గంగపాలైన మనవారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా కోరుకొందాం.
పరవశమంది దైవమును భక్తిఁగ కొల్వఁగ నేగి, శ్రీమహే
శ్వరుని పవిత్ర భూమిఁ గని భక్తిఁగ దర్శన పారవశ్యులై
తిరుగుచు నుండగా జలధి దీర్ఘ హిమాద్రి కడంగి వచ్చిన
ట్లురకలు వేసి గంగ తన యుద్ధృతి నెల్లర గొంచు పర్విడెన్.
ఉరుకుచు వచ్చు గంగఁ గని ఊరు జనంబులు, భక్త కోటియున్
హర హర శంకరా! కను మహాప్రళయంబటు వచ్చి గంగ యం
దరినిస్పృశించి లాగుకొని దర్పిలి చంపుచు నుండె. మేము సుం
దరుఁడవు నిన్ను చూడగను తప్పక వచ్చితి మయ్య. కావుమా!
అని తమ గోడు చెప్పుచు, మహా ప్రళయంబటు వచ్చు గంగచే
కొనబడు వారు కొందరును, ఘోర విపత్తు నధిక్రమింపగా
వనములవైపు పర్విడుచు బాధల నొందెడి వారు కొందరున్.
క్షణములలోన సర్వమును గంగ గ్రహింపగ నేడ్చు కొందరున్.
ఆకాశంబున చిల్లు పడ్డయటులే యత్యంత వేగంబుగా
నేకంబౌనటు భూనభంబు లకటా!ఎన్నంగ రానట్టి ఈ
లోకుల్ గానని వాన వచ్చె నిట ముల్లోకంబులున్ భీతిలన్
నీకున్ బట్టదొ? పార్వతీశ! మము మున్నీటన్ మునింగింతువా?
గట్టుకు పుట్ట కొక్కరుగ కాలయమున్ గని పర్వుతీసినా
రెట్టులనైన బాంధవుల నెల్లరి గూడగ నెంచి భీతితో
జుట్టిన గంగ కందక వసుంధరపై బ్రతుకంగ నాశతో.
పట్టును వీడి కొందరు శవంబులుగానయిరయ్య. శంకరా!
నిన్ను గనంగ వచ్చుతరి నీటను ముంచుట న్యాయమా శివా?
మున్నెపుడైన యిట్టి జడుపున్ గలిగించితొ? జాలి లేదొకో?
మన్ననతోడ భక్తుల సమాదరణంబున కాచు నీవె యీ
మిన్నగు దుఃఖహేతువయి మింటికి భక్తుల చేర్చ నెంచితే?
అమ్మయె చంపగ నెంచిన
నిమ్మనుజులఁ గావ నింక నెవ్వరు కలుగున్?
మమ్ముం గొనిపోదువె గం
గమ్మా? కృప లేదటమ్మ? కాతు రెవరికన్?
అని ప్రార్థిస్తూ, చేసేది లేక
బంధువులు మమ్మల్ని మన్నించండి. మమ్మల్ని గంగమ్మ గొనొపోతోంది. మీతో చెప్పకుండానే పోతున్నందుకు మన్నించ్చండి.
అని దుఃఖిస్తూ గంగపాలైన మనవారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా కోరుకొందాం.
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః.
1 comments:
గంగా దేవి ఆగ్రహానికి గురియైన వారిపై చింతా వారి పద్యాలు గుండెల్ని పిండు తున్నాయి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.