జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
101. ఉ. కాణ్వ ప్రశస్త శాఖజుఁడ. కౌశిక గోత్రుఁడ. సుప్రసిద్ధ చిం
తాన్వయ రామకృష్ణుఁడ. ముదంబున నీ శతకంబు వ్రాసి, భా
తిన్వివరించి నీ మహిత తెల్పితినిందు. మహత్వ పూర్ణ! ఖ్యా
తిన్విను యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
102. ఉ. పావన యజ్ఞకర్మలనపారముగా నొనరించు యాజులీ
పావన శాఖలోఁ గలరు. వర్ధిలఁజేయుము వారినందరిన్.
జీవన భాగ్యమిమ్ము. విరచింపుము మంచిని. వారికిమ్ము నీ
దీవన. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
103. ఉ. నీదు జయంతి వేడుక మనీషులనన్య మనోజ్ఞకంబుగా
సాధు జనాళితో కలిసి చక్కఁగఁ జేయుచునుండిరేండ్లుగా
మోదముతోడ వారిఁగని పుణ్యఫలంబుగ వారికిమ్ము నీ
దీధితి. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
104. ఉ. కోరరు కాణ్వశాఖజులు కోరగరానివిహంబునందునన్.
కోరరు స్వార్థమున్ కలిగి. కోరరనన్య ధనాదికంబులన్.
చేరుచు నిన్ను కోరుదురు శక్తినొసంగుచునుండు నీదు స
త్స్మేరము. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
105. ఉ. భావమనోజ్ఞసంహితను పాఠులు సద్ఘనమందు శుక్లమం
దీవర ధాత్రిపై ప్రబలుదెవ్వరు వారలు నీదు భక్తులే.
కావుము వారినెల్లరను గౌరవమొందఁగ చేయుచుండి యో
ధీవర. యాజ్ఞవల్క్య గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
106. ఉ. ఈ శతకంబునందుఁ గల హృద్యమహూజ్వల పద్య పాళి పే
రాశగ నీవొసంగినవి. అచ్చటనచ్చట కల్గు దోషముల్
ధీశుఁడ నావి. నీ కృపను తీరుగ దోషమె భూషణంబగున్
దేశిక. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
107. చ. మహితులకంజలుల్ రవికుమారులు, వేంకటశాస్త్రి, శ్రీ రమేష్.
మహిమను కొల్ప నాకు గుణ మాన్యుల మధ్యను సత్కరించి, నన్
విహిత స్వధర్మ బద్ధునిగ విశ్వమునన్ నిలబెట్టినారు స
ద్విహితము యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
108. ఉ. ప్రాణ సమాన! మంగళము. భక్త శుభంకర! మంగళంబయా.
జ్ఞాన నిధాన మంగళము. కల్మష దూరుఁడ! మంగళంబయా.
మానిత సద్గురూత్తముఁడ! మంగళముల్ గను మో సుధా పయో
ధీ! నుత యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
స్వస్తి.
బుధజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
విళంబి. కార్తీక శుద్ధ పాడ్యమి.
యాజ్ఞవల్క్య జయంతి.
యాజ్ఞవల్క్య జయంతి.
08 . 11 . 2018.
జైహింద్
1 comments:
నమస్కారములు
గురువులకు నమోనమ:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.