గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, సెప్టెంబర్ 2025, గురువారం

ప్రౌఢకవి రాచాలపల్లి బాబు దేవీదాస శర్మ గారి "అమలిన శృంగారము" : కావ్య పరిచయము —గంగిశెట్టి ల.నా.

0 comments

జైశ్రీరామ్. 


బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు.

ప్రౌఢకవి రాచాలపల్లి బాబు దేవీదాస శర్మ గారి "అమలిన శృంగారము" : కావ్య పరిచయము

      —గంగిశెట్టి ల.నా.

మన కవి తాపసి, బాబూ దేవీదాస శర్మ గారున్నారే, ఒక విలక్షణమైన కవి.. అటు కొన్ని శతాబ్దాల కిందటి పౌరాణిక భక్తి భావనలు, ఆ తర్వాతి యుగాల ప్రాబంధిక ప్రౌఢతలు, ఇటు గత శతాబ్ది ప్రారంభకాలాన్ని ఉర్రూతలూపిన భావకవిత్వం లాలిత్యాలు,  అంతటితో ఆగకుండా మొన్న మొన్నటి శేషేంద్ర నవ కాల్పనిక భావోద్వేగాలు ఒక చోట రాశిపోసినట్లుగా రూపొందిన విలక్షణ కవితా మూర్తి!... అలాంటి విలక్షణ కవి, ఇప్పటి కాలంలో ఉండడమే, అందులోనూ మన మధ్య ఉండడమే ఒక అపురూప విషయం... నిజానికి ' సత్కవి ' అంటే అలాగే ఉండాలి.. కేవలం కవితా సత్తుకు మాత్రమే కట్టుబడి ఉండాలి కానీ, ఏదో ఒక కాలీనపు గుంజకు కాదు... గుంజకు కట్టుబడ్డ పెయ్యలకు స్వతంత్రం ఉండనట్లే, భావుకుడైన కవికి కూడా,  భావ స్వాతంత్ర్యం కొరవడుతుంది.. ఏ గుంజకూ కట్టుబడని అచ్చపు సత్కవి ఉంటాడా అన్నది , ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే...   సత్కవి అనిపించుకునే వారికి భక్తి ఒక పెద్ద గుంజ!.. అందులోనూ పౌరాణిక భక్తి!.. దాన్ని దాటి , సమకాలీనతలోకి ప్రవహించడం అందరికీ సాధ్యం కాదు... ప్రస్తుతం కోనలో దేవీదాసు గారు తరచూ పునరావృతం చేసే, కవిత్వం చూస్తే, ఆ శంక కలగటం సహజమే.. కానీ, ఒకప్పుడు ప్రౌఢవయసులో దేవీ దాసు గారు రచించిన అమలిన శృంగారము అనే కావ్యాన్ని చూస్తే ఆ అనుమానం కలగదు.. పైగా, ఈ భాక్తేయ కవేనా, ఇంత భావనారమ్యమైన కావ్యం రాసింది అనే ఆశ్చర్యమూ కలుగుతుంది!! 

*

"అమలిన శృంగారము" ఆయన 2022 వ సంవత్సరంలో ప్రకటించినది.. అంటే రాయప్రోలు వారు అమలిన శృంగారమనే నవ కావ్య శాస్త్ర భావనను ప్రకటించిన సుమారు 123 సంవత్సరాల పిమ్మట ప్రచురించినది.. వాస్తవానికి, ఆ భావన మీద అప్పటిలోనే అనేక వాదోపవాదాలు జరిగాయి... 1930 ల తరువాత వచ్చిన భావ ధారలో , అంటే కొద్ది తక్కువగా వంద సంవత్సరాల క్రితమే ఆ భావన మరుగున పడిపోయినదంటే అతిశయోక్తి కాదు.. అయినా వీరు నాది భావ కవిత్వం పట్ల భక్తితో, అక్కడే ఆగిన కవితానురక్తితో, దాన్ని సంస్మరించుకుంటూ ఈ కావ్యాన్ని వ్రాశారు.. ఆ విధంగా, ఆధునిక కవితా యుగ ప్రారంభ దశలో, నవ కవితకు నూతనోత్తేజమిచ్చిన, ఒక గొప్ప నవ్య సంస్కార భావనకు, బాబూ దేవీ దాసు గారు తన కవితా నీరాజనమర్పించినారు...

  

 అయితే చిన్న మార్పుతో! 


      రాయప్రోలు గారు తన అమలిన శృంగార భావనను " నష్టమైనట్టి ప్రేమఖండములకొక్క/ సుకవి అక్షర జీవ గీతికయ చాలు.....

కొసరి యేమోయీ అని పిల్చుకొనుటకన్న/ చెలుల కిల మీద నేమి కావలయు సఖుడ!" అంటూనే, దాన్నొక సోదర బంధంగా పరిణమింపజేస్తూ, దానికి సంకేతంగా తృణకంకణము  ధరింపజేశారు..నాటి సంఘంలో కొత్త చనువును, స్వేచ్ఛను పెంచుకొంటున్న యువతీ యువకులకు అలా  మార్గదర్శకమైన ఓ ప్రబోధ ప్రాయమైన నవ్య సిద్ధాంతాన్ని వినిపించారు..

         కానీ కాలం మారింది, స్త్రీ-పురుషుల చనవుల రూపం మారింది, ఆ సిద్ధాంతమే కాల విస్మృతి పాలయ్యింది.. కవితా ప్రీతిలో అక్కడ ఆగిన దేవీ దాసరావు గారు, అందుకే కాలోచితమైన మార్పుతో, దీనిని ఆదర్శ ప్రేమికుల సాప్తపదీనంతో ముగింపుకు తెచ్చారు. ఆ మార్పు అభినందనీయమైనదే, అమలిన అనే మాట అర్థం ఎలా మారినా!... 

*

     రాచాలపల్లి బాబూ దేవీ దాసు గారు, ఇందులో కేవలం సిద్ధాంత ప్రబోధం చేయకుండా, దాని చిత్రించడానికి ఒక చిన్న కథను అల్లుకున్నారు.. బుద్ధ చరిత్రతో మొదలుపెట్టి, నాటి భావ కవుల భావనలన్నింటికీ అందులో చోటు కల్పిస్తూ, ఆ కథను అన్నారు.. ఒకానొక "కొండ రాణి".. రాజుల ఇంట పుట్టిన బిడ్డే.. కాల మహిమ వల్ల, చిన్నప్పుడే తప్పిపోయి, కొండరాజుల ఇంట పెరిగింది.. ఒక పూట వేటకు వెళ్లి, ఓ నెమలి మీద బాణాన్ని సంధించి, దాన్ని గాయపరిస్తే, దాన్ని చూసిన బుద్ధ ధర్మావలంబి అయిన యువక సన్యాసి, ఏ "యిరువదేడుల ప్రాయము వాడో" ఆ నెమలికి ఉప చర్య చేసి, ఆమెకు అహింసను బోధిస్తాడు.. ఆ పడుచు పిల్ల సైతం, తన విల్లంబులు విడిచివైచి, ఆయన పరిచర్యలో నిమగ్నమవుతూ, మనసా అతనిని ఆరాధిస్తుంది.. అతనికిని, ఆమె పట్ల ప్రేమ భావమంకురించినా, దానిని ఉదాత్త రీతిలో , హృదయాన నిలుపుకుంటాడు.. ఆమెకు కూడా, మనో శరీరాలకతీతమైన ఉదాత్త భావనను బోధిస్తాడు.. అలా వారి మధ్య సాగినది 'అమలిన శృంగారము'.. కడప అమ్మవారే, వారి ఉదాత్తతను మెచ్చి, ఇరువురను వివాహం చేసుకొమ్మని ఆదేశించి, వివాహితులై లోకసేవజేయుడని ఆశీర్వదించటంతో కథ సుఖాంతమవుతుంది.. 


    రాయప్రోలు గారు ప్రతిపాదించిన అమలిన శృంగారము, ఎదగని యువతీ యువకుల పరస్పరాకర్షణకు పర్యాయమైన ప్రేమ భావమునకు విరుగుడైతే, రాచాలపల్లి గారు చిత్రించిన అమలిన శృంగారము, పరిణత యువతీయువకుల పరిణయమునకు దారి తీసి, సముచిత సంఘజీవన విధానమునకు ఉపకరించే రాజయోగ విధానము.. ఆ విధంగా, పేరునకిది 'అమలిన శృంగారము' అయినా, కాలోచితమైన నిర్మల ప్రణయ భావము.. ఆ విధంగా అభినందనీయము... 

*

  కానీ ఈ కావ్యాన్ని ఆస్వాదింప చేస్తున్నది, కాలగతి పొందిన ఆ పూర్వ ప్రణయ భావన కాదు!.. అందులో అపూర్వంగా దర్శనమిచ్చే ప్రబంధ కవుల నుంచి, భావకవుల వరకు సాగే లలిత సుకుమార పద్య నిర్మాణ రీతి.. అతిసున్నితమైన భావాలు, అంతే లలితమైన శబ్దాలు పెనవేసుకుని సాగిన పద్యాలు కావ్యమంతటా సాక్షాత్కరించి, అచ్చపు కావ్య ప్రేమికులను, మళ్లీ ఏ కృష్ణశాస్త్రి గారి యుగానికో, కరుణశ్రీ గారి దాపుకో తీసుకొని వెళ్తాయి.. వాటిని ఇక్కడ సాంతం ప్రతిలిఖించి, చూపలేకపోయినా.... కావ్య ప్రారంభంలో, 11 పద్యాలలో అటు ప్రాబంధిక రీతి, ఇటు భావ కవితా ఫణితి కలబోసినట్లున్న శరత్కాల వర్ణనకు సంబంధించిన ఒకటి రెండు పద్యాల ప్రస్తావనతో మాత్రమే సరి పెట్టడానికి సాహసిస్తాను.. 


అది " శారద సంధ్య; సానుతల శాద్వల కోమల భూమి" అంటూ మొదలవుతుంది కావ్యం..  తరువాత " ప్రకృతి వధూటిక పటునితంబములుగా సికతాతలమ్ములు చెన్నుమీర!" అని అతి ప్రౌఢభావనతో మొదలయ్యే సీస పద్యం.. ఆ పిమ్మట " సాంధ్యరాగస్నాత సాను వినోదిని తడియార కురులు వాల్ జడలు వైచి!

అలవోక జడలోని యందాల సిరులలో విరివిగా విరజాజి సరులు దురిమి!" అతి లలితమైన భావాలను నింపుకున్న లలిత పదాల కూర్పు తోటి సీస పద్యం సాగుతుంది.. ఆ రెండు పద్యాల నిర్మాణంలో ఉన్న కాంట్రాస్టును గుర్తిస్తే కవిగారి శిల్ప ప్రతిభ మన కన్నుల ముందు నిలుస్తుంది... ఆ తరువాత ఉన్న " నింగిని నీలిమబ్బు - నళినీమకరంద రసాంధకార సారంగ తరంగ ఝాంకృత సరాళముగా చెరలాడుచుండె" అనే అతి ప్రౌఢ సమాస గుంఫనతో సాగిన ఉత్పలం ఆ శిల్ప ప్రతిభను మరింత ప్రకాశవంతం చేసి చూపుతుంది ... తరువాత వెంటనే వచ్చే" నల్ల కలువల కళలుగా, నల్లనాగు/ మెలికలుగ, కరికలభాల నలుపుగాగ/ .... జలదశకలాలు గుమిగూడి జరిగె" చిత్రణ, కవి గారి భావుకతకు, భావ కవితా భక్తికి అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.. ఇలాంటి సున్నితమైన లలిత భావనలు కావ్యమంతటా అడుగడుగునా పరచుకుని ఉంటాయి.. వాటిని ఈ ఫోనుపై ప్రతిలిఖించి చూపే శక్తి నాకు లేదు.. పై పద్యాల ఫోటో కాపీని దిగువ పెడుతున్నాను.. మీరే ఓపిక చేసుకుని చూడండి... వాటి ఆధారంగా కావ్యం లో దొరలిన కవితామాధురిని 

 అంచనా వేసుకోండి... 

     — ల.నా. గంగిశెట్టి, 16/4/25

జైహింద్.

10, సెప్టెంబర్ 2025, బుధవారం

సమస్యా పూరణము. *తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్* .. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్.   

మ.  తనువుంగల్గిన బ్రహ్మతత్త్వవిదుఁడై తాదాత్మ్యమున్ పొందుచున్,

ప్రణవోద్దీపితనాత్మతత్త్వమున జీవచ్ఛక్తినే చేర్చుచున్,

మనమందైక్యముబ్రహ్మతోడ నగుచున్, మాన్యుండొకండిద్ధరన్

తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్

జైహింద్.

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

5. మందస్మిత శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) ఆంధ్ర పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్.

 5. మందస్మిత శతకము. మూకపంచశతి (మూకకవి ప్రణీతము) 

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.


శ్లోII  బధ్నీమో వయమంజలిం ప్రతిదినం బంధచ్ఛిదే దేహినాం

కందర్పాగమతంత్రమూలగురవే కల్యాణకేలీభువే  .

కామాక్ష్యా ఘనసారపుంజరజసే కామద్రుహశ్చక్షుషాం

మందారస్తబకప్రభామదముషే మందస్మితజ్యోతిషే ..1

శాII  శ్రీమన్మంగళ కామశాస్త్రమునకున్ శ్రీమాత మూలంబు నా

కామేశానుని కంటి కప్పురము, వేగన్ కాంతి గర్వంబునే

తామందారపు పూలనుండి గొను, మోదంబొప్ప, కామాక్షి! స

త్ప్రేమోదారపు మందహాస ఝరికిన్ప్రీతిన్ నతుల్ చేసెదన్.

తాII  కామశాస్త్రమనెడి తంత్రమునకు మూలగురువు, శుభములకు విలాస స్థానమును, కామవైరి కన్నులకు పచ్చకప్పురపుపొడి, మందారంపుపూగుత్తుల కాంతిగర్వమును దొంగిలించునదియు, నగు కామాక్షి యొక్క మందస్మిత ప్రకాశమునకు మేము అనుదినము కైమోడ్చెదము.

21 – 3 – 2024.

శ్లోII  సధ్రీచే నవమల్లికాసుమనసాం నాసాగ్రముక్తామణే-

రాచార్యాయ మౄణాలకాండమహసాంనైసర్గికాయ ద్విషే.

స్వర్ధున్యా సహ  యుధ్వనే హిమరుచేరర్ధాసనాధ్యాసినే

కామాక్ష్యాః స్మితమంజరీధవలిమాద్వైతాయతస్మై నమః..2.

మII  సరితూగున్ నవ మల్లికా సుమముతో, సద్బోధనాచార్యుఁడా

సరమౌ ముక్కెరకున్నముత్యమునకున్, సన్మూలమౌ పద్మ సుం

దరమౌ తళ్కులకున్, సురాపగకు బాధన్ గొల్పు,కూర్చుండు చం

దురునిన్ గూడి, మదంబ హాసరుచి, సుజ్ఞానుల్ మదిన్ బొంగగా.

తాII క్రొత్తమల్లికలకు సమానము, అడ్డబాసముత్తియమునకు ఆచార్యకము (గురువు) తామరతూడుతళుకులకు స్వాభావిక మూలతేజస్సు, గంగానదితో జగడ మాడునది, చంద్రబింబముతో నర్థాసన మధిష్ఠించునదియు, నగు కామాక్షి యొక్క మందహాస మంజరి యొక్క తెలుపుతోడి యద్వైతమునకు నమస్కారము. అనగా నింతకన్న మించిన తెలుపు లేదని తాత్పర్యము. 

22 – 3 – 2024.

శ్లోII  కర్పూరద్యుతిచాతురీమతితరామల్పీయసీం కుర్వతీ

దౌర్భాగ్యోదయమేవ సంవిదధతీ దౌషాకరీణాం త్విషాం.

క్షుల్లానేవ మనోజ్ఞమల్లినికరాన్ఫుల్లానపి వ్యంజతీ

కామాక్ష్యా మృదులస్మితాంశులహరీ కామప్రసూరస్తు  మే ..3.

మII  ఘనసారంబు నతిక్రమించు కళలో, కంగించు దోషాకరున్,

వనమల్లెల్ తెలఁబోవునట్లొనరుచున్, వామాక్షి కామాక్షి మో

హన మందస్మిత చంద్రికా నికర మాహా! తెల్లనై యొప్పు నా

ఘనమౌ శ్రీకర మందహాసములునా కాంక్షల్ కృపన్ దీర్చుతన్

తాII  పచ్చకప్పురపు తెలికాంతినిగ్గుల నవి యేపాటి యనునది. వెన్నెలయొక్క దుర దృష్ట రేఖను బయల్పఱచునది, విరిసిన మల్లెపూలను దెల్లబోజేయునదియు నగు కామాక్షి యొక్క కోమల మందహాసకిరణ వైభవము నా కోరికలు తీర్చునది అగుగాక ! దోషాకరుడు = రాత్రిని చేయువాడు చంద్రుడు. (శ్లేష) దోషములకు స్థానమైనవాడు. కావున అతని కాంతులకు దౌర్భాగ్యదశ కూర్చుట న్యాయమే.

శ్లోII  యా పీనస్తనమండలోపరి  లసత్కర్పూరలేపాయతే

యా నీలేక్షణరాత్రికాంతితతిషు జ్యోత్స్నాప్రరోహాయతే.

యా సౌందర్యధునీతరంగతతిషు వ్యాలోలహంసాయతే

కామాక్ష్యాః శిశిరీకరోతు హృదయం సా మే స్మితప్రాచురీ ..4.

సీII  కనఁగనే చిఱునవ్వు కర్పూరలేపమౌన్ గామాక్షి కొప్పెడి ఘనకుచముల,

కనఁగనే చిఱునవ్వు కనులనల్లని కాంతి నెనలేని జ్యోత్స్నగా వినుతి గనునొ,

కనఁగనే చిఱునవ్వు కమనీయ సౌందర్య కెరటాలపై నుండి వరలు హంస,

కనఁగనే చిఱునవ్వు కవుల కల్పనపైన ఘనసార సౌరభమును రచించు,

తే.గీ.II  నట్టి నా తల్లి కామాక్షి యనుపమమగు

మందసుస్మిత చంద్రి కామందరుచులు

నాదు హృదయమున్  జల్లగా మేదురముగ

చేయుఁ గావుత నిరతంబు చిన్మయమయి.

తాII  ఏదైతే కామాక్షి యొక్క వలుదచనుకట్టుపై పచ్చకప్పురపు పూత యగునో, ఏదైతే నల్లని కాటుక కన్నులనెడిరాత్రి యొక్క కాంతిపుంజములందు తరిపి వె న్నెలయగుచుండునో, యేదైతే చక్కదనమనెడి యేటికెరటములయందు గదలు రాయంచ యయి తోచునో యట్టి కామాక్షిస్మితసమృద్ధి నా హృదయమును జల్లబఱచుగాక!

శ్లోII  యేషాం గచ్ఛతి  పూర్వపక్షసరణిం కౌముద్వతః శ్వేతిమా

యేషాం సంతతమారురుక్షతి  తులాకక్ష్యాం  శరచ్చంద్రమాః.

యేషామిచ్ఛతి  కంబురప్యసులభామంతేవసన్ప్రక్రియాం

కామాక్ష్యాః మమతాం హరంతు మమ తే హాసత్విషామంకురాః ..5.

తే.గీ.II  దేనికగు పూర్వపక్షమై తెల్లకలువ?

దేనితో శరచ్చంద్రుఁడు తాను తూగు?

శంఖ మెద్దాని శుశ్రూష సరిగ కోరు?

నట్టి కామాక్షి చిఱునవ్వు నెట్టు మమత.

తాII  తెల్లకలువ యొక్క తెలుపు వేనికి పూర్వపక్ష స్థానము బొందునో అనగా దానిని త్రోసి రాజనునో, శరత్కాలచంద్రుఁడు వేనితో నెల్లప్పుడు సరితూగునో, శంఖము కూడ వేనికడ దుర్లభమైన శిష్యపరిచర్య (శుశ్రూష) పేయ ముచ్చటపడునో, యట్టి కామాక్షియొక్క మందహాస ప్రభాంకురములు నా మమకారమును హరించుఁగాక !

31 – 3 – 2024.

శ్లోII  ఆశాసీమసు సంతతం విదధతీ నైశాకరీం వ్యాక్రియాం

కాశానామభిమానభంగకలనాకౌశల్యమాబిభ్రతీ .

ఈశానేన విలోకితా సకుతుకం కామాక్షి తే కల్మష-

క్లేశాపాయకరీ చకాస్తి లహరీ మందస్మితజ్యోతిషాం ..6.

తే.గీ.II  దిక్కులన్ శరత్ శోభలోఁ దేల్చునదియు,

రెల్లు పూ గర్వమణచుటన్ బ్రీతి కలది,

పాపనాశినియు, శివుఁడు పరవశించి

చూచు కామాక్షిహి చిఱునవ్వు శోభ ఘనము.

తాII  సకలదిక్కులయందు శరత్కాలంపు వెన్నెలసొంపును విశదపఱచునదై, రెల్లు పువ్వుల గర్వము నడంచుటలో నేరిమి ప్రదర్శించునదై, పాపక్లేశమును హరించు నదై, నీ చిఱునవ్వు తళుకులప్రవాహము పరమశివునిచే వేడుకతో నవలోకింపబడుచు నెంతయు రాజిల్లుచున్నది.  

శ్లోII  ఆరూఢస్య సమున్నతస్తనతటీసామ్రాజ్యసింహాసనం

కందర్పస్య విభోర్జగత్త్రయజయప్రాకట్యముద్రానిధెః

యస్యాశ్చామరచాతురీం కలయతే రశ్మిచ్ఛటా చంచలా

సా మందస్మితమంజరీ భవతు నః కామాయ కామాక్షి తే ..7.

తే.గీ.II  స్తన తటీరాజ్య  సింహపీఠిని వెలుంగు,

మదను ముల్లోక జయముద్రను ధరియించు,

మదనునకు స్మితమంజరుల్ పొదలు వీచి

యట్టి కామాక్షి చిఱునవ్వు లాదుకొనుత.

తాII  ఉన్నత కుచమండలమనెడి సామ్రాజ్యసింహాసనము నధిష్ఠించినట్టియు, జగత్త్రయ విజయముద్ర గైకొన్నట్టియు మన్మథుఁడను సార్వభౌమునకు ఏ దరహాసమంజరి యొక్క చంచలమైనకాంతిపుంజము వింజామరల చాతుర్యమును ప్రదర్శించునో యా చిరునవ్వు మాకోర్కెల నీడేర్చుగాక !

శ్లోII  శంభోర్యా పరిరంభసంభ్రమవిధౌ  నైర్మల్యసీమానిధి-

ర్గైర్వాణీవ తరంగిణీ కృతమృదుస్యందాం కలిందాత్మజాం.

కల్మాషీకురుతే కలంకసుషమాం కంఠస్థలీచుంబినీం

కామాక్ష్యా స్మితకందలీ భవతు సా కల్యాణసందోహినీ  ..8.

తే.గీ.II  కలికి కామాక్షి చిఱునవ్వుగంగ శివుని

కౌగిలించగ కంఠాన కాల యమున

కూడి గంగమ్మ నలుపయ్యె, వేడె దట్టి

మందహాసంబు కూర్చుత మంగళములు.

తాII  కామాక్షి మందస్మితము గంగవలె నైర్మల్య సీమావధి. కామాక్షీదేవి శివుని కౌగిలించుకొన్నప్పుడు శివుని కంఠమందలి నల్లనిమచ్చ యమునవలె అమ్మవారి చిఱునవ్వు గంగయందు కలిసి గంగాయమునాసంగమ మేర్పడినది. అట్టి కామాక్షీదేవి స్మితకందలి భక్తులకందఱకు కల్యాణముల కలిగించుగాక.

శ్లోII  జేతుం హారలతామివ  స్తనతటీం సంజగ్ముషీ సంతతం

గంతుం నిర్మలతామివ ద్విగుణితాంమగ్నా కృపాస్రోతసి.

లబ్ధుం విస్మయనీయతామివ హరంరాగాకులం కుర్వతీ

మంజుస్తే స్మితమంజరీ భవభయంమథ్నాతు కామాక్షి మే ..9.

తే.గీ.II  స్తనతటిని హారమును గెల్వ ఘనతనాడు,

శుచి విశుద్ధికై తా కృప స్రువను మున్గు,

రాగిగాఁ జేయును శివవిరాగి నమ్మ!

నీదు మందస్మితము, పాపు మాదు భయ(వ)ము.

తాII  ముత్యాలహారమును దన ప్రభచే జయించుటకో యన్నట్లు స్తనమండలమున గ్రీడించునదై, రెట్టింపు స్వచ్ఛతను బడయుటకో యన్నట్లు కృపాప్రవాహమున మున్కలు వెట్టినదై ఎల్లర కాశ్చర్యపడదగినవానిఁగా నిరూపించుటకో యన్నట్లు తెల్లనివాఁడైన శివుని ఎఱ్ఱనివానిగా నొనరించుచున్నదై (శ్లేష :- సహజవిరాగియైన శివుని అనురాగాకులునింగా జేయుచున్నదై) యొప్పు చక్కని నీ దరహాసమంజరి మా సంసారభయమును హరించుగాక !

శ్లోII  శ్వేతాపి ప్రకటం నిశాకరరుచాం మాలిన్యమాతన్వతీ 

శీతాపి స్మరపావకం పశుపతేః సంధుక్షయంతీ సదా.

స్వాభావ్యాదధరాశ్రితాపి నమతాముచ్చైర్దిశంతీం గతిం

కామాక్షి స్ఫుటమంతరా స్ఫురతు నస్త్వన్మందహాసప్రభా ..10.

తే.గీ.II  తెల్లనిదె యయ్యు చంద్రుని నల్లఁ జేయు,

చల్లనిదెయయ్యు పశుపతి యుల్లమందు

నగ్నిపుట్టించు, నధరాశ్రయయ్యు నతుల

కూర్ధ్వగతిఁగొల్పు చిఱునగ వూహకందు.

తాII  సహజముగ దాను దెల్లనిదయ్యు చంద్రకాంతులకు మాలిన్యమును సంపాదించు నదై, నైజముగా దాను జల్లనిదయ్యు పశుపతికి మన్మథాగ్ని రగుల్కొల్పుచున్నదై (స్వభా వముచే నధరము (పెదవి) నాశ్రయించినదయ్యు శ్లేష-అధర+ఆశ్రితా+ఆపి=క్రిందు క్రిందుగా వర్తించునదయ్యు తనయెడ వినతులగువారికి ఉన్నతగతిని సమకూర్చునదై యొప్పు నీ మందహాసప్రభ నాలోన బ్రస్తుటముగ స్ఫురించుఁగాక !


శ్లోII  వక్త్రశ్రీసరసీజలే తరలితభ్రూవల్లికల్లోలితే

కాలిమ్నా దధతీ కటాక్షజనుషా మాధువ్రతీం వ్యాపృతిం .

నిర్నిద్రామలపుండరీకకుహనాపాండిత్యమాబిభ్రతీ

కామాక్ష్యాః స్మితచాతురీ మమ మనఃకాతర్యమున్మూలయేత్.. 11.

తే.గీ.II  ముఖ సరసున భ్రూవల్లి ప్రముదముఁ గదలి

కెరటములు వేయ చూపులన్ వరలు నలుపు

చేత తుమ్మదల్ ముసరగా స్వేతపద్మ

పాండితిని యొప్పు నీ నవ్వు భయముఁ బాపు. 

తాII  ముఖమనెడి చక్కని సరోవరోదకములందు భ్రూవల్లి కదలికలు కెరటములు వేయగా కటాక్షములందలి నలుపుచే తుమ్మెదలు ముసురుకొన్నవై చక్కగ వికసించిన తెల్లదామరపూవుల కపటమైన పాండిత్యమును వహించినదై యొప్పు కామాక్షి యొక్క మందస్మిత చాతుర్యము నా మనసులోని కాతర్యమును (భయమును) బాపుగాక !

01 – 4 – 2024.

శ్లోII  నిత్యం బాధితబంధుజీవమధరంమైత్రీజుషం పల్లవైః

శుద్ధస్య ద్విజమండలస్యచ తిరస్కర్తారమప్యాశ్రితా.

యా  వైమల్యవతీ సదైవ నమతాం చేతః పునీతేతరాం

కామాక్ష్యా హృదయం ప్రసాదయతుమే సా మందహాసప్రభా..12.

ఉII  బాధిత బంధుజీవమును, పల్లవమైత్రియు, శుద్ధమైన సం

పాదితమైనయట్టి ద్విజమండలమున్ నిరసించు నట్టిదౌ, 

వేదనిధాన సుస్మిత సువేద్య మహాప్రభ, కాచు భక్తులన్,

నా దరి నొప్పియుండి కరుణన్ గురిపించుచు నన్నుఁ గావుతన్.

తాII  పల్లవైః= చిగురాకులతో, మైత్రిజుషం = స్నేహముచేయును (శ్లేష.) పాదలేశము లతో చెల్మిచేయును. (నీచస్నేహముచేయుచు) బంధుజీవం = మంకెనపూవును బాధిం చును (శ్లేష.) బంధువుల ప్రాణమునకు బాధగూర్చును. శుద్ధమైన ద్విజమండలమును = పలువరుసను కప్పివేయును. (శ్లేష.) బ్రాహ్మణసంఘమును తిరస్కరించును. అట్టి పెదవిని ఆశ్రయించి వర్తించు కామాక్షి మందహాసప్రభ విమలమై వినతులైన వారి మనసును బవిత్రముజేయుచున్నది. అట్టి లేనవ్వుసొంపు నా హృదయమును బ్రసన్నముఁజేయుగాక !

శ్లోII  ద్రుహ్యంతీ తమసే  ముహుః  కుముదినీసాహాయ్యమాబిభ్రతీ

యాంతీ చంద్రకిశోరశేఖరవపుఃసౌధాంగణే ప్రేంఖణం.

జ్ఞానాంభోనిధివీచికాం  సుమనసాం కూలంకషం కుర్వతీ

కామాక్ష్యా స్మితకౌముదీహరతు మే సంసారతాపోదయం ..13.

చంII  తమమెడ ద్రోహియై, కలువతంపరకు న్నుపకారియౌచు, ని

త్యము శశిశేఖరోజ్వలపు హర్మ్యముపైననె యాడుకొంచు, నా

సుమనసు జ్ఞానసంద్రమును శోభిలఁ జేసెడి గంగయౌచు, శ్రే

యమునిడు మందహాసమది, యాశ్రయమై భవబంధమూడ్చుతన్. 

తాII  చీఁకటికి ద్రోహము సేయుచు కలువకు సాయపడుచు చంద్రశేఖరుల శరీరమనెడి సౌధాంగణమున గంతులిడుచు సుమనసులయొక్క అనఁగా పరిశుద్ధమనస్కుల యొక్క (దేవతలయొక్క) జ్ఞానమనెడి సముద్ర తరంగమును కూలంకష మొనరించుచు నొప్పెడి కామాక్షియొక్క చిరునవ్వనెడి వెన్నెల నా సంసారతాపమును హరించుగాక !

శ్లోII  కాశ్మీరద్రవధాతుకర్దమరుచా కల్మాషతాం బిభ్రతీ

హంసౌఘౌరివ కుర్వతీ పరిచితిం హారీకృతైర్మౌక్తికైః.

వక్షోజన్మతుషారశైలకటకే సంచారమాతన్వతీ

కామాక్ష్యా మృదులస్మితద్యుతిమయీ భాగీరథీ భాసతే ..14.

తే.గీ.II  కుంకుమ రస ధాతు నిషద్వరాంకితమయి,

సరస హారాల రాజహంసల సుమైత్రి

పడసి, కుచతటీ హిమశైల వర్తి యగుచు,

జనని మందస్మితమమరె, సత్ప్రదయయి.

తాII  కుంకుమ రసాలేపమనెడి గైరికాదిధాతువుల యెఱ్ఱని బెందడిచే గలగినదై, ముత్యా ల హారములనెడి రాజహంసలతోడి పరిచయమువడసి చనుకట్టనెడి హిమశైల తటము లందు సంచారము సేయుచునుండు నీ చిరునవ్వు కాంతి ప్రవాహములు గంగానదివలె నుల్ల సిల్లుచున్నవి.

శ్లోII  కంబోర్వంశపరంపరా ఇవ కృపాసంతానవల్లీభువః

సంఫుల్లస్తబకా ఇవ ప్రసృమరా మూర్తాః ప్రసాదా ఇవ

వాక్పీయూషకణా  ఇవ త్రిపథగా పర్యాయభేదా ఇవ

భ్రాజంతే తవ మందహాసకిరణాః కాంచీపురీనాయికే ..15.

తే.గీ.II  కంబు వంశక్రమమొ, కాక, కలిగినట్టి 

వర దయా కల్ప గుచ్ఛంబొ, వరలు రూపు

గొన్న ప్రీతిప్రసరణంబొ, కూర్మివా గ్సు

ధా తుషారమో, గంగయో, తల్లి నగవు.  

తాII  నీ చిరునవ్వుకాంతులు శంఖముయొక్క వంశపరంపరవలె, దయయనెడి కల్పలత యందు బొడమిన పూగుత్తులవలె, మూర్తీభవించిన యనుగ్రహ ప్రసారములవలె, వాగమృతము యొక్క చినుకులవలె, గంగానదీపర్యాయములవలె, విలసిల్లుచున్నవి.

శ్లోII  వక్షోజే ఘనసారపత్రరచనాభంగీసపత్నాయితా

కంఠే మౌక్తికహారయష్టికిరణవ్యాపారముద్రాయితా .

ఒష్ఠశ్రీనికురుంబపల్లవపుటే ప్రేంఖత్ప్రసూనాయితా

కామాక్షి స్ఫురతాం మదీయహృదయే త్వన్మందహాసప్రభా ..16.

చంII  నయ ఘనసారపత్ర రచనల్ కుచపాళిని యొప్పినట్లుగాఁ,

బ్రియముగ కంఠసీమను వరించెడి కర్ణిక కాంతి ముద్ర నాన్,

జయములె పల్కు శ్రీయధర చిన్మయ పల్లవ పుష్పరాశి నాన్, 

నియతిని వెల్గు నీ నగవు నిత్యము నాకు స్ఫురించుతన్, సతీ!

తాII  కుచములందు బచ్చకర్పూరముచే రచించిన మకరికాదిపత్రరేఖలై, కంఠమునం

దందము గులుకు దంతపత్రముల యనుకరణ ముద్రా స్వరూపములై, అధరకాంతిపుంజ మనెడి పల్లవ పుటమునం దుల్లసిల్లు పుష్పములై, తోచెడి నీ మందహాసప్రభలు నా హృదయ మునందు స్ఫురించుగాక !

శ్లోII  యేషాం బిందురివోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణి-

ర్యేషాం దీన  ఇవాధికంఠమయతే హారః కరాలంబనం. 

యేషాం బంధురివోష్ఠయోరరుణిమా ధత్తే స్వయం రంజనం

కామాక్ష్యాః ప్రభవంతు తే మమ శివోల్లాసాయ హాసాంకురాః ..17.

ఉII  నీ నగవొంది ముక్కెర వినిర్మితమౌక్తిక మొప్పె తళ్కులన్,

నీ నగవాశ్రయంబునిడ, నేర్పుగ హారము ప్రాకు మీదికిన్,

నీ నగవెన్ని చుట్టమన  నేర్పున తా నరుణంబు చిందె స

మ్మాన శుభాధరంబు, బహుమానవరస్మిత మేలుతన్ ననున్.

తాII  ఏ మందహాసంపు మొలకల తుద బిందువు మాత్రమగు నడ్డబాసముత్తియము తళతళ మెరయు చుండునో, ఏ మందహాసాంకురముల యొక్క కరావలంబమును (కర = కాంతికిరణములయొక్క) ఆలంబనమును = ఆధారమునుగొని ఒకానొక దీనుడట్లు ముత్యాలహారము కంఠాగ్రభాగమున కెగయుచుండునో, వేనికి జుట్టమువలె పెదవులమీఁది యెరుపు తనయంతట రంజించుచుండునో, అట్టి శ్రీ కామాక్షీదేవి మందహాసాంకురములు నాకు సకలమంగళోల్లాసమును సమకూర్ప సమర్థము లగు గాక.

