గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2017, సోమవారం

శ్రీ రావణ శర్మ గారు నిన్నను మా యింటికి రాగా వారికి నేను సమర్పించిన అభినందన ఉత్పల మాల.

జైశ్రీరామ్.
ఆర్యులారా! "మీలో ఎవరు కోటీశ్వరుడు ? " టీ.వీ. షో లో 25 లక్షలు గెలిచిన జ్ఞాని,రచయిత
శ్రీ రావణ శర్మ గారు మొన్నను మా యింటికి రాగా వారికి నేను సమర్పించిన 
అభినందన ఉత్పల మాల.
శ్రీ రావణ శర్మ గారు.
శ్రీరస్తు       శుభమస్తు       అవిఘ్నమస్తు.
శ్రీ రావణ శర్మ గారికి అభినందన ఉత్పల మాల.
చింతా రామకృష్ణా రావు. తే. ౧౦ ౬ ౨౦౧౭.
శా. శ్రీకల్యాణ నయాన్వయా! శుభద! రాశీభూత చేతోనిధీ!
మీకై వేచితిమయ్య! స్వాగతమయా! మిత్రస్వభావాక్షరా!
మీకున్ మేలగు రావణా! సుభములే మిమ్మంటి వచ్చున్ గదా!
సాకారంబయె మాదు కోరిక భువిన్! సౌమ్యుండ మీ రాకచే.
ఉ. నూటికి నూరు పాళ్ళునుననూన సలక్షన పండితుండు, తా
దీటుగ ప్రశ్నలన్నిటికి తీరుగ రావణ శర్మ చెప్పగా
కోటి యొసంగ నేఱమిని కుత్సిత నిర్వహణాధికారు లే
ర్పాటును చేసిరాతనికి పాతిక లక్షలనిచ్చిరద్దిరా!
ఉత్పల మాలిక.
రావణ బ్రహ్మయే మహిత రావణ శర్మగ పృథ్వి నేడు తా
ధీవరులన్ గ్రహించుచునుదీనుల నెంచుచు కాచుచుంట
ద్భావ రమా ప్రపూర్ణులను దక్షతతో ప్రభవింపఁ జేయుటన్,
జీవనభాగ్య మిద్దనుచు చేరువయై కృపతోఁడ దీనులన్
కావగ దానశీలుఁడయి కల్గినదంత యొసంగుచుంటసం
భావనచేత సాధుజన వందితుఁడౌటయు,మేలు కూర్చుటన్,
దేవుఁడు కూడ సిగ్గిలగ దీనదయా గుణ పూర్ణుడౌటయున్
చేవను చూపి లోకమున శ్రీగుణ వర్ధన్ చేయ బూనుటన్,
శ్రీ వరణీయ చేతన సమృద్ధిని వెల్గుటవెల్గఁ జేయుటన్,
మా వరదాత నీవ యన మన్నికతో నిల వెల్గుచుండుటన్,
భావి తరాల వారికి ప్రవర్తన మార్గము చూపి వెల్గుటన్,
సేవక సేవితుల్ మదుల చిత్ప్రభదొక్కటె యంచు నేర్పుటన్,బ్
మోవిననంతమౌ హసనపూర్ణ సుచంద్రిక వెల్వరించుటన్,
నావగ మంచిక్రేవకును నల్గురినిన్ భరియించి చేర్చుటన్,
ధీవరుఁడై వెలుంగుటయు తీరుగ చేసి మహాత్ముఁడన్న సద్
భావన లోకమంతటను వర్ధిలఁ జేయఁగ కీర్తి పొందగా
నీవిధి పుట్టియుండు. మహనీయుఁడు రావణుఁడంచు వెల్గగన్.
జీవన సత్యమీవె, సహజీవన ధర్మ ప్రకాశమీవె,  సం
భావన చేయు పద్ధతిని చక్కని సాక్షివి నీవె, నీదు సం
సేవన చేయు వారలు ప్రసిద్ధిని గాంతురు. సత్యమిద్ది, మా
రావణ శర్మయే మనిషి,. రండు గ్రహింపుడటంచు చూపె నీ
ధీవరుఁడైన శాస్త్రి నిను. దివ్యుఁడ! రావణ శర్మ! ధన్యుఁడన్
నీ వలనన్ మహిన్ వెలుగు నే పొడ గాంతు నవజ్ఞ బాసి. సం
జీవనివై వెలుంగులిడు జీవులకున్ మహనీయ తత్వభా!
మంగళమ్.         మహత్       శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.