గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2021, మంగళవారం

శ్రీ లలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మార్చన. ప్రథమ శతకము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్ 

ఓం శ్రీమాత్రే నమః

శ్రీ లలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.

ప్రథమ శతకము.

రచన. చింతా రామకృష్ణారావు.

శ్లో౧. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ,

చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా.

1. ఓం శ్రీమాత్రే నమః.

నామౌచిత్యము

శ్రీ మాత మాతృవాత్సల్యమే రూపముగా కలది. సర్వ మంగళప్రద కావున శ్రీమాత అయినది. సృష్టి

 స్థితి లయలకు మూలమైన తల్లి. శ్రీమాత వేదత్రయ స్వరూపిణి. అట్టిశ్రీమాతకు నమస్కారము.

శా. శ్రీమన్మంగళ దేవతా! శుభతతిన్ శీఘ్రంబుగా గొల్పుమా,

శ్రీమాతా! వర భాగ్య దాత!, దయతోఁ జేకొమ్మ నీ భక్తులన్,

బ్రేమోద్భాస ముఖప్రదీప్త జననీ! విజ్ఞాన సంవర్ధినీ!

నీమంబొప్పగ నిన్నుఁ గొల్తుము సదా నీ సత్ కృపన్ బ్రోవుమా.


2. ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః.

నామౌచిత్యము

ఈ చరాచర జగత్తులో ప్రాణి కోటికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కర్మానుసారం

భవిష్యజ్జన్మల్నిచ్చుచు లోకాలను పాలించు మంగళప్రదయైన మహారాజ్ఞి.

తే.గీ. ప్రాణులను గాచు శ్రీమహారాజ్ఞి! మాదు

జ్ఞాన సంపత్తియే నిన్నుఁ గనగఁ జేయు,

కలుగఁ జేయుము మాకది కనగ నిన్ను,

వందనము లందుకొనుమమ్మ భక్త సులభ!


3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.

నామౌచిత్యము

త్రిపుర సుందరియైన లలితాంబ పంచసింహాసనాసీన. పంచప్రణవాసనములు, పంచ

 కలాసనములు, పంచ

దిగాసనములు, పంచ భూతాసనములు, పంచ ముఖాసనములు అధిష్టించియుండునది. కావున

 శ్రీమత్

సింహాసనేశ్వరి.

కం. శ్రీమత్ పంచ దిగాసన!

ధీమంతులుగా జనులను దీర్చుము తల్లీ!

ప్రేమన్ మము గరుణించెడి

శ్రీమత్ సింహాసనేశ్వరీ! వందనముల్.


4. ఓం చిదగ్నికుండ సంభూతాయైనమః.

నామౌచిత్యము

చిత్ అనగా జ్ఞానము జ్ఞానమనెడి అగ్ని చిదగ్ని, రూపక సమాసము. జ్ఞానమనెడి అగ్ని కుండము 

నుండి పుట్టునది. అవిద్య, అజ్ఞానము మున్నగువాటిని తొలగించు శక్తియే చిదగ్నికుండ సంభూత.

ఉ. మాత! చిదగ్ని సంభవ సమంచిత ధీ వర తేజ! నీవు వి

ఖ్యాతిగఁ దామసమ్మును బ్రకాశము సేత నశింపఁ జేసి, మా

కాతత భక్తి నిచ్చెద వనంత దయాబ్ధి! చిదగ్నికుండ సం

భూత! నమస్కరించెదము, బోధను గొల్పి రహింపఁ జేయుమా.


5. ఓం దేవకార్య సముద్యతాయై నమః.

నామౌచిత్యము

దేవతల కార్యములు పూర్తి చేయుట కొఱకు భూలోకమున అవతరించునది.

మత్త కో. 

దేవకార్యము దీర్చగా గణుతింప పృథ్వి జనింతువా,

కావగా సుజనాళి నంచిత గౌరవంబును గొల్పుచున్,

జీవ కోటినిఁ గాచు తల్లివి చేర రమ్మికఁ బ్రోవ నన్

దేవకార్య సముద్యతా! వర దీక్షతో నిను గొల్చెదన్.


శ్లో౨. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా,

రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్వలా.


6. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః.

నామౌచిత్యము

ఉదయించుచున్న వేయిమంది సూర్యుల కాంతితో ప్రకశించునది. సహస్రారమున పతితోకూడి 

ప్రకాశించు ఆజగజ్జననిని సాధకుడు చూడగలిగినచో కనిపించు ప్రకాశమది.. 

బ్రహ్మాండమంతటను వ్యాపించునట్టి తేజస్సుఈ తల్లియే,.

కం. ముసిరిన మాయను బాపగ,

నసమంబగు కాంతివగుదు వనుపమ! కన నీ

కస లెవరీ డుద్యద్భా

ను సహస్రాభా? ననుం గనుమ మహిత కృపన్.

కం. మసలుదువీ వుద్యద్భా

ను సహస్రాభా! తపోధనులటుల మేమున్

ముసిరిన మాయను వీడుచు

నసమాన నినున్ గనుగొన నాత్మల వెలుగై..


7. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః.

నామౌచిత్యము..

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు భుజములతో ప్రకాశించు జనని.

చతుర్వేదబాహుచతుష్టయముతో ప్రకాశించునది. .

ఉ. మోహ విదూర! మా దురితముల్ విడఁ బాపుమ సత్కృపన్. చతుర్

బాహు సమన్వితా! నతులు, భక్తుల బాధలఁ బాప నీ చతుర్

బాహువులందు గాంచగ ప్రభావమునొప్పెడి యాయుధాళి, సం

దేహములార్పు, నీ కృప మదిన్ గని పొంగుదు మమ్మ నిత్యమున్.


8. ఓం రాగ స్వరూప పాశాఢ్యాయై నమః.

నామౌచిత్యము.

ప్రేమస్వరూపమయిన పాశము ఈ జనని ఎడమ పైచేతితో ధరించి యుండునది.

ప్రాణులలో అనురాగబంధములు కలుగ జేయుచు పుట్టుకలు కలుగ జేయునది.

సీ. రాజీవ లోచనా! రాగ స్వరూప పా శాఢ్యా! మదిన్ నీవు సదయ నిలువు

మనురాగ పాశంబు లలము కొనెను మదిన్ నీ పైన ధ్యాసనే నిలువ నిచ్చి,

యానందముగ నిన్ను నందరిలో కను సుందరమైనట్టి బంధమిమ్ము,

బంధమేదైనను ప్రబలఁ జేయుము కాని మన మధ్య బంధమ్ము మాపకమ్మ

తే.గీ. జీవినే నేను నీవు నా జీవమమ్మ!

రాగ పాశంబులన్ బాపి రమ్య! నీదు

నామ సాహస్రకంబును నయము తనర

పద్యములఁ నిల్పి వ్రాయనీ హృద్యముగను.


9. ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః.

నామౌచిత్యము

కుడివైపు పై చేతిలో క్రోధమనెడి అంకుశమును ధరించిన తల్లి. ప్రాణి కోటిలో అనురాగమునకు 

కారణమయిన జననియే అది మితి మీరినప్పుడు క్రోధమును కలిగించు జనని.

కం. దిశవై క్రోధాకారాం

కుశోజ్వలా! నడుపు నన్ను కూర్మిని సతమున్,

ప్రశమన కోప వగుచు నీ

దిశగా నడిపించు మమ్మ, దిక్కగు జననీ!


శ్లో౩. మనోరూపేక్షు కోదండా, పంచతన్మాత్రసాయకా,

నిజారుణప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా.

10. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః.

నామౌచిత్యము

మనో రూపమైన చెరకు విల్లును ఎడమవైపు క్రింది చేతిలో ధరించునది. ఇది క్రియాశక్తి

శా. ప్రోవంగా ననుఁ గోరుదున్ నిను మనోరూపేక్షుకోదండ! సం

సేవాసక్తిని నాకు గొల్పుము, నినున్ సేవింతు భక్తిన్ సదా,

భావావేశము గొల్పి సత్కవితలో వర్ణింపనిమ్మా నినున్.

శ్రీవాణీగిరిజా స్వరూపిణివి నిన్ శ్రీమాతగా కొల్చెదన్.


11. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః.

నామౌచిత్యము

పంచ భూతముల సూక్ష్మ రూపములయిన శబ్ద స్పర్శ రూప రస గంధ ములు యీ పంచతన్మాత్రలే

సాయకములు..

తే.గీ. పంచతన్మాత్ర సాయకా! భవ్య తేజ!

పాంచభౌతిక దేహాన వాసముండి

జీవనము నీవె నడుపుదే దేవి! నీవె

ముక్తి మార్గము సూపుము భక్తిఁ గొలిపి.


12. ఓం నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలాయై నమః.

నామౌచిత్యము

తన అరుణ కాంతులతో ముంచఁ బడిన బ్రహ్మాండ మండలములు కలది అమ్మ. ఆత్మ జ్ఞాని 

తనను తానుబ్రహ్మముగా నెఱుఁగుచు తనలోననే గల బ్రహ్మాండమండలమున వ్యాపించిన 

అమ్మవారి అరుణారుణ ప్రభను అత్మ శక్తితో చూడగలుఁగును. అట్టి వ్యాప్తి కలది అమ్మ.

స్వయం కల్పిత

అరుణ ప్రభాపూర్ణ వృత్తము

గణములు స జ త మ ర వ....

యతి 10 వ అక్షరము.

ప్రాసనియమము కలదు

నిను నే కవిత్వమందున్ గణింపన్ సాధ్యంబొకో సుధా

మ! నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలా!

నిను నంతటన్ గణింతున్ మనీషాళిన్ వెల్గుచుందువే

వనితాకృతుల్ గనంగన్ భవానీ! నీవే వెలుంగుదే.


శ్లో౪. చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్ కచా,

కురువింద మణిశ్రేణీ, కనత్ కోటీర మండితా.

13. ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః.

నామౌచిత్యము

సంపంగి, అశోకము, పున్నాగము, మొదలగు పూవుల వాసనలతో నలరారుచున్న కేశసంపదతో 

నొప్పు జనని లలితాంబ.

స్వయం కల్పిత

పున్నాగ వృత్తము

గణములు ర ర ర భ జ గ....

యతి 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా!

చంపకంబుల్ నినుం జేరఁ జక్కంగ నిట పద్యముల్

సొంపు నీతీరునన్ గోరి చూచున్ గరుణతో సతీ!

యింపుగా సౌరభంబున్ గ్రహించన్ దగును నీవిఁకన్.


