గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జూన్ 2017, మంగళవారం

శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న బహు అరుదైన పురస్కారం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శంకరాభరణం బ్లాగును అవిరళముగా నిర్వహించుచు ఎందరో పద్యాభిమానులను కవులుగా చేస్యుచు ఆదర్శ జీవితం గడుపుచున్న మన సాహితీ బంధువు శ్రీమాన్ కంది శంకరయ్య. అట్టి మహనీయుని కృషిని గుర్తించిన జగద్విఖ్యాత విద్వద్వేత్త శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావు గారున్తన హృదయాకాసమున మెఱుపు వలె మెఱిసి అమృతపు జల్లువలె వెల్వడిన పద్యములలో వ్యక్తము చేసినారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్. అన్న మాట ఎంతటి యదార్థము! ఈ అపురూప పద్యసత్కారమునకు నోచుకొన్న శ్రీమాన్ కంది సంకరయ్య మహనీయుని మనసారా అభినందిస్తున్నాను.
ఇక చూడండి.
ప్రాచార్య శ్రీ ఏల్చూరి మురళీధరరావు వారినుండి 
శంకరాభరణ నిర్వాహకులు, శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న 
బహు అరుదైన పురస్కారం.
                                                                                                     శ్రీ కంది శంకరయ్య.
           శ్రీ ఏల్చూరి మురళీధరరావు
Recalling all those who had inspired me ... 

“భారతీసేవకప్రథుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“పద్యవిద్యాకృతవ్రతుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“గురుకవీంద్రాచార్యవరుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“దయమీఱు ప్రియసహృదయుఁ” డన్న మా కంది శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“శంకరయ్య బుధేంద్రుని వంకఁ జూచి 
సర్వసుఖములు గూర్పు మా స్వామి!” యనుచుఁ
గళలు తళుకొత్త, మోము వెన్నెలలు విరియ 
శంకరయ్య నడుగ - నెలవంకఁ జూతు!
మీ ప్రేమాతిశయముఁ బ
ద్యప్రణయనదీక్ష నన్నుఁ దావకవాత్స
ల్యప్రశ్రితుఁ గావించె సు 
ధాప్రేక్షణ శంకరార్య! ధన్యతఁ జెందన్.
ఇట్లు 
మీ ఏల్చూరి మురళీధరరావు.

ఒక మహనీయుని హృదయాహ్లాద కారకులైన ఉదార గుణ సంపన్నులైన శ్రీమాన్ ఏల్చూరి మురళీధరరావుగారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

9 comments:

కంది శంకరయ్య చెప్పారు...

వినయ పూర్వక నమస్కృతులు! ధన్యవాదాలు.

సో మా ర్క చెప్పారు...

పద్యం సమధురం.మృదు పద మనోహరం.మురళీధరరావు గారికి అభినందనలు.పురస్కార గ్రహీత శ్రీ కంది శంకరయ్య విద్వద్వరేణ్యునకు అభినందన సుమాంజలులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజ్య గురువులకు ప్రణామములు
అపురూప మైన పురస్కారమును అందించిన శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారినీ అందుకున్న శ్రీ కంది శంకరయ్యగారినీ అభినందించగల శక్తి నా ఈ చిన్నకలం సరిపోదు . ఐనా కట్టలు తెగిన ఆనందంలో అభినంద నీయులు . అందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీమాన్ ఏల్చూరి వారి ప్రశంసలనందుకొన్న గురువర్యులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏🙏🙏👏👏👏👌👌👌

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు
మాన్యులు, సుకవి మిత్రులు, శంకరాభరణ బ్లాగు నిర్వాహకులు, మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారిని
తమ పద్య రత్నములతో నరుదైన పురస్కారమందించి సత్కరించిన శుభసందర్భమున
శ్రీ కంది శంకరయ్య గారికి
అభినందనలు మఱియు శుభాకాంక్షలతో
మదీయ పద్య సన్మానము

చం.
సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, కొమ్ము పురస్కృతాంజలుల్!

కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!

ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగనుఁ జదివి సంతసింతు!

సీ.(మాలిక)
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి, విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి, తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి, దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక హితమునందించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ రసరమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

తే.గీ.(మాలిక)
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!

శుభం భూయాత్

భవదీయుఁడు
మధురకవి గుండు మధుసూదన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గారిని పద్య రత్నాలచే సత్కరించి సుకవి మిత్రులందఱ కానందమందించిన విద్వద్వరేణ్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి మనఃపూర్వక శుభాభినందనలు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుకవి విధేయ! గుండు మధుసూదన! ఏల్చురి వారి సత్ ప్రభన్
ప్రకటితమౌనటుల్ కచిత వ్రాసి కృతజ్ఞత తెల్పి, వారికిన్
సకల శుభంబులున్ గలుగ చక్కని మీ యభిలాష తెల్పినన్,
సుకవులు మిమ్ము మెత్తురని సూచన నాది పరిగ్రహింపుడీ!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యోఽస్మి రామకృష్ణారావు గారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.