గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2025, మంగళవారం

నా అశ్వధాటి సతీ శతకముపై డా.సూరం శ్రీనివాసులుగారి సమీక్ష.

 అశ్వధాటి

సంస్కృత రూపకాల్లో  ప్రరోచనాత్మక వచనాలుంటాయి. ఒక వాస్తవికతను ప్రతిపాదిస్తూ.  ' చింతా రామకృష్ణారావు గారు సతీశతకాన్ని గురిపించి ప్రస్తావించినప్పుడు అలాగే నాలుగు మాటలు వ్రాద్దామని పియింది.

కవి చింతా రామా కృష్ణారావు గారు భక్తిలోనికి బంధకవిత్వాన్ని నడిపిచగలవారు. నామాలకు రూపాన్ని కలిగించఁగలవారు. రూపాలలో చైతన్యాన్ని నింపగలవారు. ఎదుగుదలకూ, ఒదుగుదలకు తనలో తావునివ్వగలవారు. కవులకు తలలోని నాలుక వంటివారు. నిరంత రాద్యయనశీలి. వాఙ్మయ తపస్సునకు అధిష్టానం. ' అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్​ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ 15 అన్న గీతావాక్యమే ఆదర్శమైనవారు.

     ఇక శతకవిషయం సతీదేవి. పార్వతిపూర్వ రూపం . అధావమానేన పితుః ప్రయుక్తా I  దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ II  సతీ సతీయోగ విసృష్ట దేహా I  తాం జన్మనే శైలవధూం ప్రపద్యేII అని కాళిదాసవచనం. తన తండ్రియే అవమానిస్తే భరించలేక ఆత్మత్యాగం చేసిన అభిమానవతి సతి. ధనపతి సఖుడైనా తన కున్నదే తనదని తిరిపె మెత్తే భర్త చూపిన బాటలోనే, తన భర్త ఎంతటి వాడైనా తన విలువయే తనదని నమ్మిని దేవి సతి. ఆ సతీదేవి విషయమైనప్పుడు ఇక కవిత కదం త్రొక్కటానికి అభ్యంతర మేముంది.

     ఇక ఛందస్సు అశ్వథాటి. సంస్కృతంలో శిఖరిణి, అశ్వధాటి విశిష్ఠ గతితో ఆకర్షించేవి. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ. మొదలైన అశ్వధాటి అందరినీ కదుపు తుంది. వాని రాజతీర్ణరు రచించిన దశావతారస్తుతి అశ్వధాటికే అందాలు దిద్దుతుంది. అటువంటి ఛందస్సులో శతకం వ్రాయటం, గతి తప్పని గతిలో తీర్చి దిద్దటం అంత తేలిక ఏమీ కాదు.

     అయినా చింతా వారి ప్రయోగశీలత, భాషా ఛందస్సులపై పట్టు అశ్వధాటివైపే వారిని నడిపాయి. భక్తి భావానికి సామాజికతను కూడా జోడించి సతీదేవీశతకాన్ని ఆవిష్కరించారు రామకృష్ణారావు గారు.

     లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి  కృపతో, నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేల నమ్మ భువిపై, చీకాకులన్ బడక నీకై రచించుటిది నాకిచ్చు మూర్తిని సతీ! ఇది చింతా వారి ముక్తి వాంఛ కృతి నిర్మాణంలో. ఇది వ్యక్తిగతం. 

     ఇక సామాజికంగా కూడా 'వారి చింత, చింతన ప్రత్యక్షర సత్యాలుగా కనిపిస్తాయి. ధర్మాను వర్తులిల మర్మింబెఱుంగ రిక ధర్మార్థమే బ్రతుకూచున్, దుర్మార్గు లట్టి యెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే, ధర్మంబె యోడిన యధర్మంబు రాజగును ధర్మంబునే నిలుపుమా, మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబు నిల్చును, సుకర్మల్ వెలుంగును సతీ:

అశ్వధాటి అదే వేగంతో ప్రగతిపథంలో పయనించాలని ఆశిస్తూ, అభినందిస్తూ

(సూరం శ్రీనివాసులు).

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.