గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2009, గురువారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 101 నుండి 108 }

ఉ:-
కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం
తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీ ధర. రామ కృష్ణుడన్.
నిన్వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ " పే
రన్విరచించి తీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా! 101

ఉ:-
ముత్యము రామ మూర్తి కడు ముచ్చటతో ననుఁ గోరినారు " నే
మృత్యువు నొందు లోపలనె మీ రొక గ్రంథము వ్రాయు " డంచు. నౌ
న్నత్యముఁ గొల్పు కోరికను నా మది నుంచి రచించి నాడ, నీ
స్తుత్యత నొప్పు పద్యములు శోభిల. శ్రీ షిరిడీశ దేవరా! 102

ఉ:-
ఆర్యులు. కల్వపూడి వినయాన్విత వేంకట వీర రాఘవా
చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా
వీర్యుడ! నీ కృపామృతముఁ బ్రీతిగ నీ శతకంబు లోన నే
నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 103

ఉ:-
శ్రీ షిరిడీశ దేవ కృపఁ జెన్నుగ నీ శతకంబు వ్రాయగా
నా షిరిడీశ భక్తులు మహాద్భుత భక్తిఁ బఠించు చుంద్రు గా
దే! సిరి సంపదల్ గొలిపి, తేజముఁ గొల్పుము దేవ దేవ! నిన్
శ్రీ షిరిడీశ! యన్నఁ దరి జేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 104

ఉ:-
ఎంతగ నేర్చినన్, గుణము లెన్నిక నెన్నిటినైనఁ గూర్చినన్
సంతస మందఁ జేయవుగ సద్గుణు లెంచి, పఠించు వేళ ర
వ్వంతయు దోషమున్న. బుధు లందరి మన్నన లందు నట్లుగా
చెంతను చేరి చేయుమయ . శ్రీకర! శ్రీ షిరిడీశ దేవరా! 105

ఉ:-

వ్రాసితి భక్తి భావమున. వ్రాసితి నే కనుగొన్న వన్నియున్.
వ్రాసితి నీ కృపా గరిమ. వ్రాతలలో గుణ మెంచుచున్ గృపన్
దోషము లున్న వీడి, పరి తోషము, సత్ ఫల మందఁ జేయుమా!
నీ సరి దైవ మింకఁ గన నేరను. శ్రీ షిరిడీశ దేవరా! 106


చ:-
కరుణ రసామృతాబ్ధి ననుఁ గాంచిన వేంకట రత్న మమ్మకున్,
వెరవరి తండ్రిగారయిన వేంకట సన్యసి రామ రావుకున్
చరణములంటి మ్రొక్కెదను. చక్కగ నీ శతకంబు వ్రాసి, యా
గురువుల వాంఛ తీర్చితిని. కోమల! శ్రీ షిరిడీశ దేవరా! 107

ఉ:-
మంగళ హారతిన్ గొని, యమంగళముల్ తొలగించి, నీదు సన్
మంగళ రూప దర్శనము మానవ కోటికిఁ గల్గఁ జేసి, యే
బెంగలు లేక, నిన్ మదిని ప్రేమగ నిత్యముఁ గొల్వఁ జేయు మో
మంగళ రూప! మంగళము మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 108

మంగళం మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

ప్రియ సాహితీ బంధువులారా! మీ అందరి ఆదరాభిమానాలకు పాత్రమైన మన ఆంధ్రామృతం బ్లాగు నందు నేను రచించిన శ్రీ షిరిడీశ దేవ శతకమును మీరెల్లరు దయతో పఠించి, అక్షర, వ్యాకరణ, ఛందో దోషాదులు మీదృష్టిలోనికొచ్చినవి చెప్పుటతో పాటు మెఱుగులు దిద్దేందుకు మీ మనసున తోచే విషయాల్ని కూడా తెలియఁ జేయ గలందులకు వినమ్రతతో ప్రార్థిస్తున్నాను.
జైహింద్. Print this post

1 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

సుందర మైన మీ శతక సుందరి శ్రీ షిరిడీశునిన్ సదా
మందిర సేవితై ఁగొలిచి మానస రాణిగ సాయినాధునిన్
బంధన ఁజేసి సర్వజన బాధలు ఁదీర్చగ కోరి, కృష్ణులై
విందుగ సాయికిన్ శతక విందునొసంగిరి, పుణ్య మూర్తులై.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.