గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2013, మంగళవారం

శ్రీమదధ్యాత్మ రామాయణ ప్రశంస - హరి వెంకట సత్యనారయణ మూర్తి

జైశ్రీరామ్.

శ్రీ మధ్యాత్మ రామాయణ ప్రశంస

శ్రీమత్పండిత రామజోగి గురునిన్ శ్రీరామ భక్తాగ్రణిన్
నేమాన్యన్వయ జాతునిన్ బుధవరున్ నిష్ఠాగరిష్థున్ కవిన్
శ్రీమద్రామ కథామృతంబు భువిపై చిందించు పుణ్యాత్మునిన్
ధీమంతున్ కొనియాడెదన్ మునినిభున్ తేజోవిశేషాన్వితున్ 

బమ్మెర పోతరాజు మన భాగ్యవశాన మరొక్కమారు తా
నిమ్మహి నాంధ్రదేశమున నీవిధి దాశరథీ కథాసుధల్
కమ్మని పద్యరత్నములుగా రచియించగ రామజోగి జ
న్మమ్మును పొందె నౌర! యనుమానమొకింతయు లేదు చూడగన్

ఒక్కటి రెండు కాదు చవులూరెడు ఛందము లెందు జూచినన్
పెక్కులు నిండియున్నయవి విస్తృతరీతిని గ్రంథమంతటన్
చక్కని పద్యమాలికలు సాగిన వెంతయు హర్షదంబులై
యక్కట! ధన్యుడీ సుకవి, యందును శ్రీ రఘురాము సత్కృపన్ 

ప్రతి పద్యము మధురంబై
యతులితమైనట్టి మహిమ లందుటచే పం
డితవర్యా! మీ కావ్యము
క్షితి జదివెడి వారి కొసగు చిత్సౌఖ్యంబుల్

నానాసద్గుణ భాసితంబగు విధిన్ నవ్య ప్రబంధంబుగా
దీనిన్ వ్రాసితి రార్యసన్నుత! మహద్దీక్షా నిమగ్నాత్ములై
యానందప్రదమై వెలుంగు సతతం బధ్యాత్మరామాయణం
బో నేమాని కవీశ్వరా! గురువరా! యుర్విన్ సదారాధ్యమై

ఇట్లు
హరి వెంకట సత్యనారయణ మూర్తి
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కార ములు
అవధాన సరస్వతులు శ్రీ పండిత నేమాని వారి రామాయణ గ్రంధము సుమధుర రసామృతము.నేను వారి స్వహస్తముల మీదుగా పొంద గలిగిన అదృష్ట వంతురాలిని .ధన్యోస్మి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.