జైశ్రీరామ్.
ఆర్యులారా! ముఖ పుస్తకములో శ్రీ కంది శంకరయ్యార్యులు వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ! అనే సమస్యను పూరణార్థము శంలరాభరణం బ్లాగులో ఇచ్చి. దానికి తమ పూరణను జోడించియున్నారు. శంకరయ్య గారి పూరణమనుపమానమని చెప్పవచ్చును. ఇచ్చిన సమస్య దుష్కర ప్రాస. అందున వారుపయోగించిన పదములు అసాధారణమైనవి. ఈ పద్యమునందలి పాటవానికి ఎంతో ఆనందంచించిన శ్రీమాన్ ఏల్చూరి మురళీధరరావు గారు ఆపద్యానికి చాలా చక్కని వివరణనిచ్చి పాఠకుల మదికెక్కేలా చేసారు.
ఆపద్యమును ఆ వివరణను చూదండి.
శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావు గారు
ఇలా వ్రాసారు.
"విద్వత్కవివరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారి ఈ పద్యాన్ని అందుకొని ఎంతో సంతోషం కలిగింది. ఋఙ్ముక్తోద్ధృతనిరతా
సృఙ్మేదుర కదనభయవిశేషావహ దు
ర్దృఙ్మాత్ర ఘన విపత్కర
వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!
ఋఙ్ముక్తోద్ధృతనిరత - ఋఙ్ముక్త (ఋక్+ముక్త) = స్తుతివిముఖులైనవారిచే
(అప్రగల్భులు, ధీరశాంతులు అయినందువల్ల తమను తాము స్తుతించికొనుట యందు వైముఖ్యమును వహించినవారు, సహృదయతాలోపము వలన ఇతరులలోని మంచిని గుర్తించి సత్ప్రశంస చేయలేనివారు – అని ఋఙ్ముక్తులు రెండు విధాలు. అసహృదయులైన ఆ రెండవవారి ప్రసక్తి ఇక్కడ చేయబడుతున్నది)
అనగా కేవల నిందాపరులచే;
ఉద్ధృత – ఉత్+ధృత = పైకి లేవనెత్తబడిన (వాదవివాదముల యందు);
నిరత = ఆసక్తిని కలవారిచే;
అసృఙ్మేదుర – అసృక్+మేదుర = రక్తముచే సాంద్రస్నిగ్ధమైన (దట్టమైన నిగ్గు కలిగియున్న);
కదన = యుద్ధమునందు వలె;
భయవిశేష+ఆవహ = గగ్గోలు పుట్టించుటను కలిగిన;
దుర్దృఙ్మాత్ర – దుర్దృక్+మాత్ర = చెడుచూపును మాత్రమే కలిగినవారి (సహృదయులు కానివారి);
ఘనవిపత్కర – ఘన = విశేషముగా ఆపదను కూర్చు
(అనగా పాఠకులకు అహితమును కలిగించు);
వాఙ్మయమునన్ = రచనావళి యందు;
ఉన్నది+ఎల్ల = నిక్షిప్తమైనది అంతయును;
వ్యర్థము సుమ్మీ = నిష్ప్రయోజనమైనది సుమా!
రసజ్ఞత లోపించినందువల్ల ఇతరుల రచనలోని మంచిని గుర్తింపలేక నిష్కారణముగా వాదవివాదములకు పూనుకొని, సాహిత్యరంగమును ఆనంద పర్యవసాయిగా రూపొందింపక రక్తసిక్తమై భయావహమైన యుద్ధరంగములో వలె పరస్పరబాధావహముగా పరిణమింపజేయు దురాలోచనపరుల వాఙ్మయమంతయును నిరర్థకము కదా! అని తాత్పర్యం.
దుష్కరమైన ప్రాసను నిర్వహిస్తూనే ఇంత సందేశాత్మకమైన మనోజ్ఞపద్యాన్ని చెప్పిన మాన్యులు శ్రీ శంకరయ్య గారికి సాధువాదం! అభినందన!!"
క. అసదృశ పదగుంభనమున
కుసుమించిన కందపద్య కోమలి మదిలో
విషయము తెలియఁగఁ జెప్పిన
యసమానులు మురళి. సూనృతాములు, మహితుల్.
శ్రీమాన్ కంది కవిగ్రామణికి,
సన్నుత హృదయులు శ్రీమాన్ మురళీధరులకు నా అభినందనలు.
జైహింద్.
2 comments:
నమస్కారములు
అందరికీ అభినందన మందారములు
చింతా వారూ,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.