గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మార్చి 2019, ఆదివారం

శ్రీ యాజ్ఞవల్క్య శతకము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
  రచన. చింతా రామకృష్ణారావు.
  1.ఉ. శ్రీ వనజాప్త లబ్ధ వర చిన్మయ వేద నిధాన! నిత్యమున్
దేవ సుపూజితాద్యుఁడగు దివ్య వినాయకునాత్మనెంచి, నిన్ 
భావన చేసి యీ శతక భర్తగ, నే విరచింతు నీపయిన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  2.  ఉ. భూవలయంబులో సుజన పూజిత దివ్య పదారవిందయౌ,
భావనలోన మెల్గు వరవాణికి, పుస్తక రమ్యపాణికిన్,
శ్రీవనజాత సంభవుని చిన్ముఖ వాసినికంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  3. ఉ. జీవనమిచ్చినట్టి రఘు చిన్మయ వేంకట వీర సద్గురున్,
భావన చేసి నా మదిని, భక్తిసమన్వితునై భజించుచున్ 
దీవనలీయఁ గోరుదును దివ్యముగా విరచింపదీనినో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  4. ఉ. దేవులకెల్ల దేవుఁడును, దీనజనావన దీక్షితుండు, స
జ్జీవన మార్గదర్శకుఁడు, శ్రీకర కృష్ణుడు, వానినెన్నుచున్
బ్రోవఁగ గోరుచున్ మదిని పూజ్య పదంబుల కంజలింతు నో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  5. ఉ. జీవన భాగ్య హేతువయి, సృష్టికి మూలమునై యహర్నిశల్
భావనకైన చిక్కని ప్రభా నిలయుండగు భాస్కరుండు సం
భావితమూర్తియై పగలు వర్ధిలు. వానికినంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

6. చ. అవనిని కాణ్వ శాఖను మహాత్ములనేకులు జ్ఞాన తేజులై
ప్రవిమలకీర్తిఁ గొల్పిరి. పరాత్పర సన్నిభులెల్లరున్ గనన్.
భువిననురాగయుక్తులగు పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  7. చ. శ్రవణ కుతూహలమ్ముగ, ప్రశంసలనందెడు రీతి వేదమున్
సువిదిత రీతి చెప్పఁగల శోభనమూర్తులు వేద పండితుల్
భువిని వశించు భాస్కరులు. పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  8. ఉ. భావన చేత , మాటలను, పట్టుగ చేసెడి చేతలన్ సదా
ధీవరులెన్న నొక్కటిగ తీరుగ చేసెడి దివ్యమూర్తులన్
సేవలు నీకు చేయు శుభ చిత్తులకేను నమస్కరింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  9. ఉ. భావిని చూచి చెప్పెడి ప్రభావము కల్గిన కాణ్వశాఖ రా
జీవ మహాత్ములన్ దలచి చేసెద వారికి వందనంబులన్.
శ్రీవరణీయులై చెలఁగు చిన్మయమూర్తులకీవె తోడుగా.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 10. చ. శ్రవణ కుతూహలమ్మయిన చక్కని కావ్యములల్లు సత్కవుల్
భువిని వసింతురందుఁ గల పూజ్యులలోపల కాణ్వ శాఖజుల్
ప్రవరులుగా గణింపఁబడు వారిని కల్గెడి దివ్యమైన భా
తివి కన యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

11. చ. కలియుగమందు పుట్టుటను కానిపనుల్ పచరించుచుంటిమే,
తెలియకపోవుటన్. కృపను తీరుగ మా మదులందు జ్ఞానమున్
బలముగ పొందఁగా వలయు. భవ్యుఁడ సన్నుత దివ్యమార్గమున్
దెలుపుము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 12. చ. పరిపరి వేడెదన్. సుగుణ వర్ధన చేసెడి సత్కవిత్వమున్
నిరుపమ మార్గమందు వరణీయముగా నెలకొల్పుమయ్య. నన్
గరుణను చూడుమయ్య. గురుగౌరవ తేజములిమ్ము నాకు సు
స్థిరముగ, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 13. చ. అతులిత తేజసంబు పరమాద్భుత రీతిని నిన్ను చేర, సం
స్తుతులను ముంచెనీజగతి శోభిలుచుండెడి నిన్నుఁగాంచి, యే
గతిని వహించె నిన్ ప్రభలు? కాంచఁగ మాకును చూపుమయ్య. వం
దిత పద! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 14. చ. క్షితిని మహాత్ములెల్లరును శిక్షణనిచ్చెడి సద్గురూత్తముల్.
సతతము వారి వర్తనము చక్కఁగనెంచి గ్రహించువారు స
న్నుతమతులై రహించెదరనూనగతిన్. మరి నాకు కూడ యా
ధృతినిడు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 15. చ. సుజనులె నీదు మార్గమున శోభిల వర్తిలనేర్తురయ్య స
ద్విజయము కాంచగా వలచి. విజ్ఞులు వారలు. నన్ను నీవు నీ
విజయ పథమ్మునన్ నడిపి విజ్ఞతతోడ వశింపఁ జేయుమా.
ద్విజవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

