ్లోII  పరయా కాఞ్చీపురాయా పర్వతపర్యాయపీనకుచభరాయ।

పరతంత్ర వయమానాయ పంకజసబ్రహ్మచారి లోచనయా ॥6॥

తే.గీ.II పీన కుచపర్వతభర, యహీనతేజ,

పద్మసన్నిభ లోచన, భక్తరక్ష,

కంచికామాక్షిచే మేము ఘనతరముగ

మైమరచియుంటిమిచ్చట మహితసుగతి.

తాII పర్వతములకు బర్యాయములయిన వలుదపాలిండ్లబరువుతో పద్మములకు నీడు జోడులగు కన్నులతో నలరు కాంచీపురవాసిని యగు నీ పరదేవతచే మేము మైమఱచి యున్నాము. 

7. శ్లోII  ఐశ్వర్యమిందుమౌలేరైకాత్మ్యప్రకృతి కాంచి మధ్యగతమ్, 

ఐందవకిశోరశేఖర - మైదంపర్యం చకాస్తి నిగమానమ్ ॥౭॥

తే.గీ.II  అనుపమేందుశేఖరుని యేకాత్మభావ 

పు స్వభావమౌ యైశ్వర్యపు శశిరేఖ 

శేఖరము, వేద సిద్ధాంత చిత్స్వరూప

మొకటి కంచిలో వెలుగుచునుండె, కనఁగ.

తాII ఇందుశేఖరుని ఏకాత్మభావ స్వభావమైన యైశ్వర్యము బాలేందుశేఖరము (చిచ్చంద్రమండలాధిష్ఠాత్రి) వేదములయొక్క సిద్ధాంతార్థమునైన వస్తువు కాంచీనగర మధ్యమున భాసిల్లుచున్నది

8. శ్లోII  శ్రితకంపాసీమానం శిథిలితపరమశివధైర్యమహిమానమ్ ।

కలయే పాటలిమానం కంచన కఞ్చుకితభువనభూమానమ్. ॥౮॥

తే.గీ.II  పరమశివుని ధైర్యము బిగి వదలఁజేయు

నట్టి, లోకరక్షణకంచుకమయిన యట్టి,

వినుత కంపాసమాశ్రయ విశ్వతేజ

మైన యెఱుపును రక్తితో నాత్మఁదలతు.

తాII పరమశివుని ధైర్యముబిగి సడలింపజేయునట్టిదియు, సకల భువనములకు కంచుకమువలె రక్షకమునైనదియు, కంపాతీర సమాశ్రయమునైన యొక యెఱుపును రక్తితో భావించెదను. 

9. శ్లోII  ఆదృతకాంచీనిలయా-మద్యామారూఢయౌవనాటోపామ్.

ఆగమ వతంసకలికా-మానన్దాద్వైతకందలీం వందే ॥9॥

తే.గీ.II  ఆదరము గల్గి కంచి విహార మందు

యౌవనాటోపము సమభివ్యక్తము గల

తత్త్వ మానందరూపమద్వైతసార

మాగమాలంకృతాంబకేనంజలింతు.

తాII కాంచీనగర విహారమం దాదరముగలదియై, సమభివ్యక్త యౌవనాటోపము గలదియై, ఆనందరూపమగు అద్వైతతంత్రమునకు సారాంశమై ఆగమశిఖలందు (వేదాంతములయందు) అలంకరించిన యొక చిన్ని మొలకకు మ్రొక్కెదను.

10. శ్లోII  తుంగాభిరామకుచభర-శృంగారితమాశ్రయామి కాఞ్చిగతమ్.

గంగాధరపరతంత్రం శృంగారాద్వైతతంత్రసిద్ధాంతమ్ ॥౧౦॥

తే.గీ.II  ఉన్నత కుచమండలముచే నొప్పియుండి,

మహిత గంగాధరునిపైన మనసుఁ గలుగు

కంచిలోని యద్వైత, శృంగార తంత్ర

పూజ్య సిద్ధాంతమునకు నే మ్రొక్కుచుంటి.

తాII ఉన్నతకుచమండలముచే సింగారింపబడి గంగాధరునియందు మనసుంచి కాంచీనగరమధ్యమం దధివసించు శృంగారరసస్వరూపమైన అద్వైతశాస్త్ర పరమసిద్ధాంతమును(సారాంశమును) ఆశ్రయించెదను. శాంతరసపర్యవసన్నమైన శృంగారరసమే పరదేవతయొక్క స్వరూపమని యిచట సూచింపబడినది. 


11. శ్లోII  కాఞ్చీరత్నవిభూషాం కామపి కన్దర్పసూతికాపాఞ్గీమ్।

పరమాం కలముపాసే పరమశివవామాంకపీఠికా೭೭సీనామ్॥।11॥

తే.గీ.II  కంచికిని రత్నభూషణ, కామసూతి

గృహమగు కటాక్షములతోడ మహితుఁడయిన

శివుని వామాంకపీఠికాసీన జనని

సత్కళాశ్రేష్ఠ సేవను సతమొనర్తు.

తాII కంచీనగరికి రత్నాలంకారమైన , మన్మథుని ప్రసూతిగృహమైన కటాక్షములు గలపరమశివునెడమతొడయను పీఠముపై కూర్చుని యున్న ఒకానొక శ్రేష్ఠమైన కళను ఉపాసింతును.

12. శ్లోII  కంపాతీర చరణం కరుణాకోరకితదృష్టిపాతానామ్.

కేలివనం మనో మేకేశాంచిద్భవతు చిద్విలాసనామ్ ॥౧౨॥

తే.గీ.II  విమలమైన కంపాతీర విహరణములు,

కరుణచేఁ బూయు తళుకుల కంటిచూపు

విరులు కలిగిన దివ్య చిద్విలసనముల

దేవికెలదోట నా మది దీపితముగ.

తాII కంపాతీర విహారములు, కరుణారసముచే మొగ్గదొడుగు తళుకు 'జూపులు గలవియునగు నొక చిద్విలాసములకు అనగా కామాక్షికి నా మనస్సు విహారవన మగుగాక!

13. శ్లోII  ఆమ్రతరుమూలవసతే- రాదిమపురుషస్య నయనపీయూషమ్ ।

ఆరబ్ధయౌవనోత్సవ-మామ్నాయరహస్యమన్తరవలమ్బే ॥౧౩॥

తే.గీ.II  ఆమ్ర తరుమూల వర వాసి యక్షితతికి

నమృతమయి నవయౌవనమమరినదగు,

ననుపమామ్నాయములరహస్యమగు తల్లి

యాశ్రయము పొంది సుఖియింతు ననుపమముగ.

తాII ఏకామ్రవృక్షము క్రింద వసించు ఆదిమపురుషుని చూపులకమృతమయి, నూతన యౌవనోత్సవముగలదైన యామ్నాయముల లోని రహస్యమును నాలో నవలంబము సేసికొందును. 

14. శ్లోII  అధికాఞ్చి పరమయోగిభి-రాదిమపరపీఠసీమ్ని దృశ్యేన.

అనుబద్ధం మమ మానస-మరుణిమసర్వస్వసంప్రదాయేన ॥౧౪॥

తే.గీ.II  ఆదిమపరపీఠమున మహాద్భుతముగ

కానఁబడుచుండు కంచిని ఘన మునులకు

నరుణసర్వస్వమద్దానికనుపమముగ 

నద్భుతమ్ముగ నామది హత్తుకొనియె.

తాII కంచియందు పరమయోగులచే నాదిమహాపీఠమందు దర్శనీయమైయున్న ఎఱుపుయొక్క నిండుదనపు పరిపాటితో నా మనసత్తుకొన్నది.

15. శ్లోII  అంకిత శంకరదేహా-మంకురితోరోజకంకణాశ్లేషైః

అధికాఞ్చి నిత్యతరుణి-మద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్ ॥౧౫॥

తే.గీ.II  శంకరాంకిత దేహ తా నంకురింపఁ 

జేసె ముద్రలన్ బాలిండ్లచిగురుమొనల,

కంకణంబులతాకిడిన్ కౌగిలించి.

యట్టి కామాక్షినే గంటినద్భుతముగ.

తాII బిగికౌగిలిలో మొలకచనులయొక్కయు కంకణములయొక్కయు గుర్తులను శంకరుని మేన ముద్రవేయుదానిని యెల్లప్పుడు నిండుజవ్వనముచే నలరు నొక వింతగొలుపుముద్దరాలిని కాంచిలో గన్గొంటిని. "అంకిత శంకరదేహా” అనగా ఈశ్వరుని సత్తమ స్ఫురింపజేయు శక్తి యని రహస్యార్థము. 

16. శ్లోII  మధుర ధనుషా మహీధర-జనుషా నందామి సురభిబాణజుషా

చిద్వపుషా కాఞ్చిపురే కేలిజుషా బంధుజీవకాంతిముషా ॥౧.౧౬॥

తే.గీ.II  మధుర ధనువును, సౌరభమయపు పూల

బాణమున్ దాల్చి, బంధు జీవనపు కాంతి

దోచి, కంచిలోనాడుచిచ్ఛోభవపుష

హైమతోమురియుచునుంటి నాత్మలోన.

తాII తియ్యని విల్లును, సువాసనలనించు బాణములును దాలిచి, మంకెనపువ్వు రంగునుదొంగిలించుచు(మంకెనపువ్వు కంటెనెర్రనగు శరీరము కలదయి) గాంచీపురమం దాడుకొనుచుండు కొండరాచూలియైన యొక చిద్రూపముతో మురియుచున్నాను.

17. శ్లోII  మధురస్మితేన రమతే మాంసల కుచభార మన్దగమనేన ।

మధ్యే కాంచి మనో మే మనసిజసామ్రాజ్యగర్వబీజేన ॥౧౭॥

తే.గీ.II  మాంసల కుచభార ప్రణుత మందగమన,

మధురసుస్మిత వదన సమ్మాన్య మయిన

కంచిలోనెలకొనిన శృంగార రస ని

ధాన, కామాక్షితో మది తనియుచుండె.

