గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2025, మంగళవారం

శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శత నామాంచిత పద్య పుష్పార్చన.

 

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.
శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శత నామాంచిత 
పద్యపుష్పార్చన.
రచన .. చింతా రామకృష్ణారావు.
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.

ప్రేరణ.

మ.  అరుణాద్రీశునిఁ జూడ రమ్మనుచు నన్నన్నా! కృపాంభోధియౌ

యరుణాద్రీశుని నామముల్ గొనుచు పద్యాళిన్  రచింపంగదే,

పరమానందము నందెదన్ననెను, మా భవ్యాతుఁడౌ చిన్నబా

బు, రయంబే రచియించితిన్, గొనఁగఁ దీపున్ వానికేనిచ్చెదన్.

అంకితము.

చి.చింతా రామసత్యనారాయణ శర్మ - చి.ల.సౌ. వసుంధర దంపతులు.

కం.  సుకృతులు, వసుంధరకు, ప్ర  జ్ఞ కలుగు నుత రామసత్యనారాయణ శ

ర్మకు నంకితముగ నొసగితి  నకలంక సుధార్ణవమరుణాద్రిస్తవమున్.


కం.  శుభములు గాంచగ మీకిట  నభవునిపై వ్రాసినట్టి యరుణగిరినుతిన్,

ప్రభువగు నరుణగిరీశుఁడె  విభవము మీకొసగఁ గోరి ప్రీతినొసగితిన్.


మీకు శుభంబులౌత! పరమేశ్వరుఁడీ యరుణాద్రివాసుఁడే

సాకు శుభాస్పదుండగుచు, శాంతిని సౌఖ్యము సర్వ సంపదల్

శ్రీకరుఁడై యొసంగు, వరసిద్ధిని గొల్పును చిన్నబాబు! మీ

కీ కృతి మేలుచేయు, తొలగించును సంకటముల్ ధరిత్రిపై.

ఆముఖము.
శా.  శ్రీమన్మంగళ శ్రీగణేశ! యరుణాద్రిద్యున్మణిన్ శంకరున్
నీమంబొప్పగ నామపాళి గొనుచున్ నే హృద్యపద్యాళిలో
ధీమంతుల్ పఠియించి, దివ్యఫలముల్, దీప్తిన్ గనన్ వ్రాసెదన్,
క్షేమంబున్ బఠియించువారి కిడుమా, కేల్మోడ్చి నిన్ మ్రొక్కెదన్.

శా. అమ్మా! బాసర శారదాంబ! నిను నే నర్చింతు భక్తిన్ సదా,
యిమ్మా శక్తిని, నే లిఖింతు నరుణాద్రీశుప్రభారాశినే
సమ్మాన్యంబగునామముల్ శతము భాస్వద్ధృద్య పద్యాళిలో
నెమ్మిన్ జేర్చి, భవత్కృపామృతమునే నిత్యంబుగా క్రోలుచున్.

ఉ.  ఆర్య!  గురూత్తమా! నతులనందుడు, వేంకట వీరరాఘవా
చార్య! రచింతునయ్య! అరుణాచల శంకర నామపాళినే
ధైర్యము మీరొసంగుటను తప్పక పద్యములందు నిల్పి, యీ
కార్యము చేయఁజేయుఁడయ!  కామిత సత్ప్రద!  వైష్ణవోత్తమా!

శా.  శ్రీరమ్యంబుగ వ్రాయనుంటి నరుణాద్రిజ్యోతి సాంబున్, నుతా
కారా! వేంకట రత్నమాంబ జననీ! గణ్యుండ! సన్యాసిరా
మారావాఖ్య మహత్వపూర్ణ జనకా! మాంగళ్యముల్ గొల్పుడీ,
మీరే రక్షగ నిల్చి కార్యములు భూమిన్  చేయఁగాఁ జేయుఁడీ!

మ.  అరుణాద్రీశ మహోజ్వలా! మదిని నిన్నర్చించి నీ నామామముల్
పరమానందముగా పఠించుటకునై పద్యాళిలో వ్రాసెదన్,
గరుణన్ జూపి రచింపఁ జేయుము హరా! గణ్యుండు నా సోదరుం
డురచింపంగను చిన్నబాబడిగె, పట్టున్ గొల్పి వ్రాయించుమా.

శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శత నామాంచిత పద్యపుష్పార్చన.

1. ఓం శోణాద్రీశాయ నమః.
శా.  శ్రీమన్మంగళ భక్తపాలన పరా! శ్రేయస్కరా! శంకరా!
నీమాహాత్మ్యము నెన్న నాకు తరమా? నీ నామముల్ చేర్చుచున్
నీమంబొప్పగ పద్యపుష్పచయమున్ నేగూర్చి యర్చింతు నిన్,
హైమంగూడి గ్రహింపుమయ్య నుత *శోణాద్రీశ!*  దేవా! మృడా!
(మృడతి సుఖయతి. = సుఖ పెట్టువాడు మృడుఁడు శివుడు.)

2. ఓం అరుణాద్రీశాయ నమః.
మ.  *అరుణాద్రీశ!* నమోస్తుతే హరహరా! ఆనందసంధాయకా!
కరుణాసాగర! సంస్తుతాంఘ్రి యుగళా! కల్యాణతేజోమయా!
పరమాత్మా! పరమేశ్వరీ సహితుఁడా! పాపఘ్న! నిన్ గొల్తు, నీ,
చరణాబ్జంబులు నా మదిన్ నిలుపుమా! ఛండీశ! దేవా! మృడా!

3. ఓం దేవాధీశాయ నమః.
శా.  *దేవాధీశ!* నమస్కరింతు గొనుమా! దేదీప్యమానోజ్వలా!
భావావేశము గొల్పి నీదు మహిమల్ వర్ణింపనీ భక్తితో,
నీవాఁడన్, కరుణింపుమా, పురహరా! నీ పాద పద్మంబులన్
సేవింపంగను శక్తినిమ్ము, విలసచ్చిద్రూప!  దేవా! మృడా!

4. ఓం జనప్రియాయ నమః.
మ.  నిను సేవింతు *జనప్రియా!* జగతిలో నీ సాటి నీవే హరా!
నను పాలించెడి చంద్రశేఖర!  మదిన్ నాలోన నీ తేజమే
ప్రణవంబై వెలుగంగఁ జేయుము భవా! వాఙ్మాధురిన్ గొల్పుచున్ 
నిను వర్ణించెడి పద్య సద్రచననే నీవిమ్ము,  దేవా! మృడా!

5.  ఓం ప్రపన్నరక్షకాయ నమః.
మ.  కరుణాంభోధి! *ప్రపన్న రక్షక* లసజ్జ్ఞానప్రదా! పాహిమామ్,
శరణంటిన్ గరుణించి కాతువనుచున్, శక్తిన్ బ్రసాదించి, నీ
చరణాబ్జంబులఁ జేరు భాగ్యమిడుచున్, శాంతిన్ బ్రసాదింపుమా,
తరుణోపాయము నీదుపాదములె, సంతాపఘ్న దేవా! మృడా!