02 – 4 – 2024.

శ్లోII  యా జాడ్యాంబునిధిం క్షిణోతిభజతాం వైరాయతే కైరవై-

ర్నిత్యం యా నియమేన యా చయతతే కర్తుం త్రినేత్రోత్సవం.

బింబం చాంద్రమసం చ వంచయతియా గర్వేణ సా తాదృశీ

కామాక్షి స్మితమంజరీ తవకథం జ్యోత్స్నేత్యసౌ కీర్త్యతే ..18

శాII  చిమ్మున్ జాడ్యసముద్రమున్, గలువ రశ్మిన్గెల్చు వైరంబుతో,

నెమ్మిన్ సాంబునిఁ బొంగఁ జేయఁ గనుఁ, దా నిత్యంబు స్వీయప్రభన్,

సమ్మాన్యంబగు దీప్తితోఁ గెలుచు నా చంద్రున్ సదా, యట్టి తే

జమ్మౌ నీ చిఱునవ్వు మంజ రెటులన్ సంస్తుత్యమై యొప్పెనో?

తాII  ఏది జాడ్యమనెడి (బుద్ధిమాంద్యమనెడి) సముద్రమును చిమ్మి వేయునో, యేది కలువలతో గలహమునకు ఢీకొనునో, యేది త్రినేత్రోత్సవమును (మాఘబహుళ చతుర్థశి చీఁకటిరాత్రులందు జరుగు శివరాత్రి మహోత్సవమును) జరు పయత్నించునో, నిజగర్వముచే నేది చంద్రబింబమును గించపరచునో యట్టి నీ మందహాస మంజరి వెన్నెలయని ప్రశంసింపబడుచున్నది, ఇది యెట్లు ?

శ్లోII  ఆరూఢా రభసాత్పురః పురరిపోరాశ్లేషణోపక్రమే

యా తే మాతరుపైతి దివ్యతటినీశంకాకరీతత్క్షణం.

ఓష్ఠం వేపయతి భ్రువౌ కుటిలయత్యానమ్రయత్యాననం

తాం వందే మృదుహాసపూరసుషమామేకామ్రనాథప్రియే..19.

మII  మునుగా బైకొన నుద్యమించి శివునిన్, పూబోడి! నీ స్మేరమే,

ఘనగంగానదియా యనంగ నురికెన్, గల్యాణి! నీమోవియే

వణుకన్, నీ గనుబొమ్మలున్ కుటిలమై, వంగన్ ముఖం, బట్టి నీ

ఘన మందస్మితకాంతి పుంజమునకున్ గావింతు నే సన్నతుల్.

తాII  అమ్మా ! ఏది వేగముగా బరమశివుని తానె మునుముందుగ గౌరవించు ప్రక్రియయందు బయల్పడి దేవనది యను సంశయమును గలిగించునదై అప్పుడే నీ పెదవులను గదలించుచు కనుబొమలను కుటిలపఱచుచు నీ మోమును పంచుకొన జేయుచున్నదో యట్టి నీ మందహాస ప్రవాహప్రభకు నమస్కరించుచున్నాను.

శ్లోII  వక్త్రేందోస్తవ చంద్రికాస్మితరుచిర్వల్గు స్ఫురంతీ సతాం

స్యాచ్చేద్యుక్తమిదం చకోరమనసాంకామాక్షి కౌతూహలం.

ఏతచ్చిత్రమహర్నిశం యదధికామేషారుచిం గాహతే

బింబోష్ఠద్యుమణిప్రభాస్వపిచ యద్బిబ్బోకమాలంబతే ..20.

ఉII  నీ ముఖ చంద్రబింబమది నేర్పుమెయిన్ జిఱునవ్వు వెన్నెలల్

ప్రేమగఁ బంచుచున్, గొలుపుఁ బ్రీతిని సాధు చకోరపాళికిన్,

నీమధురాధరారుణిమ, నిస్తుల సంధ్యను గల్గు తేజమున్

హైమ! గడించి బిబ్బొకమహాద్భుత చేష్టలనొప్పె, చిత్రమే.

తాII  నీ ముఖమనెడి చంద్రబింబమునుండి వెడలి ఇంపుగులుకు నీ చిరునవ్వన్న వెన్నెల సాధు చకోరచిత్తములకు వేడుకఁగూర్చునన్న నిది యెంతయు నుచితమే. ఇందులో నీ దొండపండువంటి పెదవియందు సాంధ్యరాగములందు ఏకాకారమైన కాంతినే బడసి రాత్రి పవలుకూడ బిబ్బోకవిలాసమున (అనగాఇష్టవస్తువాంఛారూపమైన శృంగారచే ష్టలో) నిమగ్నమగుచున్నది. ఇది యెంతయు చిత్రమైన విషయము.

03 – 4 – 2024.


శ్లోII  సాదృశ్యం కలశాంబుధేర్వహతి తే కామాక్షి మందస్మితం

శోభామోష్ఠరుచా చ విద్రుమభవామేతద్భిదాం బ్రూమహే .

ఏకస్మాదుదితం పురా కిల పపౌ  శర్వః పురాణః పుమా-

నేతన్మధ్యసముద్భవం రసయతే మాధుర్యరూపం రసం  ..21.

శాII  నీ మందస్మిత మెన్నగా చెలియగున్ నిండైన క్షీరాబ్దికిన్,

లేమా! నీ యధర ప్రభారుణిమ తల్లీ! సత్ప్రవాళోపమం

బే, మల్లారి విషంబుత్రాగి వగపున్, పీయూషమట్లబ్బు నీ

శ్రీమంతంబగు మందహాసమున సుఖశ్రీభోగమున్ బొందెగా.

తాII  నీ చిరునవ్వు పాలసముద్రమునకు చెలికత్తె యగుచున్నది. అత్తరి నీ యధర కాంతి పవడపుకాంతిని వహించుచున్నది. ఈ సందర్భములో నే నిట్లు తర్కించుచు న్నాను. ఈ పాలసముద్రములో జనించిన చేఁదును (విషమును) ఇంత మున్ను పురాణపురుషుఁడగు శివుఁడు త్రావివైచెను. ఇఁక మిగిలియున్న అధరోష్ణ మధ్యగతమైన (చిరునవ్వురూపమైన) అమృతమును ఇప్పు డాతఁ డాస్వాదించుచున్నాడు అని.

శ్లోII  ఉత్తుంగస్తనకుంభశైలకటకేవిస్తారికస్తూరికా-

పత్రశ్రీజుషి చంచలాః స్మితరుచః  కామాక్షి తే కోమలాః.

సంధ్యాదీధితిరంజితా ఇవ ముహుః సాంద్రాధరజ్యోతిషా

వ్యాలోలామలశారదాభ్రశకలవ్యాపారమాతన్వతే..22.

శాII  ఉత్తుంగస్తనశైలసానువులపై నొప్పంగ కస్తూరి కా

యత్తంబై తగు పత్రరేఖరుచి నాహాగుల్కు మందస్మితం

బత్తన్జంద్రికలందుమోవిరుచి సద్వ్యాప్తిన్ శరత్కాలపుం

గ్రొత్తౌమబ్బుల నెఱ్ఱ సంధ్యయనగా రుద్రాణి! తోచెన్ గనన్.

తాII  ఉన్నతస్తనపర్వతసానువునందు వ్యాపించిన కస్తూరికామకరికాది పత్రరేఖాసౌంద ర్యమందు గులికెడి నీ చంచలకోమలమందహాసరుచులు దట్టమగు పెదవియందలి యెరుపు డాలుచే సంజకెంజాయలు పైపై నలముకొనిన శరత్కాలపు తెలిమబ్బుతునకల సౌందర్యమును విస్తరింపఁజేయుచున్నవి.

శ్లోII  క్షీరం దూరత ఏవ తిష్ఠతు  కథం వైమల్యామాత్రాదిదం 

మాతస్తే సహపాఠవీథిమయతాంమందస్మితైర్మఞులైః.

కిం చేయం తు భిదాస్తి  దోహనవశాదేకం తు సంజాయతే

కామాక్షి  స్వయమర్థితం ప్రణమతామేతత్తు దోదుహ్యతే..23.

తే.గీ.II  నీదు చిఱునవ్వు వలె పాలు మేదినిపయి,

తెల్లనయినను పోలదు తెలియ దానిఁ

బితికినంగాని పొందలే మతులితముగ

పొందనగు నీదు చిఱునవ్వు పుడమి జనులు.

తాII  అమ్మా ! పాలు తెల్లనైనంతమాత్రముచే నీ చక్కని చిరునవ్వులకు సాటి యెట్లు కాగలవు ? ఈ రెండింటికిని భేదము గలదు. పాలు ఒకరు పితుకగా లభించునవి. నీ చిరునవ్వు భక్తకోటికి స్వయముగా తాన చేపునది.

శ్లోII  కర్పూరైరమృతైర్జగజ్జనని  తే కాంతైశ్చ  చంద్రాతపై-

ర్ముక్తాహారగుణైర్మృణాలవలయైర్ముగ్ధస్మితశ్రీరియం.

శ్రీకాంచీపురనాయికే సమతయా సంస్తూయతే సజ్జనై-

స్తత్తాదృఙ్మమ తాపశాంతివిధయే కిం దేవి మందాయతే ..24.

తే.గీ.II  కప్పురపుపొడి, యమృతమ్ము, కమ్మనైన

వెన్నెలయు, ముత్తెములపేరు, బిసమటంచు

నీదు మందస్మితంబును నేర్పుమీర

చెప్పుదురిలను కామాక్షి! గొప్పవారు.

తాII  ఉత్తములు నీ చిరునవ్వును పచ్చకప్పురపుపొడులతో, నమృతము చిందు వెన్నెల లతో, ముత్యాలహారములతో, తామరతూండ్లతో, సమానమైనదని పొగడుదురు. అట్టి నవ్వు నా తాపమును శమింపఁజేయ నేల వెనుకాడుచున్నది?

శ్లోII  మధ్యేగర్భితమంజువాక్యలహరీమాధ్వీఝరీశీతలా

మందారస్తబకాయతే జనని తే మందస్మితాంశుచ్ఛటా.

యస్యా వర్ధయితుం ముహుర్వికసనం కమాక్షి కామద్రుహో

వల్గుర్వీక్షణవిభ్రమవ్యతికరో వాసంతమాసాయతే ..25. 

శాII  నీ మందస్మిత కాంతిపుంజము జయానీకంబుచేఁ జక్కనై

శ్రీమద్వాక్యసమూహ గర్భితమహో! శీతంబునున్, మాధురిన్,

శ్రీమందారమువోలె కల్గినదిగా, శ్రీమద్వసంతంబనన్

ధీమచ్ఛంకరు దృష్టిసోకి కొలిపెన్ దీపించు నీ నవ్వులన్.

తాII  అమ్మా! నీ మందహాస కాంతులగుంపు - మనోహరములైన వాక్యప్రవాహముతో గర్భితమైనది. ఆ కారణంగా అది చల్లదనాన్ని తేనెలతీపిని కడుపులో దాచుకున్న మందారపుష్పాలగుచ్ఛాన్ని పోలి ఉంది. శివుని చూపుల విలాసమనెడి వసంతర్తువు పై చెప్పిన చిరునవ్వులను వికసింపజేస్తూ చలిస్తున్నది.

04 – 4 – 2024.

శ్లోII  బింబోష్ఠద్యుతిపుంజరంజితరుచి స్వన్మందహాసచ్ఛటా 

కల్యాణం గిరిసార్వభౌమతనయే కల్లోలయ త్వాశు మే 

పుల్లన్మల్లి పినద్ధ హల్లక మయీ మాలేవ యా పేశలా 

శ్రీ కాంచీశ్వరి! మారమర్దితు రురోమధ్యే ముహు ర్లంబతే ||26

తే.గీ.II  మల్లికాహల్లికలఁ గూర్చు మాలయట్లు,

త్ర్యక్షు యురము నీ పెదవికాంత్యరుణపుంజ

ముననుకామాక్షి! చిఱునవ్వు మొలకలంద

గించు, నా నవ్వు నన్ గాచు నంచితముగ.

తాII  మల్లెలతోగలిపి గ్రుచ్చిన యెఱ్ఱదామరపూలమాలవలె శివుని వక్షఃస్థలమున సొగసు గుల్కుచు దొండపండువంటి నీ పెదవియొక్క కాంతి పుంజముతోగూడిన నీ యచ్చపుఁ జిరునవ్వులప్రభ నాయెడ సకలకళ్యాణములను దరంగిత మొనరించుగాక !

శ్లోII  బిభ్రాణా శరదభ్రవిభ్రమదశాం విద్యోతమానాప్యసౌ 

కామాక్షీ స్మితమంజరీ కిరతి తే కారుణ్యధారారసమ్ I

ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీశ్చాలోక్య చైనామహో

కామం ఖేలతి నీలకణ్ఠహృదయం కౌతూహలాందోలితమ్ II 27 II

తే.గీ.II  కంటి, నీ స్మితమంజరి పంటకారు

మొయిలు తేజంబునొప్పి, యమోఘమయిన 

దయను వర్షించుటన్, దల్లి! దానిఁ గాంచి

నీలకంఠుని మది తృప్తినోలలాడె.

తాII  అమ్మా! కామాక్షీ! నీ నవ్వులపూలగుత్తి శరత్కాలమునందలి మేఘము వలె తెల్లని కాంతులు గలది. అయినప్పటికీ దయారసధారలను వర్షిస్తున్నది. జగత్తునంతటినీ చల్లబరుస్తున్నది. ఇట్టి ఆశ్చర్యకరమైన మేఘాన్ని చూసి, నీలకంఠ హృదయం (శివుని మనస్సు/ నెమలి చిత్తము)కుతూహలపు ఊగిసలాటలో వినోదిస్తున్నది తల్లీ!

శ్లోII  ప్రేఙ్ఖత్ ప్రౌఢకటాక్ష కుంజకుహరేషు అత్యచ్ఛగుచ్ఛాయితం

వక్త్రేందుచ్ఛవిసింధువీచినిచయే ఫేనప్రతానాయితమ్ I

నైరన్తర్య విజృంభిత స్తనతటే నైచోలపట్టాయితం

కాలుష్యం (కల్మాషం) కబలీకరోతు మమ తే కామాక్షి మందస్మితమ్ II 28 II

తే.గీ.II  నీ దయయెదృఙ్నికుంజముల్, నీ స్మితమన

పూలగుత్తులు, ముఖచంద్ర పూర్ణ కాంతి

సంద్రపు నురుఁగు, నీ నవ్వు చనులపైన

తెల్లవస్త్రము, తల్లి! మమ్మెల్లఁగాచు.

తాII  కామాక్షీ! నీ దయగల చూపులు పొదరిండ్ల గుంపు. మిక్కిలి తెల్లని నీ చిఱునవ్వులు ఆ పొదరిండ్ల పూలగుత్తులు. ముఖమనే చంద్రకాంతి సముద్రపుటలల గుంపులో నీ నవ్వులు తెల్లని నురువులు. ఎల్లప్పుడు వృద్ధినందు పాలిండ్లపైన తెల్లని పైట చెరగు నీ నవ్వులకాంతి. ఆ చిఱునవ్వులకాంతి మాలోని మాలిన్యాన్ని మ్రింగివేయవలెనమ్మా!

శ్లోII  పీయూషం తవ మన్థరస్మితమితి వ్యర్థైవ సాపప్రథా

కామాక్షి ధ్రువమీదృశం యది భవేత్ ఏతత్ కథం వా శివే I

మందారస్య కథాలవం న సహతే మథ్నాతి మందాకినీం

ఇందుం నిందతి కీర్తితేಽపి కలశీపాథోధిమీర్ష్యాయాతే II 29 II

శాII  నీ మందస్మితమున్ సుధంచు ననుటన్ భావింపగా వ్యర్థమే,

శ్రీమందారము నెన్ననొప్పదు, కనన్ శ్రీగంగనున్ జిల్కునే, 

యేమాత్రంబున్ లెక్కలేక శశినే యీశాని! నిందించు, క్షీరాబ్ధిపై

ప్రేమన్ జూపక నీర్ష్యఁ బూను, జననీ! విఖ్యాతమౌ శోభచేన్.

తాII  నీ లేనవ్వు అమృతమనుట వ్యర్థమైనమాట. నిజముగా నది యట్టిదేయైనచో మందారమును మాటకైన సహింపదేల ? మందాకిని నేల కలత పెట్టును? చంద్రబిం బము నెందులకు నిందించును ? పాల్కడలి మాట సెప్పిన నేల యీర్ష్యగొనును?

శ్లోII  విశ్వేషాం నయనోత్సవం వితనుతాం విద్యోతతాం చంద్రమా

విఖ్యాతో మదనాన్తకేన ముకుటీమధ్యే చ సంమాన్యతామ్ I

ఆః కిం జాతమనేన హాససుషమాం ఆలోక్య కామాక్షి తే

కాలంకీమవలంబతే ఖలు దశాం కల్మాష హీనోಽప్యసౌ II 30 II

తే.గీ.II  కనులపండువై లోకాన కలుగవచ్చు,

వెలుగవచ్చును గొప్పగా, పింగళాక్షు

శిరముపై నుండ వచ్చును, వరలగ శశి,

యమ్మ! నీ నవ్వుపై యీర్ష్య క్రమ్మి చెడెను.

తాII  చంద్రుడు సకల విశ్వమునకు కనులపండు వొనరించుగాక ! మిగుల ప్రకాశిం చుగాక ! పరమశివునిచే శిరసావహింపఁబడి గౌరవింపఁబడుగాక ! అంతమాత్రమున నేమైనది? నీ చిరునవ్వును జూచి యోర్వలేక నైజముగ కల్మషములేనివాడయ్యు నతడు కళంకదశ నందుచున్నాడు !


శ్లోII  చేతః శీతలయన్తు నః పశుపతేరానంద జీవాతవో

నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః I

సంసారాఖ్యసరోరుహాకర ఖలీకారే తుషారోత్కరాః

కామాక్షి స్మరకీర్తిబీజనికరాః త్వన్మందహాసాఙ్కురాః II 31 II

తే.గీ.II  అభవు నానందమున్ బెంచు నౌషధంబు,

భక్తులకు శరచ్చంద్రిక, భవ సరోరు

హములఁ గలగించు మంచు, కీర్తిమొలక రతి 

పతికి, నీ నవ్వు, జనని! నన్ సతము కాచు.

తాII  శివుని యానందమునకు ప్రాణాధారములు, వినతులైనవారి కనుచూపులందు శరత్కాలపు వెన్నెలలు, సంసారమను తామరలను మూతవడ జేయుటలో మంచుజ ల్లులు. మన్మధుని కీర్తి మొలకకు బీజప్రాయము లైనవియు నగు నీ దరహాసాంకురములు మా మనసును జిల్లబఱచుగాక !

శ్లోII  కర్మౌఘాఖ్యతమః కచాకచి కరాన్ కామాక్షి సంచిన్తయే

త్వన్మందస్మిత రోచిషాం త్రిభువన క్షేమంకరానఙ్కురాన్ I

యే వక్త్రం శిశిరశ్రియో వికసితం చంద్రాతపామ్భోరుహత్

వేషోద్ధేషోణచాతురీమివ తిరస్కర్తుం పరిష్కుర్వతే II 32 II

తే.గీ.II  కర్మచీకట్ల కచములన్ గాంచి, పట్టి,

లాగివేయు నీ చిఱునవ్వు, వేగముగను

తమ్మి వెన్నెలలకు మైత్రి తనరఁ జేర్చు

కొనెను తనలోనికిని దానిఁ గొలుతునమ్మ.

తాII  కామాక్షీ! కర్మసమూహమనే చీకట్లను జుట్టుపట్టి లాగి, పోరాడుతున్నవి నీ చిరునవ్వుకాంతులు. ఇవి ముల్లోకాలకు క్షేమాన్ని కల్గిస్తాయి. ఈ చిరునవ్వు వెన్నెలకాంతులు- వెన్నెలకూ పద్మాలకుగల ప్రకృతి పరమైన ద్వేషాన్ని తొలగించటంలో భాగంగా ఆ రెంటికీ తన ముఖంలో ఆశ్రయమిచ్చినవి. అట్టి నవ్వులను గూర్చి ధ్యానిస్తున్నాను.

05 – 4 – 2024.

శ్లోII  కుర్యుర్నః కులశైలరాజతనయే కూలంకషం మఙ్గళం

కుందస్పర్ధనచుంచవస్తవ శివే మందస్మిత ప్రక్రమాః I

యే కామాక్షి సమస్తసాక్షినయనం సంతోషయన్తీశ్వరం

కర్పూరప్రకరా ఇవ ప్రసృమరాః పుంసామసాధారణాః II 33 II

తే.గీ.II  మొల్లమొగ్గలనెదిరించు తెల్లనైన

చూపు నీదమ్మ! శైలజా! శుభదమగుచు

మాకు నిలుచుత, ముక్కంటి మనసు పొంగఁ

జేయునవనన్యలభ్యమౌ శ్వేతవాజి.

తాII  కులశైలరాజతనయా! శివా! కామాక్షీ! మొల్లమొగ్గలను జయించే సామర్థ్యంగలవి తెల్లనైన నీ చూపులు. అవి మాకు విస్తారమైన శుభాలను కల్గించాలి. అవి (చూపులు) సమస్త సాక్షియైన శివునియొక్క కనులను, మనస్సును సంతోషింపజేసేవి. సాధారణమానవులకు లభ్యంకాని కప్పురపు సమూహపు ప్రసాదమది తల్లీ!

శ్లోII  కమ్రేణ స్నపయస్వ కర్మకుహనాచోరేణ మారాగమ-

వ్యాఖ్యా శిక్షణదీక్షితేన విదుషామక్షీణలక్ష్మీపుషా I

కామాక్షి స్మితకందలేన కలుషస్ఫోటక్రియాచుంచునా

కారుణ్యామృత వీచికావిహరణ ప్రాచుర్యధుర్యేణ మామ్ II 34 II

సీII  అమ్మరో! నీ మందహాసంపు కాంతులు కర్మకాపట్యమున్ కడిగివేయు,

మన్మథాగమతంత్ర మధుర పదార్థోక్తిఁ, జేసి దీక్షనొసంగు చిద్గురువది,

విదుషుల కక్షీణ విపుల లక్ష్మీప్రదంబులు, పాప విచ్ఛిత్తిఁ గొలుపునవియు,

దయయను నమృతంపు తరగలన్ విహరించుటన్ ముందు నిలుచునట ఘనముగను,

తే.గీ.II  అట్టి తెల్లని నీమందహాసచంద్రి

కలను నను స్నానమాడించు కమలనయన!

కరుణఁ గాచెడి కామాక్షి! పరమపథము

నాకు దయచేయుమమ్మ! యస్తోకముగను.

తాII  కామాక్షీ! నీ నవ్వుల కాంతులు కర్మలయందలి కాపట్యమును దొంగిలించేవి, మన్మథ ఆగమతంత్రమును వ్యాఖ్యానించి దీక్షనిచ్చేగురువులు, విద్వాంసులకు నాశనములేని శోభను చేకూర్చేవి, పాపముల విచ్చిత్తినందించుటలో శక్తిగలవి, దయ అనే అమృత తరంగాలలో విహరించుటలో ముందునిలిచేవి, అట్టి నీ తెల్లని చిరునవ్వుల మొగ్గలకాంతులతో నన్ను స్నానం చేయించుము!

శ్లోII  త్వన్మందస్మిత కందలస్య నియతం కామాక్షి శఙ్కామహే

బింబః కశ్చన నూతనః ప్రచలితో నైశాకరః శీకరః I

కించ క్షీరపయోనిధిః ప్రతినిధిః స్వర్వాహినీ వీచికా-

బిబ్వోకోಽపి విడమ్బ ఏవ కుహనా మల్లీమతల్లీరుచః II 35 II 

తే.గీ.II  నీదు చిరునవ్వు తునక గణింప చంద్ర

బింబ మయి యుండు, వర సుధాబ్ధి ప్రతినిధియె

నీ నగవునకు, గంగమ్మ జాణతనము

వినుత శృంగారమన వట్టియనుకృతియగు,

మల్లికలసొగసులువట్టి మాయ కనగ.

తాII  నీ నవ్వు మొలకలో చిన్నతుంపర ఒకటి చంద్రబింబమై యుద యించె నేమోయని యనుమానపడుచున్నాను. నీ నవ్వునకు పాల్కడలి ప్రతినిధి మాత్రము. గంగా తరంగముల శృంగారము వట్టి యనుకరణ మాత్రము. మల్లి కల సొగసులెల్ల మాయా మాత్రములే.

శ్లోII  దుష్కర్మార్కనిసర్గ కర్కశం అహస్సంపర్కతప్తం మిలత్-

పఙ్కం శంకరవల్లభే మమ మనః కాంచీపురాలంక్రియే (కామాక్షి కాంచీశ్వరీ) I

అంబ త్వన్మృదులస్మితామృతరసే మంక్త్వా విధూయ వ్యథాం-

ఆనందోదయ సౌధ శృఙ్గ పదవీం ఆరోఢుమాకాంక్షతి II 36 II

ఉII  కోమల మందహాసమున కూర్మిని నీవు భవాని! పాపమన్

తామరమిత్రు వాడియగు తాపముచే పరితప్తమైనదౌ

నామది చల్లగానవగ నన్ దయఁగాంచి జనింపఁ జేయుమా.

నీ దయ చేత దుఃఖమును నే విడి బ్రహ్మముఁ బొందఁ గోరితిన్.

తాII  ఓ కాంచీపురభూషణమా ! శంకర ప్రియవల్లభా ! నీ కోమలమందహాసా మృత రసముచే దుష్కర్మమనెడి సూర్యుని తీవ్రమగు వేడిమిచే దప్తమగునట్టియు పంకిల మగునట్టియు నా మనసును ముంచెత్తుము. అది దుఃఖములను విదల్చుకొని బ్రహ్మానంద సౌధశిఖరమున నధిష్ఠింపవలెనని యువ్విళ్ళూరుచున్నది.

శ్లోII  నమ్రాణాం నగరాజశేఖరసుతే నాకాలయానాం పురః

కామాక్షి త్వరయా విపత్ప్రశమనే కారుణ్యధారాః కిరణ్ I

ఆగచ్ఛంతమనుగ్రహం ప్రకటయన్ ఆనందబీజాని తే

నాసీరే మృదుహాస ఏవ తనుతే నాథే సుధాశీతలః II 37 II

మII  జననీ! నీ పద పంకజమ్ములపయిన్ సద్భక్తి వ్రాలన్ గృపన్

ఘనతన్ నీ దయఁ జల్లి యాపదలనే కల్యాణి! పాయన్ సతీ!

యనయంబున్ బొనరించి దేవతలకో యాత్మస్థ!, నీ నవ్వె తా

వినుతానందముఁ గొల్పుచుండునుకదా, విఖ్యాతిగా వెల్గుచున్.

తాII  పర్వతరాజకుమారీ! కామాక్షీ! గురుస్వరూపిణీ! నీ (పాదాల) ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న దేవతలకు- దయారసాన్ని త్వరగా వెదజల్లటం ద్వారా విపత్తులను నశింపజేసి- నీ చిరునవ్వు అనుగ్రహాన్ని ప్రకటించటం అనే నాగలిచాలులో ఆనందమనే బీజాలను నాటుతున్నది- అమృతం వలె చల్లనైన నీ చిఱునవ్వే కదమ్మా! 

శ్లోII  కామాక్షి ప్రథమానవిభ్రమనిధిః కందర్పదర్పప్రసూః

ముగ్ధస్తే మృదుహాస ఏవ గిరిజే ముష్ణాతు మే కిల్బిషమ్ I

యం ద్రష్టుం విహితే కరగ్రహ ఉమే శంభుస్త్రపామీలితం

స్వైరం కారయతి స్మ తాండవ వినోదానందినా తండునా II 38 II 

శాII  నీ కల్యాణము వేళ సిగ్గుపడుచున్ నీ నవ్వునే దాచుటన్

శ్రీకంఠుండు కనంగనెంచి యచటన్ జేయించె తా తాండవం

బో కల్యాణి! గణించి తండువను ప్రేమోద్భాససద్భక్తుచే,

లోకోద్ధారిణి నవ్వితీవపుడు, నాలో నిల్పుమానవ్వునే.

తాII  కల్యాణసమయమున శంకరుడు సిగ్గుచే నడచికొన్న నీ చిరునవ్వును జూడఁగోరి తాండవవినోదమును బ్రదర్శింప నేర్చిన తన పరివారములో నొకడగు తండువుచే గంతులు వేయించి నీ చిరునవ్వును వికసింపజేయును. అట్టి ముగ్ధమనోహర మును, విలాసనిధియు, మన్మధ గర్వకారణమునగు నీ మందస్మితము నా పాపమును హరించుగాక.

శ్లోII  క్షుణ్ణం కేనచిదేవ ధీరమనసా కుత్రాపి నానాజనైః

కర్మగ్రంథి నియంత్రితైరసుగమం కామాక్షి సామాన్యతః I

ముగ్ధైర్ద్రష్టుమశక్యమేవ మనసా మూఢస్య మే మౌక్తికం

మార్గం దర్శయతు ప్రదీప ఇవ తే మందస్మితశ్రీరియమ్ II 39 II

కంII  ధీరులకందెడి ఫలమది,

భీరువులకునందనిది, యవిజ్ఞు(ధ్యు)ల మతికిన్

జేరనిది, పూజ్యమోక్ష

ద్వారము నీ స్మేరమమ్మ! దయఁ గననిమ్మా!

తాII ధీరుడైనవాని కెవ్వనికో మాత్రము నలిగినబాటయై సులభమైనదియు. కర్మ గ్రంథిబంధితులగు సామాన్యుల కసులభమును. అజ్ఞాని మనసునకు నగోచరమును నగు ముక్తిమార్గమును నీ యీ మందస్మితకాంతి దీపమువలె నాకు జూపించుగాక ! 

శ్లోII  జ్యోత్స్నాకాంతిభిరేవ నిర్మలతరం నైశాకరం మండలం

హంసైరేవ శరద్విలాససమయే వ్యాకోచమమ్భోరుహమ్ I

స్వఛ్ఛైరేవ వికస్వరైరుడుగణైః కామాక్షి బింబం దివః

పుణ్యైరేవ మృదుస్మితైస్తవ ముఖం పుష్ణాతి శోభాభరమ్ II 40 II

తే.గీ.II  వెన్నెలలచేత రాణించు వేల్పుబువ్వ, 

వర శరత్తున హంసలన్ బద్మము విడు, 

చుక్కలను వెల్గునాకాశ మక్కజముగ, 

సొంపు చిఱునవ్వె ముఖమున కింపుఁగొలుపు.

తాII  వెన్నెలలచేతనే చంద్రబింబము స్వచ్ఛమై రాణించును. హంసలచేతనే పద్మము శరత్కాలమందు వికాసమునొందును. చుట్టును చక్కగ మెఱయు చుక్కలచేతనే ఆకాశము శోభించును. పవిత్రములైన నీ మందస్మితములచేతనే నెమ్మోము సొంపుల నిండును బెంపొందించును.


శ్లోII  మానగ్రన్థివిధుంతుదేన రభసాదాస్వాద్యమానే నవ

ప్రేమాడమ్బర పూర్ణిమా హిమకరే కామాక్షి తే తత్క్షణమ్ I

ఆలోక్య స్మితచంద్రికాం పునరిమామున్మీలనం జగ్ముషీం

చేతః శీలయతే చకోరచరితం చంద్రార్ధచూడామణేః II 41 II

తే.గీ.II  నీదు బిడియమన్ రాహువు నీదు ప్రణయ

మనెడి చంద్రుని మ్రింగగ నప్పుడొడయు

స్మేర చంద్రికల్ గనుచు చకోరమటుల

భవుఁడు పొంగెనో కామాక్షి! భవ్యముగను.

తాII  మానము (గుట్టు) అనెడి రాహువు గ్రమ్మగా నూతనానురాగమనెడి పూర్ణిమా చంద్రబింబ మాస్వాదింపఁబడగా జూచి యల్లల్లన నున్మీలితమగుచుండు నీ చిరునవ్వు వెన్నెలను జకోరమువోలె చంద్రమౌళిమనసు వెదకికొనుచున్నది.  

06 – 4 – 2024.

శ్లోII  కామాక్షి స్మితమంజరీం తవ భజే యస్యాస్త్విషామఙ్కురాన్-

ఆపీనస్తనపానలాలసతయా నిశ్శఙ్కమఙ్కేశయః I

ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి ప్రసృమరానుద్దామయా శుణ్డయా

సూనుస్తే బిసశఙ్కయాశు కుహనాదంతావలగ్రామణీః II 42 II

ఉII  నీ యొడి సేదతీరెడి గణేశుఁడు పాలను త్రాగు లాలసన్

తా యొడి నుండి పైకి గని తామర తూడుగ నీదు స్మేరమున్

పాయక చూచి తొండమున పట్టుకొనన్ జతనంబు చేసె నా

శ్రేయము గూర్చు నీ నగవు శ్రీకరమంచు భజింతునమ్మరో!

తాII  ఓ కామాక్షీ! ఏ నీ మందస్మితమంజరియొక్క వ్యాపించు కాంతులయొక్క మొలకలను ఒడిలో పడుకొని యున్న కపటగజశ్రేష్ఠుడైన నీయొక్క కొడుకు(శిశువు) బలువైన స్తనమును ద్రాగునాసక్తిచేత పైకి చూచి నిర్భయముగా శీఘ్రముగా తామరతూండ్లను శంకచేత అదుపులేని తొండముచేత లాగుచున్నాడో ఆ నీయొక్క చిఱునవ్వు గుత్తిని భజించెదను.

శ్లోII  గాఢాశ్లేషవిమర్దసంభ్రమవశాత్ ఉద్దామ ముక్తాగుణ

ప్రాలంబే కుచకుంభయోర్విగళితే దక్షద్విషో వక్షసి I

యా సఖ్యేన పినహ్యతి ప్రచురయా భాషా తదీయాం దశాం

సా మే ఖేలతు కామకోటి హృదయే సాంద్రస్మితాంశుచ్ఛటా      II 43 II

మII  హరునిన్ గొప్పగఁ గౌగిలించు తరి నీ హారంబు శీర్ణంబు కాన్

వరలన్ ముత్యములా మహేశునిపయిన్, భాసించు నీ స్మేర సుం

దరకాంతుల్ వరభావన న్నమితమౌ తళ్కుల్ ప్రసారించి తొం

దరగా కన్బడకుండచెసె జననీ! తత్స్మేరమున్ మ్రొక్కెదన్.   

తాII  పరమశివుని గాఢముగ గౌగలించుకొన్న సమయమున నీ కుచకుంభములందు జెదఱి ముత్యాలహార మెడమువడఁగా దానితో జెలిమివాటించెడి నీ మందహాసప్రభలు నీ స్వామి వక్షఃస్థలమున వ్యాపించి యా ముత్యాలహారముకంటె మించిన శోభను సమ కూర్చును. ఆ నీ మందహాసకాంతిపుంజము నా హృదయమునందు గంతులిడుగాక

శ్లోII  మందారే తవ మన్థరస్మితరుచాం మాత్సర్యమాలోక్యతే

కామాక్షి స్మరశాసనే చ నియతో రాగోదయో లక్ష్యతే I

చాన్ద్రీషు ద్యుతిమంజరీషు చ మహాన్ద్వేషాఙ్కురో దృశ్యతే

శుద్ధానాం కథమీదృశీ గిరిసుతేಽశుద్ధా దశా కథ్యతామ్ II 44 II

శాII  నీ మందస్మిత కాంతికిన్ గలిగెనే నిర్వ్యాజమౌ మత్సరం

బా మందారముపై, శివుండనినచో వర్ధిల్లుటాప్రేమయున్,

సోమప్రాభవకాంతిపుంజమునఁ జూచున్ దోషమున్, శాంభవీ!

