గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2009, మంగళవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 71 నుండి 75 }

ఉ:-
పావనమైన జన్మ మిది. భక్తి ప్రపత్తులు గల్గి దైవమున్
భావన నైనఁ గానము. స్వభావమొ? పాప ఫలంబొ? దుష్టమౌ
భావనలే స్పృశించు మది. భాగ్య విహీనుడ. భక్తి హీనుడన్.
దేవుడ! కావుమయ్య! ప్రణుతింతును. శ్రీ షిరిడీశ దేవరా! 71

చ:-
అరుదగు రూపుఁ దాల్చి, పురుషాకృతితో మముఁ బ్రోవ నెంచి, నీ
కరుణను జూపఁ గల్గితివి. కాంక్షను హిందువు ముస్లి మొక్కటై,
స్థిరముగఁ బుట్టినట్టి పగిదిన్ బ్రభవించితివయ్య! దుష్ట సం
హరణముఁ జేసికావుమయ! హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 72

ఉ:-
హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ
హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణ మొందఁ జేసి, జై
హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై
పొందిక నుండఁ జేసితివి పూజ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 73

చ:-
కలి కృత కర్మ బద్ధులయి కానరు కొందరు నిన్ను. కల్మిచే
మలిన మనస్కులై సతము మాయలలో విహరించు చుండి. నిన్
బలుకఁగ నైన నేర్వరుగ! పావన మూర్తులె పుణ్య కర్ములై
తెలియుదురయ్య నీ విమల తేజము. శ్రీ షిరిడీశ దేవరా! 74

ఉ:-
నమ్మిన వారి చిత్తమున నర్తన చేయుచు నుందువంట. లో
కమ్మున భక్త కోటి వర కామితముల్ నెరవేర్తు వంట. వే
దమ్ముల సార మీవెనట. దక్షతతో మముఁ గాంతు వంట. జీ
వమ్ముగ నుంటి వంట. గుణ వర్ధన! శ్రీ షిరిడీశ దేవరా! 75

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.