Tuesday, 20 May, 2025
సంక్షిప్త రామాయణం
ఆంధ్ర పద్యానువాదము.... చింతా రామకృష్ణారావు.
శ్రీమద్వాల్మీకీయ రామాయణే బాలకాండమ్ ।
ఓం శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమః.
శా. శ్రీమన్మంగళ రామచంద్ర చరిత శ్రీఖండ సౌరభ్యమున్
సామాన్యుల్ వరపండితుల్ చదువుచున్ సంక్షేపరామాయణ
శ్రీమన్మంగళకావ్యమందు గొననౌన్ జిత్తంబులన్ బొంగుచున్,
నీమంబొప్ప తెనుంగు చేసెద హరీ! నిన్ భక్తితోఁ గొల్చుచున్.
ఉ. శ్రీ గణనాయకా! నతులు, శ్రీరఘురాముని సచ్చరిత్రమున్
యోగులు భోగులున్ జదువ నొప్పిదమౌనటు సూక్ష్మసత్కథన్
రాగముతోడ వ్రాసెదను రమ్ము రచింపగ నిల్చి నా మదిన్,
నా గతి నీవె, విఘ్నములు నాయెడఁ గల్గకనీక కావుమా.
శా. శ్రీమన్మంగళ శాంభవిన్! హరిసతిన్, శ్రీవాణి నాత్మస్థుఁడౌ
రామబ్రహ్మము నాత్మలోన గొలుతున్, రామోద్ధతిన్ తత్ కథన్
ధీమంతుల్ కవిపండితుల్ పొగడగా దేదీప్యమానంబుగా
శ్రీమంతంబుగ వ్రాయఁ జేయుటకు నా చిత్తంబులో నిల్పుచున్.
మ. గురుదేవున్ వర రాఘవున్ దలచెదన్ గూర్మిన్ గృపన్ జూపగన్,
స్మరియింతున్ దలిదండ్రులన్ వినుత జన్మంబిచ్చి నన్ గాచుటన్,
వరణీయాద్భుత సత్కవీందుఁడగు నా వాల్మీకికిన్ మ్రొక్కెదన్,
పరమేశాని! రచింపఁ జేయుమిది నీ ప్రఖ్యాతి తెల్లంబుకాన్.
చం. జయమగు పాఠకాళికి, ప్రశస్త కవీశ్వరపాళికిన్ ధరన్,
జయమగు రామ సత్కథను సౌమ్యముగా విను భక్తకోటికిన్,
జయమగు రామదర్శనము చక్కగ పొందిన వారికెప్పుడున్,
జయమగు మంచి కోరెడి ప్రశాంత మనస్కులకెల్లవేళలన్.
అథ ప్రథమస్సర్గః
శ్లో. తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ॥ 1 ॥
శా. శ్రీమన్మంగళుఁడున్ దపస్వి, నిరత శ్రీ సంహితాధ్యాయియున్,
ధీమంతుండును, వాగ్విదాంవరుఁడు, ఖ్యాతిన్ గన్న మౌనీంద్రుఁడున్,
బ్రేమన్ గాంచెడి వాఁడు నౌ విధి సుతున్ శ్రీనారదున్ గోరె దే
వా! తెల్పంగదె యంచు మౌనివరుఁడౌ వాల్మీకి జిజ్ఞాసతోన్. (1)
భావము. తపశ్శీలుడును, వేదాధ్యయననిరతుడును, వాక్చతురులలో
అగ్రేసరుడును, మునిశేఖరుడును, ఐన నారదుని గొప్ప తపస్వియైన
వాల్మీకిమహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను.
శ్లో. కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2 ॥
తే.గీ. ఎవఁడు గుణవంతుఁడవనిపై? నెవఁడు వీరుఁ?
డెవఁడు ధర్మజ్ఞుఁడెన్నగా? నిలఁ గృతజ్ఞుఁ
డెవఁడు? సత్యవా గ్జగతిలో నెవఁడు? తలప
దృఢతరంబగు సంకల్పధీరుఁడెవఁడు? (2)
భావము. “ఓ మహర్షీ! సకలసద్గుణసంపన్నుడును, ఎట్టి విపత్కర
పరిస్థితులలోను తొణకనివాడును, సామాన్య విశేష (లౌకికాలౌకిక) ధర్మములను
ఎఱిగినవాడును, శరణాగతవత్సలుడును, ఎట్టి క్లిష్టపరిస్థితులయందును
ఆడితప్పనివాడును, నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు
ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు?
శ్లో. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3 ॥
తే.గీ. నుత సదాచార ధనుఁడుఁ, బ్రాణుల కిలపయి
హితుఁడు, సకల శాస్త్రకుశలుఁ, డెన్న సర్వ
కార్య ధుర్యుఁడు, సంతోష కారి తనదు
దర్శనముచేత నెవ్వఁడు ధాత్రిపైన? (3)
భావము. సదాచారసంపన్నుడును, సకలప్రాణులకును (తనయెడ విముఖులైన
వారికిని) హితమును గూర్చువాడును, సకలశాస్త్ర కుశలుడును, సర్వకార్య
ధురంధరుడును, తనదర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును
ఐన మహాపురుషుడెవడు?
శ్లో. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4 ॥
తే.గీ. విజిత క్రోధ సదాత్ముఁడు, విశ్వమునను
నుత సుశోభను విలసిల్లు నతులితాఽన
సూయుఁడ తని కోపమునకు సురలు జడుతు
రట్టివాఁడెవ్వఁడిద్ధరనరయఁ జెపుమ. (4)
భావము. ధైర్యశాలియు, క్రోధమును (అరిషడ్వర్గమును) జయించిన వాడును,
శోభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున
కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు
మహాపురుషుడు ఎవడు ?
శ్లో. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥ 5 ॥
తే.గీ. ఇట్టి విషయముల్ మీ నుండి యెఱుఁగ నిచ్ఛఁ
గలిగి యుంటిని, నాపైన కరుణఁ జూపి,
చెప్పుటకు మీరె తగుదురు, చెప్పుఁడంచు
వేడుకొనుచుంటి ననె ముని వేడ్క మీర. (5)
భావము. ఈ విషయములనుగూర్చి తెలిసికొనుటకు నేను మిక్కిలి
కుతూహలపడుచున్నాను. ఓ మహర్షీ! మీరు సర్వజ్ఞులు, ఇట్టి. మహాపురుషుని
గుఱించి తెలుపగల సమర్థులు మీరే."
శ్లో. శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః ।
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ॥ 6 ॥
తే.గీ. పలుకు వాల్మీకి మాటలన్ బరవశమున
మూడులోకాల నెఱిఁగిన మునివరుండు
విని, మహర్షీ! వచించెద వినుమటంచు
పలికె నాతనితోఁ దాను బదులుగాను. (6)
భావము. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి, ఎంతయు
సంతోషించెను. పిమ్మట అతడు "ఓ మహర్షీ! సరే! వినుము” అని వాల్మీకితో ఇట్లనెను.
శ్లో. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ॥ 7 ॥
తే.గీ. ఓ మునివర! నీవనినట్టి యుత్తమగుణ
చయము నరులలో దుర్లభం బయినఁ గాని
స్మృతికిఁ దెచ్చుకొని వచింతు చిత్తమలర,
శ్రద్ధతోడను వినుదువు, చక్కఁగాను. (7)
భావము. “ఓ మునీ ! నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు
ఒక్కరియందే కుదురుకొనియుండుట సాధారణముగ దుర్లభము. ఐనను
స్మృతికి దెచ్చుకొని, అట్టి గుణములు గల ఉత్తమపురుషుని గూర్చి తెలిపెదను
వినుము.