16. చ. వెతలు భరించ లేక ప్రభవించెడు దుర్గతులాప నేరమిన్
క్షితిని కృశించుచుండిరి విశిష్టమహాత్ములె. శక్తి హీనులై.
బ్రతుకఁగ దివ్య మార్గమును, బాధలఁ గెల్చెడి
శక్తినిమ్ము బా
ధితులకు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 17. చ. క్షణమున భంగురంబటుల కాలము గర్భము జొచ్చు పృథ్విపై
గుణగణులాదిశాఖజులు కూర్ముని తప్ప యిహంబు కోరరీ
ధనములు రత్నహారములు ధర్మపరిగ్రహులైన వీరికిన్
తృణమయ! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 18. ఉ. శ్రీవర తేజులౌ ప్రథమచిద్వర శాఖజులైనవారికిన్
దీవన లీయ వేడెదను. దీనులనెల్లెడ కావ వేడెదన్.
భావజ న్యూనతన్ దుడిచి భాస్కర తేజము గొల్పఁ గోరెదన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 19. ఉ. భావి తరంబులన్ సుగతి వర్ధిలఁ జేయు మహాత్ములెందరో
మీ వరణీయ తేజమును మీ మహనీయతలన్ స్మరించు. సం
సేవలఁ దేల్చు మిమ్ములను . చిత్తమునన్ స్మరియింతు వారలన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 20. చ. వలయునదేది దుర్గతిని బాయఁగ నెంచిన మానవాళికిన్?
ఫలములనెట్లు వీడనగు పాపము పుణ్యము చేయువారికిన్?
మెలకువ కొల్పు మాకు, గుణమేదుర. సత్పరివర్ధకంబు కాన్
దెలుపుము! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!

21. చ. ద్విజులను పేరుఁగన్న యిలవేల్పులు కాణ్వ మహత్వ శాఖజుల్.
ప్రజలకు మేలు చేయుచు, వరంబువనిచ్చెడి భవ్యమూర్తులున్.
నిజమగు నీదు శక్తిని గణించుటచేతనె గణ్యులైరయా.
ద్విజ నుత! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 22. చ. శరణుగురూత్తమా! మనసు చంచలమౌచు జగత్ప్రకాశకున్
హరిని కనంగనీదు. దురహంకృతి చీకటి క్రమ్మఁ జేయు. భా
సురమగు సత్యమున్ గనఁగ చూపుమయా మహనీయమైనదౌ
తెరవును, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 23. చ. పగలును రాత్రియున్ విడని పాపము గొల్పెడి దుష్ప్రవృత్తులే
జగతిని కన్నులం బడు. నిజంబిది దుర్మతిఁ పెంచు మాకు నే
ప్రగతియులేక చింతిలెడివారము. నీవిక పాపుమయ్య మా
దిగులును. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 24. చ. దినపతి ధర్మ బద్ధుఁడయి తీరుగనాకసవీధిలోననే
యనిశము సంచరించు. మనయందు తదద్భుత శక్తిఁ గొల్పడే.
జనులును ధర్మబద్ధులయి చక్కఁగనుండఁగ చేయఁగల్గఁడే
దినమణి?  యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 25. ఉ. భూజనులందు సద్గుణ సుపూజ్యులు కణ్వ ప్రశంస శాఖజుల్.
రాజిలు శక్తి కోల్పడి పరాజయ మార్గము పట్టనీకుమా.
నీ జయ శీలమెన్ని పరిణీతులవన్ తగ నీవు కొల్పుము
త్తేజము. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

26. చ. సుమధుర భాషణంబున వసుంధర నుండిన పండితావళిన్
సములను గెల్చి శాస్త్ర విలసన్నుత పాండితి చూపితీవు. నీ
మమునను మమ్ము నిల్పుమిక మాకనుమానములెంచి పాపుమీ
తిమిరము  యాజ్ఞవల్క్య.గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 27. చ. కలతలు కల్మషంబులును గాఢతరాంధము నన్ను క్రమ్ముటన్
తెలియుట నేర్వనైతిని మదిన్ గల నీశ్వరు సత్ప్రకాశునిన్.
కలుషము బాపి ప్రోవుమయ. కాంచఁగనొప్పెడి ముక్త మార్గమున్
దెలుపుము. యాజ్ఞవల్క్య.గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 28. ఉ. లోక వినాశ కారకులు, లుబ్ధులు, దుర్నయపాలకుల్ భువిన్
మాకహితుల్. దురాత్ములను మట్టును బెట్టఁగ శక్తి చాలదే.
భీకరులైన వారలను పీచమడంచఁగ మాకు  కొల్పుమా
తేకువ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 29. ఉ. సంపదలెన్ని కల్గినను సంతసమన్నది కల్గకుంట, ఘో
రంపు దురాగతంబులు నిరంతరమున్ పచరించు కోర్కె, మా
కింపుగనెంచలేము. మదులెట్టులమార్చుకొనంగనౌను? బో
ధింపుమ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 30. ఉ. విద్యలనేకముల్ కలుఁగు విశ్వమునందున, వేదవిద్యలే
వేద్యము కాకపోవుటను వేల్పుల మార్గము వీడి నేడు పల్
విద్యలు నేర్వ, జీవనము భీతిగ సాగుచునుండె. నేర్పు స
ద్విద్యను.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

