గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2009, శనివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 26 నుండి ౩౦ }

ఉ:-
శ్రీ శుభ దాయి సాయి. మన క్షేమముఁ గాంచుచునుండు సాయి. యా
వేశముఁ బాపు సాయి. సుమ పేశల మానసమిచ్చు సాయి. మా
యాశలు తీర్చు సాయి. సుమహార్ణవ జీవన మీదఁ జేయు లో
కేశుడె సాయి యండ్రు నిను నీశ్వర. శ్రీ షిరిడీశ దేవరా! 26

చ:-
గురువన సాయి యొక్కడగు. కూర్మిని బోధలు సేయు సాయి స
ద్గురువు, నిజంబు. కూటికిని గుడ్డకు జీవన మార్గ మెన్ని, స
ద్గురువుల మంచు, బోధనలు కోరుచుఁ జేయు గురున్ గురుండనన్
కరరుహమున్ ఘనంబనుట కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 27
ఉ:-
బాల్యము నందు నిన్ గొలుచు భాగ్యము శూన్యము జ్ఞాన హీనతన్.
బాల్యము దాటి పోవు తఱిఁ బాశవికత్వము క్రమ్ము మమ్ము. సౌ
శీల్యము నీ వొసంగిన సు శీలురమై నినుఁ జేరవచ్చు. దౌ
ర్బల్యముఁ బాపి, ప్రోవుమయ! రక్షక! శ్రీ షిరిడీశ దేవరా! 28

ఉ:-
భౌతిక మైన వాంఛ లెడఁ బాయక, నామది నిండె నయ్య! సం
ప్రీతిని పొంద దీ మనసు పేలవ చిత్త ప్రవృత్తిఁ గల్గి, య
జ్ఞాత భవాంధకారమును కానగ నేర దదెంత చిత్రమో!
ఏతఱి నన్నుఁ గాచెదవొ? యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 29

ఉ:-
నిశ్చల భక్తి భావమున నిన్ను భజింపగ వేడుకొంటి. నీ
నిశ్చయ మేమిటో యెఱుగ. నిర్దయతో పలు దుష్ట చింతనల్
దుశ్చరితంబుఁ గొల్పి, నను దుష్టుగఁ జేసితి వీవ. యింక నా
నిశ్చిత భావ మిచ్చి, నిలు నీడగ. శ్రీ షిరిడీశ దేవరా! 30 Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.