శ్లో. ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ॥ 8 ॥
తే.గీ. ధరణినిక్ష్వాకుకులభవుఁ డరయ రాముఁ
డనుపమానుండు, జగతిని వినుతిఁ గాంచె,
సన్నియతమతి, వీరుఁడు, సత్వ, తేజ
భర జితేంద్రియుఁడును, ధైర్యశూరుఁడతఁడు. (8)
భావము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన
శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రప్రసిద్ధుడాయెను. అతడు
మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి,
జితేంద్రియుడు.
శ్లో. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః ॥ 9 ॥
చం. నిరుపమ బుద్ధిశాలియును నీతివిశారదుఁడున్, మహాహనుం
డరయగ వాగ్విదాంవరుఁడు, నాతఁడు శత్రు నిబర్హణుండు, శ్రీ
వరలెడువాడుచూడ ఘనబాహుఁడు, సన్నుత కంబు కంఠుఁడున్,
వరనుతబాహుశోభితుఁడు భాస్కరవంశజ దివ్యతేజుఁడున్.(9)
భావము. ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా
మాటాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు,
ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె
నునుపైన కంఠముగలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు)
గలవాడు.
(20-9-2025)
శ్లో. మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః ।
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ॥ 10 ॥
తే.గీ. గొప్ప వక్షంబు, పెనువిల్లు, గూఢ జత్రు
వమరిన యరి దమనుఁడును ననుపమమగు
ఘనతరాజానుబాహువు, వినుత సుశిరుఁ
డు సులలాటుఁడు, రాముండు, నసముఁడరయ. (10)
భావము. విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనుస్సుగలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపుచేయ
గలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు,
అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన
నడక గలవాడు.
శ్లో. సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ॥ 11 ॥
తే.గీ. సముచితంబైన యవయవ సౌష్టవంబు,
స్నిగ్ధవర్ణ, ప్రతాపముల్, చెన్నుమీరు
పీనవక్ష, సునేత్రముల్, వినుతలక్ష్మి
నొప్పు శుభలక్షణుఁడు రాముఁ డి ప్పుడమిని. (11)
భావము. శ్రీరాముడు అంతగా పొడవుగాని, పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది- అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందుగావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షఃస్థలము గలవాడు, విశాలమైన కన్నులుగలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు,
(20-10-2025)
శ్లో. ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ 12 ॥
తే.గీ. సత్యసంధుఁడు ధర్మజ్ఞ సాధుశీలి,
క్షితి ప్రజాహిత రతుఁడును, కీర్తియుతుఁడు,
జ్ఞానధనుఁడును, శుచియును, సాధువశ్యుఁ
డును, సమాధినొప్పెడి ఘనుఁడు రఘువరుఁడు. (12)
భావము. రాముఁడు ధర్మమునెఱిగినవాఁడు. సత్యమునకు కట్టుబడువాఁడు. ప్రజలహితముపైన ఆసక్తి కలవాఁడు. కీర్తిమంతుఁడు. జ్ఞానసంపద కలవాఁడు. స్వయముగా పవిత్రుడు, భక్త (ఆశ్రిత) పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు.
శ్లో. ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥
తే.గీ. బ్రహ్మసదృశుఁడు, కనఁగ శ్రీపతిసముండు,
ఫాలనేత్రుండు శత్రునిర్మూలనమున
లోకజీవసంరక్షణాలోలుఁడరయ,
ధర్మరక్షుఁడు రాముండు ధాత్రిపైన. (13)
భావము. రాముఁడు ప్రజాపతి బ్రహ్మతో సమానమైనవాఁడు. విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుఁడు, శత్రువులను పరిమార్చుటలో హరునివంటివాడు, లోకమునందలి జీవులను రక్షించువాడు, ధర్మమును పరిరక్షించువాఁడు.
శ్లో. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥
తే.గీ. తనదు ధర్మ సంరక్షకుఁడనవరతము,
స్వజన రక్షకుం డరయగ, సత్వమూర్తి,
వేదవేదాంగ తత్త్వజ్ఞ సాధు హితుఁడు,
మహి ధనుర్వేద నిష్ఠిత మహితుఁడరయ. (14)
భావము. తనయొక్క ధర్మమును రక్షించువాఁడు. స్వజనులను రక్షించువాఁడు. వేదములయొక్క, వేదాంగములయొక్క తత్త్వమునెఱిఁగినవాఁడు. ధనువేదమునందు శ్రద్ధ కలవాఁడు.
శ్లో. సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞో స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ 15 ॥
తే.గీ. సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞుఁడుర్విపైన,
స్మృతియుతుండు, తానన్నిటన్ ప్రతిభుఁడెన్న,
సకల లోకప్రియుండును, సాధుమూర్తి,
తా వివేకియు, కనఁగ నుదార గుణుఁడు. (15)
భావము. సకలశాస్త్రములను సాకల్యముగా ఎఱిగినవాడు, శాస్త్రాదివిషయములయందు ఏమరుపాటు లేని వాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తిగలవాడు, సమస్తజనులకును ప్రీతి పాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు, ఉదారస్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు.
శ్లో. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః ॥ 16 ॥
తే.గీ. సంద్రమును చేరునదులట్లు సకల సత్పు
రుషులు రాఘవున్ జేరుదురు సతతంబు,
సకల జనులను రాముండు చక్కఁగఁ గను,
నాతనిని గాంచఁ బ్రీతియే యమరుచుండు. (16)
భావము. నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందటికిని పూజ్యుడు, ఎవ్వరి యెడలను వైషమ్యములుగాని తారతమ్యములు గాని లేక మెలగువాడు, ఎల్లవేళల అందఱికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండు వాఁడు రాముఁడు.
శ్లో. స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః ।
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ॥ 17 ॥
తే.గీ. సకల సద్గుణుఁ డాతఁడు, సంద్రమటుల
మహిత గంభీరుఁడెన్నఁగ, మహిని ధైర్య
మందు హిమవంతుఁడరయంగ, ననుపముఁడగు
మాన్య కౌసల్యసుతుఁడు, సమ్మాన్య ఘనుఁడు. (17)
భావము. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు.
శ్లో. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ॥ 18 ॥
తే.గీ. వీర్యమందున విష్ణువు, ప్రీతిఁ గొలుపు
చంద్రునట్టులన్ గనినచో, సాంద్రమయిన
క్రోధమందున కాలాగ్ని, గొప్పదయిన
భూమియే రఘురాముండు పుడమి క్షమను, (18)
భావము. పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రునివలె ఆహ్లాదకరుడు, సుతిమెత్తని హృదయము గలవాడేయైనను తన ఆశ్రితులకు అపకారము చేసినవారియెడల ప్రళయాగ్నివంటివాడు. సహనమున భూదేవి వంటివాడు.
శ్లో. ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ।
తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ 19 ॥
తే.గీ. త్యాగమున కుబేరుండు, సత్యమున ధర్మ
దేవతయె, పరాక్రమమున, దివ్యమయిన
సత్య సత్సుగుణములతోనిత్యముండు
రాఘవుండిల ధర్మసంరక్షకుండు. (19)
భావము. కుబేరునివలె త్యాగస్వభావముగలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘపరాక్రమశాలియైన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు.
శ్లో. జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా ॥ 20 ॥
తే.గీ. అన్నదమ్ములనాద్యుండు ననుపమమగు
శ్రేష్ఠగుణుఁడు, దాశరధి సత్ప్రియముతోడ
ప్రజలకిల యుక్త హితములు ప్రబలఁ జేయు,
ప్రకృతికినిప్రియ కామ్యముల్ వరలఁ జేయు. (20)
భావము. రాముఁడు సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు, ప్రకృతికి ప్రియకామ్యములు వరలఁ జేయువాఁడు.
