జైశ్రీరామ్.
శ్రీ యాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
21. చ. ద్విజులను పేరుఁగన్న యిలవేల్పులు కాణ్వ మహత్వ శాఖజుల్.
ప్రజలకు మేలు చేయుచు, వరంబువనిచ్చెడి భవ్యమూర్తులున్.
నిజమగు నీదు శక్తిని గణించుటచేతనె గణ్యులైరయా.
ద్విజ నుత! యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
22. చ. శరణుగురూత్తమా! మనసు చంచలమౌచు జగత్ప్రకాశకున్
హరిని కనంగనీదు. దురహంకృతి చీకటి క్రమ్మఁ జేయు. భా
సురమగు సత్యమున్ గనఁగ చూపుమయా మహనీయమైనదౌ
తెరవును, యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
23. చ. పగలును రాత్రియున్ విడని పాపము గొల్పెడి దుష్ప్రవృత్తులే
జగతిని కన్నులం బడు. నిజంబిది దుర్మతిఁ పెంచు మాకు నే
ప్రగతియులేక చింతిలెడివారము. నీవిక
పాపుమయ్య మా
దిగులును. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
24. చ. దినపతి ధర్మ బద్ధుఁడయి తీరుగనాకసవీధిలోననే
యనిశము సంచరించు. మనయందు తదద్భుత శక్తిఁ గొల్పడే.
జనులును ధర్మబద్ధులయి చక్కఁగనుండఁగ చేయఁగల్గఁడే
దినమణి? యాజ్ఞవల్క్య గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
25. ఉ. భూజనులందు సద్గుణ సుపూజ్యులు కణ్వ ప్రశంస శాఖజుల్.
రాజిలు శక్తి కోల్పడి పరాజయ మార్గము పట్టనీకుమా.
నీ జయ శీలమెన్ని పరిణీతులవన్ తగ నీవు కొల్పుము
త్తేజము. యాజ్ఞవల్క్య గురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!
(సశేషమ్)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.