6.  ఓం ధీరాయ నమః.
శా. *ధీరా!* సుందర భక్తపాలన పరా! దేదీప్య చిద్రూప! నీ
వారిన్ నిత్యము కాచుచుండెదవుగా భక్తిప్రదా! శాశ్వతా!
కోరన్ నే నిను నైహికంబులికపై, కోరన్ ధరన్ వ్యర్థముల్,
చేరన్ గోరెద నిన్ను నేను, కనుమా శ్రీ కంఠ! దేవా! మృడా! 

7.  ఓం శివాయై నమః.
మ. *శివ!* నీ తత్త్వము శ్రీశుఁడైన కనెనా? శ్రీమద్భవానీకృపన్
భవబంధంబులు వాయు తత్త్వవిదులే భవ్యంబుగా  గాంతు రీ
శివత్త్వంబును, గాంచఁ గోరితిని నే, శీఘంబె బోధింపుమా,
స్తవనీయుండ! మనోహరా! సురుచిరా! సాంబుండ!  దేవా! మృడా!

8.  ఓం సేవక వర్ధకాయ నమః. 
మ.  కనుమా *సేవకవర్ధకా!* మనమునన్ గాంతున్ నినున్ గాంక్షతో,
వినుతిన్ జేయుదు సేవలన్ గొనుమయా! విశ్వేశ్వరా! సత్ కృపన్,
క్షణముల్ సాగుచు  పోవుచుండె  పరమున్ గల్పించు వేగంబుగా,
కనుమీ సేవకునెన్ని, రక్షయగుమా! కన్పించు దేవా! మృడా!

9.  ఓం అక్షిపేయామృతేశాయ నమః.
మ.  వర ధీశక్తిని, ధారణన్, శుభద!  దేవా! *అక్షిపేయామృతే
!*  రయం బొప్పుగ నిమ్ము పద్యరచనన్ శక్తిన్ బ్రసాదించుచున్,
కరుణా సాగర! కల్పనా పటిమనే కల్పింపుమా, నిన్నునే 
నరుణాద్రీశ! రచింపనొప్పునటు, మోహాతీత!  దేవా! మృడా! 

10.  ఓం స్త్రీ పుంభావ ప్రదాయకాయ నమః.
కం.  నీవే దిక్కని నీకున్
సేవలు నామదిని నిలిపి చేసెద *స్త్రీ పుం
భావ ప్రదాయక!* లస
ద్భావంబునొసంగుమయ్య! భవహరుఁడ! మృడా!


11.  ఓం భక్తవిజ్ఞప్తిసమాదాత్రే నమః. 
కం.  భ్రాతిని మము కాచెడి నినుఁ
బ్రీతిని గొలిచెదను *భక్తవిజ్ఞప్తిసమా
దాతా!* నా మొర వినుమయ!
ఖ్యాతిగ సుజనులఁ గావుము, కరుణాబ్ధి! మృడా!

12. ఓం దీనబంధువిమోచకాయ నమః. 
తే.గీ.  జ్ఞాన భక్తి సంపన్నులే కలిమిలేక,
దీన దుర్దశనుండియున్ ధీమతులయి
నీకు భక్తబంధువులైన, నిలుపుదువుగ,
*దీనబంధు విమోచకా!* దీపిత మృడ! 

13. ఓం ముఖరాఘ్రిపతయే నమః.  
తోటకము.  
అరుణాద్రి శిఖా! *ముఖరాఘ్రిపతీ!*
పరమాత్ముఁడ! కొల్చెద భద్రుఁడ! నిన్,
సురసేవిత సత్పదశోభితుఁడా!
కరుణింపుము భవ్య సుగాత్ర! మృడా!

14.  ఓం శ్రీమతే నమః. 
మ.  మన నేరన్ నిను వీడి నేనిలను బ్రేమన్ జూడుమా, *శ్రీమతా!*
నినుసేవించెడి భక్తపాళికిలపై నీ సత్కృపన్ సౌఖ్యముల్
ఘనసంపత్తియు, శాంతి చిత్తము, లసత్ కల్యాణ భావాళియున్,
వినుతింపన్ దగు వర్తనంబు కలుగున్ వేగంబె, దేవా! మృడా! 

15.  ఓం మృడాయ నమః.  
మ.  *మృడ!* యీ నామమె దివ్యమౌ మకుటమై యీ గ్రంథరాజంబునే
నడిపింపంగను నీవె కొల్పితివి, జ్ఞానంబున్ బ్రసాదింపఁగా
నడిసంద్రంబగు నీ భవంబు గడపన్ నావై మనన్ జేయుమా,
ఒడయుండీవెగ మాకు, పూజ్య హర! ప్రేమోదార దేవా! మృడా! 
   

16.  ఓం మృగమదేశ్వరాయ నమః.
తరలము.  
*మృగమదేశ్వర!* నిన్నుఁ గొల్చెద, మేదినిన్ వర భక్తులన్
నిగమవేద్యుఁడ! కావరావయ! నేర్పు మీరగ నిత్తరిన్,
ప్రగణితంబగు నీగుణంబులు పల్కుచుండెడివారలన్
సుగుణసాంద్ర రహింపఁజేయుమ, శోభిలంగను మా మృడా!

17.  ఓం భక్తప్రేక్షణాకృతే నమః. 
తే.గీ.  అజయ! మహిత! *భక్తప్రేక్షణాకృతి!* హర!
విజయపథమున భక్తులన్ వెలుగునట్లు
చూచు సద్రూపధారివై శోభిలుదువె,
నిన్ను నేఁ గొల్తు, నీవె నా దన్నువు, మృడ!


18.  ఓం సాక్షిణే నమః.
తే.గీ.  *సాక్షి!* సర్వంబునకు నీవె సాక్షి వగుదు
వట్టి నీవే మదిన్ నిల్చి యనుపమముగ
ధర్మ వర్తనన్ నడిపింప, మర్మరహిత
సత్ప్రవర్తనన్ ముక్తి సుసాధ్యము, మృడ!

19.  ఓం భక్తదోష నివర్తకాయ నమః.
తే.గీ.  *భక్తదోషనివర్తకా!* భవహరుండ!
దోషపరిహారమింక నిశ్శేషముగను
చేసి ముక్తిమార్గముఁ జూపి చేదుకొనుము,
నీదు పాదాల చెంతనే నిలిచెద మృడ!

20.  ఓం జ్ఞానసంబంధ నాథాయ నమః.
తే.గీ.  *జ్ఞానసంబంధ నాథ!* సుజ్ఞానపథము
నీవె సృష్టిలో, నిజమిది, దేవదేవ!
జ్ఞానపథమున నడుపుమజ్ఞానహరణ!
శరణమంటి నొసంగుమా శరణము మృడ!