యేమీ? స్మేరము స్వచ్ఛమే, కలిగె నె ట్లీ పద్ధతుల్? చెప్పుమా.

తాII  నీ మందస్మితకాంతికి మందారమునెడల మాత్సర్యము గానవచ్చుచున్నది. వరమ శివునం దత్యంతము రాగము కానవచ్చుచున్నది. చంద్రప్రభామంజరులందు దోషారో పణము గోచరించుచున్నది. సహజస్వచ్ఛములైనవానికి నిట్టి యస్వచ్ఛత (రాగద్వేషదో షదశ) యెందుకు బట్టినదో చెప్పుము.   

శ్లోII  పీయూషం ఖలు పీయతే సురజనైః దుగ్ధాంబుధిర్మథ్యతే

మాహేశైశ్చ జటాకలాపనిగడైః మందాకినీ నహ్యతే I

శీతాంశుః పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ

కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లఙ్ఘ్యతే II 45 II

సీII  ఈ మందహాసంబు నెటుపోలు నమృతంబు, త్రాగుచుందురు దేవతాతతి కన,

నీ మందహాసంబు నెటుపోలు నెనలేని పాలకడలి, త్రచ్చఁబడినదికద?

యీ మందహాసంబు నెటుపోలు గంగమ్మ శివునిజడలలోన చిక్కఁబడుట

నీ మందహాసంబు నెటుపోలు శశి? పొందు రాహువుచేత పరాభవంబు,

తే.గీ.II  నిట్టి యీమందహాసం బదెట్లు మాకు

వర్ణనము చేయఁగానగు? పదము లేవి?

తల్లి కామాక్షి నీ నవ్వు తెల్లఁదనము

వర్ణనము చేయ నలువకున్ వశము కాదు.

తాII  అమృతమును దేవతలు త్రాగునది. పాలసముద్రము మధింపబడినది. గంగానది శివుని జటలో ఆపివేయఁ బడినది. చంద్రుడు చీఁకటి (రాహువు) చే బరాభవింపబడుచున్నాడు. కావున నీ మందహాస మంజరికి ఉపమాన మింకొకటి కనిపింపదు. మాటల నేర్పుల కది యతీతమై యున్నది.  

శ్లోII  ఆశఙ్కే తవ మన్దహాస లహరీం అన్యాదృశీం చంద్రికాం

ఏకామ్రేశకుటుమ్బిని ప్రతిపదం యస్యాః ప్రభాసంగమే I

వక్షోజామ్బురుహే న తే రచయతః కాంచిద్దశాం కౌఙ్భలీం

ఆస్యాంభోరుహమంబ కించ శనకైరాలంబతే ఫుల్లతామ్ II 46 II

ఉII  నీ చిఱునవ్వు నెన్నెద విచిత్రపు చంద్రికగా మదంబ! నేఁ 

జూచితి, దాని కాంతి పడి శోభిలు నీ కుచపద్మయుగ్మమున్,

దాచెను కుట్మలత్వమును, తల్లిరొ! యంతయె కాదు నీ ముఖం

బా చిఱునవ్వుచే విరిసి యంచితపద్మముగా రహించెనే.

తాII  నీ చిఱునవ్వు నొక విచిత్రమైన వెన్నెలగ భావించుచున్నాను. తత్కాంతి సంగమమున నీ కుచపద్మములు మునిగిపోవుటలేదు సరిగదా, ఒకానొక చక్కని కుట్మలదశను వీడకున్నవి. అంతియకాదు, నీ ముఖకమలముగూడ విప్పారుచున్నది.  

శ్లోII  ఆస్తీర్ణాధరకాంతి పల్లవచయే పాతం ముహుర్జగ్ముషీ

మారద్రోహిణి కందలత్ స్మరశర జ్వాలావలీర్వ్యంజతీ I

నిందంతీ ఘనసారహారవలయ జ్యోత్స్నామృణాళాని తే

కామాక్షి స్మితచాతురీ విరహిణీరీతిం జగాహేతరామ్ II 47 II

చంII  విరహిణివోలెవర్తిలుచు విశ్వమునన్ బొగడొందుచుండె నీ

నిరుపమ హాసచంద్రికగణింపక నీ యధరంపు పాన్పుపై

సరగున వ్రాలుచుండె, మరుశస్త్రమహాగ్నిని పొందు పచ్చక

ప్పురమును, వెన్నెలన్, సరము, పొల్పగు తామర నుజ్జగించునే.

తాII కామాక్షీ! నీ చిరునవ్వులు ఒక విశిష్టమైన విరహిణివలె వర్తిస్తున్నాయి. పెదవులనే చిగురుటాకులపాన్పుపై పడిపోతున్నాయి. మన్మథునిబాణాలనే (పువ్వులనే) జ్వాలలను పొందుతున్నది. పచ్చకప్పురము, ముత్యాలహారము, వెన్నెల, తామరతూడులు- వీటన్నింటిని నిందిస్తున్నది.

వి.వి. (శివునితో ఎడబాటును సహించలేని స్థితి- విరహిణీదశ. అధరాలపైనుండి జాలువారి శివుని చేరుతూ, శీతలవస్తువులన్నిటినీ ధిక్కరించే చల్లదనం కలది అమ్మ చిరునవ్వు అని భావం.)

శ్లోII  సూర్యాలోకవిధౌ వికాసమధికం యాన్తీ హరన్తీ తమః-

సందోహం నమతాం నిజస్మరణతో దోషాకరద్వేషిణీ I

నిర్యాన్తీ వదనారవింద కుహరాత్ నిర్ధూతజాడ్యా నృణాం

శ్రీ కామాక్షి తవ స్మితద్యుతిమయీ చిత్రీయతే చంద్రికా II 48 II

మII  అది నీ స్మేరపు వింతచేష్ట కన, సూర్యాలోకనన్ భాసిలున్,

వదిలించున్ దురితాంధమున్ నతులకున్ బాధల్ విడన్ బాపుచున్,

ముదమారన్ గను తల్లి! భక్తిఁ గొలువన్ దోషాకరద్వేషిణీ

వదనాబ్జాద్భుతగహ్వరప్రభవమై పాపున్ మనో జాడ్యమున్.

తాII  నీ చిరునవ్వు ఒక వింత వెన్నెలగా గన్పించుచున్నది. అది సూర్యాలోకమం దెక్కువ వికాసమును బొందుచున్నది. శ్లేష-సూరి+ఆలోకవిధి జ్ఞానుల దృష్టి - యందు తమస్సును హరించుచున్నది. (అసలు వెన్నెల దమస్సుచే ననగా రాహువుచే నాక్రాంతమగును) భక్తులు తలంచిన మాత్రమున వారిలోని దోషములకు బాధకమ గుచున్నది. శ్లేష≈దోషాకర- చంద్రునియెడ ద్వేషముగలదగుచున్నది. నీ ముఖమనెడి పద్మమునుండి వెడలుచున్నది. మానవుల జాడ్యమును హరించుచున్నది.

శ్లోII  కుణ్ఠీకుర్యురమీ కుబోధఘటనాం అస్మన్మనోమాథినీం

శ్రీకామాక్షి శివంకరాః తవ శివే శ్రీమందహాసాఙ్కురాః I

యే తన్వంతి నిరన్తరం తరుణిమస్తమ్బేరమగ్రామణీ-

కుంభద్వంద్వవిడమ్బిని స్తనతటే ముక్తాకుథాడమ్బరమ్ II49 II

కII  మదగజములకుంభములటు

లెదపై కుచకుంభములపయిని ముత్యములన్

బొదవిన కంబళమట్టుల

నొదవిన నీ నగవు డులుచు నొప్పుగ కర్మల్.

తాII  యౌవనమనెడి మదగజముయొక్క కుంభస్థలములన్నట్లు భాసిల్లు నీ కుచకుంభము లందు పఱచిన ముత్యాలరత్నకంబళముయొక్క శోభను విస్తరింపజేసెడి శివంకరములైన నీ మందహాసాంకురములు నా మనసును స్తంభింపజేయు నజ్ఞానఘటన నడంచుఁగాక!  

శ్లోII  ప్రేఙ్ఖన్తః శరదంబుదా ఇవ శనైః ప్రేమానిలైః ప్రేరితాః 

మజ్జన్తో మదనారికణ్ఠసుషమాసింధౌ ముహుర్మంథరమ్ I

శ్రీకామాక్షి తవ స్మితాంశునికరాః శ్యామాయమానశ్రియో

నీలాంభోధరనైపుణీం తత ఇతో నిర్నిద్రయన్త్యంజసా II 50 II

తే.గీ.II  ప్రేమవాయువు ప్రేరణన్ నీ మనోజ్ఞ 

మైన స్మేర శరన్మేఘమభవు కంఠ

కాంతి జలధి మునిగి నీల కాంతినొంది

నీలమేఘసౌందర్యమున్ దేల్చె కళను.

తాII  ప్రేమవాయువులచే బ్రేరితములైన నీ మందహాసములు శరత్కాల మేఘములట్లు మన్మధ వైరికంఠకాంతియనెడి సముద్రమున మునిగి నలుపుగొన్నవై నీలమేఘ సౌందర్యమును మెఱయించుచున్నవి.  


శ్లోII  వ్యాపారం చతురాననైకవిహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ

రుద్రాక్షగ్రహణం కరేణ సతతం వాగూర్మికల్లోలితా .

ఉత్ఫుల్లం ధవలారవిందమధరీకృత్య స్ఫురంతీ సదా

శ్రీకామాక్షి సరస్వతీ విజయతే త్వన్మందహాసప్రభా ..51.

శాII  నీ నవ్వుల్ చతురాననైక విహృతిన్ నిత్యంబు భాసించునే,

యా నవ్వుల్  రుదరక్కలన్ గొనునె, వాగ్వ్యాప్తిన్ బ్రకాశించునే,

యా నవ్వుల్ నుతపద్మకాంతితతి క్రిందైయుండగానుండునే,

యానవ్వుల్ కన శారదాకృతులె, యాహా! కామకోటీశ్వరీ!

తాII  ఓ కామాక్షీ! నీ చిఱునవ్వు ప్రకాశము దేవత లాంటిది. బ్రహ్మ కార్యకలాపాల గురించి చింతించిన సరస్వతి (ఆందోళన చెందుతోంది బ్రహ్మ సృష్టిని రక్షించడం), ఎవరు కలిగి ఉన్నారు రుద్రాక్ష ఆమె చేతుల్లో (కళ్ళు పట్టుకుంది శ్వేత కమలంపై కూర్చునే పదాల అలల (మాటల తరంగాల ద్వారా ప్రవహించిన) ప్రవహించిన రుద్రుడు, దాని అక్షరక్రమంలో నిండుగా వికసించినది (అందంలో తెల్ల కమలం నిండుగా వికసిస్తుంది)

శ్లోII  కర్పూరద్యుతి తస్కరేణ మహసా కల్మాషయత్యాననం

శ్రీకాంచీపురనాయికే (శ్రీకామాక్షి శివప్రియ) పతిరివ శ్రీమందహాసోಽపి తేI

ఆలిఙ్గత్యతిపీవరాం స్తనతటీం బింబాధరం చుంబతి

ప్రౌఢం రాగభరం వ్యనక్తి మనసో ధైర్యం ధునీతేతరామ్ II 52 II 

సీII  కామాక్షి నీ నవ్వు కాంతి నీ పతిఁ బోలి తెల్లనై యొప్పును మల్లెలవలె,

కర్పూర కాంతినే ఘనముగా గైకొను, హరునట్లు నీరంగు నరసి మార్చు,

నీ చిఱునవ్వులు నీ పతివలె నీదు వక్షస్థలంబునన్ బరవశించు,

దొండపండును పోలి యుండు నీ యధరమున్ శివునట్లు చుంబించి చెలగుచుండు,

తే.గీ.II  మదిని గలయట్టి తీవ్రమౌ మధుర రాగ

మును బయల్పడఁ జేయును మున్నె తాను,

మదిని గల నిగ్రహంబును కుదిపివేయు,

నట్టి నీ స్మేరమునకు నే నంజలింతు.

తాII  ఓ కాంచీపుర రాణీ!  నీ చిఱునవ్వు నీ భర్తయగు శివునివలె తెల్లనిది. ఆ తెలుపు కర్పూరపుకాంతిని దొంగిలించియున్నది. అది శివునివలె నీ ముఖముయొక్క రంగు మారునట్లొనరించుచున్నది. శివునివలెనే నీ మందహాసమును పీవరస్తన ప్రదేశమును గౌగలించుకొనుచున్నది. దొండపండువంటి నీ పెదవిని నీ భర్తవలెనే చుంబించుచున్నది. తీవ్రమైన మనసులోని రాగాతిరేకమును బయల్పరచుచున్నది. మనస్సులోని నిగ్రహశక్తి రూపము అయిన ధైర్యమును కదలింపజేయుచున్నది.

శ్లోII  వైషద్యేన్ చ విశ్వతాపహరణక్రీడాపతియస్తయా ॥

పాండిత్యేన్ పచెలిమెన్ జగతాం నేత్రోత్సవోత్పాదనే.

కామాక్షి స్మితకందలైస్తవ తులామారోఢుముద్యోగినీ

జ్యోత్స్నాసౌ జలరాశిపోషణతయా దూష్యం ప్రపనా దశమ్ ॥53॥

తే.గీ.II  వేడి చల్లార్చు గుణమును, వెన్నెలమ్మ

జ్ఞానపక్వంబు గల్గి, తా జనులకు ముద

ము గొలుపు గుణమునను నిన్నుఁ బోలనెంచు,

సంద్రమున్ బొంగఁ జేయు, నీ సరి యవదుగ.

నీదు స్మేరంబునకు సాటి రాదు తల్లి!

తాII  ఓ కామాక్షీ!  చంద్రకాంతి మీ చిరునవ్వుతో సమానత్వాన్ని పొందాలని కోరుకుంటుంది, ప్రపంచంలోని వేడిని తగ్గించే సామర్థ్యంతో, దాని పండిన జ్ఞానం (తెలుపు రంగు ద్వారా) మరియు ప్రజల కళ్ళను ఆనందపరిచే సామర్థ్యం ద్వారా, కానీ అది సముద్రాన్ని ఉప్పొంగేలా చేస్తుంది కాబట్టి అది విచారకరమైన స్థితిలో ముగిసింది.

శ్లోII  లావణ్యామ్బుజినీమృణాలవలయః శృంగారగంధద్వీప-

గ్రామణ్యఃశ్రుతిచామరైస్తరుణిమస్వారాజ్యబీజాఞ్కురైః

ఆనందామృతసిన్ధువీచిపృషతైరాస్యాబ్జహంసయిస్తవ

శ్రీకామాక్షి మథాన్ మన్దహసితైర్మత్కం మనః కల్మషమ్ ॥54॥

సీII  సౌందర్యమనియెడి సరసిజ లతకు తామరతూండ్లకడియముల్ మదిని గాంచ,

శృంగార మదగజ శృతిచామరము లమ్మ! నీ చిఱునవ్వులు, నిరుపమాన!

యౌవన సామ్రాజ్యమందు బీజాంకురములు చూడగా, నిత్యముగ వెలుంగు,

సుందరమైన యానందామృత సముద్రకెరట బిందువు తల్లి! నిరుపమమది,

తే.గీ.II  నీదు ముఖపద్మమున హంస, శ్రీద మదియు,

నట్టి స్మేరంబు నామదిన్ బట్టియున్న

దోష సంహారి యగుత, నిర్దోషినవగ,

వందనంబులు దాని కో యమ్మ! కొనుత.

తాII  ఓ కామాక్షీ! నీ చిఱునవ్వులు సౌందర్యమనెడి కమల లతకు తామర తూండ్ల కడియములు, శృంగార  గన్ధగజము యొక్క శృతి చామరములు, యౌవన స్వారాజ్యముయొక్క బీజాంకురములు, ఆనాన్దామృతసముద్ర తరంగములయొక్క బిందువులు, నీ ముఖకమలమున విహరించు హంసములు. అట్టి నీ చిఱునవ్వులతో నా మనస్సులోని దోషమును మథించుము. 

శ్లోII  ఉత్తుంగస్తనమండలీపరిచలన్మాణిక్యహారచ్ఛత

చఞ్చచ్ఛోణిమపుఞ్జమధ్యసరణిం మాతా పరిష్కుర్వతీ ।

యా వైదగ్ధ్యముపైతి శంకరజాటాకాంతారవాటిపత్-

స్వర్వాపీపయసః స్మితద్యుతిరసౌ కామాక్షి తే మఞ్జులా ॥55॥

తే.గీ.II  నీదు చిఱునవ్వు కామాక్షి! నీ యురమున

కలుగు ముత్యాలకాంతి ప్రకాశమయిన

యెఱుపు మధ్యశోభను గూర్చు, నీశు జడల

యడవి వెలువడు గంగనా నలరె నమ్మ.

తాII  ఓ కామాక్షీ! నీ మన్దహాసము నీ స్తనమండలమునందు ముత్యాలకాంతితో ప్రకాశించు నెఱుపుల మధ్య దారి నలంకరించుచున్నది. అది శివుని జడల అడవి ప్రదేశము నుండి పడు గంగాప్రవాహము యొక్క నైపుణ్యమును బొందుచున్నది.

07 – 4 – 2024.

శ్లోII  సన్నామైకజుషా జనేన్ సులభం సంసూచయంతిశనై-

రుత్తుఙ్గస్య చిరాదనుగ్రహతరోరుత్పశ్యమానం ఫలమ్ ।।

ప్రాథమ్యేన్ వికస్వరా కుసుమవత్ప్రాగల్భ్యమభ్యేయుషీ

కామాక్షి స్మితచతురీతవ మం క్షేమంకరీకల్పతామ్ ॥56॥

తే.గీ.II  ఘన యశస్వి వలన యనుగ్రహమనియెడి

ప్రనుత వృక్షసంభవ ఫలమును తెలుపుచు,

ముందుగనె పూచి వికసించు పూవువోలె

ఘనతకాంచిన నీనవ్వు కాచు నన్ను.

తాII  ఓ కామాక్షీ! మంచి యశస్సు గడించిన యొకానొక పురుషుని మూలమున అనుగ్రహమనెడి యొక మహావృక్షమునుండి పుట్టినఫలమును సూచించుచు నంతకు ముందుగ పూచి వికసించిన పువ్వువోలె రాణింపు వడసిన నీ చిరునవ్వునేరిమి నాకు క్షేమము గూర్చు నది యగుగాక !

శ్లోII  ధనుష్కాగ్రసరస్య లోలకుటిలభ్రూలేఖయా బిభ్రతో ॥

లీలాలోకశిలీముఖం నవవయఃసామ్రాజ్యలక్ష్మీపుషః ।

జేతుం మన్మథమర్దినం జనని తే మన్దస్మితప్రక్రమో

వల్గుర్విభ్రమభృతో వితనుతే సేనాపతిప్రక్రియామ్ ॥57॥

తే.గీ.II  అమ్మ! నీ స్మేర మారంభ మనుపమమగు

కదలు కనుబొమ విల్దాల్పు ఘనుఁడు చూపు

శరము దాల్చు, యౌవనరాజ్యచక్రవర్తి

శివజయక్రియన్ సేనాని గా వరలును.

తాII  అమ్మా! నీయొక్క అందమైన చిఱునవ్వుయొక్క ఆరంభము చంచలమైన వంకరయైన కనుబొమరేఖచే ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన అలవోకగా చూచు చూపు అను బాణమును ధరించునట్టియు, యౌవనమను సామ్రాజ్యముయొక్క శోభను పొందిన విలాసరాజునకు (విలాసమను రాజుయొక్క) శివుని జయించుటకు సేనాపతియొక్క ప్రక్రియను చేయుచున్నది.

శ్లోII  యన్నాకంపత కాలకూటకబలికారే చుచుంబేన యద్-

గ్లాన్యా చక్షుషి రూషితానలశిఖే రుద్రస్య తత్తదృశమ్ ।

చేతో యత్ప్రసభం స్మరజ్వరశిఖిజ్వాలేన లేలిహ్యతే

తత్కామాక్షి తవ స్మితాంశుకణికాహేలాభవం ప్రాభవం ॥58॥

తే.గీ.II  గరళమున్ మ్రింగినప్పుడున్ గలఁగ లేదు,

కంటి మంటచేతను కూడ కనల లేదు,

నేడు మన్మధాగ్నికి తాళలేడు శివుఁడు,

నీదు చిఱునవ్వెకద మూలమై దహించు. 

తాII  అమ్మా కామాక్షీ దేవీ! కాలకూటము మ్రింగునప్పుడు భయపడలేదు. కంటి మంటలకు గ్లాని నొందలేదు. అట్టి శివుని చిత్తము నేడు మన్మథాగ్ని జ్వాలలచే చుట్టబడినదనగా నది నీ మన్దస్మితలేశముయొక్క వైభవము కాదా?

శ్లోII  సంభిన్నేవ సుపర్వలోకతటిని వీచీచయైర్యామునైః ॥

సన్మిశ్రేవ శశాంకదీప్తిలహరీ నీలైర్మహానీరదైః ।

కామాక్షి స్ఫురితా తవ స్మితరుచిః కాలాఞ్జనస్పర్ధినా ॥

కాళీమ్నా కచరోచిషాం వ్యతికరే కాంచిద్దశామశ్నుతే ॥59॥

మII  యమునావీచిని గూడి పారు తఱిలో నాగంగ యెట్లొప్పు, మే

ఘముతో కూడిన వెన్నెలమ్మెటులనో, కల్యాణి! కామాక్షి! ని

త్యము నీ సంస్తుత సుస్మితంబు కురులం దత్యంతకాలప్రభన్ 

బ్రముదంబు న్మిళితంబుగానగుచటుల్ ప్రఖాత వర్ణప్రభన్.

తాII  ఓ కామాక్షీ! యమునాతరంగములచే గంగానది యొరసికొని విరబారినట్లు, వెన్నెల క్రొక్కారు నీలమేఘములతో నేకమైనట్లు, నీ చిరునవ్వు సొంపు నల్లకాటుకను ధిక్కరించు నీ తలకట్టునందలి నలుపుతోడ గూడి యొకానొక నింతసొంపు వడయుచున్నది.

శ్లోII  జానీమో జగదీశ్వరప్రణయిని త్వన్మందహాసప్రభాం

శ్రీకామాక్షి సరోజినీమభినవామేషా యతః సర్వదా ।

ఆస్యేన్దోరవలోకనే పశుపతేరభ్యేతి సంఫుల్లతాం

తంద్రాలుస్తదభావ ఏవ తనుతే తద్వైపరిత్యక్రమమ్ ॥60॥

తే.గీ.II  అమ్మ! జగదీశు రాజ్ఞి! నీ కమ్మనైన

దివ్య మందస్మితము కల్వ, తెలిసెనమ్మ,

శివుని ముఖచంద్రుఁ గని వికసించునమ్మ,

యట్లుకాకున్నవికసింపదమ్మ! నిజము.

తాII  ఓ కామాక్షీ! ఓ జగదీశ్వరవల్లభా ! నీ మందహాసప్రభ యొకానొక కలువకన్నియ యని గ్రహిం చినాము. కారణ మేమనఁగా నది శంకర ముఖచంద్రబింబదర్శనమైన యంతటనే చక్కగ వికసించుచున్నది. అది కానపుడు ముడిగి నిద్దురమోమగుచున్నది.


శ్లోII  యాంతీ లోహితిమానమభ్రతతిని ధాతుచ్ఛటకర్తమై-

ర్భాన్తీ బాలగభస్తిమాలికిరణైర్మేఘావలీ శారదీ ।

బింబోష్ఠద్యుతిపుఞ్జచుంబనకలాశోణాయమానేన తే

కామాక్షి స్మితరోచిషా సమదశామారోఢుమాకాంక్షతే ॥61॥

శాII  అమ్మా! నీ చిఱునవ్వువర్ణ మధరంపారుణ్యమున్ గూడుటన్,

సమ్మాన్యంపు ప్రశస్తవర్ణమొదవెన్, సాధించ నావర్ణమున్

సమ్మోదంబున గంగ గైరికములన్ చక్కన్వహించంగ, మే

ఘమ్మారుణ్యము భానునుండిగొనె, సాగంజాలవెట్లొందినన్.

తాII  ఓ కామాక్షీ! నీ చిరునవ్వుల తెల్లని కాంతులు, పెదవుల ఎర్రని కాంతులను కలుపుకొని ప్రకాశిస్తున్నవి. దానితో సరిపోలవలెననే కోరికతో- గంగానది తన తెల్లనికాంతికి గైరికాదిధాతువుల ఎరుపురంగును పులుముకున్నది. శరత్కాలమందలి తెల్లనిమేఘము బాలసూర్యుని అరుణకిరణాలను కలుపుకొని ఎర్రబడుతున్నది. వానిది ప్రయత్నము మాత్రమే. అవి చిరునవ్వుకాంతితో తులతూగలేవని భావము.

శ్లోII  శ్రీకామాక్షి ముఖేన్దుభూషణమిదం మన్దస్మితం తావకం

నేత్రానన్దకరం తథా హిమకరో గచ్ఛేద్యథా తిగ్మతామ్ ।

శీతం దేవి తథా యథా హిమజలం సంతాపముద్రాస్పదం

శ్వేతం కించ తథా యథా మలినతాం ధత్తే చ ముక్తావలిః ॥62॥

ఉII  నీ ముఖ చంద్ర భూషణము నీ చిఱునవ్వు గణింప నమ్మరో!

గోముగ చూచి చంద్రుడును క్రుళ్ళునటుల్ ముదమిచ్చు మాకు, స

త్ప్రేమను బంచు శీతలము, వేడిగ మంచగురీతి, ముత్యముల్

కామితదాయినీ! నలుపుగానగు నీనగుమోము ముందటన్.

తాII  ఓ కామాక్షీ ! నీ ముఖచంద్రభూషణమగు లేనవ్వు చంద్రుఁడుకూడ లోలోన నుడికిల్లునంతగా మా కనుల కాహ్లాదము గల్పించుచున్నది. ' మంచు కూడ కాకవహించు నంతగా చలువలను నించుచున్నది. అచ్చమైన మంచిముత్యముకూడ కాలుష్యము చెందునంతగా మిగుల స్వచ్ఛమై యొప్పుచున్నది.

శ్లోII  త్వన్మందస్మితమఞ్జరీం ప్రసృమరాం కామాక్షి చంద్రతపం

సన్తః సన్తతమామనన్త్యమలతా తల్లక్షణం లక్ష్యతే।

యన్నాసౌ విధునోతి తాపమధికం నాభ్యంతరంమానస

ధ్వంతం తత్ఖలు దుఃఖినో వయమమి కేనేతి జానీమహే ॥63॥

శాII  నీ మందస్మిత మెన్న వెన్నెలను, గాంతిన్ గాంచి సద్వర్తనుల్,

శ్రీమంతంబగు వెన్నెలే యగుత, గౌరీ! మాదు తాపంబుఁ దా 

నేమాత్రంబును లోని చీకటిని, దేవీ! పాపలేకుండెనే,

మేమీ దుఃఖమునేలఁ బొందితిమొ మేమే చెప్పలేకుంటిమే.

తాII  ఓ కామాక్షీ! సత్పురుషులు వ్యాపించు నీ మన్దస్మితమంజరిని చూచి వెన్నెలయే యనుచున్నారు. దాని (వెన్నెల) స్వచ్ఛత కనబడుచున్నది, కాని అధికమైన తాపమును కాని, ఆభ్యన్తరమైన అన్ధకారమును గాని, అది తొలగించుట లేదు. ఏ కారణము వలన మేము దుఃఖము కలవార మగుచున్నామో తెలియకున్నాము.

శ్లోII  నమ్రస్య ప్రణయప్రరూఢకలహచ్ఛేదాపదాబ్జయో- 

ర్మన్దం చన్ద్రకిశోరశేఖరమణాః కామాక్షి రాగేణ తే ।

బంధూకప్రసవశ్రీయం జితవతో బంహీయసీం తాదృశీం

బిమ్భోష్ఠస్య రుచిం నిరస్య హసితజ్యోత్స్నా వయస్యాయతే ॥64॥

తే.గీ.II  ప్రణయ కలహంబుశంకనా పరమశివుఁడె

యమ్మపాదాల వ్రాల నా యరుణ కాంతి

శిరమునంగల శశికి, యధరపుటరుణ

నీ నగవుకంటి, హరునకు నేస్తమయ్యె.

తాII  అమ్మవారితో శివునకు ప్రణయకలహము కలిగినపుడు శివుడామె పాదముల పైకి మెల్లగా వంగెను. అప్పుడు ఆ పాదములందలి యెఱుపు శివుని శిరోభూషణమైన స్వచ్ఛమైన బాలచన్ద్రుని కాంతితో కలిసి యెఱ్ఱవారి బన్ధూక ప్రసవ కాంతినే జయించినది. దొండపండువంటి అమ్మవారి పెదవి పైనున్న యెఱ్ఱని కాంతిని దాటి వచ్చిన అమ్మవారి చిఱునవ్వే శివునకు మిత్రురాలైనది.

08 – 4 – 2024.

శ్లోII  ముక్తానాం పరిమోచనం విదధతస్తత్ప్రీతినిష్పాదినీ ॥

భూయో దూరత ఏవ దూతమరుతస్తత్పాలనం తన్వతి ।

ఉద్భూతస్య జలన్తరాదవిరతం తద్దూరతాం జగ్ముషీ

కామాక్షి స్మితమఞ్జరీ తవ కథం కమ్బోస్తులామశ్నుతే॥65॥

సీII  ముక్తాళికిలను విమోచనమొసగుచు సంతసంబును గూర్చుసత్స్మితంబు,

మరుతమున్ దరుముచుం బాలించు స్మితమది జడములకునునిత్యమెడమునొప్పు,

నమ్మ! నీనవ్వునుముమ్మాటికిన్ బోల దా శంఖ మెన్నగా నదియు సతము

ముక్తాళి విడుచును, పోఁ ద్రోచు మరుతసంగతి, జలజనితము, కామకోటి!

తే.గీ.II  యెవ్వరగు సాటి నీ చిఱునవ్వునకును?

మదిని తలచిన వారిని మహితసుగతిఁ

గాచి రక్షించుచుండును కమల నయన!

యట్టి మందస్మితంబునకంజలింతు,

తాII  అమ్మా! నీ చిఱునవ్వుల పూలగుత్తి కాంతికి శంఖము సరిరాలేదు. ఎందుకనగా- శంఖము ముత్తెములను విడిచిపెడుతుంది. గాలిని బయటకు వెళ్ళగొడుతుంది. జడ(ల)త్వం నుండి పుట్టినది. ఈ మూడు అవలక్షణాలను పరిహరించి, విలక్షణమైనది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు- ముక్తులను (ముత్తెములను) సంతోషింపజేస్తుంది. మరుత్తులను (దేవతలను-గాలిని) పాలిస్తుంది. జడ(ల)ములకు దూరంగా ఉంటుంది.

శ్లోII  శ్రీకామాక్షి తవ స్మితద్యుతిజరీవైదగ్ధ్యలీలాయితం

పశ్యన్తో೭పి నిరంతరం సువిమలన్మణ్య జగన్మణ్డలే ।

లోకం హాసయితుం కిమర్థమనిశం ప్రకాశ్యమాతన్వతే

మన్దాక్షం విరహయ్య మంగళతరం మన్దారచన్ద్రాదయః ॥66॥

శాII  నీ మందస్మిత సద్విలాస గరిమన్నిత్యంబుగాఁ జూచుచున్,

గామాక్షీ! యల చందమామయును, లోకంబందు మందారమున్

తా మందాక్షము పొందకుండి జగతిన్ ధైర్యంబుగా వెల్గగా

నేమమ్మా జతనంబుచేయుదురు? దేనిన్ జూచి యా గర్వమో?

తాII  అమ్మా ! నీ చిరునవ్వుకాంతిప్రవాహముయొక్క విలాసమును జూచుచుంగూడ యీ జగమ్మున తామే స్వచ్ఛమైనవార మనుకొని మందారవృక్షము, చంద్రుడు మొదలయినవారు సిగ్గు విడిచి తమ వెలుగులచే నా యా వస్తువులను వెలువరిం తురు. ఇది యెందుల కమ్మా !

శ్లోII  క్షీరాబ్ధేరపి శైలరాజతనయే త్వన్మన్దహాసస్య చ

శ్రీకామాక్షి వలక్షమోదయనిధేః కిఞ్చిద్భిదాం బ్రూమహే ।

ఏకస్మై పురుషాయ్ దేవి స దదౌ లక్ష్మీం కదాచిత్పురా

సర్వేభ్యో ⁇ పి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీమ్ ॥67॥

చంII  తెలుపధికంబు కల్గుటను తీయని నీ చిఱునవ్వు, సంద్రమున్

కలిగెను పోలికన్, జనని! కాని సముద్రుఁడు లక్ష్మినిచ్చె తా

జలశయునాలిగానె, మరి సన్నుతలక్ష్మిని, వాణినిన్ గృపన్

గలుఁగఁగఁ జేయు నీ నగవు కమ్మగ భక్తులు శోభిలన్ ధరన్!

తాII  తెలుపు సమృద్ధికి నిధియైన నీ మందహాసమునకు పాలసముద్రమునకును నొక్కింత భేదమున్నదని చెప్పుచున్నాము. క్షీరసముద్రము ఒకానొక పురుషునికే లక్ష్మినీయ గల్గెను. నీ నవ్వు అందరికిని లక్ష్మీప్రసన్నతనే కాక సరస్వతీప్రసన్నతను గూడ కల్పించుచున్నదమ్మా.

శ్లోII  శ్రీకాఞ్చీపురరత్నదీపకలికే తాన్యేవ విశ్వాంతరే

చాకోరాణి చరాచరేశ్వరి పరం ధన్యాని మాన్యామహే ।

కంపాతీరకుటుంబచంక్రమకలాచుంచుని చంచూపుటైః

నిత్యం యాని తవ స్మితేన్దుమహసామాస్వాదమాతన్వతే ॥68॥

తే.గీ.II  కంప తీరాన వసియించు గణ్యమయిన

ఘన చకోరముల్ కామాక్షి వినుత మంద

హాస చంద్రికల్ పొంది దివ్యానుభూతి

పొందుచుండుట భాగ్యమ్ము, పుణ్యఫలము.

తాII  ఓ కామాక్షీ! కంపా నది ఒడ్డున తమ కుటుంబాలను ఏర్పరచుకున్న చకోర పక్షులు ప్రపంచంలోనే అత్యంత సంతృప్తి చెందినవని మేము భావిస్తున్నాము ఎందుకంటే అవి మీ చిరునవ్వు యొక్క ప్రకాశాన్ని ప్రతిరోజూ ఆనందిస్తాయి.

శ్లోII  శైత్యప్రక్రమమాశ్రితో೭పి నమతాం జాడ్యప్రథాం ధూనయన్ 

రాగవ్యఞ్జనపేశలో೭పి గిరిజే వామల్యముల్లాసయన్.

లీలాలాపపురఃసరో೭ధ్యపి సతతం వాచన్యమాన్ప్రీణయ-

న్కామాక్షి స్మితరోచిషాం తవ సముల్లాసః కథం వర్ణ్యతే ॥69॥

మII  ఉమ! నీ స్మేర సు చంద్రికల్ చలువలయ్యున్ జాడ్యమున్ బాపు నిన్

బ్రముదం బొప్పఁగఁ గొల్చు భక్తులకు, శ్రీరాగాంచితంబయ్యు ని

త్యము స్వచ్ఛత్వమునొప్పు సాంబుని పయిన్, దల్పంగ వాఙ్నైపుణిన్

సముదంచిత్ప్రభఁ గల్గియున్, మునులకున్ సంతోషముంగొల్పెడున్,

సుమతుల్ నీ చిఱునవ్వు తెల్పఁదల్తురయినన్ శోభిల్లగా దెల్పరే.

