జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
26. చ. సుమధుర భాషణంబున వసుంధర నుండిన పండితావళిన్
సములను గెల్చి శాస్త్ర విలసన్నుత పాండితి చూపితీవు. నీ
మమునను మమ్ము నిల్పుమిక మాకనుమానములెంచి పాపుమీ
తిమిరము యాజ్ఞవల్క్య.గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
27. చ. కలతలు కల్మషంబులును గాఢతరాంధము నన్ను క్రమ్ముటన్
తెలియుట నేర్వనైతిని మదిన్ గల నీశ్వరు సత్ప్రకాశునిన్.
కలుషము బాపి ప్రోవుమయ. కాంచఁగనొప్పెడి ముక్త మార్గమున్
దెలుపుము. యాజ్ఞవల్క్య.గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
28. ఉ. లోక వినాశ కారకులు, లుబ్ధులు, దుర్నయపాలకుల్ భువిన్
మాకహితుల్. దురాత్ములను మట్టును బెట్టఁగ శక్తి చాలదే.
భీకరులైన వారలను పీచమడంచఁగ మాకు కొల్పుమా
తేకువ యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
29. ఉ. సంపదలెన్ని కల్గినను సంతసమన్నది కల్గకుంట, ఘో
రంపు దురాగతంబులు నిరంతరమున్ పచరించు కోర్కె, మా
కింపుగనెంచలేము. మదులెట్టులమార్చుకొనంగనౌను? బో
ధింపుమ యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
30. ఉ. విద్యలనేకముల్ కలుఁగు విశ్వమునందున, వేదవిద్యలే
వేద్యము కాకపోవుటను వేల్పుల మార్గము వీడి నేడు పల్
విద్యలు నేర్వ, జీవనము భీతిగ సాగుచునుండె. నేర్పు స
ద్విద్యను.యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.