21.  ఓం శ్రీ హాలాహలసుందరాయ నమః
శా.  *శ్రీ హాలాహలసుందరా!* శుభకరా! శ్రీకంఠ! శంభో! హరా!
మోహాదుల్ మము వీడకున్నవెటులో ముక్తిప్రదా! మమ్ములన్
మోహాదుల్ విడునట్లు చేసి కృపతో మోక్షంబునే గొల్పుమా!
స్నేహోదారగుణుండ! కావుము కృపన్, జేయిచ్చి నన్నున్, మృడా!

22.  ఓం ఆహువైశ్వర్యదాతాయ నమః.
తే.గీ.  *ఆహువైశ్వర్యదాతా!* మహాద్భుతముగ
కవన సంపద పారించు ఘనుఁడవీవు,
నాదు కవితలో పరమేశ! నీదు చరిత
సతము పారంగఁ జేయుమా నుతముగ మృడ!

23.  ఓం స్మృతసర్వాఘనాశాయ నమః
తే.గీ.  నా శివా! *స్మృతసర్వాఘనాశ!* భవుఁడ!
ఆశఁ గొంటిని ముక్తి, పేరాశ యగునొ?
శ్రీకరుండవు, నీవుండ చింతలేదు,
తొలగు పాపముల్ మేము నిన్ దలచిన మృడ!

24.  ఓం వ్యతస్తనృత్యాయ నమః.
శా. అసమానప్రతిభాభిరామ మహితా! *వ్యత్యస్తనృత్యా!* హరా!
కుసుమాస్త్రుండును నీ ప్రభావ గరిమన్ గూలెన్గదా భస్మమై,
అసురుల్ నీకృపనందుచుండియును తా మంతంబునే పొందరే,
యసలీవే కద హేతువన్నిటికి నో యానంద రూపా!  మృడా!

25.  ఓం ధ్వజదృతే నమః.
చం.  *ధ్వజదృత!* తాల్పనా ధ్వజము పావనమైన త్రిశూల భాతితో,
భజనలు చేయఁ జేయుటకు భక్తిని గొల్పుచు మానవాళిచే,
నిజమగు నీదిశక్తి గననిచ్చిన నీవు, నినున్ దలంచుచున్
భజనలు చేయకుందురొకొ? పావన సద్ధ్వజధారి! యో మృడా!

26.  ఓం సకాంతినే నమః.
తే.గీ.  నుత *సకాంతీ!* భవత్తేజమతులితమయ,
నీదు కాంతియె నాలోన మేదురముగ
కవితఁ బొంగఁగఁ జేయుచున్, గరుణఁ జూచు,
నీదు కాంతికి పోలిక లేదుగ మృడ!

27.  ఓం నటనేశ్వరాయ నమః.
చం.  ఘన *నటనేశ్వరా!* జగతి కల్పిత నాటకరంగమౌనొ? నీ
వనయము చేయు సృష్టిని యనంతరమీనటపాళి జీవులో?
వినయముతోడ మ్రొక్కెదను, వేగమె నా నటనంబునాపి, చెం
తను నను  నీవు నిల్పుకొని తప్పక ముక్తినొసంగుమా, మృడా!

28.  ఓం సామప్రియాయ నమః.
శా.  ప్రేమోదార సుధా స్రవంతివగు నీ విఖ్యాతి *సామప్రియా!*
యేమాత్రంబును తెల్పనెవ్వరికగున్, స్మృత్యాత్ముఁడా! నేనునున్
శ్రీమాతృప్రభనెంచి నిన్ను గనుదున్ చిత్తంబులో నిత్యమున్,
ధీమంతుల్ గను సామగానమున నిన్ దివ్యంబుగా, మా మృడా!  

29.  ఓం కలిధ్వంసినే నమః.
మ.  కలికాలంబిది, పాపముల్ పెరిగె,  వేగంబే *కలిధ్వంసి!* ని
స్తుల శక్తిన్ గలికల్మషాత్ములను ధీశుల్ మెచ్చఁ బోకార్పుమా,
తులలేనట్టి సుధర్మ మార్గ మున, భ్రాంతుల్ వీడి సద్వర్తనన్
వెలుగన్ జేయుమ మానవాళినిలపై, విశ్వేశ్వరా, మా మృడా!

30.  ఓం వేదమూర్తినే నమః.
శా.  వేదార్థంబయి వెల్గుచుంటివిట నీవే *వేదమూర్తీ!* నతుల్
మోదంబున్ నిను వేదమందు కని సంపూర్ణ ప్రభావంబుతో
బాధల్ వీడి చరింతురాత్మవిదులా భాగ్యంబు నాకిమ్ము, నిన్
శోధింపగను లేను కాన కనుమా, శుద్ధాత్మభాసా! మృడా!
 
31.  ఓం నిరంజనాయ నమః.
ఉ.  రమ్యమనోజ్ఞతేజుఁడ! *నిరంజన!* కల్మషదూర శంకరా!
గమ్యము నీవె నాకు, వెలుగందగు నామది నీవు నిత్యమున్,
సౌమ్యగుణంబుతోడ నిను చక్కని భావ సమృద్ధి నొప్పుచున్
సామ్యము లేని పద్యతతి సమ్మతి వ్రాయఁగఁజేయుమో మృడా!

32.  ఓం జగన్నాథాయ నమః.
మ.  ననుఁ బాలించెడి దైవ మీవెగ *జగన్నాథా!* నమస్కారముల్,
ప్రణవంబీవయి లోకపాలన విధిన్ బ్రఖ్యాతిగాఁ జేయుచున్,
ఘన సంస్కారము భక్తులన్ నిలుపు నీ కారుణ్యమున్ నాపయిన్
కనికారంబున జూపుమయ్య! వెలుగన్ గాంక్షింతు నీతో, మృడా!

33.  ఓం మహాదేవాయ నమః.
శా.  దీనోద్ధారక సాంబమూర్తివి, *మహాదేవా!* నినున్ దల్చినన్
జ్ఞానానందమయంబుగానగును మా చాంచల్య చిత్తంబులున్,
నీ నామస్మరణంబు పాపచయమున్ నేర్పున్ నివారించు, నే
నీనాడే నిను సంస్మరింతుఁ గృపతోనేలంగ రారా, మృడా! 

34.  ఓం త్రినేత్రే నమః.
ఉ.  చంద్రుని, సూర్యునిన్ మరియు జ్వాలిని నీ ముఖమందు కండ్లుగా
సాంద్ర శుభాస్పదా! కలిగి, చక్కగ లోకము లేలువాఁడ! యో
గీంద్రులు నీ కృపామృతము నెంచుచుఁ గ్రోలుదురో  *త్రినేత్ర!* స
న్మంద్రసుశబ్దమౌ ప్రణవ నాదమునే వినఁజేయుమా మృడా!

