గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2009, మంగళవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 76 నుండి 80 }

ఉ:-
లోక మనంత మయ్య! భువి లోకమునందొక భాగమయ్య! మా
లోకము నీవె నయ్య! మము లోకువచే విడఁబోకుమయ్య! మా
లో కనువిప్పుఁ గొల్పుమయ! లుబ్ధ గుణం బెడఁ బాపు మయ్య! నీ
లోకముఁ జేర్చు మయ్య! వర లోచన! శ్రీ షిరిడీశ దేవరా! 76

ఉ:-
బంగరు భాగ్య సీమ లిడి, పాడియుఁ బంటయుఁ గొల్పి నాడ, వే
బెంగలు లేక తేజరిలె ప్రీతిగ జాతి యొకప్పు డిప్పుడో?
హంగుల కాశ చెంది, భువి హాలికు లమ్మిరి భాగ్య సీమలన్.
మ్రింగఁగ ముద్దదెట్లొదవు మేదిని? శ్రీ షిరిడీశ దేవరా! 77

ఉ:-
హారము లుండ వచ్చు. గుణ హారమునన్ వెలుగొంద వచ్చు. నా
హారము లేక జీవనము హాయిగ సాగదు. పంట భూములన్
బేరము వెట్టి యమ్ముటను పెల్లగు నాకలి కేక. కావుమా
హారము నిచ్చు భూములను హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 78

చ:-
ధరణి నమోఘ మూలికలు తన్మయతన్ బ్రభవింపఁ జేసి, యా
వరణము శోభఁ గొల్పి, మము వర్ధిలఁ జేయఁ దలంచి నావుగా!
పరశువు పట్టి త్రుంచుటను పాడయిపోయె వనంబు లన్ని. నీ
వరయుచుఁ గావ వేమి? పరమాత్ముడ! శ్రీ షిరిడీశ దేవరా! 79

ఉ:-
వృక్షము లాది దేవతలు. వృద్ధి యొనర్చును జీవ కోటి. పల్
పక్షుల కాకరంబు. తమ స్వార్థముతో పెకలించు వారికిన్
జక్షు వినాశనం బగును. సద్గుణ వర్ధన! కొల్పుమయ్య మా
కక్షయమైన జ్ఞానము, గుణాంభుధి! శ్రీ షిరిడీశ దేవరా! 80

జైహింద్. Print this post

1 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

మీరు మీ బ్లాగు హెడర్ లో పెట్టిన "గణనీయంబగు..." అనే పద్యం "...ఆంధ్రామృతం గ్రోలుడీ !" అని వ్యావహారికంగా ముగుస్తోంది. పద్యమంతా గ్రాంథికమై ఆ కొసరు మాత్రం వ్యావహారికం కావడం శోభించదు.

"...ఆంధ్రామృతంబానుడీ !" (ఆంధ్రామృతంబు + ఆనుడీ) అంటే బావుంటుందేమో యోచించగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.