గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2009, శనివారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 14

కవి సమ్రాట్ విశ్వనాథ కల్పవృక్షములో గల బావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వెలువరించిన 14వ పద్యమునకు సంబంధించిన విషయమును ఇప్పుడు చూద్దాం.

విశ్వనాథ పరమ భావుకుడైన మహా కవి. మహా కవుల వాక్కులలో దాగిన చమత్కార బంధురత తనకు తానే స్వయం ప్రకాశక మవుతుంది.
విభావకో భావిత వస్తు వర్ణనః ప్రభుః పురాణాగమ శాస్త్రదృక్ కవిః.
ప్రశస్తోజ్వల వాక్ ప్రయోగ విత్ ప్రమోద మాప్నోతి పరత్రేహచ.

విశేష భావనా శక్తి కలవాడు వస్తు వర్ణనల యందు నేర్పరి, పురాణ శాస్త్ర దృష్టి కల వాడు, రసోచితమైన రచనా ప్రయోగము తెలిసిన వాడు, అగు కవి యిహ పర లోకాఅనందము పొందును అని ఆలంకారికులు మహా కవుల లక్షణాలను తెలిపిరి.

ప్రశస్త ఉజ్వల వాక్కును ప్రయోగ నైపుణి విశ్వనాథ రచన యందు మనము అంతటా చూడ గలము.

పంపా తీరమున పయనించు చున్న శ్రీ రామునకు ఆ సరోవరముపై కనుపించిన ప్రకృతి దృశ్యము ఇట్లున్నది.
పంపా సరస్సు నీలి జలములతో ఆకాశము వలెనున్నది. అందున్న వికసించిన తెల్ల తామరలు నక్షత్రముల వలె ప్రకాశించు చున్నవట. ఉన్నట్లుండి ఒక తెల్లని చేప పిల్ల నీటి నుండి పై కెగిరినది. ఎప్పటి నుండి కాచుకొని యున్నదో ఒక కాకి ఆ చేపను తన్నుకొని పోయినది. ఇంత లోనే ఒక డేగ బాణము వలె దూసుకు వచ్చినది. కాని ఆ కాకి డేగను తప్పించుకొని పోయినది.

ఇది ఒక క్షణ కాలములో జరిగిన సంఘటన రాముని మనస్సును సీతాపహరణ ఘట్టము నకు తీసుకొని పోయినది.

ఉ:-
కాశ సితాంబుజంబు లనగా జను తారల పంప నీటి ఆ
కాశము మీద పాద హతిగా సిత మత్స్యమటన్న సీత కా
కాశరు డిట్లె తన్నుకొని యక్కట యేగెను డేగ యొక్క డా
హా! శరమట్లు వచ్చినను నాగక తప్పుక పోయె కాకమున్. {రా. క. వృ. కి.నూ.కాం. 14}

సిత మత్స్యము వంటిది సీత. కాకాశరుడు పద ప్రయోగము వలన రావణాసురుని స్ఫురణము. డేగ వచ్చినను రివ్వున బాణములా వచ్చినను కాకి తప్పించు కొనుట జటాయువు సీతా రక్షణార్థము చేసిన విఫల యత్నము స్ఫురింప జేయును.
ఈ మత్స్యాపహరణ దృశ్యము కన్నుల ముందు సీతాపహరణ జరుగు చున్నంత బాధను కలుగ చేసినది శ్రీ రామునకు.

శ్రీ రాముని యందు సీతా విరహమును కవి రెండు విధములుగ నిరూపించును. ఒకటి శ్రీరాముడు తాను చూచిన దృశ్యములందు తన పరితాపమునకు సాదృశ్యముగా గాంచుట. రెండు శ్రీరాముడే సీతా విరహమును గూర్చి లక్ష్మణునితో పలుకుట. ఇంత వరకు కవి ప్రకృతి ద్వారా రాముని విరహమును పాఠకులకు తెలిపినాడు.

ఒక సంఘటన లేదా దృశ్యము మనసు పొరలలోని అనేక భావ వికారములను బయట పెట్టును. సంతోషమో దుఃఖమో అనుభవించెడి మానవుడు లోకములో తనకు సాదృశ్యమును వెదకి కొనును. సర్వః కాంత మాత్మీయం పశ్యతి. అనినాడు కాళిదాసు. విశ్వనాథ వ్యంగ్యార్థ స్ఫోరకముగా రచించిన ఈ ఘట్టము ఆంధ్ర సాహిత్యము లోనే అపురూపమైనది.
ఈ పద్యమున స్మరణాలంకారము కలదు.సాదృశ్య జ్ఞానముచే ఉద్భవమైన సంస్కారమును కలిగించు స్మరణయే స్మరణాలంకారము.

చూచాం కదండి. మరొక పర్యాయం మరొక పద్యం గురించి తెలుసుకొందాం.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.