శ్లో. యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
తస్యాభిషేకసంభారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21 ॥
తే.గీ. ప్రీతితో రాజు యోచించె వినుత యౌవ
రాజ్యపట్టాభిషేకమ్ము రామునకును
చేయవలెనంచు, సతి కైక చేయుచున్న
పనులు గాంచెను, మందర పల్కులువిని. (21)
భావము. అట్టి సకల సుగుణాభిరాముడు ఐన శ్రీరామచంద్రునకు తన మంత్రులవిజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజపట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. దశరథుని భార్యయగు కైకేయి రామునకు చేయుచున్న యౌవరాజ్యపట్టాభిషేక సంబారము చూచెను.
శ్లో. పూర్వం దత్తవరా దేవీ వరమేన మయాచత ।
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22 ॥
తే.గీ. రెండువరములు పూర్వము నిండుమదిని
కైకకిచ్చె దశరథుఁడు, కైక కోరె
నిప్పుడారామునడవికి చప్పుననిపి
భరతునే యువరాజుగా వసుధ నిలుప. (22)
భావము. పూర్వము (శంబరాసురుని జయించిన సందర్భమున) దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయుమనియు ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె తన భర్తనుకోరెను.
శ్లో. స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః ।
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ॥ 23 ॥
తే.గీ. సత్యసంధుఁడు, సద్గుణసంస్తుతుండు,
ధర్మబద్ధుఁడయినయట్టి దశరథునకు
పంప నవసరపడె సుతున్ మాట కొరకు
నడవికిన్, గర్మ తప్పింప నలవి కాదు. (23)
భావము. సత్యసంధుడైన ఆ దశరథమహారాజు ధర్మమునకు కట్టుబడి, ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను.
శ్లో. స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ ।
పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ॥ 24 ॥
తే.గీ. తండ్రిమాటను పాలించు తనయుఁడగుచు
వనమునకునేగె తా తండ్రి ప్రతిన నెఱిగి
నిలుపుచును, కైకకున్ బ్రీతిని గొలుపుచును,
రమ్యగుణగణ్యమహితుఁడారాముఁడెలమి. (24)
భావము. వీరుడైన శ్రీరాముఁడు కైకేయికి ప్రియమును గూర్చుటకై, తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి, పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను.
శ్లో. తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ ।
స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః ॥ 25 ॥
తే.గీ. వినయసంపన్న భక్తుఁడు, వినుతమూర్తి
లక్ష్మణుఁడు రాముననుఁజుఁడు లక్ష్య మొప్ప
యన్నపై ప్రేమ, భక్తియు మిన్నుఁ దాక
వనమునకునేగె రామునిననుసరించి. (25)
భావము. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియసోదరుడు, మిక్కిలి వినయసంపన్నుడు, రామునియందు భక్తితత్పరుడు. రాముఁడడవికి జనుచుండ తానును అన్నననుసరించె అడవికి ఏగెను.
(21-10-2025)
శ్లో. భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ ।
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా ॥ 26 ॥
తే.గీ. కనగనిది సోదరునికిని గణ్యమైన
ప్రీతితో సోదరుని ప్రేమ విరియుటగును,
రామునకుఁ బ్రియ పత్నియౌ రమణి సీత
నిత్యమతనికిఁ బ్రాణమై నిలుచునెపుడు. (26)
భావము. సోదరుడికి ప్రియమైన సోదరభావాన్ని చూపించడం. రాముడికి ప్రియమైన భార్య సీత, ఎల్లప్పుడూ ప్రాణంలా ఉండేది.
శ్లో. జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా ।
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః ॥ 27 ॥
తే.గీ. సీత జనకుని వంశ సంజాత, దేవ
మాయ వలె నిర్మితాంగన, మహిత గణ్య
దివ్య సల్లక్షణాన్విత, దీపకళిక,
స్త్రీలలోఁ గన నుత్తమ స్త్రీ ధరిత్రి. (27)
భావము. జనకునివంశమున పుట్టిన సీత దేవ మాయ వలె అపూర్వమైన సౌందర్యము గలది, సర్వ శుభలక్షణ శోభిత. స్త్రీలలో ఉత్తమురాలు.
శ్లో. సీతాఽప్యనుగతా రామం శశినం రోహిణీ యథా ।
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ॥ 28 ॥
తే.గీ. శశిని రోహిణి వలె సీత చక్కగాను
పతిననుసరించి వెడలెను వనమునకును,
పౌరులును కొంత దూరము వచ్చినారు,
తాను కూడ వచ్చెనటుల దశరథుండు. (28)
భావము. సీతయును చంద్రుని అనుసరించు రోహిణి వలె పతియగు రాముని అనుసరించి అడవికి పయనమయ్యెను. పౌరులును (ఆయనను విడిచియుండలేక) చాల దూరము ఆయనను అనుగమించిరి. దశరథుడును అనుసరించెను.
శ్లో. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ ।
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ॥ 29 ॥
తే.గీ. గంగ యొడ్డున కలయట్టి శృంగిభేర
పుర నిషాదాధిపుని, భక్తవరుని గుహుని
ధర్మనిరతుఁడు రాముండు దరికిఁ జేరె,
రథమునంపెను వెనుకకు, ప్రాకటముగ. (29)
భావము. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు ఐన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని (రథమును) వెనుకకు పంపివేసెను.
22 - 10 - 2025.
శ్లో. గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయా ।
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ॥ 30 ॥
తే.గీ. నదులనే దాటి రాముండు కదిలి తాను.
గుహునితో పాటు సీతతో కూర్మితమ్ము
డయిన లక్ష్మణ సహితుఁడై యడవియడవి
నడచుకొనుచును ముందుకు వెడలి వెడలి. (30)
భావము. శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడను, గుహునితోడను గూడి జలసమృద్ధి గల నదిలను దాటి అడవి నుండి అడవికి నడచుకొనుచు సాగిపోవుచు. (తరువాత పద్యముతో అన్వయము).
శ్లో. చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ ।
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ॥ 31 ॥
తే.గీ. ఋషి భరద్వాజునాజ్ఞచే నసమ చిత్ర
కూట మునకు చేరిరచట గొప్పదైన
పర్ణశాలను నిర్మించి, వరలిరందు
సుఖముగా వారు మువ్వురున్, శోభిలుచును. (31)
భావము. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి, సీతారామలక్ష్మణులు మందాకినీ నదీతీరమునగల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కనిపర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును నివసింపసాగిరి.
శ్లో. దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్ ।
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ॥ 32 ॥
తే.గీ. దేవగంధర్వ సములయి దివ్యగతిని
పర్ణశాలనుమువ్వురున్ వరలుచుండి,
రటుల చిత్రకూటంబున నలరు సుతుని
కొఱకు దశరథుం డార్తిని కూరుకొనెను. (32)
భావము. ఆ మువ్వురూ దేవగంధర్వసదృశులై సుఖముగా ప్రశాంతముగా ఆ పర్ణశాలయందు జీవింపసాగిరి. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా (అయోధ్యలో) దశరథమహారాజు పుత్ర శోకమునకు లోనయ్యెను.
శ్లో. రాజా దశరథః స్వర్గం జగామ విలపన్సుతమ్ ।
మృతే తు తస్మిన్భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥ 33 ॥
తే.గీ. దశరథుండు శోకించుచు తనయునికయి,
స్వర్గమును చేరె మృతినొంది, సత్వరంబె
వరవశిష్ఠాదిఋషులట భరతునికడ
కరిగి కలిసి రా మహితుని నర్థితోడ. (33)
భావము. దశరథమహారాజు పుత్ర శోకకారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు భరతుని కలిసిరి.
శ్లో. నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ॥ 34 ॥
తే.గీ. కొనుము రాజ్యాధికారమ్ము కొమరుమిగుల
భరత! యని పల్కిరా మునుల్, భరతుఁ డటులఁ
గొనఁగ నిచ్చగింపక యేగె వనమునకును
రాముననుమతిన్ బాదుకల్ రహిని గొనఁగ. (34)
భావము. వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని నియోగించిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై, వనములకు బయలుదేరెను.