14. ఓం కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితాయై నమః

నామౌచిత్యము

కురువిందములనుండి పుట్టిన మణులవరుసచే ప్రకాశించుచున్న కిరీటము కలది జగన్మాత..

స్వయం కల్పిత 

కురువింద వృత్తము.

గణములు. స స త మ జ గ..

యతి 11వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితా!

తెరవేది నినున్ గొల్వన్ సుబుద్ధిన్ నీవు గొల్పమిన్?

వర సేవలు నేఁ జేయంగ సద్భక్తిన్ మనన్ వలెన్,

వర భక్తిని నాకిమ్మింక నే వర్ధిల్లగా సతీ!


శ్లో౫. అష్టమీ చంద్ర వుభ్రాజ, దళికస్థల శోభితా,

ముఖచంద్ర కళంకాభ, మృగనాభివిశేషకా,

15. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థలశోభితాయై నమః.

నామౌచిత్యము

అష్టమి నాటి అర్థచంద్రాకరమయిన నొసటి ప్రదేశంతో ప్రకాశించునది జనని.

స్వయం కల్పిత 

అష్టమీ చంద్ర కళ వృత్తము.

గణములు. ర ర భ జ జ ర గ.

యతి 16 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితా! నమస్తే,

కష్టముల్ వాపి మమ్మేలుమ పరాత్పర! మమ్ము కావుమీవే,

నిష్టతో నేను నిన్ గొల్తును శుభాస్పద! కావు నీవె నన్నున్

నష్టపోనీయ కీజన్మను గుణాలయ! కాపు నాకు నీవే .


16. ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకాయై నమః.

నామౌచిత్యము

కస్తూరీ తిలక మను మచ్చతో కూడిన విశేషమైన ముఖచంద్రయే శ్రీమాత.

స్వయం కల్పిత

మృగనాభి వృత్తము.

గణములు. భ భ త స స వ.

యతి 1౦ వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

శ్రీ ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకా!

నీ ముఖ శోభయె జీవంబు నియతిన్ బ్రబలించగా

మేమిట నీదరి వర్ధిల్లమె సనాతనని! శాంభవీ!

నీ మనమందున మేముండ నిరపాయము మాకిటన్.


శ్లో౬. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక,

వక్త్రలక్ష్మీపరీవాహ, చలన్మీనాభలోచనా.

17. ఓం వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికాయై నమః.

నామౌచిత్యము

ముఖమనెడి మన్మథ గృహమునకు కట్టఁబడిన మాంగళ్య తోరణము వలెనున్న కనుబొమ్మలు 

కలది జగన్మాత.

స్వయం కల్పిత

మృగ నాభి వృత్తము.

గణములు.. భ భ త స స వ.

యతి 10 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

శ్రీ వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లికా!

దీవనలన్ వర తేజంబు స్థిరమౌ సుఖమిమ్మికన్,

నీవె కృపన్ వర మోక్షంబు నిజశక్తి నొసంగుమా,

భావనలో నిను నిత్యంబు వరలింప తలంచెదన్


18. ఓం వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనాయై నమః.

నామౌచిత్యము

ముఖ కాంతి అనెడి ప్రవాహములో కదలాడుచున్న చేపల జంటతో సమానమైన కనుబొమ్మలు 

కలది మీనాక్షి.

స్వయం కల్పిత

చలన్మీన వృత్తము.

గణములు.. జ త త య ర వ.

యతి 10 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

భవాని నీదౌ కృపా దృష్టి పరంబున్ గొల్పునమ్మరో!

కవిత్వ మీవై ప్రవాహంబుగ రమ్మా వెల్గులీనుచున్,

ప్రవేశమిమ్మింక నీ దివ్య పదమ్ముల్గాంచ, సత్యభా

స! వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా!


శ్లో౭. నవచంపక పుష్పాభ, నాసాదండ విరాజితా,

తారా కాంతి తిరస్కారి, నాసాభరణ భాసురా.

19. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః.

నామౌచిత్యము

అప్పుడే వికసించినటువంటి సంపంగి పూవు వంటి నాసిక కలది దాక్షాయని.

స్వయం కల్పిత

ప్రౌఢ విక్రమ వృత్తము.

గణములు .. స . స . ర . త . జ . గ.

యతి .. 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

నవచంపక పుష్పాభ నాసాదండవిరాజితా!

కవనాకృతిలో నీవు కావ్యంబై ప్రభవింపుమా,

నవ జీవన మార్గంబునన్ నీవే నడిపించుమా,

భవ బంధములన్నీవె పారంద్రోలుమ, పాహిమామ్.


20. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః.

నామౌచిత్యము

నక్షత్ర కాంతిని కూడా తిరస్కరించెడి నాసాభరణములు అలంకరించుకొనినది శ్రీమాత.

స్వయం కల్పిత

నాసాభరణ వృత్తము.

గణములు..మ స ర భ జ గ.

యతి 9వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

శ్రీ రమ్యాక్షరనామా! ప్రసిద్ధ స్మిత ముఖాంబుజా!

నీ రక్షావలయంబందు నేనుంటి నిట వెల్గుచున్

దారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా!

కోరన్ నే నిహ సౌఖ్యంబు, కొల్వుండు మది నిత్యమున్


శ్లో౮. కదంబ మంజరీక్లప్త కర్ణ పూర మనోహరా,

తాటంక యుగళీభూత తపనోడుప మండలా,

21. ఓం కదంబమంజరీక్లప్త కర్ణపూర మనోహరాయై నమః.

నామౌచిత్యము

కడిమి పూలతో చేయఁబడిన కర్ణాభరణములతో మనోహరమైన తల్లి.

స్వయం కల్పిత

కదంబ మంజరీ వృత్తము.

గణములు..జ ర ర జ జ గ.

యతి 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు..

కదంబమంజరీక్లప్త కర్ణపూర మనోహరా!

మదంబ వీవెగా, కావు మమ్ము నీవిక ప్రేమతో,

ముదంబుతోడ నాపూజ పూర్తిగా గ్రహియింపుమా,

హృదిన్ వసించి నీవున్న హృద్య కావ్యము వెల్వడున్.


22. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః.

నామౌచిత్యము

చెవికమ్మల జంటగా సూర్యచంద్ర మండలములు కల జనని లలితాంబ.

స్వయం కల్పిత

తాటంకయుగళీవృత్తము.

గణములు..త స భ జ జ గ.

యతి 9 వ అక్షరము. ...

ప్రాస నియమము కలదు..

తాటంకయుగళీభూత తపనోడుపమండలా!

పాటింతు నినుఁ బూజించు వరణీయ విధానమున్

కోటీశ్వరుఁడ నీవున్న కొలువై మది నేనికన్,

వాటిల్లు శుభ సౌఖ్యాళి వరణీయ శుభప్రభా!


శ్లో౯. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోళభూః,

నవ విద్రుమ బింబ శ్రీ,న్యక్కారి రదన చ్ఛదా.

23. ఓం పద్మరాగశిలాదర్శపరిభావి కపోల భువేనమః.

నామౌచిత్యము.

పద్నరాగశిలలు అను అద్దములను మించిన నునుపైన కాంతులీనుచున్న చెక్కిళ్ళు కలది మన అమ్మ.

స్వయం కల్పిత 

పద్మరాగ వృత్తము.

గణములు. ర స భ జ జ గ.

యతి. 9వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూ!

పద్మమై నిను సేవింతుఁ బరమార్థమదే కదా,

పద్మపత్ర విశాలాక్షి! వరభావ సుధా నిధీ!

పద్మజోద్భవు దేవేరి వరలించిన కైతవా?


24. ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదాయై నమః

నామౌచిత్యము.

అప్పుడే సానపట్టిన పగడముకన్నా దొండపండు కన్నా ఎరుపయిన పెదవులతో ప్రకాశించునది 

జగజ్జనని.

స్వయం కల్పిత 

నవనీత వృత్తము.

గణములు. న స మ భ జ గ.

యతి. 9వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా!

కవన మధువున్ గ్రోలన్ గామేశ్వరిగ రమ్మికన్,

శ్రవణమధురంబౌ ధారాపాత కవితన్ దయన్

నవ రసములుప్పొంగన్ నా నుండి ప్రభవింపనీ.


శ్లో౧౦.. శుద్ధవిద్యాంకురాకర, ద్విజపంక్తిద్వయోజ్వలా,

కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా.

25. ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః.

నామౌచిత్యము.

శుద్ధవిద్య దగ్గరనుండి అనుత్తర దీక్ష వరకు గల ముప్ఫైరెండు దీక్షలను తీసుకున్న శ్రేష్ఠుల చేత 

పొందదగిన

జనని.అని బాహ్యార్థముగా తోచుచున్నదియే ద్విజపంక్తి అనగా పైపన్నులుపదునారు క్రింది 

పన్నులు

పదునారు ఆ ముప్పదిరెండు పన్నుల ముఖద్వారము నుండి ప్రకాశవంతముగా వెలువడు 

శ్రీవిద్యా స్వరూపిణి అమ్మ అని గ్రహింపవలసి యున్నది.

స్వయం కల్పిత 

ద్విజ పంక్తి వృత్తము.

గణములు. త త మ స ర వ.

యతి. 10వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

శ్రీ శుద్ధ విద్యల్ సమస్తంబున్ జిర కీర్తిన్ మహోద్ధతిన్,

శ్రీశక్తివౌ నీ ప్రభావంబై చెలగున్ సత్యమిద్ది, దే

వీ! శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా!

యా శుద్ధ విద్యల్ ననున్ జేర్చే యసమానాంబవీవెగా.


26. ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః.

నామౌచిత్యము.

కర్పూరము మొదలయిన సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలము వేసుకొనుటచే దిక్కుల 

చివర వరకు వ్యాపించిన తాంబూల పరిమళములు కలది అమ్మ.

స్వయం కల్పిత 

కర్పూరవీటికా వృత్తము.

గణములు. త ర భ మ జ గ.

యతి. 11వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా!

కార్పణ్యమున్ విడన్ జేసి, ననున్ గాపాడు తల్లివే,

దర్పంబునే మదిన్ బాపు. మహోదారా! మహేశ్వరీ!

కర్పూరహారతిన్ నీకు మనోజ్ఞా సేవఁ జేయనీ.


శ్లో౧౧. నిజ్ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ,

మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా.

27. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః.

నామౌచిత్యము.