31. ఉ. ధీరత, సత్య సంధత, విధేయత, సౌమ్యత, వాంగ్మనోజ్ఞతన్,
భారత జాతిలో ప్రబలి భవ్యముగా వెలుగొంద కోరుదున్.
మీరలె తీర్చగావలయు. మీరలె తీర్చకయున్న కోరికల్
తీరునె? యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 32. ఉ. దానగుణాభిరాములగు ధార్మికులొప్పగనుండుటన్ భువిన్
దీనజనాళి జీవనము తీయగ సాగగ మార్గమేర్పడెన్.
జ్ఞానులనుద్దరించు నిను గాంచుట భాగ్యము. దేవదేవ!  వం
దే నుత యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 33. ఉ. శ్రేయము సర్వజీవులకు చిత్తము పొంగ రచింపఁ గోరుదున్.
న్యాయమునెల్లవారును సమాదరణంబునఁ జూడఁగోరుదున్.
నీ యనురాగమెన్న, మహనీయ! కనుంగొని
తీర్చుమయ్య మా
ధ్యేయము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 34. ఉ. కష్ట సముద్రమున్ గడప, కల్పిత దుర్గతిఁ బాపఁ జేయ, మా
యిష్టములెల్ల తీర్చగ, మహేశుననుగ్రహమందఁజేయ, సం
తుష్టిని గొల్పి మాకు సుగతుల్ రచియింపగ నీవు పెట్టుమా
దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 35. ఉ. విప్రవరేణ్యులన్ గనిన విశ్వమనోజ్ఞ వివేకమబ్బు నా
విప్రుల తోడ భాషణము విజ్ఞతఁ గొల్పును శక్తిఁగొల్పుచున్.
సుప్రతిభాస్పదంబగును. శోభిలఁ గొల్పును సత్యపూర్ణమౌ
ధీప్రభ. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 36. ఉ. లెక్కకు మించి ముష్కరులు లీలగ దుష్కృతముల్ ఘటింతు రే
ప్రక్కను గన్న వారలె. ప్రపన్నులఁ గావగలారు లేరు. నీ
వొక్కడవే దురాత్మకులనుక్కడగించి జనాళీఁ బ్రోచు మా
దిక్కువు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 37. ఉ. సంతసమెల్ల వేళలను చక్కగ నుండఁగ మాకు చేయు మీ
వింత యొనర్చినన్ నిరతమేము శుభాస్పద కార్యదీక్షతో
శాంతిని నింపనేర్తుమిల. చక్కఁగ సంతస మీయ నిన్నుఁ బ్రా
ర్థింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 38. చ. స్మృతిని వచించితీవు పరిసేవ్య శుభావహ ధర్మ వర్తనల్.
బ్రతుకుటె భారమౌటను సభక్తిగ నీకు నమస్కరించి యా
స్మృతులు పఠించలేము. పరీశీలన చేయుము. మార్చుమయ్య మా
స్థితినిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 39. ఉ. గుప్తములయ్య వేదములు. కోవిదపాళి గ్రహింపనౌను. సం
క్షిప్త పదార్థ భావములు చెప్పిన మేము గ్రహింతుమయ్య. మా
ప్రాప్తమదేమొ చెప్పరయ. భాగ్యవిధాతవు నీవె చెప్పుసం
తృప్తిగ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 40.  ఉ. పంతము మాని, నీ స్మృతిని బాగుగనందరెఱుంగునట్లు, ర
వ్వంత కృపావహుండవయి ప్రస్ఫుటరీతి గ్రహింప చెప్పుమా.
సాంతము నీవు నేర్పిన. ప్రశాంతము లోకమునెల్ల చోట్ల సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

41. ఉ. భీమవరంబునందునిల పేరును గాంచిన కాణ్వ శాఖజుల్
నీ మహనీయ జన్మదిన నిస్తుల భవ్యమహోత్సవంబు ని
ష్కామముతోడచేయు. శుభకర్ముల బాధ్యత భక్త బంధు నీ
దే మరి యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 42. ఉ. అప్రతిమాన పండిత మహాత్ములు కల్గిరి కాణ్వ శాఖలో.
నీ ప్రతిభా విశేషము, మనీషయునెల్లెడ చాటువారలే.
విప్రకులోత్తముల్ ప్రబల వెల్గఁగజేయుమ వారిలోపలన్
ధీప్రభ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 43. చ. వ్రతములు, యజ్ఞముల్, సతము రమ్యముగా పచరించు దీక్షితుల్
వెతలను తాళఁ జాలరయ. వేగమె నీవు గ్రహించి వారికిన్
సతతము సంఘమందు ఘన సత్కృకతులొప్పగ కొల్పుమా సమా 
దృతినిల యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 44. ఉ. కష్టములన్ భరించుచు ప్రకాశ మనంబున మెల్గు నైపుణిన్,
దృష్టి మరల్చకుండ వినుతించుచు నిన్ గను శక్తియుక్తులన్,
శ్రేష్టుల సంగతిన్ గొలుపు శ్రేష్టతనొప్ప మనోజ్ఞమౌ మహ
ధ్దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 45. ఉ. వేగిరపాటు చేత ప్రభవించునయాచిత దుర్నిమిత్తముల్.
సాగెడి జీవితంబున ప్రశాంతి రయంబగు దానిచేతనే.
నా గతి మార్చుమయ్య కరుణన్ ననుఁగాంచుమ. నీవు పాపుము 
ద్వేగము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