తాII  కామాక్షీ! నీ చిఱునవ్వు చల్లనిదైనను నమస్కరించువారి జాడ్యము నపహరించును. శివునియందు రాగమును వ్యంజింపఁజేయునదైనను స్వచ్ఛతను వెల్లడించుచునే యుండును. విలాసప్రసంగములలో దిట్టయైనను మౌనులను సంతోషింపఁజేయును. ఇట్లు విరుద్ధదర్శనముల కాశ్రయమైన నీ చిఱునవ్వు కాంతుల నెట్లు వర్ణింపవచ్చును?

శ్లోII  శ్రోణీచఞ్చలమేఖలాముఖరితం లీలాగతం మంథరం

భ్రూవల్లీచలనం కటాక్షవలనం మన్దాక్షవీక్షాచనం.

యద్వైదగ్ధ్యముఖేన్ మన్మథరిపుం సమ్మోహయంత్యఞ్జసా

శ్రీకామాక్షి తవ స్మితాయ సతతం తస్మై నమస్కుర్మహే ॥70॥

సీII  కామాక్షి శ్రోణిపై ఘనముగా వ్రేలాడు మొలనూలు గజ్జెల  మ్రోత, మరియు,

మదనవిలాసంపు మందగమనమును, తులయె లేని కనుపాపల కదలిక,

కడలేని సిగ్గుతో కడగంటి చూపులు, నివియన్నియును కూడ శివుని మోహ

మున ముంచు టకు స్మేర మనెడి ద్వారముననే సామర్ధ్యమును చూపు సన్నుతముగ,

తే.గీ.II  అట్టి కామాక్షి చిఱునవ్వు నరసి నేను

భక్తియుక్తుండనై భువిన్ వందనములు

చేయుచుంటిని, నాయొక్క క్షేమమరయు 

తల్లి కామాక్షి నిలుచునా యుల్లమునను.

తాII  అమ్మవారి శ్రోణిపై వ్రేలాడు ఒడ్డాణవు గజ్జెల మ్రోత, విలాసవు మందగమనము, కనుబొమ్మల కదలిక, సిగ్గుతోడి కడగంటి చూపు, ఇవి యన్నియు చిఱునవ్వు యొక్క సామర్థ్యము ద్వారముననే శివుని సమ్మోహింపజేయును. అట్టి అమ్మవారి చిఱునవ్వున కెల్లప్పుడు నమస్కరించుచున్నాము.


శ్లోII  శ్రీకామాక్షి మనోజ్ఞమన్దహసితజ్యోతిష్ప్రరోహే తవ

స్ఫీతశ్వేతిమసార్వభౌమసరణిప్రాగల్భ్యమభ్యేయుషి ।

చంద్రోద్యం యువరాజతాం కలయతే చెటీధురం చంద్రికా

గంగ్గా సా చ సుధాజరీ సహచరీసాధర్మ్యమాలమ్బతే ॥71॥

తే.గీ.II  తల్లి! నీ స్మేర సజ్జ్యోతి తెల్లఁదనపు

రాజ్య చక్రవర్తిగ, యువ రాజుగ శశి,

వెన్నెలగు చేటిగా, గంగ వెంటనుండు

సహచరిగనొప్పె, కామాక్షి! జయము నీకు.

తాII  శ్రీకామాక్షీ! మనోహరమైన చిరునవ్వుకాంతి మొలకలోని అద్భుతమైన తెల్లదనం, చక్రవర్తి పద్ధతిలో వెలుగొందుతున్నది. ఈ చంద్రుడేమో యువరాజపదవిని పొందుతున్నాడు. వెన్నెల, కార్యభారాన్నివహించే చేటి అవుతున్నది. అమృతప్రవాహయైన ఆ గంగానది సహచరియై సమాన ధర్మాన్ని అవలంబిస్తున్నది తల్లీ!

శ్లోII  జ్యోత్స్నా కిం తనుతే ఫలం తనుమతామౌష్ణ్యప్రశాంతిం వినా

త్వన్మన్దస్మితరోచిషా తనుమతాం కామాక్షి రోచిష్ణుతా ।

సంతాపోయపి నివార్యతే నవవచఃప్రాచూర్యమంకూర్యతే

సౌందర్యం పరిపూర్యతే జగతి సా కీర్తిశ్చ సంచార్యతే ॥72॥

తే.గీ.II  చంద్ర కాంతి తాపమె యడంచన్ గలుగును,

నీదు చిఱునవ్వు వెన్నెల మాదు భవపు

తాప మణచి కొలుపును వాగ్ధాటినెలమి, 

సుందరంబుగ నిలుపును, సుజన పూజ్య!

తాII  వెన్నెల ప్రాణుల యుడుకు నుపశమింపజేయుటకంటె విశేషఫల మేమి కూర్చు చున్నది? మిగుల మెఱయు నీ మందహాసప్రభయో తాపమును వారించుచున్నది. వినూతన వాజ్నైపుణ్య మంకురిపజేయుచున్నది. లోకమున సౌందర్యము నించుచున్నది. సాటిలేని కీర్తినీ వ్యాపింపజేయుచున్నది. 

13 – 4 – 2024.

శ్లోII  వైమల్యం కుముదశ్రియాం  హిమరుచః కన్త్యైవ సంధుక్ష్యతే

జ్యోత్స్నారోచిరపి ప్రదోషసమయ ప్రాప్త్యైవ సమ్పద్యతే ।

స్వచ్ఛత్వం నవమౌక్తికస్య పరమం సంస్కారతో దృశ్యతే

కామాక్ష్యాః స్మిత దీధితేర్విశదిమా నైసర్గికో భాసతే. ..73.

తే.గీ.II  కలువలకు వెన్నెలలచేత కలుగు వెలుగు,

వెన్నెలకు సంధ్యలాభాన వెలుగు శోభ,

మెఱుగునన్ ముత్యముల్ వెల్గు మేలిమిగను,

సహజముగ వెల్గు నీ నవ్వు సన్నుతాంగి!

తాII  కలువల సిరులకు వెన్నెలల వెలుగులచే స్వచ్ఛత ఇనుమడించుచున్నది. వెన్నె లకు బ్రదోషసమయలాభముచేతనే శోభ నిండుచున్నది. తెలిముత్తియమునకు మెఱుగు పెట్టుట చేతనే యచ్చమైన కాంతి సిద్ధించుచున్నది. అమ్మా ! నీ చిరునవ్వు కాంతికిమాత్రము స్వచ్ఛత్వము స్వభావముగనే సిద్ధించుచున్నది.  

శ్లోII  ప్రాకాశ్యం పరమేశ్వరప్రణయిని త్వన్మందహాసశ్రియః

శ్రీకామాక్షి మమ క్షిణోతు మమతావైచక్షణీమక్షయాం.

యద్భీత్యైవ నిలీయతే హిమకరో మేఘోదరే శుక్తికా- 

గర్భే మౌక్తికమండలీ చ సరసీమధ్యే మృణాలీ చ సా ..74.

తే.గీ.II  శశియె దాగె మేఘములలో జడిసి జనని!

ముత్యములు చిప్పలన్ దాగె పొంది భయము,

నీట దామరల్ దాగెను, నీదు మంద

హాసమునుకని, యది బాపు నహము నాకు.

తాII  ఓ కామాక్షీ! ఏ నీ మందహాససంపద తళుకునకు జడిసి చంద్రుడు మేఘములలో దాగుచు న్నాడో, ముత్తెములగుంపు ముత్తెపుంజిప్పలలో నిఱుకుకొనుచున్నదో, తామరతూడు మడుగునడుమ నడగుచున్నదో అట్టి నీ దరహాసలక్ష్మీప్రభ నాలోని తెగని మమకారమును హరించుగాక !

14 – 4 – 2024.

శ్లోII  హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయ-

న్మారద్రోహిణి పూరుషే చ సతతం ప్రేమాంకురం వ్యంజయత్.

ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణావైదగ్ధ్యముత్తాలయ-

న్కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే ..75.

తే.గీ.II  అంబ! హేరంభ గుహులన్ సహర్షము గని

వత్సలతఁ గొల్పు, ప్రేమతో భవుని చూచు,

నమ్రజనులందు ప్రేమ ఘనముగఁ గొలుపు,

నీదు చిఱినవ్వుఁ బొగఁడంగ నేను తగను.

తాII  ఓ కామాక్షీ! వినాయకునందును, గుమారస్వామియందు నానందభరితమైన కూరిమి నంకురింప జేయునది, మదనారియందు సహజప్రేమాంకురములను వ్యక్తము సేయునది, నీయెడ వినతులైన భక్తులందు పరిపూర్ణకృపానైపుణ్యము నుత్తంభింపజేయునదియు నగు నీ చిఱునవ్వు సొగసును నేనేమని మతింపగలను?

శ్లోII  సంకృద్ధ ద్విజరాజకోಽప్యవిరతం కుర్వంద్విజైః సంగమం

వాణీపద్ధతి దూరగోಽపి సతతం తత్సాహచర్యం వహన్ I

అశ్రాంతం పశుదుర్లభోಽపి కలయన్ పత్యౌ పశూనాం రతిం

శ్రీకామాక్షి తవ స్మితామృతరసస్యందో మయి స్పందతామ్       II 76 II

సీII  కోపంబుఁ జూపుచున్ గూడియుండును తాను 

      ద్విజరాజు విషయాన విదిత మిదియు, 

వాణికందనిదయ్యు, వాణితో సహచరించును నీదు స్మేరము ఘనతరముగ,

పశు దుర్లభంబయ్యు, పశుపతిపై వేడు కను గలిగినదమ్మ! కామకోటి!

అట్టి నీ చిఱున వ్వహరహంబు నా యందు చెలఁగుచుండునుగాక క్షేమమిడగ,

తే.గీ.II  అమ్మ నీదు సన్ముఖపద్మమందు సతము

నలరు చిఱునవ్వు కాంతులన్ తలిరుబోడి!

యెంత చూచినన్ తృప్తి యొకింతయైన 

తీరకుండుట చిత్రమే స్మేరవదన!

తాII  అమ్మా ! నీ మందహాసామృతము ద్విజరాజును అనగా చంద్రుని, (శ్లేష.) ఉత్తమ బ్రాహ్మణుని గోపింపజేయును, అయినను ద్విజులతో బ్రాహ్మణులతో,(శ్లేష.) పలువరుసతో సహవాసము నెరపుచున్నది. సరస్వతియొక్క పద్ధతికి దూరమయ్యును అనగా మాటలకు అందనిదయ్యును ఎల్లప్పుడు ఆ పలుకులతోడి సాహ చర్యమునే పొందుచున్నది. పశుదుర్లభ మయ్యు ననఁగా నజ్ఞానులగు జీవుల కందరానిదయ్యు పశుపతియందు వేడుకగలదగుచున్నది. అట్టి నీ మందహాసామృతము నాయందు చిందునుగాక ! శ్లేషానుప్రాణిత విరోధాభాసాలంకారము.

శ్లోII  శ్రీకామాక్షి మహేశ్వరే నిరుపమ ప్రేమాఙ్కుర ప్రక్రమమ్

నిత్యం యః ప్రకటీకరోతి సహజాం ఉన్నిద్రయన్ మాధురీమ్ I

తత్తాదృక్తవ మందహాస మహిమా మాతః కథం మానితాం

తన్మూర్ధ్నా సురనిమ్నగాం చ కలికామిందోశ్చ తాం నిందతి     II 77 II

తే.గీ.II  ఆర్య! భవునిపై ప్రేమ మాధుర్యమొలికి

ప్రేమపుట్టించు చిఱున వ్వదేమి శశిని,

ధూర్జటిన్ గల గంగను దూఱుచుండు?

నీదు చిఱునవ్వు లోకాల నాదుకొనుత.

తాII  శ్రీకామాక్షీ! మహేశ్వరునిపై సహజమైన మాధుర్యమును వెలయించుచు సాటిలేని ప్రేమాం కురమును మొలపింపజేయుచు నుండెడి నీ మందహాసరేఖ అతఁడు దలఁదాల్చిన దేవనదిని, జంద్రకళను దూలనాడుచున్నది. ఇది యెందుచేత తల్లీ ?

శ్లోII  యే మాధుర్య విహారమంటపభువో యే శైత్యముద్రాకరాః

యే వైశద్య దశావిశేష సుభగాస్తే మందహాసాంకురాః I

కామాక్ష్యాః సహజం గుణత్రయమిదం పర్యాయతః కుర్వతాం

వాణీ గుమ్ఫనడంబరే చ హృదయే కీర్తిప్రరోహే చ మే II 78 II  

తే.గీ.II  మధురములకుఁ గన విహార మంటపములు,

శైత్యముద్రాకరంబులు, స్వచ్ఛమైన

వియును నీ చిఱునవ్వులు, వెలయుగాత

నాకవిత్వముపైనను, నాదు మదిని.

తాII  నీ చిరునగవు మొలకలు మాధుర్యమునకు విహారమండపములు, చలువకు ముద్రాధికారస్థానములు, స్వచ్ఛతావిశేషసుందరములు. ఇట్టి సహజగుణములు మూడింటిని ఒకదాని వెంట నొకటిగా నీ మందహాసములు నా కవితాగుంఫనమునందు, నా హృదయ మునందు, నా కీర్తియందు నలరించుగాక. (అనఁగా నీ మందస్మితసందర్శనభాగ్యముచే మధురమైన కవిత్వము, చల్లని హృదయము, స్వచ్ఛమైన కీర్తియు నాకు లభించుతమని తాత్పర్యము.)

శ్లోII  కామాక్ష్యా మృదులస్మితాంశునికరా దక్షాంతకే వీక్షణే

మందాక్షగ్రహిలా హిమద్యుతి మయుఖాక్షేపదీక్షాంకురాః I

దాక్ష్యం పక్ష్మలయంతు మాక్షిక గుడద్రాక్షాభవం వాక్షు మే

సూక్ష్మం మోక్షపథం నిరీక్షితుమపి ప్రక్షాలయేయుర్మనః II 79 II

సీII  కామాక్షి మృదులప్రకాశపుంజస్మిత మభవుఁ గాంచుచు సిగ్గు నలరునట్టి,

యక్షయ శశికాంతి నాక్షేపణముచేయ చిఱుదివ్వెలైయొప్పు, చిఱునగవను

జలములు నాదు వాక్కులలోన తేనియన్, గుడమున, ద్రాక్షలోన్, వడిగవడిగ,

మాధుర్యమును నింపి, మహనీయ మోక్షమార్గమును చూడగఁ దగు గణ్యమయిన

తే.గీ.II నిర్మలత్వముకలిగించి, ధర్మ బోధఁ

జేయునట్టులఁ జేయుత, శ్రీకరముగ,

నమ్మ కామాక్షి నీదుపాదమ్ములేను

విడువఁబోనమ్మ! నీవె నా వేల్పువమ్మ!

తాII  శివుడు చూచినప్పుడు సిగ్గుతో చుట్టబడిన, చన్ద్రుని కిరణముల నాక్షేపించుటలో చిఱుదివ్వెలైన కామాక్షీదేవియొక్క మన్దహాసకాంతి సమూహము లనెడి జలములు నా వాక్కులలో తేనెలో, బెల్లములో, ద్రాక్షలో నుండు మాధుర్యమును నింపి సూక్ష్మమైన మోక్షమార్గమును దర్శించుటకు కావలసిన నిర్మలత్వమును కలిగించుగాక!

శ్లోII  జాత్యా శీతలశీతలాని మధురాణ్యేతాని పూతాని తే

గాంగానీవ పయాంసి దేవి పటలాన్యల్పస్మిత జ్యోతిషామ్ I

ఏనః పంక పరంపరా మలినితాం ఏకామ్రనాథప్రియే

ప్రజ్ఞానాత్సుతరాం మదీయధిషణాం ప్రక్షాలయంతు క్షణాత్       II 80 II 

తే.గీ.II  అమ్మ! యేకామ్రనాథుని యాలివీవు,

నీదు చిఱునవ్వు కాంతులు నిరుపమాన

గంగ వలె తీపి, శుభ్రము, కనగ చల్ల

నిదియు, నా పాప పంకమ్ము నది కడుగుత!

తాII  ఓ ఏకామ్రేశ్వరుని అంతఃపురరాజ్ఞీ! నీ మందహాస కాంతిపుంజములు గంగా జల ములవలె మిక్కిలి చల్లనివి. తీయనివి, పవిత్రములై నవియును. అవి పాపపంకిలమైన నా బుద్ధిని జ్ఞానధారచే క్షణములో బ్రక్షాళించుగాక !


శ్లోII  అశ్రాంతం పరతంత్రితః పశుపతిః త్వన్మన్దహాసాంకురైః

శ్రీకామాక్షి తదీయ వర్ణసమతాసంగేన శఙ్కామహే I

ఇందుం నాకధునీం చ శేఖరయతే మాలాం చ ధత్తే నవైః

వైకుంఠైరవకుంఠనం చ కురుతే ధూలీచయైర్భాస్మనైః II 81 II

తే.గీ.II  నీదు సుస్మేరమును గాంచి నీలగళుఁడు

వివశుఁడై దాల్చె గంగను, వెలుగులీను

శశిని తలపైన,  నుమ్మెత్త చక్క దాల్చి,

పూసుకొనె బూది నొడలికి పూజ్యురాల!

తాII  నీ మందహాసాంకురములచే వివశుడైకాబోలు శంకరుఁడు ఆ శోభకు సాటి యగునని చంద్రుని, గంగానదిని దలకెక్కించుకొనెను. క్రొత్త తుమ్మిపూలమాలను దాల్చును. వెలిబూదిని ఒడలెల్ల బూసికొనును.  

శ్లోII  శ్రీకాంచీపురదేవతే మృదువచస్సౌరభ్య ముద్రాస్పదం

ప్రౌఢప్రేమ లతానవీనకుసుమం మందస్మితం తావకమ్ I

మందం కందలతి ప్రియస్య వదనాలోకే సమాభాషణే

శ్లక్ష్ణే కుడ్మలతి ప్రరూఢపులకే చాశ్లేషణే ఫుల్లతి II 82 II

తే.గీ.II  కామకోటీ! మృదులవచో ఘన పరిమళ

ముద్రకున్ స్థానమై ప్రౌఢపుననురాగ 

లతయె, నీ స్మేర మాభవున్ గూర్మిఁ బల్ల

వించు, భాషణన్ మొగ్గయౌ బిగియు కవు

గిలిని పులకించి కుసుమించు, కీరవాణి!

తాII  ఓ కాంచీపురదేవతా ! మృదుమధుర వచనపరిమళముద్రాస్థానము. ప్రౌఢాను రాగ తాకుసుమము నగు నీ లేనగవు ప్రియుని ముఖాలోకనమున జిగురించును. తత్సంభాషణమున మొగ్గదొడుగును. ఆయన బిగికౌగిలి నెనసి పులకించి కుసుమవికాస మందును.

శ్లోII  కిం త్రైశ్రోతసమమ్బికే పరిణతం శ్రోతశ్చతుర్థం నవం

పీయుషస్య సమస్తతాపహరణం కింవా ద్వితీయం వపుః I

కింస్విత్వన్నికటం గతం మధురిమాభ్యాసాయ గవ్యం పయః

శ్రీకాంచీపురనాయకప్రియతమే మందస్మితం తావకమ్ II 83 II

ఉII  నీ చిఱునవ్వు పాపు కద నిర్భర పాపపుతాపమున్ సతీ!

తోచును గంగపాయగను, తోచును రెండవ స్త్యేనమట్టులన్,

దోచును తీపి నేర్చుటకు  తోయిలి! వచ్చిన పాలుగా, మదిన్

వేచితి తెల్పుమౌనొ? మరి నేనెఱుగంగను కాదొ? శాంభవీ!

తాII  నీ చిరునవ్వు సకల తాపములు వావుటకు ఆ గంగాన దినుండి జాల్కొన్న నాల్గవపాయ కాదుగదా! అమృతముయొక్క రెండవమూర్తి అవునా ? లేక నీ పలుకులనుండి తియ్యందనమును నేర్చుకొనుటకు వచ్చిన పాలే యౌనా ? తెల్పుమమ్మా !

శ్లోII  భూషా వక్త్రసరోరుహస్య సహజా వాచాం సఖీ శాశ్వతీ

నీవీ విభ్రమసంతతేః పశుపతేః సౌధీ దృశాం పారణా I

జీవాతుర్మదనశ్రియః శశిరుచేః ఉచ్చాటనీ దేవతా

శ్రీకామాక్షి గిరామ భూమిమయతే హాసప్రభామంజరీ II 84 II

ఉII  నీ ముఖపద్మ భూషణము, నీదు సువాక్కుల మిత్రురాలునౌన్, 

నీ మధురంపు సుస్మితము నీ మహనీయవిలాస నీవియే,

కామునివైరి కా యమృత కల్పిత భుక్తి, త్రినేత్రు  వైరికిన్ 

కామిత జీవనౌషధము, కౌముది శత్రువు, చెప్పశాంభవీ!

తాII  నీ ముఖపద్మమునకు నైజమైన కళ, నీ పలుకులతో కలకాలము వొలుచు నెచ్చెలి. విలాసముల కెల్ల పోకముడి. పరమశివుని చూపుల కమృతసంతర్పణము. మన్మధసంపదకు జీవనౌషధము. వెన్నెల కుచ్చాటన దేవతయు నై నీ మందహాసప్రభామంజరి మాటల కందనిదై యున్నది.

శ్లోII  సూతిః శ్వేతిమకన్దలస్య వసతిః శృఙ్గారసారశ్రియః

పూర్తిః సూక్తిఝరీరసస్య లహరీ కారుణ్య పాథోనిధేః I

వాటీ కాచన కౌసుమీ మధురిమ స్వారాజ్యలక్ష్మ్యాస్తవ

శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీ హాసప్రభాచాతురీ II 85 II

ఉII  స్వేతిమ కందలంబునకు వెల్గుల సూతి భవత్స్మితంబు, వి

ఖ్యాతపు హర్షదోహల మహత్వ నిధానపు మూలమౌ కనన్,

యాతనలన్ హరించు కరుణాబ్ధియు, సూక్తిమయంబు, రాజ్య ల

క్ష్మీ తరుణప్రభల్గెలుచుమేలిమి పూవన మేలు మమ్ములన్.

తాII  తెలుపు అనెడి మొలకకు మూలము. శృంగార సారసంపదకు నెలవు. సూక్తిప్ర వాహమునకు పరిపూర్తి, కారుణ్యపయోధి పైని జాలుకొను కెరటము. మాధుర్యమనెడి స్వారాజ్యలక్ష్మీకళ విహరించు నొకానొక పూదోటయునై యొప్పు నీ మందహాసప్రభా చాతురి మాయెడ మంగళకారి అగుగాక !

శ్లోII  జంతూనాం జనిదుఃఖమృత్యులహరీ సంతాపనం కృన్తతః

ప్రౌఢానుగ్రహ పూర్ణశీతలరుచో నిత్యోదయం బిభ్రతః I

శ్రీకామాక్షి విసృత్వరా ఇవ కరా హాసాంకురాస్తే హఠాత్-

ఆలోకేన నిహన్యురన్ధతమసస్తోమస్య మే సంతతిమ్ II 86 II

తే.గీ.II  భవ భయంబును, మృత్యువు భయము వాపు,

వరదయా పూర్ణశశినొంది, వ్యాప్తిచెందు

నీదు చిఱునవ్వుమొలక గణించునటుల

చెచ్చెరన్ లోని చీకటిన్ చెరచుగాక.

తాII  జీవుల జన్మదుఃఖమును, మృత్యుపరంపరవలని సంతాపమును హరించుచు పర మాను గ్రహరూప పూర్ణచంద్రోదయమును బడసి వ్యాపించు నీ మందహాసాంకురములు హఠాద్దర్శనమై నాలోని అంధకారమును హరించుగాక !

శ్లోII  ఉత్తుంగస్తనమండలస్య విలసల్లావణ్య లీలానటీ-

రంగస్య స్ఫుట మూర్ధ్వసీమని ముహుః ప్రాకాశ్యమభ్యేయుషీ I

శ్రీకామాక్షి తవ స్మితద్యుతి తతి బిమ్బోష్ఠ కాన్త్యంకురైః

చిత్రాం విద్రుమముద్రితాం వితనుతే మౌక్తీం వితానశ్రియమ్      II 87 II

సీII  రంగస్థలంబు నీ పొంగారు పాలిండ్లు, లావణ్యమను నీదు శ్లాఘ్య నటికి,

కడు వికసించుచు కలిగిన పైభాగ తేజంబు గొనుచుండె సాజముగనె,

నీ చిఱునగవులఁ దోచెడి తెలివన్నె, యధరారుణిమ కాంతినలరుచుండ,

పగడాల వరముద్రలగణితంబుగగల ముత్యాల పందిరి పూర్ణతేజ

తే.గీ.II  మమరఁ జేయుచునుండెనో యమ్మ! నీదు

మందహాసంబు గన నతి సుందరముగ,

వందనమ్ములు చేసెద భక్తసులభ!

నీదు చిఱునవ్వు కననిమ్ము మేదురముగ.

తాII  శ్రీకామాక్షీ! ఎత్తైన పాలిండ్ల ప్రదేశం ప్రకాశించే నీ శరీరలావణ్యమనే నటి యొక్క విలాసరంగస్థలము. బాగా వికసించిన పై భాగంలో మాటిమాటికి ప్రకాశాన్ని అది పొందుతున్నది. నీ నవ్వుల తెల్లని కాంతిపుంజము, దొండపండు వంటి పెదవుల ఎర్రనికాంతుల మొలకలతో, పగడాల ముద్రలు వేసుకున్న ముత్యాల పందిరి యొక్క అందాన్ని వ్యాపింప జేస్తున్నది.

శ్లోII  స్వాభావ్యాత్తవ వక్త్రమేవ లలితం సంతోష సంపాదనం

శంభోః కిం పునరంచిత స్మితరుచః పాండిత్య పాత్రీకృతమ్ I

అంభోజం స్వత ఏవ సర్వజగతాం చక్షుః ప్రియంభావుకం

కామాక్షి స్ఫురితే శరద్వికసితే కీదృగ్విధం భ్రాజతే II 88 II

తే.గీ.II  సహజ సౌందర్య ముఖివి యో చక్కనమ్మ!

శివుని కానంద మది కూర్చుచిత్తమందు,

దానిపై మందహాసంబు తలప నగునె?

పద్మమది శరత్ శోభచే వరలుటె కద.

తాII  స్వభావముచే నందమై నీ ముఖము ఇందుశేఖరున కానందము గూర్చును. అందు మందహాసప్రభ యలమికొనినచో నా సొగ సేమని చెప్పవలెను ! పద్మము సహజముగ సర్వజగములకు గనువిందుసేయును. అది శరదృతుశోభచే వికసించినచో దాని సొగసు వర్ణించుటకు శక్యమా? 

శ్లోII  పుంభిర్నిర్మలమానసైర్విదధతే మైత్రీం దృఢం నిర్మలాం

లబ్ధ్వా కర్మలయం చ నిర్మలతరాం కీర్తిం లభన్తేతరామ్ I

సూక్తిం పక్ష్మలయంతి నిర్మలతమాం యత్తావకాః సేవకాః

తత్కామాక్షి తవ స్మితస్య కలయా నైర్మల్యసీమానిధేః II 89 II

తే.గీ.II  నీదు భక్తసమాజంబు నీదు స్మేర

కళకు పాత్రమై పరిశుద్ధ ఘనులమైత్రి

చేసి కర్మలన్ బాయుచు చిరయశస్సు

పొంది, సరసవాఙ్నిపుణతన్ బొందు, జనని!

తాII మీ భక్త సమాజము నైర్మల్యపరమావధియైన నీ మందహాసకళకుఁ బాత్రమై పరిశుద్ధమనస్కులగు మహానుభావులతో మైత్రి చేయును. కర్మవాసనలను హరిం చును. స్వచ్ఛమైన కీర్తిని బొందును. స్వచ్ఛమైన పలుకుల సొంపును ఉన్మీలింపఁ జేయును.

శ్లోII  ఆకార్షన్నయనాని నాకిసదసాం శైత్యేన సంస్థమ్భయన్- 

ఇందుం కించ విమోహయన్ పశుపతిం విశ్వార్తిముచ్ఛాటయన్I

హింసత్సంసృతిడంబరం తవ శివే హాసాహ్వయో మాన్త్రికః

శ్రీకామాక్షి మదీయమానస తమో విద్వేషణే చేష్టతామ్ II 90 II

శాII  నీ మందస్మిత మాంత్రికుండు చలువన్ నిత్య ద్విజాకర్షణన్

శ్రీమంతంబుగ నొప్పుచుండు, శశినే శిల్పంబనన్ నిల్పు, తా

కామారిన్ ఘనమోహమందునిలుపున్, ఖండించు దుఃఖమ్ములన్,

కామాక్షీ! భవతాపహారి యది, నా కష్టంబులన్ బాపుతన్.

తాII  నీ చిరునవ్వనెడి మాంత్రికుఁడు చలువచే దేవతల చూపుల నాకర్షించును. చంద్రుని స్తంభింపఁజేయును. శివుని మోహింపఁజేయును, జగముల దుఃఖముల నుచ్చాటనము సేయును. సంసారాటోపము నడంచును. అతడు నా పరితా పమనెడి చీఁకటియొక్క విద్వేషణమందు అనగా నా తాపము హరించుటయందు బ్రవృత్తుడగుగాక !


శ్లోII  క్షేపీయః క్షపయంతు కల్మష భయాన్ అస్మాకం అల్పస్మిత-

జ్యోతిర్మండలచంక్రమాః తవ శివే కామాక్షి రోచిష్ణవః I

పీడాకర్మఠ కర్మఘర్మ సమయ వ్యాపార తాపానల-

శ్రీపాతా నవహర్షవర్షణసుధా శ్రోతస్వినీశీకరాః II 91 II

శాII  ఆనం దాద్భుతవృష్టి కాదది సుధా సాకార సుస్మేరమే,

కానన్ మండలరూప సద్భ్రమణముల్, గాఢంపు కర్మాగ్నినే

తోనన్ జల్లగఁజేయు, నీ నగవు, సంతోషంబునే కొల్పుచున్,

క్షోణిన్ శుభ్రముగానొనర్చు మదులన్, గోరంగ కామేశ్వరీ!

తాII  ఆనందమును వర్షించుటలో నమృతప్రవాహంపు తుంపురులైన నీ చిఱునవ్వు కాంతుల మండలాకార పరిభ్రమణములు, బాధాకరమైన కర్మచయమనెడి గ్రీష్మకాలపు తాపాగ్నిని జల్లార్చునవై మా పాపమనేడి బురదను క్షాళన సేయుగాక !

శ్లోII  శ్రీకామాక్షి తవ స్మితైన్దవమహః పూరే పరిస్ఫూర్జతి

ప్రౌఢాం వారిధి చాతురీం కలయతే భక్తాత్మనాం ప్రాతిభమ్ I 

దౌర్గత్య ప్రసరాస్తమః పటలికా సాధర్మ్యమాబిభ్రతే 

సర్వం కైరవసాహచర్య పదవీ రీతిం విధత్తే పరమ్ II 92 II

శాII  నీ మందస్మిత చంద్రికా ప్రసరణన్ నిత్యప్రభాపూర్ణ సత్

క్షేమోదంచిత సత్కవిత్వ ఝరినే చిందింత్రు నీ భక్తులే,

కామేశాని! విపత్తులెల్లఁ గన చీకట్లై యడంగున్, సతీ!

శ్రీమాతా! కలువాత్మమిత్రమయినన్ చేకూరవే యన్నియున్?

తాII  నీ చిరునవ్వు నిండు వెన్నెలయై ప్రసరింపగా భక్తుల నవనవ కవితాసమున్మేష శాలిని యైనబుద్ధి యుప్పొంగిన సముద్రముతోడి పోలికను బడయును. ఆపదలు కారుచీఁకటి సామ్యమును బడయును. అనఁగా విపత్తులు చీకటులవలె విరియునని తాత్పర్యము. కలువల తోడి సహవాసపదవి లభ్యమైనపుడు (అనఁగా చంద్రునితో సామ్యము పొందినపుడు) లభ్యముగాని యంద మేమి యుండును ?  

శ్లోII  మందారాదిషు మన్మథారిమహిషీ ప్రాకాస్యరీతిం నిజాం 

కాదాచిత్కతయా విశఙ్క్య బహుశో వైశద్యముద్రాగుణః I

శ్రీకామాక్షి తదీయ సంగమకలా మందీభవత్కౌతుకః

సాతత్యేన తవ స్మితే వితనుతే స్వైరాసనావాసనామ్ II 93 II

మII  కని మందారముఁ గల్పకాదులను, లోకంబందు స్వచ్ఛత్వమన్

గుణ మెంచెన్ దగఁ దాను నిత్యముగ నీకున్ గల్గు మందస్మితం

బనుదానిన్వసియించుటొప్పనుచు, మాతా! దివ్య కామేశ్వరీ!

మననీ నన్నును నీదు నవ్వుఁ గనుచున్, మాన్యుండనై వెల్గగన్.

తాII  మందారాది కల్పవృక్షములయందు ఎప్పుడో ఒకసారి తన వ్యక్తస్థితిని గమనించి యెంతయు సంశయపడి, స్వచ్ఛత్వరూపమైన లక్షణము (వైశద్యముద్రాగుణము) ఆ కల్పవృక్షముల నిరంతరసహవాసమునకు వేడుకపడక నీ చిరునవ్వులతోనే స్వేచ్ఛావిహా రము సేయవలెననెడి వాసనను విస్తరింపజేసికొనుచున్నది.

శ్లోII  ఇన్ధానే భవవీతిహోత్రనివహే కర్మౌఘచండానిల-

ప్రౌఢిమ్నా బహుళీకృతే నిపతితం సంతాపచిన్తాకులమ్ I

మాతర్మాం పరిషించ కించిదమలైః పీయూషవర్షైరివ

శ్రీకామాక్షి తవ స్మితద్యుతికణైః శైశిర్యలీలాకరైః II 94 II 

తే.గీ.II  కర్మవాహిని పెనుగాలి క్రాలి నన్ను 

దుష్ట సంసారమనునగ్నిఁ ద్రోసివేయ

నుడుకుచుంటిని, చల్లగనొప్పునట్టి 

నీదు చిఱునవ్వుతళుకుచే నాదుకొనుము.

తాII  కర్మప్రవాహమనెడి పెనుగాలిచే రగుల్కొనెడి సంసారమనెడి యగ్నిచే నుడికిన నన్ను, దల్లీ ! నిండుచల్వలను నించు అమృతంపు వానజడివలె దనుపజాలిన నీ యచ్చమైన చిఱునవ్వుల తళుకులచే దడుపుము.

15 – 4 – 2024.

శ్లోII  భాషాయా రసనాగ్ర ఖేలనజుషః శృంగారముద్రాసఖీ-

లీలాజాతరతేః సుఖేన నియమ స్నానాయ మేనాత్మజే I

శ్రీకామాక్షి సుధామయీవ శిశిర శ్రోతస్వినీ తావకీ

గాఢానంద తరంగితా విజయతే హాసప్రభాచాతురీ II 95 II

తే.గీ.II  నాల్కపై వాణి నటియింప నయము తనర

నామె చెలిగనై నీ స్మేరమమితకాంతి

తోడ నఘమర్షణస్నానమాడఁజేయ

నిరుపమానందసుధలతో వరలు జనని!

తాII  సరస్వతి సొంపుగ జిహ్వాగ్రమున నటించుచుండగా నామెకు చెలికత్తెయై నీ చిరు నవ్వుకాంతుల నేరిమి ఆమెకు హాయిగా నఘమర్షణస్నానము సంఘటింపజేయుటకు బ్రహ్మానందమనెడి తరంగములతోగూడి చల్లని అమృతరసతరంగిణియై ఇంపుగులుకు చున్నది.

శ్లోII  సంతాపం విరలీకరోతు సకలం కామాక్షి మచ్ఛేతనా

మజ్జన్తీ మధుర స్మితామరధునీ కల్లోలజాలేషు తే I

నైరన్తర్య ముపేత్య మన్మథ మరుల్లోలేషు యేషు స్ఫుటం

ప్రేమేందుః ప్రతిబిమ్బితో వితనుతే కౌతూహలం ధూర్జటేః II 96 II

తే.గీ.II  మదన శృంగార వాయువుల్ మలఁగఁగ చెల

రేగు నీ స్మేరసుధలందు ప్రేమ శశియె

ప్రతిగ బింబింప నాసామి పరవశించు,

నమ్మ! యానవ్వు నాతాప హారియగుత.