తాII పుష్టినందిన పాలిండ్లబరువుచే మెల్లనగు నడకయు, సొంపులుగులుకు చిట్టనవ్వును గల మన్మథసామ్రాజ్యగర్వబీజమై కాంచీమధ్యమునందు వసించు శృంగార రసాధిదేవతతో నా మనసు వినోదించుచున్నది. 

18. శ్లోII  ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీమ్.

అంబుమయీమిందుమయీ- మమ్బామనుకమ్పమాదిమామీక్షే ॥౧౮॥

తే.గీ.II  భూమి, సూర్యుఁడు, వాయువు, పొసగు నభము,

సోమయాజి, చంద్రుఁడు నగ్ని, సుజలమనెడి

యష్టమూర్తులు తానైనయాదిజననిఁ

గరుణతోనొప్పుకామాక్షిఁ గంటి నేను.

తాII భూమి సూర్యుడు వాయువు ఆకాశము అగ్ని సోమయాజి ఉదకము చంద్రుడుఅను అష్టమూర్తులు తానేయైయున్న ఆదిమజననిని గంపాతీరమున గాంచుచున్నాను.

19. శ్లోII  లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకమ్పమ్ ।

పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యమ్ ॥౧౯॥

తే.గీ.II  మౌనులమదుల లీనమై, ధ్యానమందు

స్తిరముగా కంపయొడ్డున నిరత తపము

చేయు, స్తనభారమునవంగి చెలగునట్టి

కామశాస్త్ర తాత్పర్యమున్ బ్రేమఁగొలుతు.

తాII మునుల హృదయములందు లీనమయి ధ్యానమునందు నిలకడగోని కంప

యొడ్డునం దపము సేయునది, నిండుపాలిండ్లఁ గులుకునదియు నగు కామశాస్త్ర పరమతాత్పర్యమును స్తుతింతును. 

20. శ్లోII  శ్వేతా మన్థరహసితే శాతా మధ్యే చ వాఙ్మనో ఽ తీతా ।

శీత లోచనపాతే స్ఫీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా ॥౨౦॥

తే.గీ.II  తెల్లనౌ చిఱునవ్వును, మల్లెతీగఁ

బోలు నడుమును, చల్లని వాలుచూపు,

స్ఫీతకుచయుగ్మ, వాఙ్మనోఽతీత శాశ్వ

తంబగు జనని, రక్షించ ధరణిఁ గలదు.

తాII చిఱునవ్వున దెల్లనిదై, నడుమున సన్ననిదై, వాల్చూపుల జల్లనిదై, చనుకట్టున నిండైనదై, మాటకు మనసునకు నందనిదై, కలకాలము తల్లియై యొకతల్లి యుల్లసిల్లుచున్నది. 

23 – 01 – 2024


21. శ్లోII  పురతః కదా ను కరవై పురవైరివిమర్దపులకితాంగలతామ్।

పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీమ్ ॥౨౧॥

తే.గీ.II  ఈశు కౌగిలిచేఁ బులకించు వపువు

లత, పునీతముచేయుచు సతము కంచి

నొప్పు, కామాక్షిని, కుసుమాయుధుని వీర్య

సరస పరిపాటి నెప్పుడే నరయఁ గలనొ?

తాII త్రిపురవైరి బిగికౌగిటి సమ్మర్దముచే బులకించు నెమ్మేనుగలది, కాంచీమండలమునెల్ల బవిత్రము సేయునది, యగు పుష్పబాణుని పరాక్రమ రసపరిపాటిని నేనెన్నడు నా ముందు సాక్షాత్కరింపజేసికొందునో కదా! 

22. శ్లోII  పుణ్యా కా೭పి పురంధ్రీ పుంఖితకన్దర్పసంపదా వపుషా.

పులినచరీ కంపాయాః పురమథనం పులక నిచులితం కురుతే ॥౨౨॥

తే.గీ.II  పుణ్యశీలయౌ వనితోర్తు పూవిలుతుని

కలిమి కుప్పగానయిన ప్రకాశమాన

వపువుతో కంప పులిన సంవర్తియగుచు

శివుని మదిని పులకరింపఁ జేయుచుండె.

తాII పుణ్యశీలయైన ఒకానొక పతివ్రత పూవిలుతుని కలిమియెల్ల పుంజీభవించిన మేనితో కంపానది యిసుక తిన్నెల మసలుచు పురారిని పులకరింప జేయుచున్నది.

24 – 01 – 2024

23. శ్లోII  తనిమాద్వైత వలగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖమ్.

తటసీమని కంపాయా- స్తరుణిమ సర్వస్వమాద్యమద్రాక్షమ్ ॥౨౩॥

తే.గీ.II  శూన్య తనుమధ్యయు, తరుణ శోభితారు

ణ వపువాద్యయౌవనశోభ, ప్రవిమలమగు

కంపయొడ్డున చరియింపఁ గాంచినాడ.

సచ్చిదానందమూర్తిని, శంభుసతిని.

తాII సన్నని నడుము, లేత యెఱుపురంగుతోడి శరీరముగల ఆద్యమగు నొక నడిప్రాయంపు నిండుదనమునుగల్గి గంపాతీరమందు ఉండెడి సచ్చిదానందమూర్తిని కృపాశోభతో గూడిన యొక బాలికారూపమైన లక్ష్మీకళను జూచితిని.

24. శ్లోII  పౌష్టికకర్మవిపాకం పౌష్పశరం సవిధసీమ్ని కంపాయాః ।

అద్రాక్షమాత్తయౌవన-మభ్యుదయం కంచిదర్థశశిమౌలేః ॥౨౪॥ 

తే.గీ.II  కనితిఁ బౌష్టిక కర్మలు, కల్గినట్టి

తత్ఫలము రూపమగు లతాంత ఘనశరము

లను గలిగిన జవ్వనిని బాలశశిశేఖ

మౌళి వృద్ధిని, కంపన్ సమంచితముగ.

తాII క్షీణించిన మన్మథుడు పుష్టికర్మలను చేసి, తత్కర్మ పరిపాకమాయను నట్లు అమ్మయొక్క యౌవనదశగా ప్రతిఫలించినాడు. అది అర్ధచంద్రుని శిరసున దాల్చిన శివునకు అభ్యుదయకర్మఫలితంగా పరిణమించినది. కంపాతీరసమీపంలో అలాంటి యౌవనశ్రీని వీక్షించాను. 

25. శ్లోII  సంశ్రితకాంచీదేశే సరసిజదౌర్భాగ్యజాగ్రదుత్తంసే ।

సంవిన్మయే విలీయే సారస్వతపురుషకారసామ్రాజ్యే ॥౨౫॥

తే.గీ.II  కంచి సంశ్రిత, బాలచంద్రధరయయిన,

సర్వవిద్యాపురుషకార సకల దేశ

మయిన కామాక్షిలోన నే ననితరమగు

భక్తితో లీనమౌదును, ముక్తిఁ గనుదు.

తాII తామరపూల దురదృష్ట రేఖచేత (చంద్రరేఖచేత) సంతరింపబడిన కిరీటము గలది. జ్ఞానమయమైనది కాంచీ దేశమున నెలకొన్నదియునగు సర్వ విద్యాపాండిత్యమను నిండు మగతనముయొక్క సామ్రాజ్యమందు (సమృద్ధియందు) లీనుడ నయ్యెదను. 

26. శ్లోII  మోదిత మధుకర విశిఖం స్వాదిమ సముదాయసార కోదండమ్‌ 

ఆదృతకాంచీఖేలన మాదిమ మారుణ్యభేద మాకలయే| ౨౬ 

తే.గీ.II  పూలబాణముల్ కలిగిన పూవుబోడి,

చెఱకు విల్లును పట్టిన చిద్విలాస,

మోదములకె మోదంబైన పూజ్యురాలు,

కంచినుండెడి యరుణిమన్ గనుదు మదిని.

తాII తుమ్మెదలను సంతోష పెట్టు బాణములు కలది. తీయని పదార్థములకెల్ల సారభూతమైన విల్లు గలది. కాంచీనగర విహారమునందు వేడుకపడునదియు నగు మొట్టమొదటి ఆరుణ్యవిశేషమయిన కామాక్షిని సంభావించెదను. 

27. శ్లోII  ఉరరీకృత కాంచిపురీ ముపనిష దరవిందకుహర మధుధారామ్‌ 

ఉన్నమ్ర స్తనకలశీ ముత్సవలహరీ ముపాస్మహే శంభోః ౨౭ 

తే.గీ.II  ఉపనిషత్పద్మ మధుధారయు వర కంచి

వాస ఘన కుతూహలయును, భవ్యమైన

యున్నతంపు కుచకలశయు నయినట్టి

శివుని పరమోత్సవము నుపాసింతు మదిమి.

తాII ఉపనిషత్తులనెడి పద్మములందు జాల్వారు తేనెధారయై కాంచీపుర విహార కుతూహలినియు సమున్నత కుచకలశయునై యున్న శంభుని పరమోత్సవ ప్రవాహమునుపాసింతును.

28. శ్లోII  ఏణశిశు దీర్ఘలోచన 'మేనఃపరిపంధి సంతతం నమతాన్‌ 

ఏకామ్రనాథ జీవిత మేవంపద దూర మేక మవలంబే| ౨౮ 

తే.గీ.II  ఏణ శిశు దీర్ఘ లోచన నిట్టిదట్టి

దనగరాని యేకామ్రనాథ హృదయమును,

మ్రొక్కుభక్తుల పాపముల్ పోవఁ జేయు

బ్రహ్మతేజంబు నూతగాఁ బడయుచుంటి.

తాII లేడిపిల్ల కన్నులవలె సోగలైన కన్నులు గలది. మ్రొక్కువారి పాపముల హరిం

చునది. ఏకామ్రనాథుని జీవితమైనది. యిట్టిట్టిదనరానదియునై యున్న యేకైక

పదార్థమును నిరంతర కృపాధారకాధారమైన నవ్వుమోముగల కేవల బ్రహ్మవస్తువును నాకాధారముగ గైకొను చున్నాను.

29. శ్లోII  స్మయమానముఖం కాంచీ మయమానం కమపి దేవతాభేదమ్‌ 

దయమానం వీక్ష్య ముహూర్వయ మానందామృతాంబుధౌ మగ్నాః| ౨౯ 

తే.గీ.II  నవ్వులొలికెడి మోము ననారతంబు

కంచివాస దయామయ కామకోటి

పీఠ సద్భాస దేవతన్ బ్రీతిఁ గాంచి

యనుపమానందవార్ధిలో నలరినాము.