శ్రీమాత పలుకులు వీణానాదముకన్నా మహనీయముగా ఒప్పియున్నవి. వీణా నాదముకన్న

మధురమయిన సరససల్లాపములు గల తల్లి ఈ జగదంబ.

స్వయం కల్పిత 

సల్లాప వృత్తము.

గణములు. స ర భ త జ గ.

యతి 10వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ!

సుజనాత్మస్థ! నన్ బ్రోచుమ శుద్ధాత్మగ వెల్గుచున్,

బ్రజలే నీ సుతుల్ గాచుమ, భక్తిన్ నినుఁ గొల్తురే,

భజియింతున్ గృపన్ జూడుమ, పాపంబులఁ బాపుమా.


28. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసాయై నమః.

నామౌచిత్యము.

తన పతియయిన కామేశ్వరుని మనసున భావించుట చేత  పరమేశ్వరానందము 

పొందినందునకలిగిన చిన్న చిరునవ్వుతోకూడిన అందమయిన జనని.

స్వయం కల్పిత 

మందస్మిత వృత్తము.

గణములు. త ర ర మ జ గ.

యతి. 9వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా!

సౌందర్య రాశి వీవమ్మ! సౌభాగ్యాకారివీవెగా,

కందున్ మనంబు నీ వింకఁ గాదన్నన్ నన్నుఁ గావుమా,

బంధంబులన్ విడన్ జేయభద్రాత్మా! నిన్నుఁ జేరుదున్.


శ్లో౧౨. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా.

కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కందరా.

29. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీవిరాజితాయై నమః.

నామౌచిత్యము.

సాటియే లేని నునుపైన అందమైన చుబుకము కల తల్లి లలితాంబ.

స్వయం కల్పిత 

శ్రీవిరాజిత వృత్తము.

గణములు. జ స భ య జ గ.

యతి. 8 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా!

మనంబునను నీవే మహిమతో వెల్గు శాంభవీ!

ఘనంబగునొ నీకున్ గరుణతో మమ్ము గాచుటే?

మనోజ్ఞమగు నీ నామమును మాలోన వెల్గనీ.


30. ఓం కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంథరాయై నమః.

నామౌచిత్యము..

కామేశ్వరునిచే కట్టబడిన మంగళ సూత్రముచేతనొప్పుచున్న అందమైన కంఠముతో ప్రకాశించు 

తల్లి మన లలితాంబ.

సీ. కంబు కంఠీ! జగత్ కల్యాణ రూపిణీ! కామేశ బద్ధమాంగల్య సూత్ర

శోభిత కంథరా! శుభ యోగదా! నిన్నుఁ బ్రార్థింతునమ్మ శుభంబులంద,

నీదు మాంగళ్యమ్ము నీ భర్త కమితమౌ శక్తి నొసంగె చిచ్ఛక్తి గొలిపి,

లోకేశుగాఁ జేసె, లోలాక్షి నీ శక్తి పద్యాళిలోఁ జెప్పు ప్రతిభ నిమ్ము,

తే.గీ. పచ్చతోరణాల్ ముంగిళ్ళ వరలనిమ్ము,

భక్తి మార్గమ్మునన్ మమ్ము బ్రతుకనిమ్ము,

పాత్రులన్ జేసి పూజలన్ బ్రబలనిమ్ము

నిత్య కల్యాణ సంధాత్రి! నీకు శుభము,


శ్లో౧౩. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా,

రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా.

31. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః.

నామౌచిత్యము.

బంగారముతో చేయఁబడిన కేయూరములు, అంగదములు ధరించిన కమనీయ భుజములు కలది 

మన జగన్మాత.

స్వయం కల్పిత

కనకాంగద వృత్తము

గణములు....." స .. స .. భ .. జ .. జ .. గ " .

యతి ..... 9 వ అక్షరము. .....

ప్రాస నియమము కలదు.

మనమందున నిన్ నేను మనమందును శాంభవీ!

వినుతించెద నే నిన్ను వినుతిన్ విను శాంభవీ!

కనికారము నీకున్నఁ గని నన్ గృపఁ బ్రోవుమా,

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా!


32. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః.

నామౌచిత్యము.

రత్నములు పొదగఁబడిన కంఠమున ధరించు చింతాకు అనే ఆభరణముతో కదలుచున్న 

ముత్యాలహారముతో కూడుకొనియున్న తల్లి. ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించువారికి ఆయా 

ఫలములను ఇచ్చు తల్లి.

స్వయం కల్పిత

ముక్తాఫల వృత్తము

గణములు. స .. మ .. య .. జ .. త .. ర " .

యతి ..... 10 వ అక్షరం.. .....

ప్రాస నియమము కలదు.

కరుణాసాంద్రా! నీవు నన్నున్ గనన్ శుభంబుల్ వరించుగా,

పరమానందంబందు నేనున్ బరంబుఁ బొందన్ సుసాధ్యమౌన్,

స్థిర సౌఖ్యంబున్ బొందనౌన్ వాసిగా, కృపం గాంచు, శ్రీ శుభం

కర రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా!


శ్లో౧౪. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్తనీ,

నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయీ.

33. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః.

నామౌచిత్యము.

కామేశ్వరుని యొక్క ప్రేమ యనే రత్నాన్నిపొందుటకై అందుకు బదులుగా తన స్థనములనెడి

రత్నములనిచ్చు తల్లి ఈ జగన్మాత.

సీ. మాయా విమోహినై నీ యందు సద్భక్తి నిలుప లేకుంటి నే విలువ నెఱిఁగి!

మిథ్యనే బాపు, కామేశ్వర ప్రేమర త్నమణి ప్రతిపణ స్తని! మహితాత్మ!

ఐహికం బెవ్వరి కానందమందించు శాశ్వతంబుగనిట సన్నుతముగ?

నీ పాద పద్మముల్ నిత్యంబు సేవించి నిత్యుండనై వెల్గనిమ్ము నన్ను,

తే.గీ. నిన్నె నమ్మితినమ్మరో! నిండుమదిని

నన్నుఁ ఙ్రుణించుమమ్మ! కాకున్న నాకు

దిక్కు లేదమ్మ! నీవె నా దిక్కువమ్మ!

కొమ్మ నావందనమ్ములన్ గూర్మితోడ.


34. ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయ్యై నమః.

నామౌచిత్యము.

నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పళ్ళువలె యొప్పుచున్న స్థనద్వయముతో ప్రకాశించు 

జనని లలితాంబ.

స్వయం కల్పిత

తటిల్లతా వృత్తము

గణములు. స .. ర .. య .. స .. న .. ర " .

యతి 11 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

భ్రమలన్ మున్గి నే సుధాపూర్ణ పరంబు నిలఁ గాంచనే

క్షమతో నీవె నన్ను రక్షించగ నుంటి విట శ్రీసతీ!

క్షమ నీరూపు, నా చెడున్, నీవె శమింపగ నొనర్చు వై

ళమె, నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయీ!


శ్లో౧౫. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా

స్తనభారదలన్మధ్య పట్టబంధ వళిత్రయా.

35. ఓం లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమాయ్యై నమః.

నామౌచిత్యము.

కనఁబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే పందిరి వంటి సన్నని నడుము కలది జగన్మాత.

సీ. కామేశ్వరీ! లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమ! నుతింతు.

నామానసంబందు నీమంబుతో నుండు నిరుపమ రీతిని నిర్మలాత్మ!

క్షేమంబునే కొల్పి శ్రీమన్మహాకావ్య కర్తగా ననుఁ జేసి కావుమమ్మ!

చిత్తంబు లోపలన్ గ్రొత్త సద్భావనల్ జనియింపఁ జేయు మో ప్రణవ రూప,

తే.గీ. భావములు గొల్పి పద్యముల్ వ్రాయఁ జేసి,

సత్య సన్మార్గ సద్వృత్తి సరగున నిడు,

నీదు పాదాంబుజములనే నిత్యమెన్ని

కొలువఁ జేయుమా నాచేతఁ గూర్మితోడ.


36. ఓం స్తనభారదలన్మధ్య పట్టబంధ వళిత్రయాయై నమః.

నామౌచిత్యము.

వక్షోజముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టేల యొక్క బంధము 

వలెకనఁబడుచున్నమూడు ముడతలతో ప్రకాశించుచున్న జనని. మణిపూరక చక్రము ఉండే 

నాభి వద్ద మూడుముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్య అధో లోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల

సమన్వయము సుబోధకమగును.

సీ. భయ దూరమై యొప్పు నయ మార్గమున్ జూపు జయమార్గమీవేను జననిరొ! స్తన

భార దలన్మధ్య పట్టబంధ వళిత్రయా! నినుం గొలిచెద నహరహంబు,

నైహికంబైనట్టి, యాముష్మిక విదూర విభ్రాంతి చయము నన్ వ్రేచుచుండె,

నీవే సదా రక్ష, నీకిదియె పరీక్ష, నైచ్యంబుఁ బాపుచు నన్ను గనుమ,

తే.గీ. నీదు పద పంకజములె నన్ జేదుకొనును,

నాదు విశ్వాసమును జూచి బాధఁ బాపు,

బోధఁ గొలుపుచు దుర్గుణ వేధఁ బాపు,

నట్టి పద కంజములకు నే నంజలింతు.


శ్లో౧౬. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ

రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితా.

37. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తట్యై నమః

నామౌచిత్యము.

ఉదయించుచున్న సూర్యుని వలె అరుణ తేజముతో కనఁబడు వస్త్రముతో నొప్పుచున్న

 కటిప్రదేశము కలదిజగజ్జనని.

స్వయం కల్పిత

కౌసుంభ వృత్తము

గణములు. త .. భ .. త .. ర .. ర .. వ " .

యతి 10 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

వ్యారుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ!

సవ్యంబుగా నిను వర్ణించి చక్కగా నేను వ్రాయనా?

భవ్యాత్మవీవని నిన్గొల్చి, పాప భారంబు వీడనా,

కావ్యాళిలో నినుఁ గాంచంగఁ గమ్మగా నుండు నమ్మరో!


38. ఓం రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితాయై నమః.

నామౌచిత్యము.

రత్నమయమైన చిఱుగజ్జలతో అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డాణపు త్రాడు కలది జనని.

స్వయం కల్పిత

రశనాదామ వృత్తము

గణములు. ర .. స .. భ .. య .. జ .. గ " .

యతి ..... 9. .....వ అక్షరము. ప్రాస నియమము కలదు.

రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషితా!