46. ఉ. ఇద్ధర దుర్జనార్ణవమయెన్ దురపిల్లఁగ సజ్జనాళి. సం
బద్ధము లేని చట్టములు. పాపపు చింతన మృగ్యమాయె. నీ
విద్ధరనుద్ధరింప గుణవృద్ధిని చేయుము. పెంచుమింక స
ద్వృద్ధిని  యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 47. ఉ. మూలము నీవు పూజ్యగుణముల్ మము చేరుట కెల్ల వేళలన్.
మేలును గొల్పు సద్గుణము మేము గ్రహింపఁగ శక్తినీమ్ము. నీ
మ్రోల నమస్కరించు గుణమున్ దయచేయుము.  కొల్పుమయ్య  స
చ్చీలము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 48. ఉ. సంతసమున్ సతంబు మనసారగ మాకు ననుగ్రహించుమా
శాంతిగ నుండ సజ్జనుల సంగతినొప్పి, శుభప్రదంబుగా
చింతలఁ బారఁద్రోలుచు ప్రసిద్ధిగ మంచిగ దేనినైన  సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 49. ఉ. నవ్యత పేరునన్ యువత నాగరికంబను హీన సంస్కృతిన్.
సవ్యమునేవగించుకొను. సద్గుణమన్న గ్రహింపనోపరే.
నవ్య సమాజమెన్నఁగననంతుని సేవలు తెల్పుమయ్య. ఓ  
దివ్యుఁడ! యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 50. ఉ. సంపదలెల్ల మాయు. విలసన్నుత దైవమె నిల్చు నిత్యమున్
సొంపులశాశ్వతంబు.  గుణశుద్ధియె శాశ్వత కీర్తి మూలమౌన్. 
భ్రాంతిని వీడ సత్ ప్రభలు భక్తిగ కాంచఁగ మార్గమీవు బో
ధింపుము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

51. ఉ. జ్ఞానవిదూర మానసము కాల్చుచునుండు హృదంతరాళమున్.
హీన దురంత దుస్థితి యహీనగతిన్ మము చుట్టిముట్టు. స
మ్మానముతోడ మమ్ముగనుమా. మదినుండియె పాపుమా మహ
ద్దీనత.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 52. ఉ. నీతిని నమ్మి లోకముననేక పరాభవ కీలలందు వి
ఖ్యాతియె భస్మమై, తుదకు కాలిన కట్టె తెరంగునుండు వి
ఖ్యాతులకాత్మధైర్యమిడు. కాంచుము. మాపుము వారిలో మహ
ద్భీతిని.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 53. ఉ. ఆశలకంతులేదు. కలహాల భయంబు కనంగ లేదు. పే
రాశలఁ జిక్కుచుండి అడియాసలెదుర్కొను మానవాళికిన్
శ్రీశునిపై మనంబునిడ చిత్తము పొంగగ నీయుమయ్య సం
దేశము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 54. ఉ. జ్ఞప్తికి రాడు మాధవుఁడు కామితముల్ నెరవేరుచున్నచో.
గుప్తముగా హృదబ్జమను కోవెలనుండెడి వానిఁ గాంచరే! 
సుప్త మనస్థితిన్ దరిమి. చూపుము దేవుని. కొల్పుమయ్య సం
తృప్తిని యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 55. ఉ. అప్పుల బాధలన్ బడుట నాత్మకు శాంతి సుదూరమౌటచే
నిప్పులపై చరించినటు నిత్యము చింతిలు దీన మానవుల్
ముప్పునెదుర్కొనున్. కనుక పూజ్యుఁడ ప్రోవఁగ నెంచి, చూడు మా
తిప్పలు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 56. ఉ. ప్రాణమదెట్టులుండు? కనరాని మహాద్భుత శక్తియా? లస
న్మౌనము దాల్చి తాపసులు మంచిగ కాంచఁగఁ గల్గుదేని? నే
దీనుఁడనెట్టులిద్ది కనితీరుదు? తృప్తిగనిమ్మి నాకు నీ 
ధీనిధి. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 57. ఉ. శ్రేయము గొల్పు సద్గుణము, క్షేమము గొల్పెడి మంచి బుద్ధియున్,
న్యాయమనోజ్ఞ వర్తనము, నైతిక వాగ్ఝరి మాకుఁ గొల్పుమా.
సాయము చేయుబూనితివొ చక్కగ నీవికఁ గొల్పు నాకున
స్తేయము.  యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 58. ఉ. చాలము మాటపైనిలువఁ జాలము నమ్మగ దైవమొక్కనిన్.
జాలము పాపముల్ విడువ, చాలము నిన్గన జ్ఞాన నేత్రమున్.
చాలుదుమేము బోధనలు చాలఁగ చేయఁగ. కాంచఁ జెప్పుటే
తేలిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 59. ఉ. కోరికలన్ త్యజించుటయు, కుత్సితభావవివర్జితంబు, సం
సారమహాంబుధిన్ చెలఁగి సత్యవిదూరము కాకయుంట, ని
స్సారము వీడి సారమును చక్కఁగ పట్టిన ముక్తి ప్రాప్తమై
తీరును యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 60. ఉ. మోహమదేలఁ గొల్పె విధి? మోహమె ముక్తికి మార్గమైన స
మ్మోహమదేల కల్గునిల? మోహము క్రోధము కామమున్ వినా
యైహికముండదే. పరమునందుటదెట్టలు? దేహమెన్న సం
దేహము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

