గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2009, సోమవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 56 నుండి 60 }

ఉ:-
భారతి, నాది దేవత భవానిని, శ్రీ సతి నమ్మ లండ్రు యీ
భారత భూమిపై. తమ ప్రభావముఁ జూపెడి స్ర్తీల నమ్మగా
చేరి భజింప రేల? తమ చేష్టల బాధలఁ గొల్ప నేలనో?
వారి మనంబు మార్చుమయ! భవ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 56

చ:-
అహ రహమున్ శ్రమించి, కడు హాయి నొసంగెడి స్తీలు జాతికిన్
నిహిత విశేష లబ్ధ మహనీయ సుధాంబుధులయ్య!  మాతగా,
సహచర మూర్తిగా, సుతగ, సన్నుత సోదరిగా మెలంగు. నీ
మహిమను స్త్రీలఁ గావుమయ! మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 57

చ:-
ధర నవమాన భారము లతా కుతలంబొనరింపఁ గృంగి, యే
తెరువు నెఱుంగ లేక, సుదతీ మణు లెందరొ భార తావనిన్
పరితప మొందుచున్ తమదు ప్రాణములన్ విడుచుండ్రి. స్త్రీల నీ
ధర నిక గావు మయ్య పరితప్తుల! శ్రీ షిరిడీశ దేవరా! 58

చ:-
మగ సిరిఁ గల్గి యుండుటయె మానిత మంచు దలంచి, మూర్ఖులై
పగఁ గొని నట్లు భార్యలను, పాప మెఱుంగని పంకజాక్షులన్
వగవఁగ హింస వెట్టు కుల పాంసను లేలఁ జనింతు రిద్ధరన్?
మగువల పాలి దుష్టులను మాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 59

చ:-
మగువలఁ గాంచి, మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్నిశిఖ పాలొనరింపు, ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృ జనంబిక మృగ్య మౌను. నీ
తెగువను జూపి, బ్రోవుమయ తీరుగ! శ్రీ షిరిడీశ దేవరా! 60

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.