గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2019, గురువారం

ఒకే రోజులో నాచే రచింపఁబడిన శ్రీ యాజ్ఞవల్క్య శతకము నుండి 56వపద్యమునుండి 60వ పద్యము వరకు.

జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.

 56. ఉ. ప్రాణమదెట్టులుండు? కనరాని మహాద్భుత శక్తియా? లస
న్మౌనము దాల్చి తాపసులు మంచిగ కాంచఁగఁ గల్గుదేని? నే
దీనుఁడనెట్టులిద్ది కనితీరుదు? తృప్తిగనిమ్మి నాకు నీ 
ధీనిధి. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 57. ఉ. శ్రేయము గొల్పు సద్గుణము, క్షేమము గొల్పెడి మంచి బుద్ధియున్,
న్యాయమనోజ్ఞ వర్తనము, నైతిక వాగ్ఝరి మాకుఁ గొల్పుమా.
సాయము చేయుబూనితివొ చక్కగ నీవికఁ గొల్పు నాకున
స్తేయము.  యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 58. ఉ. చాలము మాటపైనిలువఁ జాలము నమ్మగ దైవమొక్కనిన్.
జాలము పాపముల్ విడువ, చాలము నిన్గన జ్ఞాన నేత్రమున్.
చాలుదుమేము బోధనలు చాలఁగ చేయఁగ. కాంచఁ జెప్పుటే
తేలిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 59. ఉ. కోరికలన్ త్యజించుటయు, కుత్సితభావవివర్జితంబు, సం
సారమహాంబుధిన్ చెలఁగి సత్యవిదూరము కాకయుంట, ని
స్సారము వీడి సారమును చక్కఁగ పట్టిన ముక్తి ప్రాప్తమై
తీరును యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 60. ఉ. మోహమదేలఁ గొల్పె విధి? మోహమె ముక్తికి మార్గమైన స
మ్మోహమదేల కల్గునిల? మోహము క్రోధము కామమున్ వినా
యైహికముండదే. పరమునందుటదెట్టలు? దేహమెన్న సం


దేహము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

(సశేషమ్)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్ని పద్యములు సులభగ్రాహ్యముగా నున్నవి . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.