తాII నవ్వుమోము గలది. దయచూపునది. కొంచీపురమున జరించునదియునగు 

నొకానొక దేవతను గాంచి మే మానందసాగరములో మున్కలిడుచున్నాము, 

25 – 01 – 2024

30. శ్లోII  కుతుకజుషి కాంచిదేశే కుముద తపోరాశి పాక శేఖరితే 

కురుతే జనో మనో೭యం కులగిరి వరిబృఢ కులైక మణిదీపే. 30 

తే.గీ.II  కాంచి వాసంపు కుతుకను కలిగినదియు,

కలువ రేడును తలపైన కలిగినదియు,

హిమగిరీంద్రుని మణిదీప రమయునైన

జననిపై వీడు మదినిల్పెననుపమముగ.

తాII కాంచీదేశమందు ముచ్చటపడునది. కలువలు చేసికొన్న తపస్సుయొక్క పరిపాకము కిరీటముగా ధరించునది. (చంద్రుడు కిరీటముగా గలదనుట) కులపర్వతముల కెల్లసార్వభౌముడైన హిమవంతునియింట మణిదీపమయి యున్నదానియందు వీడు మనసుపెట్టుకున్నాడు. 


31. శ్లోII  వీక్షే మహి కాంచిపురే విపుల స్తన కలశ గరిమ పరపశితమ్‌ 

విద్రుమసహచర దేహం విభ్రమ సమవాయసార సంనాహమ్‌। 3౧ 

తే.గీ.II  విపుల కుచభార యగుటచే వివశయగుచు

పవడముల కెనయగు దేహభాతినొప్పు,

కంచివాసిని రూపానమించియున్న

నుత విలాససారముఁ గంటి నతులితముగ.

తాII విపుల కుచకుంభ భారముచే వివశమై, పవడముల కీడుజోడగు నెఱ్ఱని నెమ్మేని సోయగముకలదై, సకల విలాససార మెల్ల రూపుగొన్న పర దేవతా రూపమును కాంచి పురమున గాంచుచున్నాము. 

32. శ్లోII  కురువిందగోత్ర గాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః 

కూలంకష కుచకుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభమ్‌| 3౨ 

తే.గీ.II  పవడగోత్రంపు గాత్ర, కంపదరినిగల,

కూలముల రాచు కుచకుంభ, కుసుమశరుని

వీర్య సార సంరంభయౌ వేల్పు జనని

కంజలించెద నామది యందు నిలిపి.

తాII పవడములకు సగో త్రమైన గాత్రముకలది (అరుణశరీరిణి యన్నమౌట)  నిండైన కుచకుంభముల యొప్పుగలది, పూవిలుకాని పరాక్రమ సారభూత మైన సంరంభము గలదియునై కంపాతటమునందు వర్తించు నొక వస్తువును నమస్కరించెదను, 

33. శ్లోII  కుట్మలిత కుచకిశోరైః కుర్వాణైః కాంచిదేశ సౌహార్దమ్‌  

కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభుసుకృత సంభారైః | 33 

తే.గీ.II  కుట్మలిత కుచయుగ్మమ్ము, కోరుకొనెడి

కంచి స్నేహముతోనొప్పు, ఘనతరమగు

కుంకుమారుణశోభల శంకర నుత

పుణ్యరాశియే మా క్షేమ గణ్య పథము.

తాII మొగ్గదొడుగు చనుమొలకల నింపుగుల్కునవి. కుంకుమపువ్వువలె నెజ్జనివి కాంచీ దేశముతో జెలిమివాటించునవియు నైన శంభునిపుణ్యముల రాశిచే మా క్షేమమార్గము నిండియున్నది. 

34. శ్లోII  అఙ్కితకచేన కేనచిదంధంకరణౌషధేన కమలానామ్‌ 

అంతఃపురేణ శంభో రలంక్రియా కాఫీ కల్ప్యతే కాంచ్యామ్‌| 3౪ 

తే.గీ.II  కమలములు కనుల్ మూయునా కారణమగు

శశిని వేనలిన్ గలిగిన శంభునిదగు 

నంతిపురిచేత సహజమౌ కాంతి యొకటి

దిద్దఁబడుచుండె కంచిలో దివ్యముగను.

తాII " కమలములు కనుమూయుటకు గారణమైన యౌషధముచే 

నలరు వేనలిగల శంకరుని అంతఃపురముచే కొంచీనగరమునం దొకానొక 

యందము తీర్చి దిద్దబడుచున్నది. 

35. శ్లోII  ఉరరీకరోమి సంతత మూష్మలఫాలేన లాలితం పుంసా 

ఉపకంప ముచితఖేలన ముర్వీధరవంశ సంపదున్మేషమ్‌|| 35

తే.గీ.II  సెగలు చిమ్మెడి నుదురున్న శివునిచేత

సతము లాలింపఁబడునది, నుత హిమగిరి

సంపదోన్మేషమున్మదిన్ సంతతమును

నేను భావింతు ననుపమమైన భక్తి.

తాII సెగలుచిమ్ము ఫాలభాగముగల పురుషునిచే లాలింపబడునది. కంపానదీతీరమున నాటలాడునదియు నగు పర్వతరాజుయొక్క భాగ్యోన్మేషము నెల్లప్పుడును భావించెదను. 

36. శ్లోII  అంకురిత స్తనకోరక మంకాలంకార మేకచూతపతేః 

అలోకే మహి కోమల మాగమ సంలాప సారయాథార్థ్యమ్‌॥| 36

తే.గీ.II  అంకురిత కుచకుట్మలా యంకపీఠ

మున శివున కలంకారమై, పూజ్య వేద

సారభూతమై, మునిరాజ సరస హృదయ

దీపికగ నున్న తల్లి సద్దీప్తిఁ గంటి.

తాII అంకురించు కుచకుట్మములతో ఏకామ్రేశ్వరుని యంకపీఠమున కలంకారమై, ఈ వేదగోష్టి కెల్ల సారభూతమైయున్న యొకానికసత్యమును, మునిరాజ హృదయ దీపికయగు దానిని, జూచుచున్నాము, 

37. శ్లోII  పుంజితకరుణ ముదంచిత శింజిత మణికాంచి కిమపి కాంచిపురే 

మంజరిత మృదులహాసం పింజర తనురుచి పినాకి మూలధనమ్‌| 3౭ 

తే.గీ.II  పుంజితకరుణామూర్తుయు శింజితమణి,

మంజరిత మృదుల హసన, పింజర తను 

రుచిని యొప్పు శివ ధనము, రుచిర కాంచి

పురిని యొప్పుచు నుండెను నిరుపమముగ.

తాII కరుణ రసము మూర్తీ భవించినది మణికింకిణులచేమ్రోయు నొడ్డాణముగలది పూగుత్తులఁ బోలు చిటునవ్వుల గుల్కునది యలముకొను నెమ్మేని తళుకులు గలదియునై పినాకపాణి మూలధన మొకొనొకటి కాంచీనగరమునందొప్పుచున్నది. 

38. శ్లోII  లోలహృదయో೭స్మి శంభో ర్లోచనయుగలేన లేహ్యమానాయామ్‌ 

లాలిత పరమశివాయాం లావణ్యామృత తరంగ మాలాయామ్| 38

తే.గీ.II  శంభు చూపులన్ లేహ్యమై, శశిధరునినె

లాలనము చేయునదియగు శ్లాఘనీయ

విపుల లావణ్యసుధఘృణిన్ బ్రీతితోడ

నోలలాడంగ కుతుకంబు నొప్పియుంటి.

తాII శంభునిచూవులచే లేహ్యమానయు పరమశివుని లాలించునదియు నగు నొక 

లావణ్యామృత తరంగపంక్తి నోలలాడవలెనని కుతూహలపడు హృదయము గలవాడనై యున్నాను, 

39. శ్లోII  మధుకర సహచర చికురై ర్మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః  

మండిత కంపాతీరై ర్మంగళకందై ర్మమాస్తు సారూప్యమ్‌॥ “ 3౯ 

తే.గీ.II  మధుకర సహచర చికుర, మన్మథాస్త్ర

శాస్త్ర తంత్రదీక్షిత కటాక్షములఁ గూడి

కంప తీరపు శోభయై ఘనతఁ గన్న

శుభపరంపరమూలమున్ జొచ్చెదమిఁక.

తాII తుమ్మెదలకీడు జోడయిన జుట్టుతో మన్మథశాస్త్రమను శాక్త తంత్రమందు 

దీక్షపొందిన కటాక్షములతో గూడి కంపా తీరము నలంకరించియున్న శుభ పరంపరలకెల్ల మూలమైన యొక వస్తువుతో మాకు సారూప్యము సిద్ధించుగాక! 

40. శ్లోII  వదనారవింద వక్షో నామాంకతటీ వశంవదీభూతా  

పురుష త్రితయే త్రేథా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి | ౪0

తే.గీ.II  ఒకని ముఖపద్మమందున, నొకని వక్ష

మందు, మరొకనిదైన వామాంకమందు,

ముగ్గురమ్మలై యొప్పుచు మూడురూప

ములను నీవేగ, కామాక్షి! పొందినావు.

తాII కామాక్షీ! ముగ్గురుమూర్తులలో నొకని ముఖపద్మమందు, మొక్కని వక్ష 

స్థలమందు, మఱియొకని వామాంకసీమయందు వశంవదవై మూడు రూపములతో త్రిశక్తి రూపీణివై యున్నదానవు నీవే. 

26 – 01 – 2024


41. శ్లోII  బాధాకరీం భవాబ్ధే రాధారా ద్యంబుజేషు విచరంతీమ్ 

అధారీకృత కాంచీం బోధామృతవీచి మేవ విమృశామః| 41 

తే.గీ.II  బాధను భవాంబుధికిఁ గొల్పు బ్రహ్మతేజ,

కనగ నాధార మగుచును కమలతతిని

సంచరించెడి, కంచిలో సంచరించు

జ్ఞానసుధనెన్ని చింతింతు ఘనతరముగ.