నూత్నమౌ శుభమార్గంబును నినుం గాంచఁ గొల్పుమా,

యత్నమేనొనరింతున్ జయము నాకున్ లభించనీ

రత్నమేకద నీపాద రజ మాత్మన్ వెలుంగనీ.


శ్లో౧౭. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా,

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా.

39. ఓం కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః.

నామౌచిత్యము.

కామేశ్వరునకు మాత్రమే తెలియఁబడిన మృదువయిన ఊరుద్వయ శోభిత అమ్మ. 

ఊరుద్వయమును ఉ ఊ లుగ మనం సంకేతిస్తే ఉ సౌభాగ్యాన్ని, ఊ మర్దవాన్ని సూచిస్తాయి. ఈ 

మార్దవ సౌభాగ్యాల సంధాన కర్త్రి అయిన అమ్మ అయ్యవారికి మాత్రమే సమగ్రంగా 

తెలియఁబడును..

స్వయం కల్పిత

కామేశప్రియ వృత్తము

గణములు. మ .. త .. త .. ర .. ర .. వ 

యతి ..... 10. .....వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

మా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా

శ్రీకారంబందున్ నినుంగాంచ చిత్త మందున్ ముదంబునే,

నాకున్ నీ కైదండయే యండ, నాకుఁ గూర్చున్ శుభంబులన్,

లోకంబందున్ వేచు నన్ బాధలున్ గృపన్ జూచి కావుమా.


40. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః.

నామౌచిత్యము.

మాణిక్యములతో నొప్పుమకుటాకాకారముతో ప్రకాశించు మోకాళ్ళు కలది జనని.

స్వయం కల్పిత

మాణిక్య మకుట వృత్తము

గణములు. ర .. భ .. య .. య .. న .. ర " .

యతి 11. వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

సౌమ్య! మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా!

రమ్య సుజ్ఞాన శుభ తేజంబుఁ బ్రార్థించెద నొసంగుమా,

గమ్య మీవేను మది గాంచంగఁ గల్యాణ శుభ రూపిణీ!

సామ్యమే లేని వర రూపా! ప్రసాదింపుము మహోద్గతిన్.


శ్లో౧౮. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా

గూఢ గూల్ఫాకూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా.

41. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికాయై నమః.

నామౌచిత్యము.

ఆరుద్ర పురుగులచేత పొదగఁబడిన మన్మథుని అమ్ములపొది వంటి జంఘములు కలిగిన తల్లి 

మనతల్లి.

స్వయం కల్పిత 

స్మరతూణీర వృత్తము

గణములు. స .. జ .. య .. భ .. త .. ర " .

యతి 11 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

మహి తేంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా!

మహిమాన్వితంబగు మంత్రాళిన్ మహిమోపేత కావవే,

యిహ సౌఖ్యమున్ బర సౌఖ్యంబున్ హృది నీ వుండి కొల్పుదే

సహియింపు నా దురితాళిన్, శ్రీసతి సద్భాగ్య దాయివై.


42. ఓం గూఢ గుల్ఫాయై నమః

నామౌచిత్యము.

నిగూఢముగా ఉండే చీలమండలు కలది మన అమ్మ.

శా. చిత్తంబందు వసించు నిన్నుఁ గొలుతున్ శ్రీ గూఢగుల్ఫా! సదా!

మత్తున్ బాపుము మానవాళినిలఁ బ్రేమన్ జూచి రక్షించుచున్,

క్షుత్తాపంబు హరింప భుక్తి నిడుచున్ గూర్మిన్ మమున్ గాంచుమా,

బత్తిన్ గొల్చెద, భక్త వత్సల! సతీ! భద్రంబునే గొల్పుమా.


43. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః.

నామౌచిత్యము.

తాబేలు వీపునకు గల నునుపుఁదనమును జయించునంతటి అందమైన పాదములపైభాగము

 కలది అమ్మ. సముద్రమున మునిగిపోకుండునటుల మందర పర్వతమును మోసిన కూర్మమును

 మించి సంసారమనెడిమహాసముద్రమున మునిగిపోవుచున్న మందరపర్వతము వంటి భౌతిక

 తత్వ జీవులను కూర్మమును మించి

ఉద్ధరించి మోక్షమునిచ్చు సామర్ధ్యముగల పాదములు కలది అమ్మ.

కం. ప్రప వీవే జ్ఞానామృత

పిపాస తీర్చుటకు, కూర్మ పృష్ఠ జయిష్ణు

ప్ర పదాన్విత! నుతులు జనని!

యపురూపా! నీ పదముల నర్చింతు మదిన్.


శ్లో౧౯. నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణా

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా.

44. ఓం నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః.

నామౌచిత్యము.

తనకు నమస్కరించు జనులయొక్క అజ్ఞానమును పారద్రోలఁ గలిగిన కాలి గోరుల కాంతితో

నొప్పునది అమ్మ.

స్వయం కల్పిత

తమోపహ వృత్తము.

గణములు..న జ య స న ర వ.

యతి 11 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

మది నిలుమమ్మ! భవానీ! సుమనోహర కవిత్వరూపిణీ!

పదిలముగా మముఁ గాపాడి భవాంబుధిని దాటఁజేయుమా,

ముదమున నిన్నునుతింతున్ సముదంచితముగా వరాంగి!, జ్ఞా

నద! నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణా! నతుల్.


45.. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః.

నామౌచిత్యము.

పద్మముల కాంతికి మించిన కాంతి కలిగిన పాదద్వయముతో ప్రకాశించునది జగన్మాత.

స్వయం కల్పిత

పాదపంకజ వృత్తము.

గణములు జ . ర . భ . భ . జ . గ. ...

యతి 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా!

మదంబ! నీ పదాబ్జంబు మదిన్ నిలుపనీ కృపన్,

హృదబ్జమందు నీవుండి కృతుల్ వెలయఁ జేయుమా,

ముదంబు గల్గు నిన్నెన్నఁ బునర్జనన ముండదే,


శ్లో౨౦. శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా

మరాళీ మంద గమనామహా లావణ్య శేవధీ.

46. ఓం శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః.

నామౌచిత్యము.

చిఱు సవ్వడి చేసే అందమైన మణిమంజీరాలతో అలంకరింపఁబడిన పాదములు కలది మన 

అమ్మ.

స్వయం కల్పిత

శింజానమణిమంజీర వృత్తము.

గణములు....త . స . ర . య . జ . గ . .....

యతి . 7 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

రంజిల్లు మది నీ రమ్య పాద ధూళిన్ ధరించగన్,

సంజాత ఫలమై శాంతి నా మదిన్ నిండుచుండెడున్,

కంజాత నయనా! గర్వమున్ విడన్ జేయుమమ్మరో!

శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా!


47. ఓం మరాళీ మంద గమనాయై నమః.

నామౌచిత్యము.

ఆడ హంసల నడకల వలె నుండు నిదానమైన నడక కలది అమ్మ.

కం. శ్రీమన్మంగళ గమనా!

సామాన్యులు గాంచలే రసాధారణమౌ

నీ మహిమంపు గతి, మరా

ళీ మంద గమన! కనఁ బడు, లీలా హేలన్


48. ఓం మహా లావణ్య శేవధయే నమః.

నామౌచిత్యము.

ఈ నామమున శేవధి అనే పదము పుంలింగము గాన ఓం మహా లావణ్య శేవధయే నమః

 అనవలెను. అతిశయమైన అందమునకు నిధివంటిది అమ్మ..

కం. దశ నీవె, మహా లావ

ణ్య శేవధీ! నడువుము నను నయ మార్గమునన్

విశదమగు సత్ప్రవృత్తిని

విశేష శుభ కృత్యములను బ్రీతి నొసఁగుమా.


శ్లో౨౧. సర్వారుణా అనవద్యాంగీ, సర్వాభరణ భూషితా,

శివకామేశ్వరాంకస్థాశివాస్వాధీన వల్లభా.

49. ఓం సర్వారుణాయై నమః.

నామౌచిత్యము.

అమ్మ సర్వారుణ, అనురాగపు రాసి. చైతన్య స్వరూపము,

ఉ. కారణ మీవె సృష్టికిఁ, బ్రకాశము నీవె, జగత్ ప్రసిద్ధ!

ర్వారుణ! మంగళాంగి! యనురాగము చూపెడి లోకమాత! దు

ర్వార భవత్ప్రతాప మనివార్యము, దుష్టుల పాలి మృత్యువే,

నే రచియింతుఁ బద్యములు, నీ కృప సృష్టి గ్రహింప నెంచుచున్.


50. ఓం అనవద్యాంగ్యై నమః.

నామౌచిత్యము.

వంకపెట్టుటకు వీలు లేని శరీర భాగములు కలది.

మ. అనవద్యాంగి! జయంబు నీకు జననీ! యార్యా! మహాసాధ్వి! నీ

యనవద్యాంగములే గనన్సకలమాహార్యంబహో సృష్టికిన్

గన నెచ్చోటును లేదు నిన్ విడిచి, యోగంబిట్లు నిన్ గాంచుటే

కనఁగా నన్నిట నీదు రూపె ఘనమై కన్పించు నా కంటికిన్..

51. ఓం సర్వాభరణ భూషితాయై నమః.

నామౌచిత్యము.

సస్తమైన ఆభరణముల చేతను అలంకరింపఁబడు తల్లి.

కం. అభయద! నుత సర్వాభర

ణ భూషితా! కనుమ నన్ జనని! మొర వినుమా,

శుభముల శోభిలు తల్లీ!

యభయము నీవేను మాకు నన్నింట నిటన్.


52. ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః.

నామౌచిత్యము.

శివకామేశ్వరుని అంకముపై ఉండు జనని.

ఆ.వె. కామి తార్థ ద! శివ కామేశ్వరాంకస్థ!

యైహికంబుఁ బరము నమరఁ జేయు

మిమ్ము గాంచ సుగతి మేలుగా లభియించు

వందనంబు గొనుమ! భర్గు రాణి!


53. ఓం శివాయై నమః.

నామౌచిత్యము.

శివస్వరూపిణి, శుభగుణ స్వ్రూపిణి మన అమ్మ.ముక్తిస్వరూపిణి,

పంచ చామరము.

శివా! శివున్ గృపాత్మవై ప్రసిద్ధుఁ జేసి తీవె, యా

భవుండు నిన్ సగంబు దాల్చి భాగ్యశాలి యయ్యెగా,

సవిస్తృతంపు సృష్టి నొప్పసాధ్యమాయె నీ కృపన్,

శివుండు నీవు నొక్కటై విశేష భక్తిఁ గొల్పుడీ!


