ఉ:-
స్త్రీల స్వభావ సిద్ధమగు శీల మహా ధన రక్షణంబు నే
డేల నశించి పోయె? కనవేల మదోన్మద దుష్ప్రవర్తనల్?
శీలము చేలమున్ మహిళ సిగ్గును వీడి త్యజించుటేలనో?
శీలముఁగొల్పి కావుమయ స్త్రీలను. శ్రీ షిరిడీశ దేవరా! 41
చ:-
యువకులు కొందరీ భువిని యుక్తి కుయుక్తుల బుద్ధి నేర్పునన్
భవితను భారతావనికి పన్నుగ నాశన మొందఁ జేయఁ గా,
నవిరళ దుష్ట చేష్టలను హాయిగఁ జేయుచు నుండ్రి , జూచితే?
భువి కిక రక్ష నీవె కద! పూజ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 42
ఉ:-
మంచిది చూచి మానవులు మంగళ కార్యము లాచరింతురే!
సంచిత పాప కర్మ ఫల సంపదలే వెను వెంట నుండ నీ
మంచిది మంచిఁ జేయునె? సమంచిత చిత్తులు నిన్నె మంచిగా
నెంచుచు మంగళంబుఁ గన నెంచరె? శ్రీ షిరిడీశ దేవరా! 43
ఉ:-
ఏది సతం బనిత్య మన నేది? నిజంబన నేది? కానగా
నేది యబద్ధమౌను? కన నేది గుణం బగునయ్య? నిర్గుణం
బేది? ప్రకాశ మేది? వల పేది? కనుంగొన నిక్కమేది? యీ
పేదకు నీవె చూపుమయ వేద్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 44
ఉ:-
ఎందుకు మంచి మార్గముల నెంపికతో రచియింపకుండ, మా
ముందున చెడ్డ మార్గములు ముచ్చటతో రచియించినాడ, వి
బ్బందులు గొల్పి, నిన్ గొలువ, వర్ధిలఁ జేయఁ దలంచినావొ? యా
నందమె యెందు కీయవయ? నన్ గను శ్రీ షిరిడీశ దేవరా! 45
జైహింద్.
Print this post
Sree Bhagavatula Somannaa ZPHighSchool, Golden jubilee celebrations of
1974-75 SSC Batch, Dimili village.
-
జైశ్రీరామ్.
జైహింద్.
2 గంటల క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.