జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
81. ఉ. విస్మయమిద్ది. లోక హిత విస్తృత ధర్మ పథంబు చూపు రో
చిష్మతి, జ్ఞాన భాసురము. చిన్మయ తేజవివర్ధనాక్షయం
బై, స్మృతులందు గొప్పదయి వర్ధిలు నేటికి కూడ నీదు భా
తి స్మృతి యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర భాస్కరా!
82. ఉ. శాంతము, సౌఖ్యమున్, సుజన సన్నుత సద్గుణమున్, మహత్వమున్,
దాంతియు, సత్య సంధతయు, తత్వవివేకము, ధైర్య సంపదన్
సాంతము మాకుఁ గొల్పి మము చక్కఁగ చూడమటంచు నిన్ను ప్రా
ర్థింతును యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
83. ఉ. నిక్కము, సద్గురుల్ కనుచు నిన్ను కనంగను చేయనెంతురే.
అక్కజమిద్ది. నీ ప్రతిభ నందరు సద్గురులందుకొంట. మా
మక్కువ తీర నిన్గన, సమస్త వివేకము గొల్పుదీవె మా
దిక్కయి. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
84. చ. అతులిత దుఃఖ హేతువులనంతముగా మము క్రమ్ముచుండుటన్
క్షితి ధృతి హీనతన్ బ్రతుకుకే తుది కోరక తప్పదయ్య. సం
స్తుత సుఖమీయుమయ్య. కృపతోడను మాకిల కొల్పుమా మహ
ద్ధృతినిక, యాజ్ఞవల్క్య
గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
85. ఉ. పాపపుకూపమీజగతి. పాపులకాకరువౌట కాంచవో?
శాపమిటన్ జనించుటని సాత్వికులెల్లడ బాధ చెందుటన్
నీ పని కాదొ కాంచుట? మనీషులనెల్లెడ కావరామ్మయా.
దీపిత యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
రసరమ్య మైన శతకమును ఒక్క రాత్రిలో అవలీలగా మాకందించిన సోదరులు శ్లాఘ నీయులు అభినందన మందారములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.