తాII సంసార సాగరమునకు బాధకమై మూలాధారాది చక్రములందు సంచరించునదై కాంచీనగరము తన నివాసముగా జేసికొన్న యొకానొక జ్ఞానామృత తరంగమును గూర్చి విమర్శించుచున్నాము. 

42. శ్లోII  కలయా మ్యంతః శశధరకల యాంకిత మౌలి మమల చిద్వలయామ్‌ 

అలయామాగమపీఠీ నిలయాం వలయాంకసుందరీ మంబామ్| 42

తే.గీ.II  చంద్రరేఖచే గుర్తింపు చక్కగఁ గను

ఘనకిరీటియు, స్వచ్ఛంపు జ్ఞానపూర్ణ,

యనుపమాగమ పీఠమం దధివసించు

సువలయాంకయౌ సుందరీ శోభఁ గనుదు.

తాII చంద్రరేఖచే గుర్తింపబడిన కిరీటముగల్గి అచ్చమైన జ్ఞానముచే పూర్ణమై ఆగమ పీఠమందధివసించుచు పూర్ణాంకస్వరూపిణియై యున్న యాయమ్మను లోలోన ననుసంధానము వేసెదము. 

43. శ్లోII  శర్వాది పరమసాధక గుర్వానీతాయ కామపీఠజు షే  

సర్పాకృతయే శోణిమ గర్వాయ సమర్ప్యతే హృదయమ్‌. 43 

తే.గీ.II  గురులు శర్వాదులే తెచ్చి కూర్మి నిలుప

వెలుగు కామపీఠస్థయౌ వేల్పులమ్మ

సర్వ శోణిమ గర్వయౌ సకలజనని

కంకితము చేసెదన్ మదిన్ శంకలుడిపి.

తాII శివుఁడు మహాసాధకులయిన గురుమండలముచే గొనిరాబడి కామకోటిపీఠ మధిష్టించి యున్న ఎఱుపుయొక్క గర్వము నిగ్గు ఎల్ల తానైయున్న యొక సర్వాకృతికి నా హృదయ మర్చించెదను. 

44. శ్లోII  సమయాసాంధ్యమయూఖై: సమయా బుద్ధ్యా సదైవశీలితయా  

ఉమయా కాంచీరతయా న మయా లభేత కింను తాదాత్మ్యమ్‌| 44 

తే.గీ.II  సంధ్యవేళ కిరణముల సమమయినది,

సమమయిన బుద్ధితో సేవనములు గొనెడి

కంచి వాస కుతూహల కామకోటి

యుమను నే నైక్యమొందుదును ముదముగను.

తాII సంధ్యారాగకిరణములవలె సమానురాలైన సమబుద్దితో నెల్లప్పుడు ధ్యానింపబడునదైన కొంచీపురమున విహరింప గుతూహలము గొన్న ఉమాదేవితో నే నైక్యము పొందకుం దునా? 

45. శ్లోII  జంతో స్తవ పదపూజన సంతోష తరంగితస్య కామాక్షి 

బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా 45 

తే.గీ.II  నీదు పాదసేవానందమేది కలదొ

దానినొందుచున్ బొంగెడిమానవులకు

కలుగ వీ భవబంధముల్, కలిగెనేని

రాతిగుండు మున్నీటిపై రహిని నిలుటె.

తాII కామాక్షీ ! నీ పాదములను బూజించు నానందముచే నుష్పొంగువానికి సంసార బంధము మరల కలుగదు, కల్లెనేని నట్టేట నీటిపై రాతిగుండు తేలియాడవలసినదే. అనగా అసంభవ మన్నమాట, 

46. శ్లోII  కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే  

గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి | 46 

తే.గీ.II  కుండలి! కుమారి! కుటిల! మా గుణిని! లలిత!

చండి! చాముండ! భువి చరాచర సవిత్రి!

గుహ్య! వరగుహారణి! నినున్ గూర్మితోడ

మహిత గురుమూర్తివనుచు నమస్కరింతు.

తాII ఓ కుండలీ! కుమారి! కుటిలా! చండీ! చరాచరజననీ! చాముండా! గుణినీ! గుహారణీ!గుహ్యా! కామాక్షీ! నిన్ను నమస్కరించెదను. 

47. శ్లోII  అభిదాకృతి ర్భిదాకృతి రచిదాకృతి రపి చిదాకృతి ర్మాతః 

అనహంతా త్వ మహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వమ్‌| 47 

తే.గీ.II  భేదరహితాకృతి వయిన భేదరూప!

చిద్ రహిత రూపవయిన మా చిత్స్వరూప!

యహములేని యహమెరూపమైన తల్లి!

శాశ్వతవయు భ్రమను గొల్పు సాధు లలిత!

తాII నీవు అభేదస్వరూపిణి వయిన భేదరూపిణివి, కేవల జ్ఞానరూపీణివయిన నజ్ఞానరూపిణివి, అనహంకృతి వయిన నహంతాకృతివి. శాశ్వతవయ్యు భ్రమింపఁజేయుదువు. 

48. శ్లోII  శివ శివ పశ్యంతి సమం | శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషాః 

విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్‌|| 48 

తే.గీ.II  కలికి కామాక్షి శ్రీ కటాక్షమ్ము గొనిన

పురుషు డింటిని, యడవిని, నిరుపమగతి

శత్రు మిత్రులన్, మగువల చక్కనైన

పెదవులన్ మట్టి నొకటిగా నెదను దలచు.

తాII శ్రీ కామాక్షీకటాక్ష మెవ్యరియందు బ్రసరించునో వారు అడవిని, ఇల్లును, 

శత్రుని, మిత్రుని, లోష్టమును, మగువబింబోష్ఠమును సమముగా _భావించెదరు. దేవీకటాక్షలాభమునకు ఫలము సర్వసమత్వము, - వైరాగ్యము. 

49. శ్లోII  కామపరిపంథి కామిని! కామేశ్వరి కామపీఠ మధ్యగతే 

కామదుఘా భవ కమలే! కామకలే కామకోటి కామాక్షి! | ౪౯  

తే.గీ.II  కాము రిపు శివునాలివౌ కామిని! రమ!

కామ పీఠమధ్యగత! సత్కామసుదుఘ!

మహిత కామేశ్వరీ! నీవు మమ్ముఁగావ

కామ కళవయి కామాక్షి కనుము కృపను.

తాII కాముని గెల్ళినవాని యిల్లాలగు నో కామేశ్వరీ! కామకోటిపీఠ మధ్యమం 

దధిష్తించిన యో లక్ష్మీ! కామకలా (ఈకారముచే వాచ్యమగుదానా) కామకోటి! 

కామాక్షీ! మాపాలిటి కామధేనువవు కమ్మా! 

50. శ్లోII  మధ్యేహృదయం మధ్యేనిటలం మధ్యేశిరో೭పీ వాస్త వ్యామ్‌  

చండకర శక్రకార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీమ్‌! ౫౦ 

తే.గీ.II  హృదయము, లలాట శిరములన్ ఘృణిని, శక్ర

కార్ముకమును, చంద్రునిఁ బోలి ఘనతరమగు

సత్ప్రకాశంబునొప్పెడి జయనిధాన!

అమ్మ! కామాక్షి! నీకు నే నంజలింతు.

తాII హృదయమునడుమ. లలాటమధ్యమున శిరస్సుమధ్యమందు సూర్యునివలె ఇంద్ర ధనస్సువలె జంద్రునివలె భాసించు కామాక్షిని మ్రొక్కెదను. ఇందు మధ్యశబ్దము సంధ్యాస్థానమును సూచించును. పరదేవత సంధ్యాస్థానమం దభివ్యక్తయౌను గావృన సంధ్యాదేవతగా నుపాస్యమై యున్నదని భావము,

27 – 01 – 2024


51. శ్లోII  అధికాంచి కేలిలోలై రఖిలాగము యంత్రతంత్రమంత్రమయైః 

అతిశీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః|  

తే.గీ.II  కంచి కేళిలోలాఖిలాగమ మయమును,

యంత్ర, తంత్ర, మంత్ర మయము ననుపమమును,

శంభునకు జీవనోపాయ సాధు రూప

యైన మాతచే నా మది కమరె శాంతి.

తాII కంచియం దాటాడ వేడుకగొన్నవి సర్వాగమ ప్రసిద్ధములగు యంత్ర తంత్ర మంత్ర  స్వరూపముగా గలవి విషమశరవైరియగు పరమశివ నుజ్జీవింప జేయునవియు నగు నుపాయములచేత (కామాక్షి చేత) నా హృదయమెంతయు జల్లబడినది. 

52. శ్లోII  నందతి మమ హృది కాచన మందిరయన్తీ నిరంతరం కాంచీం 

ఇందు రవిమండలకుచా బిందు వియన్నాద పరిణతా తరుణీ.  

తే.గీ.II  కంచి వాసంబుగాఁ గల్గు కరుణ తరుణి

సూర్య శశి కుంభకుచ యైన శోభనాంగి

బిందు వాకాశ నాద రూపిణిని జననిఁ

బొందుచుండె నా యెడద నానందసుధను.

తాII ఒక యమ్మ కాంచిని నిజనివాస మొనరించుకొని సూర్యచంద్రమండలములే 

కుచ కుండలములుగా గలదై, బిందువుగా, ఆకాశముగా, నాదముగా క్రమపరిణామము పొందిన యొకయువతి నా హృదయమునం దానందించు చున్నది. 

53. శ్లోII  శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వరచికిత్సామ్   

లిమ్పామి మనసి కించన కంపాతటరోహి సిద్ధభైషజ్యమ్  53 

తే.గీ.II  జన్మ రోగ ప్రతిక్రియన్ జరుపుటకును

మెఱుపు తీగ సమానమౌ మేల్తరముగ

కంప తీర ప్రభవ తైలకందమెన్ని

పూసికొందు నా మదికిని పూతగాను. 

(తైలకందము = సిద్ధౌషధము.)

తాII సంసార రోగమునకు చికిత్స చేయుటకు మెరుపుతీగ వంటి వన్నెతో సమానమైన వన్నెగల, కంపానదీతీరమున మొలచు సిద్దౌషధమును ఒకదానిని అనగా అమ్మవారిని నా మనసున పూతగా పూసెదను.

