గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మే 2009, బుధవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 81 నుండి 85 }

ఉ:-
మంచిని చేయగా దలచి, మానవ జాతిని సృష్టిఁ జేసి, మా
వంచన భావముల్ కనవు వర్ధిలఁ జేయఁగఁ గోరు చుండి. మా
సంచిత పుణ్య మట్లు మముఁ జక్కగ జూచుచు బ్రోచునట్టి ని
న్నుంచెదమయ్య మా మదుల నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 81

చ:-
పశులకు, మానవాళికిని భౌతిక భేద మెఱుంగు మానవుల్
పశువులు, పక్షులున్, మరియు పాముల వోలె చరించు టొప్పునో?
నిశిత విచక్షణంబు, మహనీయతఁ గల్గి చరించు టొప్పునో?
దిశను గ్రహింపఁ జేయుమయ దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 82

ఉ:-
అంబ భవాని సత్ కృపల నందగ దీక్ష వహితు రెందరో.
అంబకు మారు రూపమగు నంగనలన్ గని దుష్టకాముకుల్

సంబర మొప్ప, వెంట పడి, చాల కలంచ భరించ లేక యా
యంబ శపించు. లేదు పరిహారము. శ్రీ షిరిడీశ దేవరా! 83


ఉ:-
బంగరు మేడ లుండ నగు. భాగ్య నిధానము లుండగా నగున్.
రంగుల జీవనమ్ము నలరారగ నౌను. రహింప వచ్చు. తా
నింగిత మించుకేని విడ, నెవ్వని కైన క్షయంబు నిక్కమౌ
నింగిత మిచ్చి బ్రోవుమయ! యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 84

ఉ:-
ఎందరు బంధువుల్ కలుగ రిందరిలో నిట నొక్కడైన నీ
బంధము, నాత్మ తత్వమున, ప్రార్థన చేయు క్రమంబుఁ దెల్పిరే!
ఎందుల కయ్య! బంధు జను లెవ్వరు వత్తురు పోవు నాడు. నీ
సుందర రూపు ముక్తి నిడు చూచిన. శ్రీ షిరిడీశ దేవరా! 85

జైహింద్. Print this post

1 comments:

కొత్త పాళీ చెప్పారు...

ఎందరు బంధువుల్ కలుగ రిందరిలో నిట నొక్కడైన నీ
బంధము, నాత్మ తత్వమున, ప్రార్థన చేయు క్రమంబుఁ దెల్పిరే!

So true!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.