35.  ఓం త్రిపురాంతకాయ నమః.
తే.గీ.  స్థూల, సూక్ష్మ, కారణ దేహ శోభనణచి
నీవు త్రిపురాంతకుండవై నిత్యమోక్ష
పథము *త్రిపురాంతకా!* గొల్పి, వరలుదువట,
నిన్ను పూజించి చేరెద నే నిను మృడ!

36.  ఓం భక్తాపరాధసోఢాయ నమః.
కం.  *భక్తాపరాధసోఢా!*
ముక్తిప్రద! నాదు దురితముల్ నశియింపన్
భక్తిగ నిను భజియింతును,
రక్తిని నా మదిని నిలుము రమ్యముగ మృడా!

37.  ఓం యోగీశాయ నమః.
శా.  *యోగీశా!* మహిమాన్వితుల్ ధరణిపై యోగుల్,  నినున్ నిత్యమున్
యోగీశా! మదిలోన నిల్చి, ధర మా యోగంబుగా నీవెయై
రాగద్వేషములన్ హరించు, పరమున్ రాజిల్ల కల్పింపుమం
చా గణ్యాత్ములు కోరకుండ నిడు దేవా! కావు నన్నున్ మృడా!

38.  ఓం భోగనాయకాయ నమః.
మత్తకోకిల.
*భోగనాయక!* ముక్తిదాయక! పూజ్యపాద! మహాశివా!
రోగదూర శరీరమున్, భవరోగబాహ్య వివృద్ధియున్,
త్యాగశీలము, ధైర్యమున్, శుభతత్త్వవృద్ధియుఁ గొల్పుమా,
నే గణించెద నిన్ మనంబున, నిత్యమిట్టుల, మా మృడా!

39.  ఓం బాలమూర్తయే నమః.
చం.  నిరుపమ! *బాలమూర్తి!* మహనీయ శుభాస్పద కీర్తి నీ కృపన్
సరగున చేరు మమ్ము నినుఁ జక్కగ నమ్ముచుఁ గొల్చుచున్నచో,
నరుణమహాద్రివాసుఁడవు, హాయిగ నిన్ గననెంచువారికిన్
నిరుపమ సౌఖ్యదుండవయి, నిశ్చల భక్తి నొసంగుమా, మృడా!

40.  ఓం క్షమారూపిణే నమః.
తే.గీ.  ఓ *క్షమారూప!*దోషంబు లొకట రెండ,
దొర్లుచుండు నా వర్తనన్ దురిత హార!
నన్ను క్షమియించి దోషంబులెన్ని పాపు
మంచు వేడుదున్, నిన్ను నే ననుపమ  మృడ!

41.  ఓం ధర్మరక్షకాయ నమః.
ఉ.  ధర్మము నాల్గుపాదముల తప్పక నిల్చిననాడు ధాత్రి దు
ష్కర్మలు చేయరెవ్వరును, కావుము దానిని*ధర్మరక్షకా!*
భర్మము, భామినీవలపు భక్తిని బాపుటచేత జ్ఞానులున్ 
ధర్మము నెంచకుందురహొ! దారిని తప్పగనీకు మా మృడా!

42.  ఓం వృషధ్వజాయ నమః.
చం.  నుతులు *వృషధ్వజా!* జయమనూన విధంబునఁ గల్గఁ జేయుమా,
శతకమునందు పద్యములు సన్నుతినొప్పెడి నీదు నామముల్
నుతముగ నొప్పి యున్నవి, వినోదము నీమది కంఁ జేయ, నే
నతులితరీతి వ్రాసితి ననంతుఁడ! నా మదినుండుమా, మృడా!

43.  ఓం హరాయ నమః.
తే.గీ.  హరహరా యన పాపంబులారిపోవు,
విను *హరా!* భస్మదేహుండ! ప్రీతితోడ,
నిన్ను నోరార పలికినన్ నీవె కృపను
కన్న తండ్రివై కాపాడు  మిన్నగ, మృడ!

44.  ఓం గిరీశ్వరాయ నమః.
మ.  జగదాధార*గిరీశ్వరా!* శుభకరా! సంపాద్య భక్తార్ణవా!
ప్రగతిన్ గూర్చెడి దివ్యతేజ!  నిను నే భావింతు నన్నింటిలోన్,
నిగమంబుల్ కన నీవె, నాదు మదిలో నీవే కదా యుంటివో
సుగుణాకార! సుశబ్దపాళినిలలీ శోభింతు వీవే, మృడా!

45.  ఓం భర్గాయ నమః.
*భర్గా!* ముక్తిని పొందెడి 
మార్గము నీవనుచుఁ దలతు,  మనసుననైనన్
స్వర్గంబును కోరను, నా 
భర్గుఁడవగు నిన్నె చేరి వరలుదును మృడా!

46.  ఓం చంద్రరేఖావతంసకాయ నమః.
తే.గీ.  *చంద్రరేఖావతంసకా!* జయనిధాన!
అరుణగిరిపైన నీవుండి నిరుపమగతి
భక్తపాళిని రక్షింపఁబ్రతినఁ బూని
ముక్తి నిడుచున్న నిన్ను నేఁ బొగడుదు, మృడ!

47.  ఓం స్మరాంతకాయ నమః.
తే.గీ.  విను *స్మరాంతకా!* మదనుని పీచమణచి
బూదిగా నీవు చేయుటన్ భూతమయెనొ?
కానఁబడకయె కల్గించు కామవాంఛ,
నీవె దిక్కయ్య నాకింక నిరుపమ మృడ!

48.  ఓం అంధకరిపవే నమః.
కం.  అంధకుఁడను రిపువొక్కడు
*అంధకరిపు!* నిలిచియుండెనజ్ఞానముగా,
బంధించి చంపుమతనిని,
సుందరసుజ్ఞాన దివ్య శోభనిడు, మృడా!

49.  ఓం సిద్ధరాజాయ నమః.
తే.గీ.  *సిద్ధరాజా!* మహాతేజ! శోభఁ గూర్చు
సిద్ధినొసగుము సాధనన్,  శ్రితజనాఢ్య!
శ్రద్ధతో పాటు భక్తిని, జ్ఞానమునిడి
నీదు భక్తుఁడనగు నన్ను నిలుపుము మృడ!

50.  ఓం దిగంబరాయ నమః.
తే.గీ.  ఓ *దిగంబరా!* కరుణించుమోయి నన్ను,
నీవె దిక్కులు నాకెన్న, నన్ వసించు
నీకు దిక్కులు నేనౌదు నిజము కనగ,
జ్ఞానమున నిన్ను చూడనీ ఘనముగ మృడ!