తాII  మన్మథశృంగారవాయువులు విసరి చెలరేగిన యే నీయొక్క మధుర మందస్మిత మనెడి అమృతతరంగిణీ తరంగములందు ప్రేమ యనెడి అమృతకరుఁడు (చంద్రుడు) ప్రతిబింబించి నీ స్వామి కెనలేని వేడుక కూర్చునో యట్టి నీ నవ్వుల వెల్లువలో మునుకలు వెట్టి నా బుద్ధి నా యశేష పరితాపమును హరించుగాక !

శ్లోII  చేతః క్షీరపయోధి మంథర చలత్ రాగాఖ్యమంథాచల-

క్షోభవ్యా పృతిసంభవాం జనని తే మందస్మితశ్రీసుధామ్ I

స్వాదంస్వాదముదీత కౌతుకరసా నేత్రత్రయీ శాంకరీ

శ్రీకామాక్షి నిరంతరం పరిణమత్యానంద వీచీమయీ II 97 II

తే.గీ.II  నీ మనస్సను క్షీరాబ్ధి నియమమలరఁ

బ్రేమ కవ్వమన్ గొండతో వేగముగను

జిల్కఁ నీ స్మేరసుధచింద శివుని కనులు

త్రావి యానందమయమయెఁ దలిరుఁ బోడి!

తాII  నీ మనసనెడి పాల్కడలిలో ననురాగమనెడి కవ్వపుంగొండనుగొని తరువగా తరు వగా బుట్టిన నీ లేనవ్వనెడి యమృతముం ద్రావి త్రావి శంకరుని యా నేత్రత్రయి యానందతరంగ రేఖగా బరిణమించినదమ్మా !

శ్లోII  ఆలోకే తవ పంచసాయకరిపోః ఉద్ధామ కౌతూహల-

ప్రేఙ్ఖన్ మారుతఘట్టన ప్రచలితాత్ ఆనంద దుగ్ధాంబుధేః I

కాచిద్వీచిరుదంచతి ప్రతినవా సంవిత్ప్రరోహాత్మికా

తాం కామాక్షి కవీశ్వరాః స్మితమితి వ్యాకుర్వతే సర్వదా II 98 II

తే.గీ.II  శివుని రాగానిలము సోకఁ జెలఁగి రేఁగి

గొప్ప యానంద దుగ్ధాబ్ధి కొమరు మీర

నంబరముఁ దాక జ్ఞానాంకురంబొకండ్రు

లేవ నీ స్మేరముగ కవుల్ చూచిరమ్మ! 

తాII  పరమేశ్వరుని యనురాగమనెడి గాలితాకిడికి రేగి బ్రహ్మానందమనెడి క్షీరాబ్దియం బరమును దాకగా నందులో జ్ఞానాంకురరూపమైన యొక కెరటమువ్వెత్తుగా లేచినది. తల్లీ ! దానినే కవీశ్వరులు నీ చిరునవ్వుగా బేర్కొనుచున్నారు.

శ్లోII  సూక్తిః శీలయతే కిమద్రితనయే  మందస్మితాత్తే ముహుః

మాధుర్యాగమ సంప్రదాయమథవా సూక్తేర్ను మందస్మితమ్ I

ఇత్థం కామపి గాహతే మమ మనః సందేహ మార్గభ్రమిం

శ్రీకామాక్షి న పారమార్థ్య సరణి స్ఫూర్తౌ నిధత్తే పదమ్ II 99 II

శాII  మాధుర్యాగమ సంప్రదాయ గరిమన్ మాతల్లి! హైమా! మహా

మోదంబొప్పగ మాటసొంపు గొనెనా పూజ్యంపు నీ నవ్వునే

యాధారంబుగ స్వీకరించి? యటుకా కా నవ్వె తన్నైపుణిన్

యాధారంబుగ మాటసొంపుఁ గొనియే యట్నుండి తా నొందెనా?

బాధించున్ నను శంక, తీర్పు కృపతో ప్రఖ్యాత శ్రీ శాంభవీ!

తాII  ఓ హిమగిరి కుమారీ! మాధుర్య మనెడి యాగమ సంప్రదాయ రహస్యమును నీ చిఱునప్వు నుండి మాటసొంపు నేర్చుకొన్నదా ? లేక నీ మాట సొంపు నుండి నీ మందహాసమే దాని నభ్యసించెనా ? అని యిట్లు నా మనసు సంశయమార్గమున సుడితిరుగుచు నెంతకును పరమార్థసరణియొక్క సూర్తియందు నిలుకడ పొందలేకున్నది.

శ్లోII  క్రీడాలోల కృపాసరోరుహముఖీ సౌధాంగణేభ్యః కవి-

శ్రేణీ వాక్పరిపాటికామృతఝరీ సూతీ గృహేభ్యః శివే I

నిర్వాణాఙ్కుర సార్వభౌమపదవీ సింహాసనేభ్యస్తవ

శ్రీకామాక్షి మనోజ్ఞ మందహసిత జ్యోతిష్కణేభ్యో నమః II 100 II

ఉII  మంగళ రూపిణీ! శుభద మంజులమౌ చిఱునవ్వు నీది, నీ

మంగళమూర్తియౌ దయకు మాన్య సుసౌధము కేళికిన్ గనన్, 

మంగళకారులౌ కవుల మంజులవాక్సుధకాలవాలమున్,

మంగళ మోక్షపీఠమది, మానిని! వందనమమ్మ! దానికిన్.

తాII  మంగల స్వరూపురాలవైన శ్రీకామాక్షీదేవీ! నీ చిఱునవ్వు కాంతి కణములు ఆటయందు ఆసక్తి గల దయయను స్త్రీ విహరించు సౌధమునకు ముంగిళ్ళు. కవి సమూహముల వాక్పరిపాటియను అమృత నదికి జన్మస్థానములు, మోక్షమను చక్రవర్తి పదవికి సింహాసనములు నైనవి. అట్టి నీ అందమైన చిఱునవ్వు కాంతి సమూహములకు నమస్కరించుచున్నాను.


శ్లోII  ఆర్యామేవ విభావ యన్మనసి యః పాదారవిందం పురః 

పశ్యన్నారభతే స్తుతిం స నియతం లబ్ధ్వా కటాక్షచ్ఛవిమ్ I

కామాక్ష్యా మృదుల స్మితాంశులహరీ జ్యోత్స్నా వయస్యాన్వితామ్

ఆరోహత్యపవర్గ సౌధవలభీం ఆనంద వీచీమయీమ్ II 101 II

సీII  ఆర్యాపరాత్పరి ననుపమ భక్తిని మదిలోన భావించి మధురగతిని

తత్పాదయుగళిని దలచుచు నెదురుగా నేకాగ్రచిత్తులై శ్రీకరముగ

తత్ స్తుతిన్ నియతితోన్ తాదాత్మ్యమును పొంది యారంభమును చేయ నార్య కృపను

బొంది, యా కామాక్షి మందహాసపుకాంతి వెల్లువ యనియెడి వెన్నెలయను

తే.గీ.II  చెలిని గూడి సంతసమను చిద్వరేణ్య

ముక్తిసౌధాగ్రమనియెడి పూర్ణచంద్ర

శాలకెక్కును భక్తులు, జయపథాన

మంగళములను గాంతురు మంగళముగ.

తాII  ఆర్యయగు పరదేవతను మదిలో భావించుచు, మున్ముందు తత్పాదారవిందము నెదుట దర్శించుచు, తత్స్తుతిని నియమముతో నారంభించిన యతడు తత్కటాక్షరుచి వడసి ఆ కామాక్షియొక్క మందహాసములకాంతి వెల్లువ యనెడి వెన్నెలయను చెలికత్తెతో గూడిన యానందరసతరంగితమైన ముక్తియనెడి సౌధాగ్రచంద్రశాల కెక్కును. ఇందలి ఆర్యాదిశబ్దము లీ గ్రంథమందలి ఆర్యాదిశతకము లైదింటినిగూడ పేర్కొనును.

II మందస్మిత శతకం సంపూర్ణం II

16 – 4 – 2024.


II3. స్తుతి శతకం II

మూకపంచశతి (మూకకవి ప్రణీతము) 

పద్యానువాదము .. చింతా రామకృష్ణారావు.



శ్లోII  పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయన్తే గిరాం

వైరించాన్యపి గుంఫనాని విగళద్గర్వాణి శర్వాణి తే

స్తోతుం త్వాం పరిఫుల్ల నీలనళినశ్యామాక్షి కామాక్షి మాం

వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్పాద సేవాదరః II 1 II

తే.గీ.II  ఫుల్లనీలోత్పలాక్షి! శంభుని ప్రియసతి!

బ్రహ్మ పలుకె నిన్ నుతి చేయ వలను కాక

వీడె గర్వంబు, నిన్ను సేవించు నాకుఁ

కోర్కె నిన్ గీర్తనము చేయఁ గొలిపె మతిని.

తాII ఓ కామాక్షీ! నిండుగా వికసించిన నీలి కమలం వంటి ముదురు నీలి కన్నులు కలిగిన శివుని భార్యా ! దేవతలలో గొప్పది, పదాల వాడుకలో ప్రావీణ్యం, బ్రహ్మ యొక్క పాండిత్యమైన పదాలు కూడా అహంకారం కోల్పోయే నీ మహిమలను స్తుతించడంలో సహాయపడదు ( వారుమిమ్మల్ని స్తుతించడానికి సరిపోవు కాబట్టి). అయినప్పటికీ, మీకు సేవ చేయాలనే నా తీవ్రమైన కోరిక మరియు మీ పాదాలను ఆరాధించాలనే కోరిక నన్ను ఉచ్చారణగా మరియు మీ స్తోత్రంలో కీర్తనలు పాడమని ప్రేరేపిస్తుంది.

శ్లోII  తాపింఛ స్తబకత్విషే తనుభ్రుతాం  దారిద్ర్యముద్రాద్విషే

సంసారాఖ్య తమోముషే పురరిపోర్ వామాంకసీమాజుషే

కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే

విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరంజ్యోతిషే II 2 II

తే.గీ.II  నుత తమాల పుష్ప వర శోభితయు, కంప

తీరమున విహరించునదియును, కవుల

నాల్క నుండు, జగద్రక్షణ నొనరించు,

శివుని కెడమ దేహంబైన శివకు నతులు.

తాII తమాల పుష్పంలా ప్రకాశవంతంగా ఉండేటువంటి, ప్రజల పేదరికాన్ని పారద్రోలేటువంటి,  సంసారమనే అంధకారాన్ని పారద్రోలుతూ ఉండేటువంటి , కంపా తీరమునవిహరించేటువంటి, కవుల నాలుక గుడిసెలో ఉండేటువంటి, మరియు ఇది అన్ని లోకాలను రక్షించేటువంటి పరమశివుని ఎడమ అర్ధభాగాన్ని పంచుకునే  ఆ పరమ తేజస్సగు కామాక్షికి ఎల్లప్పుడూ నా ప్రణామాలు. 

శ్లోII  యే సంధ్యారుణయంతి శంకరజటా కాంతార చంద్రార్భకం

సిందూరంతి చ యే పురందర వధూ సీమంత సీమాంతరే

పుణ్యమ్ యే పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమీ

పాయాసుః పరమేశ్వర ప్రణయినీ పాదోద్భవాః పాంసవః II 3 II

తే.గీ.II  శివ జటాటవీ శశి నెఱ్ఱఁ జేయునట్టి,

శచికి పాటల సిందురచ్ఛవిగ నమరు,

నతుల పుణ్యముల్ పండించు నుత భవాని

యొక్క పదధూళి నన్ గాచు చక్కగాను.

తాII అమ్మవారి పాద పరాగములు శివుని జడల అడవిలోని బాలచంద్రుని సంధ్యారుణునిగా నొనరించుచున్నవి. శచీదేవి పాపటలో సిందూరములగు చున్నవి. సేవించువారి పున్నెమును పండించుచున్నవి. అట్టి ఆ పాదరేణువులు నన్ను కాపాడుగాక!

శ్లోII  కామాడంబర పూరయా శశిరుచా కమ్రస్మితానాం త్విషా

కామారేరనురాగ సింధుమధికం కల్లోలితం తన్వతీ                                                                                                                                                                                                 కామాక్షీతి సమస్త సజ్జననుతా కళ్యాణదాత్రీ నృణామ్

కారుణ్యాకులమానసా భగవతీ కంపాతటే జృంభతే II 4 II

తే.గీ.II  కామ డంబంబుతోఁ జంద్రకాంతి నొప్పు

తెల్లనౌ చిఱునవ్వుతోఁ ద్రినయనునినె

రాగ సంద్రానఁ గలచిన రమణి యనుచు

నుత జనని కంపదరి జృంభ గతిని యొప్పె. 

తాII కామాడంబరముతో చంద్రకాంతి గల తెల్లని తన చిఱునవ్వుతో శివుని అనురాగసముద్రమును కల్లోలిత మొనర్చుచున్న కామాక్షి యని సర్వజనులచే నుతింపబడిన, దయతో నుప్పొంగిన మనస్సుగల భగవతి కమ్పాతీరమున విజృంభించుచున్నది.

09 – 3 – 2024.

శ్లోII  కామాక్షీణ పరాక్రమ ప్రకటనం సంభావయన్తీ దృశా

శ్యామా క్షీర సహోదర స్మిత రుచి ప్రక్షాలితాశాంతరా

వామాక్షీ జన మౌళి భూషణ మణిః వాచాం పరా దేవతా

కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే II 5 II

సీII  కమనీయ దృష్టితోఁ గాముని ప్రకటించుచున్నట్టి ప్రతిభతో నొప్పుచుండి,

చక్కఁగా భావింప సంపూర్ణమైనట్టి యౌవనమధ్యస్థ యగుచునొప్పి,

క్షీర సహోదర స్మిత రుచి నలరారి ప్రక్షాళితాశాంత భాగికగుచు,

పూబోడి జన మౌళి భూషణమణిగ తా వర్ధిల్లుచున్నట్టి భాగ్యరాశి,

తే.గీ.II  వాక్ పరా దేవతామూర్తి భవ్యతేజ

దివ్య కామక్షి యనఁబడు దీపశిఖయె

కరుణ రూపంబు గొన్న ప్రకాశమొకటి

కంప తీరాన నుండెను సొంపు మీర.

తాII తనచూపుతో కాముని పరాక్రమమును ప్రకటించుచున్న, యౌవన మధ్యస్థయై తన చిఱునవ్వుచే దిక్కుల మధ్యభాగమున తెల్లబఱచుచు, స్త్రీలలో తలమానికమై, వాక్కులకందని దేవతయై, కమ్పానదీ తీరమున కామాక్షియను పేర ఒకానొక కరుణ ప్రకాశించుచున్నది.

శ్లోII  శ్యామా కాచన చంద్రికా త్రిభువనే పుణ్యాత్మనామాననే

సీమా శూన్య కవిత్వ వర్ష జననీ యా కాపి కాదంబినీ

మారారాతి మనోవిమోహన విధౌ కాచిత్థమః కందలీ

కామాక్ష్యాః కరుణా కటాక్ష లహరీ కామాయ మే కల్పతాం II 6 II

సీII  మూడులోకములందు పూర్ణమౌ శ్యామలంబౌనొక చంద్రిక జ్ఞానకల్ప,

పుణ్యాత్ములగువారి మోములనెనలేని మేల్కవిత్వముఁ గొల్పు మేఘమొకటి,

మరువైరి మనసున మరులు గొనుటయను పనియందు కామాక్షి ప్రబలమైన

కటిక చీకటి మొల్క కరుణాకటాక్ష సత్కమనీయ ధార నా కామకల్ప

తే.గీ.II  నమును గావించుగాక సద్ఘనతరముగ

నమ్మపాదాలపై నాకు నమ్మకంబు

పెంచఁ గోరెడి నాకోర్కె నెంచి, జనని

కోర్కెతీర్పఁగ నే నెంచి కోరుచుంటి.

తాII మూడు లోకములందు నల్లని ఒకానొక వెన్నెల పుణ్యాత్ముల యొక్క ముఖములందు హద్దులేని కవిత్వవర్షమును కలిగించును.  ఏదో ఒకానొక మేఘమాల శివుని మనస్సును మోహించుట అను కర్మయందు కామాక్షీదేవియొక్క కడగంటి దయాప్రవాహము ఒకానొక చీకటి మొలక.  అది నాయొక్క కామము కొఱకు పూనుకొను గాక!

శ్లోII  ప్రౌఢధ్వాంత కదంబకే కుముదినీ పుణ్యాంకురం దర్శయన్ 

జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్

కాలిందీ లహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం

కశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః II 7 II

సీ.  చిమ్మ చీకటి గుమిన్ జిఱుజాబిలిన్ జూపుచున్నట్టి కచభర శోభితాంబ,

వెన్నెలలోఁ గూడ, మన్ననన్ జక్రవాకపుజంటఁ గలిపెడి ఘన కుచభర,

నభమున కాళింది నవ లహరీ  దశ కనబడఁ జేయు నూగారు కలిత, 

కాంచీపురంబందు కమనీయ శశిమౌళి కన్నులపడువై ఘనతరముగ

తే.గీ.II వర్ధిలుచు నుండె కామాక్షి, సార్థకముగఁ

జేయ సేవించు సుజనుల జీవనములు,

భక్తితోఁ గొల్తు నాకున్న శక్తి మీర

నాదు జనయిత్రిపాదముల్ నయభయముల.

తాII చీకట్ల గుంపులో చిఱుజాబిల్లి మొలకను చూపుచు, వెన్నెలలో గూడ చక్రవాకముల జంటను కలుపుచు, ఆకసమున వింతగా మనోహరముగా నున్నాయని ప్రవాహమును చూపించుచున్న శివుని కన్నుల గొప్పపండుగ సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

శ్లోII  తంద్రా హీన తమాల నీల సుషమైః తారుణ్య లీలాగృహైః

తారానాథ కిశోర లాంఛిత కచైః తామ్రారవిందేక్షణైః

మాతః సంశ్రయతాం మనో మనసిజ ప్రాగల్భ్య నాడిన్ధమైః

కంపాతీరచరైః ఘనస్తనభరైః పుణ్యాంకురైః శాంకరైః II 8 II

సీII  నిస్తంద్ర సు తమాలనీలంపు ప్రభలతో తారుణ్య లీలా నిధాన గృహము,

శ్రీ చంద్రరేఖ లాంఛితమైన మహనీయ కచభారయుత దివ్య కమలవదన

తామ్రారవింద సత్తరళాయతేక్షణ కవులపాలిటి గొప్ప కల్పభూజ,

మరుని విజృంభణ కిరవైనపెన్నిధి, కంపసమీపన కదలు ముగుద,

తే.గీ.II  ఘనపు స్తనభర కామాక్షి కరుణతోడ

నిరుపమంబైన నాసేవ నిరతమంది,

మదిని వసియించు తాను నా మనసునెన్ని

సత్కరించుత శోభిల్ల సముచితముగ.

తాII అమ్మవారు శివుని పుణ్యముల మొలక. అది తమాలనీలము. తారుణ్యలీలా గృహము. చంద్రకిశోరచిహ్నిత కచము. ఎఱ్ఱని కమలముల వంటి నేత్రములు కలిగినట్టిది. మన్మథుని విజృంభణమునకు హేతువైనట్టిది. కమ్పాతీరమున చరించునట్టిది. గొప్ప స్తనముల బరువు గలిగినట్టిది. అది నా మనస్సును సత్కరించుగాక!

శ్లోII  నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షావిధిం పుష్ణతీ

తేజస్సంచయపాటవేన కిరణాన్ ఉష్ణర్ ద్యుతేర్ముష్ణతీ

కాంచీమధ్యగతాపి దీప్తిజననీ విశ్వాంతరే జృంభతే

కాచిచ్చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా II 9 II

సీII  నిశ్చలయయ్యు తా నిరతంబు మరుతాళి రక్షించి పోషించు రమ్యవదన,

తనకాంతిపుంజంపు దార్ఢ్యంబుచేతను సూర్యుని కిరణముల్ చూరగొనును,

కాంచీపురముమధ్య కలదయ్యు నెప్పుడున్ విశ్వంబునకు గొప్ప వెలుగులిచ్చు, 

తమసాంధమున్ బాపు ప్రమిదనొప్పెడి దివ్వె, చిత్రంబుగానిట చెలగుచుండె,

తే.గీ.II  కంచి కామాక్షి మాయమ్మ కమలనయన,

దివ్య సుజ్ఞాన సజ్జ్యోతి, భవ్యమైన

జ్ఞానసంపత్తి కలిగించి కాచునన్ను,

వందనమ్ములు చేసి నే వరలుచుందు.

తాII సహజముగ దాను నిశ్చలమయ్యు మరుత్తులకు రక్షణకల్పించునది. మరుత్తులు దేవతలు, (శ్లేష) వాయువులు. తన కాంతిపుంజముయొక్క దార్థ్యము చే సూర్యునికిరణములను హరించునది. కాంచీమధ్యవర్తిని యయ్యు (నడుమున నొడ్డాణ ముగలదియని -- (శ్లేష) సకలవిశ్వాంతరమునందు తలచిన మాత్రమున తమంబును = చీకటిని (శ్లేష) అజ్ఞానమును ఆర్పెడి ఒకానొక చిత్రమైన దీపము విజృంభించుచున్నది.

శ్లోII  కాంతైః కేశ రుచాం చయైర్ భ్రమరితం మందస్మితైః పుష్పితం

కాంత్యా పల్లవితం పదాంబురుహ యోః నేత్రత్విషా పత్రితం

కంపాతీర వనాంతరం విదధతీ కళ్యాణ జన్మస్థలీ

కాంచీమధ్య మహామణిర్విజయతే కాచిత్ కృపా కందలీ II 10 II

సీII  తనరెడి నల్లని తలకట్టు చేతను భ్రమరితంబయియుండి ప్రముదమొప్ప

పాదపద్మప్రభాపల్లవయుక్తమై కరుణాంతరంగ ప్రఖ్యాతినొప్పి,

నేత్రకాంతులచేత నిరుపమానంబుగ పత్రితయైయొప్పి పరవశించి,

మందహాసద్యుతినందిన పుష్టితో సకలమౌ కల్యాణ సన్నిధగుచు,

తే.గీ.II  కంప తీరంబునను తులకింపుతోడ

నొక్క కృపయను చిఱు మొల్క యొప్పియుండి

భక్తపాళికి శుభదయై రక్తినొప్పె

నట్టి కామాక్షి జనని కే నంజలింతు.

తాII నల్లని తలకట్టుచే భ్రమరితమై (తుమ్మెదలు ముసిరినదై) పాదకమల ప్రభలచే బల్లవితమై (చిగిర్చినదై) నేత్రకాంతులచే బత్రితయై (మారాకు పెట్టినదై) మందహా సద్యుతులచే పుష్టి నందినదై సకలకల్యాణములకు నిధానమై కంపాతీరమునం దులకించు నొక కృపయను చిఱుమొలక సర్వోన్నతిం దనరుచున్నది.


శ్లోII  రాకాచంద్ర సమానకాంతి వదనా నాకాధి రాజస్తుతా

మూకానామపి కుర్వతీ సురధనీ నీకాశ వాగ్వైభవం

శ్రీ కాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం

ఏకా పుణ్య పరంపరా పశుపతేరాకారిణీరాజతే II 11 II

తే.గీ.II  పూర్ణిమాచంద్రవదనయై ముద్దులొలుకు,

నగణితంబుగ శచియె యూడిగము చేయ,

మూగకున్ గవితాపగ స్ఫురణఁ గొలుపు

శివుని భాగ్యంబు కంచిలో చెలగుచుండె.

తాII పౌర్ణమి చంద్రునివంటి ముద్దుమోము గలదై, దేవేంద్రలక్ష్మి తన కూడిగము సేయ, మూగవారికిగూడ మందాకినీ ప్రవాహమధురమగు కవితా విలాస స్ఫురణము నల వరించుచు, నేకామ్రనాధుల భాగ్యమొకటి కాంచీపురమునందు సకలదుః ఖాపహారియై విహరించుచున్నది.

శ్లోII  జాతా శీతల శైలతః సుకృతినాం దృశ్యా పరం దేహినాం

లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాపవిచ్ఛేదినీ

ఆశ్చర్యం బహు ఖేలనం వితనుతే నైశ్చల్యమాబిభ్రతీ

కంపాయాస్తటసీమ్ని కాపి తటినీ కారుణ్య పాథోమయీ II 12 II

చంII  హిమగిరి పుత్రియై, తన నహీపు భక్తిని దల్చినంతనే

ప్రముదముతోడఁ గన్బడుచు, భక్తిగ సంస్మరణంబు చేయ మో

క్షము నిడి తాపముల్ డులిపి, కంచిని గంప సమీపమందునన్

సముచితరీతి యాడెడు ప్రశస్తదయామృతధార యొప్పెనే.

తాII హిమగిరికిం బుట్టి, పుణ్యాత్ములకు మాత్రము అనుకొన్నక్షణములో దర్శన మిచ్చుచు, క్షణకాలము సంస్మరించినంతనే తాపత్రయము నున్మూలించుచు, గాంచీపురమునందు సుస్థిర స్థితిం గనియు గంపాతీరము నందుల్లాస ఖేలనము సేయుచు నొక దయా రసామృత తరంగిణి జాల్వారుచున్నది.

శ్లోII  ఐక్యం ఏన విరచ్యతే హరతనౌ దంభావపుంభావుకే 

రేఖా యత్కచసీమ్ని శేఖర దశాం నైశాకరీ గాహతే

ఔన్నత్యం ముహురేతి యేన స మహాన్మేనా సఖః సానుమాన్

కంపాతీర విహారిణా సశరణాః తేనైవ ధామ్నా వయం II 13 II

శాII  తానేశక్తి, త్రిశూలి, దేహమునకున్ దంభావపుంభావమున్

లోనన్ వెల్గి సమైక్యతన్ గొలిపె, నే లోకేశ్వ రా జాబిలిన్

తానే దాల్చె, హిమాద్రి కీర్తి నిట నే తన్వంగి పెంచెన్, సదా

జ్ఞానోద్భాసిత కంపవాసియగునా కామాక్షి మా దిక్కగున్.

తాII జాబిల్లిరేఖ శిరమునం దూగ మేనాభర్తయైన హిమగిరి సార్వభౌమునికి బర మోన్నతి గూర్చుచు కంపాతీరమందు నవయౌవనముతో విహరించు నొక సొగసుచేత మేము దిక్కుగలవార మైనారము.

శ్లోII  అక్ష్ణోశ్చ స్తనయోః శ్రియా శ్రవణయోః బాహ్వోశ్చ మూలం స్పృశన్ 

ఉత్తంసేన ముఖేన చ ప్రతిదినం ద్రుహ్యన్పయోజన్మనే

మాధుర్యేణ గిరాం గతేన మృదునా హంసాంగనాం హ్రేపయన్

కాంచీసీమ్ని చకాస్తి కో೭పి కవితా సంతాన బీజాంకురః II 14 II

సీII  కమనీయమైన సత్ కవితా సుకల్పక బీజాంకురంబగు వేల్పులమ్మ,

ఆకర్ణవిశ్రాంతమగుకనుదోయితో నలరారుచున్నట్టి యనుపమాద్య,

బాహుమూలలునొక్కు బరువైన పాలిండ్లతోనొప్పు చున్నట్టి తోయజాక్షి,

శిరముననున్నశశిని, ముఖములనొప్పు కాంతిచేక్రిందైన కమలయుతయు,

తే.గీ.II  నడక మాటల సొంపుచే  నతముఖముగ

హంసలను చేసి యలరెడి యనుపమాంగి,

కాంచి పురమున విలసిల్లె కరుణఁ జూప

కంచి కామాక్షి, మదిలోన కలుగు జనని.

తాII కవితాకల్పవృక్షమునకు మూలమైన లేత మొలకయై, నేత్రప్రభ కర్ణమూలములను, కుచద్యుతి బాహుమూలములను నారయగా, మొగమును కిరీటచంద్రుఁడును పద్మకాంతులను ద్రోసిరాజనగా, మాటల సొంపుచే నడకల యింపుచే రాజహంసికి సిగ్గు కల్పించుచు, నొక పొలుపు కాంచీపురమున విలసిల్లుచున్నది.

శ్లోII  ఖండం చాంద్రమసం వతంసమనిశం కాంచీపురే ఖేలనం

కాలాయశ్ఛవితస్కరీం తనురుచిం కర్ణేజపే లోచనే

తారుణ్యోష్మనఖంపచం స్తనభరం జంఘా స్పృశం కుంతలం

భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయేదంబికే II 15 II

సీII  శీర్షభాగమునందు చిఱు చంద్రరేఖతో ననుపమానంబుగా నలరు జనని,

వినుతదేహపుకాంతి యినుమునే నిరసింప వినుతులు గన్నట్టి విశ్వతేజ,

కర్ణాంతమున్ గల్గు కన్నుల సొగసుతో జగతిని కాచెడి జయనిధాన,

తరుణవయసుచేత తనరు నఖంపచ స్థనభరముననొప్పు శంభురాణి,

తే.గీ.II  జంఘములఁ ద్రాకు వేణితో చక్కనొప్పి

యున్న కామాక్షి యనుభాగ్యమెన్నడబ్బు

నాకునీజన్మలోననే శ్రీకరముగ,

కలుగఁ జేయుము మాయమ్మ! కనికరమున.

తాII శిరమునం జంద్రరేఖ తూగగా, శరీరకాంతి ఇనుముయొక్క కాంతిని నిరసింపగా, కనులు చెవిలో రహస్యము తెలుపగా (ఆకర్ణాంతములనుట) ' ఎలప్రాయంపు వెచ్చదన మున గోరు వెచ్చనయి పాలిండ్లు కులుకగా, జంఘాలము (పిక్కలందాకునది) అయి తలకట్టు విలసిల్లగా, ఆచార్యకృపాలబ్ధమయి యుండెడి యా కామాక్షి యనెది భాగ్యము మాకుం బ్రీతి చేకూర్చు టెన్నడో కదా !

శ్లోII  తన్వానం నిజకేళి సౌధసరణిం నైసర్గికీణాం గిరాం

కేదారం కవిమల్లసూక్తిలహరీ సస్యశ్రియాం శాశ్వతం

అంహోవంచనచంచు కించన భజే కాంచీపురీ మండనం

పర్యాయ చ్ఛవి పాకశాసన మణేః పౌష్పేషవం పౌరుషం II 16 II

మII  శ్రుతులే శాంభవి గేళిసౌధసరణిన్ శోభిల్ల వర్ధిల్లుచున్,

సతమున్ సత్కవి సూక్తిసస్యరమకున్ సంస్తుత్య కేదారమై,

క్షితి పాపంబులఁ బాపు నేర్పరియునౌ, శ్రీకంచికా భూషయౌ, 

స్తుతుఁడౌ మన్మథగర్వ, నీలమణియౌ శోభన్ సదా కొల్చెదన్.

తాII శ్రుతికాంతారత్నములు కేళీవిహారము సేయు సౌధములందు (వేదాంతములంద నుట) శోభిల్లి కవుల వాగ్రూప సస్యములు పండుటకు పంటపొలమై, పాపహరమై పుష్పేషుని (మన్మధుని) మగతనమెల్ల రూపెత్తినదై, కాంచీనగరాలంకారమై, యింద్రనీ లమణితున్కవంటి నెమ్మేనిచాయగల యొక శాశ్వతసౌందర్యము నారాధించెదను.

శ్లోII  ఆలోకే ముఖపంకజే చ దధతీ సౌధాకరీం చాతురీం

చూడాలంక్రియమాణ పంకజ వనీ వైరాగమ ప్రక్రియా

ముగ్ధస్మేర ముఖీ ఘనస్తనతటీ మూర్ఛాల మధ్యాంచితా

కాంచీసీమని కామినీ విజయతే కాచిజ్జగన్మోహినీ II 17 II

సీ. పద్మముఖంబున, వాలుచూపులలోన, నెలరాజు నైపుణినలరుచుండి,

శిగలోన నొప్పుగఁ జేర్చబడెడి చంద్ర రేఖ సత్ప్రక్రియఁ బ్రీతిఁ గలిగి,

చిఱునవ్వులొలికించు సిరులొల్కు ముఖముతో, శ్రీకరంబుగ సృష్టిఁ జెలగుచుండి,

ఘనమైన స్తనభారమున కృశింసచిన కౌను నందంబుగా నొప్పు సుందరాంగి,

తే.గీ.II  కంచిపురమున తొనికెడి కనికరమున

ననుపమాన సర్వోత్కృష్టమైనదగుచు

శ్రీజగన్మోహినొక్కతె చెలఁగుచుండె.

కంచి కామాక్షి యాతల్లి ఘన సుచరిత.

తాII చూపునందు, వదనకమలమునందును, చంద్రునికి సంబంధించిన నైపుణిని ధరించునదియైన,  కొప్పునందు అలంకరింపబడుచున్న కమల వన వైరముల ప్రక్రియ గల, చక్కని చిఱునవ్వు మోముగల, గొప్ప స్తనభారముచే చిక్కిన నడుముతో నొప్పిన జగన్మోహినియైన  ఒకానొక కామిని కాంచిసీమయందు  సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

శ్లోII  యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేపి మందస్మిత

జ్యోత్స్నాసంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహో దేహినం

ద్రాక్షామాక్షికమాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ

కామాక్షి స్వయమాతనోత్యభిసృతిం వామేక్షణేవ క్షణం II 18 II

తే.గీ.II  నీదు చిఱునవ్వువెన్నెల నీటమున్గి

నీదు చూపను రా త్రేరిమీద పడునొ

విమతి యైనను వాగ్ఝరి వెంబడించు

తేనె ద్రాక్షలన్ మీరెడి తీపినొప్పి.

తాII ఓ కామాక్షీ! ఎవరికి నీ కటాక్షమనెడి పూర్ణిమారాత్రి నీ చిఱునవ్వనెడి వెన్నెలయేట స్నానమాడి నిత్యాభిముఖియగునో అతఁడు ఎంత మందమతియైనను వానింగూర్చి ద్రాక్షారసము యొక్కయు, తేనె యొక్కయు గర్వమునకు సిగ్గుగూర్చెడి రీతిని అభిసారికానాయికవోలె విచిత్రవాగ్వైఖరి యభిసరించును.

శ్లోII  కాలిందీ జలకాంతయః స్మితరుచి స్వర్వాహినీ పాథసి

ప్రౌఢధ్వాంతరుచః స్ఫుటాధరమహో లౌహిత్య సంధ్యోదయే

మాణిక్యోపల కుండలాంశు శిఖినీ వ్యామిశ్రధూమశ్రియః

కళ్యాణైకభువః కటాక్షసుషమాః కామాక్షి రాజంతి తే II 19 II

ఉII  నీ కడగంటి కాంతులవి నీ చిఱునవ్వులగంగలోపలన్

శ్రీకరమైన యా యమున చిందెడి కాంతిగ, నీ స్ఫుటాధర

శ్రీకమనీయమౌ యరుణ చిద్ఘనసంధ్యను కాఱుచీకటై,

సోకగ కుండల ప్రభలు, శోభిలె నాపొగకాంతినమ్మరో.

తాII ఓ కామాక్షీ! చిఱునవ్వనెడి దేవనదిలో (పాల వంటి గంగలో) యమున జలప్రభలయి, పెదవి పై గులుకు నెఱ్ఱనికాంతియనెడి సంధ్యారాగమందు కాఱుచీకటులయి, మణికుండలములనెడి అగ్ని శిఖయందు నెలకొను ధూమరేఖలై నీ కాటుకకంటికొనకాంతులు కల్యాణకరంబు లగుచున్నవి.