54. ఓం స్వాధీన వల్లభాయై నమః.

నామౌచిత్యము.

తనకు లోఁబడియుండు భర్త కలిగినది మన అమ్మ.

తే.గీ. వల్లభుండనఁ బరమాత్మ, వరలుచున్న

జీవమాత్మయౌన్, బరమాత్మఁ జేరఁ జీవి

తపన చెందెడుఁ జేర్చుమీ తత్త్వమరసి,

నీవు స్వాధీన వల్లభా! నిన్నుఁ గొలుతు..


శ్లో౨౨. సుమేరు శృంగ మధ్య స్థా, శ్రీమన్నగర నాయికా,

చింతామణి గృహాంతస్థా, పంచ బ్రహ్మాసన స్థితా.

55. ఓం సుమేరు శృంగ మధ్య స్థాయై నమః.

నామౌచిత్యము.

మేరు పర్వతపు శిఖ్ర మధ్యభాగమున ఉండునది మన జనని. శ్రీచక్రమున బిం 

స్థానముననుండున్ది. సహస్రారకమల మధ్యస్థానమున ఉండునది మన అమ్మ.

తే.గీ. ఆత్మలోఁ గల్గు సృష్టియం దనుపమముగ

ధ్యాన మేరువుపై వెల్గు జ్ఞాన రూప!

ధీ వరేణ్యులం గాచు సుధీ! సుమేరు

శృంగ మధ్య స్థ! నిలుము నా చిత్తమునను.

56. ఓం శ్రీమన్నగర నాయికాయై నమః.

నామౌచిత్యము

శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి. మ్మ్.

కం. ధీ శ్రేయములను నీవే

గా శ్రీమన్నగర నాయికా! కృపతో నీ

యాశ్రితులకు!ం గలిగింతువు,

నీ శ్రిత వాత్సల్యమును గణింపగఁ దరమా.


57. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః!

నామౌచిత్యము.

చింతామణులచే నిర్మింపఁబడిన గృహములో నివసించునది మ్న అమ్మ. కోరినవి యిచ్చు మణిగా 

చింతామణి ప్రసిద్ధి చెందినది.నిరంతరము శక్తి కొలది పరులకు సహాయపడుచు అమ్మను 

చింతించుచు ఉండే హృదయమేచింతామణి అనుకొన్నచో మ్మ ఆ హృదయమనెడి గృహమునే

 ఆవాసముగాఅ చేసుకొని, మంగళప్రదగాకనికరిస్తుంది.

అష్టమూర్తి వృత్తము

గణములు.... మ న త స ర భ జ య

యతి.....1.....9.....17.

ప్రాస నియమము కలదు.

మాతా! నిన్ దలతు చింతామణి గృహాంతస్థ! నిన్నే మదిని నిల్పుచు, నమ్మా

ఖ్యాతిన్ బద్యముల నల్లం గనఁగ సద్భావనల్ వొంగవె? నినున్ విరచింపన్.

చైతన్యంబును మహద్విజ్ఞతయుఁ జేకూరునమ్మా! జయ పథమ్మును గాంచన్,

నీ తత్త్వంబుఁ గననిమ్మా, నిను గ్రహింపన్, గృపన్ బెన్నిధివి, నన్ గను తల్లీ!


58. ఓం పంచ బ్రహ్మాసన స్థితాయై నమః

నామౌచిత్యము.

పంచబ్రహ్మవినిర్మిత ఆసనమున ఉండునది మన అమ్మ. బ్రహ్మ, విష్ణు, రుద్ర,, ఈశ్వర,

సదాశివులు పంచ బ్రహ్మలు..కుండలినీశక్తి వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వ గతి 

పొందుచున్నప్పుడు మూలాధారస్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మగ్రంధిని, మణిపూర, 

అనాహతచక్రములకుయ్ సంబంధించిన విష్ణు గ్రంధిని, విశుద్ధ ఆజ్ఞా చక్రములకు

 సంబంధించిన  రుద్రగ్రంధిని,లలాటమునకు శిరోమధ్యభాగమునకు సంబంధించిన ఈశ్వర

 స్థానమును అధిగమించును, ఈ విధముగా పంచబ్రహ్మాసనస్థిత అయి మనలోనే ఉన్నది అమ్మ.

తే.గీ. కోణ పంచకమందునఁ గూర్మినొప్పు

బ్రహ్మపంచకమందునఁ బ్రబలుచున్న

పంచ బ్రహ్మాసన స్థితా! ప్రణతులమ్మ!

నిన్ను సేవింతు నా మదిన్ నిలువుమమ్మ!


శ్లో౨౩. మహా పద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ,

సుధాసాగర మధ్యస్థా కామాక్షీ, కామదాయినీ.

59. ఓం మహా పద్మాటవీ సంస్థాయై నమః.

నామౌచిత్యము.

మహిమ కల షట్చక్ర పద్మాటవి యందు ఉండునది యీ అమ్మ. మహాపద్మమయిన 

సహస్రారమున నుండునది యీ జనని.

శా. భావింపంగను నా శరీరమను నీ పద్మాటవిన్ నిల్చితే,

భావాతీత విశేషపుణ్యద! మహా పద్మాటవీ సంస్థ! నిన్

సేవింతున్ మనసార భావ జగతిన్ శ్రీదేవి! ప్రీతిన్ సతీ!

నీవే నా కవితామృతంబువగుచున్ నిత్యంబు భాసింపుమా.


60. ఓం కదంబ వనవాసిన్యై నమః.

నామౌచిత్యము..

కడిమిచెట్ల వనమున నివసించునది యీ లోకమాత.

కం. సేవించెద నిను మదిలో

భావనఁ జేయుచుఁ గదంబ వనవాసిని! నన్

గావుము ద్వంద్వాతీతా!

నా వందన మందుమమ్మ! నను గృపఁ గనుమా.


61. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః.

నామౌచిత్యము.

శ్రీచక్రములోని కేంద్ర బిందువు సూచించు సహస్రార కమలము మధ్య నుండునది జగన్మాత.

కం. తరణోపాయము నీవే,

కరుణ సహస్రారమునను గలిగితివమ్మా!

వర తేజమున సుధా సా

గర మధ్యస్థా! కృపాబ్ధి! కావుమ నన్నున్.


62. ఓం కామాక్ష్యై నమః.

నామౌచిత్యము.

కమనీయమైన నేత్రములు కలది అమ్మ, కామకోటిపీఠాధిదేవత, కమనీయ రమణీయ భావపూర్ణులై 

అమ్మను చూచు భక్తులననుగ్రహించు కమనీయ నేత్రశోభిత మన తల్లి కామాక్షి

శా. కామాక్షీ! కరుణామయీ! బుధనుతా! కల్యాణి! సౌభాగ్యదా!

శ్రీమాతా! జగదంబ! నీవు కృపతోఁ జిత్తేజమై వెల్గుచున్

మా మీదన్ దయఁ జూపుచున్ శుభములన్ మాచేతఁ జేయించుమా,

నీ మార్గంబున మమ్ము నిల్పి వరదా! నిత్యంబు కాపాడుమా.


63. ఓం కామదాయిన్యై నమః.

నామౌచిత్యము.

కోరినవి యిచ్చు కామదాయిని మన అమ్మ, కామేశ్వరుని మనకు అందునట్లు చేయు తల్లి 

కామదాయిని మన అమ్మ.

ఉ. వెన్నెలఁ బోలు నీ నగవు, వీనుల విందొనరించు పల్కులున్,

గన్నులఁ గాంతి రేఖలును, గామితముల్ నెరవేర్చు హస్తముల్,

వెన్నను బోలు మానసము, విజ్ఞతతోఁ గనఁ గోరు చుంటి నా

గన్నులఁ బండువౌచు నికఁ కన్పడు మమ్మరొ! కామదాయినీ!


శ్లో౨౪. దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవా

భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితా.

64. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవాయై నమః.

నామౌచిత్యము.

బ్రహ్మాది దేవతల యొక్క, వశిష్ఠాది ఋషుల యొక్క ఆదిత్యాది గణదేవతల యొక్క సమూహము 

చేత స్తోత్రము చేయఁబడుచున్న తన యొక్క గొప్పతనము కలది మన అమ్మ. భండాసుర 

నిర్మూలనార్థమైవీరందరూ అమ్మవారి ఆవిర్భావం నిమిత్తము సామూహికముగా స్తుతించిరి. 

దేవగణమయిన అచ్చులతోను,ఋషిగణమయిన హల్లులతోను, సంఘాత సంకేతముగా 

గ్రహింపదగు క్ష కారముతోను, అనగా ఏబది అక్షరములతో స్తుతింపఁబడునది మన అమ్మ..

స్వయం కల్పితము

దేవీవైభవ వృత్తము

గణములు....; మ న మ ర ర వ .

యతి. 10 వ అక్షరము. .....

ప్రాస నియమము కలదు.

శ్రీదేవీ! నినుఁ గనన్ నేరన్ జిత్తమందున్, స్మరించెదన్,

నే దీనుండను మహాకాళీ! నీవు చూడంగదే సతీ!

నీ దివ్యాంచిత మహత్కాంతిన్ నేర్పుతో నాత్మ చూడ లే

దో? దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవా!


65. ఓం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః.

నామౌచిత్యము.

భండుఁడు అను రాక్షసుని వధించుటకు ప్రయత్నించు స్త్రీదేవతల సేనలతో చక్కగా 

కూడియున్నది మన అమ్మ. అజ్ఞాన మద అహంకారముల స్వరూపమే భండాసురుఁడు. 

అట్టివానిని  నశింపఁ జేయుటకు జ్ఞానముతో కూడిన భావాలకు ప్రతీకలైన శక్తి సేనలతో 

సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి అమ్మ.

స్వయం కల్పిత 

లలితామోద వృత్తము.

గణములు. ..స .. భ . య .. జ .. త .. ర.

యతి 11 వ అక్ష్రము.....

ప్రాస నియమము కలదు.

భయమున్ బాపుమ, ప్రమోదమ్ము వర్ధిలన్ జేయుమా కృపన్,

నియతిన్ నిన్ మదిని సేవింతు నిత్యమార్గంబు నందికన్,

ప్రియ సద్భాషణము నీచేత వృద్ధియౌనమ్మరో సతీ!

జయ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా!


శ్లో౨౫. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితా

అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిసమావృతా

66. ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః.

నామౌచిత్యము.

