గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2009, సోమవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 46 నుండి 50 }

ఉ:-
మంచిని మాత్రమే పెనిచి, మారుగ చెడ్డను పెంచకున్న నీ
వంచనలేమియున్ భువిని వర్ధిల వంచు భ్రమించినాడవో?
మంచిని పెంచుమా కృపను. మా యెదలో చెడు త్రుంచు మయ్య! మ
మ్ముంచుము మంచి వారి మది నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 46

ఉ:-
భారత మాత రక్షణము భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,
ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే
కారణ భూతు లయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ
వారికి శక్తి నీయుమయ భవ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 47

ఉ:-
లక్ష్యముఁ గల్గి చేయ, మన లక్ష్యము సత్ ఫల మందఁ జేయు. నిర్
లక్ష్యము దుష్ఫలంబొసగు. లక్ష్యమె నీవయి యున్న నాడు , దుర్
లక్ష్యము లేక సత్ ఫలములన్ గన నౌను. నిజంబు. మాకు స
ల్లక్ష్యముఁ గొల్పి బ్రోవుమయ రమ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 48

ఉ:-
పుట్టుకతోనె జీవులకు పూర్వ సమార్జిత పుణ్య పాపముల్
పుట్టుకు వచ్చునేమొ! పరి పూర్ణ వివేకము తోడఁ గొందరున్,
నెట్టన దుష్ట చింతనము నిండి వసించుచు నుండ్రు కొందరున్.
పట్టుగ పాప పంకిలముఁ బాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 49

చ:-
సుగుణ సుమాల సౌరభము సూనృత వాక్కులఁ గొల్పఁ గోర్కె. ని
న్నగణిత భక్తి తత్పరత నందరుఁ గొల్వఁగ జేయఁ గోర్కె. యీ
జగము ననంత దౌష్ట్యములు చాలగ నన్ను వహించి వ్రేచు. నా
దిగులును బాపి కోర్కెలను తేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 50

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.