నీ చిరునవ్వు యొక్క ప్రకాశానికి ప్రాతినిధ్యం వహించే ఆకాశ గంగ యొక్క పాల తెల్లని నీటిలో యమునువాచీకటి జలాలను పోలి ఉంటుంది, ఇది అన్ని శుభాల సారవంతమైన నేల అయిన మీ ప్రక్క చూపుల ప్రకాశం. ఇది మీ పెదవుల ఎరుపు రంగుతో సూచించబడే  సాయంత్రం సంధ్యా సమయంలో ( సంధ్య ,సూర్యాస్తమయం) దట్టమైన చీకటిని కూడా పోలి ఉంటుంది. ఇది మీ మాణిక్య చెవి-గోళాల ప్రకాశాన్ని సూచించే అగ్ని నుండి వచ్చే పొగ లాంటిది .  

శ్లోII  కలకల రణత్ కాంచీ కాంచీవిభూషణ మాలికా

కచభర లసచ్చంద్రా చంద్రావతంస సధర్మిణీ

కవికులగిరః శ్రావం శ్రావం మిలత్ పులకాంకురా

విరచిత శిరః కంపా కంపాతటే పరిశోభతే (జగదంబికా) II 20 II

సీII  కలకల ధ్వనిఁజేయు కనకవడ్డాణంబు ధరియించియున్నట్టి దక్ష కన్య 

కంచికే తానలంకారంబుగానిల్చి, చంద్రవంకను సిగన్ జక్కఁ దాల్చి,

చంద్రశేఖరునితో సరియై ప్రకాశించు ధార్మికమూర్తియై ధరను నిలిచి,

కవుల సద్రచనలన్ జక్కగా వినుచుండి తలయూపినుతియించు పులకరించి,

తే.గీ.II  కంప తీరాన వెలసె తానింపుమీర,

శివుని యర్థాంగగౌరిగా చెలువు మీర,

నట్టికామక్షి పాదముల్ పట్టి విడువ

జన్మరాహిత్యమందగ చక్కగాను.

తాII కలకల మ్రోయు వడ్డాణము గల కాంచీ నగరమునకు అలంకార మాలయైన కేశపాశమున ప్రకాశించు చంద్రకల గల, చంద్రకలాశేఖరుడైన శివునితో సమాన ధర్మము గల, కవుల సమూహముయొక్క వాక్కులను వినుచు వినుచు పులకించిపోవుచు శిరః కమ్పము చేయు అమ్మవారు కమ్పానదీతీరమున విలసిల్లుచున్నది.


శ్లోII  సరసవచసాం వీచీ నీచీ భవన్మధుమాధురీ 

భరిత భువనా కీర్తిః మూర్తిర్మనోభవజిత్వరీ

జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే

కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితం II 21 II

తే.గీ.II  తేనె లొలికెడి వాగ్ఝరి, దివ్య కీర్తి,

మన్మథుని గెల్చు రూపము, మహిని సుఖము,

కోరుకొను భోగభాగ్యము, కూర్మితోడ

నమ్మచూడకెట్లబ్బును? నెమ్మదిఁ గన.

తాII తరంగించు తేనె తీపి గల సరసవాక్కు, లోకముల నిండిన కీర్తి, మన్మథునోడించు రూపు, మనసునకు తగిన భోగ్యము, మనుష్యులకు అమ్మవారి కటాక్షము సోకనిదే ఎట్లు కలుగును?

శ్లోII  భ్రమరిత సరిత్కూలో నీలోత్పల ప్రభయా భయా

నతజన తమః ఖణ్డీ తుండీరసీమ్ని విజృంభతే

అచలతపసామేకః పాకః ప్రసూన శరాసన

ప్రతిభట మనోహారీ నారీకులైక శిఖామణిః II 22 II

తే.గీ.II మహి గిరీశుని సత్తపోమహిమ జనిత,

నతుల కభయప్రదాత, యంధమునడంచు, 

స్త్రీలమేల్బంతి, కంప దరిని, ఘనుఁడగు

శివుని యర్థాంగి, కంచిలో చెలగుచుండె.

తాII స్త్రీల శిఖరాభరణం, శివుని హృదయాన్ని దోచుకున్నది, శివుని అచంచలమైన తపస్సుల ఫలం,ఆమె పాదాలకు నమస్కరించే వారి భయాన్ని పోగొట్టే కామాక్షి దేవి కంపా ఒడ్డున ప్రకాశిస్తుంది.నీలి తామరపువ్వువంటి ముదురు నీలం తేజస్సుతో తేనెటీగలు నివసించినట్లుగా కనిపిస్తాయి .

శ్లోII  మధుర వచసో మందస్మేరా మతంగ జగామినః

తరుణిమ జుషస్తాపింఛాభాః తమః పరిపంథినః

కుచభరనతాః కుర్యుర్భద్రం కురంగవిలోచనాః

కలితకరుణాః కాంచీభాజః కపాలిమహోత్సవాః II 23 II

సీII  మధురవాఙ్నిధియును, మందస్మితోదంచిత ముఖియు, జగతిలో ప్రముఖయుఁ గన,

మదగజగమనయు, మహనీయ యౌవనవతియును, ఘన శుభమతియు తలప,

తాపింజపూవులన్ దలదన్ను కాంతితో వరలెడి శుభగుణ భాగ్యరాశి,

వక్షోభరంబుచే వంగిన తనుమధ్య, తామసంబును బాపు ధర్మనిష్ఠ,

తే.గీ.II  నుత కురంగ నేత్ర, కరుణాన్వితగ తాను

కంచిలో వెల్గు కామాక్షి, సంచితఫల

మౌను తలప కపాలికి, ననుపమమగు

భద్రతనుగొల్పు మనలకు, పాహి యనిన.

తాII మధురమైన మాటలు, అందమైన చిరునవ్వు కలవారు, మత్తెక్కిన ఏనుగు నడకలా ఉండేవారు, యవ్వనం తాజాది , తాపింజాపువ్వులా ప్రకాశవంతంగా ఉంటుంది , ఆమె వక్షస్థల బరువుతో కొంచెం వంగి ఉంటుంది , కామాక్షి దేవి. దయతో నిండిన మరియు కంచి నివాసం ఉన్న డోయ్ కళ్ళు మాకు శుభం కలిగించు (ఆమె ద్వారా మేము ఆశీర్వదించబడాలి)

శ్లోII  కమల సుషమాకక్ష్యారోహే విచక్షణ వీక్షణాః

కుముద సుకృత క్రీడా చూడాల కుంతలబంధురాః

రుచిర రుచిభిస్తాపింఛశ్రీ ప్రపంచన చుంచవః

పురవిజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః II 24 II

తే.గీ.II  కమల కాంతులన్ మించెడి కనుల నేర్పు,

కలువరేని తా శిఖయందు కలిగినదియు,

తనువు కాంతి తమాలమున్ దాటునదియు

శివ మనోహారి, కంచిలో చెలఁగుచుండె.

తాII కమలములశోభ పై తరగతి కెక్కుటయందు విచక్షణతగన్న చూపులుగలవి. కలు వల పుణ్యక్రీడ అయిన చంద్రుని శిరోభూషణముగాగల కురులుగలవి. నిజ కాంతిచే తాపింఛకుసుమశోభను విస్తరింపజేయు నేర్పుగలవియు నగు పరమశివుని మనోరధములు (కామాక్షియనుట) కంపాతీరమునందు చరించుచున్నవి.

శ్లోII  కలితరతయః కాంచీలీలా విధౌ కవిమండలీ

వచన లహరీ వాసంతీనాం వసంత విభూతయః

కుశలవిధయే భూయాసుర్మే కురంగవిలోచనాః

కుసుమ విశిఖా రాతేరక్ష్ణాం కుతూహల విభ్రమాః II 25 II

తే.గీ.II  కంచి సంచార కౌతుక, కవుల శ్రేణి

వచన లహరి వాసంతికి వర వసంత

సంపద, మృగేక్షణయు, కామ శత్రువునకు

కనులపండుగ, తీర్చుత కామితములు.

తాII కాంచీవిహార కుతూహలములు, కవిశ్రేణివాష్ప్రవాహంబులనెడి వాసంతి లతలకు వసంత సంపదలు, ఆడులేడి చూపులు గలవి, కామవైరికన్నులకు వేడుకలు గొలుపునవియు నగు విలాసములు, నాకు క్షేమవిధాయకము అనుగాక !

శ్లోII  కబలిత తమస్కాండాః తుండీర మండల మండనాః

సరసిజ వనీ సంతానానామ్ అరుంతుద శేఖరాః

నయన సరణేర్నేదీయంసః కదా ను భవంతి మే

తరుణ జలదశ్యామాః శంభోస్తపః  ఫలవిభ్రమాః II 26 II

తే.గీ.II  చెలఁగు తమసమ్ము నశియింపఁ జేయునట్టి,

కంచి కాభరణంబుగా క్రాలునట్టి,

చంద్రరేఖను దాల్చిన, సాంద్ర రజని,

శంకరునితపఃఫలమిడు జయము కనిన.

సీII  కబళించు భక్తుల కఠినమైయున్నట్టి యజ్ఞానతిమిరమ్ము ననుపమముగ,

కంచికేతానలంకారమై యున్నట్టి కామక్షి యనబడు కల్పవల్లి,

నెలవంకతాలుపు, సులలిత సహృదయ, సుజనులమదినుండు శోభనాంగి,

సాంద్రమేఘమువోలె శ్యామలవర్ణము కలియొప్పుచునుండు కంబుకంఠి,

తే.గీ.II  కంచి కామాక్షి యాతల్లి కాలకంఠు

తపము ఫలమది, జన్మంబు ధన్యతఁ గన

నెపుడు నే చూడనగునొ నా తపన తీర

జనని దుర్గాంబ పదములు చక్కగాను.

తాII దట్టమైన అజ్ఞాన అంధకారాన్ని కబళించే కామాక్షిని, కంచికి అలంకారంగా, నెలవంకను తలపై పెట్టుకుని, కొత్తగా ఏర్పడిన మేఘంలా చీకటిగా ఉన్న అద్భుతమైన ఫలాన్ని, శంభుని యొక్క తపస్సును, నేను ఎప్పుడు చూస్తాను?

11 – 3 – 2024.

శ్లోII  అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా

సరసిజభువో యానం మ్లానం గతేన చ మంజునా

త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతీ

తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరీ II 27 II

సీII  కామాక్షి తనముఖ కాంతితో నోడించు పద్మతేజమ్మును వరలుచుండి,

సుందరంబుగనుండి శోభిల్లు నడకతో రాయంచనడకల రహిని బాపు,

నయగారముననొప్పు నయవాగ్విభవముచే దేవతామృత దివ్య దీప్తి డించు,

ననుపమమైన మా యమ్మలో సుగుణాళి వినువారి చెవులకు ప్రణవసుధయె,

తే.గీ.II  శివునియర్థాంగి మాయమ్మ భవవిదూర,

యట్టి మాతల్లి కంచికాపట్టణమును

శ్రేషమైనట్టి దానిగా చేయుచెండె

తాను వసియించి యచ్చట జ్ఞానఖనిగ.

తాII కామాక్షీమాత మన్మథుని మొదటి బాణమయిన పద్మాన్ని దీనురాలినిగా చేసే ముఖకాంతికలది, బ్రహ్మవాహనమైన హంసను తన మెల్లని నడకలచే ఓడించేది, దేవతల ఆహారమైన అమృతాన్ని తన మాటల తీయదనంతో విస్తరింపజేసేది, అట్టి శివుని సుందరి కంపాతీరాన్ని శ్రేష్ఠమైనదానినిగా చేస్తుంది.

శ్లోII  జనని భువనే చంక్రమ్యేహం కియన్త మనేహసం

కుపురుష కర భ్రష్టైః దృష్టైర్ధనైరుదరం భరిః

తరుణ కరుణే తంద్రాశూన్యే తరంగయ లోచనే

నమతి మయి తే కించిత్ కాంచీపురీ మణిదీపికే II 28 II

సీII  చెడుబుద్ధి కలిగిన చెడువర్తనులయిన వారలిచ్చెడి సొమ్ము వడసి నేను

కడుపు నింపుకొనుచు గౌరవహీనునై బ్రతుకుటెట్టులు తల్లి? పరము లేదొ?

యెంత కాలమిటుల నీలోకమున నేను నిర్లక్ష్యవర్తినై నిలువవలయు?

కంచిలోనున్నట్టి కమనీయ మణిదీపమా! మొరలను వినుమా! యొకింత,

తే.గీ.II  బద్ధకము లేక వెలిగెడి ముద్దరాల!

దయకు మారుపేరైనట్టి జయనిధాన!

నీకు సాష్టాంగపడు నన్ను నీవు దయను

చూడు మించుక, నీవె నా తోడు జనని!

తాII ఓ తల్లీ! చెడు స్వభావాలు మరియు ప్రవర్తనకలిగిన వ్యక్తుల చేతుల్లోని కల్మషమైన డబ్బుతో నా కడుపు నింపుకుంటూ, ఈ లోకంలో ఎంతకాలం లక్ష్యం లేకుండా తిరుగుతాను . కంచి రత్నాల దీపమా! సోమరితనం లేని దయ యొక్క భాండాగారమైన నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్న నాపై నీ చూపు యొక్క చిన్న తరంగాన్ని దయచేసి మళ్లించుమమ్మా!

శ్లోII  మునిజన మనః పేటీరత్నం స్ఫురత్ కరుణానటీ

విహరణ కలాగేహం కాంచీపురీ మణి భూషణం

జగతి మహతో మోహవ్యాధేః నృణాం పరమౌషధం

పురహరదృశాం సాఫల్యం మే పురః పరి జృంభతాం II 29 II

తే.గీ.II  మునుల మదులందు వజ్రము, మోహమనెడి

రోగమునకౌషధంబును, రుద్రునకన

నేత్రపర్వంబగు, దయానటి త్రినేత్ర,

నడచునాట్యశాలయె, కనఁబడుత నాకు.

తాII ఋషుల మదిలోని వజ్రము, దయ అనే నర్తకి, విహరించే రంగస్థలము, కంచికి అలంకారము, మోహము అనే అనారోగ్యమునకు గొప్ప మందు, శివుని నేత్రములకు ధన్యత చేకూర్చేది అయిన కామాక్షి నా ముందు తనను తాను బహిర్గతం చేసుకొనుగాక.  

శ్లోII  మునిజన మనోధామ్నే ధామ్నే వచోమయ జాహ్నవీ

హిమగిరి తట ప్రాగ్భారాయ అక్షరాయ పరాత్మనే

విహరణ జుషే కాంచీదేశే మహేశ్వర లోచన

త్రితయ సరస క్రీడా సౌధాంగణాయ నమో నమః II 30 II

చంII  మునిజన మానసద్యుతికి, పూజ్య వచస్సురగంగకున్,లస

ద్ఘనహిమ సన్నగాగ్ర వరకామిత సత్ప్రదకున్, శివ త్రిలో

చనముల కాటపట్టయిన సౌధముగా గల కంచి కామకో

టిని వసియించు దేవికి, ఘటింతు ప్రణామము లార్యకున్ ధృతిన్.

తాII మునిజనుల మనస్సుకు, గంగాప్రవాహం వంటి వాక్కులకు నిలయమైనట్టిదానకు, హిమగిరి యొక్క ఉన్నత పుణ్య శిఖరమునకు; నాశరహితమైన పరమాత్మకు, కాంచీదేశమందు విహరించేది- శివుని మూడుకన్నుల సరసక్రీడలకు మేడయైనట్టిదైన కామాక్షికి నమస్సులు!


శ్లోII  మరకతరుచాం ప్రత్యాదేశం మహేశ్వర చక్షుషాం

అమృత లహరీ పూరం పారం భవాఖ్యపయోనిధేః

సుచరిత ఫలం కాంచీభాజో జనస్య పచేలిమం

హిమశిఖరిణో వంశస్యైకం వతంసముపాస్మహే II 31 II

తే.గీ.II  మరకతఛవిని పోద్రోచు, మారవైరి

కంటి కమృతము, భవమను కడలికొడ్డు,

కంచి జన పుణ్యఫలము, నగపతి భూష,

కంచి కామాక్షి, కొలుతు నే నెంచి మదిని.

తాII మరకతమణికాంతిని కాదనునది, సంసారసింధువునకొడ్డు, మహేశ్వరుని చూపుల కమృతప్రవాహంపుబుగ్గ, కాంచీవాసుల పరిపక్వపుణ్యఫలము, హిమగిరివంశమున కేకైక భూషణము నైన కామాక్షీదేవి నుపాసించెదము.

శ్లోII  ప్రణమన దినారంభే కంపానదీ సఖి తావకే 

సరస కవితోన్మేషః పూషా సతాం సముదంచితః

ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవిత్వ కుముద్వతీం

నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వరకన్యకే II 32 II

తే.గీ.II  అమ్మ! కామాక్షి! నీ దరి నెమ్మిఁ జేరు

క్షణము నుండియె ఘనతర కవనధార

పారుటను జేసి, ప్రౌఢులౌ పర సుకవుల

మోములన్ వాడఁగా జేయు ముగ్ధవమ్మ.

తాII ఓ కామాక్షీ! ఆనందముతో నీ సన్నిధిని వ్రాలిన యా మొదటి దినారంభము నందే కవితారుణోదయమైనట్లయి శత్రుకోటియొక్క వక్తృత్వముతో గూడిన కవిత్వ విలాస ప్రౌఢిరూపమైన కలువతీగ మోము ముడిచికొనునట్లు చేయగలదు.


శ్లోII  శమిత జడిమారంభా కంపాతటీ నికటేచరీ

నిహత దురితస్తోమా సోమార్ధముద్రిత కుంతలా

ఫలిత సుమనోవాంఛా పాంచాయుధీ పరదేవతా

సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందినీ II 33 II

తే.గీ.II  మాంద్యమును వాపు, చెలగుకల్మషమునడఁచు,

కంపతీరాన నుండు, శ్రీకరవిధముగ

చంద్రకళఁ దాల్చు, వేల్పులన్ జక్కఁగఁ గను,

హిమజ నా కంటఁ బడి నన్నునేలుఁ గాక.

తాII మాంద్యమునణచి, పాపపుదుడుకువాషి, కంపాతీరమునందు పసించుచు, చంద్రరేఖ సిగబంతిగా ధరించి, వేల్పులకోరికల నీడేర్చుచు, హిమగిరి సార్వభౌము పూర్వపుణ్యమును పండించుచుండెడి తల్లి, నా నయనములను సఫలము సేయుగాక !

శ్లోII  మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా

కుముద సుషమా మైత్రీ పాత్రీ వతంసిత కుంతలాం

జగతి శమిత స్తంభాం కంపానదీ నిలయామసౌ

శ్రియతి హి గలత్తంద్రా చంద్రావతంస సధర్మిణీం II 34 II

తే.గీ.II  జాడ్యమా! నన్ను పీడింపఁ జాలవీవు,

స్తబ్దతనుబాపు, శశిరేఖ ధరను, శివుని

సతిని, కంప తీర నిలయ సన్నిధాన

మాశ్రయించెను నామది యనుపమముగ.

తాII ఓ జాడ్యాతిరేకమా! నీవు నాబుద్ధి నెట్లు పీడింపగలవు. ఈ నా బుద్ధి చంద్రావతంసయగు, స్తబ్ధతను నశింపజేయు, కమ్పానదియే నిలయముగాగల, శివుని యిల్లాలిని సోమరితనము వీడి ఆశ్రయించుచున్నది గదా.

శ్లోII  పరిమళ పరీపాకోద్రేకం పయోముచి కాంచనే

శిఖరిణి పునర్ద్వైధీభావం శశిన్యరుణాతపం

అపి చ జనయన్కంబోః లక్ష్మీం అనంబుని కో ప్యసౌ

కుసుమ ధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః II 35 II

సీII  మొయిలు పుత్తడులకున్ బుట్టించు సౌరభం బమ్మ మేన్ జుత్తులనమరినటుల,

గిరిని రెండుగ చేయు నిరుపమ కానాక్షి, మహితమౌ కుచయుగ్మ, మంగళనిధి,

చంద్రునికరుణిమన్ జక్కగాదిద్దుతా నరుణతేజమునొప్పునధరజనని,

నిర్జలదేశాన నిరుపమ శంకంబుఁ గలుగునట్టులఁ జేయు కంబుకంఠి,

తే.గీ.II  అట్టి కల్యాణగుణమణి యనుపమముగ

మన్మథునిపూర్ణశక్తి యా మాన్యతేజ,

కంచిపురలోన విలసిల్లు కనకదుర్గ,

భక్తిసంపత్తి నిచ్చి నన్ వరలఁజేయు.

ఆ.వె.II  మేఘమందుమరియు మేలుపుత్తడియందు

పరిమళమ్ముఁ గొల్పు పంకజముఖి,

కొండ రెండు చేయు కుచయుగ్మ కొలుపును

చందమామకెఱుపు చక్కగాను.

తాII మేఘమందు, మేలిమిబంగారమందును పరిమళమును సంఘటింపజేసి (అనగా నల్లని జుట్టునందు పువ్వులు,) మేనియందు సుగంధమును గూర్చి, మహాగిరియందు ద్వైతమును (జంటను) గూర్చి, (అనగా గిరులంబోలు కుచములు రెండు ధరించి,) చంద్రునం దరుణప్రభను సంతరించి (అనగా ముఖమునం దెఱ్ఱని యధరమును,) నిర్జలదేశమందు శంఖమును నలవరించి (అనగా శంఖమువంటి కంఠమును పూని,) మన్మధుని పూర్ణపరాక్రమ మొకటి కాంచిలో విలసిల్లుచున్నది.

శ్లోII  పురదమయితు ర్వామోత్సంగస్థలేన రసజ్ఞయా 

సరసకవితాభాజాం కాంచీపురోదరసీమయా 

తటపరిసరై ర్నీహారాద్రే ర్వచోభి రకృత్రిమైః 

కిమిద న తులా మస్మచ్చేతో మహేశ్వరి! గాహతే II 36 II

తే.గీ.II  శివుని వామాంకమును, కంచిసీమనడిమి,

సుకవితారసజ్ఞశిఖరశోభ, పర్వ

తేశ్వరుని ఘనసౌందర్యతేజము, శ్రుతి

సార మగు నిన్ను కామాక్షి! చేరుటెట్లు?

తాII అమ్మా! శివునివామాంకము, గాంచీపురగర్భదేశము, కవితారసజ్ఞ శేఖరము, పర్వతే శ్వరుని పరమసౌందర్యము, వేదవాక్యార్థసారము, నైన పదార్థమునగు నీతో నా మన సైక్యము పొందజాల దేమమ్మా !

శ్లోII  నయన యుగళీం ఆస్మాకీనాం కదా ను ఫలేగ్రహీం 

విదధతి గతౌ వ్యాకుర్వాణా గజేంద్ర చమత్ క్రియాం 

మరకతరుచో మాహేశానా ఘనస్తన నమ్రితాః

సుకృతవిభవాః ప్రాంచః కాంచీవతంస ధురంధరాః II 37 II

తే.గీ.II  మదపుటేనుగున్ మించెడి మందగమన,

మరకతద్యుతి వెదఁజల్లు మరు రిపు సతి,

కుచ భరంబున నమ్రిత, కూర్మినొప్పు

కడుసనాతన నీ సతిన్ గాంచుటెపుడొ?

తాII మదగజముయొక్క గమననై పుణ్యమును దన నడకచే వ్యాఖ్యానించుచు కాంచీపుర శిరోభూషణములయి మరకతమణిప్రభగెల్చు శరీరముగలవై కుచభారముచే వినమ్రము లయి ఆద్యంతరహితములైన శివుని సుకృతవిశేషములు నా కన్నుల నెన్నడు సఫలము సేయునోకదా !

శ్లోII  మనసిజయశః పారంపర్యం మరందఝరీసువాం

కవికులగిరాం కందం కంపానదీ తటమండనం

మధురలలితం మత్కం చక్షుర్మనీషి మనోహరం

పురవిజయినః సర్వస్వం తత్పురస్కురుతే కదా II 38 II

తే.గీ.II  మన్మథుని కీర్తిరూపము, మధువులొలుకు

మధుర కవిసూక్తి మూలము, మాన్యమయిన

కంపకున్భూషణంబగు, ఘనులమదులు

ద్రోచు శాంభవిన్ గాంచగ వేచియుంటి. 

తాII మన్మధునికీర్తి పరంపర, పచ్చితేనియలు వాకలుగట్టు మధురకవి సూక్తులు, పల్ల వించు మూలకందము విబుధజనమనోహరము మూర్తీభవించిన శివుని పూర్వపుణ్యము నైయున్న కంపానదీతీరమణిభూషణ మొకానొకటి నా కన్నుల నటించు టెన్నడో కదా!

శ్లోII  శిథిలిత తమోలీలాం నీలారవింద విలోచనాం

దహన విలసత్ ఫాలాం శ్రీకామకోటిం ఉపాస్మహే

కరధృత సచ్ఛూలాం కాలారి చిత్తహరాం పరాం

మనసిజ కృపాలీలాం లోలాలకామలికేక్షణాం II 39 II

సీ.  తామసగుణమును తరిమివేసెడి తల్లి, నీలోత్పలాక్షి, సన్నీలవేణి,

ఫాలనేత్రంబునన్ బ్రబలెడి యగ్నితో, సత్ప్రకాశమునొప్పు సదయహృదయ,

శ్రీకామకోటిలో శ్రీకరంబుగనుండి భక్తులన్ రక్షించు భర్గురాణి,

చేతిలోశూలమున్ జెన్నారగాఁ గల్గి, శూలిమనసు దోచు శోభనాంగి,

తే.గీ.II  మన్మథుని బ్రోచినట్టి యా మాననీయ

ముంగురులశోభతోనొప్పు ముద్దుగుమ్మ,

యట్టి కామాక్షి పాదముల్ పట్టి నేను

భక్తితో నుపాసించెద భద్రతఁ గన.

తాII తమోగుణం (అజ్ఞానం) యొక్క లీలను నశింపజేయునది, నల్లకలువలవంటి కన్నులు కలది, నొసట అగ్నితో ప్రకాశించేది, శ్రీకామకోటి నివాసిని, చేతశూలాన్ని ధరించినది, యముణ్ణి జయిన శివుని మనస్సును హరించినది, మన్మథుని దయతో ప్రోచినది, కదలాడే ముంగురులుకలది, ఫాలలోచన అయిన కామాక్షీదేవిని ఉపాసిస్తాము.

శ్లోII  కలాలీలాశాలా కవికులవచః కైరవవనీ

శరజ్జ్యోత్స్నాధారా శశధరశిశు శ్లాఘ్యముకుటీ

పునీతే నః కంపాపులినతట సౌహార్దతరలా

కదా చక్షుర్మార్గం కనకగిరి ధానుష్క మహిషీ II 40 II

సీII  కాలకంఠునిసతి కళలకాటస్థలి, కంచిలో కామాక్షి కమల నయన,

కవుల మాటలనెడి కలువల తోటకు శరదిందుచంద్రిక, చల్లనమ్మ,

శోభిల్లు శశిరేఖ చూడామణిగగల మన్ననలందునాపన్నరక్ష,

కంపానదీతీర మింపని మదినెంచిస్నేహంబుతోనఁట చెలగు తల్లి,

తే.గీ.II  అట్టి మాతల్లి కన్నులకట్టునెపుడు?

కాలయాపన చేయక కదలి వచ్చి

తనను గాంచెడి కోరికన్ తానె తీర్చి

బ్రతుకు వ్యర్థము కాకుండ క్షితిని గాచు.

తాII మేరుపర్వతాన్ని విల్లుగాగల్గిన పరమశివుని పట్టపురాణి కళలకు విహారస్థలము, కవుల మాటలనే కలువలతోటలకు శరత్ కాలపు వెన్నెలప్రవాహము, బాలచంద్రుని ధరించిన కిరీటముకలది, కంపానదీతీరం పట్ల స్నేహం చేసేదీ, , అట్టి తల్లి మా కన్నులమార్గాన్ని ఎపుడు ధన్యం చేస్తుందో కదా!


శ్లోII  నమః స్తాన్నమ్రేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా

దధానేభ్యః చూడాభరణం అమృతస్యంది శిశిరం

సదా వాస్తవేభ్యః సువిధభువి కంపాఖ్యసరితే

యశో వ్యాపారేభ్యః సుకృత విభవేభ్యో రతిపతేః II 41 II

తే.గీ.II  స్తన భరంబున నమ్రిత, సదయనొప్పు,

చంద్రరేఖసద్భూషగా శిరమునొప్ప,

కంపతీరాన చెలువొందు కాలగళుని

రాణి కామాక్షి నెన్నుచు ప్రణుతులిడుదు.

తాII కుచభారగర్వముచే వినమ్రయై చల్లని అమృతము నించు శిరోభూషణముచే (చంద్రునిచే) నందముగని కంపాతీరముల నలరు శంకరుల భాగ్యసంపదలకు నా నమస్కారము.

12 – 3 – 2024.

శ్లోII  అసూయన్తీ కాచిత్ మరకతరుచో నాకిముకుటీ -

కదంబం చుంబంతీ చరణనఖ చంద్రాంశుపటలైః

తమోముద్రాం విద్రావయతు మమ కాంచీర్నిలయనా

హరోత్సంగ శ్రీమన్ మణిగృహ మహాదీపకలికా II 42 II

మII  తనుకాంతి న్మణికాంతులన్ డులుచు, పాదద్వంద్వమున్ మ్రొక్కుచున్

ప్రణతుల్ జేసెడి దేవతామకుటముల్ ప్రఖ్యాతిగాముద్దిడున్,

వినుతుండౌహరు దేహమందిరమణిద్వీపంబునన్ దీపమై

ఘనతన్వెల్గు జగత్రయీజననియౌ కామాక్షి జ్ఞానంబిడున్.(నన్ బ్రోచుతన్.)

తాII తన శరీరకాంతితో మరకతమణికాంతులను అసూయపడజేసేది, కాలిగోటిచంద్రకాంతులతో దేవతాకిరీటసమూహాన్ని ముద్దిడుకొనేది, శివుని ఒడి అనే మణిగృహంలోని గొప్పదీపపుమొలక, కాంచీ నివాసిని- అయిన కామాక్షి నాలోని అజ్ఞానస్థితికి పారద్రోలుగాక!

శ్లోII  అనాద్యంతా కాచిత్ సుజన నయనానందజననీ

నిరుంధానా కాంతిం నిజరుచి విలాసైర్జలముచాం

స్మరారేః తారల్యం మనసి జనయన్తీ స్వయమహో

గలత్కంపా శంపా పరిలసతి కంపాపరిసరే II 43 II

సీII  ఆద్యంతములు లేని యపురూప దేవత, కన్నులపండువై కలుగు తల్లి,

తన దేహ కాంతితోఁ దల్లడిల్లఁగఁ జేయు నీలి మేఘరుచుల నీలవేణి,

మనసిజవైరికే మది చంచలింపగా యెదదోచి చేసెడి మృదులదేహ,

శంపా సమీపాన సొంపుగా కనిపించు సన్నుతుల్ గొనునట్టి సరసిజాక్షి

తే.గీ.II  దివ్యతేజంబుతో నొక్క దేవపూజ్య

కంపమన్నది లేనట్టి కరుణ కాంతి

భక్తపాళిని బ్రోవగా వరలుచుండె,

కంచి కామాక్షి యాతల్లి, కాచు నన్ను.

తాII కంప ఒడ్డున మెరుపులా మెరుస్తున్నకామాక్షి దేవి ఆది అంతం లేనిది, మంచివారి హృదయాలను ఆహ్లాదపరుస్తుంది, తన చీకటి తేజస్సుతో మేఘాలను అధిగమిస్తుంది, శివుని హృదయాన్ని మృదువుగా చేస్తుంది.

శ్లోII  సుధాడిండీరశ్రీః స్మితరుచిషు తుండీర విషయం

పరిష్కుర్వాణాసౌ పరిహసిత నీలోత్పలరుచిః

స్తనాభ్యాం ఆనమ్రా స్తబకయతు మే కాంక్షితతరుం

దృశామైశానీనాం సుకృత ఫల పాండిత్య గరిమా II 44 II

తే.గీ.II స్త్యేనఫేనమున్ బోలెడి చిఱునగవును,

దివ్యనీలోత్పలము గెల్చు దేహకాంతి,

కుచ భరంబున వంగిన కోమలాంగి

భవుని కనువెల్గు నా కోర్కె వరలఁ జేయు.

తాII అమృతంలా మధురమైన చిరునవ్వు, ముదురు నీలిరంగు తేజస్సుతో నీలపువ్వును వెక్కిరించేది, స్తనభారానికి వంగి, శివుని నేత్రాలచేత చేసినపుణ్యఫలం కామాక్షీ దేవి నా కోరికలు తీర్చుగాక.

శ్లోII  కృపాధారా ద్రోణీ కృపణధిషణానాం ప్రణమతాం

నిహంత్రీ సంతాపం నిగమ ముకుటోత్తంసకలికా

పరా కాంచీలీలా పరిచయవతీ పర్వతసుతా

గిరాం నీవీ దేవీ గిరిశ పరతంత్రా విజయతే II 45 II 

సీII  కృపను పారెడు తూము, కృపణధిషణులైన నతులైనచో కాచు నతులితగతి,

నిగమ ముకుటోత్తంస యగణితకలికయౌ నీరజాతేక్షణ నిరుపమాన,

కాంచీనగర లీలలెంచి గణించిన పర్వతాధిపుపుత్రి ప్రవర చరిత,

వాక్కులకధిపతి, భాస్వంతుఁడైనట్టి పరమేశునకధీన పార్వతమ్మ,

తే.గీ.II  యట్టి కామాక్షి తల్లికి నంజలించి,

జయము పలికెద సతతంబు ప్రియముతోడ,

కంచిలోనుండి ధర్మంబు కాచు జనని,

నిత్యమంగళ, నాతల్లి, నిర్వికార.

తాII కృపారసము చిలుకు తూము. బలహీనహృదయుల పట్ల దయగలది, తన ముందు సాష్టాంగ ప్రణామం చేసేవారి బాధలను తొలగించునది, ఉపనిషత్తుల శిఖరాభరణము, కంచిలో ఆడుకొనునది, హిమవంతుని పుత్రి, వాక్కుకు అధిపతి, మరియు శివుని నియంత్రణలో తనను తాను ఉంచుకున్నది అయిన కామాక్షికి జయము.

శ్లోII  కవిత్వశ్రీకందః సుకృత పరిపాటీ హిమగిరేః

విధాత్రీ విశ్వేషాం విషమ శరవీర ధ్వజపటీ

సఖీ కంపానద్యాః పదహసిత పాథోజ యుగళీ

పురాణో పాయాన్నః పురమథన సామ్రాజ్యపదవీ II 46 II

చంII  కవితకు మూలకందము సుగణ్య హిమాద్రి శుభప్రసూతియున్,

ప్రవిమల సృష్టి కర్త, సుమభాసు నికేతనరాజమెన్నగా,

ప్రవహనమైన కంప చెలి, పల్లవహస్తయు, మన్మథారి సం

స్తవ శుభ రాజ్య సత్పదవి, నన్ గని బ్రోచుత ప్రేమతో సదా.

తాII కవిత్వశోభకు మూలకందము, హిమగిరిపూర్వపుణ్యపరిపాటి, సర్వసృష్టికర్త్రి,  మన్మధయోధుని ధ్వజపతాక, కంపానది చెలిమికత్తె, మదన వైరి సామ్రాజ్యపదవియు, నైన పురాణి మమ్ము బ్రోచుగాక !

శ్లోII  దరిద్రాణా మధ్యే దరదళిత తాపింఛసుషమాః

స్తనాభోగః కాంతాః తరుణ హరిణాంకాంకిత కచాః

హరాధీనా నానావిబుధ ముకుటీ చుంబితపదాః

కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే II 47 II

సీII  సన్ననినడుముతో, సరిగ తమాలంపు వృక్షశోభను నేను వెలుగుటెపుడొ?

కుచభారమునవంగి, కురులలో శశిరేఖఁ దాలిచి భువిపైన తనియుటెపుడొ?

శివునకధీనమై చెలగుచు నేనునును నీవుగా నొప్పుచు నీల్గుటెపుడొ?