సంపత్కరీదేవి చేత చక్కగా అధిరోహింపఁబడిన ఏనుగుల సమూహము చేత 

సేవింపఁబడినదిజగన్మాత..చిత్త వృత్తులే సంపత్కరీదేవి. జ్ఞానేంద్రియములవలన 

చిత్తవృత్తులేర్పడును. ఈ శబ్దాదులే ఏనుగుల

సమూహము. సంపత్కరి ఈ సింధురవ్రజను అదుపులో పెట్టి మంచిపనులు చేయించును. వటిచే

సేవింపఁబడును.

స్బయం కల్పిత

సింధురవ్రజ వృత్తము.

గణములు........ర ర య జ భ ర ....

యతి....11వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

సేవ్య! సంపత్కరీ సమారూఢ సిందుర వ్రజ సేవితా!

సవ్య మార్గంబునన్ బ్రయాణింపఁ జాల నన్ గరుణింపుమా

భవ్య లక్ష్యంబుతో నినున్ గాన వచ్చితిన్, గనిపింపుమా.

దివ్యమౌ నీదు తేజమే నాకు దీప్తిఁ గొల్పును భార్గవీ!

సీ. శ్రీకరీ! సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా! కరుణఁ గనుము.

సత్య సంపదలను సజ్జనులకొసఁగి, ధర్మంబు నిలుపుము ధరణి పైన,

సమరస భావంబు నమలిన తత్వంబు నమరఁ జేయుము నాకు కమల నయన!

జయ మార్గమును జూపి నయ మార్గ వర్తిగా నమరఁ జేయుము తల్లి! కొమరుఁడఁ గద,

తే.గీ. నిత్య సంతోషమే మది నీవు వెలుఁగ,

సత్య సంవర్తనయె నీకు జయము వలుకు,

స్తుత్య సద్వృత్తమే నిన్ను స్తుతిని జేయ

కృత్యముల నిన్నె దలతు, సత్కృతులఁ గొలుతు.


67. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః.

నామౌచిత్యము.

అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించఁ బడిన అధిక సంఖ్యలో గల గుఱ్ఱాలచే ఆవరింపఁ

బడినది.ఇంద్రియములనదుపులోనుంచి, శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారితీయించగల వాటిచే

సేవింపఁబడునది మన అమ్మ.

స్బయం కల్పిత

సల్లాలిత వృత్తము.

గణములు. .. మ త ర జ జ గ.

యతి...7 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

అశ్వారూఢాధిష్ఠి తాశ్వకోటి కోటి భిరావృతా!

శశ్వత్ సౌఖ్యంబిమ్ము, సాధ్య మీవెయై మది వెల్గుచున్,

విశ్వంబందున్ నిన్నె వేల్పువంచు భావనఁ జేసెదన్,

విశ్వేశుం డాలింపఁ బిల్చు నిన్నె సృష్టిని జేయగన్.


శ్లో౨౬. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా

గేయచక్ర రథారూఢ మంత్రిణీపరిసేవితా

68. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః.

నామౌచిత్యము.

చక్రరాజ రథమునందుంచఁబడిన ఆయుధములచే అలంకరింపఁబడినది....శ్రీచక్రములో 

ఆత్మజ్ఞాన సంపత్తితో అలంకరింపఁబడినది, సూర్యుఁడినే యిరుసుగా కలిగి ఖగోళమున 

అలంకరింపఁబడిన సూర్యకుటుంబమనే ఏక చక్రమును అధిరోహించినది జగజ్జనని.

స్వయం కల్పిత

చక్రరాజ వృత్తము.

గణములు .. ర . స . ర . భ . జ . గ

యతి .9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

చక్రరాజ రథా రూఢ సర్వాయుధ పరిష్కృతా!

వక్ర మార్గము నాకేల? వర్ధిల్లెదను సత్ప్రభన్,

చక్రి పూజిత శంభుండె సద్భాగ్యమగు నాకిలన్

విక్రమంబున మౌఢ్యంబు వీగంగనికఁ జేయుమా.


69. ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరి సేవితాయై నమః.

నామౌచిత్యము.

శ్రీచక్రములోని త్రికోణమే గేయ చక్ర రథము.త్రికోణానికి అధిష్ఠాన దేవతయైన త్రిపురాంబయే 

పరమేశ్వరికిమంత్రి అయిన రాజశ్యామల. ఈమె సేవలనందుకొనునది జగన్మాత. గేయ చక్రమనగా

 సూర్యమండలము.సూర్యలోకాన్ని పొందిన యోగినులు దేవిని ధ్యానించి పరలోకం చేరుదురు. 

అట్టివారిచే సేవింపఁ బడునది జగన్మాత.

సీ. శ్రీచక్రమునకుపైఁ జెల్వొందుచున్నట్టి గేయ చక్రాధిష్ఠ కృపను గనెడి

శ్యామలాంబను జుట్టి చక్కగానొప్పెడి మంత్రిణి సేవలు మదిని గొనుచు

సృష్టి నేలెడి తల్లి! దృష్టిలో నను నిల్పి ప్రకటితముగఁ గావు సకల కామ్య

దా! గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరి సేవితా! నిన్నుఁ బ్రస్తుతింతు,

తే.గీ. కనగ శ్రీచక్రమది నేనె, ఘనముగ నట

వెలుఁగుచుంటివి, కననైతి, విశ్వ జనని,

యాత్మలో జ్ఞాన తేజము నమరఁ జేసి,

నిన్ను దర్శింపనిమ్మికన్ నేర్పుమీర.


శ్లో౨౭. చక్ర రథారూఢ దండనాథ పురస్కృతా

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగా

70. ఓం కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతాయై నమః.

నామౌచిత్యము.

వరాహములచే లాగఁబడు చక్రములు గల రథమునెక్కిన వారాహి యను దండనాథ చే 

సేవింపఁబడునది. జ్ఞానమను వారహిచే సేవింపఁబడునది అమ్మ. ఆమె దండనాయిక. 

అంతశ్శత్రువులను దండించు జనని.

స్వయం కల్పిత

రథారూఢ వృత్తము.

గణములు.......న జ య జ త ర

యతి...౧౧వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

ధర కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతా!

గురుతర శత్రుల షట్కం బగోచరంబై వహించెడున్,

సరగున నా మదిలో నుండి సంహరించంగ వేడెదన్

తెరవు నినుంగని పొంగన్ బ్రదీప్తమౌ జ్ఞానమిమ్మికన్..


71. ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః.

నామౌచిత్యము.

జ్వాలామాలిని అనే నిత్యాదేవతచే ఆవరించఁబడిన అగ్నిప్రాకారములో మధ్యగా ఉండుతల్లి 

శ్రీమాత. మనలో నేను తాను అనే పదాలతో చెప్పఁబడే ఆత్మస్థానముననుండు జనని.

ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఎక్కడ లీనమై ఎక్కడనుండి ప్రారంభింపఁబడునో అచ్చట ఉండునది 

శ్రీలలితాంబిక.

స్వయం కల్పిత

జ్వాలామాలిని వృత్తము.

గణములు......మ స ర మ జ గ.

యతి 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగా!

నీ లీలల్ వివరింపంగ నేనేరీతిన్ దగన్ గనన్

బాలా! నాకిల నీదండ వహ్నిప్రాకారమేకదా,

జాలిన్ జూపుమ,దేవీ ప్రశాంతిన్ నిత్యంబు గొల్పుమా.


శ్లో౨౮. భండ సైన్య వధోద్యుక్తశక్తి విక్రమ హర్షితా

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా.

72. ఓం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః

నామౌచిత్యము.

భండాసురుని, అతని సైన్యమును సంహరించుట కొఱకు సంసిద్ధమై యున్న తన 

సైన్యవిక్రమాన్ని  చూచి ఆనందించు దేవి. మనలోని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొఱకు 

సంసిద్ధమగు చున్న జ్ఞాన  సంపర్కమును చూచి ఆనందిచు తల్లి.

సీ. ఆత్మలో విహరించు నరిషట్కమే భండ సైన్యంబు, దానిని సమయఁ జేయ

నుద్యుక్తమగు శక్తి నుదయించు విక్రమ మును జూచి పొంగెడి పూజ్య భండ

సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షి తా! నీవె నాకండ, దయను గనుమ,

నిరతంబు నీ స్మృతుల్ వరలించు నా మదిన్, నా దోషముల్ వాపి యాదుకొమ్మ.

తే.గీ. జ్ఞాన తేజంబుగా నిన్నుఁ గనఁగ నిచ్చి,

యైహికాముష్మికమ్ముల నందనిమ్ము,

నిన్ను వివరించి జగతికిన్ దెలుపనిమ్ము,

జగతినంతటఁ గల నీవు జయమునిమ్ము.


73. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకాయై నమః.

నామౌచిత్యము.

నిత్యా దేవతల యొక్క పరాక్రమాటోపములను చూచి సంతోషము పొందు తల్లి లలితాంబ.

పరాక్రమాటోపములను ప్రదర్శించు ఆత్మ శక్తిని చూచి సంతోషించెడిది మన అమ్మ.

స్వయం కల్పిత

సముత్సుక వృత్తము.

గణములు .. త .. ర .. భ .. భ .. జ .. గ.

యతి 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా!

సత్యంబు నిత్యమున్ నేఁ బచరించు నటులన్ గృపన్

స్తుత్యా! యొనర్పుమా నాకు శుభంబులను గొల్పుమా,

భృత్యుండ నేను నీ చెంతఁ బ్రియంబుఁ గన నుండెదన్..


శ్లో౨౯. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా

74. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః!

నామౌచిత్యము.

భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలయిన బాలాదేవి విక్రమము చూచి 

సంతోషించునది అమ్మ. మనలో భ్రమలను పుట్టించి,వంచించే ఆసురీ శక్తులను నిర్మూలించి, 

మనలను కాపాడేబాలాత్రిపురసుందరి విక్రమమునకు సంతసించు తల్లి.

స్వయం కల్పిత

బాలావిక్రమ వృత్తము.

గణములు .. ర . స . ర . త . జ . గ.

యతి .. 9 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా!

భండపుత్రులె దుర్మార్గ భావంబుల్ నను వ్రేచెడిన్

పండువెన్నెలగానీవ భావాతీత శుభాకృతిన్

నిండుగా మదిలోనుండి నిత్యా! రక్షణ సేయుమా.


75. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః.

నామౌచిత్యము.

మంత్రిణీదేవిచే విరచింపఁబడిన విషంగ వధకు సంతోషించునది ఈ లోకమాత.

