గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2009, ఆదివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }

శ్రీ సాహితీ మిత్రులారా! నాచే రచింపఁబడిన " శ్రీ షిరిడీశ దేవ శతకము " న 21 వ పద్యము నుండి 25 వ పద్యము వరకు పరిశీలనార్థము మీ ముందించుచుంటిని. సదసద్వివేకజ్ఞులగు మీరు నిశితముగా పరిశీలించి గుణ దోష విచారణ చేసి నాకు తెలియఁజేయఁ గోరు చున్నాను. దోషములున్న సవరించు ఒన గలనని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.దయతో ఇక పరిశీలించండి.

కా:-
పరమ దయానిధీ! పతిత పావన! భక్త మనోజ్ఞ రూప! మ
మ్మరమర లేక కాచెదవు, హాయిగ. నీకృప నెన్న నౌనె? నిన్
బరిపరి మా మదిన్ దలచి, భవ్య మనస్కుల మౌదుమన్న, సు
స్థిరముగ నుండదీ మనసు తృప్తిగ. శ్రీ షిరిడీశ దేవరా!21

ఉ:-
కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండగా
కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచు నెంచగా
కొందరు దీను లందు కడు కూర్మిని నిన్ గని పొంగు చుండు. ని
న్నందరి లోన గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా!22

ఉ:-
ధర్మము బోధ చేయుట, స్వ ధర్మమునే పచరించు చుంట, యే
మర్మము లేక వర్తిలుట, మంచిగ నుండుట, నేర్చినాము. దు
ష్కర్ముల మాయ వర్తనలు సైచుట బాధగ నుండె. నేది సత్
త్కర్మయొ? దుష్టమో? తెలిపి, కావుము. శ్రీ షిరిడీశ దేవరా!23

ఉ:-
మాటలు నీవు పల్క శుభ  మార్గములన్ విరచించెనయ్య. నీ
మాటలె వేద వాక్యముగ, మానవ జాతి గ్రహించె నయ్య. నీ
సాటి కృపాబ్ధి లేడనుచు సన్నుతిఁజేయుచు నుందురయ్య! నీ
వేటికిఁ జూడ రావయ మునీశ్వర? శ్రీ షిరిడీశ దేవరా!24

ఉ:-
ఎంతటి వస్తువైననగు, నెచ్చటనైనను పోయెనేని, మా
వంతను నీకుఁ దెల్ప, గ్రహ పాటును మార్చి, యొసంగెదీవు. నీ
చెంతనె చిత్తముంచి, సహ జీవనులై వసియించు భక్తులన్
వింతగ బ్రోచుచుండెదవు వేగమె. శ్రీ షిరిడీశ దేవరా!25

చూచారు కదండీ! మీఅపురూపమైన సూచనలకై ఎదురు చూస్తుంటాను.
జైహింద్. Print this post

1 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మాస్టారు గారు,
ప్రతి పద్యము అద్భుతముగా ఉన్నవి. చక్కటి భక్తి శతకాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.