51.  ఓం ఆగమప్రియాయ నమః.
తే.గీ.  *ఆగమప్రియా!* ప్రణతులు భోగహార!
వేదవాఙ్మయమందున విదితమగును 
సర్వమున్ నీవెయౌ కాలచక్రమనుచు,
నాగమంబులున్ నీవంచు హరహర! మృడ!

52.  ఓం ఈశానాయ నమః.
కం.  *ఈశానా!* శాసించుము
నే శాశ్వత మార్గమయిన నిన్నే వ్రాయన్,
ధీశులు మెచ్చెడి కృతిగా,
శ్రీ శంకర ప్రణతులయ్య! చిద్భాస!  మృడా!

53.  ఓం భస్మరుద్రాక్షలాంఛనాయ నమః.
తే.గీ.  *భస్మరుద్రాక్షలాంఛనా!* భక్తితోడ
నీకు భస్మాభిషేకంబు నేను చేసి,
మహిత రుద్రాక్షధారినై మధురమయిన
నిన్ జపించంగఁ జేయుమా! నియతిని మృడ!
 
54.  ఓం శ్రీపతయే నమః.
తే.గీ.  చెలఁగ శ్రీమాత నా తల్లి చిత్తమునను
కొలిచెదన్ నిన్ను*శ్రీపతీ!* కూర్మిఁ గనుమ,
అమ్మ నీలోన సగమౌచు క్రమ్ముకొనగ
శ్రీపతిగ నీవు పేరొంది చెలగితివి మృడ!

55.  ఓం శంకరాయ నమః.
తే.గీ.  *శంకరా!* నిన్ను స్మరియింప సంకటములు
వాసి శుభములే కలుగును భక్తులకును,
భక్తజనపాళిఁ గాంచెడి బాంధవుండ!
వందనంబులు చేసెద నందుము మృడ!

56.  ఓం సృష్టాయ నమః.
కం.  *సృష్టా!* నీకేల జగతి
సృష్టించుచు కష్టమొంద? శ్రితజన రక్షా!
స్పష్టంబాయెను జగతిన్
సృష్టింపగ నంబ తెలిపె, నీకనుచు, మృడా!

57.  ఓం సర్వవిద్యేశ్వరాయ నమః.
తే.గీ.  *సర్వవిద్యేశ్వరా!* నాకు చక్కనయిన
పరమపథమును చేరెడి భవ్య విద్య
నేర్పుమా, నిన్ను సేవింతు నేర్పు మీర,
వందనంబులు చేసెద నందుము మృడ!

58.  ఓం అనఘాయ నమః.
మ.  *అనఘా!* నన్నఘమంటనట్టి విధమున్ హైమామనోనాయకా!
అనయంబున్ నడిపింపుమయ్య కృపతో నానందసంవర్ధకా!
వినయంబున్, సువివేకసంపద, లసద్విజ్ఞానమున్ గొల్పుమా!
నినుసేవించఁగఁ జేయుమా సతతమున్, నిత్య ప్రకాశా! మృడా!

59.  ఓం గంగాధరాయ నమః.
మ.  ఘన *గంగాధర!* నేర్పుతోఁ గననగున్ కాశీపురంబందునన్
నిను తేజోమయ కోటిలింగములుగా, నిత్యంబు నిన్ గొల్వగా
ప్రణవోద్భాసులు భక్తపాళి యచటే ప్రఖ్యాతిగా నుందురే,
నను నే కాశిగ చేసి చూచెద నినున్ నాలోన, నిత్యా! మృడా!

60.  ఓం క్రతుధ్వంసినే నమః. 
తే.గీ.  హే *క్రతుధ్వంసి!*  దక్షుండనేను కాదు,
వినుత దాక్షాయినీ మాత ప్రేమతోడ
పుత్రునైనట్టి నన్ గాంచి ప్రోచుచుండు,
నీవునున్ నన్ను నిత్యంబు, నిత్యుఁడ మృడ!

61.  ఓం విమలాయ నమః.
మ.  *విమలా!* నిర్మలమానసంబు నిడుమా,  విశ్వాసమున్ నిల్పుచున్
కమనీయంబగు నీదు పాదములు తాకం జేయుమా భక్తితోన్,
క్షమతో నైహికమందు నిన్నె గనుచున్ గల్యాణసత్కార్యముల్
ప్రముదంబొప్పగఁ జేయఁ జేయుమ కృపన్, బ్రఖ్యాత దేవా! మృడా!

62.  ఓం నాగభూషణాయ నమః.
తే.గీ.  *నాగభూషణా!* నిన్ను నే నాగబంధ 
చంపకంబున రచియింప నింపుగాను
చేయుమయ్యరొ! కృపతోడ చేవగొలిపి,
వందనంబులు చేసెద, సుందర మృడ!

63.  ఓం అరుణాయ నమః.
కం.  * అరుణా!* కరుణాసాగర!
పరమంబగు నరుణగిరిని ప్రభవించిన నిన్
నిరుపమముగ వర్ణింపగ
సరిపోవను, నీవె వ్రాసి సరిపెట్టు, మృడా!

64.  ఓం బహురూపాయ నమః.
కం.  ఇహ పర లోకములందున
బహురూపములందునుండు *బహురూపా!* ని
న్నహరహమున్ జపియింతును,
స్పృహ వీడక నిన్ను గొలువఁ జేయుమయ మృడా!

65.  ఓం విరూపాక్షాయ నమః.
అక్షయమైన సంపదలనందఁగఁ జేసెడివాడ! యో*విరూ
పాక్ష!* మహాత్మ! వందనము, భవ్యతరంబగు జ్ఞాన చక్షువున్
రక్షక! నాకుఁ గొల్పుమయ! నా మదిలోనను నన్ను నే విరూ
పాక్షునిగా తలంచెదను, భక్తిగ నీవె యటంచునో మృడా!

66.  ఓం అక్షరాకృతయే నమః.
ఉ.  అక్షయమైన సంస్కృతియె హైందవమెన్నగ *నక్షరాకృతీ!*
సాక్షిగ నిల్చి తీవె విలసన్నుత్ర రీతి రహింపఁజేయుచున్,
దక్షులు ధీశిఖామణులు తప్పక సంస్కృతినెన్ని కావగా
నక్షయమైన శక్తి నిడుమా తగ వారికి, దైవమా! మృడా!

67.  ఓం అనాద్యంతరహితాయ నమః.
తే.గీ.  నుత *యనాద్యంతరహితా!* వినోదమునకు
సృష్టి చేసితి వందులో కష్టములవి
మాకు తప్పకపోవుట నీకు తెలియు,
మమ్ముఁ గాచుట నీవిధి, మహితుఁడ! మృడ!

68.  ఓం శివకామాయ నమః.
తే.గీ.  నతులు *శివకామ!* నీకు, సన్నుతిగ నీవు
కృపను మాలోన సద్భక్తి  క్షితిని గొలిపి,
నిన్నె పూజింపఁ జేయుమా, నిరతముగను,
భావమున నీవె నిలుమయ్య, ప్రగణిత మృడ!

