జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
46. ఉ. ఇద్ధర దుర్జనార్ణవమయెన్ దురపిల్లఁగ సజ్జనాళి. సం
బద్ధము లేని చట్టములు. పాపపు చింతన మృగ్యమాయె. నీ
విద్ధరనుద్ధరింప గుణవృద్ధిని చేయుము. పెంచుమింక స
ద్వృద్ధిని యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
47. ఉ. మూలము నీవు పూజ్యగుణముల్ మము చేరుట కెల్ల వేళలన్.
మేలును గొల్పు సద్గుణము మేము గ్రహింపఁగ శక్తినీమ్ము. నీ
మ్రోల నమస్కరించు గుణమున్ దయచేయుము. కొల్పుమయ్య స
చ్చీలము యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
48. ఉ. సంతసమున్ సతంబు మనసారగ మాకు ననుగ్రహించుమా
శాంతిగ నుండ సజ్జనుల సంగతినొప్పి, శుభప్రదంబుగా
చింతలఁ బారఁద్రోలుచు ప్రసిద్ధిగ మంచిగ దేనినైన సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
49. ఉ. నవ్యత పేరునన్ యువత నాగరికంబను హీన సంస్కృతిన్.
సవ్యమునేవగించుకొను. సద్గుణమన్న గ్రహింపనోపరే.
నవ్య సమాజమెన్నఁగననంతుని సేవలు తెల్పుమయ్య. ఓ
దివ్యుఁడ! యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
50. ఉ. సంపదలెల్ల మాయు. విలసన్నుత దైవమె నిల్చు నిత్యమున్
సొంపులశాశ్వతంబు. గుణశుద్ధియె శాశ్వత కీర్తి మూలమౌన్.
భ్రాంతిని వీడ సత్ ప్రభలు భక్తిగ కాంచఁగ మార్గమీవు బో
ధింపుము. యాజ్ఞవల్క్య. గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
పద్యము లన్నియు సందేశాత్మకముగా నున్నవి . ముక్యముగా 49. " నవ్యత పేరునన్ యువత " ఆధునిక వివరణ బాగుగా నున్నది . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.