61. ఉ. అక్షయ వేదమెన్ని పరమాద్భుతరీతిని భాస్కరుండు సత్
శిక్షణనీయ నీకు వికశించితివందున సాటి లేనటుల్.
మోక్ష ఫల ప్రదుండ! కయిమోడ్పులు చేసెద  దివ్యమైన నీ
దీక్షకు. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

  62. ఉ. జ్ఞానమనంతమంచు నినుఁ గన్న మహాత్ములకర్థమౌనటుల్
మానిత పండితాళికడ మాటలచే విజయంబు పొందితే.
మౌనము వీడి నీ జనుల మంచిని చూడుము ముక్తి చూపుచున్
ధీనుత! యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా! 

 63. ఉ. ముక్తికి జీవితాన ననుభూతినినొసంగెడి దివ్య కల్పనా
శక్తికి, మంచి మార్గమును చాలఁగ చూపిన దివ్యమైన నీ
యుక్తికి, సన్నుతుల్. సుగుణ యుక్తుఁడ! నీప్రభ చేరెనయ్య యా
దిక్తటి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 64. ఉ. ఒప్పరికించినన్ సకలమోడుదుమయ్య, శుభాళి దూరమౌ
నెప్పటికప్పుడే జరుగు నేదిశుభంబసుభంబొతెల్పుచున్
ముప్పుఘటిల్లకుండ మము బ్రోవుము. బ్రోవకయున్నచో నినున్
దెప్పరె? యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 65. ఉ. అధ్యయనంబు చేయుతరినంతము లేని సుఖోపభోగులై
విద్యలు నేర్వఁజాలక, నివృత్తిఁ గనుంగొనలేనివారలన్
విద్యల తల్లి మెచ్చునెటు? వేల్పువు నీవయి కొల్పుమయ్య  స
ద్విద్యలు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

66. ఉ. చింతయె లేని జీవనము సిద్ధిని పొందఁగ మార్గమౌను. ని
శ్చింతగ శ్రీహరిన్ మదిని చేర్చి నిరంతర సేవలన్ సదా
భ్రాంతిని చేయగానగును. పాపఁగ చింతలనెల్ల నిన్ను ప్రా
ర్థించెద యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 67. ఉ. సంచిత పాప కర్మ చెరసాలగ చేయును జీవితమ్మునే.
కుంచిత చిత్తమున్ నడువకూడని దుర్గతినాశ్రయింతుమే.
కాంచవొ నీవు. మమ్ములను కావక చూచుచు మమ్ము పట్టి వే
ధించకు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 68. ఉ. భారము నీది. నీ సుగుణ భారము మాకును పంచి కావఁగా.
కారణమీవెఱుంగుదువు. కాణ్వ జనావళి గౌరవార్థమై
తీరును వీడనీక కడతేర్చగ మమ్ములఁ, గోరుచుంటి మీ
ధీరహి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 69. ఉ. కష్టము మాకు సద్గుణ వికాసముతో చరియింప నిచ్చలున్.
నష్టము గొల్పు నైహికమె నచ్చుచునుండు జగంబునందు. నీ
దృష్టిని మాపయిన్ నిలిపి తీరుగనుండ మరల్చుమయ్య మా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 70. ఉ. భావితరాలలో ప్రతిభ వర్ధిలఁ జేసెడి శక్తినిమ్ము. సం
భావిత మూర్తులై చెలఁగు భాతిని గొల్పెడి యుక్తినిమ్ము. నీ 
దీవనలాత్మశక్తినిడు. దీవనలిచ్చుచు మాకు కొల్పుమో
ధీవర యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