23 - 10 - 2025.
శ్లో. గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ।
అయాచద్భ్రాతరం రామం ఆర్యభావపురస్కృతః ॥ 35 ॥
తే.గీ. నుత పరాక్రమునిని, సత్యనుతుని, రాముఁ
నార్యభావపురస్కృతుండనుపముఁడగు
భరతుఁడల చేరి, శ్రీరామ వరుఁ డడుగక
నే వచించెను నుతమతిన్ నిరుపమముగ. (35)
భావము. ఆ భరతుఁడు సత్యపరాక్రమశాలి, మహాత్ముఁడు, సోదరుఁడు ఐన రాముని వద్దకు వెళ్లి, మహోన్నతమైన గౌరవ భావనతో రాముఁడు అడకకుండగనే తాను ఇట్లు పలికెను.
శ్లో. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ ।
రామోఽపి పరమోదారః సుముఖస్సుమహాయశాః ॥ 36 ॥
తే.గీ. రాజు వీవేను, ధర్మజ్ఞ రమ్యుఁడవును
నీవె, యనిపల్కె భరతుండు, నిరుపముఁడగు
రామునిని గాంచి, యతఁ డుదారగుణయుతుఁడు,
వాసిఁగాంచిన సుముఖుండు, భవ్యమూర్తి. (36)
భావము. నీవే రాజువు, ధర్మము తెలిసిన వాడవు, అని రాముని ఉద్దేశించి భరతుడు పలికెను. రాముఁడు మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచినవాడు.
శ్లో. న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః ।
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ॥ 37 ॥
తే.గీ. తండ్రియాజ్ఞచేఁ, బాలనన్ తాను గొనక,
నుత మహాబలుఁడగు రాముఁడతులితముగ
న్యాసముగ పాదుకలనిచ్చె, నచ్చచెప్పె,
రాముఁడంపగ భరతుని రాజ్యమునకు. (37)
భావము. మహాబలుఁడు అయిన శ్రీరాముఁడు తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముఁడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి, పలువిధములుగా నచ్చజెప్పెను.
శ్లో. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ।
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ॥ 38 ॥
తే.గీ. రాముడంపెను భరతుని రాజ్యమునకు,
కోరికీడేరకున్నను గొనుచు రామ
పాదుకలను, రాముని దివ్యపాదములకు
వందనముచేసి మరలెను భరతుఁడపుడు. (38)
భావము.
శ్రీరాముడు భరతుని రాజ్యమునకు తిరిగి వెళ్ళమని ఒప్పించెను. భరతుఁడు 'అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను' - అను తన లక్ష్యము నెరవేఱకున్నను, రామపాదములను స్పృశించి, నమస్కరించి వెనుతిరిగెను.
శ్లో. నందిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా ।
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః ॥ 39 ॥
తే.గీ. ఇంద్రియజితుఁడు, శ్రీమంతుఁ డిద్ధరిత్రి
సత్యసంధుఁడు భరతుఁడు సహనశీలు
డెదురు చూచుచు నన్నకై మదిని నిలిపి
ప్రోలునేలె నందిగ్రామముననె యుండి. (39)
భావము. శ్రీమంతుడు, సత్యసంధుడు జితేంద్రియుడైన భరతుడు అతను వెళ్ళిపోయిన తర్వాత రాముడు తిరిగి వచ్చుననెడి ఆశతో నందిగ్రామంలోనే రాజ్యాన్ని పాలించాడు.
శ్లో. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ ।
తత్రాగమనమేకాగ్రో దండకాన్ప్రవివేశ హ ॥ 40 ॥
తే.గీ. చూచి రాముఁడు తమనట చూడవచ్చు
జనుల వలన తాపసులకు జరుగు భంగ
మనుచు నటనుండి చనె దండకాటవికిని,
తమ్ముఁడును సీత తనతోడఁ దరలి రాగ. (40)
భావము.
శ్రీరాముడు తన దర్శమునకై తఱచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి, ఆ కారణముగా అచటి మునులతపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను.
శ్లో. ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ॥ 41 ॥
తే.గీ. రమ్య రాజీవ నేత్రుఁడు రాముఁడటుల
దండకారణ్యమును జేరి, తాను చంపె
నట విరాదుఁడన్ రాక్షసు నమితభక్తి
ని శరభంగ ఋషిన్ గనె నియతి తోడ. (41)
భావము. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు 'విరాధుడు' అను రాక్షసుని సంహరించెను. శరభంగమహర్షిని దర్శించెను.
శ్లో. సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా ।
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనమ్ ॥ 42 ॥
తే.గీ. కనె సుతీక్షునగస్త్యుని, వినయమొప్ప,
కనె నచట నగస్త్యభ్రాతను, నయవినుతుఁ
డయిన రాముం డగస్త్యుని యాజ్ఞనతని
ఘన శరాసన, హరివిల్లులను గ్రహించె. (42)
భావము. శ్రీరాముడు సుతీక్షుని, అగస్త్యమునిని, ఆయనసోదరుని దర్శించెను. అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును గ్రహించెను.
26 - 10 - 2025.
శ్లో. ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ।
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ॥ 43 ॥
తే.గీ. అనుపమాక్షయ సాయకమైన యమ్ము
లపొది, కత్తి, రామునకిష్టము పరికింప,
వనచరులతోడనడవిలో వసనముండె
రామచంద్రుండు, వరణీయ రమ్యగుణుఁడు. (43)
భావము. ఖడ్గము మరియు అక్షయ బాణాలు కలిగిన తూణీరము (బాణాల గూడు) రాముడికి ఎంతో ప్రీతికరమైనవి. శ్రీరాముడు వనచరులతో కలిసి అడవిలో నివసించుచుండెను.
27 - 10 - 2025.
శ్లో. ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ ।
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ॥ 44 ॥
తే.గీ. రక్కసులఁ జంపఁ గోరిరి రాము నచట
చేరి ఋషులెల్ల, రాముఁడా కోరికవిని
దైత్యసంహారమునుఁ జేయఁ దానునచట
వనచరులతోడ నివసించె వనమునందు. (44)
భావము. రాక్షసుల సంహారము చేయమని కోరడం కోసము అనేకమంది ఋషులు వచ్చి రామునివద్దకు చేరిరి. అప్పుడు రాముడు ఆ రాక్షసు సంహారార్థం అడవిలో వనచరులతో సహా నివసిస్తున్నపుడు, ఆ ఋషుల ప్రార్థనలను, అభ్యర్థనలను అంగీకరించాడు.
శ్లో. ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్ ॥ 45 ॥
తే.గీ. అగ్నికల్ప ఋషులు దండకాటవిన్ వ
సించు వారి కోరిక మేర త్రుంచుదునిల
రాక్షసులనని రాముఁడు ప్రతినబూని,
జన్మ పరమార్థమును గని సంస్తుతముగ. (45)
భావము. దండకారణ్యంలోని అగ్నితుల్యులైన ఋషుల కోరిక మేరకు, రాముఁడు యుద్ధంలో రాక్షసులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసెను.
శ్లో. తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ ।
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ॥ 46 ॥
తే.గీ. ఆ జనస్థానవాసియై యచట రాముఁ
డుండగా కామరూపిణి యుండె నచట
శూర్పణఖ, యామె ముకుచెవుల్ ఛురికతోడ
కోసినారు, కురూపిగాఁ జేసినారు. (46)
భావము. అప్పుడు రాముడు అక్కడ జనస్థానంలో నివసిస్తూ ఉండగా కామరూపిణి అయిన శూర్పణఖ అనే రాక్షసిని విరూపురాలిగా మార్చారు.
