జైశ్రీరామ్.
రామకథోపనిషన్నవనీతం🌹
📍 అవధాన ప్రాచార్య , అభినవ మల్లినాథ ,పురాణ వాచస్పతి ,పద్యకళా తపస్వి ,
డా.ధూళిపాళ మహాదేవమణి.రాజమహేంద్రి.
************
📍"వేదః ప్రాచేతసాదాసీత్
సాక్షా ద్రామాయణాత్మనా"📍
అని వేదాల అవతరణం గూర్చి చెప్పారు వాల్మీకంలో.
వేదములచే తెలుసుకోదగిన పరమపురుషుడే దశరథ రామునిగా అవతరిస్తే అట్టి పరమాత్మను ఉట్టంకించే వేదమే రామాయణంగా అవతరించిందన్నారు.
వేద శబ్దానికి 1 "విద్యతే " అన్న వ్యుత్పత్తి లో సత్త అనీ , 2 "వేత్తి" అన్నవ్యుత్పత్తి లో జ్ఞానమనీ 3" విన్తే" అన్న ధాతు నిష్పత్తిలో విచారణ అనీ 4.విందతే , విందతి అన్ననిర్వచనాల్లో ప్రాప్తి లేక లాభము అనీ అర్థాలు ప్రసిద్ధాలు..వేదశబ్దానికున్న ఈ అర్థాలన్నీ రామాయణంలో అన్వయిస్తాయి.కనుక వేదం అంటే కర్మ జ్ఞాన సిద్ధాంతాలను బోధించే వాఙ్మయ సమాహారమని అర్థం.రామాయణం లో కర్మద్వారా బ్రహ్మమును చేరే మార్గం మనం పొందగలమని "సాక్షాద్రామాయణాత్మనా" అని చెప్పబడింది.సామాన్యులమైన మనకు ఇదే సులభ మార్గం.
ఆర్ష విద్యా నిష్ణాతులు శ్రీ దేవీ దాసుగారు మరో అడుగు ముందుకు వేస్తూ తమ ఈ గ్రంథానికి "రామాయణోపనిషత్" అని నామకరణం చేసి పాఠకులకు ఈగ్రంథ పఠనం వల్ల సాక్షాత్తుగా బ్రహ్మప్రాప్తి కలుగుతుందని భరోసా ఇస్తున్నారు. ఇంతకంటే మనకు కావలిసిందేముంది ? ఇలా సామాన్యులు అనలేరు.ఒక్కదేవీ దాసు గారే అనగలరు.
వారి పేరులోనే ఉంది ఆగొప్పతనం.పేరు అందరూ నిలబెట్టుకో లేరు పేరు.పేరు వల్ల మనకు కీర్తి కలగడం కాదు.మనమే పేరుకి పేరు తేవాలన్నది ఈకవి పరమేశ్వరుని ఆశయం.నిజంగా ధన్య జీవులు వీరు.
అమ్మవారి ప్రసాదంతో కవులకే ఆశ్చర్యం కలిగే
సత్కవనం తో మహాకవి అయ్యారు.
పరమేశ్వరుని యందు అనన్యమైన భక్తితో ఉపాసనతో పండితుల్లోనే మహావిద్వాంసులయ్యారు.
సంవత్సరానికి ఒక కృతికన్యను ఈవయస్సులో కూడా మనకు ప్రసాదిస్తున్నారు. ఇప్పటికే బహుకృతి సుకృతి వీరు.ఆర్షవాఙ్మయాంభోధిని ఆపోశన పట్టిన అగస్త్యులు వీరు. పద్యం ఎంత పగడ్బందీగా వ్రాయాలో అలావ్రాస్తారు.యువకవులు వీరి పద్యప్రౌఢిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఈగ్రంథానికి "ఉపనిషత్ " అని పేరుపెట్టడంలో ఔచిత్యాన్ని మనం ప్రశంసించాలి.
"ఉప + ని "అన్న ఉపసర్గలు పూర్వంగా ఉన్న "షద్ల్ " ధాతువుకు 3అర్థాలు.1విశరణము అనగా శిథిలంచేయడం.2.గతి .అనగా జ్ఞానం
3 ప్రత్యవసాదనం. అంటే నాశనంచేయడం.