69.  ఓం స్వయంప్రభవే నమః.
తే.గీ.  మా  *స్వయంప్రభూ!* నీ పూజ మాననీక,
దుష్టమార్గాన నిలుపక, దురితులకును
దూరముగనుంచి కాపాడు, దురితహరుఁడ!
వందనంబులు చేసెదనందుమ మృడ!

70.  ఓం సచ్చిదానందరూపాయ నమః.
తే.గీ.  సచ్చిదానందమొసగి ప్రశాంతమిచ్చు
*సచ్చిదానందరూపా!* నిజంబు నీవె, 
కల్లలెన్నగామిగిలిన కలుములెల్ల,
నిన్నెనమ్మితి నా దేవ! నిరుపమ మృడ!

71.  ఓం సర్వాత్మాయ నమః.
శా.  ఎందున్ జూచిన నెవ్వరిన్ గనిన నీవే దేవ *సర్వాత్మ!* నా
యందున్ గల్గితి వీవె, నిత్య శుభదా! ఆనంద సంపత్ప్రదా!
సౌందర్యంబన నీవె దేవ! మదిలో సంస్కార రూపంబుతో
నందంబున్ గలిగించుచున్న నిను నే నర్చింతు భక్తిన్, మృడా!

72.  ఓం జీవధారకాయ నమః.
తే.గీ.  *జీవధారక!* నీవె మా జీవధార!
భావమందున నీవుండి భక్తి గొలిపి
శ్రీవదాన్యులమైత్రిని చెలఁగఁ జేసి,
ముక్తి మార్గము చూపితే పూజ్యుఁడ! మృడ!

73.  ఓం స్త్రీసంగవామభాగాయ నమః.
కం.    *స్త్రీసంగవామభాగా!*
స్త్రీ సంస్తుతమై చెలంగు జీవాత్మయె, నీ
వా సన్నుత పరమాత్మవు,
భాసించుదు రిట్లు మీరు ప్రాణులను, మృడా!

74.  ఓం విధయే నమః.
తే.గీ.  ఓ *విధీ!* మా విధివ్రాత నుత్తమముగ
మార్చు నీ ప్రేమ ఘనమయ్య! మార్గ మీవె
జీవితమునంది సద్విధి స్థిరముగాను
నీదు కృపతోడ లభియించు, నిరుపమ! మృడ!

75.  ఓం విహితసుందరాయ నమః.
తే.గీ.  *విహితసుందరా!* యరుణాద్రి వెలసి జనుల
సేవలంద ప్రదక్షిణల్ చేయఁ జేయు
నీదు మహిమను పొగడంగ  నిఖిల జగతి
నెవ్వరికి సాధ్యమగునయా? యీశ్వర! మృడ!
 
76.  ఓం జ్ఞానప్రదాయ నమః.
తే.గీ.  వినుత *జ్ఞానప్రదా!* సద్వివేకమిచ్చి
నన్ను కాపాడుకొనుమయ్య మన్ననముగ,
నిన్నెనమ్మిన నాయందు నీవె కలవు,
కాన గౌరవంబును నిల్పు కరుణను, మృడ!

77.  ఓం ముక్తిదాయ నమః.
తే.గీ.  *ముక్తిదా!* భక్తి నినుఁ గొల్చు శక్తినొసగు,
మరుణగిరికి ప్రదక్షిణల్ నిరుపమగతి
చేయు శక్తి భాక్తాళికి నీయుమయ్య!
నీకు ప్రణతులు, గైకొమ్ము, నిరుపమ మృడ!

78.  ఓం భక్తవాంఛితదాయకాయ నమః.
తే.గీ.  *భక్తవాంఛితదాయకా!* భస్మధరుఁడ!
నిన్ను సేవింప వాఛించు నన్ను గనుచు
వాంఛనే తీర్చి నాభక్తి వరలనిమ్ము,
వందనంబులు చేసెద నందుము మృడ!

79.  ఓం ఆశ్చర్యవైభవాయ నమః.
 కం. *ఆశ్చర్యవైభవా!* నా
దుశ్చర్యలనణచి, భక్తితో నిను సతమున్
నిశ్చల భక్తిని గొలువగ
నాశ్చర్యముఁ గొలుపఁ గొలుపుమా, భవుఁడ! మృడా! 

80.  ఓం కామినే నమః.
తే.గీ.  కామితార్థప్రదుండ! యో  *కామి!* నీవె
యవని  నరుణాచలంబున నగ్ని లింగ
రూపమున నుద్భవించి మాప్రాపువయితి
వట్టి నినుఁగొల్తు మదిలోన, ననుపమ మృడ! 

81.  ఓం నిరవద్యాయ నమః.
మ.  నిరవద్యంబగు పద్యసద్రచనలో నీ శక్తి నన్ జేరుచున్
*నిరవద్యా!* భవదీయ నామశతమున్ నిష్టన్ రచింపించె సత్
పరమార్థంబును గొల్పనెంచి ప్రజకున్ భాగ్యంబుగా దీక్షతో
నిరతంబున్ బఠియింపఁ జేయుటకునై, నిత్యుండ! దేవా మృడా!

82.  ఓం నిధిప్రదాయ నమః.
మ.  అమితంబైన నిధిప్రదాతవయి, మోహాదుల్ విడన్ జేయ, సం
గములన్ ద్రుంచు *నిధిప్రదా!* కొలుతు నిన్, గల్యాణ తేజోనిధీ!
సమదృష్టిన్ కలిగించి మానసమునన్ సర్వంబు నీవే యటం
చమలంబైన మనోజ్ఞభావమిడు, మోహాతీత దేవా మృడా!

83.  ఓం శూలినే నమః.
ఉ.  ముమ్మొనవాలు దాలుప! ప్రపూజ్య పద్వయ! *శూలి!* యుండు నా
నెమ్మనమందు నిత్యముగ,  నిర్భర భక్తిని గొల్చెదన్ నినున్,
గమ్మని పద్యపుష్పములు గౌరవమొప్పఁగఁ గూర్చి నీకు నే
నెమ్మి నొసంగుదున్, ననుగణించుము, దేవర! మ్రొక్కెదన్ మృడా!

84.  ఓం పశుపతయే నమః.
చం.  పశువటులన్ మెలంగు నను పాపవిదూరునిఁ జేయనెంచి యో
*పశుపతి!* నీవె నా పతిగ భద్రతనిచ్చితివెంతభాగ్యమో,
శిశువు లమాయకత్వమునఁ జేసెడి దోషము సైచు తండ్రి నాన్
విశదము కాగ నా చెడుగు వేల్పుగ నుండి సహించితే? మృడా!