శ్లో. తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ॥ 47 ॥
తే.గీ. శూర్పణఖ మాటలను విని శూరులైన
త్రిశిరస, ఖర, దూషణులు కలిసి, యనేక
రాక్షసులతోడ వచ్చిరి రాముని గని,
యుద్ధమును జేసి, చంప సన్నద్ధులగుచు. (47)
భావము. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షసప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతోగూడి, యుద్ధసన్నద్ధులై వచ్చిరి.
శ్లో. నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ ।
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ॥ 48 ॥
తే.గీ. అంతటను రాముఁడొక్కఁడే యచటనున్న
త్రిశర, ఖర, దూషణులను, పదియునునాల్గు
వేల రాక్షస సైన్యమున్ నేలకొరఁగఁ
జంపె, దివ్యమహాద్భుత శక్తినొప్పి. (48)
భావము. అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన పదునాలుగు వేలమంది రాక్షసయోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను.
శ్లో. రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ ।
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ॥ 49 ॥
తే.గీ. త్రిశర, ఖర, దూషణులను, పదియునునాల్గు
వేల రాక్షస సైన్యమున్ నేలకొరఁగఁ
రాముఁడే చంపెనను వార్త రావణుండు
శూర్పణఖచెప్ప కోపవశుఁడుగనయెను. (49)
భావము. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని, క్రోధముతో ఉడికిపోయెను.
శ్లో. సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ।
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ॥ 50 ॥
తే.గీ. తనకు సాయము చేయమంచనియె రావ
ణుండు మారీచుని గని, ఘనుండు రాముఁ
డతనితో వైరమొప్పదంచతని నపుడు
తగ నివారింపఁ జూచె నతనిని గనుచు. (50)
భావము. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి, (సీతాపహరణ విషయమై) అతని సహాయమును అర్ధించెను. అప్పుడామారీచుడు "శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటివానితో విరోధము నీకు తగదు." అని పలికి, రావణుని పెక్కువిధముల వారించెను.
శ్లో. న విరోధో బలవతా క్షమో రావణ తేన తే ।
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51 ॥
తే.గీ. రామచంద్రునితోడ వైరంబు తగదు,
రావణా! నీకన వినఁడు, రావణుండు,
కాలచోదితుఁడై తాను కదలె నపుడు
తోడ మారీచుఁ గొనిపోయె, దురితమతిని. (51)
భావము. వాని హెచ్చరికలను పెడచెవిన బెట్టి, ఆయువుమూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని పోయెను,
28 - 10 - 2025.
శ్లో. జగామ సహమారీచః తస్యాశ్రమపదం తదా ।
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52 ॥
తే.గీ. రాము నాశ్రమమునకు నా రావణుండు
చేరె మారీచునిఁ గొని, సుదూరమునకు
రామలక్ష్మణులరుగఁ, నాశ్రమము వీడ
చేసె మారీచు మాయచే, శీఘ్రముగను. (52)
భావము. ఆ విధముగా రావణుఁడు మారీచునితోసహా శ్రీరాముని ఆశ్రమ (పంచవటి) సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావియైన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పోవునట్లు చేసెను,
శ్లో. జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ।
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ॥ 53 ॥
తే.గీ. రామునాలిని గొనిపోయె రావణుఁడిల,
నడ్డువచ్చిన గృద్ధ్రమున్ హతమొనర్చి,
మృతిని పొందు జటాయువున్ క్షితిని గాంచి,
రాముఁ డెఱిఁగె సీతనుఁ గూర్చి, రగులుచు మది. (53)
భావము. రావణుఁడు సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డుతగిలిన 'జటాయువు' అను గృధమును ప్రాణములు పోవునట్లుగా గాయపఱచెను. చంపఁబడిన గృధ్రం (జటాయువు)ను చూచి, మైథిలి (సీత) అపహరించబడిన దని రాముఁడు వినెను.
శ్లో. రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః ।
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ॥ 54 ॥
తే.గీ. శోకసంతప్త రాఘవుఁ డాకులుఁడయె
మృతినిపొంద జటాయువు, క్షితి నతండు
దహనసంస్కారమును జేసె తప్తుఁడగుచు
చిత్తమున విలపించుచు సీత కొఱకు. (54)
భావము. జటాయువుమృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడెను. ఇట్లు శోకమున మునింగియు శ్రీరాముడు జటాయువునకు అంత్యసంస్కారములను నిర్వహించెను.
శ్లో. మార్గమాణో వనే సీతాం రాక్షసం సన్దదర్శహ
కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్.
తే.గీ. సీత జాడకై వెదకుటఁ జేయుచున్న
రామచంద్రుఁడు కాంచెను రక్కసునట
వికృతముగనున్నవానిని భీకరమగు
రూపుఁడగు కబందునిని, విరోధ మతిని. (55)
భావము. రాముఁడు అడవిలో సీతమ్మ కొఱకు వెతుకుతూ, చూచుటకు వికృతముగా ఘోరముగా ఉన్న కబందుఁడు అనే రాక్షసుని చూచెను.
శ్లో. తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః ।
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ॥ 56 ॥
తే.గీ. ఆ కబంధుని హతమార్చి యతనికి దివి
ప్రాప్తమగునట్లు చేసె దహనమొనర్చి,
యట్టి రామునికిని దెల్పె నాకబందు
డా శబరి ధర్మవర్తిని నరయు మనుచు. (56)
భావము. మహాబాహువైన శ్రీరాముడు ఆ దానవుని హతమార్చి, ఆ కళేబరమును దహింపజేసి అతనికి స్వర్గప్రాప్తి కలిగించెను.ఆ కబంధుడు శ్రీరామునితో ధర్మచారిణి అయిన శబరిని గూర్చి తెలిపెను.
శ్లో. శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవమ్ ।
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ॥ 57 ॥
తే.గీ. ధర్మనిష్ణాతురాలైన తల్లి శబరి
దర్శనము చేసుకొనుమంచతఁడు వచించె,
శత్రుసూదన, ధర్మనిష్ణాత రాముఁ
డరిగెశబరిని గాంచగ, ననుపమముగ. (57)
భావము. ధర్మంలో నిష్ణాతురాలైన శబరిని కలవమని రామునకు సూచించెను. శత్రువులను రూపుమాపువాడును, మహాతేజశ్శాలియు ఐన శ్రీరాముడు శబరికడకు వెళ్లెను.
29 - 10 - 2025.
శ్లో. శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ।
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ ॥ 58 ॥
తే.గీ. దశరధాత్మజ రాముండు తగిన రీతి
శబరి పూజలనందెను సన్నుతముగ
పంపయొడ్డున రాముండు వానరుఁడగు
హనుమను కలిసి యుండెను వినుతముగను. (58)
భావము. దశరధపుత్రుఁడగు రాముఁడు ఉచితరీతిలో శబరిచే పూజింపఁబడెను. పంపాసరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను.
శ్లో. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః ।
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ॥ 59 ॥
తే.గీ. హనుమ సూచనన్ సుగ్రీవునపుడు కలిసె
ఘనపరాక్రమమవంతుఁడు గౌరవముగ
రామచంద్రుండు, తెలిపె పరాత్పరుండు
తనదు వృత్తాంతమంతయున్ వినగ నతఁడు. (59)
భావము. ఆ వానరోత్తముఁడైన హనుమంతుని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్లెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును దెలిపెను.
శ్లో. ఆదితస్తద్యథావృత్తం సీతయాశ్చ విశేషతః ।
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ॥ 60 ॥
తే.గీ. మొదటినుండియు జరిగిన సుదతియైన
సీతవృత్తాంతమంతయున్ జెప్పె రాముఁ
డపుడు సుగ్రీవుఁడదియంత విపులముగను
వినుచు సర్వంబునెఱిఁగెను, విస్త్రుతముగ. (60)
భావము. సీతాపహరణ గాథను ఆద్యంతము సుగ్రీవునకు రాముఁడు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటిని వినెను.