విషంగుఁడు, విశుక్రుఁడు భండాసురుని సోదరులు.. విషంగుఁడు మనలో లంపటత్వాన్ని

రెచ్చగొట్టేవాడు.అమ్మవారి మంత్రి అయిన శ్యామలాదేవి విషంగుని వధించుట చూచి 

సంతోషించునది మన అమ్మ.

స్వయం కల్పిత

మంత్రిణీ వృత్తము.

గణములు .. స మ న స న ర వ.

యతి .. 11వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

విను, మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా! కృపన్.

వినయంబున్ బాపున్ గుణమది విషంగుడె కనంగ, వింటివా?

కనుమమ్మా! యోచింపకుమ, తగ వీడునటుఁ జేయుమా సతీ!

ఘనమౌ నీ నామంబిల శుభ కరం బది గ్రహింపఁ జేయుమా,


శ్లో౩౦. విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితా

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా.

76. ఓం విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితాయై నమః.

నామౌచిత్యము.

విశుక్రుని ప్రాణములను హరించిన వారాహి యొక్క పరాక్రమమునకు సంతోషించునది జగన్మాత.

శుక్ర వికార ఆసురీ గుణమును యోగదండమును పట్టి యోగమార్గము ద్వారా రికట్టే దండనాథ 

అయిన వారాహీదేవి పరాక్రమమున్కు సంతోషించు తల్లి.

స్వయం కల్పిత

వారాహి వృత్తము.

గణములు . ర . త . న . మ . ర . వ. ..

యతి 10 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

భావనాకాశమ్మున గల బ్రహ్మాండంబీవె పార్వతీ!

జీవితాంతంబున్ శుభగతి సేవింతున్ నిన్నుసమ్మతిన్,

నీ విధానంబున్ దెలుపుము నిన్ గొల్వన్,, దిక్కు నీవె రా

వా! విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితా


77. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః.!

నామౌచిత్యము.

కామేశ్వరుని మఖావలోకముమాత్రమున గణేశ్వరుని కల్పించిన జనని.

స్వయం కల్పిత 

కామేశ్వరీ వృత్తము.

గణములు . త . స . ర . స . జ . గ

యతి 9 వ అక్షరము .

ప్రాస నియమము కలదు.

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా!

నామాళిని నినున్ గాంతు నా మది వెల్గుమీవిఁకన్,

హేమాభ తను! వీకున్నదే కనలేని దేదియున్,

శ్రీమాతవు ప్రభాపూర్ణ! చేకొని కావుమా ననున్


శ్లో౩౧. మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా

భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ

78. ఓం మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః.

నామౌచిత్యము.

మహా గణేశ్వరునిచే నశింపఁ జేయఁబడిన విశుక్రుఁడు ప్రయోగించిన జయవిఘ్నయంత్రమునకు 

మిక్కిలి సంతోషించినది అమ్మ.

స్వయం కల్పిత

విఘ్నయంత్ర నాశిని వృత్తము.

గణములు .. న . ర . య . జ . త . ర. ..

యతి 11 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

లలి విశుక్రుడష్ట విఘ్నమ్ములన్ ననున్ బాధ పెట్టుచో

నిలువలేను, గావుమో యమ్మ! నీవె నా కోర్కెఁ దీర్చుమా,

కలవరంబుఁ బాపుమా నన్ను కావ, నీ రక్షణేచ్ఛ దీ

పిలు, మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా


79. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః.

నామౌచిత్యము.

భండాసురుఁడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినది అమ్మ.

దుస్సంకల్పములనే అస్త్రశస్త్రాలను మూలములోనే నశింపఁ జేయునది అమ్మ.

స్వయం కల్పిత సరసీరుహ వృత్తము..

గణములు. ..స . ర . య . జ . త . ర.

యతి 11 వ అక్షరము. ....

ప్రాస నియమము కలదు.

వినుతింతున్ బరాత్పరీ! నిన్ను విశ్వసింతున్ మనంబునన్

గను విందై కనంబడన్ నమ్మికన్ నినున్ జేర రానొకో

కని నాలోని దుర్మతిన్ బాపి కావుమ నీవే కృపాబ్ధి,! ధ్యా

సను, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ!


శ్లో౩౨. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః

మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా.

80. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః

నామౌచిత్యము.

రెండు చేతుల వేలి గోళ్ళనుండి ఉత్పన్నమయిన నారాయణుని దశావతారములు కలది అమ్మ.

స్వయం కల్పిత

కరాంగుళి వృత్తము.

గణములు న . భ . య . య . న . ర.

యతి. 11 వ అక్షరము.

ప్రాస నియమము కలదు.

నిను వినా కనగ నేరన్, గణించన్ బరము, కావుమా

నను కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతీ!

మనములో నిలిచి, మన్నించుమా శాశ్వతముగా సతీ!

కనుము నన్ ఘనముగా నీవికన్, బాధలను బాపుమా.!

(ప్రణుతులమ్మ! శుభదాయీ! నివారింపుమిక బాధలన్.,)


81. ఓం మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః.

నామౌచిత్యము

తాను ప్రయోగించిన మహాపాశుపతాస్త్రాగ్నిలో పూర్తిగ నిర్మూలింపఁబడిన రాక్షసులసైన్యము కలది

అమ్మఅజ్ఞాన ఆసురీభావాలను ఒకే ఒక అద్వితీయమైన సంకల్పశక్తితో అంతము చేయునది 

అమ్మ.

స్వయం కల్పిత

పాశుపత వృత్తము.

నామౌచిత్యము

గణములు.   . . . . . .    

యతి 11 అక్షరము.  

ప్రాస నియమము కలదు.

వినుత పాదాబ్జ యుగా! నిన్నె విశ్వాసంబున నిల్పితిన్

మనమునందున్, సతమున్ గావుమా నీవే, కనఁ  గోరెదన్

నిను, మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా!

కని మదిన్ గల్గెడి దుష్టాళిఁ కాలం జేయుమ, సత్ కృపన్.

 

శ్లో౩౩కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకా

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా.

82. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకాయై నమః.

నామౌచిత్యము.

కామేశ్వరాస్త్ర ప్రయోగానికి భండాసురునితో పాటు పూర్తిగ దగ్ధమైపోయిన శూన్యక పట్టణము కలది

అమ్మస్వచ్ఛమైన ప్రేమామృతంలో నిర్మలమైన జ్ఞానాగ్నిలో లీనమైన అహంకారాజ్ఞాన స్థావరము 

కలది అమ్మ.

స్వయం కల్పిత 

కామేశ్వరాస్త్ర వృత్తము.

గణములు.  ..  . . . . . .    ..   

యతి 11 అక్షరము.  .. 

ప్రాస నియమము కలదు.

క్షితిపైఁ బుట్టఁ జేసి, నన్నిట్లు చికాకుం బడఁ జేసితే,

మితియే లేని మాయ నన్ బట్టె, స్మృతిన్ బాపుచు నుండెనే,

బ్రతిమాలించుకొందువేలో? బరమేశానివి. కావు నన్

సతి! కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకా!


83. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః.

నామౌచిత్యము.

బ్రహ్మ విష్ణువు ఇంద్రుఁడు మున్నగు దేవతల చేత స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.

ఆత్మజ్ఞానముతో స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.

స్వయం కల్పిత 

దేవ సంస్తుత వైభవ వృత్తము.

గణములు.  ..  . . . . . .    ..   

యతి 11 అక్షరము.  .. 

ప్రాస నియమము కలదు.

జీవ మీవే, నామదిలోనుండి సేవలందుదు వీవెగా,

భావమీవే, యన్నిట నీదైన ప్రాభవంబె కనంబడున్,

నీవె నా కీర్తిన్ భువిపైఁ బెంచు నిర్మలాత్మవు, కొల్తు నిన్

దేవి! బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా!

 

శ్లో౩౪హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః,

శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖ పంకజా.

84. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధ్యై నమః.

నామౌచిత్యము.

ముక్కంటి చూపుచే పూర్తిగా దగ్ధమైన కామునికి సంజీవని అమ్మ

కామాగ్నిదగ్ధులను ప్రేమామృతంతో ప్రమోదమును కలిగించి  రక్షించునది అమ్మ.

సీనిన్నె నమ్మితిఁ గొల్పు నీ రక్ష, సద్రక్ష - ! హర నేత్రాగ్ని సందగ్ధ కామ

సంజీవనౌషధీ సత్వరంబుగ, నీదు పదముల చెంతను ప్రబలనిమ్ము,

కామాదులన్ బాపి గౌరవంబును నిల్పి మోక్ష మార్గము సూపి ముక్తినిమ్ము,

జీవితాశయము నిన్ జేరుటే యని నీవు నన్ను గ్రహింపుమా నాదు జనని!

తే.గీనాదు జన్మంబు వ్యర్థమౌ శ్రీద! నేను  

చేరకుండిన నిన్ను, నన్ జేదుకొనుము.

లక్ష్య సంసిద్ధి గొల్పెడి లక్ష్మివీవె,

నీకు వందనం బనుపమ! నీరజాక్షి!.


85. ఓం శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖపంకజాయై నమః.

నామౌచిత్యము.

మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపఁబడే ముఖపద్మము కలది అమ్మ.

స్వయంకల్పిత 

వాగ్భవ వృత్తము.

గణములు.   ..   . . . . . .   

యతి.   11 అక్షరము.   

ప్రాస నియమము కలదు

కరుణాంభోధీ కన రావేలా? కళా నిలయ మీవెగా,

పరమానందంబున వర్ధిల్లన్ బ్రశాంతిగ మనంగనౌన్

వరలింపంగన్ నను నీదేగా ప్రభావ మిల లేరు నీ

సరి, శ్రీమ ద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా!

 

శ్లో౩౫కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ,

శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ.

86. ఓం కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణ్యై నమః.

నామౌచిత్యము.

కంఠము నుండి నడుము వరకూ ఉన్న భాగాన్ని పంచదశీ మంత్రములోని మధ్య కూట

స్వరూపముగా కలది అమ్మ.

కామేశ్వరుని స్థానమై అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానము నుండి కంఠము కటి మధ్య

ప్రదేశమునుమధ్యకూట స్వరూపముగా కలది అమ్మ.

స్వయంకల్పిత 

మధ్య కూట వృత్తము.

గణములు.   ..   . . . . . .   

యతి. 11 అక్షరము.  

ప్రాస నియమము కలదు

అనురాగంబున్ గన, నిన్నున్మహార్తితోఁ గొల్చెదన్ శివా!

