గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2022, శనివారం

శ్రీ చక్రబంధ అష్ట లక్ష్మీ స్తోత్ర గీతావళి.

 జైశ్రీరామ్.

శ్రీ చక్రబంధ అష్ట లక్ష్మీ స్తోత్ర గీతావళి.

౧. లక్ష్యమును జేర్చు శ్రీ గజలక్ష్మి మ్రోల
మనసు నిల్పుదు. శ్రీదేవి మమ్ము చేదఁ
గవన మత్తేభ శ్రీ కల్గి కాంక్ష తీర్- చు
లక్ష్య మది గని, లబ్ధి దలంచుమేల.
౨. రక్ష ధన లక్ష్మి శ్రీఁ గొల్పు నక్షయంబు
వర్ధనము చేయుశ్రీ శుభ భావశ్రీని
కొలుచు వారికి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
రక్షవయి కొల్పు బుద్ధిని భ్రాంతి తీర!
౩. లక్ష్య నరునికి శ్రీ ధాన్య లక్ష్మి ప్రాపు
దయను పోషించు శ్రీకివే దండి పూలు
లేమి విడనాడ శ్రీ సేవలే సురక్ష
లక్ష్మి దరి లేని పుష్పాలు లక్షలేల?
౪. లక్ష శుభములు శ్రీ ధైర్య లక్ష్మిఁ జేర
లక్ష్మిలసమాన  శ్రీ ధైర్య లక్ష్మి వెంట
నమరు వారలు శ్రీ దీప్తి కంక మాల్య
లక్ష్మిలభినవరక్షట లౌల్యమేల
౫. కలిత సంతాన శ్రీలక్ష్మి. జ్ఞాన పుత్రు
లక్ష్యముననిచ్చు శ్రీముక్తిలాభమౌను
చపలతన్ బాపు. శ్రీజ్ఞాన శక్తిఁ దేల్చు
కమలలోచన త్రుళ్ళును కాల్చు గాక!
౬. విద్య యనఁబడు శ్రీ లక్ష్మి! విశ్వ మాత !
నశ్వరముఁ బాపు శ్రీదివ్య జ్ఞాన ధామ !
రుచిరసన్నుత శ్రీ విద్య రోచిఁ గొల్పు!
విద్యనమరుచు తల్లి! మద్వేల్పు దేవి!
౭. లక్ష్యములఁ గూర్చు శ్రీ ఆది లక్ష్మి జ్ఞాన
ముద్ర ధరియింతు శ్రీభక్త పూజ్య మ్రోల
గొప్ప కవిఁ జేసి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
లభ్యమునుఁగొల్పినన్నేల లాఁతి యేల
౮. సత్కవులపాలి శ్రీకర చంద్ర వంక
జగతి సద్రూప శ్రీలిచ్చు,చక్కఁ గాచు
శ్రీ విజయ లక్ష్మి.శ్రీ జన సేతుచంద్ర.
సద్విజయ శ్రీని కల్పించుచంద్రభాస!

అష్ట లక్ష్మీమాతలకూ నమస్కరించుచు 
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

అన్నగారు అష్టలక్ష్ములను చక్రబంధంలో ఇరికించారు
చాలాచాలా బాగున్నది
మీరు సరస్వతీ పుత్రులు
ఆర్యా వందనాలు పదివేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.