28 – 01 – 2024

54. శ్లోII  అనుమిత కుచకాఠిన్యా మధివక్షఃపీఠమంగజన్మరిఫోః  

ఆనందదాం భజే తా మానంగ బ్రహ్మతత్త్యబోధి సిరామ్‌||  

తే.గీ.II  శివుని రొమ్ముపై నొక్కిన, చెలఁగు కఠిన

స్థనభరను, మరు బోధనా సార నాడి

యైన సంతస దాయినినమ్మ నెన్ని

భజనఁ జేసెద సన్ముక్తిఁ బడయ నెంచి.

తాII శివుని రొమ్మునందు ఊహింపఁబడిన స్థనముల కఠినత ఉన్న, మన్మథునిచే ప్రతిపాదింపఁబడిన బ్రహ్మతత్త్వమును బోధించు నాడియైన, ఆనందమునొసగు అమ్మవారిని సేవించెదను.

55. శ్లోII  ఐక్షిషి పాశాంకుశధర హస్తాన్తం విస్మయార్హ వృత్తాంతమ్‌ 

అధికాంచి నిగమవాచాం సిద్దాంతం శూలపాణిశుద్ధాంతమ్‌ . 

తే.గీ.II  అమరి పాశాంకుశములు హస్తాంతమందు, 

వింతఁ గొల్పు వృత్తాంతముల్ పెక్కు కలిగి, 

వేదసిద్ధాంతమగు శివు వేనలి నిట

కాంచి పురమునఁ దృప్తిగాఁ గంటి నేను.

తాII ముంజేతులలో పాశమును అంకుశమును బట్టికొని, వింత గొలువు వృత్తాంతములెన్నియో కలిగి, వేదముల సిద్దాంతమై యున్న శివుని భార్యను కాంచీనగరమున జూచితిని. 

8 – 02 – 2024

56. శ్లోII  ఆహితవిలాసభంగీ మాబ్రహ్మస్తంబ శిల్పకల్పనయా 

ఆశ్రితకాంచీ మతులా మాద్యాం విస్ఫూర్తి మాద్రియే విద్యామ్‌!  

తే.గీ.II  బ్రహ్మ మొదలుగ స్తంబము వరకు శిల్ప

కల్పనన్ దనదగు వెళుక విధ మడర

నొప్పు కంచివాసిని నాద్య నుజ్వలాంబ

నాదరించెద జ్ఞానాబ్ధిననుపమముగ.  (వెళుకు = విలాసము)

తాII బ్రహ్మాది స్తంబ పర్యంతమైన సృష్టి శిల్పము యొక్క కల్పన చేత నిజ విలాసభంగిమల నెల్ల విస్త రింపఁ జేసిన, కొంచీనగర నివాసినిని అనుపమము ఆద్యము నైన సూర్తిరూప మగు జ్ఞానవిద్యా స్వరూపిణియగు అమ్మను ఆదరించెదను. 

57. శ్లోII  మూకో೭పీ జటిలదుర్గతి శోకో೭పీ స్మరతి యః క్షణం భవతీమ్‌ 

ఏకో భవతి స జంతుః లోకోత్తరకీర్తి రేవ కామాక్షి.

తే.గీ.II  మూకయు, జటిలదుర్గతి శోకమగ్నుఁ

డనుపమ! నిను క్షణంబు తా మనము నందు

స్మరణఁ జేసినన్ గామాక్షి! సంస్తుతిఁ గను

నతఁడు, లోకోత్తముఁడగు మహాత్ముఁడనుచు.

తాII మూగవాడుగాని, చిక్కువిడనిదుర్గతిలో బడినవాడుగాని, శోకగ్రస్తుడుగాని, నిన్నొక్క క్షణము స్మరించునేని ఆ జీవి లోకోత్తరకీర్తిశాలి యగును, 

58. శ్లోII  పంచదశ వర్ణరూపం కంచన కాంచీవిహార ధౌరేయమ్‌  

పంచశరీయం శంభో ర్వంచన వై దగ్ధ్యమూల మవలంబే|  

తే.గీ.II  పంచదశవర్ణ మంత్రరూపముననొప్పు,

కంచిలో స్వేచ్ఛగా విహరించు నిపుణ,

నిటల లోచనున్ వంచించు నేర్పరియగు

ననుపమపు మూలవస్తువు నాశ్రయింతు.

తాII పంచదశాక్షరమంత్రస్వరూపము కంచిపురీవిహారకౌశలము శంభుని వంచింపగల నెఱజాణతనమున కెల్ల మూలమును అయిన ఒక వస్తువును ఆశ్రయించుకొని యున్నాను. 

59. శ్లోII  పరిణతవతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీమ్‌  

పంచాశదర్ణ కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీమ్‌| 

తే.గీ.II  జ్ఞానుల సుషుమ్న నాడిని జక్కఁ జేరి

తా పరాదిగ నాల్గువిధముల పదవు

లంది, యేబదక్షరములనమరియున్న

వినుత పదశిల్ప కామాక్షిఁ బ్రీతిఁ గొలుతు.

తాII జ్ఞానుల సుషుమ్నా నాడీమార్గమును జేరి పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ రూప మున నాలుగు విధముల పరిణతి చెందినట్టియు పంచాశదక్షరకల్పిత మైన పదశిల్పము గల యా యమ్మను కామాక్షిని నమస్కరించెదను. 

60. శ్లోII  ఆదిక్ష న్మమ గురురా డాది క్షాన్తాక్షరాత్మికాం విద్యామ్ 

స్వాధిష్ఠ చాపదండాం 'నేదిష్ఠా మేవ కామపీఠ గతామ్|  

తే.గీ.II  వినుత స్వాధిష్ఠచాపదండ నిటఁ దరిని

కామ పీఠగత యయిన కల్పకంబు,

నక్షరోద్దిష్ట వర్ణాళి నమరినట్టి

మాతృకామంత్రమొసగిరి మహిత గురులు.

తాII గురుసార్వభౌములు ఈ కామపీఠమం దధిష్టించియున్న, తియ్యచెరకుకఱ్ఱ ధరించిన, అకారాది క్షకారాంతాక్షరమాలారూపమైన మాతృకా మం త్రరూపీణిని (విద్యను) నా కుపదేశించినారు, 

10 – 02 – 2024


61. శ్లోII  తుష్యామి హర్షిత స్మరశాసనయా కాంచిపుర కృతాసనయా 

స్వాసనయా సకలజగ ద్భాసనయా కలిత శంబరాసనయామ్ ||  

తే.గీ.II  మదన శాసనునకు ముద మొదవనుండి,

కంచి వాసంబుగాఁ గల్గి, కనఁగ తనకు

తానె యాసనమయి, జగద్ధాత్రియయిన

శంబరాసనన్ గాంచితి సంతసముగ.

తాII శివుని సంతోషింపజేయుచు, కాంచీపురమందు వసించుచు, స్వయమధిష్ఠాన మై సకల జగత్తును భాసింపఁ జేయునదై, శంబరాసనయైయున్న యొకతల్లిచే నానందభరితుడ నగుచున్నాను. 

62. శ్లోII  ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతిమనస్సు భూమవతీ 

సామవతీ సత్యగిరాం సోమవతీ శిరసి భాతి హైమవతీ| ౬౨ 

తే.గీ.II  కంపపై ప్రేమ కలదియు, కలిగి యతుల

చిత్తములఁ బూర్ణరూపమున్, సేవ్యమాన

సామవేదస్వరూపమై, చంద్రశేఖ

రి యగు, హిమగిరి తనయ వర్ధిల్లుచుండె.

తాII కంపానదిపై ప్రేమ కలది యతుల చిత్తములయందు పూర్ణరూపమైనది వేద 

వాక్కులో సామవేదము స్వరూప మైనది శిరన్సునందు చంద్రరేఖ గలదియునై 

హిమవంతుని కూతురు భాసించుచున్నది. 

63. శ్లోII  కౌతుకినా కంపాయాం కౌసుమ చాపేన కీలితే నాంతః 

కుల దైవతేన మహతా కుట్మలముద్రాం థునోతు నః ప్రతిభా!  

తే.గీ.II  కంపపై కౌతుకము గల కమలనయన,

పూలవిల్లుచే గొప్పదౌ పూవుబోడి,

మదిని చెక్కిన కులదేవత దయచేత

మాదు కవన ప్రభగ వెల్గి శ్రీదమగుత.

తాII కంపయందు కౌతుకము గలది, పూలవిల్లుచే గొప్పది, అగు ఒక గొప్పకులదైవతముచే మా కావ్య ప్రతిభ వికసించుగాక.

64. శ్లోII  కేనాపి మిల ద్దేహా యూనా స్వాహా సహాయ తిలకేన 

సహకార మూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే! 

తే.గీ.II  అగ్నితిలకుఁడౌ యువకుని యత్తియున్న

మేను గలిగిన కేవల జ్ఞాన రూపి

ణి యగు నట్టియిల్లాలు తా నియతితోడ

మేలు మామిడి నీడన్ రమించుచుండె.

తాII స్వాహాదేవీసహాయుఁడగు అగ్నిని తిలకముగా గల ఒక పడుచువానితో అత్తిన మేను గలదియై కేవల జ్ఞానరూపిణియగు నొక యిల్లాలు తీయమామిడిచెట్టు క్రింద క్రీడించు చున్నది, 

65. శ్లోII  కుసుమశర గర్వసంప త్కోశగృహం భాతి కాంచి దేశగతమ్‌ 

స్థాపిత మస్మి న్కథమపి గోపిత మంత ర్మయా మనోరత్నమ్.

తే.గీ.II  మన్మథుని గర్వసంపద మందిరమ్ము

కంచియందొకటున్నది ఘనతరముగ,

నా మనంబను రత్నమున్ బ్రేమతోడ

దాచిపెట్టితి నచ్చట తత్త్వరసి.

