జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
31. ఉ. ధీరత, సత్య సంధత, విధేయత, సౌమ్యత, వాంగ్మనోజ్ఞతన్,
భారత జాతిలో ప్రబలి భవ్యముగా వెలుగొంద కోరుదున్.
మీరలె తీర్చగావలయు. మీరలె తీర్చకయున్న కోరికల్
తీరునె? యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
32. ఉ. దానగుణాభిరాములగు ధార్మికులొప్పగనుండుటన్ భువిన్
దీనజనాళి జీవనము తీయగ సాగగ మార్గమేర్పడెన్.
జ్ఞానులనుద్దరించు నిను గాంచుట భాగ్యము. దేవదేవ! వం
దే నుత యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
33. ఉ. శ్రేయము సర్వజీవులకు చిత్తము పొంగ రచింపఁ గోరుదున్.
న్యాయమునెల్లవారును సమాదరణంబునఁ జూడఁగోరుదున్.
నీ యనురాగమెన్న, మహనీయ! కనుంగొని
తీర్చుమయ్య మా
ధ్యేయము. యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
34. ఉ. కష్ట సముద్రమున్ గడప, కల్పిత దుర్గతిఁ బాపఁ జేయ, మా
యిష్టములెల్ల తీర్చగ, మహేశుననుగ్రహమందఁజేయ, సం
తుష్టిని గొల్పి మాకు సుగతుల్ రచియింపగ నీవు పెట్టుమా
దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
35. ఉ. విప్రవరేణ్యులన్ గనిన విశ్వమనోజ్ఞ వివేకమబ్బు నా
విప్రుల తోడ భాషణము విజ్ఞతఁ గొల్పును శక్తిఁగొల్పుచున్.
సుప్రతిభాస్పదంబగును. శోభిలఁ గొల్పును సత్యపూర్ణమౌ
ధీప్రభ. యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.