జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
66. ఉ. చింతయె లేని జీవనము సిద్ధిని పొందఁగ మార్గమౌను. ని
శ్చింతగ శ్రీహరిన్ మదిని చేర్చి నిరంతర సేవలన్ సదా
భ్రాంతిని చేయగానగును. పాపఁగ చింతలనెల్ల నిన్ను ప్రా
ర్థించెద యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
67. ఉ. సంచిత పాప కర్మ చెరసాలగ చేయును జీవితమ్మునే.
కుంచిత చిత్తమున్ నడువకూడని దుర్గతినాశ్రయింతుమే.
కాంచవొ నీవు. మమ్ములను కావక చూచుచు మమ్ము పట్టి వే
ధించకు యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
68. ఉ. భారము నీది. నీ సుగుణ భారము మాకును పంచి కావఁగా.
కారణమీవెఱుంగుదువు. కాణ్వ జనావళి గౌరవార్థమై
తీరును వీడనీక కడతేర్చగ మమ్ములఁ, గోరుచుంటి మీ
ధీరహి. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
69. ఉ. కష్టము మాకు సద్గుణ వికాసముతో చరియింప నిచ్చలున్.
నష్టము గొల్పు నైహికమె నచ్చుచునుండు జగంబునందు. నీ
దృష్టిని మాపయిన్ నిలిపి తీరుగనుండ మరల్చుమయ్య మా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
70. ఉ. భావితరాలలో ప్రతిభ వర్ధిలఁ జేసెడి శక్తినిమ్ము. సం
భావిత మూర్తులై చెలఁగు భాతిని గొల్పెడి యుక్తినిమ్ము. నీ
దీవనలాత్మశక్తినిడు. దీవనలిచ్చుచు మాకు కొల్పుమో
ధీవర యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఆణిముత్యముల వంటి పద్య శతకమును మాకందించిన శ్రీ చింతా సోదరులకు శత వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.