శ్లో. చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ ।
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61 ॥
తే.గీ. అగ్నిసాక్షిగ స్నేహంబు ననుపముఁడగు
రామచంద్రునితో చేసె రమ్యగతిని
ప్రేమతోడుత సుగ్రీవుఁడా మహాత్ముఁ
డన్నతో తన వైరంబునపుడు చెప్పె. (61)
భావము. సుగ్రీవుఁడు శ్రీరామునితో సంతోషముతో అగ్నిసాక్షిగా మైత్రిని నెఱపెను. ఆ తర్వాత అతఁడు రామునితో అన్నయగు వాలితో తనకుఁ గల వైరమును గూర్చి చెప్పెను.
శ్లో. రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ।
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ॥ 62 ॥
తే.గీ. కనుల నీరున్న సుగ్రీవుఁ గాంచి యపుడు,
రాముఁడడిగి కారణమును ప్రేమతోడ,
తెలుసుకొని వాలినే చంపి తీరుదునని
చేసెను ప్రతిజ్ఞ నాతండు శ్రీకరముగ. (62)
భావము. దుఃఖించుచున్న వాలియొక్క దుఃఖమునకు గల కారణమంతయును ప్రేమగా అడిగి రాముఁడు తెలుసుకొనెను. అనంతరము రాముడు “వాలిని వధింతును” అని ప్రతిజ్ఞ చేసెను.
శ్లో. వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ।
సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ॥ 63 ॥
తే.గీ. వాలి బలపరాక్రమములు పలుక నేర
నంత ఘనమని సుగ్రీవు డనియె రామ
చంద్రుఁడు వినంగ, రాముని శక్తి వాలి
ని వధియింప చాలునొకొ? యని మదిఁ దలచె. (63)
భావము. పిమ్మట సుగ్రీవుడు వాలియొక్క (అసాధారణ) బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకుగల పరాక్రమము విషయమున సుగ్రీవునిమనస్సులో సందేహము మెదలుచుండెను.
శ్లో. రాఘవః ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్ ।
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ॥ 64 ॥
తే.గీ. రామునకు వాలి శక్తిని రహిని జూప
వాలి చంపగ దుందుభిన్ నేలపైన
పర్వతము వోలెపడి యుండి భయము గొలుపు
గుట్టగానున్న యెముకల గూడు చూపె. (64)
భావము. ఆయన బలపరాక్రమములను తెలిసికొనుటకొఱకు వాలిచే హతుడైన 'దుందుభి' యను రాక్షసుని మహాపర్వతసదృశమైన కళేబరమును సుగ్రీవుడు రాముఁనకుఁ జూపెను.
శ్లో. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః ।
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్ ॥ 65 ॥
తే.గీ. దుందుభి కళేబరము గాంచి, మందహాస
ముఖుఁడగుచు రామచంద్రుఁడు పూర్తిగాను
పడగ పదియోజనములది పన్నుగాను
కాలి గోటితో చిమ్మెను ఘనతరముగ. (65)
భావము. మహాపర్వతసదృశమైన ఆ అస్థిపంజరమును జూచి, మహాబాహువైన రాముడు ఒక చిఱునవ్వు నవ్వి, 'ఇంతేనా' అని యనుచు దానిని తన కాలి బొటనవ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా పదియోజనముల దూరమున పడిపోయెను.
శ్లో. బిభేద చ పునః సాలాన్సప్తైకేన మహేషుణా ।
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా ॥ 66 ॥
తే.గీ. మదిని సుగ్రీవునకుఁ గల మసకవంటి
సందియము బాప రాముండు శరము వీడ
నేడుతాడులన్ ద్రుంచి తానేకబిగిని,
పర్వతమును బాతాళమున్ వ్రయ్యఁ జేసె. (66)
భావము. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ఒకే గొప్ప బాణంతో ఏడు సాల వృక్షాలను చీల్చివేసాడు. తద్వారా, (ఆ బాణం యొక్క శక్తికి) పర్వతాన్ని, పాతాళాన్ని కూడా(జనింపఁ జేసెను) వ్రయ్యఁజేసెను.
శ్లో. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః ।
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా ॥ 67 ॥
తే.గీ. రామునసదృశమైన పరాక్రమమును
చూచి సుగ్రీవుఁడానంద వీచిఁ దేలె,
కొండలకుమధ్య గుహవలె నుండునట్టి
తనదు కిష్కింధ రాముని గొనుచు జేరె. (67)
భావము. అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును జూచి, ఎంతయు సంతోషించెను. . పిమ్మట అతడు రామునితో గూడి కొండలమధ్య గుహవలెనున్న కిష్కంధను సమీపించెను.
శ్లో. తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః ।
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68 ॥
తే.గీ. హేమపింగళవర్ణకపీశుఁడైన
మహిత సుగ్రీవుఁ డరిచెను మారుమ్రోగ
దిశలు, నాధ్వనిన్ విని వాలి యసమబలుఁడు
తనదు గృహము బైటకు వచ్చె దర్పమెలయ. (68)
భావము. బంగారు పింగళవర్ణములు గలవాడు, కపిశ్రేష్ఠుడు ఐన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని, వానరప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను.
శ్లో. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః ।
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ॥ 69 ॥
తే.గీ. తారనొప్పించి వాలి యు ద్ధమును చేయ
వెడలె సుగ్రీవునొద్దకు, వెనుకనుండి
రాముఁడొక్కబాణము వేసి వ్రాలఁ జేసె
నేలపైనను వాలిని నియతితోడ. (69)
భావము. 'సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్లవలదు' అని వారించుచున్న తారను సమాధానపఱచి, వాలి సుగ్రీవునితోతలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను.
శ్లో. తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే ।
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ॥ 70 ॥
తే.గీ. వినుతి చేయగ సుగ్రీవుఁ డనుపమముగ
వాలి వధ చేసె రాముండు, ప్రవరముగను
నపుడు కిష్కింధ రాజుగా నచట నిలిపె
వినుత సుగ్రీవు నా రాముఁడనితరముగ. (70)
భావము. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా జేసెను.
శ్లో. స చ సర్వాన్సమానీయ వానరాన్వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71 ॥
తే.గీ. వానరేంద్ర సుగ్రీవుఁడు వనములందు
వివిధ దేశములఁగల కపివరులెల్ల
నటకువచ్చునట్టులఁ జేసి, యతుల సీత
జాడ కనిపెట్టుటకుఁ బంపె సకల దిశలు. (71)
భావము. అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులనందఱిని రప్పించి, సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను.
శ్లో. తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72 ॥
తే.గీ. సీతనన్వేషణము చేయ ఖ్యాత బలుఁడు
హనుమ సంపాతి సూచన ననుసరించి
నూరు యోజనాల్గలుగు విస్తార మైన
లవణ జలధిని లంఘించె లాఘవముగ. (72)
భావము. పిమ్మట (సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణదిశకు వెళ్లిన) మహాబలసంపన్నుడైన హనుమంతుడు, సంపాతి సూచన మేరకు నూఱు యోజనముల విస్తీర్ణముగల లవణసముద్రమును ఒక్క గంతులో దాటెను.
శ్లో. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతామ్ ॥ 73 ॥
తే.గీ. రావణాసురపాలిత లంకఁ జేరె
హనుమ, సీతకైవెదకెడి యవసరమున
రామ జపమును జేయుచు క్రాలుచుండ
చూచె నాతఁడు సీత నశోకవనిని. (73)
(1వ పాదమున ర-ల అభేదయతి. {కం. రభసంబున నతని శరము*లను గడు నొంచెన్.. భారతము - ద్రోణ. 2.73} )
భావము. అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవికొఱకు వెదకుచు అతడు అశోక వనమున అడుగిడి, అచట రామధ్యానమున నిమగ్నమైయున్న జానకిని కనుగొనెను.