పలుదేవతల శీర్షికల ముద్దులిడుభాగ్య మెప్పుడు కల్గునో గొప్పగాను?

తే.గీ.II  కంపతీరాన నీవలె నింపునొప్పి

నేను విహరింతు నెప్పుడో? నిరుపమాన!

నీవుగా నేను మారుట నీదు కృపయె,

నీవె నాకోర్కె తీర్చుచున్ బ్రోవవమ్మ!

తాII గిరిసుతా! సన్నని నడుముకలిగి, కాస్తవికసించిన తమాల వృక్షము యొక్క పరమశోభతో, కుచభారాలతో వంగి, చంద్రరేఖను దాల్చిన కేశపాశంతో, శివాధీనత్వంపొంది, పలుదేవతాకిరీటాలను ముద్దిడుకునే పాదాలతో, కంపాతీరంలో మేమెప్పుడు నీరూపంతో సమానరూపంకలిగి విహరిస్తామోకదా తల్లీ! (సారూప్యం కోరుతున్న విధానమిది.)

శ్లోII  వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మనసో

నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరీ

చరీచర్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే

సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా II 48 II

శాII  నావాక్కుల్ మది నీపయిన్ నిలుచుతన్, నావాగ్ఝరుల్ ప్రౌఢమై

భావోద్భాసితమై చెలంగుత, సతీ! వాగ్దేవి! నా జాడ్యమా

దేవీ! శత్రుపరంబు కాత, మదిలో దేదీప్యమానంబుగా

నీవే వెల్గుత, నీ దయామృతఝరుల్ నిత్యంబు నాకందుతన్.

తాII ఓ కామాక్షీ! నా మనస్సు మరియు నా వాక్కు నీలో స్థిరంగా ఉండుగాక. నా నోటిలో అద్భుతమైన ప్రసంగ తరంగాలు నాట్యం చేయుగాక. ఓ జ్ఞానమాత! మన మందబుద్ధిని మన శత్రువులకు పోనిత్తువుగాక. ఓ తల్లి కామాక్షీ! నీ దయ నాపై ధారాళంగా   కురియుగాక.

శ్లోII  క్షణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురుః

కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం

నరీనర్తు స్వైరం వచనలహరీ నిర్జరపురీ-

సరిద్వీచీ నీచీకరణ పటురాస్యే మమ సదా II 49 II

తే.గీ.II  భ్రమరశోభకు శిక్షణ సముచితమిడు

నీదు కడగంటి చూపు నన్నాదుకొనును,

వరలు స్వర్గంగఝరి మించు వాగమృతము

నాట్యమాడుత కామాక్షి! నా రసనను.

తాII ఓ కామాక్షీ! తుమ్మెదల శోభకు శిక్షణనిచ్చుటలో గురువైన నీ కడగంటి చూపుల ప్రసారం క్షణంలో నన్ను ఆపదలనుండి విముక్తుని చేయుగాక! నా ముఖంలో ఎల్లప్పుడు గంగానది ప్రవాహాన్ని అధఃకరించే శక్తిగల మాటల ప్రవాహం నాట్యం చేయుగాక!

శ్లోII  పురస్తాన్మే భూయః ప్రశమనపరః స్తాన్మమ రుజాం

ప్రచారస్తే కంపాతట విహృతి సంపాదిని ద్రుశోః

ఇమాం యాంఛామూరీకురు సపది దూరీకురు తమః -

పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయ మాం II 50 II

తే.గీ.II  కంప దరినాడఁ గోరెడి గణ్యవమ్మ,

నీదు చూపు నా రుగ్మతన్ నిత్యమణచు,

నాదు మాయ చీకటి బాపి నీదు కృపను

జ్ఞానులందున నిలిపి నన్ గావుమమ్మ!

తాII కంపా నది ఒడ్డున ఆడుకోవడానికి ఇష్టపడే ఓ కామాక్షీ! నీ చూపు నుండి తేజస్సు నా ముందు వ్యాపించి నా అనారోగ్యాన్ని మరియు దాని బాధను తగ్గించు. దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరించి, నా అజ్ఞానమనే చీకటిని తొలగించి, నన్ను జ్ఞానుల లోకానికి నడిపించుము.


శ్లోII  ఉదంచంతీ కాంచీనగరనిలయే త్వత్ కరుణయా

సమృద్ధా వాగ్ధాటీ పరిహసిత మాధ్వీ కవయతాం

ఉపాదత్తే మార ప్రతిభట జటాజూట ముకుటీ-

కుటీరోల్లాసిన్యాః శతమఖ తటిన్యా జయపటీమ్ II 51 II

తే.గీ.II  కంచి కామాక్షి! నీ దయన్ కవన ధార

పుష్కలంబుగఁ బొంగుచు ముందుకురుకు,

శివజటాజూట గంగదౌ సిడము పట్టి

చేత చిక్కించుకొనునమ్మ! సిద్ధమిదియె.

తాII కాంచీనగరవాసినీ! నీ దయవలన; తేనెల తీయదనాన్ని పరిహసించే, పుష్కలమైన వేగంగల కవిత్వశక్తి పెల్లుబికి వస్తుంది. అది శివుని జడలకు కిరీటంగా ఉల్లసిల్లుతున్న గంగానదియొక్క విజయ పతాకను చేజిక్కించుకుంటుంది.

శ్లోII  శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం

సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా

త్రిలోక్యాం ఆధిక్యం త్రిపురపరిపంథి ప్రణయినీ

ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే II 52 II

తే.గీ.II  శివుని యిల్లాల! కామాక్షి! చేరినీకు

వందనము చేయు సుతున కమంద బుద్ధి,

విద్య, సంపద, కీర్తి సత్ప్రేమనిత్తు

వట్టి నీ సేవ త్రైలోక్యపతిని చేయు,

నిఁక లభింపనిదేముండు? సకల జనని!

తాII కామాక్షీ! శివుని ఇల్లాలా! జననీ! పాపాలను హరించుదానా! నీ పాదాలపై మోకరిల్లే సుపుత్రులను నీవు వెంటనే కరుణిస్తావు. సంపదను, విద్యను, అమితకీర్తిని ప్రసాదిస్తావు. నీ పాదాభివవందనము త్రిలోకాల్లో ఆధిక్యతనే కలిగిస్తుందంటే, దానివల్ల లభించనివి ఏవి ఉంటాయి తల్లీ?

శ్లోII  మనః స్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం

సదా లోలం నీలం చికురజిత లోలంబనికరమ్

గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః

దృశాం యోగ్యం భోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే II 53 II

సీII  నతులైనవారల మతులలో జాడ్యమున్ దొలగంగఁ జేసెడి తోయజాక్షి,

నీలోత్పలంబులన్ నిలదీసి యోడించు కమనీయమైనట్టి కలువకంటి,

నీలివర్ణమునొప్పు, మేలైన కచములన్ దుమ్మెదలను మించు ధుర్యురాలు,

వాగ్దంబమేలేక వరలెడు చిఱునవ్వు గలయట్టి శివపత్ని జ్ఞానతేజ,

తే.గీ.II  చంద్రరేఖను దాల్చెడి సన్నుతాంగి,

శివుని కన్నుల వెలుగయి చెలగుతల్లి,

హిమగిరీశుని సత్పుత్రి, క్షమకు నిలయ,

కనగ ధరను సర్వోత్కర్షగావెలుంగు.

తాII కమ్పానదీతీరమున నమస్కరించు వారి మనోజాడ్యమును తొలగించునట్టిది, మంచి కన్నులు గలిగినట్టిది, నీలి రంగు గలట్టిది, తుమ్మెదల జయించు కేశములు గలట్టిది, వాక్కులకు దూరముగా నున్నట్టిది, చిఱునవ్వు గలట్టిది, చంద్రకల దాల్చినట్టిది, శివుని కన్నుల యోగ్యభోగ్యమైనట్టిది, హిమవంతుని భాగ్యమైనట్టిది అగు అమ్మవారు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది.

13 – 3 – 2024.

శ్లోII  ఘనశ్యామాన్ కామాంతక మహిషీ కామాక్షి మధురాన్

దృశాం పాతానేతాన్ అమృత జలశీతాననుపమాన్

భవోత్పాతే భీతే మయి వితర నాథే దృఢభవన్-

మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా II 54 II

మII  భవమన్ విడ్వర మిట్లు నాదు మదినే బాధించుచుండగ నో

శివపత్నీ! భయమొందుచుంటి, నిను నే సేవింతు నీ మూకపై

భవదీ యామృత శీత లాక్షయ మహద్భాస్వంత మాధుర్య సం

స్తవనీయాద్భుతమౌ కటాక్షములనే సాగిల్లగాఁ జేయుమా.


తాII శివపత్నీ! కామాక్షీ! సంసార మొకయుత్పాతమై బెదరిపోవుచున్న నాయందు, తీవ్రశోకంబున వివ శుడైయున్న యీ మూగవానియందు, మేఘశ్యామలములు, అమృతశీతలములు, మధురములు నైన నీ చూపులను బ్రసరింపజేయుము.

శ్లోII  నతానాం మందానాం భవనిగళ బంధాకులధియాం

మహాన్ధ్యాం రున్ధానాం అభిలషిత సంతానలతికామ్

చరంతీం కంపాయాః తటభువి సవిత్రీం త్రిజగతాం

స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతుకలికాం II 55 II

మII  భవబంధమ్ములఁ జిక్కి మందమతులై బాధాకులస్వాంతులై

స్తవనీయంబుగ మ్రొక్కు భక్తతతికిన్ సర్వాపదల్ బాపుచున్

భవతాపంబునడంచి జ్ఞానమిడి, సంభాసించు కల్పమ్ము నా

శివసంజీవని, యెంతు నామెను మదిన్ జిజ్ఞాసతో నిత్యమున్.

తాII సంసారమను సంకెళ్ళం దవిలి మందమతులై చెదరినమనసుగల జనులు నిజ చరణమ్ముల వ్రాలినంతనే వారి యజ్ఞానరూపమైన గ్రుడ్డితనమును బాపి కల్పలతవోలె వారి యభిలాష లొసంగుచు కంపాతీరమున మసలెడి శివసంజీవినీలతికను "నిత్యము స్మరింతుము.

శ్లోII  పరా విద్యా హృద్యా శ్రితమదనవిద్యా మరకత-

ప్రభానీలా లీలాపర వశిత శూలాయుధమనాః

తమః పూరం దూరం చరణనత పౌరందరపూరీ-

మృగాక్షీ కామాక్షీ కమలతరలాక్షీ నయతు మే II 56 II

తే.గీ.II  తా పరావిద్య, హృద్య, శ్రితమదన నుత

విద్య, మరకతనీలయు, వినత సుర వి

లాసిని, కమలనేత్ర, విలాస మోహి

త శివ మానస, కామాక్షి దయను కనుత. 

తాII పరమార్థవిద్యాస్వరూపిణి, మనోహారిణి, మన్మథవిద్యావిలాసిని, మరకత మాణిక్య నీలకాంతిభాసిని, నిజచరణ వినత సుర విలాసిని, కమలదళ లోచని, నిజవిలాస సమ్మోహిత సదాశివ మానస, అగు కామాక్షి నా యజ్ఞానమును నిజకటాక్ష వీక్షణముచే పోఁగొట్టు గాక!

శ్లోII  అహంతాఖ్యా మత్కం కబలయతి హా హంత హరిణీ

హఠాత్సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ

కటాక్ష వ్యాక్షేప ప్రకటహరిపాషాణపటలైః

ఇమాం ఉచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా II 57 II

తే.గీ.II  నా యహమ్మను జింక తా నయము వీడి

నాదు జ్ఞానమన్ మొలకను నములుచుండె

నీదు దివ్యకటాక్షేంద్రనీలశిలల

తో తరిమికొట్టు కామాక్షి! దోయిలింతు!

తాII అహంకారమనెడి జింక దూకి హఠాత్తుగ నా జ్ఞానమనెడి మొలకను కబళించుచు న్నది. దయతో నీ కటాక్ష ప్రసారములనెడి ఇంద్రనీలశిలాశకలములచే నా లేడిని తఱిమికొట్టుమమ్మా.

శ్లోII  బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ

కటాక్షః కామాక్షి ప్రకట జడిమక్షోదపటిమా

కథంకారం నాస్మై కరముకుల చూడాలముకుటా

నమోవాకం బ్రూయుః నముచి పరిపంథి ప్రభృతయః II 58 II

తే.గీ.II  పండితుఁడు, మూక యెవరైన బడసిరేని

నీ కటాక్షమున్ గామాక్షి! నిత్యమతని

సేవఁ జేసెదరింద్రాది దేవగణము,

తమ ముడులు తీసి,  భక్తితోఁ దలలు వంచి.

తాII పండితుఁడుకాని మూగవాఁడుకాని ఎవనియందు ఒక క్షణమైనను మాంద్యమును హరించు నీ కటాక్షము ప్రసరించునో వానికి ఇంద్రాదిదేవతలు నిజకిరీటములువంచి కరములు మొగిచి నమస్కరించెదరు.

శ్లోII  ప్రతీచీం పశ్యామః ప్రకట రుచినీ వారకమణి-

ప్రభాసధ్రీచీనాం ప్రదలిత షడాధారకమలామ్

చరంతీం సౌషుమ్నే పథి పరపదేందు ప్రవిగలత్-

సుధాద్రాం కామాక్షీం పరిణత పరంజ్యోతిరుదయామ్ II 59 II

సీII  వివరంబు పరికింప వినుత సర్వాంతర యైనట్టి శివమనోహరి జననిని,

నీవారబీజమునే పోలు తనుకాంతిఁ గలిగిన మహనీయ కరుణనిధిని,

యపురూపమైన మూలాధారమాదిగా షట్చక్రమూలమౌ సదయమతిని,

వినుతసుషుమ్న సద్విమల మార్గపు గామి యయి సహస్రారమ్మునమరి పారు,

తే.గీ.II  నమృతధారకునర్థమౌ యనుపమమగు

శ్రీపరంజ్యోతి యుదయమై చెలగునట్టి

కంచి కామాక్షినే మదినెంచి గాంతు,

వందనంబులు చేయుచున్ వినుత గతిని.

తాII సర్వాంతరయైన, నీవారబీజమువంటి తనుత్వకాంతులు గల, మూలాధారాది షట్కమలములు ఆధారములుగాగల, సుషుమ్నా మార్గమున విహరించు, సహస్రారచంద్రునినుండి స్రవించు అమృతధారచే ఆర్థయైన పరంజ్యోతియొక్క ఉదయముగా పరిణమించు కామాక్షీదేవిని చూచుచున్నాము.

శ్లోII  జంభారాతి ప్రభృతిముకుటీః పాదయోః పీఠయంతీ

గుమ్ఫాన్వాచాం కవిజనకృతాన్ స్వైరం ఆరామయంతీ

శంపాలక్షీం మణిగణరుచా పాటలైః ప్రాపయన్తీ

కంపాతీరే కవిపరిషదాం జృంభతే భాగ్యసీమా II 60 II

తే.గీ.II  దేవతల కిరీటాళిని దివ్యపాద

పీఠిగాఁ గొని, సుకవుల వినుతకవిత

ధాటినొనరించి తనపుష్పవాటిగాను,

తొడవుకాంతితో గాంతులే జడియ నిలిచె

కవులభాగ్యమ్ము కామాక్షి కంప దరిని.

తాII ఇంద్రాదిదేవతాకిరీటకోటిని దనకు బాదపీఠ మొనరించుకొని సుకవివచోధాటిని తాను విహరించుపుష్పవాటి నొనరించుకొని నిజాభరణ మణిగణరుచులచే క్రొమ్మెరుగుల శోభ నదలించుచు కవివరుల అదృష్టసీమ యొకటి కంపాతీరమందు విజృంభించు చున్నది.

14 – 3 – 2024.


శ్లోII  చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం

కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగామ్

మారారాతేర్ మదనశిఖినం మాంసలం దీపయన్తీం

కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే II 61 II

తే.గీ.II  చంద్రశేఖర, చతురాస్య, చంచలాక్షి,

కుందసుస్మేర, కుచభార మంద గమన,

నతశరీర, నెరయదల్చు క్షితి భ్రరముల,

శివునికామాగ్నిపెంచుచు కవులకల్ప

వల్లియైనకామాక్షినే వరలఁ గొలుతు.

తాII ఇందు కిరీటము, ఇంపులు గుల్కెడి నెమ్మొగము, చంచలమగు నపాంగవిలాసము, మొల్లలబోలు నెలనవ్వులు గలిగి, కుచభారమున నానతయై, కుంతలములచే దుమ్మెద లనదల్చుచు, కామవైరికామాగ్నిని రగుల్చుచు, గవులపలుకులకుఁ గల్పవల్లియై, యలరు కామాక్షినుపాసింతురు.

శ్లోII  కాలాంబోధప్రకర సుషమాం కాంతిభిః తర్జయన్తీ

కల్యాణానాం ఉదయసరణిః కల్పవల్లీ కవీనామ్

కందర్పారేః ప్రియసహచరీ కల్మషాణాం నిహంత్రీ

కాంచీదేశం తిలకయతి సా కాపి కారుణ్యసీమా II 62 II

మII  వర కామాక్షి దయాసముద్ర, నగగా భాసించు నా కంచికిన్,

పరమోద్భాసిత దేహకాంతి మొయిలున్ పంతంబుతో నెగ్గు, సు

స్థిర శోభాళికి మూలమున్, కవుల భాతిన్ బెంచు కల్పంబు,నీ

శ్వరు కామాగ్నిని పెంచు, చెడ్డనణచున్, శర్వాణి లోకంబునన్.

తాII కామాక్షి, అపారమైన దయ యొక్క స్వరూపిణి, కంచిని అలంకరించింది. ఆమె తన శరీరం యొక్క తేజస్సు ద్వారా చీకటి మేఘాల  ప్రకాశాన్ని అధిగమించింది . అన్ని శుభాలు వచ్చే మూలం ఆమె. ఆమె కవులకు కోరికలు తీర్చే లత మరియు మన్మథుని శత్రువు అయిన శివునికి ప్రియ సహచరురాలు. ఆమె సర్వ దురాచారాలను నాశనం చేసేది కూడా.

శ్లోII  ఊరీకుర్వన్నురసిజతటే చాతురీం భూధరాణాం

పాథోజానాం నయనయుగళే పరిపంథ్యం వితన్వన్

కంపాతీరే విహరతి రుచా మోఘయన్ మేఘశైలీం

కోకద్వేషం శిరసి కలయన్ కోపి విద్యావిశేషః II 63 II

తే.గీ.II  జ్ఞానపూర్ణ స్వరూపిణి, కంప దరిని

మేఘతేజంబునేమించు మేనితోడ,

కుచ శిఖరి తాల్పు, శశిరేఖ కురులఁ గలిగి,

విజిత నీలోత్పలకచ, వెలసె శివగ.

తాII మహోన్నతమైన జ్ఞాన స్వరూపిణి కంపా నది ఒడ్డున తన తేజస్సుతో మేఘాల అంధకారాన్ని అధిగమిస్తూ, తన వక్షస్థలంపై పర్వతాల లక్షణాలను అలవర్చుకుంటూ, కమలాల పట్ల తన కళ్లతో శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, తలపై నెలవంకను ఆడుతూ ఆడుతుంది.

శ్లోII  కాంచీలీలాపరిచయవతీ కాపి తాపింఛలక్ష్మీః

జాడ్యారణ్యే హుతవహశిఖా జన్మభూమిః కృపాయాః

మాకందశ్రీర్మధురకవితా చాతురీ కోకిలానాం

మార్గే భూయాన్మమ నయనయోః మాన్మథీ కాపి విద్యా II 64 II

తే.గీII  కంచి నెచ్చెలి, తాపింఛ కాంతి యుతయు,

జాడ్య వన దవానలయును, జాలికిరవు,

మధుర కవికోకిలలకును మావి చివురు,

నయిన కామాక్షి దోచు నా నయన దృష్టి.

తాII కాంచి యను విలాసవతికి నెచ్చెలియు, ఇరుగుడుమ్రానికి ఈడగు మైచాయగ లదియై, జాడ్యమను నడవిం దహించు దావాగ్నిశిఖయునై, దయకు పుట్టినిల్లై, మధుర కవికోకిలములకు మామిడిచివురునై, యున్న యొకానొక కామకళ నా చూపుమేఱల దోచుగాక. 

15 – 3 – 2024.

శ్లోII  సేతుర్మాతః మరకతమయో భక్తిభాజాం భవాబ్ధౌ

లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతీ

కాంచీభూషా పశుపతిదృశాం కాపి కాలాంజనాలీ

మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాలా II 65 II

ఉII  నీదు కటాక్ష మెన్న మహనీయ భవాంబుధి సేతువే కనన్, 

వాదుగ కల్వపూలను నవప్రభలన్ విలసిల్లునట్టి యా

హ్లాదమునొప్పుమన్మథునియద్భుతటెక్కెము, కంచి భూషయున్,

మోదముసాంబమూర్తికిపూర్తిగ కాటుకకన్నిలిచ్చు త

చ్ఛ్రీద మదంబ శాంభవి నశింపఁగ జేయుత నాదు దుఃఖమున్.

సీII  కామాక్షి నీవైన కరుణాకటాక్షముల్ భవసాగరముపైన వారధియగు,

లీలా విలోల విశాల కువలయంపు మన్మథ ధ్వజమౌను మంగళాంగి,

కంచికా కామాక్షి! కాంచీనగరభూషణంబు తలంపంగ నయనిధాన!

పశుపతి కంటికి పరమాద్భుతంబైన కాలాంజనాలియే కమల నయన!

తే.గీ.II అట్టి నీకంటి చూపు నన్ పట్టి చూచి

నాదు దుఃఖమున్ బాపుత మోదమలర,

నిన్నె నమ్మిన సుతుఁడను, నీడవగుచు

నన్ను కాపాడుమమ్మరో సన్నుతముగ.  

తాII ఓ తల్లీ! కామాక్షీ! నీ కటాక్షమాల భక్తులు సంసారసాగరము దాటుటకు మరకతమణి సేతువు, కలువపూలవిలసిల్లు సువిలాసచంచలమగు మన్మధుని టెక్కెము,  కాంచీపురీభూషణము, పశుపతిచూపులకు నల్లని కాటుకరేఖ, అది నా దుఃఖమును సడలించుగాక.

శ్లోII  వ్యావృణ్వానాః కువలయదళ ప్రక్రియావైరముద్రాం

వ్యాకుర్వాణా మనసిజమహారాజ సామ్రాజ్యలక్షీం

కాంచీలీలా విహృతిరసికే కాంక్షితం నః క్రియాసుః

బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః II 66 II

తే.గీ.II  కంచి లీలావిహారిణీ! కలువపూల

వికసనంబున శత్రువై, విషమశరుని

రాజ్యలక్ష్మినిఁ దెలిపెడి, రాగబంధ

ములను బాపు కంటను గనుము ననుఁ గృపను.

తాII కాంచీనగరంలో లీలావిహారం చేసే ఓ కామాక్షితల్లీ! కలువపూవుల వికసనమునందు శత్రుత్వాన్ని ప్రకటిస్తూ, మన్మథమహారాజు యొక్క సామ్రాజ్య లక్ష్మిని వ్యాఖ్యానిస్తూ; నియమవంతులైన విరాగుల (సంసార) బంధాలను తెంపివేస్తూ దీక్షాబద్ధాలైన నీ దయతో కూడిన కంటికొసలనుండి ప్రసరించే చూపులు మా కోర్కెలను నెరవేర్చు గాక!

శ్లోII  కాలాంభోదే శశిరుచిదళం కైతకం దర్శయంతీ

మధ్యేసౌదామిని మధులిహాం మాలికాం రాజయంతీ

హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీ

కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీః II 67 II

సీII  శిఖకాలమేఘాన చిన్ని చంద్రునిఁ బోలు మొగలి పూ రేకును ముడిచి చూపు,

చిరునవ్వు మెఱుపులన్ విరితేనెమేపరు లనుబోలు చూపులన్ ఘనత నిలుపు,

వికసిత ముఖపద్మ మొకహంసగీతమున్ వెలుగొందగా జేయు విపులసరణి,

కంపానదీతీర కారుణ్యలక్ష్మియై యొక కాంతి పుంజంబు ప్రకృతిజనని

తే.గీ.II  కూర్మితోఁ జూచి భక్తుల కోర్కె తీర్చ

భాసిలుచునుండె కృపతోడ వాసిగాను,

కంచి కామాక్షి మాయమ్మ కనికరమున

నన్ను కృపఁజూచి కాచుత నయము తలర.

తాII కారుమబ్బులో చంద్రకాంతిమొలకవంటి మొగలిపూరేకును (చంద్రరేఖను సిగలో) ధరించి చూపునది; మెరుపుతీగ మధ్యలో తుమ్మెదల వరుసను ప్రకాశింపజేసినది (నవ్వులలో కలసిన నల్లని కటాక్షప్రసారాలు) వికసించిన కమలంలో హంసధ్వనిని వెలుగొందజేయునది (వదనంలో నుండి మధురధ్వనులు) అయిన వినూత్నమైన ఒకానొక దయాసంపదలరాశి, కంపాతీరంలో ప్రకాశిస్తున్నది.

శ్లోII  చిత్రం చిత్రం నిజమృదుతయా భర్త్సయన్ పల్లవాలీం

పుంసాం కామాన్ భువి చ నియతం పూరయన్ పుణ్యభాజాం

జాతః శైలాన్న తు జలనిధేః స్వైరసంచారశీలః

కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మే II 68 II

తే.గీ.II  చిగురుటాకులఁ జడిపించు ద్యుతితనువున,

ధర సుకృతులకు సుఫలముల్ దయనొసంగు,

జలజ కాని చింతామణి చట్టు పట్టి, 

శుభములనుగొల్పుచున్ మాకు నభయమిడుత.

తాII తన శరీరపు మెత్తదనంచేత చిగురుటాకులను బెదరగొడుతూ, పుణ్యాత్ములైనవారి కోర్కెలను నియమబద్ధంగా భూలోకంలోనే ఫలింపజేస్తూ, సముద్రంనుండి కాక పర్వతంనుండి పుట్టినదై, స్వేచ్ఛావిహారంచేస్తూ కాంచీనగరంలో అలంకారంగా నెలకొని ఉన్న ఒకానొక వింతయైన చింతామణి మాకు శుభాలను కల్గించుగాక!

16 – 3 – 2024.

శ్లోII  తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూకపుష్పం

తస్మన్ మల్లీకుసుమసుషమాం తత్ర వీణానినాదం

వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యాం

ఐశానీ సా కలయతితరాం ఐంద్రజాలం విలాసం II 69 II

సీII  జలదనికటమందు తామ్రాంబుజములును, దానిలో మంకెన, దానియందు

మల్లికాకుసుమంపు మహితమౌ కాంతియు, నక్కడవీణను చక్కగాను

ధ్వనియింపఁ జేయుచు, ఘనుడైన గణనాథు జనకుని సత్కార్య చయ తరంగ

ఫలితమై కామాక్షి మహనీయమైనట్టి యావిష్కృతంబయ్యె ననుపమముగ,

తే.గీ.II  అట్టి కామాక్షి మము నిలఁబెట్టునట్టి

దిట్ట, నేనామె పాదముల్ పట్టి విడువ,

ననుపమంబుగ నాలోననలరు జనని

నిత్యమంగళదాయియై నిలుపు నన్ను.

తాII మేఘాల దగ్గర ఎర్రటి కమలాలు (కళ్ళు) ఉన్నాయి (జుట్టు తాళాలు). దాని దగ్గరే ఎర్రటి మందార పువ్వులు (పెదవులు) ఉన్నాయి. ఆ మందార పువ్వుల లోపల మల్లె మొగ్గలు (పళ్ళు) ఉంటాయి. వీణ యొక్క మధురమైన సంగీతం ఉంది. ఈ మాయాజాలం అంతా కంచిలో నివసించే  శివుని సత్కార్యాల తరంగాల ఫలితమైన  కామాక్షి ద్వారా ఆవిష్కరించబడింది.

17 – 3 – 2024.

శ్లోII  ఆహారాంశం త్రిదశ సదసాం ఆశ్రయే చాతకానాం

ఆకాశోపర్యపి చ కలయన్ ఆలయం తుంగమేషాం

కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం

మందస్మేరో మదననిగమ ప్రక్రియా సంప్రదాయః II 70 II

సీII  చాతకంబులకును చక్కని నిలయమున్ దివ్యులకును భుక్తి భవ్యరీతి

నిత్యమొసగునట్టి నిరుపమ శశితాల్పు, గగనసౌధద్వయ మగణితముగ

గలిగిన కుచభర, కౌనుశూన్యపుదేహ, కవులకు సురగవి, కమల నయన,

మందహాసాంచితమహనీయ ముఖపద్మ, మదనవేదపుసార సదయహృదయ,

తే.గీ.II  కంపతీరాన కామాక్షి యింపుతోడ

భక్తజనులను కాచెడి భవ్య హృదయ

వెలుగుచున్నది గొప్పగా, ప్రీతితోడ

సేవ చేసెద నాతల్లి చిత్తమలర.

తాII చాతక పక్షులకు ఆశ్రయమైన మబ్బులో దేవతల ఆహారభాగాన్ని కల్పించటం (మబ్బువంటి నీలమైన తలకట్టులో చంద్రుడు), ఆకాశంపై భాగానకూడ ఎత్తైన భవనాన్ని కలిగి ఉండటం (సన్నని నడుముపై ఉన్నత కుచమండలం) కవులకు కామధేనువు, సన్నని చిరునవ్వు- ఇట్టివి కలిగి ఉన్న మన్మథ వేదప్రక్రియాసంప్రదాయము- కంపాతీరంలో విహరిస్తున్నది.


శ్లోII  ఆర్ద్రీభూతైరవిరలకృపైః ఆత్తలీలావిలాసైః

ఆస్థా పూర్ణైరధిక చపలైః అంచితాంభోజ శిల్పైః

కాంతైర్లక్ష్మీ లలితభవనైః కాంతికైవల్యసారైః

కాశ్మల్యం నః కబలయతు సా కామకోటీ కటాక్షైః II 71 II

సీII  ఆర్ద్రమై యుండెడి యవిరళకృపనొప్పి, లీలావిలాసాలఁ దేలియాడు,

వాంఛాప్రపూర్ణముల్, వరలవొక్కయెదనె, ఘనమౌచునొప్పెడి కమలసృష్టి,

అమ్మవౌ కనుపాపలాకర్షణీయమౌ నిలయముల్, కామారి కలల పంట,

గణనీయ మహితప్రకాశస్వరూప సత్ సారముల్, వేదాంత సారములును,

తే.గీ.II  అట్టి మహనీయమైనట్టి పట్టుఁ గలుగు

దివ్యమైనట్టి చూపులు దీనులమగు

మాదు మదులందు నెలకొన్న మలినములను

మ్రింగివేయుత, మాకు సన్మంగళమిడ.

తాII అమ్మవి దయగల చూపులు దయారసంతో తడిసినట్టివి, మనోహరమైన విలాసాలుకలవి, వాంఛాప్రపూర్ణాలు, ఒకచోటనే ఉండనట్టివి, గొప్పనైన కమలముల యొక్క సృష్టి విశేషాలు, సంపదలకు ఆకర్షణీయమైన నిలయాలును,  కేవల ప్రకాశస్వరూపసారాలు.  అట్టి శ్రీకామకోటీ అమ్మవారి చూపులు మాలోని మాలిన్యాన్ని మ్రింగివేయుగాక.

శ్లోII  ఆధూన్వంత్యై తరల నయనైః ఆంగజీం వైజయంతీం

ఆనందిన్యై నిజపదజుషాం ఆత్త కాంచీపురాయై

ఆస్మాకీనం హృదయమఖిలైః ఆగమానాం ప్రపంచైః

ఆరాధ్యాయై స్పృహయతితరాం ఆదిమాయై జనన్యై II 72 II

చంII  సుమశరుకేతనమ్మెగుర శోభిల వేయుచు కంటి చూపులన్,

ప్రముదమునన్ భజించు వర భక్తులకున్ బరితోషమిచ్చుచున్,

సుమధుర సేవలందు నుత సుందర వేదములందు నిల్చి సే

మము నిడు కంచికాపురి ప్రమాణమహేశ్వరికంజలించెదన్.

తాII మన్మథపతాకాన్ని తన చలించే చూపులతో ఎగురవేస్తూ,  తన పాదము లాశ్రయించిన వారిని ఆనందింపజేస్తూ, అఖిల వేద శాక్తాగమాలలో ప్రబంధింపబడి ఆరాధింపబడుచున్నదై, తల్లులకే తల్లియై కాంచీపురంలో నెలకొన్న కామాక్షీదేవిపట్ల నా మనసు ఆనందంప్రకటిస్తున్నది.

శ్లోII  దూరం వాచాం త్రిదశసదసాం దుఃఖసింధోస్తరిత్రం

మోహక్ష్వే లక్షితిరుహవనే క్రూరధారం కుఠారమ్

కంపాతీర ప్రణయి కవిభిః వర్ణితోద్యచ్చరిత్రం

శాంత్యై సేవే సకలవిపదాం శాంకరం తత్కలత్రం II 73 II

తే.గీ.II  దేవ నుతులకునందదు, నావ గాను

దుఃఖ జలధిదాటించు, దురిత మోహ

వనకుఠారము, కవినుత ఘన సుచరిత,

కంచి శివునాలి నెంచెద కావ నన్ను.

తాII దేవతాస్తుతుల కందనిది, దుఃఖసాగరము దాటుటకు ఓడయైనది మోహమనెడి విషవృక్షముల అడవికి బదునైన గండ్రగొడ్డలియైనదియునై కవులచే స్తుతింపబడు చరి త్రగలదియై కంపాతీరమున విహరించు చంద్రశేఖరకళత్రమును సకలవిపత్ప్రశాంతికై సేవించెదను.

శ్లోII  ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ-

శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశన్తీ

తుండీరాఖ్యై మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రీ

చండీ దేవీ కలయతి రతిం చంద్రచూడాలచూడే II 74 II

తే.గీ.II  ప్రకృతిసిద్ధ మాలిన్యమున్ బరగ తుడిచి,

ఆశ్రితులప్రజ్ఞ పెంచుచు, ననుపమ శశి

రేఖఁ శిరమునఁ దాల్చి, తా శ్రీకరమగు

చండి స్వర్ణము కురిపించు తుండిరమున.

తాII ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న మాలిన్యాన్ని ఖండించివేస్తూ, తన పాదాలనాశ్రయించినవారికి ఏమరుపాటులేని ప్రజ్ఞావికాసాన్ని కలిగిస్తూ, చంద్రవంకను శిరోమణిగా ధరించి చండీదేవి స్వరూపిణియై బంగారు వర్షాన్ని కురిపిస్తూ- తుండీర మండలం (కాంచి)లో మాకు ఆనందాన్ని కల్గిస్తున్నది.

శ్లోII  యేన ఖ్యాతో భవతి స గృహీ పూరుషో మేరుధన్వా

యద్దృక్కోణే మదననిగమ ప్రాభవం బోభవీతి

యత్ ప్రీత్యైవ త్రిజగదధిపో జృంభతే కింపచానః

కంపాతీరే స జయతి మహాన్ కశ్చిదోజో విశేషః II 75 II

సీII  శివుఁడు గృహస్తుగా చిత్తంబు పొంగార నయ్యె నే జననిచేననుపమముగ,

నేతల్లి క్రీగంటి యెనలేని చూపులు కామదేవునిలోని ప్రేమఁ బెంచు,

నేశక్తి కృపచేత భాసించె భిక్షువు ముల్లోకములనేలు ముఖ్యుఁడగుచు,

కంపా సమీపాన గలిగిన యా దివ్య జనని కామాక్షికి జయము జయము, 

తే.గీ.II  భక్తజనపాళి కెన్నగా భాగ్యరాశి,

దేవతాతతిన్ రక్షించు దివ్యశక్తి, 

కవులవాఙ్నిధి యైనట్టి కల్పవల్లి,

మోక్షమొసగుచు నాకు సంరక్షఁ గొలుపు.

