గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, అక్టోబర్ 2022, మంగళవారం

నాన్యం గుణేభ్యః కర్తారం - ...14 - 19...//.....గుణానేతానతీత్య త్రీన్దేహీ - , , .14 - 20,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

 జైశ్రీరామ్.

|| 14-19 ||

శ్లో.  నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|

గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్ఛతి.

తే.గీ.  కర్మలన్ ద్రిగుణప్రకృతి కాంక్ష గొలిపి

చేయజేయును, నేన గాదు చేయువాడ

నాత్మ నాకాశమేనంచు నాత్మనెన్ను

వాడు సన్ముక్తుడై తాను వరలగలడు.

భావము.

ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప 

అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ 

నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే 

పొందుచున్నాదు.

|| 14-20 ||

శ్లో.  గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|

జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోమృతమశ్నుతే.

తే.గీ.  త్రిగుణ దూరుడౌ జీవుడు  ప్రగణితముగ

నైహికంబగు బాధలనధిగమించి

జననమరణముల్ లేనట్టి చక్కనైన

ముక్తిసన్మార్గమందున పొలుపుగాంచు.

భావము.

దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు 

జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని 

అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.