నను నీ భక్తున్ సుఖ మార్గంబునన్ శుభోద్దీప్తి వెల్గనీ,

కని నన్నింకన్ ధరణిన్ నిల్పగా సతం బీవు చూపు ప్రే

మను, గంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ!


87. ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః.

నామౌచిత్యము.

శక్తి కూటముతో సామ్యమున్న కట్యధోభాగమును ధరించినది అమ్మ.

స్వయంకల్పిత 

శక్తికూట వృత్తము.

గణములు.   ..   . . . . . .    

యతి. 11 అక్షరము.   

ప్రాస నియమము కలదు

ధనమేల నీవున్న నాకున్ ముదంబు నిల్చున్ మనంబునన్,

గొన మీవె నాకున్, ధనంబే యగున్ జిదానంద రూప! భా

వనమందు నీవుండి దేవీ! ప్రభావమిమ్మింక. ప్రేమతోఁ

గను శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ!

 

శ్లో౩౬మూల మంత్రాత్మికామూలకూటత్రయకళేబరా,

కులామృతైక రసికా కుల సంకేత పాలినీ.

88. ఓం మూల మంత్రాత్మికాయై నమః.

నామౌచిత్యము..

మూల మంత్రమైన పంచ దశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపగా కలది అమ్మ.

తేపద్య పుష్పాళి నీ పాద పద్మములను

కొలువ వెలయుచునుండెను గొనుము జనని!

జన్మరాహిత్య మర్ధించు జనులనెన్ని

మూలమంత్రాత్మికా! నీవ ప్రోవుమమ్మ!


89. ఓం మూలకూటత్రయకళేబరాయై నమః.

నామౌచిత్యము.

మూల మంత్రమైన పంచాక్షరీ మంత్రము యొక్క మూడు కూటములను సూక్ష్మ శరీరముగ కలది

అమ్మ.

తే.గీమూలకూటత్రయమున నిన్ బూజ్యుఁడు కను,

సృష్టి కంతటి కీవెగా పుష్టివి కన,

మూల కూటత్రయ కళేబరా! సద్భ

గవతి వని నిన్ను నర్చింతుఁ గనుము గృపను.


90. ఓం కులామృతైక రసికాయై నమః.

నామౌచిత్యము.

కులమునకు సంబంధించిన అమృతము నందు మిక్కిలి ఆసక్తి కలది అమ్మ.

సహస్రార పద్మములోని చంద్రమండలం స్రవించే అమృతమునందాసక్తి కలది అమ్మ.

తే.గీ. త్రిపుటి వీవేను, కులమదే, తృప్తి నచటఁ

బొందుదానవు, నాకు నానందమటులె

పొందఁ జేయుము, నీ చెంత, నుందుఁ దృప్తిఁ

గనఁ, గులామృతైక రసికా! కల్పవల్లి!


91. ఓం కుల సంకేత పాలిన్యై నమః.

నామౌచిత్యము

కుల సంబంధమైన ఒడబాటులను, ఏర్పాటులను పాలించు తల్లి. కౌళవిద్యా  రహస్యములను

కాపాడునది.

కంలో కుల సంకేత నిధుల

శ్రీకర పరిపాలనంబుఁ జేసెడి జననీ!

లో కుల గోప్యతను వరల

నీ, కులసంకేత పాలినీ! వందనముల్.

 

శ్లో౩౭  కులాంగనాకుళాంతస్స్థా కౌళినీ కులయోగినీ,

అకులాసమయాంతస్థాసమయాచార తత్పరా.

92. ఓం కులాంగనాయై నమః.

నామౌచిత్యము.

కులము వంశము శీలము మానము మర్యాద, పాతివ్రత్యము మున్నగు వాటి యందు సత్ ప్రవర్తన

స్వభావాదులు కలిగిన  స్త్రీని కులాంగనగా పరిగణింతుము. అట్టి లక్షణములు కలిగియున్న అమ్మ

కులాంగన.  కులాంగనల యందు గోచరమగు తల్లి.

చంఅరయఁగఁ బృథ్విపైఁ గల కులాంగనలన్ గల సత్ప్రవృత్తియే

నిరుపమ ధర్మతేజమును నిల్పుచునుండెను సత్యమిద్దియే,

మరువగ రాదు నీ మహిమ, మాన్య కులాంగన లందు నీవెగా

నిరుపమ రీతి నుందువు గణింప? కులాంగన! సత్ ప్రవర్ధనా!


93. ఓం కులాంతస్స్థాయై నమః

నామౌచిత్యము.

కులము నందు కలది, కౌల విద్యలో కలది. మూలాధార చక్రము నందు కలది అమ్మ.

శామోదంబొప్పగ చక్రషట్క కుల సన్మూలంబువై నిల్చి, సద్

బోధన్ గొల్పుచు నుందు వమ్మ జననీ! పుణ్యాత్ములన్ గాంచి, మో

హాదుల్ వాపగ నెంచి మానవ కులంబందున్ బ్రవర్తించు నిన్

దాదాత్మ్యంబున మేము గొల్తుము కులాంతస్స్థా! నమో వాకముల్.


94. ఓం  కౌళిన్యై నమః.924,

నామౌచిత్యము

శివ శక్తుల సామరస్యమును, సమన్వయమును తెలియఁ జేయు కుల విద్యకు అధిష్ఠాత్రి అమ్మ.

కౌలాచారులచేఁ గొలువఁబడు దేవత అమ్మ. కుల దేవతల రూపంలో ఆరాధింపఁబడునది అమ్మ.

.వెకుళయె శక్తికన, నకులయా శివుండౌను,

కలసి యకుల కులయు కౌళినయితె?

గ్రామదేవతవయి కాచెడి కౌళినీ!

గన  . మూ . లముగను కౌళినివిగ.

( = సహస్రారము నకు

మూ = మూలాధారము నకు

సంకేత వర్ణములు)


95. ఓం కులయోగిన్యై నమః.

నామౌచిత్యము.

కుండలినీ యోగ దేవతా స్వరూపిణి అమ్మ.

చంప్రగణిత పంచమావరణ భాసిత సత్ కులయోగినీ! లస

న్నిగమ సువేద్య! వందనము, నిష్ఠగ మూల సుచక్రవాసివై,

జగతిని జూపుచుందువుగ చక్కగ మాకు సతంబు నీవు, ని

న్నగణిత భక్తిఁ గొల్చెద మనంత శుభాస్పద! స్వీకరింపుమా.

96. ఓం అకులాయై నమః.

నామౌచిత్యము.

తనకనుచు ప్రత్యేకమైన కులము లేని అకుల మన అమ్మ. అకారముతో ప్రారంభమగు అక్షర కుల

దేవత జనని.

సకలంబున్ సతతంబు నీవయి సహస్రారంబునన్ వెల్గు దీ

వకులా! నీ పతి తోడ మమ్ము గన, భాగ్యంబన్న మాదే కదా,

యకులంబందు వసించు నీ యునికి మే మాత్మన్ గనన్ గల్గినన్

బ్రకటంబౌదువు నీవు మాకు జననీ! రాణింపఁ జేయన్ మమున్.

చంవరలు సహస్రమన్నకులపద్మముపై పతితోడనొప్పు నీ

దరహసనాంకుర ప్రభ లుదార దయామతిఁ గాచు సృష్టినే.

నిరుపమ బాహ్యదూరమగు నిత్యము నెన్నుచు గాంచఁ జేయు నీ

కరుణను జూపుమో యకుల! కాచెడి తల్లివి  నీవె శాంభవీ!


97. ఓం సమయాంతస్థాయై నమః.

నామౌచిత్యము.

సమయాచార అంతర్వర్తిని అమ్మ. మనలోనే యుండి పనులు చేయుటకు ప్రేరణ కలిగించునది

మన అమ్మ.

దహరాకాశమునన్ బ్రపూజ్యవగుచున్ దాక్షిణ్యమున్ జూపు నిన్,

సహనంబొప్పఁగ ప్రేమఁ గొల్త్రు సమయాచారుల్, గృపన్ వారికిన్

మహిమోపేత మనోజ్ఞ సత్ ఫలములన్ మన్నించుచున్ గొల్పుదే,

దహరంబందున నిల్పి గొల్తు సమయాంతస్థా! ననున్, బ్రోవుమా..


98. ఓం సమయాచార తత్పరాయై నమః.

నామౌచిత్యము.

సమయాచారమునందు, సమయాచారుల యందు ఆసక్తి కలది అమ్మ.

సీనుత సమయాచార మతిమంతు లిల సమ  యాచార తత్పరా! యనుచు మ్రొక్కి,

షడ్విధైక్య పరులై సాధింప చిచ్ఛక్తి నిన్నె నమ్మిరటంచు నీవె బ్రీతి

వర సమయాచార పరవై శుభాస్పదా! వరలింతువే భక్తినరసి మదిని.

పతిని గూడుచు నీవు నుత సహస్రారంబు పై వెల్గుచుందువే ప్రముఖముగను,

తే.గీయసమ సత్ సమయాచార మరయుచుండి

దీక్షఁ గొన్నట్టి మహితుల రక్షణకయి

తత్పరతఁ గల్గి నిలిచెడి తల్లి వీవు,

వందనంబులఁ జేసెద నందుకొనుము.

 

శ్లో౩౮మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ,

మణిపూరాంతరుదితా విష్ణు గ్రంథి విభేదినీ.

99. ఓం మూలాధారైక నిలయాయై నమః.

నామౌచిత్యము.

మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా కలది  మన అమ్మ.

కంమూలాధారోద్భాసా!

మేలుఁ గొలుప మేలుకొని, భ్రమించెడి మదినే

పాలించుము మేలు నిడుచు,

మూలాధారైక నిలయ! పూజలు గొనుమా!


100. ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః.

నామౌచిత్యము.

బ్రహ్మగ్రంథిని విడఁగొట్టునది మన అమ్మ. బ్రహ్మమునకు సంబంధించి మనలో ఉన్న సందేహపు

చిక్కు ముడులను విడదీసి నిజము తెలియఁ జేయునది

శా. బ్రహ్మంబీవె, గ్రహించి నిన్ను గొలువన్ భాసించు నీ వచ్చటన్

బ్రహ్మగ్రంథి విభేదిగా నిలువగాఁ బాయున్ గదా మాయసద్

బ్రహ్మానందముతోడఁ గాంచగనగున్ భక్తాళి, కామేశ్వరీ!

బ్రహ్మగ్రంథి విభేదినీ! జయములే భావింప నిన్ గల్గెడున్.

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.