71. చ. ఘనమగు సంహితన్ రవి సుఖంబుగ నీకు ననుగ్రహించెనా. 
క్షణమును నిల్వజాలకయు చక్కఁగ చేసెన పాఠనంబు. నీ
వనుపమరీతి నేర్చుటను భవ్య ఫలప్రదుడయ్యె నీకు నా
దినపతి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 72. ఉ. జ్ఞాన నిధానమీవు. వరగణ్యుల లోపల గణ్యుఁడీవు. వా
దైన యనంత వేదముల తత్వమెఱింగితివీవు. నీవికన్
మౌనము వీడి, నీజనుల మాన్యతనిల్పఁగ హెచ్చరింపుమో
ధీనిధి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 73. ఉ. అప్పులు చేయనొప్పని మహాత్ములు నీ వర శాఖ భూసురుల్
తప్పులు చేయనొప్పరు. యదార్థమునందు చరించు ధీనిధుల్. 
తప్పఁగఁ జేయు వారి పరితాపము, దుర్విధిఁ  గల్గుచున్న యా
తిప్పలు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 74. ఉ. న్యాయము తప్పనేరరు. సనాథులనాథులు కాణ్వ శాఖజుల్.
ధ్యేయముతోడ వర్తిలెడి ధీవరులెల్లరు. చూడు వీరికిన్
న్యాయము చేయుమెల్లెడల, నార్తిని చేయుము జీవితాలనే
దీయగ. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 75. ఉ. చక్కఁగ నీదెయౌ ప్రథమశాఖను పుట్టినవారలందరున్ 
నిక్కము నిన్నె నమ్మిరయ. నేరరు దుర్వ్యవహారముల్ధరన్.  
మక్కవతోడ నిన్గొలుచు మాన్యులుపల్కుదురయ్య నీవె మా 
దిక్కని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 76. ఉ. మురియుచు నీదు జన్మదినమున్ పరమాద్భుత భావనన్ దగన్
నిరుపమ రీతిలో జరుపు నీ ప్రియ భక్తులు నేర్పుమీరఁగా.
ధరణిని నీవె మాకనెడి ధార్మికవర్యుల మానసంబికన్
దిరుగదు. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 77. ఉ. మాకు శుభాస్పదంబయిన మంచిని గొల్పి చరింపజేయుచున్,
శ్రీకరమైన జీవనము,  చిన్మయతేజసమొప్పఁగూర్చుచున్,
లోకహితంబు చేయగ విలోకన చేయుము. భారమెల్ల నీ
దేకద. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!

 78. ఉ. సుతులని, పత్నియంచు, ధనశోభయటంచు మనంబునెంచి, సం
స్తుతమగు పారలౌకికము త్రోసి యిహంబునె చిక్కియుండు మా
కతులిత జ్ఞానమున్ గొలిపి యాదరమొప్పఁగ పాపు మీషణ
త్రితయము. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

 79. ఉ. దీనదయాపరుండవు. మదిన్ నిను దల్చిన మాత్రమే కృపన్
ప్రాణసమాన దైవమయి రక్షణఁ గొల్పఁగనెంతువీవు. మా
దీనతఁ బాపి యోగ్యత మదిన్ కలిగింపఁగ భారమింక నీ
దేనయ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

 80. చ. పరులకు హానిలేని నిరపాయ మహోన్నత భావపూర్ణమై 
పరఁగునుపాయమున్ గొలిపి పాపపు కూపము బాపి రక్షణన్
నిరుపమ! కొల్పుమా సతము నిర్మల జీవన మార్గమింక సు 
స్థిరముగ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

81. . విస్మయమిద్ది. లోక హిత విస్తృత ధర్మ పథంబు చూపు రో
చిష్మతి, జ్ఞాన భాసురము. చిన్మయ తేజవివర్ధనాక్షయం
బై, స్మృతులందు గొప్పదయి వర్ధిలు నేటికి కూడ నీదు భా
తి స్మృతి యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర భాస్కరా!

82.
. శాంతము, సౌఖ్యమున్, సుజన సన్నుత సద్గుణమున్, మహత్వమున్,
దాంతియు, సత్య సంధతయు, తత్వవివేకము, ధైర్య సంపదన్
సాంతము మాకుఁ గొల్పి మము చక్కఁగ చూడమటంచు నిన్ను  ప్రా
ర్థింతును యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

83.
. నిక్కము, సద్గురుల్ కనుచు నిన్ను కనంగను చేయనెంతురే.
అక్కజమిద్ది. నీ ప్రతిభ నందరు సద్గురులందుకొంట. మా
మక్కువ తీర నిన్గన, సమస్త వివేకము గొల్పుదీవె మా
దిక్కయి. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

84.
. అతులిత దుఃఖ హేతువులనంతముగా మము క్రమ్ముచుండుటన్
క్షితి ధృతి హీనతన్ బ్రతుకుకే తుది కోరక తప్పదయ్య. సం
స్తుత సుఖమీయుమయ్య. కృపతోడను మాకిల  కొల్పుమా మహ
ద్ధృతినిక, యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

