ఉ:-
సద్గుణ! సాయినాధ! వర శబ్దమె నీవట! తీర్థ పాలకా!
సద్గురు! వేద వేద్య! విలసన్నుత! ద్వారక మాయి సంస్థితా!
మద్గురు! నాధ నాధ! స్మృతి మాత్ర ప్రసన్న! విభూత! నిర్గుణా!
సద్గతిఁ జూపి కావుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా! 51
చ:-
సురుచిర సుందరాత్ములను, సూనృత సువ్రతులన్ సృజించి, మా
దరి నిడినాడ వీ వనుచు, దక్షుడవంచుఁ దలంచు నంత, మా
పరువును మంటలో కలుపు పాపపు కృత్య నికృష్ట చిత్తులన్
దరిఁ గొనఁ జేసితేల? సుకృతంబొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 52
ఉ:-
దేవుడ వీవె కాగ పలు దేవుల సృష్టికి హేతువేమి? మా
భావ మెఱుంగ సాధ్యమని పావన! నీవు గ్రహించినాడవో?
దీవన లిచ్చి బ్రోచుటకొ? దేవులుగా మదులందు నిల్చి, స
ద్భావన లిచ్చి బ్రోచుటకొ? దక్షుడ! శ్రీ షిరిడీశ దేవరా! 53
ఉ:-
సజ్జనులందు నిన్గనుచు, సద్గుణముల్ గొని సంచరింపఁగా
వెజ్జల తోడు కావలయు. వెజ్జలు కొందరు ఘోర దుష్కృతుల్
లజ్జిలఁ జేయు చుండిరిల. లక్ష్యము లాత్మ జయంబు కావలెన్.
సజ్జను డప్పుడౌను కద! సద్గురు! శ్రీ షిరిడీశ దేవరా! 54
ఉ:-
ఎన్నఁగ రాని పాపముల నెన్నిటినో యిటఁ జేసినాడ. నే
నెన్నడు నీ కృపామృతము నిచ్ఛగ భక్తిని గ్రోల లేదు. నా
కన్నుల నీదు రూప మను కాంతిని నింపి సుఖింప లేదు. సం
పన్నుల మ్రొక్కి కీడ్పడితి. పాపిని. శ్రీ షిరిడీశ దేవరా! 55
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.