85.  ఓం శంభవే నమః.
చం.  శుభములు సంభవించునట శోభిలు నీ వలనన్ గనంగ *శం
భు!* భవము దాటఁ జేయుమదె పూర్తిగ నాకు శుభంబు శంకరా!
అభయములిచ్చువాఁడవని హాయిగ నిన్ భజియింతురందరున్,
శుభద! దయాంతరంగ! పరిశుద్ధమనంబునొసంగుమా, మృడా!

86.  ఓం స్వయంభువే నమః.
ఉ.  పుట్టగ చేయకుండగనె పుట్టినవాడ! *స్వయంభు!*  శంభు ని
న్నెట్టుల నిర్వచించనగు నెట్టుల నీమహిమాన్వితంబులన్,
గుట్టును తెల్పగానగును, కూరిమితో నిను సంస్మరింప, నీ
విట్టె దయాంబురాశివయి యింతయు తెల్పెదవీశ! మా మృడా!

87.  ఓం గిరీశాయ నమః.
చం.  అరుణగిరిస్వరూపమున నగ్నిమహాద్భుత లింగమూర్తివం
చెరిగిన భక్తకోటి గిరి నెన్ని ప్రదక్షిణలన్ జరింతురో
నిరుపముఁడా! *గిరీశ!*గణనీయమహాద్భుత సత్ఫలంబులన్
పరిణత భక్తులందుదురు, భస్మశుభాంగుడ! సన్నుతుల్, మృడా!

88.  ఓం సంగీతవేత్రే నమః.
శా.   శ్రోతల్ భక్తిమహత్వభావము కనన్ శోభిల్లు సంగీతమున్
ఖ్యాతిన్ గాంచిన గాయకోత్తములు విఖ్యాతిన్ ధరన్ బాడుచున్,
నీ తత్త్వంబు నెఱుంగఁజేయుదురుగా నిత్యాత్మ *సంగీతవే
త్తా!* తాదాత్మ్యము కల్గఁజేయుము శివా! ధన్యుండనౌదున్ మృడా!

89.  ఓం నృత్యజ్ఞాయ నమః.
శా.  నృత్యజ్ఞానము నీ స్వరూపమె యగున్ *నృత్యజ్ఞ!*  చింతించినన్,
నృత్యంబున్ దిన సంధ్యలందు కనుదున్, నీవే ప్రదర్శించుటన్,
సత్యంబైన నినున్ గనంగనగునీ సన్మార్గమందున్ హరా!
నృత్యానందకరుండ! నాట్య జగతిన్ నిన్ గాంచనీ, మా మృడా!

90.  ఓం త్రివేదినే నమః.
మ.  కన వేదత్రితయంబు నీవె కద, శ్రీకంఠా! *త్రివేదీ!* నతుల్,
ఘనమున్, దివ్య మహాఘనంబు శ్రుతులన్ కంఠస్థులౌ, ధాత్రి నా
వినయోద్భాసమహత్త్రివేదులనఘుల్, విఖ్యాత నీ రూపమే
చెలగున్ వారిని చేరి,  పుణ్యఫలమై శ్రేయంబు గూర్చన్ మృడా!
  
91.  ఓం వృద్ధవైదికాయ నమః.
తే.గీ.  *వృద్ధవైదిక!* నిను నేను శ్రద్ధఁ గొలుతు,
బద్ధకము చేరనీయక భక్తితోడ
వృద్ధ వైదిక మార్గాన ప్రీతిఁ గదుర
వెలుఁగఁ జేయుమా నన్ గృపన్ పృథివిని మృడ!

92.   ఓం త్యాగరాజాయ నమః.
తే.గీ.  *త్యాగరాజ!* నిస్వార్థ సత్త్యాగశీల
మొసగి సన్మార్గవర్తినై మసలనిమ్మ,
త్యాగగుణమున్న నతఁడెన్న త్యాగరాజె,
నీవెవారుగానెంచెద, నిరుపమ మృడ!

93.  ఓం కృపాసింధవే నమః.
తే.గీ.  నీ కృపామృతంబును గ్రోలు నిష్కలంకు
లిలను ధన్యులు, శంకరా! తలతు నిన్ను
భక్తితోడ  *కృపాసింధు!* భవమునణచి,
ముక్తినొందంగఁ జేయుమా, పూజ్యుఁడ! మృడ!

94.  ఓం సుగంధినే నమః.
సుగంధి.
ఓ *సుగంధి!* నీ కృపన్ మహోత్తముల్ గణింపనౌన్
నీ సముల్ నినున్ గనంగ నేర్పు గల్గి యుందురే,
నే సుగంధి వృత్తమందు నీ సుగంధి నామమున్
భాసిలంగవ్రాసితిన్, భవత్ కృపన్, శివా! మృడా!

95.  ఓం సౌరభేశ్వరాయ నమః.
మత్తకోకిల. 
*సౌరభేశ్వర!* నీదు సద్గుణ సారమెన్ని కవీశ్వరుల్
నేరిమిన్ కవితామృతంబుగ నిత్యమున్ రచియించుచున్,
జేరుచుందురు నిన్ను వారలు, సిద్ధి పొందుచు నా కృషిన్,
జేరనిమ్ము ననున్ మహేశ్వర! చింతితార్థద! శ్రీ మృడా!

96.  ఓం కర్తవీరేశ్వరాయ నమః.
తే.గీ.  *కర్తవీరేశ్వరా!* జగత్కర్తవగుచు
జీవరాశికి సుఖదుఃఖ భావములిడి,
వేచుచుంటివి, యిది నీకు ప్రీతికరమొ?
వేచఁబోకుమ జీవులన్, వేడుదు మృడ!

97.  ఓం శాంతాయ నమః.
కం. *శాంతా!* జీవితమందున
శాంతంబన నీ స్మరణనె చక్కగఁ గలుగున్,
బ్రాంతులు వీడిన శాంతము
స్వంతంబగు నీదు కృపను, సన్నుతుఁడ! మృడా!

98.  ఓం కపాలినే నమః.
తే.గీ.  ఓ *కపాలి!* జీవితమున నొకటి కూడ
వెంటరాబోదు కడపటన్, వినుతుఁడవగు 
నిన్నునమ్మినన్ ముక్తి నన్నెన్ని వచ్చు,
నిన్నునమ్మితిన్ బ్రోవుమా నిఖిలుఁడ! మృడ!

99.  ఓం కలశప్రభవే నమః.
కం.  *కలశప్రభు!* నీ కృపఁ గన
విలసన్మణియౌను నరుఁడు, విఖ్యాతుండై,
సులలిత కవిత్వ మమరును,
కలిదోషములంటఁబోవు, ఘనుఁడగును, మృడా!

100.  ఓం పాపహరాయ నమః.
తే.గీ.  అరుణగిరికన్న నెత్తగు నఘచయంబు
భయము గొలుపుచునుండె నవ్యయ ఫలంబు
నెటుల *పాపహరా!* వీడుటెరుకపరచి
కాచి రక్షింపు మన్నించి, కరుణను, మృడ!

