గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2019, శుక్రవారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 61వపద్యమునుండి 65వ పద్యము వరకు .

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

 61. ఉ. అక్షయ వేదమెన్ని పరమాద్భుతరీతిని భాస్కరుండు సత్
శిక్షణనీయ నీకు వికశించితివందున సాటి లేనటుల్.
మోక్ష ఫల ప్రదుండ! కయిమోడ్పులు చేసెద  దివ్యమైన నీ
దీక్షకు. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  62. ఉ. జ్ఞానమనంతమంచు నినుఁ గన్న మహాత్ములకర్థమౌనటుల్
మానిత పండితాళికడ మాటలచే విజయంబు పొందితే.
మౌనము వీడి నీ జనుల మంచిని చూడుము ముక్తి చూపుచున్
ధీనుత! యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 63. ఉ. ముక్తికి జీవితాన ననుభూతినినొసంగెడి దివ్య కల్పనా
శక్తికి, మంచి మార్గమును చాలఁగ చూపిన దివ్యమైన నీ
యుక్తికి, సన్నుతుల్. సుగుణ యుక్తుఁడ! నీప్రభ చేరెనయ్య యా
దిక్తటి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 64. ఉ. ఒప్పరికించినన్ సకలమోడుదుమయ్య, శుభాళి దూరమౌ
నెప్పటికప్పుడే జరుగు నేదిశుభంబసుభంబొతెల్పుచున్
ముప్పుఘటిల్లకుండ మము బ్రోవుము. బ్రోవకయున్నచో నినున్
దెప్పరె? యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 65. ఉ. అధ్యయనంబు చేయుతరినంతము లేని సుఖోపభోగులై
విద్యలు నేర్వఁజాలక, నివృత్తిఁ గనుంగొనలేనివారలన్
విద్యల తల్లి మెచ్చునెటు? వేల్పువు నీవయి కొల్పుమయ్య  స
ద్విద్యలు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

(సశేషం)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్ని పద్యములు సులభగ్రాహ్యముగా నున్నవి . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.