ఇందు మొదటి అర్థంవల్ల సంసార పంకం లో కూరుకు పోకుండా జన్మపరంపను కత్తిరిస్తుంది.రెండవ దానివల్ల జన్మలు పోవడంతో ముక్తి జ్ఞానం కలుగుతుంది.3 వ.అర్థం వల్ల కర్మలన్నీ నశించి జీవన్ముక్తులౌతారు.
ఈ ఉపనిషదర్థం శ్రీ దేవీదాసుగారి ఈకృతిలో భాసిస్తూనే ఉంటుంది . దానికి అనుగుణంగానే పుస్తకం తెరిచిన వెంటనే " ఆనందవల్లి " అన్నశీర్షిక కనబడి ఉపనిషత్ ప్రాంగణంలో కి అడుగు పెడతాం.
ఆవెంటనే ఇద్దరు ఆధ్యాత్మిక విద్యా గురువుల్ని ఏకలక్ష్య భూతుల్ని చేసి మనకు అద్భుతంగా ఇలా అందించారు.
"📍ఒకటే తేజము రెండు రూపములతో
వ్యోస్థలిన్ వెల్గదే
ఒకటే లక్ష్యము రెండు మార్గములుగా
నుర్విన్ ప్రకాశింపదే
ప్రకటంబౌ గురులీ వశిష్ట వర విశ్వామిత్రు
లధ్యాత్మ బో
ధకు లానంద విహారు లార్యులు జగత్కళ్యాణ
సంధాతలున్ 📍3
ఇందులో ద్వైతం అద్వైతంగా ఎందుకోసం అవతరించిందో !స్పష్టంగా చెప్పారు. ఏ సిద్ధాంతం చూసినా మార్గాలు వేర్వేరు అయినా లక్ష్యం ఒక్కటే సుమా అని ఎంతో అందంగా ప్రకటించారు.
ఏస్థితి లోనైనా సాధన ఎలా ఉండాలో విశ్వామిత్రుణ్ణి మిషగా చేసి ఇలా చెప్పారు కవి.
📍కనులు మూసిన రాముడే కానిపించు
కనులు తెరచిన రాముడే కానిపించు
రాముడే లేని దేశ కాలంబు లేవొ
తెలియదంచు స్వప్నంబున తేలె మౌని📍55
అంతటా అన్ని అవస్థల్లోనూ బ్రహ్మనే దర్శించాలన్న ఉపనిషత్ సందేశమే ఇది.
నట్టడవిలోకి తనవెంటవచ్చి కటిక నేలపై పరుండిన రామలక్ష్మణుల ను చూసి ఆసౌందర్య పరానందంలో పరవశించిన విశ్వామిత్రుని స్థితి అది.
ఇలా పద్యరామాయణ ఉపనిషన్నవనీతాన్ని అందిస్తున్నారు దేవీదాస కవివరేణ్యులు.
ఈపద్యాలు రస హృదయంతో చదివి ఔపనిషదిక సారాన్ని అనుభవించాలి తప్ప ఒకటి రెండు పద్యాలు సూచించడం కాదు. చదివిన పాఠకులు విశ్వామిత్రుని లా ఆనందవల్లిని అందుకొని తీరుతారు.
శ్రీమద్రామాయణం రెండు భాగాలు చేసిపూర్వ భాగం 1145 పద్యాలతో మనకందించారు. ఇప్పుడీకవి చంద్రములు.ఇది దేవీదాస రామాయణం. మిగిలిన ఉత్తరభాగం కూడా మనకు త్వరలో అందించాలని కోరుతూ శ్రీదేవీదాసుగారిని హృదయమిచ్చి ప్రశంసా అభినందనలు తెలియ జేస్తున్నాను.
ధూళిపాళ మహాదేవమణి.9494002247📍
జైహింద్.
Print this post
1 comments:
శ్రీయుతులు చిత్రకవన చతురులు బ్రహ్మశ్రీ చింతారామకృష్ణారావుగారు చేస్తున్న సారస్వత సేవ సామాన్యంకాదు.వారిని ఆసరస్వతి పూర్ణకటాక్ష వీక్షలతో రక్షించునుగాక
మహాదేవమణి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.