తాII మన్మథగర్వసంపదకు భాండాగార మొకటి కాంచి మధ్య దేశమందు ప్రకాశించుచున్నది. నా మనస్సు అనెడి రత్నమును దానియందు దాపరిక మొనర్చితిని, 

66. శ్లోII  దగ్ధషడధ్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారుణ్యమ్‌ 

కలయే తవ తారుణ్యం కంపాతట సీమ్ని కిమపి కారుణ్యమ్‌| ౬౬ 

తే.గీ.II  ప్రథిత దగ్ధ షడధ్వరారణ్య,  దరద

ళిత కుసుంభ సంభృత రక్తిమ, తటమయిన

కంప నదికడ వెలసిన కరుణ యనగ

నొప్పుయౌవనిన్ ధ్యానింతు నొప్పిదముగ.

తాII షడధ్వరారణ్యమును కాల్చిన, కొంచెము వికసించినట్టి కుసుంబ పుష్పముల ఎఱుపును ధరించిన, కంపా తట ప్రదేశమున వెలసినదయా స్వరూపమయిన నీ యౌవన్మును ధ్యానింతును.

11 – 02 – 2024

67. శ్లోII  అధికాంచి వర్తమానా మతులాం కరవాణి పారణా మక్ష్ణోః  

ఆనంద పాకభేదా మరుణిమ పరిణామ గర్వ పల్లవితామ్‌. 

తే.గీ.II  హ్లాద పాకభేదయు, నతులయు, 

కంచి సంచారి, యరుణిమ క్రమ పరిణతి

గర్వ పల్లవితయునగు కామనేత్రి

యొక్క దర్శనమును బొంది యొప్పుదునిల.

తాII ఆనందపరిపాక విశేషమును, ఎఱుపురంగుయొక్క క్రమపరిణామ గర్వముచే జిగురించుదానిని,  కాంచి యందు వర్తించు దానిని, దర్శించుకొనుదును. 

68. శ్లోII  బాణ సృణి పాశ కార్ముకపాణీ మముం కమపి కామ పీఠగతమ్‌ 

ఏణధరకోణచూడం శోణీమ పరిపాకభేద మాకలయే. ౬౮ 

తే.గీ.II  బాణ, సృణి, పాశ, కార్ముకపాణిని, నుత 

కామకోటి పీఠ గతను, శ్రీమదంబ

ననుపమారుణ పరిపాక ఘనయశమును,

చంద్రరేఖ శిరోమణిన్ సన్నుతింతు. 

తాII బాణములు అంకుశము పాశము విల్లును హస్త ములందాల్చి చంద్రవంక శిరము నంబూని కామకోటి పీఠమందున్న యొకానొక ఆరుణ్యపరిపాకమును భావించెదను. 

69. శ్లోII  కిం వా ఫలతి మమాన్యై ర్బింబాధర చుంబి మందహాసముఖీ  

సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షీ || 69 

తే.గీ.II  అధర బింబమున్ ముద్దిడు మధుర హసన

ముననునొప్పు మోమున, తమంబును హరించు

లోక జనని కామాక్షి నా లోననుండ

నితర దేవతలొసగునదేమి యుండు?

తాII దొండపండువంటి పెదవిని ముద్దుపెట్టుకొను మురిపెంపు జిఱునవ్యు 

నెమ్మోమునం దులకింప, తమంబు హరించు జగజ్జనని కామాక్షి నా మనసునందే 

వర్తించుచుండ నా కితర దేవతల వలన నొరుగ బోవు ఫల మేమి? 

70. శ్లోII  మంచే సదాశివమయే పరశివమయ లలితపౌష్ప పర్యంకే  

అధిచక్రమధ్య మాస్తే కామాక్షీనామ కిమపి మమ భాగ్యమ్! 

తే.గీ.II  లలితపుష్పపర్యంకాన లాలితముగ

సౌమ్య సద్వరభాస శ్రీచక్రమందు

మహి సదాశివ మయమగు మంచెపైన

యమరి కామాక్షి నాభాగ్యమై రహించె.

తాII కామాక్షియను పేర నా భాగ్యమొకటి సదాశివమయమయిన మంచమునందు 

పరశివ రూపమైన పూలపానుపునందు శ్రీచక్రమధ్యమం దధిషించి యున్నది. 


71. శ్లోII  రక్ష్యోఽస్మి కామపీఠీ లాలికయా ఘనకృపాంబుకాలికయా  

శ్రుతియువతి కుంతల మణీమాలికయా తుహినశైలబాలికయా ౭౧ 

తే.గీ.II  కామ పీఠికా డోలికన్ గ్రాలునదియు,

కృపను వర్షించు మేఘమున్, హిమగిరిసుత,

శ్రుతి యువతి కొప్పుమణిమాల, నుతుల దేలు

దేవతయె ననుఁ బాలింప దీప్తిఁ గనితి.

తాII కామపీఠమను నుయ్యెల పైని యూగునది, సాటిలేని కృపారసము వర్షించు మేఘమైనది, శ్రుతులనెడి సుందరుల కొప్పులందు మణిమాలిక యైనదియు నగు హిమశైలబాలిక పాలనలో నేనున్నాను.

72. శ్లోII  లీయే పురహరజాయే, మాయే, తవ తరుణ పల్లవచ్ఛాయే, 

చరణే చంద్రాభరణే, కాంచీశరణే, నతార్తిసంహరణే| 

తే.గీ.II  పురహరుసతి! మాయా! కంచి పురమె గృహము

గాఁ గల జననీ! నతులార్తిఁ గరుగఁ జేయు,

తరుణ పల్లవచ్ఛాయా! మదంబ! నీదు

చరణ కమలాల లీనమై వరలనిమ్ము. 

తాII ఓ పురహరునియిల్లాలా! మాయా! ఛంద్రాభరణా! కాంచీయే గృహమయినదానా! ప్రణతార్తిసంహరణా! నేను నీ చరణములందు లీనుండ నయ్యెద. 

73. శ్లోII  మూర్తిమతి ముక్తి బీజే మూర్ధ్ని స్తబకిత చకోరసామ్రాజ్ఞే 

మోదితకంపాకూలే ముహుర్ముహు ర్మనసి ముముదిషాస్మాకమ్‌. 

తే.గీ.II  శశియె తలను పూ బంతిగాఁ జక్కనొప్ప,

ముక్తిబీజమె రూపమౌ పూవుబోడి

తళుకులీనెడు కంపకున్ దరిని కలిగి,

దానితో మదిన్ మురియంగఁ దలతు సతము.

తాII తలపై చకోరసామ్రాజ్యము (చంద్రబింబము) పూ బంతి కాగా, రూపు గట్టిన ముక్తి బీజమై, కంపాతీరమున సంచరించుచుండు నొకానొక తళుకుతో మాటిమాటికి మురియవలెనని మా కోరిక, 

74. శ్లోII  ‘’వేదమయీం నాద మయీం 

బి౦దుమయీం పరపదోద్య దిందు మయీం 

మంత్రమయీం  తంత్ర మయీం 

ప్రకృతి మయీం నౌమి విశ్వ వికృతిమయీమ్. ‘’

తే.గీ.II  వేదమయిని, నాదమయిని, బిందుమయిని,

పరపదోద్య దిందుమయిని, ప్రకృతిమయిని,

మంత్రమయిని, తంత్రమయిని, మహిత విశ్వ

జనని కామాక్షినెన్ని, యంజలిఘటింతు.

తాII పరమ పదం(సహస్రారం ) లో ఉదయించే చంద్రుని స్వరూపంకలిగి, వేద, నాద, బిందు రూపిణి, మంత్రం తంత్రమయినది, విశ్వ వికార రూపిణిగా ఉన్నది అయిన ప్రకృతికి – అంటే కామాక్షీ దేవికి నమస్కరిస్తున్నాను .

75. శ్లోII  పురమథన పుణ్యకోటీ పుంజిత కవిలోక సూక్తి రసధాటీ 

మనసి మమ కామకోటీ విహరతు కరుణావిపాక పరిపాటీ!  

తే.గీ.II  పురమథను పుణ్యకోటియు, పుంజిత కవి

లోక సూక్తిరసపుధాటి శ్రీద కామ

కోటి ఘనకరుణా పరిపాటి, నాదు

చిత్తమందున విహరించి క్షేమమిడుత.

తాII పురారిపుణ్యములకోటి పుంజీకృత సుకవిసూక్తి రసధాటి కరుణారస పరిపాక పరి పాటీయునగు కామకోటి నా మనసునందు విహారము సలుపు గాక! 

76. శ్లోII  కుటలం చటులం పృథులం మృదులం కచ నయన జఘన చరణేషు,  

అవలోకిత మవలంబిత మధికంపాతట మమేయ మస్మాభిః. 

తే.గీ.II  కుటిలకచ, పృథుల జఘన, చటులనేత్ర,

మృదుల చరణపద్మముల నమేయమైన

మూర్తి యొకటి కంప దరిని పూజనీయ

ముగను కనిపించె నాశ్రయమ్ముగనునిలిచె.

తాII జుట్టునందు గుటిలమై కన్నులందు జటులమై (చంచలమై) పిరుదులందు 

పృథులమై (విశాలమై) చరణములందు మృదులమై యున్న అమేయ మైన యొక మూర్తి కంపాతీరమునందు మాకు గోచరించినది. ఆశ్రయమైనది. 

12 – 02 – 2024

77. శ్లోII  ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాక్ష్యాః  

పశ్యామి నిస్తుల మహో పచేలిమం కిమపి పరశివోల్లాసమ్.

తే.గీ.II  దివ్య కామాక్షి సుకటాక్ష దీపకళిక

చూప, లోదృష్టితోఁ, బూర్ణశోభఁ గలిగి

యొప్పు పరశివు నుల్లాస మొప్పిదమగు

కంచికామాక్షిగా నేను గాంచుచుంటి.

తే.గీ.II  దివ్య కామాక్షి దయ యను దీపకాంతి 

లోని చూపిడన్ బూర్ణ సుజ్ఞానమొంది

నదగు పరశివునుల్లాసమదియె కనగ

దివ్యకామాక్షికాన్ జూచితిని జననిని.

తాII కామాక్షి యనుగ్రహమనెడి దీపపుకళిక సహాయముతో లోపలిచూపుతో (ఆత్మోన్ముఖదృష్టితో) నిండుగ బండినది (పూర్ణభావము చెందినది) యగు పరశివుని ఉల్లాసము (పరమశివానందస్థాన మైన కామాక్షిని) దర్శించుచున్నాను. 

