జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
86. చ. వ్రతముల, నోములన్ గనఁగ వశ్యముకాదయ సత్య తేజమున్.
స్తుతమతివైన నీ స్మృతులె చూపఁగ నేర్చును సత్య రూపమున్.
క్షితిని వసించువారలకు క్షేమము గూర్చఁగ నీవిటన్మహ
త్కృతివయ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
87. ఉ. పూజలతోన సద్గురుని ముందుగ తృప్తులఁ జేసి, విద్య వి
భ్రాజులు నేర్వ నేర్చెదరు. భాస్కర తేజము వారికబ్బెడున్.
భూజనులందు బ్రాహ్మణులు పుణ్యవిదూరులకబ్బునయ్య ని
స్తేజము. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
88. ఉ. రాజిలు కాణ్వశాఖజుల రమ్య మనోజ్ఞ విధానమెన్నునీ
భూజనులెల్ల. వింతయిది పూజ్యులు వేదవిదాంవరాళియున్
రాజిల శాఖనొప్పిరి. వరంబుగ నిల్చెను వీరిలోన నీ
తేజమె యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
89. ఉ. దేశ విదేశ వాసులగు దివ్యులలో భవదీయ శాఖ వా
రాశగ నీ మహత్వము సమాదరలీల ప్రసిద్ధి గొల్పువా
రీశుఁడు కూడ మెచ్చునటులెల్లెడనుందురిదెల్ల నీదు సం
దేశమొ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
90. ఉ. వేదము శుక్ల భాసితము. వేదవిదుల్ వర కాణ్వశాఖలో
సాదర చిత్త భాసితులు. సంస్తవనీయులు పండితాళి. స
ద్బోధను గొల్ప నీ స్మృతి, ప్రపూజితులైరిల వీరు. వీరు నీ
దీధితి, యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
గురుదేవర శ్రీకర జ్ఞాన భాస్కరా నమోనమ :
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.