జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
76. ఉ. మురియుచు నీదు జన్మదినమున్ పరమాద్భుత భావనన్ దగన్
నిరుపమ రీతిలో జరుపు నీ ప్రియ భక్తులు నేర్పుమీరఁగా.
ధరణిని నీవె మాకనెడి ధార్మికవర్యుల మానసంబికన్
దిరుగదు. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
77. ఉ. మాకు శుభాస్పదంబయిన మంచిని గొల్పి చరింపజేయుచున్,
శ్రీకరమైన జీవనము, చిన్మయతేజసమొప్పఁగూర్చుచున్,
లోకహితంబు చేయగ విలోకన చేయుము. భారమెల్ల నీ
దేకద. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
78. ఉ. సుతులని, పత్నియంచు, ధనశోభయటంచు మనంబునెంచి, సం
స్తుతమగు పారలౌకికము త్రోసి యిహంబునె చిక్కియుండు మా
కతులిత జ్ఞానమున్ గొలిపి యాదరమొప్పఁగ పాపు మీషణ
త్రితయము. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర భాస్కరా!
79. ఉ. దీనదయాపరుండవు. మదిన్ నిను దల్చిన మాత్రమే కృపన్
ప్రాణసమాన దైవమయి రక్షణఁ గొల్పఁగనెంతువీవు. మా
దీనతఁ బాపి యోగ్యత మదిన్ కలిగింపఁగ భారమింక నీ
దేనయ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర భాస్కరా!
80. చ. పరులకు హానిలేని నిరపాయ మహోన్నత భావపూర్ణమై
పరఁగునుపాయమున్ గొలిపి పాపపు కూపము బాపి రక్షణన్
నిరుపమ! కొల్పుమా సతము నిర్మల జీవన మార్గమింక సు
స్థిరముగ యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర భాస్కరా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
" సుతులని పత్నియంచు " బాగుంది మంచి శతకము ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.