85.
. పాపపుకూపమీజగతి. పాపులకాకరువౌట కాంచవో?
శాపమిటన్ జనించుటని సాత్వికులెల్లడ బాధ చెందుటన్
నీ పని కాదొ కాంచుట? మనీషులనెల్లెడ కావరమ్మయా.
దీపిత యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

86.
. వ్రతముల, నోములన్ గనఁగ వశ్యముకాదయ సత్య తేజమున్.
స్తుతమతివైన నీ స్మృతులె చూపఁగ నేర్చును సత్య రూపమున్.
క్షితిని వసించువారలకు క్షేమము గూర్చఁగ నీవిటన్మహ
త్కృతివయ యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

87.
. పూజలతోన సద్గురుని ముందుగ తృప్తులఁ జేసి, విద్య వి
భ్రాజులు నేర్వ నేర్చెదరు. భాస్కర తేజము వారికబ్బెడున్.
భూజనులందు బ్రాహ్మణులు పుణ్యవిదూరులకబ్బునయ్య ని
స్తేజము. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

88.
. రాజిలు కాణ్వశాఖజుల రమ్య మనోజ్ఞ విధానమెన్నునీ
భూజనులెల్ల. వింతయిది పూజ్యులు వేదవిదాంవరాళియున్
రాజిల శాఖనొప్పిరి. వరంబుగ నిల్చెను వీరిలోన నీ
తేజమె యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

89.
. దేశ విదేశ వాసులగు దివ్యులలో భవదీయ శాఖ వా
రాశగ నీ మహత్వము సమాదరలీల ప్రసిద్ధి గొల్పువా
రీశుఁడు కూడ మెచ్చునటులెల్లెడనుందురిదెల్ల  నీదు సం
దేశమొ యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

90.
. వేదము శుక్ల భాసితము. వేదవిదుల్ వర కాణ్వశాఖలో
సాదర చిత్త భాసితులు. సంస్తవనీయులు పండితాళి.
ద్బోధను గొల్ప నీ స్మృతి, ప్రపూజితులైరీలవీరు. వీరు  నీ
దీధితి, యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

91.
. అల్పులమయ్య. నీ ప్రతిభనర్థముచేసుకొనంగలేము. నిన్
నిల్పగలేము మా మదుల నిత్యము నిర్మల భావముంచి. సం
కల్పబలంబు లేదు. గతి గానగ లేమయ. సత్య మార్గమున్
దెల్పుము యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

92.
. ఉల్లమునందు శాంతము, సమున్నత సద్గుణ సద్విభాసమున్,
చల్లని మానసంబును, ప్రశస్త మనోజ్ఞ కవిత్వ ధారలన్.
కాళ్ళకు శక్తినీయుమయ కాదనకుండగగౌరవంబు సం
ధిల్లగ యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

93.
. సూక్తి సుధాస్మృతి వసుంధర నందరు నేర్చి సర్వదా
భక్తి ప్రపత్తులం గలిగి భావన చేసి పఠించుచుండినన్
సూక్తుల సంతచే మిగుల శోభిలుటన్ గని  మారు మ్రోగు నా
దిక్తటి యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

94.
. అర్చన చేయఁ జేయుము మహాత్మ త్వదీయపదాంబుజంబులన్.
కూర్చుము భక్తి తత్పరత కూరిమితోడ మదాత్మలో. కృపం
జేర్చుము మమ్మునీకడకు. శ్రీకర! బంధుర సందియంబులన్
తీర్చుమ. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

95.
. యోగముచేతనైహికము, యోగము చేత పరంబు ప్రాప్తమౌ
నీగతి కొల్పు యోగముననేక ఫలంబుల మంచి చెడ్డలన్
సాగఁగ చేయుచుండు మము. సద్గురువర్యుఁడ!కొల్పుమయ్య                                               ద్యోగము యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

96.
. కష్టములెల్లనొక్కటయి కాల్చుచునుండె మనంబు నక్కటా
దృష్టిని నీపయిన్నిలుప తేలిక కాదు. మహాత్మ నీవికన్
కష్టములెల్లఁ బాపి, మము కావఁగ భావనఁ జేసి పెట్టుమా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

97.
. సతతము నిన్స్మరించు, గుణసాంద్రులు సద్వర కాణ్వశాఖజుల్,
క్షితి నను గౌరవించుతరి చిన్మయమూర్తులకంజలించి నే
నతులితభక్తి నీశతక మంచితరీతి రచించినాడ
త్కృతిగను యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

98.
సరసుఁడు, వేదశాస్త్ర పరిషత్ ఘనపాఠియు నప్పనాఖ్యులా
పరమ పవిత్రమూర్తి నను వర్ధిలఁజేయఁగ సత్కరించుటన్
గరువము పెంచినారుశుభకామితముల్ నెరవేర్చు వారికా
తిరుపతి. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

99. 
. కనుము దయానిథీ. సుకవి కల్పకముల్ ధర మెచ్చునట్లుగా
ఘనముగ నీ జయంతిని ప్రగాఢమనమ్మున వ్రాసినాడ నీ
మనమునకెక్కనీ కృతిని. దీనిని చేఁ గొనుమయ్య. నీవె యం            .    
దిన, తగు. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