తాII ఎవరి వల్ల శివుడు గృహస్థుడిగా ప్రసిద్ది చెందాడో, ఎవరి ప్రక్క చూపులు కామదేవుని ప్రేమలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయో, ఎవరి అనుగ్రహం వల్ల (మానవ పుర్రెతో కూడిన భిక్షాపాత్రతో) భిక్షాటన చేసే శివుడు ఈ ముగ్గురికీ ప్రభువుగా అధికారం పొందాడు. కంపా నది ఒడ్డున ఉండే ఆ ప్రకాశవంతమైన దయాశక్తికి విజయం.

శ్లోII  ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి యన్మే

నింద్యాం భింద్యాత్ సపది జడతాం కల్మషాదున్మిషంతీం

సాధ్వీ మాధ్వీరసమధురతా భంజినీ మంజురీతిః

వాణీవేణీ ఝటితి వృణుతాత్ స్వర్ధునీ స్పర్ధినీ మామ్ II 76 II

సీII  ధరణి నా వాగ్గతి ధన్యమో? కాక యధన్యమగునొ? యనన్ ధన్యమనుదు,

పాపంబునుండి తా పనిపడి వికసించు జాడ్యమ్ము నేసాధ్వి సరిగ చూచి

తొలగించు? ననినచో పులకితాంగుడనయి పరమ బ్రహ్మ జనని నిరుపమముగ

తొలగించునందును, సులలిత మధురమౌ తీయతేనియ మించు దివ్యగతిని

తే.గీ.II  స్వర్గ గంగాఝరిన్ మించి సరసమైన

వాఙ్నిధియె నన్ను వరియించి వరలఁ జేయు

నమ్మ కామాక్షి కరుణను నెమ్మితోడ,

వందనమ్ములు చేయుదున్ భక్తితోడ.

తాII అమ్మా! కామాక్షీదేవీ, నా వాక్కులగతి ధన్యమా, అధన్యమా, అను ప్రశ్నకు అతి ధన్యమని నా యుత్తరము. ఎవతె పాపమునుండి వికసించు నింద్యమైన జాడ్యమును తొలగించునను ప్రశ్నకు పరబ్రహ్మస్వరూపిణి అనియే నా యుత్తరము. తేనె తీపిని భంజించు అందమైన రీతిగల ఆకాశగంగతో పోటీపడు వాఙ్నిధి నన్ను వరించుగాక!

శ్లోII  యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజాం

యస్యాః పీఠీ సతతశిశిరా శీకరైర్మాకరందైః

యస్యాః పేటీ శృతి పరిచలన్ మౌళిరత్నస్య కాంచీ

సా మే సోమాభరణ మహిషీ సాధయేత్కాంక్షితాని II 77 II

సీII  ఎవతెకు యోగుల హృదయంపుకమలంబులగు పుష్పములవాటికగను తలప?, 

నెవతె పీఠము దల్ప స్తవనీయమగు తేనె చినుకులన్ జల్లనై జెలఁగుచుండు?

నెవతెకు వేదాల నెప్పుడున్ దిరిగెడి మౌళిరత్నపుపెట్టె మాననీయ

కంచినగరమగున్?గమనీయమైనట్టి కరుణాకటాక్షుండు గరళగళుని

తే.గీ.II  మహిషి యాయమ్మ కామాక్షి, మహిని కృపను

నాదు మదిలోన నెలకొన్న శ్రీదమయిన

కోరికల్ తీర్చి కుశలంబు కొలుపు గాక,

యట్టి కామాక్షిపదములకంజలింతు.

తాII ఎవతెకు యోగుల హృదయకమలమే పుష్పవాటికయో, ఎవతెయొక్క పీఠము మకరందపు చినుకులతో చల్లనై యుండునో, ఎవతెకు వేదములలో తిరుగు మౌళి

రత్నము యొక్క పెట్టె కాంచీనగరమో, ఆ సోమశేఖరుని మహిషి నా కోరికల దీర్చు గాక!

18 – 3 – 2024.

శ్లోII  ఏకా మాతా సకలజగతామేయుషీ ధ్యానముద్రాం

ఏకామ్రాధీశ్వర చరణయోః ఏకతానాం సమింధే

తాటంకోద్యన్మణిగణరుచా తామ్రకర్ణప్రదేశా

తారుణ్యశ్రీ స్తబకితతనుః తాపసీ కాపి బాలా II 78 II

సీII  ఏకామ్రనాథీశు శ్రీకరపదసుమ ధ్యానభంగిమనున్నధన్యురాలు,

సకలభువనమాత ముకుళితవరహస్త, చిత్తమేకాగ్రతన్ జెలఁగనుండి,

తాటంకమణిజన్య తామ్రవర్ణము చెవి భాగంబులెఱ్ఱగా వరలఁ జేయ,

యౌవన సంపదనలరుపూగుత్తుల సొగసుతోనొప్పెడి యగణితముగ

తే.గీ.II  బాల యొక్కతె కంచిని వరలుచుండె

ఘోర తపమును జేయుచున్ గూర్మితోడ,

కంచికామాక్షి యాయమ్మ కరుణతోడ

కేలుమోడ్చెడి నన్ను రక్షించుగాక.

తాII ఏకామ్రేశ్వరుని పాద పద్మాలపై ధ్యాన భంగిమలో ఉన్న ఒక యువకురాలు, తేజోవంతమైన నవ యవ్వనంతో, ఆమె రత్నాలు పొదిగిన చెవి ఆభరణాల  నుండి తేజస్సుతో, ఆమె చెవుల చుట్టూ ఎర్రటి ఛాయతో, తపస్సు చేస్తోంది. 

శ్లోII  దంతాదంతిప్రకటనకరీ దంతిభిర్మందయానైః

మందారాణాం మదపరిణతిం మథ్నతీ మందహాసైః

అంకూరాభ్యాం మనసిజతరోః అంకితోరాః కుచాభ్యాం

అంతః కాంచి స్ఫురతి జగతాం ఆదిమా కాపి మాతా II 79 II

సీII  మందగమనమున మదపుటేనుగుతోడ యుద్ధంబు ప్రకటించు యోధురాలు, 

మందారపూల యమంద గర్వంబునే మందహాసంబున మాయఁ జేయు,

నలకామదేవ భూజాంకురము, కుచాంకితోరమ్మయిన యట్టి చారుశీల,

లోకమ్ములకునొక్క లోకేశ్వరిగనొప్పుశ్రీకరమైనట్టి చిద్విభాస,

తే.గీ.II  కంచిలోనొక్క దేవత కాంక్షితముల

నెల్ల భక్తులకును దీర్చ నుల్ల మలర

నొప్పి యున్నది సృష్టికే గొప్పగాను,

శివుని యర్థాంగి కామాక్షి, భవముబాప.

తాII తన నిదానమైన మనోహరమైన నడకతో ఏనుగును అధిగమించేటువంటి, మందార పువ్వుల అహంకారాన్నిచూర్ణం చేసే ప్రకాశవంతమైన చిరునవ్వు కలిగినటువంటి, కామదేవ వృక్షం నుండి మొలకెత్తిన మొలకలను పోలినటువంటి, అన్ని లోకాల పురాతన తల్లి కంచిలో ప్రకాశిస్తుంది.

శ్లోII  త్రియంబకకుటుంబినీం త్రిపురసుందరీం ఇందిరాం

పుళిందపతిసుందరీం త్రిపురభైరవీం భారతీం

మతంగకులనాయికాం మహిషమర్దనీం మాతృకాం

భణంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే II 80 II

సీII  త్రిపురసుందరి తల్లి, త్రిపురభైరవి, త్ర్యంబ కకుటుంబినియు, మాతృకయును మరియు, 

యిందిర, మాతంగి, యిలపుళిందపతికి రాజ్ఞియు, మహిషమ ర్దనిగ, భార

తిగ, కంచిలో మాకు తగు మేలు చేయంగఁ గలుగు కామాక్షి! మా కల్పవల్లి! 

విబుధ వరులు నిన్ను వివిధరీతులతోడ ప్రీతిని బిల్చుచు ఖ్యాతిగాను

తే.గీ.II  సేవలందింతురమ్మవిశేషముగను!

నేనునున్ నిన్ను మదినెంచి నిత్యమిట్లు

గొలుచుచుంటిని, నన్ జూచి పలుకవమ్మ!

పలుకులిమ్ము నిన్ స్తుతి చేయఁ బరవసించి.

తాII ఓ కామాక్షీ! త్రియంబకుటుంబినియని, త్రిపురసుందరియని, ఇందిరయని, పుళిందనాథసుందరి యని, త్రిపురభైరవియని, భారతియని, మతంగకులనాయికయని, (మాతంగి) మహిషాసుర మర్దినియని, మాతృకయని ('అ' కారాది 'క్ష' కారాంత వర్ణమాలామంత్రరూపిణి అని), నీ విహృతినే యనఁగా నీ అవతారవిహారవిశేషములనే విబుధవరులు పలువిధములుగ బేర్కొనుచుందురు.


శ్లోII  మహామునిమనోనటీ మహితరమ్య కంపాతటీ

కుటీరకవిహారిణీ కుటిలబోధసంహారిణీ

సదా భవతు కామినీ సకలదేహినాం స్వామినీ

కృపాతిశయకింకరీ మమ విభూతయే శాంకరీ II 81 II

సీII  మునిమనోనటి, వక్రబోధసంహారిణి, సకలదేహులకును స్వామినియును,

ఘనమైన వినుతమౌ కంపాతటీ కుటీరక విహారిణియునౌ రమ్యనదియు,

దివ్యమయిన కృపాతిశయ కింకరి శాంకరి విభూతి, కలలపంట,

యగు గాక సతత మీ నగరాజ సత్పుత్రి, జగతిని నడిపించు నయనిధాన,

తే.గీ.II  జయము, జయమమ్మ జగదంబ! జయము నీకు,

భయము మా లోనఁ బోఁగొట్టి నియతితోడ

మెలఁగుమార్గాన నడుపుమా మేలుగనగ,

సకలసద్గుణ శుభమణీ! శంభురాణి!

తాII మునుల మనోరంగములందు నటించు నర్తకి, కంపాతటీకుటీరముల విహరించు నది, కుటిలబోధమును (అజ్ఞానమును) హరించునది, సకలశరీరులకు స్వామినియగు భామిని కృపావిశేషమునకు గింకరి కృపకు లోబడు తల్లియునగు శాంకరి మా సకలవిభూతులకు హేతువగుగాక. 

శ్లోII  జడాః ప్రకృతినిర్ధనాః జనవిలోచనారుంతుదాః

నరా జనని వీక్షణం క్షణమవాప్య కామాక్షి తే

వచస్సు మధుమాధురీం ప్రకటయంతి పౌరందరీ-

విభూతిషు విడంబనాం వపుషి మాన్మథీం ప్రక్రియాం II 82 II

తే.గీ.II  అమ్మ! కామాక్షి! నీకటాక్షమ్ములున్న

జడుఁడు తీయగా పల్కెడి జాణ యగును,

పేద దేవేంద్రవైభవోపేతుఁడగును,

రూపహీనుఁడు మన్మథరూపుఁడగును.

తాII అమ్మా కామాక్షీ! నీ కటాక్ష పాత్రులయిన జడులుకూడ తేనియలతీపి గల మాటలు గలవారయ్యెదరు. ఆగర్భదరిద్రులు దేవేందైశ్వర్యసంపన్నులు కాగలరు. కురూపులు నవమన్మధ సుందరులయి విలసిల్లుదురు.

శ్లోII  ఘనస్తనతట స్ఫుటస్ఫురిత కంచులీ చంచలీ

కృతత్రిపురశాసనా సుజనశీలితోపాసనా

దృశోః సరణిమశ్నుతే మమ కదా ను కాంచీపురే

పరా పరమయోగినాం మనసి చిత్కలా పుష్కలా II 83 II

సీII  స్తనసుందరత్వమున్ గనఁ జేయు కంచుక ధారియై శివుని చిత్తము రగిల్చి,

భక్తులచేత నుపాసింబడునది, సర్వోత్తమంబౌ ప్రశస్తికలది,

పరమయోగులయొక్క పావన హృదయాలలోనుండునట్టి విలోలనయన,

పూర్ణస్వరూపిణి, మునిజన సేవిత, భోగభాగ్యములిచ్చు పూవుబోడి,

తే.గీ.II  పూర్ణమైనట్టి కామాక్షి పూజ్య జనని,

కంచి పురమున వెలిగెడి కల్పవల్లి,

నాదు కనులకునెప్పుడు నయము కదుర

దర్శనం బిడునో కదాతనివితీర?

తాII స్తనసౌందర్యాన్ని ప్రకాశింపజేసే కంచుకమును ధరించి త్రిపుర శాసనుడైన శివుని చంచలింపజేసినది, సుజనులచే ఉపాసింపబడునది, సర్వోత్తరయైనది (పరా), పరమయోగుల హృదయాలలో వెలిగెడు చైతన్యకళ, పూర్ణరూపిణియైన తల్లి, కాంచీపురము నందు నా కనులకెప్పుడు దర్శనమిచ్చునో కదా!

శ్లోII  కవీంద్రహృదయేచరీ పరిగృహీత కాంచీపురీ

నిరూఢకరుణాఝరీ నిఖిలలోకరక్షాకరీ

మనః పథదవీయసీ మదనశాసనప్రేయసీ

మహాగుణగరీయసీ మమ దృశోస్తు నేదీయసీ II 84 II

తే.గీ.II  కవుల మదులందుఁ జరియించు కంచి నిలయ,

కరుణ రస ఝరి, లోకరక్షణ చణయును,

గుణ గరీయసి, శివపత్ని, ఘన సుహృదయ

మార్గమునకు దవ్వైనది, మమ్ముగనుత.

తాII కవీంద్రులహృదయమందు జరించునది, కాంచీపురిని జేరియుండునది, ప్రఖ్యాత కరుణారస నిర్ఘరియై సర్వలోకరక్షణమాచరించునది, మహాగుణగరీయసియు, మదన వైరి ప్రేయసియు, మనోమార్గమునకు దవ్వయినదియు నగు తల్లి నా చూపులకు దారసిల్లు గాక.

19 – 3 – 2024.

శ్లోII  ధనేన న రమామహే ఖలజనాన్న సేవామహే

న చాపలమయామహే భవభయాన్న దూయామహే

స్థిరాం తనుమహేతరాం మనసి కిం చ కాంచీరత-

స్మరాంతకకుటుంబినీ చరణ పల్లవోపాసనాం II 85 II

చంII  ధనమును చూచి పొంగ మిక ధాత్రిని దుష్టులసేవ చేయ, మెం

దును చపలత్వ మొంద మిల దుష్టభవంబన భీతి చెంద మీ

శుని వర కంచి వాస సతి శుభ్రపదద్వయపల్లవంబులన్

బ్రణవముగాఁ దలంచుచు నుపాసన చేసెదమెల్లవేళలన్.

తాII ధనమునకు పొంగము, దుష్టులసేవింపము, చపలత్వము నొందము, భవభయమునం బరితపింపము, మఱి కాంచీవిహారకుతూహలినియైన పురవైరి యిల్లాలి చరణపల్లవముల యుపాసనను మనసునందు సుస్తిర మొనరించుకొందుము.

శ్లోII  సురాః పరిజనా వపుర్మనసిజాయ వైరాయతే

త్రివిష్టపనితంబినీ కుచతటీ చ కేళీగిరిః

గిరః సురభయో వయః తరుణిమా దరిద్రస్య వా

కటాక్షసరణౌ క్షణం నిపతితస్య కామాక్షి తే II 86 II

శాII  అమ్మా! నీ కను చూపు సోకిననె పేదైనన్ రమానాథుఁడౌన్,

నెమ్మిన్ దేవతలెల్ల సేవకులగున్, నిత్యస్మరోత్తేజుఁడౌన్,

మిన్నౌదేవనితంబినీ కుచగిరుల్ నిత్యంబు కేళీగిరుల్,

క్రన్నన్ వానికి నౌను, వాఙ్మియగుచున్ బ్రాయుండగున్ నిత్యమున్. 

తాII కామాక్షీ! ఎవడు నీ ప్రక్క చూపుల బాటలో పడుతాడో, అతడు మిక్కిలి దరిద్రుడైనప్పటికీ, అతనికి దేవతలు సేవకులుగా మారతారు,  అతడు తన దేహపు  సొగసులో కామదేవుని మించినవాడు , మూడు లోకములలో అతి సుందరమైన దేవకాంతల యొక్క వక్షస్థలము అతని క్రీడా గిరులు అగును, అతని పదాలు మధురమైన వాసన మరియు అతని వయస్సు శాశ్వతమైన యవ్వనము. 

శ్లోII  పవిత్రయ జగత్రయీ విబుధబోధ జీవాతుభిః 

పురత్రయవిమర్దినః పులక కంచులీదాయిభిః

భవక్షయవిచక్షణైః వ్యసనమోక్షణైర్వీక్షణైః

నిరక్షరశిరోమణిం కరుణయైవ కామాక్షి మాం II 87 II

మII  త్రిజగత్ పండిత జ్ఞానమూలమగు సద్దివ్యౌషధంబున్, జగ

ద్విజితానంగుని మేని బుల్కలకు భావింపన్ గారణంబున్, సదా

సుజనాళిన్ భవబంధబాహ్యులుగ సత్ శోభన్ గృపన్ జేయుచున్

నిజశక్తిన్ వ్యసనాళిఁ బాపు పదముల్ నీవమ్మ! కామేశ్వరీ!

తాII ఓ కామాక్షీ! ముల్లోక పండితుల జ్ఞానమునకు జీవనౌషధములు, పరమశివు నెమ్మేను పులకరింపజేయునవి, సంసారమును క్షయింపజేయు విచక్షణగలవి, వ్యసనములను విడి పింపజేయునవి అయిన నీ చూపులచే దయతో నిరక్షరశిరోమణి

యైన నన్ను బవిత్రుని జేయుము.

శ్లోII  కదా కలితఖేలనాః కరుణయైవ కాంచీపురే

కలాయముకులత్విషః శుభకదంబ పూర్ణాంకురాః

పయోధరభరాలసాః కవిజనేషు తే బంధురాః

పచేలిమకృపారసాః పరిపతంతి మార్గే దృశోః II 88 II

తే.గీ.II  కంచిలోపలఁ గరుణఁ గ్రీడించునవియు,

శింశుపపుకాంతిఁ గలిగి భాసించునట్టి,

శుభకదంబపూర్ణాంకుర శోభనొప్పి,

స్తనభరాలస, కవిబంధ సదయదృష్టి

యెపుడుపరతువో నాపైన నీశురాణి! 

తాII కాంచీపురమున గరుణతో క్రీడించునవి, కళాయకుసుమ (ఇఱుగుడుపువ్వుచే) కాంతి నింపైనవి, శుభములనెడి కడిమితరువులచీరు మొలకలయినవి, కుచభరముచే నల సము లైనవి, కవిజనులయందు పరిపూర్ణములైనవియు, నగు పరిపక్వకృపారసములు నా యం దెపుడు గురియునో కదా' !

శ్లోII  అశోధ్యమచలోద్భవం హృదయనందనం దేహినాం

అనర్ఘమధికాంచి తత్ కిమపి రత్నముద్ ద్యోతతే

అనేన సమలంకృతా జయతి శంకరాంకస్థలీ

కదాస్య మమ మానసం వ్రజతి పేటికావిభ్రమం II 89 II

తే.గీ.II  కన నశోధ్య మచలజము, మనసు పొంగఁ

జేయు దేహులకు నిల కంచి నిలయయున

నర్ఘరత్నమ్ము, భవునొడినమరి శోభ

గొలుపు, దానిపై  నామది నిలుచునెపుడొ?

తాII శోధ్యము కానిది, కొండనుండి పుట్టినది, ప్రాణుల హృదయుము నానందింప జేయునది, వెల కట్టలేనిది, కాంచీనగరమందున్నట్టిదియునైన, ఆ రత్నము (అమ్మవారు) ప్రకాశించుచున్నది. శివుని యొడి ఈ రత్నముచే అలంకరింపబడి సర్వోత్కర్షముగా వర్ధిలుచున్నది. ఈ రత్నమునకు నా మనసెప్పుడు పెట్టెగా నుండునో.

శ్లోII  పరామృతఝరీప్లుతా జయతి నిత్యమంతశ్చరీ 

భువామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా

మహద్భిరపరోక్షితా సతతమేవ కాంచీపురే

మమాన్వహమహంమతిః మనసి భాతు మాహేశ్వరీ II 90 II

తే.గీ.II  పర సుధా ఝరీ ప్లుతయును, వరలు జ్ఞాన

రూప, జీవులకు బయటన్ లోపలఁ గల,

యాత్మ, కంచి నొప్పుచు, మహితాత్ములకును

కంటబడు తల్లి, నాలోనఁ గలుగుగాక. 

తాII పరమజ్ఞానైకరూపిణియై, పరమానందామృత ప్రవాహపరిప్లుతయై, జీవుల లోపలను వెలుపలను జరించునదై, కాంచీపురమున మహానుభావులచే దర్శింపఁబడునదై, యలరు పూర్ణాహంభావ స్వరూపిణియైన మహేశ్వరి నా మనసున దేవతగా భాసించుగాక !


శ్లోII  తమోవిపినధావినం సతతమేవ కాంచీపురే

విహారరసికా పరా పరమసంవిదుర్వీరుహే

కటాక్షనిగళైర్ధృఢం హృదయదుష్టదంతావలం

చిరం నయతు మామకం త్రిపురవైరి సీమంతినీ II 91 II

తే.గీ.II  ఘన తమోవిపినంబున మనగ తిరుగు

నాదు మదికరిన్ గామాక్షి! నీదు కామ

కోటి సుజ్ఞానమనియెడి రాటఁ నిలుప

నీ కటాక్షమన్ గొలుసుతో నీవె కట్టు.

తాII తమోగుణరూపమైన యడవిలో నురుకుచు పరుగులెత్తెడి నా హృదయమనెడి మదపుటేనుగును సాధనతో మళ్ళించి మచ్చికచేసి కాంచీవిహారకౌతుకముగొన్న పరమ శివుని రాణివాసము (కామాక్షి ) పరమార్థజ్ఞానరూపమైన చెట్టునకు తన కటాక్షము అనెడి గొలుసులచే నంటగట్టుగాక !

శ్లోII  త్వమేవ సతి చండికా త్వమసి దేవి చాముండికా

త్వమేవ పరమాతృకా త్వమపి యోగినీరూపిణీ

త్వమేవ కిల శాంభవీ త్వమసి కామకోటీ జయా

త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే II 92 II

తే.గీ.II  నీవె చండిక, కామాక్షి! నీవె విజయ,

నీవె జయవు, శంభునిసతి, నీవె యోగి

ని, భువన జనని, చాముండ, నీవె కోర్కె

లకు ముగింపువు, సకలములకును నీవె.

తాII ఓ కామాక్షీ! నీవు చండికవి. నీవు చాముండికవి. నీవు దివ్యమాతవి. నువ్వు కూడాయోగినివి. నీవు శంభుని భార్యవి. నీవు కామకోటివి, కోరికలన్నింటికి అంతం. నీవు జయవి మరియు విజయవి. మూడు లోకాలు నీలోనే ఉన్నవి. ఇంక  చెప్పుట కేమున్నదమ్మా? 

శ్లోII  పరే జనని పార్వతి ప్రణతపాలిని ప్రాతిభ-

ప్రదాత్రి పరమేశ్వరీ త్రిజగదాశ్రితే శాశ్వతే

త్రియంబకకుటుంబినీ త్రిపదసంగిని త్రీక్షణే

త్రిశక్తిమయి వీక్షణం మయి నిధేహి కామాక్షి తే II 93 II

తే.గీ.II  పరశివా! త్రిలోచని! భక్తి ప్రణత సుజన

పాలినీ! త్రిశక్తిస్వరూపా! త్రియంబ

కేశ్వర కుటుంబినీ! దృష్టి కృపను పరుచు

నాపయిన్ వర కామాక్షి! పాపదూర!

తాII పరశివా! ఓ పార్వతీ! ప్రతిభాప్రదాత్రి! ప్రణతజనపాలిని! త్రిపదసంచారిణి! త్రిలోచని! త్ర్యంబకేశ్వరునికుటుంబిని! శక్తిత్రయస్వరూపిణి! కామాక్షీ! నీ కటాక్షములను నా పైని బ్రసరింపజేయగదమ్మా.

శ్లోII  మనోమధుకరోత్సవం విదధతీ మనీషాజుషాం

స్వయంప్రభవవైఖరీ విపినవీథికాలంబినీ

అహో శిశిరితా కృపామధురసేన కంపాతటే

చరాచరవిధాయినీ చలతి కాపి చిన్మంజరీ II 94 II

తే.గీ.II  సజ్జన హృదయ భృంగాళి సంతసమును

పెంచు చిన్మయ మంజరి పిత్ర్యమనగ

కృపను జలువలనించుచు ప్రపగ నిలిచె

వేదవేదికపై, సృష్టి ప్రీతి నడుప.

తాII సజ్జనుల మనసులనెడి తుమ్మెడల కానందము నించు నొక చిన్మయ పుష్పమం జరి కృపామధురిమచే జలువలనించుచు బ్రహ్మనుండి ప్రవృత్తములయిన వేదములనెడి వైఖరీ రూపమైన వేదికపై నిలిచి యీ చరాచరసృష్టిక ర్తియై చరించుచున్నది.

శ్లోII  కళావతి కలాభృతో ముకుటసీమ్ని లీలావతి

స్పృహావతి మహేశ్వరే భువనమోహనే భాస్వతి

ప్రభావతి రమే సదా మహితరూపశోభావతి

త్వరావతి పరే సతాం గురుకృపాంబుధారావతి II 95 II

సీII  మకుటమందున శశి మానితముగఁ గల్గి, లీలలన్ గలిగిన బాలవమ్మ!

పతిని ప్రేమగ చూచు ప్రభ గల తల్లివి, సుప్రకాశపు రూప శోభకలిగి,

త్వరగల, కృపయను నిరుపమ జలధార వరలగొల్పెదవీవు నిరుపమాన,

పరమునందెప్పుడున్ నిరుపమముగ నీదు ధ్యానంబునందుండి హాయికనుదు,

తే.గీ.II  కంచి కామాక్షి! ప్రోవ నీకన్ననెవరు

నాకు కలుగుదు రోయమ్మ? నయనిధాన!

వందనంబులు చేసెద నందుకొనుము,

జయము నీవని యనుటకు సాక్షి నీవె.

తాII కిరీటమున చంద్రుని గల, లీలలు గల, మహేశ్వరునియందు కోరిక గల, ప్రభ గల, ప్రకాశించు గొప్ప రూప శోభగల, త్వర గల, గొప్ప కృప యను జలధార గల పరము (అమ్మవారు) నందు ఎల్లప్పుడు రమించుచుండెదను.

శ్లోII  త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే

త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే

త్వయైవ ఖరకోపయా నయనపావకే హూయతే

త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే II 96 II

తే.గీ.II  జగతికంబవు నీచేత జగములొలయు,

కరుణకలిగిన నీచేత కావఁబడును

కంటిమంటచే హోమమే ఘనముగనగు,

నిత్యసత్యవౌ నీచేత నిత్యమగును.

తాII జగదంబవైన నీచే భువనము లుదయించుచున్నవి. కరుణారసార్ద్రంవైన నీచేత నవి

పాలింపబడుచున్నవి. తీవ్రకోపవైన నీచేత (వుహాకాళిచేత) నయనాగ్నిలో హోమము

చేయబడుచున్నవి. నిత్యసత్యవైన నీచేతనే యని నిత్యస్థితి నందుచున్నవి.

20 – 3 – 2024.

శ్లోII  చరాచరజగన్మయీం సకలహృన్మయీం చిన్మయీం

గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం

పరాపరమయీం సదా దశదిశాం నిశాహర్మయీం

పరాం సతతసన్మయీం మనసి చిన్మయీం శీలయే (కామకోటీం భజే) II 97 II

సీII  కదలని, కదులు సకలమునుండెడిదాన! అన్ని హృదయాలలోనున్నదాన!

జ్ఞానపూర్ణా! సతీ! కలుగు త్రిగుణపూర్ణ! ముల్లోకములనుండు తల్లివమ్మ,

రాత్రింబవళ్ళునున్ రాజిలు కామాక్షి!కన పరారూపవై కదలుతల్లి!

సత్తాస్వరూపమై సకలంబునందుండు సౌమ్యరూపిణివమ్మ సకల జనని!

తే.గీ.II పరమచైతన్య రూపిణీ! భక్తపాళి

కోర్కెలను తీర్చ కంచిలో కొలువు తీరి

పరమశివునకు మోదంబు నిరుపమముగ

కలుగఁజేసెడి తల్లి! నన్ గనికరించు.

తాII కదిలేవీ కదలనివన్నిటియందున్నదానా! సకలహృదయాలలో నిండినదానా! జ్ఞానముచేనిండినదానా! మూడుగుణాలలో నిండినదానా! ముల్లోకాలలో, రాత్రింబవళ్ళలో నిండియున్నదానా! పరారూపిణి! ఎల్లపుడు సత్తారూపమైనదానా! పరమచైతన్యరూపిణీ! సదానిన్ను విమర్శిస్తాను.

వి.వి. (అపరా– సరాగులచే పూజనందునది, పరాపరా-అటు పిమ్మటిదశ, పరా- విరాగులచే సేవింపబడునది.)

శ్లోII  జయ జగదంబికే హరకుటుంబిని వక్త్రరుచా

జితశరదంబుజే ఘనవిడంబిని కేశరుచా

పరమవలంబనం కురు సదా పరరూపధరే

మమ గతసంవిదో జడిమడంబర తాండవినః II 98 II

తే.గీ.II  లోక మాత!  శివుని పత్ని! శ్రీకరమగు

కనుల కాంతితోన శరత్తు కమలములను

గెలిచితివి, పరరూపిణీ! కేలుపట్టి

జడిమ డంబరమును బాపి నడుపు నన్ను.

తాII జగదంబా! శివుని ఇల్లాలా! కన్నులకాంతితో శరత్కాల కమలకాంతిని జయించినదానా! తలకట్టుకాంతితో మేఘకాంతిని క్రిందుచేసినదానా! పరరూపధారిణీ! జ్ఞానాన్ని కోల్పోయి, అజ్ఞానపు తాండవంగలిగిన నాకు ఎల్లప్పుడు గొప్పనైన చేయూతనిమ్ము తల్లీ! (దృశ్యమాన త్రిపుటీరూప ప్రపంచసృష్టికి ఆవల యున్నది- ‘పర’రూప)

శ్లోII  భువనజనని భూషాభూతచంద్రే నమస్తే

కలుషశమని కంపాతీరగేహే నమస్తే

నిఖిలనిగమవేద్యే నిత్యరూపే నమస్తే

పరశివమయి పాశచ్ఛేదహస్తే నమస్తే II 99 II

తే.గీ.II  లోకమాత! చంద్రవిభూష! నీకు నతులు,

సర్వవేదసువేద్యవు,  శాశ్వతవును, 

పరశివమయివి, మహిత కంపాతటస్థ!

పాశవిచ్ఛేదహస్తవు, పాపనాశ! 

తాII తా. లోకమాతా! చంద్రాభరణా! పాపహారిణీ! కంపాతీరగృహిణీ! సర్వవేదములచే తెలియదగినదానా! శాశ్వతరూపా! పరశివతత్త్వంతో నిండినదానా! పాశములను ఛేదించే హస్తములు కలదానా! నీకు నమస్కారము.

శ్లోII  క్వణత్కాంచీ కాంచీపుర మణివిపంచీ లయఝరీ-

శిరః కంపా కంపావసతిః అనుకంపాజలనిధిః

ఘనశ్యామా శ్యామా కఠినకుచ సీమా మనసి మే

మృగాక్షీ కామాక్షీ హరనటనసాక్షీ విహరతాత్ II 100 II

సీII ధ్వనిచేయు వడ్డాణమును గలతల్లివి, నుత మృగాక్షీ నీకు నతులు, గొనుము,

కాంచీపుర మణివిపంచిలయఝరికి తలయూపి మెచ్చెడి తరళనయన!

కంపానదీతీర కమనీయ వాసము కలిగిభక్తులఁ గాచు కల్పవల్లి!

అనుకంపసంద్రమా! ఘన కుచసీమ! యౌవనమధ్య! కామాక్షి! జీవమీవె,

తే.గీ.II  హరనటనసాక్షి పరికింపనమ్మ నీవు,

మేఘమును గేలు చేయు నీ మేని చాయ.

నాదు మదిలోన వసియించి నన్నుఁ గనుము,

బంధనంబులు బాపి నన్ వరలఁ గనుము.

తాII మ్రోగుచున్న మొలనూలు మణులచే ఒప్పుతూ, కాంచీపురంలోని మణుల వీణల వాద్యప్రవాహానికి మెచ్చుకోలుగా తల ఊపుదానవు, కంపానదీతీరవాసము కలిగిన దయాసముద్రానివి, మేఘమువలె నల్లనైన దానివి, శ్యామాదేవియు, కఠినమైన పాలిండ్లుకలతల్లివై, జింకకన్నులు కలదానివై, కామాక్షీ దేవివై, శివుని తాండవమునకు సాక్షివై ఉన్నతల్లీ, నా మనస్సులో విహరింతువుగాక!


శ్లోII  సమరవిజయకోటీ సాధకానందధాటీ

మృదుగుణపరిపేటీ ముఖ్యకాదంబవాటీ

మునినుతపరిపాటీ మోహితాజాండకోటీ

పరమశివవధూటీ పాతు మాం కామకోటీ II 101 II

మాలని.  సమర విజయ రూపా!సాధకానంద దీపా!

యమిత మృదు గుణాత్మా! ఆది కాదంబ వర్త్మా!

ప్రముద ముని శరణ్యా! బ్రహ్మకోటి ప్రగణ్యా!

ప్రమద శివుని భామా! పాహి కామాక్షి! హైమా!

తే.గీ.II  సమర విజయ వానందవా సాధకులకు,

మృదుగుణపుపేటివి, కదంబ సాధువాటి!

ముని నుత పరిపాటి వజాండ మోహితవును,

వర శివ వధూటి! నన్ను కాపాడుమమ్మ!

తాII యుద్ధాలలో విజయస్వరూపమా! సాధకులకు కలిగే తీవ్రానంద స్వరూపమా! మృదువైన గుణాల మణులపేటికా! కదంబవనాలనే ముఖ్యంగా గలదానా! మునులచే స్తుతింపబడుదానా! బ్రహ్మాండకోటులను మోహింపజేయుదానా! పరమశివుని ఇల్లాలా! కామకోటినిలయా! నన్ను రక్షించుతల్లీ!

శ్లోII  ఇమం పరవరప్రదం ప్రకృతిపేశలం పావనం

పరాపరచిదాకృతి ప్రకటన ప్రదీపాయితం

స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్ అంబికాం

జపైరలమలం మఖైః అధికదేహ సంశోషణైః II 102 II

తే.గీ.II  పరము మోక్షమ్ము వరముగా వరలనిచ్చు,

నుత పరాపరాకృని నెన్ని క్షితిని జూపు,

స్తుతిశతకపాఠనము చేయుచో కృశింపఁ

జేయు వ్రతముల పనియేమి? శ్రీకరమిది.

తాII పరమును మోక్షమును వరముగా ప్రసాదించునది, గొప్ప చిన్న జీవుల ఆకృతులకు స్వస్వరూపమును చూపించుటలో ప్రదీపమైన ఈ స్తుతిని పఠించినచో ఎక్కువగా దేహమును పీడించు జపములతో గాని యజ్ఞములతో గాని పనిలేదు.

21 – 3 – 2024.

II స్తుతి శతకం సంపూర్ణం II

కృతికర్త.  

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165


రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 

43) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ. 10 - 3 -2025 మరియు 11 - 3 - 2025.తేదీల మధ్యవిరచితము.

44) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)( ఏకదిన విరచితము) 20 – 4 – 2025.

45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)

46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.

స్వస్తి.

జైహింద్.