గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2013, సోమవారం

శ్రీ పెద్దింటి వరాహ నరసింహాచార్యులు ఇక మనకు లేరు.

ఓం నమశ్శివాయ.
ఆర్యులారా! చలన చిత్రములు ప్రభవించిన తొలి రోజులలో లవ-కుశ చలన చిత్రము(మాటలు లేని చిత్రము)లో నారద పాత్ర ధారులగు శ్రీ పెద్దింటి వరాహ నరసింహాచార్యుల వారు సామాజికులకందరికీ ఆదర్శమైన వ్యక్తి యని చెప్పుట అత్యుక్తి కానేరదు. వీరు ఆనాడు సంస్క్య్తాంధ్రములను గురువుల వద్ద నేర్చుకొనుటతో పాటు సంగీతము, నాట్యము, శిల్పము, చిత్ర లేఖనము మున్నగు విద్యలలో అందివేసిన చేయి కలవారు.వాస్తు, జ్యోతిష్యము పౌరోహిత్యము దేవతార్చన మున్నగు విద్యల విషయములో ఇక చెప్పనక్కరే లేదు.
వీరు గొప్ప కవిగా-వక్తగా-శిల్పిగా-చిత్రకారుడుగా-జ్యోతొశ్శాస్త్ర వేత్తగా-సంగీతగురువుగా-నటుడుగా-తెలుగు పాఠ్యాంశ బోధకునిగా-అతి సామాన్య నిరాడంబర జీవిగా-అన్ని రంగములందునూ ప్రతిభా పాటవములను కనపరచు వ్యక్తిగా మంచి పేరుప్రతిష్ఠలున్నవారు.
విశాఖపట్టణము జిల్లా యలమంచిలి తాలూకా, మామిడివాడ గ్రామమున అతి సామాన్య నిరాడంబర కుటుంబ జీవనము సాగించు వీరియెడ అందరికీ ఆదర భావముకలదు. ఈ మహనీయుడు చిన్నతనము నుండియునిన్న మొన్నటి వరకూ కూడా ఐదు కిలోమీటర్ల దూరమున కల యలమంచిలి గ్రామానికి సైకిలు త్రొక్కుకొనుచూ పోయెడివారు.వీరు సైకిలుపై  ఎక్కడికైనా వెళ్ళుట చూచినవారె ఎవరైనా తమ కారులో రమ్మని కోరినా, లేదా తమ మోటర్ సైకిల్ పై రమ్మని కోరినా తన ఆనందం వ్యక్తము చేయుచునే సున్నితముగా తిరస్కరించేవారు. ఏనాడూ అనారోగ్యమన్నదే అతడెరుగకపోవుట అచ్చటి ప్రజానీకమునకు విడ్డూరముగా తోచుట నిజము.ఇప్పటికి వారి వయస్సు తొంబది ఐదేళ్ళు.
ఈ మహనీయుడే నాకు ఆదర్శముగా నిలిచి, నేను నేటికినీ సైకిలుపైననే అనువైనంత దూరము ప్రయాణము చేయుచుండుటకు కారణము. నన్ను చూచి అనేకమంది డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా ఈ సైకిల్ ప్రయాణమును ఆదర్శముగా తీసుకొనుట నాకు మహదానందదాయకము.
అట్టి ఈ మహనీయుడును, నేనును దిమిలి గ్రామమున శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో కలిసి కొంత కాలము పనిచేశాము.ఆ రోజులలో నా కవితావైశిష్ట్యమును కొనియాడుచూ నాకు మంచి కవితాసక్తిని పెంపొందించుటలో ముఖ్యపాత్ర వహించిరని కృతజ్ఞతా పూర్వకముగా తెలుపుకొను చున్నాను.
అత్తి మహనీయుడు నేటి మధ్యాహ్నము గం.3.00కు శ్రీ కైవల్యమునందినారను కఠినాతికఠినమైన వార్త నా మనసును కలచి వేస్సినది.
వీరు రచించిన అమృత బిందువులు గ్రంథము మానవునకు జీవన సత్యములను సుమారు రెండు వేలు పొందుపరచి లోకమునకు అందించిరి.
ఈ మహనీయుని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా ఆ పరమాత్మను ప్రార్థించుచూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపమును తెలియ జేయుచున్నాను.
వీరి అమృత బిందువులను అతి త్వరలో ధారా వాహికగా మీకందించే ప్రయత్నము చేయ గలను.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.