101.  ఓం దేవదేవాయ నమః.
తే.గీ.  *దేవదేవా!* మహాదేవ! దీనబంధు!
రమ్య చింతాన్వయుండను, రామకృష్ణ
నామధేయుండ, వ్రాసి నీనామములను
పద్య చయమున, నీ ముందు పరచితి మృడ!
 
102.  ఓం సర్వనామ్నే నమః.
తే.గీ.  కల్వపూడికులాంభోధి ఘనులు వీర
రాఘవాచార్య గురువుల ప్రాభవమున,
కవిత *సర్వనామా!* యబ్బె ప్రవిమలగతి
నాకు, నీకృప తోడుగాన్, నిరుపమ మృడ!

103.  ఓం మనోవాసాయ నమః.
తే.గీ.  ఓ  *మనోవాస!* యోపలేకుంటినయ్య
తగులములు నేను, నీవింక తగ్గఁ జేసి,
ముక్తిసన్మార్గమున్ జూపు, పూజ చేతు,
వందనంబులు చేసెద నందుమ మృడ!

104.  ఓం సర్వాయ నమః.
తే.గీ.  సర్వసిద్ధి నివాసుండు సత్యనార్య
నాముఁడగు నాదు తమ్ముఁడు నన్ను *సర్వ!*
వ్రాయమనె నిన్ను గూర్చి, నే వ్రాసినాడ,
నీదు కరుణతోఁ దమ్ముని నిలుపుము మృడ!

105.  ఓం అరుణగిరీశ్వరాయ నమః.
చం.  *అరుణగిరీశ్వరా!* జయము, హైందవధర్మము వెల్గఁ జేయుమా,
దురితుల దౌష్ట్యముల్ పెరిగి దుర్దశ హైందవధర్మమొందె, నీ
వరుణభయంకరాగ్నిని యనర్థపు మూలములన్ దహించుమా,
సరియెవరయ్య రక్షనిడ చక్కని నీకు, మహేశుఁడా! మృడా!

106.  ఓం కాలమూర్తయే నమః.
ఉ.  కాలమహాస్వరూపమది కానగ నీవెగ *కాలమూర్తి!*  నీ
మ్రోలను వ్రాలి భక్తిమెయి పూజలు చేసినఁ, గాల దుర్గతుల్
తేలికగా నశించునటు దివ్యముగా నొనరింతు వీవు, నా
యేలికవైన నీవె నను నేలుము ధాత్రిని దైవమా! మృడా!

107.  ఓం స్మృతిమాత్రేణ సంతుష్టాయ నమః.
ఆ.వె.   మాదు దైవమ *స్మృతిమాత్రేణ సంతుష్ట!*
నీవెకాదె కనఁగ? భావజ హర!
స్మృతిని నిలుము సతము, శ్రీమన్మహాభాగ!
వందనములు చేతు నందుమ మృడ!

108.  ఓం శ్రీమదపీతకుచాంబాసమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.
అరుణాద్రి వృత్తము.
స్వయం కల్పితము.
గణములు...భ - భ - త - ర - స - జ - ర..  యతి --12వ అక్షరం.
*శ్రీమదపీతకుచాంబాసమేత శ్రీ అరుణాచలేశ్వరా!* నతుల్,
ధీమణి! మంగళముల్ గాంచుమయ్య! తేజమునొప్పు పార్వతీపతీ!
క్షేమము గొల్పుము నీవే యనంత చిత్ప్రభతో వెలుంగు శంభుఁడా!
శ్రీమహనీయుఁడ! శ్రీసాంబ దేవ! శ్రీకర! మంగళంబులో మృడా!

శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శత నామాంచిత పద్య పుష్పార్చన సంపూర్ణం.

ఫలశ్రుతి.
అరుణగిరీశు నామముల నద్భుతరీతిని గల్గియున్న యీ
పరమపవిత్రమైన కృతి భక్తిగ నొప్పి పఠించు వారికిన్
పరము నిహమ్మునాహరుఁడె వర్ధిలఁజేయనొసంగు,  సంపదల్ 
కురయఁగఁ జేయు, సేమమును కూర్చును, నిక్కము, కూర్మినొప్పుచున్.

మంగళాశాసనము.
అరుణాద్రీశుఁడ, మంగళంబులగు నీకానంద సంధాయి! సు
స్థిర కల్యాణ మనోజ్ఞ కాంతి జగతిన్ దీపించు నీ కాంతిచే,
పరధర్మంబులు నాశమై, ధరణిపై భవ్యాత్మయౌ భారతీ
స్థిరధర్మంబులె నిల్చు, వైదికములున్  దీపించుఁ బ్రఖ్యాతిగాన్.

శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శత నామాంచిత పద్యపుష్పార్చన
సంపూర్ణం.

తేదీ. 08 - 8 - 2025. శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్ధశీ భృగువారం.
స్వస్తి.
కృతికర్త.  
చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.
చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ .,P.O.L.,  M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అగ్నిసూక్తము  ..  పద్యానువాదము.
 2) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
 3) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమున మూడు ప్రాసయతులతో ఒక్క 
     రోజులో వ్రాసినది.)
 4) ఆంధ్ర సౌందర్యలహరి. సంస్కృతశ్లోక, పదచ్ఛేద, అన్వయక్రమ, పద్య, ప్రతిపదార్థ, 
      భావసహితము.
 5) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.
 6) ఈశావాస్యోపనిషత్ పద్యానువాదము. తే. 04 - 11 - 2025.
 7) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
 8) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
 9) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 
      2025.
 10) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 11) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
 12) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
 13) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
 14) బాలభావన శతకము.
 15) మూకపంచశతి పద్యానువాదము.
 16) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
 17) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 18) రాఘవా! శతకము.
 19) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 20) రుద్రమునకు తెలుగు భావము.
 21) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 22) వసంతతిలక సూర్య శతకము.
 23) విజయభావన శతకము.
 24) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 25) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 
 26) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)
 27) శ్రీఅవధానశతపత్రశతకము.
 28) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
 29) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
 30) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
 31) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
 32) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
 33) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 
       118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.) 
 34) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
 35) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
 36) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 37) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ.10-3-2025మరియు 11-3- 2025.తేదీల మధ్యవిరచితము.
 38) శ్రీలక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
 39) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
 40) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున 
       మూడు మకుటములతో మూడు శతకములు.) 
 41) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
 42) శ్రీ శివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
 43) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
 44) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 
       సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో 
       సుందరోత్పల నక్షత్రమాల.)
 45) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
 46) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము
 47) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత  
       పాదఉత్పలమాలిక. 
 48) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)(ఏకదిన విరచితము)తే.20 – 4 – 2025. 
 49) సంక్షిప్త రామాయణము. పద్యానువాదము. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.