శ్లో. నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ 74 ॥
తే.గీ. మైథిలికి రామ సుగ్రీవ మైత్రిఁ దెలిపి,
హనుమ రామముద్రిక నిచ్చె ఘనముగాను,
సీతనోదార్చి వెడలుచు ఖ్యాతిగాను
లంకనేకాల్చెనాతఁడు జంకు లేక. (74)
భావము. పిదప ఆంజనేయుడు సీతాదేవికి 'రామసుగ్రీవుల మైత్రిని దెలిపి, రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి, ఆమెను ఓదార్చెను, పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను.
శ్లో. పంచ సేనాగ్రగాన్హత్వా సప్త మంత్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥ 75 ॥
తే.గీ. పంచ సేనాగ్రగాములన్ ప్రతిభతోడ
నేడుగురుమంత్రిపుత్రుల నిలకు కూల్చి,
చూర్ణముగ నక్షయకుమారశూరుఁ జేసి,
మూర్ఛ నటియించె బ్రహ్మాస్త్రమునకు హనుమ. (75)
భావము. హనుమంతుడు ఐదుగురు సేనాగ్రగాములను, ఏడుగురు మంత్రి పుత్రులను వధించి, శూరుఁడైన అక్షకుమారుడిని చూర్ణము చేసిన తర్వాత ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రముచే బుద్ధిపూర్వకముగా గ్రహణమునకు లోనయెను.
శ్లో. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా ॥ 76 ॥
తే.గీ. విధి వరమున బ్రహ్మాస్త్రము వీడెననుచు
హనుమ గ్రహియించి నటియించె తనకు మూర్ఛ
వచ్చినట్టుల, రాక్షస బాధల నతఁ
డోర్చుకొనుచునే, చంపె తానొప్పిదముగ. (76)
భావము. నిరుపమాన పరాక్రమశాలియైన వాయునందనుడు బ్రహ్మవరప్రభావమున బ్రహ్మాస్త్రమునుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. ఐనప్పటికిని హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైయున్నట్లు నటించుచు, రాక్షసులుపెట్టు బాధలను సహించెను. హనుమంతుడు రాక్షసులను యాంత్రికముగా నాశనం చేసెను.
శ్లో. తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥ 77 ॥
తే.గీ. పిదప లంకను దహియించె, విడిచి సీత
యున్నవనమును హనుమ, మన్ననముగ
రామునకుఁ బ్రీతిఁ గొలిపెడి రమ్య వార్తఁ
దెలుప రాముని కడకేగ తిరిగి వచ్చె. (77)
భావము. (రావణాజ్ఞననుసరించి, రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా) మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను దెలిపి, శ్రీరామునకు ప్రీతినిగూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువుసమీపమునకు మఱలివచ్చెను.
శ్లో. సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ ।
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥ 78 ॥
తే.గీ. రామచంద్రునికడ కేగి రమ్యగతిని
తా ప్రదక్షిణన్ జేయుచు తనియ ప్రభువు
చూచినాడను సీతను శుభదరామ!
యనుచు తెలిపెను హనుమ జ్ఞేయంబు కాగ. (78)
భావము. మహాబుద్ధి శాలియైన పవనసుతుడు 'కనుగొంటిని సీతమ్మను' అని పలికి, రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి యెడబాటునకు లోనయ్యును. నిశ్చలుడై యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను.
30 - 10 - 2025.
శ్లో. తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ॥ 79 ॥
తే.గీ. హనుమ మాటలకానంద మంది రాము
డరిగె సుగ్రీవసహితుఁడై యబ్ధిదరికి
సూర్య తీక్ష్ణ బాణములు ప్రశోభితముగ
వేసి క్షోభ సాగరునకుఁ బెంచెనతఁడు. (79)
భావము. హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట, శ్రీరాముడు సుగ్రీవాదులతోగూడి, మహాసముద్ర తీరమునకుచేరెను. అనంతరము అతడు సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను.
శ్లో. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ॥ 80 ॥
తే.గీ. సాగరుఁడు రామచంద్రుని సన్నిధి నట
నిలిచి, సూచించె వారధి నిర్మితికిని,
నలుని సాయంబుతో సేతువలఘు రీతి
పూర్తి చేసెను రాముండు స్ఫూర్తితోడ. (80)
భావము. సముద్రుడు తన భయంకరమైన రూపమును ప్రదర్శించి, శ్రీరామునితో నీకు సహాయం చేయుదునని, దారి ఇచ్చెదనని చెప్పి, నలుని ద్వారా సేతువును నిర్మించమని సూచించెను. సముద్రుని సూచనలను అనుసరించి, శ్రీరాముడు సముద్రముపై నలునిద్వారా సేతువును నిర్మింపజేసెను.
శ్లో. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే ।
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81 ॥
తే.గీ. రాముఁడా సేతువున చేరె లంక, యచట
యుద్ధమున రావణునిఁ జంపె, నొప్పిదముగ
చేరి తన సతిన్, పరునింటఁ జేరియున్న
సీత నతులితన్ గైకొనన్ సిగ్గుపడెను. (81)
భావము. . శ్రీరాముడు ఆ సేతువు ద్వారా లంకను జేరి, రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి, పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు (లోకాపవాద శంకతో) సిగ్గుపడి వెనుకాడెను.
శ్లో. తామువాచ తతో రామః పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ॥ 82 ॥
తే.గీ. పరుల పంచను గలవని పరుషముగను
పలికె రాముండు జనుల కవగతమవగ,
సీత ఘనత, యా మాటలన్ జెలగె మదిని
మంట సీతకామెయె దూకి మంటను బడె. (82)
భావము. శ్రీరాముడు (సీతాదేవి సౌశీల్యమునుగూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందఱియెదుట) పరుష వచనములను పలికెను. సాధ్వియైన ఆ సీతాదేవి ఆకఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
శ్లో. తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ॥ 83 ॥
తే.గీ. అగ్ని ప్రత్యక్షమై పల్కెనందరు విన,
జనకజాత్మజ సీతమ్మ సాధ్వియనుచు,
రాముడానందమొందెను, రామవిభుని
ననిమిషులు పూజ చేసిరి యనుపముఁడని. (83)
భావము. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత" అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమసంతుష్టుడాయెను. దేవతలందరిచేతను పూజింపఁబడెను.
శ్లో. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ ।
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ॥ 84 ॥
తే.గీ. మూడులోకాలఁ గలయట్టి మునులు, దేవ
తలు, చరాచర గణములు ధర మహాత్ముఁ
డయిన రాముని వర్తన, నియతిఁ జూచి
సంతసించిరి మిక్కిలి, సంస్తుతముగ. (84)
భావము. మహాత్ముఁడైన శ్రీరాముని ఆ గొప్ప కర్మ వలన ముల్లోకములు, దేవతలు, ఋషులు సంతోషించిరి.
శ్లో. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ॥ 85 ॥
తే.గీ. రాక్షసేంద్ర విభీషణున్ లంకకుఁ బతిఁ
జేసె రాజ్యాభిషేకమ్ము చేసి రాముఁ
డతులితానందమును బొందె నటుల తాను
చేయనెంచిన దానిని చేసి ధరను. (85)
భావము. పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్నమనస్కుడయ్యెను.
శ్లో. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ॥ 86 ॥
తే.గీ. దేవతలనుండి వరములు తీసుకొనిన
రాముఁ డా యనిన్ మృతులైన సోమములను
బ్రతుకఁ జేసి యయోధ్యకుఁ బ యనమయెను
పుష్పకమున మిత్రాళితోఁ బొంగుచు మది. (86)
భావము. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతలనుండి వరములను పొంది, శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, వానరులందఱితో గూడి పుష్పకవిమానముపై అయోధ్యకు బయలుదేరెను.
