జైశ్రీరామ్.
శ్రీ దుర్గా నవరాత్రులు సందర్భముగా యావజ్జనావళికి నా శుభాకాంక్షలు.
శ్లో. యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ.
ఉ. ఎవ్వతె నాత్మ తత్త్వము మహేశ్వరనామముతోడ నొప్పునో,
యెవ్వతె లోకరూపిణిగనేర్పడి యొప్పునొ సృష్టి యంతలో
నెవ్వతె నామరూపములహీనదయాస్థితిఁ దాల్చుచుండెనో,
యెవ్వతెముగ్గురౌ ప్రకృతు లెవ్వతె శ్రీ నవశక్తులెన్నగా
నవ్వనజాయతాక్షికి జయంబు శుభంబు సతంబుఁ గోరెదన్.
భావము.
ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వము సర్వేశ్వరుఁడనే
శుభనామాన్ని పొందినదో, ఎవతె తనే జగదాకారముగా పరిణామము
చెందినదో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గల
మూల ప్రకృతియో, ఎవతె స్వయముగా అనంత రూపములైన శక్తియో,
ఎవతె నిత్యమూ మరల మరల ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు
(నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి
జయించుగాక.
శ్లో. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
కం. నవరాత్రులనారాధ్యా!
నవనుత శ్రీచక్ర నిలయ! నా మది నిలుమా,
నవరూపధరా! శక్తీ!
నవదుర్గా!నిన్నుఁగొలుతు, ననుఁ గృపఁ గనుమా!
భావము.
నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది,
శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.
నవదుర్గలు.
శ్లో. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
(వరాహ పురాణం)
1. శైలపుత్రీ హిమవంతుని కుమార్తె
2. బ్రహ్మచారిణీ | శివుని పొందుటకు
కఠోర్మ్యిన బ్రహ్మచర్యమునవలంబించిన జగజ్జనని
3. చంద్రఘంట, పరమేశ్వరుండుపార్వతి
తపస్సునకు మెచ్చి ప్రేమించి పెద్దల సమ్మతితో వివాహమాడుటకు తన నిజరూపమగు
జటాజూటములతోభూతప్రేతగనములతో అతిభయంకరముగా పెండ్లికుమారుడుగా రాగా అది చూచిన
పార్వతి బంధువులు భయవిహ్వలులగుచుండగా పార్వతి చంద్రఘంటగా మారి
పరమేశ్వరునకుపెండ్లికుమారునిఅలంకారముతో ప్రత్యక్షమగునట్లు చేసి భూతగణాలను
బంధికోటిగా మార్చి బంధువుల భీతిని పోకొట్టిన తల్లి
4. కూష్మాండ.. శక్తిస్వరూపిణి అయిన అమ్మ తన
అతిసూల్ష్మప్రతాపశక్తిమాత్రముతోనే సమస్త సృష్టి చేసిన జనని.
5. స్కందమాత స్కంధునకు జనని
ఈమె ఒడిలో స్కందుడు కూర్చొని ఉంటాడు./తారకాసురుని చంపి స్కంధుఁడు శుంభ నిశుంభులతో
యుద్ధమునకు తలపడగా స్కందమాత భీకరరూపిణియై వారిని వధిస్తుంది.
6. కాత్యాయనీ పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. తనకు సంతానం కలగలేదు. తను దుర్గా దేవికి గొప్ప భక్తుడు. ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు. ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక అమ్మవారు నెరవేర్చింది.
దుర్గా దేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయనీ మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసురమర్దిని అని పిలుస్తారు. ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది. కాత్యాయనీ దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి.
7. కాలరాత్రిచండ మరియు ముండ అనే ఇద్దరు రాక్షస సేనాధిపతులు శుంభ మరియు
నిశుంభలు పంపారు. వారు ఆమెతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, చండీ దేవి ఒక చీకటి దేవత
కాళిని (కొన్ని ఖాతాలలో, కాళరాత్రి అని పిలుస్తారు) సృష్టించింది. కాళి/కాళరాత్రి వారిని
చంపింది, తద్వారా చాముండ అనే పేరు వచ్చింది .
8. మహాగౌరీ మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు అని అర్థం. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం
నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని
సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం,
కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది.
దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన
శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై,
ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా
నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని
కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును
సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు.
9. సిద్ధిదాత్రీ సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగల తల్లి
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.