గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2009, ఆదివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 }

శ్రీ సాహితీ మిత్రులారా! నాచే రచింపఁబడిన " శ్రీ షిరిడీశ దేవ శతకము "న 6 వ పద్యము నుండి 10 వ పద్యము వరకు పరిశీలనార్థము మీ ముందించుచుంటిని. సదసద్వివేకజ్ఞులగు మీరు నిశితముగా పరిశీలించి గుణ దోష విచారణ చేసి నాకు తెలియఁజేయఁ గోరు చున్నాను. దోషములున్న సవరించుకొన గలనని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.దయతో ఇక పరిశీలించండి

చ:-
అతులిత పాప పంకిలము లంటగ, నెన్నగ రాని బాధలన్,
మతి చెడి దుష్ట చింతన లమానుష దుష్కృతిఁ జేయఁ జేయ, దు
ర్మతులగు లోక నిందితులు రక్షణఁ గోరుచు నిన్నఁ జేఱ సం
తతమునఁ గూర్చి బ్రోతువయ, దక్షుఁడ!  శ్రీ షిరిడీశ దేవరా!6

చ:-
అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపు చుండి, మ
మ్మనువునఁ బ్రోతు వీవు. పరమాత్ముడ వంచు భజింతు మేము. ని
న్ననయముఁ గొల్చు చుండి, సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే
య, నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా!7

ఉ:-
మోసము చేయుటే పనిగ మూర్ఖులు కొందఱు చేయు చుండ, నా
మోస మెఱుంగ లేమి, మది ముమ్మొన వాలు విధంబు నాటఁగా,
గాసిలి, వారు నిన్ను మదిఁ గాంచిన తోడనె బ్రోతువయ్య! నీ
ధ్యాసయె రక్షగా నిలుచు, ధాత్రిని. శ్రీ షిరిడీశ దేవరా!8

చ:-
మలినపు కావి వస్త్రమును మచ్చునకై తమ మేనఁ దాల్చి, నీ
సులలిత సుందరాకృతిని జూపుచు నిల్తురు కొందఱత్తరిన్
పలుమఱు నీవె యౌదువని, భక్తిని సేవలు చేయు భక్తులన్
తెలివిని గొల్పి కావుమయ! తీరుగ. శ్రీ షిరిడీశ దేవరా!9

ఉ:-
ఎంతటి రోగమున్న, మనమేగతిఁ జింతల సోలుచున్న, ర
వ్వంత విభూతి నీ ధునిది హాయిగ దాల్చినఁ జాలు మేన, మా
వంతలు బాపి, ప్రోచునయ వర్ధిలఁ జేయుచు, నట్టి భూతి ధ
న్వంతరి కీవొసంగితివొ? పావన! శ్రీ షిరిడీశ దేవరా!10


చూచారు కదండీ! మీ అపురూపమైన సూచనలకై ఎదురు చూస్తుంటాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.