శ్లో. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః ।
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ॥ 87 ॥
తే.గీ. మహితమగు భరద్వాజాశ్రమమును జేరి
సత్యమూర్తిపరాక్రమ శాలి రాముఁ
డా హనుమను బంపెను భరతాంతికమున
కు తన మాట నిల్పుకొనుచునతులితముగ. (87)
భావము. శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. "పదునాలుగుసంవత్సరములు పూర్తియైన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును" అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతునియొద్దకు పంపెను.
శ్లో. పునరాఖ్యాయికాం జల్పన్సుగ్రీవసహితశ్చ సః ।
పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా ॥ 88 ॥
తే.గీ. అటుల వారు నందిగ్రామ మరుగువేళ
పుష్పకమునందు రాముండు పూజ్యమిత్ర
వరులు, సుగ్రీవుడాలింప, జరిగిన కత
లెన్నుచును జెప్పు రాముండు మిన్నగాను. (88)
భావము. శ్రీరాముడు పుష్పక విమానంలో సుగ్రీవుడితో కలిసి నందిగ్రామానికి తిరిగి వెళుతున్నప్పుడు, జరిగిన సంఘటనలన్నింటినీ మళ్ళీ చెబుతున్నాడు.
శ్లో. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ॥ 89 ॥
తే.గీ. పూజ్యమైన నందిగ్రామమున జటలను
విడిచిపెట్టి, సోదరులతో కలిసి పాప
రహితముగనున్న రాముండు రమ్యమైన
జనకజను పొంది, పొందె రాజ్యమును మరల. (89)
భావము. చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను.
శ్లో. ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ॥ 90 ॥
తే.గీ. ప్రజలు రామరాజ్యమున నిర్భయముతోడ,
సంతసముతోడ, తృప్తితో, సకల ధర్మ
వర్తనన్, రోగ రహితులై భాసిలు, నట
లేదు దుర్భిక్షమనునది, లేదహితము. (90)
భావము. శ్రీరాముడు రాజైనందున అతని పాలనలో లోకులంతా సంతోషముతో, సంతృప్తిగా, ధార్మికముగా ఉండిరి. విగత రోగులు, రోగరహితులు అయి యుండిరి. దుర్భిక్షమనునది లేక, భయరహితులై యుండిరి.
శ్లో. న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ ।
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ॥ 91 ॥
తే.గీ. పుత్రశోకంబులే లేక పురుషులుంద్రు,
స్త్రీలు వైధవ్యమే లేక చెలగుచుందు
రెప్పుడును పతివ్రతలుగా, నిప్పులనగ,
రామ రాజ్యంబునందున రమ్యగతిని. (91)
భావము. రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును. స్త్రీలు భర్తలను కోల్పోకుండా ఎప్పుడూ పతివ్రతలుగా ఉంటారు.
శ్లో. న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః ।
న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా ॥ 92 ॥
తే.గీ. లేదు భయమగ్నివలనను, లేదు నీటి
వలన భయమెన్న, లేదిల వాయు భయము,
భయము లేదు జ్వరాదులన్, ప్రభువు రామ
చంద్రుని పరిపాలనమునన్, శాంతి యొప్పు. (92)
భావము. అగ్నిప్రమాదములు లేవు. జలప్రమాదములు లేవు. అటులనే వాయుభయములు లేవు. జ్వరాదుల వలన బాధలు లేవు.
శ్లో. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ।
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ॥ 93 ॥
తే.గీ. ఉండ వాకలిచే బాధ, లుండ వటులె
చోరభయములు, ధనధాన్య శొభ మిగుల
నొప్పు నగరాల రాష్ట్రాల గొప్పగాను,
రామ పరిపాలనంబున రాజిలు ధర. (93)
భావము. ఆకలిదప్పుల బాధలు ఉండవు. అటులనే చోరభయములు ఉండవు - (ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధి భౌతిక బాధలు లేకుండును.) రాజ్యములోని నగరములు, రాష్ట్రములు ధనధాన్యములతో తులతూగుచుండును.
శ్లో. నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ।
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ॥ 94 ॥
తే.గీ. అంద రిద్ధర నిత్య మానందముగనె
యుందు రరయ కృత యుగమునందు వోలె,
నశ్వమేధశతాధికమటులె పెక్కు
స్వర్ణ యాగముల్ రాముండు సలుపుచుండు. (94)
భావము. కృతయుగమునందు వలె రామరాజ్యమున కూడా అందరూ నిత్యమూ తృప్తిగా సంతోషముగా ఉందురు. అనేకములైన అశ్వమేధాదిక్రతువులను, సువర్ణక యాగములను(1) శ్రీరాముడు నిర్వహించును.
శ్లో. గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ।
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥ 95 ॥
తే.గీ. కోట్లకొలది గోదానముల్ కోరిచేయు
బ్రాహ్మణోత్తములకుఁ, గాంచు బ్రహ్మపదము,
నపరిమిత ధనదానంబునాచరించి
కీర్తిఁ బొందును రాముండు, స్ఫూర్తిఁ గొలుపు. (95)
భావము. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేసి, బ్రహ్మలోకమును పొందును, అతడు బ్రాహ్మణులకు అపరిమితమైన ధనధాన్యములను దాన మొనర్చి, వాసికెక్కును.
శ్లో. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥ 96 ॥
తే.గీ. నూరు రెట్లు రాడ్వంశమున్ ధీర రాము
డధికముగఁ జేయు, భూమిపై నలరు నాల్గు
వర్ణములవారు కులధర్మపరులుగఁ దగ
నడచునట్టులఁ జేయునీ నాయకమణి. (96)
భావము. రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్ధిపఱచును. నాలుగువర్ణముల వారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును.
శ్లో. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ॥ 97 ॥
తే.గీ. ప్రజలకానందముప్పొంగి పరవశింపఁ
బదియునొకవేలవత్సరాల్ పాలనమును
రామచంద్రుండు చేసి తా రహిని బ్రహ్మ
లోకమును బొందు, జగతికి శ్రీకరముగ. (97)
భావము. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.
శ్లో. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98 ॥
తే.గీ. కన పవిత్రమైనది, పాప కలుష హారి
యైనదియు, పుణ్యమొసఁగెడి జ్ఞానమిచ్చు
వేదముల సమ్మతినిగన్న శ్రీద గ్రంథ
మిద్ది, పఠియింప పాపము లెలమి వాయు. (98)
భావము. పవిత్రమైనది, పాపములను పోఁగొట్టునది,పుణ్యప్రదమైనది, వేదములచేత కూడా సమ్మతింపఁబడినది యగు యీ రామాయణమును ఎవరు పఠింతురో వారు సమస్త పాపములనుండి విముక్తులగుదురు.
శ్లో. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99 ॥
తే.గీ. ఇట్టి రామాయణంబు పఠించిరేని
ఆయురభివృద్ధి, సేమంబు నంచితమగు
లాభములు కల్గు, పుత్రపౌత్ర జనులకును,
ముక్తి కలుగును పరివారమునకుఁ గూడ. (99)
భావము. ఈ రామాయణమును పఠించినవారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్రపౌత్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.
శ్లో. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్
జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100 ॥
తే.గీ. ద్విజులు పఠియించిరేని వాగ్దీప్తి కలుగు,
క్షత్రియులు పొందు రాజ్యంబు ఘనతరముగ,
వైశ్యులకు పణ్యఫలమబ్బి వరలఁజేయు,
శూద్రులకు కీర్తి, ప్రజలలో శోభ కలుగు. (100)
భావము. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములయందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపారలాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు.
ఈ రామాయణమును పఠించినవారును, వినినవారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము.
31 - 10 - 2025..
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే నారదవాక్యం నామ ప్రథమః సర్గః ॥
ఇది శ్రీమద్వాల్మీకి రామాయణమున ఆదికావ్యమున బాలకాందళొనారదవాక్యమనబడు ప్రథమ సర్గకు సంబంధించినది.
సమాప్తము.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.