గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2019, బుధవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 51వపద్యమునుండి 55వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.
51. ఉ. జ్ఞానవిదూర మానసము కాల్చుచునుండు హృదంతరాళమున్.
హీన దురంత దుస్థితి యహీనగతిన్ మము చుట్టిముట్టు. స
మ్మానముతోడ మమ్ముగనుమా. మదినుండియె పాపుమా మహ
ద్దీనత.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 52. ఉ. నీతిని నమ్మి లోకముననేక పరాభవ కీలలందు వి
ఖ్యాతియె భస్మమై, తుదకు కాలిన కట్టె తెరంగునుండు వి
ఖ్యాతులకాత్మధైర్యమిడు. కాంచుము. మాపుము వారిలో మహ
ద్భీతిని.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 53. ఉ. ఆశలకంతులేదు. కలహాల భయంబు కనంగ లేదు. పే
రాశలఁ జిక్కుచుండి అడియాసలెదుర్కొను మానవాళికిన్
శ్రీశునిపై మనంబునిడ చిత్తము పొంగగ నీయుమయ్య సం
దేశము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 54. ఉ. జ్ఞప్తికి రాడు మాధవుఁడు కామితముల్ నెరవేరుచున్నచో.
గుప్తముగా హృదబ్జమను కోవెలనుండెడి వానిఁ గాంచరే! 
సుప్త మనస్థితిన్ దరిమి. చూపుము దేవుని. కొల్పుమయ్య సం
తృప్తిని యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 55. ఉ. అప్పుల బాధలన్ బడుట నాత్మకు శాంతి సుదూరమౌటచే
నిప్పులపై చరించినటు నిత్యము చింతిలు దీన మానవుల్
ముప్పునెదుర్కొనున్. కనుక పూజ్యుఁడ ప్రోవఁగ నెంచి, చూడు మా
తిప్పలు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

(సశేషమ్)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్ని పద్యములు సులభగ్రాహ్యముగా నున్నవి . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.