100.
. శ్రావ్యముగా పఠించినను, శ్రద్ధగ దీనిని భోధ చేసినన్,
దివ్యత కొల్పి, దీప్తమగు ధీప్రభ పెంచుము వారికిద్ధరన్.
భావ్యము నీకు పాఠకుల వర్థిలఁ జేయుట. భక్తబాంధవా!
దివ్యుఁడ! యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

101.
. కాణ్వ ప్రశస్త శాఖజుఁడ. కౌశిక గోత్రుఁడ. సుప్రసిద్ధ చిం
తాన్వయ రామకృష్ణుఁడ. ముదంబున నీ శతకంబు వ్రాసి, భా
తిన్వివరించి నీ మహిత తెల్పితినిందు. మహత్వ పూర్ణ! ఖ్యా
తిన్విను యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

102.
. పావన యజ్ఞకర్మలనపారముగా నొనరించు యాజులీ
పావన శాఖలోఁ గలరు. వర్ధిలఁజేయుము వారినందరిన్.
జీవన భాగ్యమిమ్ము. విరచింపుము మంచిని. వారికిమ్ము నీ
దీవన. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

103.
. నీదు జయంతి వేడుక మనీషులనన్య మనోజ్ఞకంబుగా
సాధు జనాళితో కలిసి చక్కఁగఁ జేయుచునుండిరేండ్లుగా
మోదముతోడ వారిఁగని పుణ్యఫలంబుగ వారికిమ్ము నీ
దీధితి. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

104.
. కోరరు కాణ్వశాఖజులు కోరగరానివిహంబునందునన్.
కోరరు స్వార్థమున్ కలిగి. కోరరనన్య ధనాదికంబులన్.
చేరుచు నిన్ను కోరుదురు శక్తినొసంగుచునుండు నీదు
త్స్మేరము. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

105.
. భావమనోజ్ఞసంహితను పాఠులు సద్ఘనమందు శుక్లమం
దీవర ధాత్రిపై ప్రబలుదెవ్వరు వారలు నీదు భక్తులే.
కావుము వారినెల్లరను గౌరవమొందఁగ చేయుచుండి యో
ధీవర. యాజ్ఞవల్క్య గురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

106.
. శతకంబునందుఁగల హృద్యమహూజ్వల పద్య పాళి పే
రాశగ నీవొసంగినవి. అచ్చటనచ్చట కల్గు దోషముల్
ధీశుఁడ నావి. నీ కృపను తీరుగ దోషమె భూషణంబగున్
దేశిక. యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

107.
. మహితులకంజలుల్ రవికుమారులు, వేంకటశాస్త్రి, శ్రీ రమేష్.
మహిమను కొల్ప నాకు గుణ మాన్యుల మధ్యను సత్కరించి, నన్
విహిత స్వధర్మ బద్ధునిగ విశ్వమునన్ నిలబెట్టినారు
ద్విహితము యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

108.
. ప్రాణ సమాన! మంగళము. భక్త శుభంకర! మంగళంబయా.
జ్ఞాన నిధాన మంగళము. కల్మష దూరుఁడ! మంగళంబయా.
మానిత సద్గురూత్తముఁడ! మంగళముల్ గను మో సుధా పయో
ధీ! నుత యాజ్ఞవల్క్యగురుదేవరశ్రీకర! జ్ఞాన భాస్కరా!

స్వస్తి.
బుధజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
విళంబి. కార్తీక శుద్ధ పాడ్యమి.
08 . 11 . 2018.
చరవాణి. 8247384165

కృతికర్త  పరిచయము

 

భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చింతా రామ కృష్ణా రావు. M.A.,. 

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

1) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు    

    ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 2) ఆంధ్రసౌందర్యలహరి.

 3) ఆంధ్రామృతమ్పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగుల నిర్వహణ.

 4) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 5) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 6) నేరెళ్ళమాంబ సుప్రభాతము.

 7) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

 8) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

 9) బాలభావన శతకము.

10) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

11) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

12) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

13) రుద్రమునకు తెలుగు భావము.

14) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) వసంతతిలక సూర్య శతకము.

16) విజయభావన శతకము.

17) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

18) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

19) శ్రీ అవధానశతపత్రశతకము.

20) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

21) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

22) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

23) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

24) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

25) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

26) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

27) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

28) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

29) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

30) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున

      మూడు మకుటములతో మూడు శతకములు.)

31) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

32) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

33) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

     పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

34) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

35) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద   

      ఉత్పలమాలిక

36) ౨౨౦౦. అనంత ఛందము కొఱకు శతకము.

37) శ్రీమన్నారాయణీయము పద్యానువాదము.

38) మూకపంచశతి పద్యానువాదము.

39) రమా(ఏకాక్షరప్రాస)శతకము.

40) రాఘవా అష్టోత్తరశతనామాంచిత అష్టోత్తరశత ఛందోవినిర్మిత శతకము.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.