78. శ్లోII  విద్యే విధాతృవిషయే కాత్యాయని కాలి కామకోటికలే 

భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీమ్‌!  

తే.గీ.II  విధి కగపడు కాత్యాయని! విద్య! కాలి!

కామకోటి కలారూపిణీ! మదంబ!

భారతీ! శాకినీ! భద్ర! భైరవీ! శి

వా! యనుచు నిన్నుఁ గొల్చెదన్ భవ్యముగను.

తాII బ్రహ్మకు గోచరమగు ఓ విద్యాధిష్టాశ్రీ ఓ కాత్యాయనీ కాళీ కామకోటీ కలా 

రూపిణీ భారతీ భైరవీ భద్రా శాకినీ శాంభవీ శివా యని నిన్ను స్తుతించెదను, 

పరదేవతా ప్రకృతి యందు లోకానుగ్రహ _నిమిత్తముగా నానిర్భవించిన ఆయా 

యవతారవిశేషము లీ నామములచే బేర్కొనబడినవి. 

79. శ్లోII  మాలిని మహేశచాలిని కాంచీఖేలిని విపక్షకాలిని తే 

శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమో೭స్తు| 

తే.గీ.II  విద్రుమశాలిని! మాలిని! విశ్వభాస!

శూలిని! మహేశచాలిని! శుభ! కపాలి

ని! సురజనపాలిని! సుజనని, వరకంచి

ఖేలిని, విపక్ష కాలినీ! కేలుమోడ్తు.

తాII ఓ మాలినీ (అకారాద్యక్షరమాలామంత్రరూపిణీ యనుట) మహేశ్వరుని మది 

కదిలించినదానా! కాంచీనగరవిహారిణీ! శత్రువులపాలిటికాలరూపిణీ (కాళీ)! త్రకూలధారిణీ! (ప్రవాళ(పవడము) కాంతిమయశరీరిణీ ! దేవతాపాలినీ! కపాలధారిణీ! నీకు నమస్కారము. 

80. శ్లోII  దేశిక ఇతి కిమ్ శంకే తత్తాదృక్ తవ ను తరుణిమోన్మేషః  

కామాక్షి శూలపాణేః కామాగమ సమయ తంత్రదీక్షాయామ్‌ ||  

తే.గీ.II  తత్త్వ దర్శియైనట్టి నీ తరుణిమోద

యంబు కామశాస్త్రంబున నమరు తంత్ర

దీక్ష శివునకు బోధింపనక్షయముగ

గురువుగానగునా? యేమి?కువలయాక్షి!

తాII ఓ కామాక్షీ! తత్త్వదర్శియైన నీ యౌవనోదయము శూలపాణికి కామశాస్త్ర తంత్రదీక్ష ననుగ్రహించుటలో గురవగునా యేమి? 


81. శ్లోII  వేదండకుంభ డంబర వైతండిక కుచభారార్త మధ్యాయ  

కుంకుమ రుచే నమస్యాం శంకర నయనామృతాయ రచయామః। ౮౧ 

తే.గీ.II  ధరను వేదండకుంభ డంబర వితండ 

వాదమును జేయు ఘన కుచభారమునను

నలిగి చిక్కిన నడుమును, సులలితమగు

నరుణదేహంబుశివుకంటికమృతమయిన

మాదు జననికికైమోడ్తు, మేదురముగ.

తాII ఏనుగు కుంభస్థలముయొక్క విలాసాటోపముతో వితండవాదము సేయు కుచ భారముచే  కటకటలాడు నెన్నడుము కుంకుమపూవువన్నియగులుకు నెమ్మేనును గలిగి శంకరుని చూపుల కమృత ప్రాయమైన మా యమ్మకు మ్రొక్కెదము. 

13 – 02 – 2024

82. శ్లోII  అధికాంచిత మణీకాంచనకాంచీ మధికాంచి కాంచి దద్రాక్షమ్‌  

అవనతజనానుకంపా మనుకంపాకూలమస్మదనుకూలామ్‌||  

తే.గీ.II  మేలగు మణిమయ సువర్ణ మేఖలఁ గల,

యవనత జన కల్పలతిక, భవవిదూర,

కరుణతో మము చూచెడి కంచి వాసి

నమ్మ నిట గంప దరిఁ జూచి తనుపమముగ.

తాIIమిక్కిలి ఒప్పియున్న మణిమయ సువర్ణ మేఖలను దాల్చి, అడుగడుగున నడుగులందు వ్రాలు భక్తజనము నాదరించుచు, మాయెడ సుముఖియైయుండు ఒకానొక యమ్మను గంపాతీరమున కంచిలో గాంచితిని, 

83. శ్లోII  పరిచిత కంపాతీరం పర్వతరాజన్య సుకృతసంనాహమ్‌ 

పరగురుకృపయా వీక్షే పరమశివోత్సంగ మంగలాభరణమ్‌|  

తే.గీ.II  కంపదరినొప్పు హిమగిరి కన్నబిడ్డ

పరమశివునొడినొప్పెడి పసిడితొడవు

గురుని సత్కృపన్ గనుచుంటి నిరుపమముగ

దివ్యకామాక్షి నాకంటి తేజమరయ.

తాII కంపాతీర పరిచయము వడసిన పర్వతసార్వభౌముని పుణ్యములరాశిని పరమశివు నొడిలోని  మంగళాభరణమును గురుదేవుల పరమకృపచే దర్శించుచున్నాను. 

84. శ్లోII  దగ్ధమదనస్య శంభోః ప్రథీయసీం బ్రహ్మచర్యవై దగ్ధీమ్‌  

తవ దేవి తరుణీమ శ్రీ, చతురిమ పాకో న చక్షమే మాతః॥| _ ౮౪ 

తే.గీ.II  నీదు నవయౌవనపు శోభ నిరుపమాన

దగ్ధమదనుఁడౌ శంభుఁడు ధర్మపూర్ణ

బ్రహ్మచర్య సన్నిష్టను క్రాలుటఁ గని

యోర్వలేకుండె కామాక్షి! శర్వురాణి!

తాII దేవీ! నీ నవయౌవనశోభాచాతుర్యపరిపాకము మన్మథుని దగ్ధముచేసిన శంభుని సుప్రసిద్ధబ్రహ్మచర్య నిష్టానై పుణ్యమును జూచి యోర్వలేని దయ్యెను గదమ్మా. 

85. శ్లోII  మదజలతమాలపత్రా వసనితపత్రా కరాదృతఖనిత్రా 

విహరతి పులిందయోషా గుంజాభూషా ఫణీంద్రకృత వేషా| 

తే.గీ.II  మదజల తమాలపత్రయై, మడుఁపుగాను

పత్రములు దాల్చి, చేతను బారపట్టి,

సర్పవేష, కుంజాభూష, సౌమ్యభాష,

యొకపుళింద కాంత తిరుగుచుండెనిచట.

తాII హస్తమునం దవ్వుగోలగొని, ఆకులచీరగట్టుకొని, సర్పరాజు నాభరణముగ గై సేసి, గురివెందపూసల పేరులు దాల్చి, మదధారచే దడియుచున్న వృళిందకన్య యొకతె యిందు విహరించుచున్నది. 

86. శ్లోII  అంకే శుకినీ, గీతే కౌతుకినీ, పరిసరే చ గాయకినీ, 

జయసీ సవిధే೭మ్బ! భైరవమండలినీ, శ్రవసి శంఖకుండలినీ. 

తే.గీ.II  అంకమున జిల్క, పాడుటందాశ, దరిని

గాయకినులును, దగ్గరగా వసించు

భైరవసమూహము, చెవులవరలు శంఖ

కుండలములున్నతల్లి! నీకును జయంబు.

తాII అమ్మా! అంకతలమునం దాడెడు చిలుకతో గానమేయువేడుకగొని యిరు 

"వంకల పొటకత్తెలు వంతపొడగ భెరవమండలముతో శంఖాకార కుండలములం దొళ్ళి నా దాప్సన నుల్లసిల్లు తల్లివి నీవు. 

87. శ్లోII  ప్రణత జనతాపవర్గా కృత రణసర్గా ససింహసంసర్గా  

కామాక్షీ ముదితభర్గా హతరిపువర్గా త్వమేవ సా 'దుర్గా!  

తే.గీ.II  ప్రణత జనతాపవర్గవున్, రణ రచయిత

వుఁ, గనఁగ స సింహసంసర్గవున్ హరితపు

వర్గవును మరి ప్రముదిత భర్గవునగు, 

దుర్గవీవేను కామాక్షి! దోయిలిఁ గొను.

తాII వినతులయిన జన సమూహముపాలిటి మోక్షమై యుద్దములను రేచుచు సింహ వాహవై కామాక్షీ! శత్రువర్గముంజెండాడి ఉగ్రుని కానందము నించు దుర్గవు నీవే, 

88. శ్లోII  శ్రవణచలద్వేదండా సమరోద్దండా ధుతాసురశిఖండా  

దేవి కలితాంత్రషండా ధృతనరముండా త్వమేవ చాముండా.

తే.గీ.II  శ్రవణ చలిత వేదండవు! సమర నిపుణ

వును, ధుతాసుర పింఛవున్, ప్రణవ దేవ

త! కలితాంత్రషండవు, నిఁక ధృతనర

ముండవున్ నీవె చాముండ! మ్రొక్కెద నిను.

తాII చెవులయం దూగులాడు ఏనుగులుగల, యుద్దమునందు బ్రచండమూర్తి వై రాక్షసుల తలలు పై కదలుచున్న నెమలి పింఛము కలిగిన, ప్రేగుల మాలలు దాల్చి, కంఠమున నరులపుర్రెలు ధరించి వర్తించు చాముండవు నీవే. 

89. శ్లోII  ఉర్వీ ధరేంద్రకన్యే దర్వీభరితేన భక్తపూరేణ 

సుర్వీ మకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి! 

తే.గీ.II  హిమనగసుత! దర్వీభరితముగనన్న

మొసగి భక్తుల కాకలి నొనరఁదీర్చు

తల్లి వీవేను కామాక్షి! తలిరుఁ బోడి!

వందనమ్ములు చేసెదనందుకొనుము.

తాII ఓ గిరిరాజకన్యా! గరిటెనిండా అన్నము వడ్డించి దీనుల యపరిమిత పరితాపము హరించుదానవు నీవే. 

90. శ్లోII  తాడిత రిపు, పరిపీడన భయహరణ నిపుణ హల ముసలా,  

క్రోడపతి భీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి |  

తే.గీ.II  తాడితరిపుకామాక్షిరొ! ధరణిని పర

పీడన భయహర నిపుణవె, హల ముసల

ధారిణి! భయము గొలుపెడి యారువుముఖి

వగుచు జగతిని కామాక్షి! యాడుదువుగ.

తాII శత్రువులను గొట్టి కూల్చుటలో భక్తుల భయమును వారించుటలో నేర్పుగన్న 

నాగలి, రోకలియు దాల్చి వెఱపుగొల్పు పందిముట్టెతో (వారాహివై) నీ వీ జగమున గ్రీడింతువు.


91. శ్లోII  స్మరమథన వరణలోలా మన్మథ హేలా విలాసమణిశాలా  

కనకరుచిచౌర్యశీలా త్వమంబ బాలా కరాబ్జధృతమాలా। 

తే.గీ.II  స్మరమథన వరణాసక్తి మదిని యున్న,

కరమునం దక్షమాలను కలిగి యుండి 

కామహేలా విలాస ప్రకాశపు మణి

శాల వగు స్వర్ణదేహపు బాలవీవు.

తాII కరములయం దక్షమాలగొని కామలీలా విలాసములకు మణిమందిరమయి మేలిమి బంగారుచాయను గాజేయు శరీరకాంతితో కరపద్మములందు మాలధరించియుండు బాలవు నీవ, 

92. శ్లోII  విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటీ  

కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ||  

తే.గీ.II  స్తుత విమలపటీ! కామాక్షి! శ్రుతినిధాన!

వర కమలకుటీ! కలితవిపంచి! దేవి!

సతత పుస్తక రుద్రాక్ష శస్త హస్త

పుటి! వినుత పక్ష్మలాక్షి! యా పొత్తువీవు.  

తాII ఓ కామాక్షీ! తెల్లనిచీర కట్టికొని కమలమను కుటీరమున, పుస్తకము, రుద్రాక్షమాల హస్తములందు దాల్చి వీణె మీటుచు నీవ విరించి యిల్లాలవై (వాణీవై) విలసిల్లుదువు, 

93. శ్లోII  కుంకుమరుచిపింగ మసృక్పంకిల ముండాలి మండితం మాతః 

జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయకరాబ్దమ్‌।|  

తే.గీ.II  ఎఱ్ఱనైనట్టి నెత్తుటి పుఱ్ఱెమాలఁ

బూని జపమాల పుస్తకములనుదాల్చి

యభయముద్రతో నొప్పెడు హస్తపద్మ 

ముల నలరు నీదు పొడ విజయలహరియగు.

తాII అమ్మా! రక్తపంకిలములగు పుఱ్ఱెలమాలనుబూని జపమాల పుస్తకమును వర ముద్రను దాల్చిన నాల్గహస్తపద్మములతో కుంకుమవర్ణమై నీ రూపము సర్వోన్నతమై యలరును, 

94. శ్లోII  కనకమణికలితభూషాం కాలాయసకలహశీల కాంతికలామ్‌  

కామాక్షి శీలయే త్వాం కపాల శూలాభిరామ కరకమలామ్‌||  

తే.గీ.II  కనకమణి యుత భూషలున్, గాలలోహ

మును జయించు శీలపు కాంతి, పుఱ్ఱెయు వర

శూలమున్గల హస్త సచ్ఛోభనలరు

నిన్ను కామాక్షి! దర్శింప నెన్నుదు మది.

తాII సువర్ణమయరత్నభూషణములు ధరించి కాలాయసముతో (ఇనుముతో) తగవాడు కాంతికళచే మించి కపాలమును, శూలమును కరకమలములందు వహించి యుండు నిన్నే అన్వేషించెదను, (భావించెదను). 

95. శ్లోII  లోహితమవుంజమధ్యే మోహితభువనం ముదా నిరీక్షంతే 

వదనం, తవ కుచయుగలం కాంచీసీమాం చ కే೭పి కామాక్షీ ||  

తే.గీ.II  లోహితమపుంజ మధ్యము, మోహితముగ

భువనములఁ జేయు ముఖమును, పూజ్య కుచయు

గంబు, కామాక్షి! కాంతురు కంచిలోన

నెవ్వరోధన్యజీవులు హృద్యముగను.

తాII అరుణకాంతినడుము భువనములెల్ల మోహింపజేయు నీ మోమును, గుచయుగమును, కాంచీసీమను నెవ్వరో ధన్యులు దర్శింపగల్లుదురు. 

96. శ్లోII  జలధి ద్విగుణీత హుతవహ దిశా దినేశ్వర కలాశ్వినేయదలైః 

నలినైర్మహేశి గచ్చసి సర్వోత్తర కరకమలదల మమలమ్‌॥ 

తే.గీ.II  కనగ షట్చక్రముల వెంటఁ గదలి గడచి

యన్నిటికి పైన నున్నట్టి యనుపమమగు

నుత సహస్రార కమలంబునతులితముగ

పొందుదువు తల్ప హృదయంబు పొంగిపోవ.

తాII నాల్గు ఆటు పది పండ్రెండు పదునారు రెండును వైన దళములుగల 'కమల 

ము(లు అనగా వరుసగా మూలాధార - స్వాధిష్టాన -- మణేపూర -- అనాహత - విశుద్ధ -- ఆజ్ఞా చక్రము)ల వెంట నన్నిటికి మీదిదైన విమల మైన నహ స్రారకమలదళమును బొందెదవు. 

97. శ్లోII  సత్కృతదేశికచరణాః నబీజ నిర్బీజ యోగనిశ్శ్రేణ్యా  

అపవర్గ సౌధవలభీ మారోహం త్యంబ కే೭పీ తవ కృపయా ౯౭ 

తే.గీ.II  దేశికుని పాదసేవను దివ్యముగను

మహి సబీజనిర్బీజ సమాధిరూప

మయిన నిచ్చెన వెంట మహాద్బుతముగ

మోక్షసౌధమ్ము పైకెక్కు శిక్షకుండు.

తాII గురుచరణమును గట్టిగ బట్టుకొని సేవించిన అదృష్టవంతు లేకొందరు నీద 

యచే సబీజ నిర్బీజ సమాధిరూపమయిన నిచ్చెనవెంట మోక్షసౌధము ఫై మేడకు 

(చంద్రశాలకు) ఎక్కెదరమ్మా! 

98. శ్లోII  అంతరసి బహిరసి త్వం జంతుతతే రంతకాంతకృదహన్తే 

చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానమ్‌|| ౯౮ 

తే.గీ.II  అంతకాంతక వీవె యహంత! మాత!

జీవులకులోన బయటను నీవె యుంటి

వమ్మ! ధ్యాన ధారణ భక్తవర్యులకును

మహిమఁ గొల్పుదు వమ్మరో! యహరహంబు.

తాII అహంతారూపమైయున్న నీవు యముని అంతముచేయుదువు, సర్వజీవులలోన వెలుపలను బయటను ఉన్నావు, ధ్యానధారాసంపన్ను లయిన యోగులకు అనుపమ ప్రభావమును అనవరతము విస్తరింపజేయుచున్నావు. 

99. శ్లోII  కలమంజుల వాగనుమిత గలపంజర గత శుక గ్రహౌ త్కంఠ్యాత్

అంబ! రదనాంబరం తే బింబఫలం శంబరారిణా న్యస్త మ్‌|| 99 

తే.గీ.II  నీదు కలకంఠమును విని నీదు కంఠ

మందు తన చిలుకున్నటులాత్మాఁ దలఁచి

యధరబింబంబు రప్పింప నమరఁ జేసె,

నీ యధరబింబమునెంచ నేరనమ్మ!

తాII అవ్యక్తమధురములయిన నీ పలుకు లాలించి నీ గళమను పంజరములో తనక వాహన మైన చిలుక యున్నదని అనుమానించి దాని వెలికి రప్పించుటకు మన్మథుడు ఎఱగా బెట్టిన దొండపండుకదమ్మా నీ పెదవి. 

100. శ్లోII  జయ జయ జగదంబ శివే జయ జయ' కామాక్షి జయ జయాద్రిసుతే 

జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే ౧౦౦ 

తే.గీ.II  జయము జగదంబ! మా శివా! జయము నీకు,

జయము కామాక్షి! నా తల్లి! జయమునీకు,

జయము హైమవతీ నీకు జయము జయము,

జయము చిద్గగనపు చాంద్రి! జయము జయము,

జయము మాహేశ్వరీ నీకు జయము జయము.

తాII ఓ జగన్మాతా! శివా! సర్వోన్నతురాలవై వర్తింప్పుము. కామాక్షి! హిమాచల 

కుమారీ! సర్వాతిశాయినివై యలరుము. మహేశునిల్లాలా! సర్వాధికవై యుండుము. జ్ఞానాకాశమున నలముకొనిన నిండు'వెన్నల ప్రవాహమా! నీవు సర్వవిశేష వై రాజిల్లుము. 


101. శ్లోII  అర్యాశతకం భక్త్యా పఠతా మార్యాకటాక్షేణ 

నిస్సరతి వదనకమలా ద్వాణీ పీయూషధోరణి దివ్యా " 

తే.గీ.II  భక్తి నార్యా శతకమును భక్తిమీర

చదువ వాక్సుధాఝరినిచ్చు ముదముతోడ

నంబ చదువరులకుఁ గృపననుపమముగ,

జయము పాఠకులకు నిల జయము జయము.

తాII ఈ ఆర్యాశతకమును భక్తితో బఠించువారి ముఖకమలమునుండి ఆర్యా 

కటాక్షముచే అమృతధోరణియైన దివ్యవాణి (అలౌకిక భాష) వెలువడును. 

14 – 02 – 2024

ఆర్యాశతకము సమాప్తము.

స్వస్తి.

 

కృతికర్త.  

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165


రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.

44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.

45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)

46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.

స్వస్తి.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.